శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas


శ్రీ కృష్ణ లీలలు! 

అది మండు వేసవి. మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. పండు ముదుసలి, రామ భక్తురాలు అయిన ఒక అవ్వ, తలపై బరువైన పళ్ళ బుట్టతో, వేణు గోపాల స్వామి గుడి దగ్గర కాసేపు నీడలో కూర్చుందామని వచ్చింది. మెల్లగా బుట్టను క్రిందికి దించింది. చెమట పట్టిన ఆ ముడుతల ముఖాన్ని తుడుచుకుంటూ, "నాయనా గోపాలా! ఊరంతా తిరిగాను. ఒక్క పండు కూడా అమ్మలేదు. ఈ రోజు పస్తేనా స్వామీ?" అని ఆ వేణు గోపాలుని విగ్రహం వైపు చూస్తూ తనలో తాను అనుకున్నది.

[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! https://youtu.be/AbSSImIw2-4 ]


ఇంతలో ఒక బాలుడు, నుదుటిపై కస్తూరీ తిలకం, వక్ష స్థలంపై కౌస్తుభ హారం, నాసాగ్రమున నవమౌక్తికం,  కంఠాన ముత్యాలహారం, చేతిలో పిల్లన గ్రోవి, శిఖలో నెమలి పింఛంతో, ఆ అవ్వ వైపుగా వస్తున్నాడు. ఆ బాలుడు ఎవరోకాదు, వేణు గోపాలుడే..

ఎవరా అన్నట్లు, ఆ అవ్వ అలా చూస్తోంది. దగ్గరగా వచ్చిన బాలుని చూసింది. తాదాత్మ్యంతో ఆ లీలా మానుష రూపధారిని చూస్తూ, 'అయినా కలియుగంలో భగవంతుని దర్శనం ఏమిటిలే' అనుకున్నది. 

"అవ్వా, ఈ పళ్ళు తీయగా ఉంటాయా?" అడిగాడు బాలుడు.

"అవును కన్నా. చాలా తీయగా ఉంటాయి. తీసుకో" అన్నది అవ్వ.

బాలుడు: ఎన్ని?

అవ్వ: ఎంత డబ్బు ఇస్తే అన్ని..

బాలుడు: డబ్బా? అంటే ఏమిటి?

అవ్వ: నీకు అర్ధం కాలేదా.. కాలేదన్నట్లు తల ఊపాడు బాలుడు.

ఈ చోద్యాన్నంతటినీ నారదుడు గమనిస్తున్నాడు. ఆ లీలామానుష విగ్రహధారి లీల ఏమిటా అన్నట్లు చూస్తున్నాడు.

అవ్వ: అయ్యొ పిచ్చికన్నా.. డబ్భంటేనే తెలియదా? నువ్వు ఏదైనా తీసుకుంటే, దానికి ప్రతిఫలం ఇవ్వాలి. అదే డబ్బంటే..

బాలుడు: అటువంటిదేదీ నా దగ్గర లేదే..!

అవ్వ: నీకు తెలియదులే. పళ్ళు కొనడానికి డబ్బు కావాలని అమ్మనడుగు. ఇస్తుంది.

బాలుడు: అమ్మ ఇంట్లో లేదు. యమునకు వెళ్ళింది..

అవ్వ: ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలున్నాయా?

బాలుడు: ఓ.. చాలా ఉన్నాయి. గాదెల నిండా ఉన్నాయి..

అవ్వ: అయితే కొన్ని తీసుకురా. పళ్ళు ఇస్తాను..

బాలుడు: చాలా వింతగా ఉందే. అమ్మ ఎన్నో ఇస్తుంది. కానీ ఏమీ తీసుకోదు. గొల్ల భామలు వెన్న పెడతారు. డబ్బులు తీసుకోరు. వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు. కౌగిలించుకోమంటారు. అమ్మా అనమంటారు..

బాలుడి మాటలు అవ్వకు అంత అలసటలోనూ నవ్వు తెప్పించాయి. బాలుని అలాగే చూస్తోంది. ఆమె మనస్సు ఏదో తన్మయత్వం చెందుతోంది ఆ ముద్దు ముద్దు మాటలకు.

బాలుడు: అమ్మా..

అవ్వ: నన్నే! అన్నది ఆశ్చర్యపోతూ..

బాలుడు: అవునమ్మా.. నిన్నే అమ్మా అన్నాను. అమ్మా అంటాను. నిన్ను కౌగలించు కుంటాను. నీ ఒళ్ళో కూచుంటాను. నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఒక్క పండు ఇవ్వవా? తినాలనుంది..

అవ్వ: పిచ్చి తండ్రీ. నాకా అదృష్టం లేదు కన్నా..

బాలుడు: ఎందుకు?

అవ్వ: నేను అంటరాని దానను. నిన్ను నేను ఎలా ముద్దాడగలను?

అవ్వ అలా అంటుండగానే బాలుడు, 'ఇలా' అంటూ అవ్వ ఒడిలో వాలిపోయాడు. అవ్వను ముద్దాడాడు. మెడ చుట్టూ తన చిట్టి చేతులతో చుట్టేశాడు.

అవ్వ: అయ్యో కన్నా. ఏమిటిది! ఎవరైనా చూస్తే ఎంత గొడవ చేస్తారో.. నేను అంట రాని దానను..

బాలుడు: ఏం? అంటరాని వారు మనుషులు కారా? ఇవన్ని మానవ కల్పితాలు.. అలాంటి ఆంక్షలు నాకు ఇష్టంలేదు.. నా స్నేహితులు చాలా మంది నీవంటి వారే. నవ్వు కూడా అమ్మవే నాకు.. అంటూ అవ్వను ముద్థు పెట్టుకున్నాడు.

నారదుడు చూస్తున్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

శ్రీకృష్ణునికి యశోదా దేవి లాగా, శ్రీనివాసునికి వకుళాంబ లాగా, అవ్వ ఆ బాలుడి కళ్ళలోకి అలా వాత్సల్యంగా చూస్తోంది. తన అదృష్టానికి మురిసి పోతోంది.

అవ్వ: కన్నా.. నువ్వు ఎవరివి? ఏమిటీ మాయ? నీ స్పర్శ నాలో వెలుగులు చిమ్మి, తన్మయ పరచింది. క్రిందటి జన్మలో యశోదా దేవినా? లేక వకుళా దేవినా..? ఈ అదృష్టం చాలు.. ఇంతకన్నా ధనం వద్థు.. పళ్ళు ఎన్నికావాలో తీసుకో. ఒకటా? రెండా? అన్నీనా? తీసుకో కన్నా.. ఎన్నికావాలో తీసుకో..

బాలుడు: నాకు ఇవన్నీ కావాలి..

అవ్వ: అలాగే కన్నా.. అన్నీ తీసుకో. అంటూ అన్నీ తీసి ఒక గుడ్డలో మూట కట్టబోయింది.

బాలుడు: వుండమ్మా. నేను నీకు కావలసినన్ని ధాన్యం గింజలు తెస్తాను..

అవ్వ: వద్దు కన్నా.. నా జన్మ తరించి పోయింది. పళ్ళు తీసుకో కన్నా.. అన్నది ఆర్ద్రంగా

ఆ బాలుడు వినిపించుకోకుండా బుడిబుడి అడుగులతో ఇంట్లోకి వెళుతుంటే, అవ్వ ఆ బాలునివైపే చూస్తూ, తన్మయత్వంతో బుట్టలో వున్న పళ్ళన్నీ బాలుని కోసం గుడ్డలో వేసి మూటకడుతోంది.

ఇంతలో బాలుడు తన చిట్టి చేతుల దోసిలి నిండా ధాన్యం తీసుకు వస్తున్నాడు. ధాన్యపు గింజలు దారంతా పడిపోతున్నాయి.

బాలుడు: ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను తీసుకో.. అంటూ అవ్వకు చూపించాడు. బాలుడు అవ్వను చేరే సమయానికి, ఆ చిట్టి చేతుల దోసిలిలో పది పదిహేను గింజలు మాత్రమే మిగిలాయి. అవ్వ అలా బాలుని దోసిలి వైపు, బుంగమూతి వైపు, మిలమిల లాడే కన్నుల వైపు చూస్తోంది. నాడు  యశోదా దేవికి పదునాలుగు లోకాలను చూపించిన ఆ నోటిని సగం తెరచి, బాలుడు చిరునవ్వుతో అవ్వవైపు చూస్తున్నాడు.

అవ్వ ఆ గింజలను చూసి చిరునవ్వుతో, బోసి నోటిని సగం తెరచుకుని, కంటి నుండి వాత్సల్య పూరితమైన ఆనంద భాష్పాలతో, లీలా మానుష ధారిని చూస్తూ తన్మయత్వం చెందుతూ, తనను తాను మరచిపోయి అలా ఉండిపోయింది.
 
అవ్వ: అబ్బో.. చాలా తెచ్చావు కన్నా..

బాలుడు: దోసిలిలో చాలానే తీసుకున్నానమ్మా.. అన్నీ దారిలో పడిపోయాయి. ఇవే మిగిలాయమ్మా.. బుంగమూతితో అవ్వ వైపు చూస్తూ అన్నాడు.

అవ్వ: ఇవే చాలా ఎక్కువ కన్నా. నా బుట్ట నిండిపోతుంది..

అంటూ ఆ ధాన్యం గింజలను ఆనందంగా తీసుకున్నది. ఈ రోజు చాలా మంచి రోజు అనుకున్నది అవ్వ. ఆ కాసిన్ని గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పోసుకుని, పళ్ళమూటను బాలునికి ఇచ్చింది. బాలుడిని మనసారా కౌగలించుకుని, ముద్దు పెట్టుకున్నది. విడువలేక విడువలేక, అతి కష్టం మీద బయలుదేరింది.

అంతా నారద మహాముని తిలకిస్తున్నాడు. ఆ శ్రీకృష్ఞ పరమాత్మ ఏ లీల చూపనున్నాడా అన్నట్టు, నమస్కారం చేశాడు.

అవ్వ బుట్ట తేలికగా ఉంది. మనసు బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది. నెమ్మదిగా ఇంటికి చేరింది. నట్టింట్లో బుట్టను క్రింద పెట్టి, కూర్చుని బుట్టలోని ధాన్యం గింజలు కట్టిన గుడ్డను తెరిచి చూస్తే, అందులో ధాన్యంగింజలు లేవు. వాటి స్థానంలో, గంపెడు నవరత్నాలూ, మణి మాణిక్యాలూ ధగధగలాడిపోతూ కనిపించాయి. అవ్వ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. నిస్చేష్ఠురాలై పోయింది ఆమె. తనకు తెలియకుండానే రెండు చేతులనూ జోడించి, పరమాత్మకి నమస్కరిస్తోంది. ఇదంతా గమనిస్తున్న నారదుడు, ఆ పరమాత్మ ఆవ్వపై కురిపించిన కనకవర్షానికి, ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తి మార్గమని అనుకున్నాడు.
 
మనకు ధనరాశులు ఇచ్చి, భక్తి మార్గంలో వెళతామా, లేక ధన రాశుల వలన వేరే పేరాశలు, పెను బంధాలకు మార్గం మార్చుకుంటామా! అనే దానికి ఇది ఒక పరీక్ష కాదుగదా? ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే ఉచ్చులో నరుని వివేకము ఏవిధంగా పయనిస్తుందో.. దైవ చింతన వైపా, లేక ధన చింతన వైపా? నరుడు ఈ పరీక్షలో బాగా యోచించి, ధనమనే మాయా పాశానికి లొంగక, ఆ పరమాత్మ చింతనలోకి వెళతాడా, లేక ఆ ఉచ్చులో చిక్కుకుపోయి, ఐహిక బంధాలలో ఉండిపోతాడా? ఆ నందనందనుడు బహు చమత్కారి. అనుకున్నాడు నారదుడు..

🚩 జై శ్రీ కృష్ణ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur