Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label History. Show all posts
Showing posts with label History. Show all posts

Wednesday, January 24, 2024

Rama an Ordinary Human Being or God? Legend, History & Religion | రాముడు దేవుడా?


రాముడు దేవుడా?
శతృత్వం ఎంతటిదైనా, అది చావుతో ముగిసిపోతుంది! 

శ్రీరాముడి జీవితాన్ని చూస్తే, ఎన్నెన్నో సమస్యల సుడిగుండాలలో ఆయన ఈదినట్లు తెలుస్తుంది. ఆయన జీవితమంతా సమస్యలతోనే సాగింది. మొదట పినతల్లి కారణంగా, పితృవాక్య పరిపాలనను అనుసరించి ఆయన తన రాజ్యాన్ని వదులుకోవలసి వచ్చింది. అడవుల పాలైన శ్రీరాముడి చెంత ఉన్న భార్య సీతమ్మను, రావణుడు అపహరించుకుపోయాడు. ఆమె కోసం ఆయన అంతటా గాలించి, ఆమె జాడను కనుగొని, తనకు ఇష్టం లేకపోయినా యుద్ధం చేశాడు. అలా సీతమ్మను తీసుకుని రాజ్యానికి వెళితే, అక్కడ సీతమ్మను గురించి అపవాదులు వినాల్సి వచ్చింది. ఈ దశలో గర్భవతిగా ఉన్న సీతమ్మను తిరిగి అడవుల పాలు చేయాల్సివచ్చింది. ఆ తర్వాత తన కొడుకులతోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ఆ భీకర యుద్ధ సమయంలో సీత రణస్థలికి రావడం, పుత్రులను రామునికి అప్పగించి, భూమాత ఒడిలోకి చేరడం, ఇలా రాముడి జీవితం చూసుకుంటే ముళ్లబాటే. ఐనప్పటికీ భారతదేశంలో కోట్లాదిమంది రాముడినే ఎందుకు కొలుస్తారు? ఆయననే ఆదర్శంగా ఎందుకు తీసుకుంటారు? శ్రీరాముని గొప్పదనం గురించిన వివరాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/8iPA9Kys0Ec ]


రాముడు మాయలూ, మంత్రాలూ చూపించలేదు. శ్రీకృష్ణుడిలా విశ్వరూపం ప్రకటించలేదు. జీవితంలో ఎన్నెన్నో కష్టాలు, జరగరాని సంఘటనలు.. చిన్న వయస్సులోనే పినతల్లి స్వార్థానికి తండ్రికి దూరమై, ఆయనను పోగొట్టుకున్నాడు. పట్టాభిషేక ముహూర్తానికే అడవులపాలయ్యాడు. అరణ్యవాసంలో తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు. కారడవులలో బాధాతప్త హృదయంతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే, రాక్షస వధ గావించాడు. అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా, తాను మాత్రం విస్పష్టంగా 'అహం దశరథాత్మజః' అంటే, దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే అని ప్రకటించాడు. అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?

ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించినవాడు రాముడు. ధర్మానికి రూపునిస్తే, రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనాన్ని వదులుకుని, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామచంద్రుడు ధర్మమూర్తి అయ్యాడు. ఆ యుగపురుషుడిగానే కాక, సకల జగత్తుకూ ఒకేఒక్కడుగా నిలిచాడు.

1. శాస్త్ర ధర్మ పాలన..

తండ్రి మాట కోసం, సీత, లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరాడు రాముడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించాడు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి, దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. అది విని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు రామయ్య. 'పెద్దకుమారుడినైవుండీ తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయాన'ని బాధపడ్డాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చి, తాను దశరథుడిననీ, పిండం తన చేతిలో పెట్టమనీ వాణి వినిపించింది. కానీ, రాముడు అందుకు ఒప్పుకోలేదు. శాస్త్రప్రమాణాలను అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచాడు. నిజంగా మీరు నా తండ్రే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలను స్వీకరించండి. నేను శాస్త్ర ప్రమాణాన్నే పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా, శాస్త్ర ధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రుడొక్కడే.

2. స్నేహ ధర్మ పాలన..

సీతమ్మ మాయలేడిని కొరినప్పుడు, ఆమెను వదలి, పర్ణశాలను దాటి, చాలా దూరం వెళ్ళారు రామలక్ష్మణులు. అదే అదనుగా, రావణుడు మారు వేషంలో వెళ్ళి సీతమ్మను అపహరించాడు. అదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగించే ప్రయత్నంలో, రావణుడిని ముప్పుతిప్పలు పెట్టాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేశాడు. రెక్కలు తెగిన పక్షిరాజు  నేలకూలాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణాలు విడిచాడు. తన క్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన జటాయువును ఆప్తమిత్రుడిగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహించాడు రామచంద్రుడు. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా స్నేహశీలి.

3. యుద్ధ ధర్మ పాలన..

వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడవలసిన తమ్ముడి భార్యను, వాలి కామంతో కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియ ధర్మం. అంతేకాకుండా, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంది. దానిని ధరించిన సమయంలో, వాలి ఎదుట ఎవరు నిలిచినా, వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధ ధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.

రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడిగాడు. అప్పుడు రాముడు..
మరణాంతాని వైరాని నివృత్తం నః ప్రయోజనం |
క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||
'విభీషణా! శతృత్వం ఎంతటిదైనా, అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరక పోవడం వల్లనే, యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి, ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అని అన్నాడు. ఇదీ రాముడి ధర్మవర్తనం..

4. దయా ధర్మ పాలన..

సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి, రాజ్యబహిష్కరణ శిక్ష వేశాడు, రావణుడు. సముద్ర తీరంలో, అపారమైన వానర సేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయించాడు, విభీషణుడు. మరో ఆలోచన లేకుండా, విభీషణుడికి అభయం ఇచ్చాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి, విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ, సుగ్రీవుడు, మొదలైన వారికి, ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెప్పారు. అతడు రావణాసురుడి దూత అని హెచ్చరించారు. అంతా విన్న రాముడు, విభీషణుడే కాదు. చివరకు రావణుడే తనను ఆశ్రయించినా, అతడికి కూడా అభయం ఇస్తానన్నాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం, క్షత్రియ ధర్మం, దయా ధర్మం. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధ భూమిలో ఉన్నా, దయా ధర్మాన్ని విడిచి పెట్టలేదు రాముడు.

5. మనుష్య ధర్మ పాలన..

రామరావణ సంగ్రామం ముగిసింది. రావణుడు నేలకొరిగాడు. ముల్లోకాలూ ఆనందించాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతించారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా, సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదించారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా, రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’ అంటూ, తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే, సాధారణ మనుజుడిని మాత్రమే’ అని అన్నాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్య ధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని ఎన్నడూ చెప్పుకోలేదు. సాధారణ మనిషిలాగే, రాజ్య భోగాలతో పాటు, సుఖ దుఃఖాలూ అనుభవించాడు. మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన యుగపురుషుడు రామచంద్రుడు.

6. సోదర ధర్మ పాలన..

రావణ వధ అనంతరం, లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రాముడు. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ, తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుందని రాముడు ఆలోచిస్తుండగా, ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! ఎవరు నువ్వు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే, నీకు భయం అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సహాయం కావాలా? అంటూ రాముడు ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్ర ప్రభూ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ.. సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలవవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని దర్శించుకోవాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే, నీ ఔన్నత్యం అర్థమైంది. రామచంద్రా! నీ దర్శన భాగ్యంతో ధన్యురాలనయ్యాను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ, పర స్త్రీలపై ఆ రామచంద్రుడు చూపించే సోదర ధర్మం.

పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు, రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి, కాల పరీక్షను ఎదుర్కోవడమే వివేకవంతుల లక్షణం. రామయ్యా అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళికా బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేము. మన ప్రమేయం లేకుండా, చికాకులు కలుగుతాయి. వాటికి క్రుంగిపోతే, జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి, ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే, అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా, సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అనేది, ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది, అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం, రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం.

జై శ్రీరామ!

Monday, December 5, 2022

‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం! Jaabaali Maharshi


‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం!
పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం ఏమిటి?

మన పురాణ ఇతిహాసాలలో ఎంతో మంది మునులూ, రుషులూ ఉన్నా, వారిలో జాబాలి మహర్షి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. ప్రకృతి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించి, గొప్ప వ్యక్తిగా కీర్తిని గడించిన జాబాలికి, ఒక వ్యాపారస్థుడు తెలియజేసిన ధర్మ సూక్ష్మం ఏంటి? జాబాలి గోత్రానికే మూలమైన ఆయనకు, ధర్మదేవతలు ఎందుకు గుణపాఠం నేర్పారు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L4UeG2rUorU ]


ఒకానొకప్పడు జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే, జాబాలికి కూడా జ్ఞానాన్ని ఆర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని, గౌతమ మహర్షి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. అప్పుడు గౌతముడు, అతడి తల్లిదండ్రులూ, గోత్ర నామాదుల వివరాలు అడిగాడు. ఆ ప్రశ్నకు జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. ఎందుకంటే, చిన్ననాటి నుంచి, అతను తన తండ్రిని ఎరుగడు. ఇక తన గోత్రమూ, తనకు తెలియదు. అందుకని, దాసిగా పనిచేసే తన తల్లి దగ్గరకు వెళ్లి, గౌతముని ప్రశ్నలకు జవాబును కోరాడు. ‘నాయనా! నీకు తండ్రి లేడు. నా పేరు జాబాల కాబట్టి, నా కుమారుడవైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉన్నదని నమ్ముతున్నాను. అంతేకాదు! ఇకమీదట ఎప్పుడూ, సత్యాన్నే వాంఛించు. దానికి గుర్తుగా, నీకు ‘సత్యకాముడు’ అన్న పేరును జోడిస్తున్నాను’ అని చెప్పి పంపింది జాబాలి తల్లి. ఆ మాటలను యథాతథంగా సత్యకామ జాబాలి, గౌతమునితో చెప్పాడు.

జాబాలి సత్యవాక్కుకు సంతోషించిన గౌతముడు, అతణ్ని తన శిష్యగణంలో చేర్చుకున్నాడు.  జ్ఞానానికే అంతిమం అనదగ్గ బ్రహ్మజ్ఞానాన్ని, గౌతముని వద్ద పొందాలన్నది జాబాలి కోరిక. కానీ, జ్ఞానం పట్ల జాబాలికి ఉన్న తపనను పరీక్షించి కానీ, అతనికి విద్యను అందించేందుకు సిద్ధపడ లేక పోయాడు, గౌతముడు. అందుకోసం జాబాలికి ఆవులూ, ఆంబోతులూ ఉన్న పశుమందను అప్పగించి, ‘వీటి సంఖ్య వేయిగా మారేంతవరకూ, నువ్వు వాటిని అడవులలో సంరక్షిస్తూ ఉండు’ అని ఆదేశించాడు. అలా గురువుగారి ఆదేశం మేరకు, సత్యకామ జాబాలి, పశువుల మందను మేపుతూ, అడవులలో తిరగసాగాడు. కానీ, అతని మేధోశక్తికి, ప్రకృతిలోని ప్రతి అణువూ, ఏదో ఒక రహస్యాన్ని చెబుతున్నట్లే తోచేది. లేత చిగుళ్లు జీవనంలోని సౌకుమార్యాన్ని సూచిస్తే, ఎండిన ఆకులు, లయతత్వాన్ని బోధించాయి. కొండలు స్థిరత్వం గురించి చెబితే, సెలయేళ్లు సంతోషానికి శబ్దాన్నిచ్చాయి. అలా అడవిలో తిరుగుతూ కాలం గడుపుతూ, తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలోని పరమజ్ఞానాన్ని పొందసాగాడు, సత్యకామ జాబాలి.

ఇలా ఉండగా ఒకరోజు, అతని మందలోని ఒక ఆంబోతు అతని దగ్గరకు వచ్చి, ‘సత్యకామా! మా సంఖ్య వేయిని చేరుకుంది. ఇక నువ్వు నీ గురువుగారి దగ్గరకు బయల్దేరవచ్చు. అయితే, అందుకు ముందుగా నీకు బ్రహ్మజ్ఞానంలోని తొలి పాదాన్ని వివరిస్తాను విను. ఈ విశ్వంలోని నాలుగు దిక్కులూ, ఆ బ్రహ్మతత్వంలోని భాగమే..!’ అని చెప్పింది. ఆ సాయంత్రం వెలిగించిన అగ్ని నుంచి వెలువడిన అగ్నిదేవుడు, ‘ఈ జగత్తులో భాగమైన భూమి, ఆకాశం, సముద్రాలు, అన్నీ కూడా బ్రహ్మంలోని భాగమే. ఇదే బ్రహ్మజ్ఞానంలోని రెండవ పాదం’ అని విశదీకరించాడు. ఇక మర్నాడు ఒక హంస అతని చెంతకు చేరి, వెలుతురును ప్రసాదించే రూపాలైన అగ్నీ, సూర్యుడూ, చంద్రుడూ, విద్యుల్లతలు కూడా, బ్రహ్మకు ప్రతిరూపాలే అని చెప్పి, ఎగిరిపోయింది. ఇక బ్రహ్మజ్ఞానంలోని చివరి పాదాన్ని, ఒక నీటి పక్షి అతనికి అందించింది. ‘మనిషి ఉనికికి ఆధారభూతమైన ప్రాణం, దృష్టి, వినికిడి, మనస్సు కూడా, బ్రహ్మలోని అంతర్భాగాలే’ అని ఆ నీటి పక్షి అతనికి చెప్పింది. అలా సత్యకామజాబాలి బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడై, సంతృప్తిగా తన గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.

సత్యకామునిలో వెలుగొందుతున్న బ్రహ్మవర్చస్సును, అల్లంత దూరంనుండే చూసిన గురువుగారు, జరిగినది గ్రహించారు. ‘సత్యకామా! నీకు ఇక నా అవసరం లేదు. నీ అంతట నువ్వే, కావల్సిన జ్ఞానాన్ని సాధించగలిగావు’ అని అన్నారు. కానీ, సత్యకామునిలో తాను జ్ఞానాన్ని పొందానన్న గర్వం, ఇసుమంతైనా లేకపోయింది. ‘గురువుగారూ! జ్ఞానానికి అంతు ఎక్కడ? నాకు ఆ ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి, బ్రహ్మజ్ఞానాన్ని నేర్పిన మాట నిజమే. కానీ, మీ నుంచి కూడా ఎంతో కొంత విద్యను ఆర్జించాలనుకుంటున్నాను. దయచేసి ఈ దీనుడి కోరికను మన్నించండి’ అని వినమ్రతతో వేడుకున్నాడు. సత్యకాముని వినమ్రతకు ముగ్థుడైన గౌతముడు, తనలో ఉన్న జ్ఞానసారాన్ని కూడా, సత్యకామ జాబాలికి అందించాడు. దివ్యజ్ఞానాన్ని పొందిన జాబాలి, తపస్సులో నిమగ్నమయ్యాడు. అలా ఉండగా, అతడి తల మీద ఒక పిచ్చుక గూడు కట్టింది. అక్కడ గుడ్లుపెట్టి పొదిగి, వాటిని పిల్లలను చేసింది. ఆ పిచ్చుక, పిల్లలతో కలిసి అక్కడ నివసించ సాగింది. ఆ విషయం తెలిసిన జాబాలి, వాటిని తరిమి వేయకుండా భరిస్తూ, "ఆహా! నా వంటి ధర్మనిష్టాగరిష్టుడు ఎవరైనా ఉంటారా!" అని తనను తాను మెచ్చుకోసాగాడు.

అప్పుడు ఆకాశవాణి, "మహాత్మా! తనను తాను మెచ్చుకునే ధర్మనిష్ట ఎక్కడైనా ఉంటుందా? నీ కంటే ధర్మనిష్టా పరుడైన తులాధరుడు కూడా, ఇలా ఎప్పుడూ మాట్లాడ లేదు. ఇక నీ వెంత?" అని ఎగతాళి చేసింది. ఆ మాటలకు ఆశ్చర్యపడిన జాబాలి, "ఆ తులాధరుడు ఎక్కడ ఉంటాడు. నేను అతడిని కలవాలి" అని అడిగాడు. అతడు వారణాశి పురంలో నివసిస్తున్నాడని, ఆకాశవాణి పలికింది. జాబాలికి తులాధరుడి మీద కలిగిన మత్సరంతో, వారణాశికి వెళ్ళాడు. అక్కడ వ్యాపారం చేస్తున్న తులాధరుడిని చూశాడు. జనులంతా అతడిని ధర్మాత్ముడని పొగడుతున్నారు. జాబాలిని చూసిన తులాధరుడు అతడికి అతిథి సత్కారాలు చేసి, "మహానుభావా! మీ తల మీద పిచ్చుకలు తిరుగుతున్నా చలించక, హాయిగా తిరుగుతున్న మీరు, జితేంద్రియులు. గౌరవించదగిన వారు" అని అన్నాడు. అది విన్న జాబాలి, "అది సరే, నీవు చేసేది వ్యాపారం.. అందులో ధర్మము తప్పక చేయడం ఎలా సాధ్యము?" అని అడిగాడు.

అందుకు తులాధరుడు, "అయ్యా! నేను వస్తువులు కొనడంలో, అమ్మడంలో ఎలాంటి మోసములకూ పాల్పడను. కొంత లాభంతో తృప్తి పడతాను. లాభం వచ్చినప్పుడు పొంగిపోక, నష్టాలకు క్రుంగిపోక, సమ స్థితిలో ఉంటాను. నేను మట్టిబెడ్డనూ, బంగారపు ముద్దనూ, సమ దృష్టితో చూస్తాను. నేను ఎవరినీ పొగడను, తిట్టను. నన్ను నేను పొగడుకోను. ఇతరులను హింసించను. సాటి జీవులయందు, దయ కలిగి ఉంటాను. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతుంటాను. నేను భోగభాగ్యములను కానీ, కీర్తిప్రతిష్టలనుగానీ కోరను. ఎవరికైనా ఉపకారము చేసి, నేను ఇంత ఉపకారము చేశానని చెప్పుకోను. నాకు దేని మీదా మమకారముగానీ, ద్వేషముగానీ లేవు. ఈ లోకమును ఆటవస్తువులాగా చూస్తూ, బయటి ప్రపంచానికి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాను" అని అన్నాడు. అందుకు జాబాలి, "తులాధరా! నీవు యజ్ఞములు, యాగములు, తపస్సు మొదలగు ధర్మముల గురించి మాట్లాడలేదు. వేదవిధులు, వీటిని సత్కర్మలంటారు కదా! మరి ఇది ఆచరించదగిన ధర్మము కాదా?" అని అడిగాడు.

"మహానుభావా! ఈ యజ్ఞములు, యాగములు, తపస్సులు, ఏవేవో కోరికలు తీరడానికి చేస్తారు. కనుక వాటి అవసరం లేదని నా అభిప్రాయం. ఈ యజ్ఞ యాగాలు, జననమరణ చక్రం నుండి మానవులను విముక్తి చేయలేవు. ఎవరైతే సత్యమునే ఒక యజ్ఞముగా పాటిస్తూ, నిత్య తృప్తుడై ఉంటాడో, అతడికి శాశ్వత ఆనందము కలుగుతుందని నా నమ్మకము" అని అన్నాడు తులాధరుడు. అందుకు జాబాలి, "తులాధరా! నీవు కర్మలు వదల కుండా చేస్తున్నావు కదా! దానికి కారణమేమిటి?" అని అడిగాడు. అందుకు తులాధరుడు ఇలా చెప్పాడు. "ఎవరు సతతమూ ధర్మమునే ఆచరిస్తారో, ఎవరు ధర్మముతో చెలిమి చేస్తారో, ఎవరు నిష్కల్మష హృదయంతో కర్మలు చేస్తుంటారో, అతడికి కర్మలు ఆచరించక పోతే కలిగే ఆనందము కలుగుతుంది. అన్ని నగరాలూ పుణ్య క్షేత్రములే.. అన్ని నదులూ పుణ్య నదులే.. నిష్కల్మష హృదయంతో ఉన్న వాడికి, అన్నీ పవిత్ర నదులే.. వృత్తిధర్మంగా పనిచేస్తున్నాను, ఫలితం భగవంతుడికి అప్పగిస్తాను, అనుకుని కర్మలు చేసే వాడికి, ఏ దోషమూ అంటదు. ఫలితం ఆశించి చేసే కర్మలకు, దోషం అంటకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసిన ధర్మము ఇది. ఇది సరైన ధర్మం ఔనోకాదో, సజ్జనులను అడిగి తెలుసుకుంటాము. నీవు ఇన్ని రోజులూ తండ్రిలా పోషిస్తున్న ఆ పిచ్చికలు, హాయిగా ఎగురుతున్నాయి. వాటిని పిలిచి, లాలించు" అని అన్నాడు.

అప్పుడు జాబాలి పిచ్చుకలను దగ్గరకు పిలిచాడు. అవి అతడి దగ్గరకు రాకుండా, అలా ఆకాశంలో ఎగురుతూ, "ఓ మునీంద్రా! మేము ధర్మదేవత దూతలము. ధర్మదేవత పంపగా, నిన్ను పరీక్షించడానికి వచ్చాము. మేము మీకు కలిగిన సందేహమును తీరుస్తాము. ఎవరి మనస్సులో ఇతరుల ఎడల ద్వేషము, మాత్సర్యము ఉంటుందో, అతడికి ఇతరులతో తగవులాడాలని కోరిక కలుగుతుంది. అందువలన, హింస చెలరేగుతుంది. కనుక మునీశ్వరులకు, తమలో తాము ద్వేషించడం, మాత్సర్యము వహించడము, కూడనివి. ‘స్పర్ధ’ ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మం నశిస్తే, మనిషి నాశనం ఔతాడు. కనుక మానవుడు స్పర్ధను వదలాలి. సత్వగుణము వలన శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ ఉన్నవాడు, తాను తెలుసుకో తగిన దానిని తెలుసుకుంటాడు. ప్రతి మనిషికీ, శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞ యాగములూ నిష్ఫలములు. కనుక శ్రద్ధే, అన్నిటి కంటే ముఖ్యము. శ్రద్ధ ధనమువంటిది. అది మనసును చెడు దారిలో పోకుండా కాపాడుతుంది. శ్రద్ధ జీవాత్మ యొక్క ప్రసన్నత్వము. యాగము చేయుటకు శ్రద్ధ, శుచిత్వము, ముఖ్యము. శ్రద్ధలేని శుచిత్వము, శుచిత్వములేని శ్రద్ధ, నిష్ఫలమే. ఇదే విషయాన్ని బ్రహ్మ, దేవతలతో ఇలా చెప్పాడు. శ్రద్ధ కలిగిన వాడు ఉత్తముడు. అతడి చేతి భోజనము, అత్యంత శ్రేష్టము.

ధనము వడ్డీకి ఇచ్చి, ఆ వడ్డీతో దానధర్మలు చేసేవాడూ, వేదవేదాంగములు చదివిన లోభి అయిన వాడూ సమానమే. అందులో యాగములో దానము చేసిన వాడు, శ్రేష్టుడు. శ్రద్ధలేని వాడికి, దానము చెయ్యడానికి మనస్కరించదు. శద్ధ కలిగిన వాడి మనసులో, మత్సరం ఉండదు. అందుకని, శ్రద్ధ కలిగిన వాడు శ్రేష్టుడు" అని పిచ్చుకలు జాబాలికి చెప్పాయి. ఆ మాటలు విన్న జాబాలి తులాధరుడిని చూసి, "మహాత్మా! నాకు ఆన్నీ తెలుసనుకున్నాను. నాకు ఏమీ తెలియదని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను మునుల మాటలను వినలేదు కనుక, నన్ను నేను పొగడుకోవడమనే దోషం నాకు పట్టుకుంది. నీ మాటలతో నాకు దోషము పోయింది. ఇక నేను ప్రశాంత చిత్తంతో జీవిస్తాను" అని పలికాడు జాబాలి. ఆ మాటలతో సంతోషించిన తులాధరుడు, "ఓ మహాత్మా! ఎవరికైనా స్వధర్మం కంటే మించిన ధర్మము మరొకటి లేదు" అని పలికాడు. తరువాత జాబాలి, తులాధరుడి వద్ద శెలవు తీసుకుని వెళ్ళి పోయాడు. ఆనాటి నుండి, జాబాలి ధర్మాన్ని నిష్ఠతో పాటించాడు.

ఈ సత్యకామ జాబాలి కథ, కేవలం ఛాందోగ్య ఉపనిషత్తుతోనే ముగిసిపోలేదు. సత్యాకముడు, పిప్పలాదుడనే ఋషికి చెప్పిన, మంత్రాలతో కూడిన ‘జాబాలి ఉపనిషత్తు’ కూడా, మన గ్రంథాలలో ప్రముఖమైన స్థానాన్ని దక్కించుకుంది. ఇక రామాయణంలోనూ, జాబాలి ప్రస్తావన వస్తుంది. అయితే, జాబాలిని ఒక నాస్తికునిగా, రామాయణం ఎంచుతుంది. తనలో ఉన్న బ్రహ్మమే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉందన్న జాబాలి భావన వల్ల, అతడిని నాస్తికునిగా ఎంచి ఉండవచ్చు. అతనికి ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి అందించిన బ్రహ్మజ్ఞానంలోని సారం ఇదే కదా! నర్మదా నదీతీరాన జాబాలి తపస్సు చేసుకున్న ప్రాంతమే, నేడు జబల్పూరుగా మారిందని చెబుతారు. తిరుమలలోని జాబాలి తీర్థం వద్ద కూడా, ఆయన కొన్నాళ్లు తపస్సు చేసుకున్నాడని ప్రతీతి. జాబాలిని పురాణాలు ఒక ఋషిగా ఎంచి, ఆయన పేర ఒక గోత్రాన్ని నెలకొల్పాయి. మొత్తానికి తన సత్యనిష్ఠతో, జ్ఞానతృష్ణతో, గోత్రమంటూ లేని జాబాలి, తనే ఒక గోత్రానికి స్థాపకుడయ్యేంతటి ఋషిగా మారాడు.

ధర్మో రక్షతి రక్షితః

Monday, October 24, 2022

విభీషణుడి కుమారుడు ‘నీలుడి కథ’! Purushottama Kshetra / Neeladri


దేవలోకంపై యుద్ధానికి వెళ్ళిన అసురుడు నీలాచలేశ్వరుడిగా వెలిశాడా?

చింతామణి, కామధేనువు, కల్ప వక్షం అనేవి, దేవతా వస్తువులు. కానీ, అటువంటి అద్భుత వస్తువులను అసురుడైన నీలుడు సంపాదించుకున్నాడు. విభీషణుడి కుమారుడైన నీలుడు, పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి వరం సంపాదించి, ఇంద్రుడిపై యుద్ధం చేశాడు. దేవతలపై యుద్ధం చేయడానికి వెళుతున్న నీలుడిని, రామభక్తుడైన విభీషణుడు ఎందుకు అడ్డుకోలేదు? అసురుడైన నీలుడికి గురువైన శుక్రాచార్యుడిచ్చిన సలహా ఏంటి? దేవతా స్త్రీలలోని అత్యంత సుందరీమణి అయిన వన సుందరిని, నీలుడు ఎలా పొందాడు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/pGLkcLVZvBA ]


రావణ వధ తర్వాత, లంకాపూరికి విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన ధర్మబద్ధంగా రాజ్య పాలన చేస్తుండేవాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు. ఇతడు గుణమూ, బలమూ, విద్యలలో మేటి. ఒక సారి నీలుడు, తండ్రి విభీషణుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ఇలా అన్నాడు. "తండ్రీ! మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారికేమీ లోటు లేదు. మనకు ధన సంపదలకు కొదవ కూడా లేదు. అయినా మన రాజ్య మైన లంకలో, చింతామణీ, కామధేనువూ, కల్ప వృక్షం లేని లోటు బాగా కన్పిస్తోంది నాకు. మీరు శ్రీ రాముని పద సన్నిధిని చేరి, లంక సామ్రాజ్యాన్ని దక్కించుకొన్నా, వీటిపై మీకు ద్రుష్టి లేదు. వాటిని మీరు ఎందుకు పొందలేక పోయారు? నాకు అనుమతినిస్తే, వాటిని సాధించి తీసుకు వచ్చి, మన లంకలో ఉంచుతాను" అన్నాడు వినయంగా. కొడుకు నీలుని మాటలను విన్న విభీషణుడు, "కుమారా! నేను శ్రీ రామ చంద్ర పాదాబ్జ మకరందాన్ని గ్రోలే తుమ్మెదను. ఆ రామప్రభువు దివ్యానుగ్రహం వల్ల, అన్ని సుఖాలూ, ఆనందాలూ, భోగభాగ్యాలతోపాటు, బ్రహ్మానంద రసానుభూతిని అనుభవిస్తున్నాను. దేవతలకు కూడా సాధ్యం కాని దీర్ఘాయుష్షూ, సామ్రాజ్యమూ, నాకు శ్రీ రామ కృప వల్ల లభించాయి. శ్రీ రాముడే నా చింతామణి, కామ ధేనువు, కల్ప వృక్షం. అంత కంటే వేరేమీ నాకు అక్కర లేదు. రాముని కరుణ వల్ల, ఇంద్రాది అష్ట దిక్పాలకులు నా వశంలోనే వున్నారు. కనుక నాకు నువ్వు చెప్పిన ఆ మూడింటి అవసరం లేక పోయింది. అవి లంకలో లేవనే చింత వదిలెయ్యి. శ్రీ రామ పద భక్తితో ధన్యుడవయ్యే ప్రయత్నం చెయ్యి" అని అనునయంగా చెప్పాడు.

తండ్రి మాటలు, నీలుడికి రుచించలేదు. కీర్తి కాంక్షతో తహతహ లాడిపోయాడు. మళ్ళీ తండ్రితో వాటి అవసరాన్ని తెలియ జేశాడు. చివరికి విభీషణుడు మెత్తబడి, "నీ కోరికను కాదన లేకపోతున్నాను. వాటిని సాధించి, ఇక్కడికి తీసుకొనిరావటానికి గురువు అనుమతి చాలా ముఖ్యం. ముందుగా మన కుల గురువు శుక్రాచార్యుల వారికి శుశ్రూష చేసి, అనుగ్రహం సంపాదించి, అప్పుడు, ఆయన  అనుమతితో  ప్రయత్నం చెయ్యి" అని సలహా ఇచ్చి, ఆశీర్వదించి, నీలుడిని పంపాడు. తండ్రి అనుమతితో సగం కార్యం తీరిందని సంతోషించిన నీలుడు, గురువు శుక్రాచార్యుల వారిని చేరి, పూజించి, నమస్కరించి, చేతులు జోడించి, ”గురు దేవా! మా తండ్రి విభీషణ మహారాజు ఆనతితో, మిమ్మల్ని ఆశ్రయించటానికి వచ్చాను. నాకు చింతామణి, కల్ప వృక్షం, కామ ధేనువులను సాధించి, లంకలో వాటిని ఉంచాలన్న కోరిక కలిగింది. దీనికి మీ అనుగ్రహం కావాలి. ప్రసాదించండి." అని వేడుకొన్నాడు. నీలుని భక్తీ తత్పరత, వినయం, ఆచార్యులకు నచ్చి, "కుమారా! ఈ రోజు మృగశిరా నక్షత్రం. ఈ నక్షత్ర కాలం, కొత్త మంత్రోపదేశానికి మంచిది. దాన్ని జపిస్తే, నీ కోరిక శీఘ్రంగా ఫలిస్తుంది. శ్రీ హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తాను. శ్రద్ధతో జపించి, నీ కోర్కెను సాధించుకో" అని చెప్పి, వెంటనే "పంచముఖ ఆంజనేయ మంత్రం" ఉపదేశించాడు.

జగన్నాధ క్షేత్రం చేరి, దీక్షతో, ఆ మంత్రాన్ని త్రికరణ  శుద్ధిగా జపించమని చెప్పాడు, శుక్రాచార్య గురువరేణ్యుడు. పంచముఖ ఆంజ నేయుడు ఎలా ఉంటాడో కూడా వర్ణించి చెప్పాడు. పంచముఖ ఆంజ నేయుడు, సర్వ సిద్ధి ప్రదాత. తూర్పుముఖం, కోటి సూర్యుల కాంతితో, భీకరమైన  కోరలతో, భ్రుకుటి ముడిచి కనిపిస్తాడు. దక్షిణ ముఖం, నార సింహ ముఖం. మహాద్భుతంగా, మృత్యువును తెచ్చే ఉగ్రరూపంగా, తేజోవంతంగా వుంటుంది. భయనాశనం చేస్తుంది. పశ్చిమ ముఖం గరుడుని ముఖం. దీనికి వక్రతుండం వుంటుంది. సర్పాల విషాన్ని నాశనం చేస్తుంది. సర్వ భూతాలనూ అదుపులో ఉంచుతుంది. ఉత్తర ముఖం, సూకర ముఖం. ఈ వరాహ ముఖం, నల్లని కాంతితో వుంటుంది. భేతాళ ప్రయోగాలనూ, జ్వరం మొదలైన రోగాలనూ నాశనం చేస్తుంది. పై ముఖం, హయ ముఖం. ఇది మోక్షాన్ని ఇస్తుంది. ఇలాంటి మహామహిమాన్వితమైన అయిదు ముఖాలకు చెందిన బీజాక్షరాలతో, భక్తిగా మంత్రాలను జపిస్తే, కోరిన కోరిక తీరుతుంది. అలా గురువు అనుమతితో నీలుడు బయల్దేరి, "నీలాచల  క్షేత్రమైన పూరీ జగన్నాధ క్షేత్రాన్ని" చేరాడు. అక్కడ ఒక మహా పర్వతం, దానికింద పెద్ద అడవి వున్నాయి. ఆ పర్వతం మీదకు చేరి, అక్కడి జలాశయం దగ్గరున్న కొండ బిలంలో ప్రవేశించి, దీర్ఘ తపస్సు చేయటం ప్రారంభించాడు.

ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలితంగా, కోటి సూర్య ప్రభలతో, ముప్పది మూడు కోట్ల అద్భుత గణంతో, సంజీవ రాయుడైన ఆంజనేయ స్వామి, నీలుడికి దర్శనమిచ్చాడు. శంఖధ్వని వంటి ధ్వనితో నీలుణ్ణి పిలిచాడు. వెంటనే మేల్కొన్న నీలుడు, ఆయన పాదాలపై సభక్తికంగా వాలి పోయాడు. కళ్ళ వెంట ఆనంద  భాష్పాలు ధారా పాతంగా కారసాగాయి. నీలుణ్ణి భుజం పట్టి పైకి లేపాడు హనుమ. నీలుడు అత్యంత భక్తితో స్తోత్రం చేశాడు. దీనినే "నీల కృత ఆంజనేయ స్తోత్రం" అని అంటారు. ఇది చాలా మహిమాన్వితమైన స్తోత్రం. దానికి విపరీతంగా సంతోషించి హనుమ, "నీలా! నీ తపస్సు, ధ్యానాలకు మెచ్చాను. నీ మనోభీష్టం నాకు తెలుసు. త్వరలో ఇంద్రుని జయిస్తావు. చింతామణి తదితరాలనూ పొందుతావు. దేవతా స్త్రీలలో అత్యంత సుందరీమణి అయిన వన సుందరి అనే స్త్రీ నీకు భార్యగా లభిస్తుంది. నువ్వు కోరక పోయినా, బ్రహ్మ దేవుడే నీకావరాలను అనుగ్రహిస్తాడు. లోకంలో ఎవరైనా సరే.. నీ లాగా నా మంత్రాన్ని జపించి, నా వ్రతాన్ని చేస్తే, వారందరి కోరికలూ నేను తక్షణమే తీరుస్తాను. నీ తండ్రి విభీషణుడు నాకు మంచి మిత్రుడు. ఆయనా, నేనూ శ్రీరాముని బంటులము. నా దక్షిణ భాగంలో నీకు సుస్థిరమైన స్తానం కల్పిస్తున్నాను. నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం, ఇక నుంచి "పురుషోత్తమ క్షేత్రం"గా పిలువబడుతుంది. నీ కోరికలు న్యాయ బద్ధమైనవే. త్వరలోనే అవి తీరగలవు" అని వర దానం చేసి, పరివారంతో సహా అదృశ్యమైనాడు ఆంజనేయుడు.

హనుమ దర్శనంతో తృప్తి చెంది, ఆయన వరాలను అందుకొన్న నీలుడు, అక్కడి నుంచి బయలుదేరి, మళ్ళీ గురువు  శుక్రాచార్యుల సన్నిధికి  చేరాడు. ఆయన సంతోషించి, నీలుణ్ణి ఆశీర్వదించి, తండ్రి విభీషణునికి వివరాలన్నీ తెలియ జేయవలసినదిగా చెప్పి పంపించాడు. లంకలో తండ్రి విభీషణుడిని చేరి, జరిగిన విధానం అంతా పూస గుచ్చినట్లు తండ్రికి విన్నవించాడు. కుమారుని అద్భుత తపో వృత్తాంతం, వర గ్రహణం విన్న విభీషణుడు పరమానందం పొంది, నీలుణ్ణి ఆశీర్వదించాడు. కొంత కాలం తర్వాత నీలుడు మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభించాడు. తనలో తాను ఇలా వితర్కించుకొన్నాడు.. "రాజు పని వున్నా లేకపోయినా, రాజ్యానికి నష్టం లేకుండా, శత్రువులను భయపెట్టాలి. శత్రు మర్దనుడనే బిరుదు పొందాలి. ఇలా చేయకపొతే, శత్రువులకు తేలికైపోతాడు. మా జాతికి శత్రువు, స్వర్గ లోకాధిపతి ఇంద్రుడే. అతని వద్ద నుండి చింతామణి, కల్ప వృక్షం, కామ ధేనువునూ, నేను గ్రహించటం రాజ ధర్మం. నెమ్మదిగా, నయంతో సాధించటానికి ప్రయత్నిస్తాను. ఇవ్వక పొతే, యుద్ధం చేసయినా, వాటిని దక్కించుకుంటాను. ఒక దూతను రాయబారిగా ఇంద్రుడి వద్దకు పంపితే మంచిదని తోస్తోంది. అతని వల్ల సమాచారం తెలుసుకుని, అప్పుడు మిగిలిన కార్యాన్ని గురించి ఆలోచిస్తాను" అని దీర్ఘాలోచన చేశాడు. అందుకు సమర్ధుడైన దూతను పిలిచాడు. అతనితో తన మనసులోని మాటను తెలియజేశాడు. "నా రాయబారిగా ఇంద్రలోకం వెళ్లి, నేను చెప్పే మాటలు ఇంద్రునికి తెలుపు. ఇంద్రుడు రాక్షసులకు విరోధి అనీ, మనకు కావలసిన చింతామణి, తదితరాలనూ మర్యాదగా అప్పగించి, సంతోషం కలుగజేయమని చెప్పు. లేకపొతే యుద్ధానికి సిద్ధంగా ఉండమని తెలియజేయి" అని వివరంగా చెప్పి దూతను పంపాడు.

దూత నీలుడి మాటలను మననం చేసుకుంటూ, స్వర్గ లోకం చేరాడు. అక్కడ దేవ సభలో మహేంద్రుడి ఎదుటికి చేరాడు. ఇంద్రుడు, భార్య అయిన శచీదేవితో కూడి, సింహాసనం పై అధివసించి వున్నాడు. దేవగురు బృహస్పతి, దేవ లోక మహర్షులందరూ, ఉచితాసనాలపై ఉపవిష్టులైనారు. అప్సరసలు నృత్యాలు చేస్తుంటే, గంధర్వులు కమ్మగా గానం చేస్తున్నారు. రాక్షస రాజ కుమారుడు నీలుని దూత సభలో ప్రవేశించి, మహేంద్రుడికి నమస్కరించాడు. ఆయనా మర్యాద పూర్వకంగా కుశల ప్రశ్నలు వేస్తూ, స్వాగతించాడు. దూత నీలుడు చెప్పమన్న మాటలను, "సురాధిపా దేవేంద్రా! నేను లంకా రాజ్య పరి పాలకుడు విభీషణ మహా రాజు గారి సేవకుడిని. ఆయన కుమారుడు, యువరాజు నీలుని దూతను. శ్రీ మంతుడూ, సర్వ శస్త్రాస్త్ర సంపన్నుడూ, ధర్మాత్ముడూ, భగవద్ భక్తుడూ అయిన నీల మహారాజు, మీకు ఒక సందేశాన్ని నా ద్వారా పంపించారు. సావధానంగా విని, ప్రత్యుత్తరం ఇవ్వవలసినదిగా కోరుతున్నాను" అని చెప్పి, నీలుడు చెప్పి పంపిన విషయాలనన్నిటినీ ఏకరువు పెట్టాడు.

అన్నీ విన్న సహస్రాక్షుడు కోపోద్రేకంతో, "నీలుడు అంతటి వాడు అయ్యాడా? మా వజ్రాయుధం సంగతి మరిచాడా? మహా బల సంపన్నులైన పాకాసుర, జమ్బాసురాది రాక్షసుల కన్నా పోటు గాడా? అతని పరాక్రమం ఏమిటో చూద్దాం. అతను అడిగినవేవీ ఇవ్వమని చెప్పు" అని చెప్పి, ఆ దూత శిఖను కత్తిరింప జేసి, బయటికి వెడల గొట్టాడు ఇంద్రుడు. ఇంతలో సభలో అశుభ శకునాలు కనిపించాయి, వినిపించాయి. ఏదో ప్రమాదం జరుగబోతోందనే సూచన గమనించాడు ఇంద్రుడు. సభను చాలించి, అంతఃపురం చేరాడు.

ఇంద్ర సభలో జరిగిన పరాభవాన్ని మూట గట్టుకుని, దూత నీలుని చేరి, విషయం అంతా వివరించి చెప్పాడు. నీలుడు దూతకు జరిగిన పరాభవం తనకే జరిగినట్లుగా భావించాడు. తండ్రి విభీషణునితో మంత్రాలోచన చేశాడు. సైన్యాన్ని సమకూర్చుకుని, స్వర్గాన్ని ముట్టడించటానికి సన్నద్ధుడై బయల్దేరాడు. కొద్ది కాలంలోనే స్వర్గం చేరి, దేవ సైన్యంతో యుద్ధం ప్రకటించాడు. ఇంద్రుడు కూడా సమయా సమయాలు తెలియకుండా, అహంకార బల గర్వితుడై, మద మత్సరాలతో ఊగిపోతూ, పోరుకు తలపడ్డాడు. భయంకర యుద్ధం సాగింది. ఇంద్రుడు వజ్రాయుధాన్ని నీలుడిపై ప్రయోగించాడు. నీలుడు దాన్ని ఛేదించి, నిర్వీర్యం చేశాడు. పరాభవంతో రగిలిన దేవేంద్రుడు, నీలుడితో ద్వంద్వ యద్ధానికి దిగాడు. ఇంద్ర నీలులిద్దరూ, బాహా బాహీ యుద్ధం చేశారు. కుప్పించి తన్నుకొన్నారు, కాళ్ళతో కొట్టు కొంటున్నారు. క్రమంగా ఇంద్ర బలం క్షీణించి, రాక్షసుడు అయిన నీలుని బలం పెరిగింది. ఇంద్రుడు దెబ్బ తిని, నేల మీద కూలి పోయాడు. నీలుడు అమాంతం కుప్పించి ఎగిసి, ఇంద్రుని వక్షస్థలం మీద చేరి, పదునైన ఖడ్గాన్ని గుండెలు చీల్చటానికి పైకి ఎత్తాడు. ఆ ఘోరం చూడలేక, అందరూ భయ కంపితులైనారు.

అప్పుడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై, నీలుని ఆపాడు. ఇద్దరికీ సంధి చేయటానికి తాను వచ్చానని, బ్రహ్మ వారిద్దరికీ చెప్పాడు. నీలుడు ఇంద్రుని గుండెల మీద నుంచి లేచాడు. ఇంద్రుడు, నీలుడు, ఇద్దరూ బ్రహ్మ దేవునికి నమస్కరించి, భక్తీతో కీర్తించారు. నీలుడు చేసిన బ్రహ్మ స్తవానికి, నాలుగు ముఖాల బ్రహ్మ సంతోషించాడు. దేవేంద్రునితో బ్రహ్మ, "పాక శాసనా! నీకు బుద్ధి ఇంకా రాలేదా? ఇప్పుడు నీవు అనుభవిస్తున్న స్వర్గాధిపత్యం, విభీషణుడి రాజాధికారం అంతా, శ్రీ రాముడి దయ చేతనే ననే సంగతి మరచి పోయావా? నీలుడు కోరిన కోరికలు, అతి సాధారణమైనవే. వాటిని మన్నించి, అతనికి వాటిని ఇచ్చి వేస్తే మంచిది" అని చెప్పాడు. బ్రహ్మ ఇంద్రునికి హితోపదేశం చేస్తూ, నీలుడు హనుమ భక్తుడు. హనుమద్దాసులకు అప జయం వుండదు. చింతామణి, కల్ప వృక్షం, కామ ధేనువు లను, నీలునికి సమర్పించు. అతనిని క్షమాపణ కోరి, సుఖంగా వుండు" అని బోధించాడు. బ్రహ్మ వాక్కులకు సిగ్గు పడి, నీలుణ్ణి క్షమాపణ కోరి, చింతామణీ, కల్ప వృక్షం, కామ ధేనువు లను ఒసగి, సభక్తికంగా నిలబడ్డాడు.

అప్పుడు బ్రహ్మ నీలుని చూసి, "శ్రీ మంతా నీలా! నువ్వు మాకు ఇష్టుడవైన భక్తుడవు. నా సంతోషం కోసం, నీకు  ఒక వరం ఇవ్వా లను కొంటున్నాను. స్వీకరించు. నువ్వు తపస్సు చేసిన ఈ ప్రదేశం ఇక నుంచి "నీలా చలం" అని, నీ పేర పిలువ బడుతుంది. దీనినే, "పురుషోత్తమ క్షేత్రం" అని పిలుస్తారు. నీకు "వనసుందరి" అనే దేవతా స్త్రీని ఇస్తున్నాను. ఆమెను వివాహం చేసుకుని, సర్వ సుఖాలనూ అనుభవించు. కాలాంతరంలో నువ్వే ఇక్కడ "నీలాచలేశ్వరుడ"నే పేరు మీద ఈ నీలాచలంలో వెలసి, భక్తుల కోర్కెలను తీరుస్తావు." అని చెప్పి, వన సుందరిని ఇచ్చి, యుద్ధంలో చని పోయిన వారందరినీ బ్రతికించి, బ్రహ్మ లోకం చేరాడు బ్రహ్మ. ఇంద్ర, నీలాదులు, పరమ సంతోషం పొందారు. ఇద్దరి మధ్యా వైరం ఎంత త్వరగా ప్రారంభం అయిందో, అంత  త్వరగా సమసి పోవటం, ఉభయులకూ ఆనంద దాయకం  అయింది.

కాలం ఎంతటి వారినైనా కలుపు తుంది, విడదీస్తుంది. కాల మహిమను ముందుగా ఎవరూ తెలుసుకోలేరు. ఈ గాధలను పరాశర మహర్షి, మైత్రేయునికి వివరించినట్లుగా పురాణవిదితం..

ధర్మో రక్షతి రక్షితః!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...