Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label Shri Rama Pattabhishekam. Show all posts
Showing posts with label Shri Rama Pattabhishekam. Show all posts

Monday, January 22, 2024

శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 2 Coronation of Lord Rama in Ayodhya - Shri Rama Pattabhishekam


శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 2
ఆనాడు శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగింది? ఈనాడు ప్రాణ ప్రతిష్ట సమయంలో మనం ఏం చేయాలి?

యావత్ భారత దేశం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసిన బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ ఘట్టానికి చేరుకున్నాం. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయంలో ముగ్ధ మనోహరుడైన బాల రాముడు కొలువు దీరుతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడిన అయోధ్య రామాలయ విశిష్టతలేంటి? వేల ఏళ్ళ క్రితం నాటి రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది? రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున మనం చేయవలిసిన కార్యాలేంటి? అనేటటువంటి విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/WJxFJo2M8QU ]


రాముడు లంక నుండి సీతా దేవిని తీసుకుని పుష్పక విమానంలో, భల్లూక, వానరుల సమూహంతో అయోధ్యలోని నందిగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ నుండి రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, సూర్యమండల సన్నిభమైన రథాన్ని ఎక్కి పట్టాభిషేకానికి బయలుదేరాడు. ఆ రథం యొక్క పగ్గాలను భరతుడు పట్టుకుని నడిపించాడు. లక్ష్మణుడు నూరు తీగలు కలిగిన తెల్లటి గొడుగును పట్టాడు. ఒకపక్క శత్రుఘ్నుడు, మరొకపక్క విభీషణుడు వింజామర వీస్తున్నారు. అలా రథంలో అయోధ్యకు వెళుతున్న రాముడు, కనపడ్డ వాళ్ళందరినీ పలకరించుకుంటూ వెళ్ళాడు. రాముడు అందరితో కలిసి ఊరేగింపుగా, నందిగ్రామం నుండి అయోధ్యకు వెళుతుంటే,  అయోధ్యలో ప్రతి ఇంటిమీదా పతాకాలు ఎగురవేశారు. అన్ని ఇళ్ళముందు రంగవల్లులు వేశారు. అందరూ సంతోషపడిపోతూ, నాట్యం చేస్తూ వెళుతున్నారు. అలా వెళ్ళేటప్పుడు ముందుగా మంగళ వాయిద్యాలు నడిచాయి. ఆ వెనుక వేద పండితులు నడిచారు. తరువాత పెద్దలు, వాళ్ళ వెనుక కన్నె పిల్లలు. కొంతమంది స్త్రీలు పిండివంటలు పట్టుకుని నడిచారు. మార్గమధ్యంలో గంధపు నీరు జల్లుకుంటూ వెళ్ళారు. ఆ తరువాత సువాసినులయిన స్త్రీలు చేతులలో పువ్వులు, పసుపు, కుంకుమ పట్టుకుని వెళ్ళారు. వశిష్ఠుడు, జాబాలి, కాశ్యపుడు, గౌతముడు మొదలైన ఋషులందరూ అక్కడికి వచ్చారు. అలా అందరూ కలిసి అయోధ్యకి చేరుకున్నారు.

ఆ రాత్రికి అయోధ్యలో గడిపాక, మరునాడు రాముడి పట్టాభిషేకానికి 4 సముద్ర జలాలూ, 500 నదుల జలాలనూ వానరులు తీసుకొచ్చారు. ఇంద్రుడు నూరు బంగారు పూసలు కలిగిన మాలను రాముడికి బహూకరించాడు. వానరులు తీసుకొచ్చిన ఆ జలాలను రాముడి మీద పోసి, ఆయనకు పట్టాభిషేకం చేశారు. అప్పుడే కిరీటాన్ని తీసుకు వచ్చి రాముడి శిరస్సున అలంకరించారు. ఆ సమయంలో రాముడు కొన్ని కోట్ల బంగారు నాణాలూ, లక్షల ఆవులూ, వేల ఎద్దులనూ దానం చేశాడు.

తిరిగి ఇన్ని వేల సంవత్సరాల తరువాత, అయోధ్యలో బాల రాముడి పట్టాభిషేకం కన్నుల పండువుగా జరగుతోంది. ఆనాడు అయోధ్య ప్రజలు రాముడి రాక కోసం ఎదురుచూసిన విధంగా, నేడు భరత జాతి యావత్తూ రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తోంది. సర్వాంగ సుందరంగా, ఎన్నో ప్రత్యేకతలతో నిర్మింపబడిన రామ మందిరం, ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా నిలువనుంది. ప్రస్తుతం కంబోడియా అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత స్థానంలో, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఉంది. ఇప్పుడు అయోధ్యలోని రామాలయం, మూడవ అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందింది. భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం, అయోధ్య రామ మందిరం. ఈ రామమందిరాన్ని సంప్రదాయ నాగర్‌ శైలిలో నిర్మించారు. ఈ ఆలయం, 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది. మందిరాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు, 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ రామాలయంలో మొత్తం 392 స్తంభాలూ, 44 గేట్లూ ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు, ఐదేళ్ల బాలరాముడిగా దర్శనమివ్వనున్నాడు.

ఆలయంలో మొత్తం 5 మండపాలున్నాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపం. రామాలయంలోని మొత్తం గోడలూ, స్తంభాలపై, అనేక రకాల దేవతామూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రీకరించారు. ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో, దీర్ఘచతురస్రాకారంలో ప్రహరీని నిర్మించారు. నాలుగు మూలల్లో నాలుగు దేవాలయాలను నిర్మించారు. వీటిలో సూర్యభగవానుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలున్నాయి. ఉత్తర భుజంలో అన్నపూర్ణ ఆలయం, దక్షిణం వైపు ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి అయిన సీతా కూపం ఉంది. మందిర సముదాయంలో వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, నిషాద్ రాజ్, శబరి మాత, అహల్య దేవిల మందిరాలను చూడొచ్చు. నైరుతి భాగంలో నవరత్న కుబేరు తిలపై, పురాతన శివాలయం పునరుద్ధరించబడింది. అక్కడ జటాయువు విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇంత విశాలమైన ఈ ఆలయాన్ని, ఇనుము వాడకుండా, ప్రత్యేక శిలలతో అత్యంత సుందరంగా నిర్మించారు. మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్‌, సిమెంట్‌, కాంక్రీటును వాడలేదు. భూమిలోని తేమతో, ఆలయానికి భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు, 21 అడుగుల ఎత్తున గ్రానైట్‌తో పునాదిని నిర్మించారు.

దేశం నలు మూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. రిక్టర్‌ స్కేల్‌పై 10 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చినా, మరే విధమైన ప్రకృతి విపత్తులు వచ్చినా, కనీసం 2,500 సంవత్సరాల పాటు తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని డిజైన్‌ చేశారు. ఆయోధ్య రామాలయ ప్రాంగణంలో, 27 నక్షత్రాలకు సూచికగా, 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్నీ, రాశినీ అనుసరించి, ఆయా చెట్ల కింద కూర్చుని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కోసమే, ఈ వాటికను ఏర్పాటు చేశారు.

నాడు వానరులు 500 నదులూ, 5 సముద్రాల నుండి తెచ్చిన జలాలతో, రాముడి పట్టాభిషేకాన్ని నిర్వహించారు. నేడు వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఏడు ఖండాలలోని 115 దేశాలలో ప్రవహించే నదులూ, సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాన్ని, 2,587 ప్రాంతాల నుంచి తెప్పించిన మట్టినీ, రామాలయ నిర్మాణంలో వినియోగించారు.  ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత, ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం గర్భగుడిలో, మూల విరాట్‌పై సూర్య కిరణాలు పడినట్లుగా, రామ మందిరంలోని బాల రాముడి విగ్రహం మీద, శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా, అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం. ఇలా ఎన్నో విశిష్టతలతో నిర్మింపబడిన ఈ ఆలయంలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం, మేష లగ్నంలో అభిజిత్ ముహుర్తంలో జరగబోతోంది. సాధారణంగా 5 గ్రహాలు అనుకూల స్థానంలో ఉంటే మంచి ముహుర్తం. అయితే ప్రాణ ప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సమయంలో విగ్రహ ప్రతిష్టాపన చేస్తే, ప్రపంచంలోనే మన దేశ కీర్తి మరింత పెరుగుతుంది. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో మనమందరం ప్రత్యక్షంగా పాల్గోనే అవకాశం లేకపోవచ్చు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు శ్రీ రాముడి అక్షతలను పంపిణీ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ రోజున అయోధ్యలోని రామ మందిరంతో పాటు, ప్రతీ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిలో పాల్గోనే అవకాశం ఉన్నవారు, ఆలయంలో రామ నామ స్మరణ చేస్తూ రాముల వారి కృపకు పాత్రులు కావచ్చు. ఇన్నేళ్ళ మనందరి కల తీరబోతున్న వేళ సాయం సమయంలో, ప్రతీ ఇంట్లో దీప కాంతిలో దీపావళి శోభ కనువిందు చేయబోతోంది. ప్రతి ఇంట్లో 5 దీపాలను వెలిగించి, మన ఇంటికి కూడా రాముల వారిని ఆహ్వానిద్దాము.

జై శ్రీరామ!

Wednesday, January 17, 2024

శ్రీరామ పట్టాభిషేకం! భాగం - 1 Coronation of Lord Rama in Ayodhya - Shri Rama Pattabhishekam


శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 1  @mplanetleaf  
రాముడు పట్టాభిషిక్తుడవ్వడం భరతుడికి ఇష్టమేనా?

రామాయణంలోని ప్రతి ఘట్టం ఒక మధుర కావ్యంలానే ఉంటుంది. ఒక్కో కాండం, అద్భుతమైన భావోద్వేగాలను జనింపజేస్తుంది. రామాయణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం, శ్రీ రామ పట్టాభిషేకం. రాముడికి రాజుగా పట్టాభిక్తుడవ్వడం ఇష్టమేనా? రాముడి దూతగా హనుమ భరతుడి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు? పుష్పక విమానంలో లంక నుండి బయలుదేరిన రాముడు, సీతతో పంచుకున్న విషయాలేంటి? పుష్పక విమానంలో ఎవరెవరు అయోధ్యకు చేరుకున్నారు - వంటి మధురమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6D9Vuf63rNc ]


తాము అయోధ్యకు పయనమవ్వడానికి ప్రయాణ సాధనం ఏదైనా ఉన్నదా? అని రాముడు విభీషణుడిని అడగగా, విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు ఆ విమానాన్ని ఎక్కిన తరువాత వానరులతో, "మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను" అని చెప్పగా వారందరూ, "మిమ్మల్ని విడిచి మేము ఉండలేము. మేము కూడా మీతో అయోధ్యకు వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. మిమ్మల్ని కన్న కౌసల్యా మాతను ఒకసారి దర్శించుకోవాలని ఉంది. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది" అని అన్నారు. విశాల హృదయుడైన రాముడు సరే అనేసరికి, అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది.

రాముడు సీతమ్మకు పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ, "సీతా, ఇదిగో ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం. అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం. ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువును మేము వానరులతో కలసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని, ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని ఎంతో ఆలోచించాము. ఇదే కిష్కింధ. ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకూ నీ జాడను కనిపెట్టడానికి బయలుదేరారు" అని చెప్తుంటే, సుగ్రీవుడు గబగబా వచ్చి, "రామ! మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తారా, రుమా చూస్తుంటారు. వాళ్ళని కూడా ఎక్కించుకుందాము" అన్నాడు. రాముడు సరేనని ఒప్పుకోవడంతో, పుష్పకవిమానాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి, తార, రుమలకు విషయాన్ని చెప్పి, రమ్మన్నాడు.

అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్ళి "రండి, రండి. సుగ్రీవుడు జయాన్ని సాధించి, రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి" అని చెప్పింది. అప్పుడు అక్కడున్న ఆడ వానరులందరూ మానవ కాంతలలాగా  కామరూపాలను పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసి లోపలికి ఎక్కి, "సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ?" అని అడిగారు. "ఆవిడే సీతమ్మ" అని చూపిస్తే, అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకుని, పలకరించింది.

మళ్ళి రాముడు సీతతో "సీత, అదే ఋష్యమూక పర్వతం. అక్కడే నేను, సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావా సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం.  అక్కడే రావణుడు నిన్ను అపహరించాడు" అని రాముడు చెబుతుంటే, సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది. ఇంకా కొంత ముందుకు వెళ్ళాక, అదే అగస్త్య మహర్షి ఆశ్రమం. అక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. ఆ పక్కన కనపడుతున్నది చిత్రకూట పర్వతం. అక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము" అన్నాడు. అలా రాముడు పుష్పకవిమానంలో ప్రయాణం చేస్తున్నంత సేపు, సీతమ్మకు దారి పొడవునా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ, అక్కడ జరిగిన సంఘటనలు వివరించాడు.

అలా ఆ పుష్పక విమానం కొంత ముందుకు వెళ్ళాక, వాళ్ళకి భరద్వాజ మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పక విమానాన్ని అక్కడ దింపి, భరద్వాజుడికి నమస్కరించారు వాళ్ళు అందరూ. భరద్వాజ మహర్షి రాముడిని చూసి సంతోషిస్తూ, "రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలాలలో నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం నాకు తెలుసు. ఈ ఒక్క రాత్రి నా ఆశ్రమంలో ఉండి విశ్రాంతి తీసుకుని, నా ఆతిధ్యం స్వీకరించిన తరువాత నువ్వు బయలుదేరు" అని అన్నాడు. అప్పుడు రాముడు భరద్వాజుడి మాట కాదనలేక, అక్కడ ఉండటానికి నిర్ణయించుకున్నాడు. తరువాత  హనుమంతుడిని పిలిచి, 'హనుమ! నువ్వు ఇక్కడినుండి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు. అతను నాకు మిక్కిలి స్నేహితుడు. గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. ఆ పని అయిపోయిన తరువాత అక్కడినుండి బయలుదేరి, అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా లేదా? అని కనుకకుని, నందిగ్రామానికి వెళ్ళు. అక్కడ అందరితో నేను తిరిగి వస్తున్నానని చెప్పు. ముఖ్యంగా భరతుడికి అదే మాట చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు.

భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే, వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను. భరతుడు అయోధ్యను పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా" అన్నాడు. వెంటనే హనుమంతుడు అక్కడి నుండి బయలుదేరి గుహుడిని కలుసుకుని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుండి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకుని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలను వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.

మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భరద్వాజుడు రాముడితో, "రామా!! నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో" అని అన్నాడు. అప్పుడు రాముడు, "వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుండి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకు ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా, చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి. ఇలా నాకు వరం ఇవ్వండి" అని అడిగాడు. భరద్వాజుడు రాముడు అడిగినట్టు వరం ఇవ్వగానే, భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని, కోలాహలంతో నందిగ్రామానికి చేరుకున్నాడు రాముడు. అప్పుడు భరతుడు తన సైనికులతో "రాముడు వచ్చేస్తున్నాడు. అయోధ్యలో ఉన్న తల్లులను తీసుకురండి. రథాలని తీసుకురండి. పెద్దవాళ్ళని తీసుకురండి. అందరినీ అయోధ్యకు రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుండి అయోధ్యకు పట్టాభిషేకానికి తీసుకువెళదాము" అని భరతుడు ఆజ్ఞాపించాడు.

రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు, పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. అలా రాముడి రాక అయోధ్యకు కొత్త కాంతి తీసుకొచ్చింది. రాముడు పుష్పక విమానం నుండి కిందకి దిగగానే, భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అన్నగారి పాదాలకు పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల నుండి నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకుని, "ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుండి, మనం అయిదుగురన్నదమ్ములము సుగ్రీవ" అని అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదనుడూ, మైందుడూ మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలతో, "మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు. మీకు ఋణపడి ఉన్నాం" అని అందరినీ కౌగలించుకున్నాడు. పుష్పకం నుండి కిందకి దిగిన వానరకాంతలు, అక్కడున్న ఆడవారి రూపాలనూ, వారి అలంకారాలనూ చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు వారందరితో, "ఈ వానర కాంతలందరికీ మేమే తలస్నానాలు చేయిస్తాము" అని వాళ్ళందరికీ చెప్పి తలస్నానాలు చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది.

భరతుడు తలవంచి నమస్కారం చేసి రాముడితో, "అమ్మ కైకేయి ఆనాడు రెండు వరాలడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయావు. నీ పాదుకలను వ్యాసంగా ఇచ్చి, నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకువచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు. ఇవ్వాళ నేను దానిని నీకు అప్పగించేస్తున్నాను" అని అన్నాడు. భరతుడి మాటలకు సంతోషించిన రాముడు, తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి, "అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను. నీ జుట్టు జటలు పట్టేసింది కదా, అందుకని క్షుర కర్మ చేయించుకో" అని అన్నాడు. అప్పుడు రాముడు, "నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని, నా అంతట నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కానీ, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నా మీద ఉన్న  ప్రేమ చేత, స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలను తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యము మీద  మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు, ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప, నేను దీక్షని విరమించను" అని అన్నాడు.

భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక, రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకుని, దివ్యాభరణములను ధరించి బయటకు వచ్చాడు. తన కొడుకు ఇన్నాళ్ళకు తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి, సీతమ్మకు అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి, చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయిల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు, 9000 ఏనుగులను ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగును తీసుకు వచ్చి, దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకు బయలుదేరారు. మరి అయోధ్యలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది? ఎవరెవరు పాల్గోన్నారనేటటువంటి రసరమ్య ఘట్టాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందము..

జై శ్రీరామ!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...