Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, January 27, 2025

Discover the REAL Story Behind Kumbh Mela! | 'కుంభ' మేళా! లక్షల సంవత్సరాల చరిత్ర!


కుంభమేళా! లక్షల ఏళ్ల చరిత్ర! TELUGU VOICE
144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా!

ఇదే నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తా పత్రికలలోనూ కనిపిస్తున్న ముఖ్య వార్త.. అన్ని దేశాలూ, అంతరీక్షంలో ఉన్న శాటిలైట్స్ సహాయంతో వీక్షించాలని తహతలాడుతున్న ఏకైక పరిణామం, ఆఖరికి ఇస్లాం పుట్టుకకు మూలమైన మధ్య ఆసియా దేశాల ప్రజల నుంచి, మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ లోని జనాల వరకూ, ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటున్న డెస్టినేషన్, అఖండంగా, ఆమోఘంగా, దేదీప్యమానంగా, ఏ బాష వర్ణనకీ అందనంత ఘనంగా మన దేశంలో జరుగుతున్న మహాకుంభమేళా గురించే అని చెప్పడం, ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.. భారత దేశంలోని ఉత్తర్ ప్రదేశ్ లో గల ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకి తరలి వస్తున్న కోట్లాదిమంది భక్తులనూ, అక్కడికి వచ్చే ఎందరో నాగ సాధువులు, అఘోరాలు, యోగులూ, మహాపురుషుల వంటి వారిని చూసి, ప్రపంచం మొత్తం తాదాత్మ్యం చెందుతోంది. ఈ క్రమంలో ఇతర దేశస్థులతో పాటు, మన దేశంలో ఉన్న చాలా మందికి, అసలు కుంభమేళ అంటే ఏమిటి..? మహా కుంభమేళ విశిష్టత ఏమిటి..? ఇది ఎప్పుడు మొదలైంది..? ఎలా మొదలైంది..? కుంభమేళా పూర్తి చరిత్ర ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి. మరి అటువంటి అనేక సందేహాలకు సమాధానాలతో పాటు, ఈ భూమిపై మొట్టమొదటగా పురుడు పోసుకుని, నేటికీ దేదీప్యమానంగా భాసిల్లుతున్న హిందువుల చరిత్రను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/TGyS9rZg8bc ]


కుంభమేళ అనేది అనంత హైందవ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. కుంభమేళ అంటే ఎల్లలు లేని ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ముందు సాక్షాత్కరించే ధృవతార.. కుంభమేళ అనేది ఆధునిక శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరిచే సైన్స్. ముందుగా కుంభమేళ చరిత్ర గురించి తెలుసుకుంటే, అసలు ఆ సమయంలో నదీ స్నానం ఎందుకు చేస్తాం అనే ప్రశ్నకు దాదాపు సమాధానం దొరికినట్లే అని, చరిత్రకారులతో పాటు ఈ విషయంపై పరిశోధనలు చేసిన నిపుణులు సైతం చెబుతున్నారు. కుంభమేళ మొదలుకు కారణం గురించి భాగవత మహా కావ్యంలో స్పష్టంగా చెప్పబడితే, ఆ అనంత మహాయాగం జరిగిన తీరు గురించి, రామాయణం, మహాభారతం, పద్మపురాణం వంటి అనేక ఇతిహాసాలలో ప్రస్థావించబడింది.

పూర్వం సృష్టి సమతుల్యతకూ, నిర్మాణానికీ దేవతలు పాటు పడుతుంటే, ఈ సృష్టిపై తమ ఆధిపత్యం ఉండాలనే అత్యాశతో, దారుణాలకు తెగబడ్డ జాతి దానవులు. ఆ కారణం చేతనే, దేవదానవుల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలో దానవులు తమ ఆమోఘమైన తపశ్శక్తితో, ఆ శివయ్యానూ, బ్రహ్మదేవుడినీ మెప్పించి, అనేక వరాలు పొందడమే కాకుండా, తమ గురువైన శుక్రాచార్యుడి అద్భుతమైన శక్తి యుక్తుల చేత, దేవతలపై నిరంతరం యుద్ధాలు చేసేవారు. ఈ క్రమంలో దేవతలు తమ శక్తులను కోల్పోతూ, శక్తి హీనులై, తమ ఆవాసమైన స్వర్గాన్ని సైతం కోల్పోవడంతో, దిక్కు తోచని దేవతలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, తమ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మ దేవుడిని కోరారు.

సృష్టికర్త ఆ సమస్యకు పరిష్కారం చెప్పగలిగినది ఆ దేవదేవుడే అని, శ్రీమహా విష్ణువు దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ స్వామి ప్రసన్న వదనంతో, దేవతల ఆయుషు పెరగాలన్నా, వారిని అమరులుగా చేయాలన్నా ఒకేఒక్క పరిష్కారం, పాల కడలి నుంచి అమృతాన్ని బయటకు తియ్యడం అని చెప్పి, దానికోసం మంధర పర్వతాన్ని, వాసుకి సహాయంతో చిలకమని చెప్పాడు. అంత పెద్ద కార్యం దేవతలు మాత్రమే చేయలేక, దానవులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, వారి సహాయంతో పాలకడలిని చిలకడం, ఈ నేపద్యంలో శ్రీ మహా విష్ణువు కూర్మావతారం ఎత్తి, మంధర పర్వతాన్ని ఎత్తడం, తొలిగా వచ్చిన హాలహలాన్ని శివయ్య తన కంఠంలో దాచుకోవడం, ఆఖరుగా ఒక బంగారు కుంభంలో అమృతం పైకి రావడం వంటి వివరాలు ప్రతి హిందువుకూ తెలిసినవే.

అయితే అమృతం పైకి వచ్చాక, దేవ దానవులు దానికోసం 12 పగళ్ళూ, 12 రాత్రులూ మహా యుద్ధం చేశారు. ఆ సమయంలో శ్రీమహా విష్ణువు చాకచక్యంగా అమృత కుంభాన్ని చేజిక్కించుకుని, దానిని తన వాహనమైన గరుత్మంతుడికి ఇవ్వగా, ఆయన ఆ అమృత కుంభాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు, నాలుగు చుక్కలు జారి భూమిపై పడ్డాయనీ, అలా పడ్డ ప్రదేశాలే ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని అని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. దేవతల ఒక రోజు, మనకు ఒక సంవత్సరం. అంటే వారు 12 రోజులు పోరాడిన తర్వాత అమృతాన్ని పొందారు. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి, మన దేశంలోని ఈ నాలుగు క్షేత్రాలలో కుంభమేళ జరుగుతుంది. కుంభం నుంచి జారిపడిన అమృత బిందువుల వల్ల ఏర్పడ్డ ప్రదేశాలలో జరిగే మహా మేళ అవ్వడం చేత, దీనికి కుంభమేళ అనే పేరు వచ్చినట్లు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

సూర్యుడు, బృహస్పతి గమనాన్ని ఆధారంగా చేసుకుని, కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి కలిసి సింహా రాశిలోకి వచ్చినప్పుడు, నాసిక్ లోని త్రయంబకేశ్వరంలోనూ.. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోనూ, సూర్యుడు, బృహస్పతి వృశ్చిక రాశిలో ఉనప్పుడు ఉజ్జయినీ లోనూ, ఆఖరుగా బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ప్రయాగ్ రాజ్ లోనూ కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాని కూడా నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. మొదటగా సాధారణ కుంభమేళా.. ఇది ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. రెండవది, అర్ధ కుంభమేళా.. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడవది పూర్ణ కుంభమేళా.. ఇది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇక మహా కుంభమేళా.. ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే, ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది. ఇదే ప్రస్తుతం జరుగుతోంది..

కుంభమేళా సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఆయా ప్రదేశాలకు వచ్చి, అక్కడున్న పుణ్య నదులలో స్నానాలు చేస్తారు. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ దగ్గర గంగా, యమునా, సర్వసతీ నదుల త్రివేణి సంగమం ఉండటంతో, అక్కడ చేసే నదీ స్నానానికి మరింత విశిష్టత ఉంది అనాదిగా. రాముడు, కృష్ణుడి వంటి యుగ పురుషులు సైతం, కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానమాచరించినట్లు, చరిత్ర చెబుతోంది.

కుంభమేళా సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శక్తి పీఠాలు, అఖాడాల నుంచి, ఎందరో సాధువులు, యోగులు, మహా పురుషులూ వచ్చి, ఈ పుణ్య నదులలో స్నానాలు చేయడంతో పాటు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం సమారాధనలు జరుపుతారు. కుంభమేళా అనగానే అందరినీ ప్రధానంగా ఆకర్షించే మరో అద్భుత ఘట్టం, అక్కడకి లక్షల సంఖ్యలో తరలి వచ్చే నాగ సాధువులు. ఒంటినిండా విభూతిని పూసుకుని, జడలు కట్టిన కేశాలతో దిగంబరంగా, ఒక్కసారిగా వచ్చి పుణ్య నది స్నానాలు చేసి, మళ్ళీ ఒక్కసారిగా అంతమంది, చిన్న జాడ కూడా విడువకుండా వెళ్లిపోతారు. ఎక్కడో హిమాలయాలలో, మన దేశంలో ఉండే పలు పుణ్య ప్రదేశాలలో, అత్యంత రహస్యంగా తపస్సు చేసుకుంటూ జీవించే ఈ నాగ సాధువులు, కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే అంత పెద్ద మొత్తంలో ఎలా వస్తారు, ఎలా వెళ్తారు అనేది, Science పరంగా నేటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి సంబంధించి మనం గతంలో చేసిన, ‘సూక్ష్మ శరీర యానం’ అనే వీడియోను కూడా చూడండి. చూడని వారికోసం ఆ వీడియో link ను పైన I-cards లోనూ, Description లోనూ పొందుపరిచాను.

ఇక కుంభమేళా సమయంలో నదీ స్నానం చేయడం వెనుక, చాలా పెద్ద సైన్స్ దాగి ఉన్నట్లు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా జీవనదులలో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. వాటితో పాటు నదిలో ఉండే కరెంట్స్ వల్ల, మన చర్మంపై ఉన్న అనేక రోగాలను తగ్గించడమే కాకుండా, నాడీ వ్యవస్థను ఉత్తేజ పరిచి, అనేక శారీరక, మానసిక రోగాలను తగ్గిస్తాయి. అందుకే ఇటువంటి పుణ్య సమయాలలోనైనా నదీ స్నానం చేయాలని మన యోగులు, ఋషులు ఏనాడో చెప్పారు. దానితో పాటు, అంతరీక్షంలో జరిగే గ్రహాల కదలికల ఆధారంగా జరిగే కుంభమేళా సమయంలో నదీ స్నానం చేయడం వల్ల, ఆ గ్రహాల కదలికల నుంచి వచ్చే కొన్ని కిరణాలూ, వాయువులూ, మన నదులను మరింత శక్తివంతంగా మారుస్తాయనీ, ఆ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనిషి పొందుతాడనీ, మన మహర్షులు ఏనాడో చెప్పారు. అందుకే కుంభమేళా అంటే ఆధ్యాత్మిక కలయికే కాకుండా, నేటి శాస్త్రవేత్తలకు అంతు చిక్కని అద్భుత సైన్స్.

మరి ఇప్పుడు జరుగుతున్న 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా అవకాశాన్ని వదులుకోవడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి..

🚩 హర హర మహాదేవ🙏

Monday, January 20, 2025

anjore Brihadeeswara: Ancient Secrets Revealed | 1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి?


1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? TELUGU VOICE
నీడ నేలపై పడని అతి పెద్ద ఆలయ రహస్యం!

ఆది మానవుడి పుట్టుక ఎప్పుడు సంభవించిందో తెలియదు కానీ, ముందుగా నాగరికత నేర్చి, మన దేశాన్ని విశ్వ గురువు స్థానానికి చేర్చిన ఘనకీర్తి పొందిన వారు మన పూర్వీకులు. నేడు భూమిపై అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలలోని ప్రజలకు, కనీసం గుడిసెలు కట్టుకోవడం కూడా తెలియని సమయంలో, ఇక్కడ పెద్ద పెద్ద భవనాలూ, అద్భుతమైన మందిరాలూ నిర్మించబడ్డాయి. అలా ఆ నాడు కట్టబడిన అద్భుత నిర్మాణాలలో ఎన్నింటినో, గోరీ, బాబర్ వంటి ధూర్తులు నాశనం చేసినా, నేటికీ కొన్ని నిర్మాణాలు నాటి మనవారి నిర్మాణ కౌశలానికి సాక్షీభూతాలుగా నిలుస్తున్నాయి. అటువంటి కట్టడాలలో ఒక ఆలయం, మన దక్షణ భారత దేశంలోనే కొలువై ఉంది. మనకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకరం ఆ ఆలయ నిర్మాణం ఓ వింత అయితే, దాని గోపుర నిర్మాణ పద్ధతి, ఓ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ప్రపంచలో మరెక్కడా లేని విధంగా, 13 అంతస్తుల ఎత్తైన ఆ ఆలయ గోపురం నీడ భూమిపై పడదు. ఇన్ని వింతలకూ రహస్యాలకూ నెలవై వున్న ఆ ఆలయం, మన దక్షిణ భారత దేశంలో ఎక్కడ ఉంది? దానిని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? అసలు ఆ ఆలయం పేరేంటి? ఆ ఆలయ నిర్మాణ మిస్టరీని ఇప్పటికీ ఎందుకని ఛేదించలేక పోతున్నారు? నిజంగానే అక్కడి గొపురం నీడ నేలపై పడదా - వంటి ఎన్నో సందేహాలు, మనలో చాల మందికి కలుగుతాయి. మరి అటువంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/eMYxF4J1Ic0 ]


ఎంతో ఘన చరిత్ర కలిగిన మన అఖండ భారతావనిని, యుగ యుగాలుగా ఎంతో మంది రాజులు పరిపాలించారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే, గొప్ప రాజులుగా చరిత్ర పుటలలో, మనష్యుల మనస్సులలో, చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి వారిలో, ఒకప్పుడు తమిళనాట కావేరీ నది ఒడ్డునుంచి మొదలు పెట్టి, ఇటు శ్రీలంకా, మాల్దీవుల నుంచి, అటు జపాన్ వరకు ఆక్రమించుకుని, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన చోళ వంశానికి చెందిన రాజులను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, ప్రపంచ చరిత్రలో కొన్ని వేల ఏళ్ళపాటు మనుగడలో ఉన్న అత్యంత పురాతన రాజవంశంగా, చోళ వంశానికి పేరు ఉంది. అటువంటి గొప్ప వంశంలో పుట్టి, ఆ వంశానికే మరింత పేరు తెచ్చిన మొదటి రాజ రాజ చోళుడే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయాన్ని నిర్మింపజేశాడు.

చోళ వంశంలో పుట్టి, అధ్బుతమైన భుజ బలం, బుద్ధి బలం కలిగిన రాజుగా పేరు పొందిన మొదటి రాజ రాజ చోళుడు, ఒక ప్రక్క తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడంతో పాటు, మరో ప్రక్క ఎన్నో అద్భుతమైన నిర్మాణాలను నెలకొల్పినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విధంగా ఆయన కట్టించిన ఎన్నో గొప్ప కట్టడాలలో ఒకటి, తంజావూర్ లోని బృహదీశ్వరాలయం.

చోళుల ముఖ్య నగరాలలో ఒకటిగా, రైస్ బౌల్ అఫ్ తమిళనాడుగా పేరు పొందిన తంజావూర్ నగరంలో, దాదాపు వెయ్యేళ్ల క్రితం ఈ ఆలయాన్ని మొదటి రాజ రాజ చోళుడు నిర్మింపజేసినట్లు, చరిత్ర చెబుతోంది. సాధారణంగా, పురాతన కట్టడాలలో రాయికీ రాయికీ మధ్య బంధం దృఢంగా ఉండటానికి, బంక మట్టిని కానీ, వేడి సున్నాన్ని కానీ వాడేవారు. బృహదీశ్వరాలయ నిర్మాణంలో మాత్రం, ఇటుకలూ, బంకమన్ను, సున్నం వంటివి ఏవీ ఉపయోగించలేదు. వాటికి బదులుగా, కేవలం పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళను ఒకదానిపై ఒకటిగా పేర్చి, ఎంతో పకడ్బందీగా నిర్మించారని, నిపుణులంటున్నారు.

ఇక్కడ మరో వింత ఏమిటంటే, బృహదీశ్వరాలయ నిర్మాణం జరిగిన తంజావూరు పరిసరాలలో, కనీసం యాభై, అరవై కిలోమీటర్ల పరిధిలో, ఒక్క గ్రానైట్ కొండ కూడా లేదు. అయినా అంత భారీ ఆలాయ నిర్మాణాన్ని పూర్తిగా గ్రానైట్ రాళ్ళతో కట్టడం చాలా వింత అని, నిపుణులంటున్నారు. కొంత మంది పరిశీలకులు చెబుతున్నదానిని బట్టి, తంజావూరు నుంచి ఇంచుమించు డబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుక్కొట్టై అనే ఊరికి, దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో గ్రానైట్ కొండలు ఉన్నాయి. వాటిలోని రెండు కొండలను పూర్తిగా తొలిచి తంజావూరుకు తీసుకువచ్చి, బృహదీశ్వరాలయాన్ని నిర్మించి ఉంటారని అంటున్నారు. ఇక్కడ విచిత్రమేమిటంటే, దాదాపు 1000 ఏళ్ల క్రితం, Science ప్రకారం ఎటువంటి ఆధునిక పరిజ్ఞానమూ లేని ఆ కాలంలో, అంత పెద్ద కొండరాళ్ళను, అంత దూరం ఎలా తరలించి ఉంటారనే విషయం, అంతు చిక్కని రహస్యంగానే మిగిలి పోయింది.

ఈ విషయంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న నిపుణుల బృందం, ఆ రాళ్ళ తరలింపుకు అప్పటి మన వారు అనుసరించిన మర్మాన్ని కనుగొన్నారు. పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం, పొడవాటి చెట్లను నరికి, వాటిని గుండ్రంగా చెక్కి, అవి విడిపోకుండా ముడులు వేసి, వాటిపై ఈ రాళ్ళను పెట్టి, ఏనుగుల సహాయంతో తంజావూరుకు తరలించారని, తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా చర్చలు జరుగుతూనే వున్నా, ప్రస్తుతానికి ఈ సిద్ధాంతాన్నే నమ్మవలసిన పరిస్థితి. ఆ విధంగా గ్రానైట్ రాళ్ళ సాంధ్రతా, వాటి పరిమాణం ప్రకారం ఒక్కో రాయిని అమర్చి, దాదాపు పదమూడు అంతస్థుల ఎత్తు వుండే గోపురాన్ని నిర్మించారు.

ఇక ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ, ఆలయంపైనున్న రాతి గోపుర కలశం. ఇది దాదాపు ఎనబై టన్నుల బరువుండే ఏక శిలను చెక్కి, దానిని పదమూడు అంతస్థుల పైకి ఆ కాలంలో ఎలా చర్చారనేది, నేటి Science కి అంతుచిక్కని మిస్టరీనే. బృహదీశ్వరాలయంపై ఎన్నో పరిశోధనలు జరిపిన కొంతమంది పరిశోధకులు, ఎనభై టన్నుల బరువుండే కలశాన్ని గోపురంపైకి ఎలా చేర్చివుంటారనే విషయంపై ఓ సిధాంతాన్ని మన ముందుంచారు.

దాని ప్రకారం, బృహదీశ్వరాలయానికి ఇంచుమించు ఏడూ కిలోమీటర్ల దూరం నుంచీ ఏటవాలుగా ఓ మట్టి వంతెనను నిర్మించి, దానిపై ఈ రాయిని ఆలయం వరకు తీసుకు వచ్చి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ సిద్ధాంతాన్ని చరిత్రకారులు పూర్తిగా ఏకిభవించలేకపోతున్నారు. ఎందుకంటే, చరిత్రలో బృహదీశ్వరాలయ పరిసరాలలో దొరికిన ఆధారాల ప్రకారం, ఆ మట్టి వంతెనకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్ళూ లభించ లేదు. మరి అంతపెద్ద రాయిని పదమూడంతస్థుల పైకి, అదికూడా వేయేళ్ళ క్రితం ఎలా చర్చారనేది, వీడని మిస్టరీయే.

బృహదీశ్వరాలయ నిర్మాణాన్ని మొదటి రాజ రాజ చోళుడు, సామాన్య శకం 1004 వ సంవత్సరంలో మొదలు పెట్టి, సామాన్య శకం 1009 లేదా 1010 వ సంవత్సరాల మధ్యకాలంలో పూర్తి చేయించినట్లు తెలుస్తోంది. అంటే, ఇంత పెద్ద ఆలయాన్ని, ఎటువంటి అధునిక పరికరాలూ, యంత్రాలూ లేకుండా, కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో పూర్తి చేయడం ఒక వింతయితే, వెయ్యేళ్ళు దాటినా చెక్కు చెదరకుండా ఉండటం మరో వింతగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, అలయంలోకి వెళ్ళే భక్తులు గర్భ గుడి ముందు నుంచుని ఎంతమంది మాట్లాడుకున్నా, వారి మాటల ప్రతి ధ్వని వినిపించకపోవడం ఇక్కడ మరో వింత.

ఇదిలా ఉంటే, బృహదీశ్వరాలయ వింతలూ, విశేషాల గురించి మాట్లాడుకునే క్రమంలో, స్థానికంగా అనేక కొత్త కొత్త కథలు పుట్టుకొచ్చినట్లు, నిపుణులంటున్నారు. అటువంటి వాటిలో, ఈ ఆలయానికి నీడ పడకపోవడం కూడా ఒకటి. నేటికీ చాలా మంది, బృహదీశ్వరాలయం నీడ భూమిపై పడదనే చెప్పుకుంటున్నారు. చరిత్రకారులు ఈ విషయంపై పరిశోధనలు జరిపి, దీనికి కారణాన్ని కనుగొన్నట్లు వ్యక్తంచేశారు.

ఆనాడు బృహదీశ్వరాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత, రాజ రాజ చోళుడు ప్రధాన వాస్తు శిల్పిని పిలిపించి, ఇంత పెద్ద ఆలయం పడిపోదుకదా? అని అడిగినప్పుడు, దాని నీడ కూడా పడదని పరిహాసంగా ఆయన సమాధానమిచ్చినట్లు చెబుతున్నారు. ఈ మాటే కాలగమనంలో నేడు జనబాహుళ్యంలో నానుతున్న మాటగా చరిత్రకారులంటున్నారు.

ఇక ప్రపంచ చారిత్రక కట్టడాలను చూసుకుంటే, దాదాపు వేయేళ్ళ క్రితం, ఇంత పెద్ద కట్టడం ఎవరూ నిర్మించ లేదని చరిత్రకారుల వాదన. పైగా కేవలం రాయిపై రాయిని పేర్చి నిలబెట్టిన ఇంతపెద్ద కట్టడం, ఇన్నేళ్ళయినా చెక్కు చెదరకపోవడం వింత మాత్రమే కాకుండా, నాటి మన వాస్తు శిల్పుల నిర్మాణ కౌశలానికి అద్దం పట్టేలా ఉందని, నిపుణులంటున్నారు. ఇన్ని వింతలూ, విశేషాలూ కలిగి ఉన్నది కాబట్టే, UNESCO వారు ఈ ఆలయాన్ని World Heritage Site గా గుర్తించారు.

🚩 ఓం నమః శివాయ 🙏

Monday, January 13, 2025

Reincarnation of Arjuna a Hagiography | కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!


ఆత్మీయ మిత్రులందరికీ 'భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు' TELUGU VOICE
పరమాత్ముడికై సంపూర్ణ శరణాగతీ, ఆత్మ నివేదనా ఎలా ఉండాలి?
కలియుగంలో అర్జునుడు ‘పునర్జన్మ – మోక్షం’!

పంచమ వేదంగా పేరుగాంచిన వ్యాస విరచిత జయకావ్యం - మహాభారతంలో, పాండవుల స్వర్గారోహణ గురించి వివరించబడివున్నది. 17వ పర్వమైన మహా ప్రస్థానిక పర్వం ప్రకారం, పాండవులు సర్వమూ త్యజించి, స్వర్గానికి పయనమైనట్లు చెప్పబడింది. ఆ విషయాలను వివరిస్తూ, 'పాండవులు స్వర్గానికి వెళ్లిన దారి ఎక్కడుంది?' అనే శీర్షికన గతంలో మనం వీడియో చేసి ఉన్నాము. చూడని వారు అదికూడా తప్పక చూడండి. అలా ఆ జన్మను ముగించిన పాండవ మధ్యముడు 'అర్జునుడి' మరుజన్మ వివరాలు ఏమిటి? అని తెలుసుకునే ముందు, ద్వాపరయుగంలో అర్జునుడు శివుడి గురించి తపస్సు చేయగా, పాశుపతాస్త్రాన్ని వరంగా ఇచ్చాడు గానీ, మోక్షం ప్రసాదించలేదు ఆ పరమేశ్వరుడు. ‘కలియుగంలో బోయ వానిగా జన్మించి మోక్షం పొందుతావ’ని అర్జునుడికి శివుడు చెప్పినట్లు మన ఇతిహాసాలలో పేర్కొనబడింది. దాని ప్రకారం అర్జునుడు బోయవానిగా జన్మించి, శివుడి అనుగ్రహాన్ని పొందాడని ప్రతీతి. ఆ బోయవాడి పుట్టుపూర్వోత్తరాలనూ, ఆతడు కైవల్యాన్ని పొందిన వైనం వంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZJHvEAzmeQk ]


బోయ రాజైన నాగప్ప, దత్త దంపతులకు, రాజంపేట ప్రాంతంలోని ఊటుకూరులో జన్మించాడు తిన్నడు. తల్లిదండ్రులిరువురూ తెలుగు వారు, సుబ్రహ్మణ్య స్వామి భక్తులు కావడంతో, అతడికి తిన్నప్ప అనే పేరు పెట్టారు. కొడుకు తిన్నప్పకు విలువిద్యాదులు నేర్పించి, రాజును చేశాడు తండ్రి నాగప్ప. కులధర్మం ప్రకారం వేటగాడైనా, జంతువుల పట్ల అపార కరుణను చూపేవాడు తిన్నడు. జంతువులలో పసివాటినీ, ఆడవాటిని, రోగాలతో ఉన్నవాటినీ వేటాడేవాడు కాదు. తనలోని జంతు భావాలైన కామ, క్రోధ, మద మాత్సర్యాలను జయించాడు తిన్నడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్లి అడవి పందిని బంధించబోగా, అది తప్పించుకున్నది. దానిని పట్టుకోవడానికి తన అనుయాయులైన నాముడూ, కాముళ్ళతో ఆ వరాహాన్ని తరుముకుంటూ వెళ్లాడు. పరుగెత్తి పరుగత్తి ఎట్టకేలకు దానిని చంపాడు. అలసిపోయిన తిన్నడు ఆ పందిని తీసుకుని స్వర్ణముఖీ నదీ తీరానికి వెళ్లాడు. ఆ ప్రక్కనే ఉన్న కాళహస్తి పర్వతంపై వెలసి ఉన్న ఆలయాన్ని చూసిన తిన్నడికి, అక్కడకు వెళ్లాలనే తృష్ణ కలిగింది. అనుకున్నదే తడవుగా ఆ కొండ ఎక్కనారంభించాడు.

ఆలయం సమీపించే కొద్దీ, తనకు అంతకుముందెన్నడూ అనుభవంకాని అలౌకికానందాన్ని అనుభూతి చెందుతూ, పరవశుడైపోసాగాడు. అది పూర్వ జన్మ సంస్కార ఫలితమే. తన మీదినుంచి ఏదో బరువు దిగిపోతున్నట్లు అనిపించసాగిందతనికి. దేహ స్పృహ కూడా మందగించ సాగింది. ఆ పరమేశ్వరుని మీద అనంతమైన ప్రేమ పెల్లుబికింది. లింగాన్ని కౌగలించుకుని ముద్దులు కురుపించి, ఆనందభాష్పాలు జాలువారుతుండగా, ‘ఈశ్వరా! ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉంటున్నావయ్యా? నీకు ఆహారమెలా అందుతోంది? నీకిక్కడ తోడెవరుంటారు?’ అని చింతాక్రాంతుడై అడుగుతూ.. ‘నేను నీతోనే ఉంటాను. అయ్యో! నా తండ్రికి ఆకలిగా ఉందేమో.. ఆహరం తీసుకు రావాలి.’ అని తనలో తానే అనుకుంటూ, శివయ్యాను వంటరిగా విడిచి వెళ్ళలేక వెళ్లాడు. స్వర్ణముఖీ నదిలోని నీటిని నోటితో పుక్కిలినిండా పట్టి, పువ్వులను తలపై పెట్టుకుని, చేతిలో మాంసాన్ని పట్టుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నాడు. నోటిలోని నీటితో శివుణ్ణి అభిషేకించి, పువ్వులతో అర్చించి, మాంసాన్ని నైవేద్యంగా అర్పించాడు. ఆలయ ద్వారం వద్ద కూర్చుని ఏ జంతువూ లోనికి రాకుండా కాపలా కాస్తూ, ఆ శివయ్యనే చూస్తూ మురిసి పోయాడు..

తిన్నడు చేస్తున్న పనులు చూసిన అతని అనుయాయులు నాముడూ, కాముడూ ఆ విషయాన్ని అతని తల్లి దండ్రులకు ఎరుకపరిచారు. వారక్కడకు చేరుకుని, తిన్నడిని ఇంటికి తీసుకువెళదామని శత విధాలా ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. దానితో వారతనిని అక్కడే వదిలి వెళ్లక తప్పలేదు. ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి మాంసాన్ని తీసుకురావడం, శివయ్యకు నోటి నీళ్ళతో అభిషేకం చేయడం, తలపై పెట్టుకు తెచ్చిన పూలతో అర్చించడం, మాంసాన్ని నివేదించడం వంటి పనులు చేస్తూ, అక్కడే ఉండిపోయాడు తిన్నడు. ఈ విధంగా అయిదు రోజులు గడిచి పోయాయి. ఆలయ అర్చకుడూ, పరమ శివ భక్తుడూ అయిన శివగోచారుడు, ప్రతి రోజూ ఉదయాన్నే ఆలయం చేరుకుని, తిన్నడు చేస్తున్న పనులను జూసి భరించలేక రోదించాడు. ‘ఈ ఘోర కలిని ఆపు స్వామీ’ అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ నాటి రాత్రి అర్చకునికి కలలో శివయ్య కనిపించి, ‘నీవు రేపు లింగం వెనుక దాక్కుని ఏం జరగబోతోందో చూడు..’ అని చెప్పాడు. మరునాడు శివగోచారుడు, రాత్రి స్వామి కలలో చెప్పిన విధంగానే చేశాడు. రోజూ లాగానే తిన్నడు నీళ్ళూ, పూలూ, మాంసం పట్టుకుని ఆలయం చేరుకున్నాడు. తిన్నడు శివయ్యను చూసే సరికి, లింగం యొక్క కుడి కంటి నుండి రక్తం కారుతోంది. అది చూసి ఏడుస్తూ, తల్లడిల్లి పోయి, తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు తిన్నడు. అయినా లింగంనుంచి రక్తస్రావం ఆగక పోవడంతో, కంటికి కన్ను అనే సిద్ధాంతం గుర్తుకు వచ్చి, తన కంటిని పెకలించి, శివయ్యకు అమర్చాడు. రక్తం కారడం ఆగిందని సంతోషించే లోపుగా, లింగం యొక్క ఎడమ కంటి నుండి రక్తం కారండం ప్రారంభమయ్యింది.

వెంటనే తిన్నడు, ‘శివయ్యా, విచారించకు.. నా రెండవ కన్ను కూడా తీసి పెడతాను' అంటూ రక్తం కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలితో ఆ కంటిని వత్తి పెట్టి, తన రెండవ కంటిని కూడా పెకిలించుకోబోతుండగా, అతడి అపార భక్తిప్రపత్తులకు కదిలిపోయిన శివుడు ప్రత్యక్షమై, తిన్నడిని వారించాడు. ‘తిన్నా.. నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను. నీ కంటిని నాకు అర్పించినందుకు, ఇకపై నీవు కన్నప్పగా లోక ప్రసిద్ధుడవవుతావు. నిస్వార్థ భక్తుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతావు’ అంటూ శివసాయుజ్యం ప్రసాదించాడు. ఇదంతా గమనిస్తున్న శివగోచారుడు నిశ్చేష్ఠుడయ్యాడు. అలా తిన్నడు తన అపార భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని, కన్నప్పగా చీరస్మరణీయుడయ్యాడు. మహాభక్తుడైన తిన్నడు తన కళ్లను తానే పెకలించి శివునికి అర్పించడం, ఆ పరమాత్ముడిపై సంపూర్ణ శరణాగతీ, ఆత్మ నివేదనా కనిపిస్తాయి. దానిని మించిన భక్తి తత్పరత మరొకటి లేదు. వేదం, నాదం, యోగం, శాస్త్రాలూ, పురాణాలూ ఏమీ తెలియక పోయినా, అకుంఠిత భక్తి శ్రద్ధలతో ఒక సాధారణ వ్యక్తి, ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని, ‘భక్త కన్నప్ప’గా చరితార్థుడయ్యాడు.

మన పురాణాలలో చెప్పబడిన గొప్ప శివ భక్తులను ‘నాయనార్లు’గా పేర్కొనబడినది. వీరిలో 63 మంది ముఖ్యులు. ఈ నాయనార్లలో రాజుల నుంచీ సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేమీ కాదని, అంత్యకాలంలో మోక్షాన్ని పొందిన వీరి గాధలు నిరూపిస్తాయి. వీరిలో 19వ వాడు, తెలుగు వాడు, తిన్నడు.

🚩 హారహర మహాదేవ 🙏

Monday, January 6, 2025

Sabarimala: Original Ayyappa's Idol Vandalised? | శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది?


శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది! TELUGU VOICE
నేడు భక్తులు దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం పరశురాముడు ప్రతిష్ఠించినది కాదా?

స్వామియే శరణం అయ్యప్ప అంటూ ప్రపంచం దద్దరిల్లి పోతోంది. ఆ హరిహర సుతుడిపైనున్న నమ్మకం, ప్రేమ, భక్తికి గుర్తుగా, ఆయప్ప మాలను ధరించి, మండలం రోజుల పాటు దీక్షబూనుతుంటారు ప్రతి సంవత్సరం. కార్తీక మాసం మొదలవ్వగానే, మనకు ఎక్కడ చూసినా ఆ మణికంఠుడి మాల ధరించిన స్వాములే కనిపిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆయప్ప మాల వేసుకుని వచ్చే కోట్లాది మంది స్వాములతో కిక్కిరిసి పోయి ఉంటుంది శబరిమల. ప్రతి సంవత్సరం కోట్లాది మంది దర్శించుకునే అయ్యప్ప స్వామి విగ్రహం, ఆనాటి దైవ స్థాపిత విగ్రహమేనా? అసలైన విగ్రహం పళనిలోని కుమారస్వామి ఆలయంలో ఉన్న నవ పాషాణ విగ్రహం లాంటిదా? మరి అసలైన విగ్రహానికి ఏమైంది..? ఇప్పుడున్న విగ్రహం అక్కడికి ఎలా చేరింది..? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Z1osWZdk17g ]


కార్తీక మాసంలోనే కాకుండా, ప్రతి నెల కొన్ని ప్రత్యేక దినాలలో కూడా ఆలయం తెరుస్తారు కాబట్టి, ఆ సమయంలో కూడా భక్త కోటి, స్వామి దర్శనార్ధం శబరిమలకు ప్రయాణమవుతారు. ఒక్కప్పుడు అలా ఉండేది కాదు. దాదాపు 1950 వరకు శబరిమలపై అయ్యప్ప స్వామి దర్శనం, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉండేది. అందుకు ప్రధానమైన కారణం, ఆ ఆలయం ఉన్న ప్రదేశం. కేరళలోని దట్టమైన ఆడవుల మధ్యలో ఉండడం వలన, భక్తులకు ఆ ప్రయాణం అంత సులభ తరం కాదు.

పురాణాల ప్రకారం, అయ్యప్ప జననం ఎలా జరిగింది, ఆయన చరిత్ర వంటి విషయాలు తెలిసినవే. ఆయనను పెంచి పెద్ద చేసిన Pandalam రాజ వంశం వారే, నేటికీ ఆలయ సంరక్షణ, నిర్వాహణ బాధ్యతలతో పాటు, ప్రత్యేకమైన పూజల విషయంలోనూ ఎన్నో నియమాలు పాటిస్తూ ఉన్నారు. కొన్ని వార్తల ప్రకారం, కొన్నేళ్ళ క్రితం అయ్యప్ప ఆలయం గురించిన వివరాలు తెలుసుకోడానికి, Pandalam వంశీయుల ఆధీనంలో వున్న గ్రంధాలయంలో వేతకగా, వారి దగ్గర సామాన్య శకం 1075 నుంచి మాత్రమే రికార్డ్స్ ఉన్నట్లు తెలిసింది. అంతకు పూర్వం రాసిన రికార్డ్స్ ఏమయ్యాయి..? అసలు ఉన్నాయా, లేవా..? అనే విషయాలు, వీడని మిస్టరీయే.

ఇదిలా ఉంటే, అందుబాటులో ఉన్న ఆ రికార్డ్స్ ని పరిశీలించినప్పుడు, సరిగ్గా సామాన్య శకం 1075వ సంవత్సరంలో, మొదటిసారి ఆలయంలో అతి పెద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Pandalam రాజ వంశ శాసనాల ప్రకారం, ఆ మణికంఠుడిని పెంచి పెద్ద చేసిన రాజా రాజశేఖరుడు, స్వామి కోరిక మేరకు శబరిమల కొండలపై ఆలయం కట్టించి, తనతో పాటు, తన వంశం కొనసాగినంతవరకు, ఆలయ సంరక్షణ, నిర్వాహణ వంటి బాధ్యతలన్నీ తప్పనిసరిగా చూసుకోవాలని శాసించాడు. ఇక సామాన్య శకం 1070ల కాలం నాటికి, Pandalam రాజ వంశానికి రాజుగా, రాజా శ్రీ Moolam Thirunaal పాలిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం బంగారు తాపడంతో, మిగిలిన ప్రదేశాలు పక్కా నిర్మాణాలతో ఉంది. కానీ, అప్పుడు స్వామి వారి ఆలయంపై కేవలం రాగి తాపడం మాత్రమే ఉండేది. చుట్టుప్రక్కల నిర్మాణాలు కూడా అంత గొప్పగా ఉండేవి కాదు. దానికి తోడు వాతావరణ మార్పుల కారణంగా, రాగితాపడం పాడై చిల్లులు పడిపోవడంతో, వర్షం వస్తే ఆ నీరు ఆలయంలో ఉన్నవారిని కూడా తడిపేసేది. ఈ విషయాన్ని రాజుకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే భక్తుల కోసం, ఆలయంపై డబ్బులు ఖర్చుపెట్టే ఉద్దేశం లేదని చెప్పేవాడు. దాంతో ఆలయ పూజారులూ భక్తులూ చేసేదేమీ లేక, ఆలయం పై భాగాన్ని గడ్డితో అల్లి, వర్షం నీరు లోపలకి రాకుండా ఏర్పాట్లు చేసుకున్నారు.

సరిగ్గా సామాన్య శకం 1077లో, ఎండ తీవ్రత బాగా ఎక్కువగా ఉండటంతో, ఆలయం పైనున్న గడ్డి భగ్గుమని, ఆలయం మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. ఆ సమయంలో స్వామి వారికి పూజలు చేస్తున్న ఆలయ అర్చకుడు, మంటలంటుకున్నాయనే విషయం గమనించగానే, స్వామి వారి విగ్రహాన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు. ఈ విషయం రాజుకు తెలియడంతో, తాను చేసిన తప్పును మన్నించమని వేడుకుని, ఆలయాన్ని పుననిర్మింపజేశాడు. అప్పుడు రాగి తాపడంతో పాటు, ఇత్తడి తాపడాన్ని కూడా వేశారు. అలా ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత, సామాన్య శకం 1085 వ సంవత్సరం నుంచి, భక్తులకు తిరిగి స్వామివారి దర్శన భాగ్యం మొదలయ్యింది.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆ సమయంలో ఆలయ అర్చకుడు రక్షించిన ఆ విగ్రహం, సామాన్యమైన విగ్రహం కాదు. కేరాళ రాష్ట్రాన్ని సముద్రం నుంచి వెలికి తీసి, మనుషులకు నివాస యోగ్యంగా మార్చిన పరశురాముడే, అయ్యప్ప స్వామి విగ్రహాన్ని నవపాషాణాలతో, తన శాస్త్రపరిజ్ఞానంతో స్వయంగా తయారు చేసి ప్రతిష్టించాడు. కేరళ రాష్ట్ర పుట్టుకకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనం ఇదివరకు వీడియో చేసి ఉన్నాము. చూడని వారి కోసం ఆ వీడియో link, description లోనూ, పైన icards లోనూ పొందుపరిచాను. అలా పరశురాముడి చేత ప్రతిష్ఠించబడిన స్వామి వారి నవపాషాణ విగ్రహం, 1900వ సంవత్సరం వరకు పూజింపబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. పరశురాముడు కనిపెట్టిన ఆ పరిజ్ఞానమే, కాలాంతరాళాలో మహర్షుల దగ్గరకు, అక్కడి నుంచి భోగ సిద్ధుడికీ చేరగా, దాని సహాయంతో ఆయన కుమారస్వామి విగ్రహాన్ని తయారు చేసి, తమిళనాడులోని Palani క్షేత్రంలో ప్రతిష్టించారు.

చరిత్ర ప్రకారం శబరిమల కొండపై చాలా అగ్ని ప్రమాదాలు జరిగాయి కానీ, అవన్నీ చిన్నాచితకా అవ్వడంతో, రికార్డ్స్ లోకి ఎక్కలేదని నిపుణులంటున్నారు. అయితే 1900వ సంవత్సరంలో, శబరిమల కొండపై చాలా పెద్ద విషాదమే సంభవించింది. అలా మరో మారు స్వామి వారి ఆలయం మంటలకు ఆహుతి అయ్యింది. ఇక్కడ మరింత విషాదం ఏమిటంటే, పరశురామ ప్రతిష్ఠిత మణికంఠుడి విగ్రహం కూడా పాక్షికంగా దెబ్బతిన్నది.

ఆలయం అగ్నికి ఆహుతైన రెండు రోజులకు అక్కడికి వచ్చిన పోలీసులు కొన్ని వైషయాలను కనిపెట్టారు. వాటిని బట్టి, ఆలయ గర్భగుడి ద్వారం దగ్గర పరిశీలించినప్పుడు, ఎవరో అక్కడ పదునైన వస్తువుతో పదే పదే దాడి చేసినట్లూ, అలా ఆలయ ద్వారం విరగగొట్టి లోపలికి ప్రవేశించినట్లూ తెలుసుకున్నారు. అలా వెళ్ళిన వ్యక్తులు ముందుగా స్వామి వారి విగ్రహాన్ని పాక్షికంగా విరగగొట్టి, ఆ తర్వాత మొత్తం ఆలయానికి నిప్పు పెట్టినట్లు గమనించారు. ఇక్కడ వింతైన విషయం ఏమిటంటే, ఆలయంలో ఉన్న ఒక్క విలువైన వస్తువును కూడా వారు ముట్టుకో లేదు. ఆ రోజుల్లో కేవలం మండల పూజ సమయంలో మాత్రమే, జనాలు ఆలయం దగ్గర ఉండేవారు. తక్కిన రోజులలో పెద్దగా జన సంచారం ఉండేది కాదు. ఎందుకంటే, ఆ రోజులలో శబరిమల వెళ్ళడం అంటే, ప్రాణాలపై ఆశలు వదులుకున్నట్లే అని, చరిత్రకారులు చెబుతారు. భీకరమైన అడవి మార్గంలో పెద్ద పులులు, చిరుత పులులు, ఏనుగులవంటి క్రూర ప్రాణులతో పాటు, కొన్ని అరుదైన, అత్యంత విషపూరితమైన కీటకాలూ, విష సర్పాలూ అక్కడ సంచరించేవి. అందుకే మండల పూజ సమయంలో తప్ప, ఏడాది పొడవునా మిగతా రోజులలో అక్కడికి ఎవరూ పెద్దగా వెళ్ళేవారు కాదు.

1900వ సంవత్సరంలో జరిగిన ఘటనను పరిశీలించిన పోలీసులు, ఆలయ ధ్వంసం కోసం వచ్చిన దుండగులు 5 గంటలపాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. వారికి అక్కడున్న నగానట్రాపై పెద్దగా ఆసక్తి లేకపోవడం గమనించి, కేవలం ఆలయం అక్కడ ఉండటం ఇష్టంలేక అలా చేశారని తేల్చేశారు, పోలీసులు. ఈ క్రమంలో శబరిమల ఆలయం దగ్గర ఉండే కొన్ని ఆటవిక తెగల వారిని సందేహించినా, సరైన సాక్ష్యాలు లేక ఏమీ చేయలేకపోయారు. దానికితోడు ఆలయం అగ్నికి ఆహుతైన తర్వాత, అక్కడ వర్షం పడటంతో సాక్ష్యాలన్నీ తుడిచిపెట్టుకు పోయాయని, పోలీస్ రికార్డ్స్ లో ఉంది.

అయ్యప్ప స్వామి ఆలయంలో అలా తరచూ అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలను పరిశీలించిన పండితులు, స్వామి వారి విగ్రహం ఆగ్నేయం మూలన ఉండటమే అగ్నిప్రమాదాలకు మూల కారణమని గుర్తించారు. ఆ తర్వాత మరో కొత్త విగ్రహం కోసం వేతకగా, అప్పటికే కేరళలోని Chengannur అనే జిల్లాలో శివాలయ నిర్మాణం కోసం వచ్చిన Ayyappa Paniker, Neelaganda Panikar అనే ఇద్దరు శిల్పకారులు, శబరిమల ఆలయ పెద్దలకు ఎదురు పడ్డారు. వారిద్దరిదీ తమిళనాడులోని తంజావూరు కాగా, తమ ప్రాంతంలో నిర్మించబోయే ఆలయాలలో మంచి శిల్పకళాకారులు కావాలని, నాటి Chengannur రాజు వారిని కేరళకు పిలిపించాడు. పూర్వం నుంచి వారు అయ్యప్ప స్వామి భక్తులు అవ్వడంతో, స్వామి వారి విగ్రహం చేయడానికి సంతోషంగా ఒప్పుకుని, పంచలోహాలతో అయ్యప్ప విగ్రహాన్ని తయారు చేశారు.

అలా నాడు Ayyappa Paniker, Neelaganda Panikar అనే ఇద్దరు శిల్ప కళాకారులు చేసిన విగ్రహమే, నేడు సమస్త భక్తకోటి దర్శించుకుంటున్న శబరిమల అయ్యప్ప స్వామి ప్రధాన మూర్తిగా కొలువై ఉంది. ఇక్కడున్న కొంత అయోమయ పరిస్థితి ఏమిటంటే, కొన్ని రికార్డ్స్ ప్రకారం ఇదంతా జరిగింది 1900వ సంవత్సరంలో కాకుండా, 1950లో అని ఉన్నా, చాలా రికార్డ్స్ ప్రకారం 1900వ సంవత్సరంలో జరిగినట్లు చరిత్రకారులంటున్నారు.

🚩 స్వామియే శరణమయ్యప్ప 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...