Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Showing posts with label 2025. Show all posts
Showing posts with label 2025. Show all posts

Friday, May 2, 2025

జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి.. Adi Shankaracharya Jayanthi 2025


జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి శుభాకాంక్షలు 💐 

దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే |
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః ||

లోకంలో దుష్టాచారాన్ని నశింపజేయడానికి సాక్షాత్తు కైవల్య నాయకుడైన శివుడు శంకరాచార్యుని రూపంలో భూమండలం మీద అవతరించారు.

Don't miss to Watch: https://youtu.be/srTCWknBC7Q


ఆదిశంకరాచార్య జయంతి నేడు. వారికి సునమస్సులు..

అద్భుతమైన వ్యక్తీకరణ
-------------------------------

"విషమ విషయమార్గే గచ్ఛతోऽనచ్ఛ బుద్ధేః
ప్రతిపదమభిఘాతో మృత్యురప్యేష విద్ధి
హిత సుజన గురూక్త్యా గచ్చతస్స్వస్య యుక్త్యా
ప్రభవతి ఫలసిద్ధిస్సత్యమిత్యేవ విద్ధి"

అంటూ కల్మష బుద్ధితో క్రూరవిషయ మార్గాల్లో  వెళుతుండే వాడికి ఈ మృత్యువు ప్రతి అడుగులోనూ దెబ్బకొడుతూంటుందని తెలుసుకో; హితులు, సుజనులు,‌ గురువులు చెప్పిన దానివల్లా, సొంత యుక్తివల్లా వెళ్లేవాళ్లకు ఫల‌ప్రాప్తి అవుతోంది. దీన్నే సత్యంగా తెలుసుకో అని 'మన జాతి గురువు' ఆదిశంకరచార్యులవారు తమ వివేకచూడామణి 83వ శ్లోకంలో ఒక అద్భుతమైన వ్యక్తీకరణను చేశారు. 'తత్త్వాన్నీ , సత్వాన్నీ , సత్యాన్నీ శంకురులు చెప్పిన స్థాయిలో మఱెవ్వరూ చెప్పలేదు. శంకరులు‌ చెప్పినంత‌‌ కవితాత్మకంగా మఱెవరూ చెప్పలేదు'.

గురువు
----------

'గురు‌' అన్నది‌ రెండు‌ పదాల కలయిక.‌ "గు"‌అంటే చీకటి. "రు" అంటే‌ కాంతి. అజ్ఞానపు చీకటిని నిర్మూలించగలిగేది గురువు. కాంతి ప్రతి ఒక్కరికీ తొలి గురువు.‌ కాంతి లేకపోతే మనకు ఏదీ తెలియరాదు. "తమ‌సోమా‌ జ్యోతిర్గమయ" అని అన్నది అందుకే. గురువులు కాంతినిస్తారు. ఆదిశంకరాచార్య మహోన్నతమైన, అసదృమైన గురువు. ఆధ్యాత్మిక, సామాజిక జ్యోతి ఆదిశంకరాచార్య ఒక దశలో‌ గురువై ఉండకపోయుంటే వైదిక లేదా సనాతన జాతి లేకుండానే పోయుండేది. భారతప్రదేశానికి ప్రకృతి ఉండేది కాదు. 

బ్రతుకే ఒక పయనంగా
------------------------------

"శంకరుల వంటి మేధ కావాలి‌" అని అన్నారు స్వామి వివేకానంద. అత్యున్నతమైన మేధతో, అనన్యమైన నైజంతో స్వ'అర్థం అన్నదే లేకుండా బ్రతుకే ఒక పయనంగా, ఒక ప్రయత్నంగా, ఒక సత్ఫలితంగా తనను తాను మట్టికి అంకితం చేసుకుంటూ తత్త్వంతో, సత్వంతో సత్యం కోసం 'సత్యంగా' సాగారు శంకరులు.

తాత్త్వికత దృష్ట్యా
----------------------

"స్వచ్ఛమైన తాత్త్వికత దృష్ట్యా భారత భూమిపై భగవద్విషయక పరిగణనలకు అతీతంగా ఆదిశంకరాచార్యుల సిద్ధాంతం అతి ముఖ్యమైనది (లేదా అవసరమైనది), మనోహరమైనది. వారి సిద్ధాంతాలకు వ్యతిరేకమైన వేదాంత ధోరణులూ, సంప్రదాయాలూ వారి సిద్ధాంతంలోని సాహసోపేతమైన గాంభీర్యానికి, విచారణా సూక్ష్మతకు సాటిరావు” అని భారతీయ తత్త్వశాస్త్ర పరిశీలకుడైన జర్మనీ దేశపు జార్జ్ టిబో (George Thibaut) ఆదిశంకరాచార్య గుఱించి అన్నారు. 

శంకరుల కాలం
-------------------

సామాన్య శకానికి పూర్వం (BCE) 509లో శంకరులు పుట్టారు అని ప్రధానమైన శంకరమఠాల గురు పరంపర ద్వారానూ, శంకరాచార్యులవారు స్థాపించిన పీఠాల చరిత్ర ద్వారానూ తెలియవస్తోంది. వారి కాలంలో  సనాతన ధర్మానికీ, భారతప్రదేశానికీ 'హిందు' పదం ఆపాదించబడలేదు. అందుకే వారి రచనలలో ఎక్కడా హిందు అన్న పదం మనకు కనిపించదు.‌ వారి జననం సామాన్య (CE) శకం 788 అయి ఉంటే అప్పటికి హిందు పదం చలామణిలోకి వచ్చింది కాబట్టి వారి రచనల్లో ఎక్కడైనా హిందు అన్న పదం కనిపించి ఉందేది. 6వ శతాబ్దికి చెందిన న్యాయ‌ సిద్ధాంత తాత్త్వికుడు ఉద్యోతకారుడు. శంకరులు ఉద్యోతకారుడి ప్రసక్తి  చెయ్యలేదు. 5వ శతాబ్దికి చెందిన  ప్రముఖ బౌద్ధ‌ పండితుడు దిన్నాగ. దిన్నాగ ప్రసక్తి కూడా శంకరులు చెయ్యలేదు. అంటే శంకరుల కాలం వీళ్లకు పూర్వంది అని తెలుసుకోవచ్చు. సామాన్య శకం 700 -750 కాలం నాటి సంస్కృత నాటక కర్త భవభూతి శంకరుల  వివర్తవాద ప్రసక్తి చేశాడు. అంటే అప్పటికే శంకరులు చాల పూర్వం వారని తెలుస్తోంది. సామాన్య శకానికి పూర్వం 5వ శతాబ్దికి చెందిన గౌతమ‌ బుద్ధుడి ప్రసక్తి కూడా ఎక్కడా శంకరులు‌ చెయ్యలేదు. శంకరుల కాలానికి ఉన్న వివిధ‌ స్వదేశీ‌ మతాల్లో‌‌‌ బౌద్ధమతం‌ లేదు. అంటే శంకరులు బుద్ధుడి కన్నా పూర్వం వారు అన్నది కూడా స్పష్టమౌతున్నది. (బుద్ధుడి కాలం BCE 477-397 అని చరిత్రకారుడు K.T.S. Sarao తెలియజేస్తున్నారు)

16యేళ్లకే
-------------

ఆదిశంకరాచార్య భారతావనిపై పుట్టి జీవించింది 32 సంవత్సరాలే! శంకరులు వైశాఖ శుక్ల పంచమినాడు కాలడి‌ (ప్రస్తుత కేరళ రాష్ట్రం) గ్రామంలో శివగురువు,‌ ఆర్యాంబ దంపతులకు జన్మించారు. శంకరులు బాల్యం నుంచే అపూర్వ, అద్వితీయ వ్యక్తిత్వంతో, ధీ శక్తితో ఎదిగారు. అనితరసాధ్యమైన మేధతో 16యేళ్లకే తమ ఇతర‌ రచనలతో పాటు ప్రస్థానత్రయమైన దశోపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాసేశారు. నిజానికి భగవద్గీతకు అంతకు ముందే భాష్యాలు ఉన్నా శంకరుల భాష్యం తరువాతే భగవద్గీత  వ్యాప్తిలోకి వచ్చింది. ప్రస్థానత్రయాన్ని శంకరులు తమ భాష్యాలతో జనబాహుళ్యంలోకి‌‌ తీసుకువచ్చారు. 

తిరుగుబాటు
-----------------

వక్ర వ్యాఖ్యానాలతోనూ, వక్ర ధోరణులతోనూ, దోష సంప్రదాయాలతోనూ సనాతన ధర్మం‌‌ అస్తవ్యస్తమైన కాలంలో ఆదిశంకరాచార్యులు  వేద ప్రతిపాదిత సత్యాన్ని సంస్థాపించడానికి పూనుకుని ఉద్యమించారు; కృతకృత్యులూ అయ్యారు. తాత్త్విక, సామాజిక, ఆధ్యాత్మిక చింతనలతో  విశేషంగా కృషిచేశారు వారు.  ఆదిశంకరాచార్యులు తన అసమాన బహుముఖ ప్రజ్ఞతో, విప్లవాత్మక ధోరణితో ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న  సామాజిక,‌ సైద్ధాంతిక, మత మౌఢ్యంపై తిరుగుబాటు చేసి విజయం‌ సాధించారు. వేద ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతాన్ని మళ్లీ ప్రసరింపజేశారు; ప్రవహింపజేశారు. 

ఒరవడి
----------

ఒక విస్మయకరమైన మేధావి, ఒక జ్ఞాని, ఒక పూజనీయమైన ఆచార్యుడు, ఒక భక్తుడు, ఒక కర్మ యోగి, ఒక వివేకి, ఒక పండితుడు,‌ ఒక దార్శనికుడు, ఒక సంస్కర్త‍‍, ఒక ఆధ్యాత్మిక యోగి, ఒక సిద్ధుడు‍, ఒక‌ మహాకవి. ఒక ముముక్షువు, ఒక మార్మికుడు,‌ ఒక తత్త్వవేత్త, ఒక తార్కికుడు, ఒక‌ అద్వైతి, ఒక భాష్యకారుడు, ఒక ఉద్యమ కారుడు, ఒక విప్లవశీలి, ఒక సనాతన ధర్మ నిర్మాత ఆదిశంకరాచార్య. వారి నుడి‌ తత్త్వానికి బడి, ఆపై సత్యానికి గుడి. మనందఱికీ వారే ఒరవడి.

శంకరత్వాన్ని సరిగ్గా‌‌ స్మరించుకుందాం‌‌ ఇదిగో‌‌‌ ఇలా --

అత్యున్నతమైన విషయం
--------------------------------

"ఏవమాత్మా రణౌ ధ్యాన మథనే సతతం‌‌ కృతే  ఉదితాన గతిర్జ్వాలా సర్వాజ్ఞానేంధనం దహేత్" (ఆత్మబోధ 42వ శ్లోకం) అంటే ఆత్మే ఒక ఆరణి (నిప్పును రగిలించేందుకు ఉపయోగించే జమ్మి చెట్టు‌ కఱ్ఱ)కాగా, నిరంతర ధ్యానమే మథనం కాగా ఆందులోంచి పుట్టిన జ్వాలలో మొత్తం అజ్ఞానం అనే ఇంధనం దహించుకుపోతుంది అని అర్థం.‌ ఎంత అద్భుతంగా చెప్పారు శంకరులు! "సత్యాపి భేదాపగ్మే నాథ్ తవాహం న మామ్ కీనస్త్వమ్  సాముద్రో హి తరంగః క్వచన్ సముద్రో న తారంగః" (విష్ణుష్టపదీ శ్లోకం 3) అంటే నేను భిన్నత్వానికి లోబడినా నాథా,  నేను నీవాణ్ణి కానీ నువ్వు నా వాడివి కాదు అన్నది‌ నిజం‌. కెరటాలు సముద్రానికి చెందినవి కావచ్చు‌. కానీ సముద్రం కెరటాలకు సంబంధించినది కాదు అని అర్థం. ఇక్కడ శంకరులు ఒక మహోన్నతమైన విషయ వివరణ చేశారు. "స్వప్నో జాగరణేऽలీకః స్వప్నేऽపి నహి జాగరః  ద్వయమేవ లయే నాస్తి లయోऽపి హ్యు భయోర్న చ"(అపరోక్షానుభూతి- శ్లోకం 57) అంటే మెలకువలో కల లేదు; కలలో  మెలకువ లేదు; ఈ‌‌ రెండూ మరణం‌(లయ)లో‌ లేవు; ఈ మరణం మెలకువలోనూ, కలలోనూ లేదు అని అర్థం.‌ అహా, అత్యున్నతమైన విషయాన్ని అసదృశంగా చెప్పారు శంకరులు!

మహోన్నతమైన మాటలు
---------------------------------

"జ్ఞానం‌ లేకపోతే స్వేచ్ఛ లేదు; అగ్ని లేకపోతే వంట లేనట్లుగా" (ఆత్మబోధ‌- శ్లోకం 2). "విద్య అవిద్యను పోగొడుతుంది‌‌; తేజస్సు మాత్రమే అంధకారాన్ని పోగొట్టగలిగినట్టు". (ఆత్మబోధ- శ్లోకం 3) "నీళ్లలో బుడగలు పుడతాయి. కాసేపు నీళ్లపై  ఆడతాయి. ఆ తరువాత నీళ్లలోనే కలిసిపోతాయి". (ఆత్మబోధ- శ్లోకం 8) ఈ విధమైన రచనం మనకు ఖలీల్ జిబ్రాన్, రూమీ వంటి అంతర్జాతీయ కవులలోనూ కనిపిస్తుంది. "పైన ఉన్న ఊకను తీసేస్తే బియ్యపు గింజ చక్కగా తెలుస్తుంది". (ఆత్మబోధ - శ్లోకం16) ఈ చెప్పడం ఎంత సహజంగా ఉందో! ఈ ఉపమానంలో జీవనం కనిపిస్తోంది కదూ? "దీపానికి ఇంకో దీపం అక్కర్లేదు  తనే ప్రకాశిస్తుంది కాబట్టి".(ఆత్మ‌బోధ . శ్లోకం 29) ఈ ధోరణి మనకు కవి రూమీలో కూడా కనిపిస్తుంది‌. "రోగాన్ని ఔషధం ఏ విధంగా పోగొడుతుందో ఆవిధంగా". (ఆత్మబోధ- శ్లోకం 37)  సహజమైన ఉపమ‌‌ ఇది!  ఇలాంటివి కవి చైనీస్ కవి లావొచు రచనల్లోనూ  కనిపిస్తాయి. "నీళ్లలో నీళ్లు లాగా, ఆకాశంలో‌ ఆకాశం లాగా, తేజస్సులో తేజస్సులాగా" (ఆత్మబోధ- శ్లోకం 53) ఈ అనడం ఎంత గొప్పగా ఉందో కదా? రూమీ, ఖలీల్ జిబ్రాన్, లావొచు వంటి కవుల్లో ఈ ధోరణి ఉన్నది. "పాలలో వెన్న అంతటా వ్యాపించి ఉంటుంది" (ఆత్మబోధ- శ్లోకం 59)  "పచ్చిపాలలోన వెన్న పరమాత్ముడు" అని అన్నమయ్య అన్నదానికి మూలం ఇదే. "అగ్నిలో కాలుతున్న ఇనుము అగ్నిలాగానే ప్రకాశించినట్లు" (ఆత్మబోధ-‌శ్లోకం 62) ఈ చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది! ఈ స్థాయి‌‌ మహోన్నతమైన మాటలు‌ శంకరులు ఎన్నో అన్నారు.


భజగోవిందం
-----------------

"ఎవరు నీ భార్య? ఎవరు నీ కొడుకు? ఈ సంసారం చాల విచిత్రమైనది. నువ్వెవరివి? ఎక్కణ్ణుంచి వచ్చావు? తమ్ముడూ, ఆ విషయం గుఱించి‌ ఇప్పుడు ఆలోచించు. (8వ శ్లోకం మోహముద్గరం‌ లేదా  భజగోవిందం‌ శ్లోకాలు) కవి‌ ఖలీల్ జిబ్రాన్  "your children are not your chidren" అని అనడానికి వందలయేళ్ల క్రితమే శంకరులు ఈ మాటలు అన్నారు. "నీ ధనం, నీ పరివారం, నీ యవ్వనం వీటితో గర్వించకు. అవి నిమిషంలో నశిస్తాయి. అవి మాయ. అది తెలుసుకుని బ్రహ్మ‌ పథంలోకి ప్రవేశించు.‌ (11వ శ్లోకం భజగోవింద‌ం‌ శ్లోకాలు) ఇలా అంటూ శంకరులు మనల్ని కదిలిస్తారు.

గర్భంలోని శిశువు
----------------------
"ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృ కుక్షౌ స్థితం మాం
విణ్మూత్ర మేధ్య మధ్యేక్కథ యతి‌ నితరాం జాఠరో జాతవేదాః
యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం" (శివాపరాథ క్షమాపణ స్తోత్రం.‌‌ శ్లోకం 1)  

అంటే మొదట్లో కర్మ అవసరంవల్ల (లేదా కర్మ విస్తరణ కారణంగా) కలుషితమై‌న తల్లి కడుపులో ఉండేవాణ్ణి నేను. మల మూత్రాలు, కడుపులోని వేడి, ఇతరమైనవి ఏవైతే ఉన్నయో వాటివల్ల కలిగిన దుఃఖం, వ్యథల్ని ఇతరులు చెప్పడం ఎలా సాధ్యమౌతుంది? అని అర్థం. "గర్భంలోని శిశువు దుఃఖాన్ని, వ్యథను ఎవరు‌ చెప్పగలరు?"‌ ఈ భావన చేసిన‌‌ తొలి కవి, తాత్త్వికులు ఆది‌శంకరాచార్యులే. లావొచు, రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్‌పిఅర్, హాఫిజ్ వంటి కవులెవ్వరూ ఇలాంటి‌ లేదా ఈ‌ స్థాయి చింతన,‌ భావన చెయ్యలేదు. ఇలాంటి‌‌‌ రచన‌‌‌, చింతన ఇది ఒక్కటే!

భవ్యమైన భావుకత
------------------------

"దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనతారిణి తరలతరంగే" (గంగా స్తోత్రం - శ్లోకం 1) ఆది‌శంకరులు తన గంగా స్తోత్రంలో గంగా‌‌ నదిని "తరల‌తరంగే‌" ‌అన్నారు. "తరలం" అంటే కదిలేది, ప్రకాశించేది,‌ అనురాగం ఉన్నది, హారం మధ్యలో ఉండే ప్రధాన రత్నం, వజ్రం అని అర్థాలు. ఒక్క మాటతో గంగా నది గుఱించి చెప్పేశారు. ఇలా ఒక్క మాటతో వస్తువుపై సరైన అవగాహన కలిగించడం ఒక మహాకవి లక్షణం. ఆ గంగా‌ నదిని 'వసుధాహారం' అంటే భూమికి‌ హారం అన్నారు. ఇది శంకరుల భవ్య‌మైన భావుకత.

కాళిదాసు కన్నా ముందే
--------------------------------

కాళిదాసు రాసిన  'శ్యామలాదండకం' కన్నా ముందే శంకరులు స్తోత్రాలు రాశారు. (స్తోత్రాలు గేయ సాహిత్యానికి సంబంధించినవి) ఆదిశంకరాచార్య సామాన్య శకానికి పూర్వం 509-477 కాలం వారు  అన్న వాస్తవం ఆధారంగా ఈ విషయాన్ని మనం గ్రహించవచ్చు. ఆదిశంకారాచార్య వేర్వేఱు దేవతలపై 64 స్తోత్రాలూ, 37 ప్రకరణ గ్రంథాలూ రాసి మనకందించారు. 

సౌందర్యలహరి
--------------------

సౌందర్యలహరి, శివానంద లహరి రచనలలో శంకరులు అద్భుతమైన కవనాన్ని అందించారు. సౌందర్యలహరి శిఖరిణి వృత్తాలలో ఉన్న 100 శ్లోకాల రచన. “భక్తీ, కవిత్వమూ పరాకాష్ఠకు చేరి సౌందర్యలహరి అయింది”  అని కంచి పరమాచార్య చంద్రశేఖర సరస్వతి అన్నారు. సౌందర్యలహరిలో భావుకత, వర్ణన, భాష, పదచిత్రాలు, ఉత్ప్రేక్షలు చాల గొప్పవి. “నీ ముఖకాంతి” అనడమూ, చీకట్లను పగవాళ్లతో పోల్చడమూ, పార్వతి కంఠంపై పడిన ముడతలను “షడ్జమ, మధ్యమ, గాంధార గ్రామాల (‘గ్రామం’ అంటే సంగీత స్వరాల సమూహం) కోసం ఏర్పఱిచిన సరిహద్దుల్లా ఉన్నాయి” అనడమూ, పార్వతి స్తన్యాన్ని “ఆమె హృదయపు పాల సముద్రం” అనడమూ, మళ్లీ అదే “సారస్వతంలా ప్రవహిస్తోంది” అనడమూ శంకరులు మహాకవి అన్న సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. సౌందర్యలహరిలో శంకరులు ఇచ్చిన ఉత్ప్రేక్షలు ప్రపంచంలో ఏ కవికీ సాధ్యపడనివి. 

శివానందలహరి
--------------------

శివానందలహరి 100 శ్లోకాల రచన. ‘పరమేశ్వరుడిని కౌగిలించుకుని ఆనందాన్ని పొందాలి’ అని అనుకోవడమూ, నా మనసు తప్ప నీకు ఏమీ ఇవ్వలేను’ అని అనడమూ, బుద్ధిని యంత్రంతో పోల్చడమూ మహాకవిగా శంకరులు శివానందలహరిలో చేశారు. “కారు మబ్బుపై తోచే మెరుపు తీగలా విష్ణువు గుండెపై లక్ష్మి ప్రకాశిస్తోంది” అని అనడంలోనూ, “పెద్ద కలువ పువ్వు పైన ఆడ తుమ్మెదలా విష్ణువు మోముపైన అటూ, ఇటూ ప్రసరిస్తున్న లక్ష్మి కృపా కటాక్షం” అని అనడంలోనూ, (ఈ శైలి అన్నమయ్య లో కనిపిస్తుంది) “లక్ష్మి అనే మేఘం చాతకపక్షి లాంటి పేదవాడినైన నాపై ధన వర్షం కురిపించాలి” అని అనడంలోనూ మహాకవి శంకరులు కనిపిస్తున్నారు. చాతకపక్షి ఆత్మాభిమానం కలది. వాన చినుకులను మాత్రమే తాగి బతుకుతుంది. మరే నీరూ తాగదు. వర్షాకాలం దాటితే దానికి ఆహారం ఉండదు. పేదవాడు కొన్ని రోజులు తిండి తినకుండా గడుపుతాడు కదా. ఇలా ఉపమిస్తూ పేదవాడిని తొలిసారి కావ్యస్థం చేశారు శంకరులు. 

ద్రావిడ శిశు
----------------

ఆదిశంకరాచార్యులు తమ సౌందర్యలహరి 75వ శ్లోకంలో తనను తాను "ద్రావిడ శిశు" అని‌ ప్రకటించుకున్నారు. ఆ శ్లోకం:

"తవ స్తన్యం మన్యే తుహినగిరి కన్యే హృదయతః
పయఃపారావారః పరివహతి సారస్వత మివ  దయావత్యా దత్తం ద్రవిడశిశు‌రాస్వాద్య తవ యత్  కవీనాం ప్రౌఢానా నుజని‌ కమనీయః కవయితా"

శంకరులు సామాజిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు అంటే వారు ఆర్యులు అయుండాలి కదా? పైగా సంస్కృతంలో రాశారు. సంస్కృతం ద్రావిడుల భాష కాదని కదా మనం‌‌ చదువుకున్నది. ఇక్కడ ఆర్యులైన శంకరులు  సంస్కృతంలో తనను తాను ద్రావిడశిశు‌‌ అని ప్రకటించుకుంటున్నారు! అదేంటి?‌  నిజమేమిటంటే,  "శంకురుల కాలానికి మన దేశంలో ఆర్య‌ ద్రావిడులు అన్నది లేదు". నిజానికి ఆర్య అన్న జాతి ఎప్పుడూ లేదు. ద్రావిడ అంటే దక్షిణభూభాగానికి సంబంధించిన అని అర్థం. ద్రావిడ అన్నది ప్రదేశాన్ని సూచించేది. ఆర్య అన్నది జాతిని సూచించేది కాదు. అర్య అన్నది గొప్పవాళ్లను సంబోధించే పదం అయ్యా , మహాశయా అన్నట్టుగా. శంకరుల ఈ శ్లోకం వల్ల ఆర్య ద్రావిడ జాతులు అన్నవి నిజం కాని అభూత కల్పనలు అని‌ తెలియవస్తున్నది.‌ ("Aryan invasion is an abandoned theory" అనీ, "the existence of any such (aryan) race had been generally rejected" అనీ అంతర్జాతీయ అధ్యయనంగా Oxford Reference Dictionary కొన్నేళ్ల క్రితం తేల్చి చెప్పింది) ఈ శ్లోకానికి‌ అర్థం: హిమగిరి పుత్రికా (పార్వతీ), నీ స్తన్యం హృదయం నుంచి పుట్టినదైన పాల కడలి. సారస్వతం (సరస్వతికి‌ సంబంధించినది) దాని నుంచే ప్రవహిస్తోందని తలుస్తున్నాను (అనుకుంటున్నాను).‌ఆ స్తన్యాన్ని ఈ ద్రవిడ శిశువు తాగి ప్రౌఢ కవులలో కమనీయమైన కవిగా పుట్టాడేమో? అద్భుతమైన భావుకతనూ, రచనా‌ సంవిధానాన్నీ‌ చూపారు ఇక్కడ శంకరులు‌. ఇవాళ ప్రపంచంలో గొప్ప కవిత్వాన్నిచ్చిన కవులుగా ఎక్కువగా చదవబడుతున్న లావొచు, రూమీ, ఖలీల్ జిబ్రాన్, షేక్స్‌పిఅర్ రచనా సంవిధానం శంకరుల రచనా సంవిధానం పరిధిలో ఉండడం తెలియవస్తోంది. వీళ్లే కాదు, రవీంద్రనాథ్ టాగోర్, శ్రీశ్రీ , అన్నమయ్య, వేమన వంటి కవులు కూడా శంకరుల కవితా రచనా‌‌ పరిధిలోని వాళ్లే!

వివేకచూడామణి
----------------------

వివేక చూడామణి... ఆది‌శంకరాచార్య కృతులలో ఈ వివేకచూడామణి అత్యున్నతమైనది. ఈ విషయకంగా దీనికి సరిపోలగల రచన విశ్వంలో మఱొకటి లేదు. ప్రస్థానత్రయం తరువాత మన భూమిలో పుట్టిన మహోన్నతమైన రచన ఇది. ఆ‌‌ వివేక చూడామణి (శ్లోకం‌ 63)లో ‌"అజ్ఞాన సర్ప‌దష్టుడైన (శ్రీశ్రీ‌ బాధాసర్ప దష్టులారా,‌ అనడానికి శంకరుల‌‌ ఈ ప్రయోగమే మూలం) వాడికి బ్రహ్మజ్ఞాన ఔషధం తప్పితే వేదాల వల్ల ఏం ప్రయోజనం?, శాస్త్రాలవల్ల ఏం ప్రయోజనం?, మందుల వల్ల ఏం ప్రయోజనం?‌‌ అనీ, (శ్లోకం‌ 64లో) "మందుల పేర్లవల్ల కాదు వాటిని‌ సేవిస్తే తప్ప వ్యాధి పోదు‌‌. స్వానుభవం‌ (అపరోక్షానుభవం) తప్పితే బ్రహ్మం, పేరు (శబ్దం) వల్ల నివృత్తి కాదు" అనీ తెలియజెప్పప్పడం వారి ప్రత్యేకతనూ,‌ ఔన్నత్యాన్నీ , దార్శనికతనూ తెలియజేస్తోంది.  “శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణ కారణం” అన్న తొలికవి, వైతాళికులూ ఆదిశంకరాచార్య. “మాటలు శ్మశానాల వంటి నిఘంటువుల దాటి” అని శ్రీశ్రీ అనడానికి వందలయేళ్లకు పూర్వమే శంకరాచార్య ఈ మాటలు అన్నారు. “వ్యాకరణం రక్షించదు, రక్షించదు” అని శంకరులు అన్నాకే  శ్రీశ్రీ “వ్యాకరణాల సంకెళ్లు విడిచి” అని అన్నారు. “మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది” అని అనడానికి “భజగోవిందం భజ గోవిందం, గోవిందం భజ” అని శంకరులు అన్నదే తనకు స్ఫూర్తి అని శ్రీశ్రీ చెప్పారు. ఒక తత్త్వవేత్త, వేదవేత్త, భాష్యకారులు, సంస్కర్త, దార్శనికులు, మార్గదర్శి  అయిన ఆదిశంకరాచార్య “ఒక మహోన్నతమైన కవి” అన్నది నిజం. పద(దు)ను, సూటితనం, సాహసం, చొచ్చుకునిపోయే గుణం ఉన్న కవి ఆదిశంకరాచార్య.

పద పురోగతి
-----------------

ఆదిశంకరాచార్య రాసిన స్తోత్రాలలోనూ, అష్టకాలలోనూ, ప్రకరణాలలోనూ, భాష్యాలలోనూ, మహోన్నతమైన కవిత్వం మెరుస్తూంటుంది. ఉపమ, ఉత్ప్రేక్ష, శబ్దాలంకారాలను వారు అద్భుతంగా ప్రయోగించారు. వారి వాక్య నిర్మాణంలోని లయ, ఛందస్సుల బిగి, వాక్యాంతాలలోని ధ్వని, అద్భుతమైనవి. శంకరుల రచనలలో ‘పద పురోగతి’ (word-progression) ప్రతేకంగానూ, ఉన్నతంగానూ ఉంటుంది. ‘సువక్షోజ కుంభాం, సుధాపూర్ణ కుంభాం, ప్రసాదావలంబాం, ప్రపుణ్యావలంబాం’. ఇది య’ గణాల భుజంగప్రయాత వృత్తం. ఇక్కడ 2 య’ గణాలను కలిపి శంకరులు  “సువక్షోజ కుంభాం , సుధా పూర్ణకుంభాం” అంటూ పాదాన్ని నడిపారు. 3వ య’ గణానికి శబ్దమైత్రిని పాటించి సౌందర్యాన్ని సాధించారు. బాషపై, చందస్సుపై , శయ్యపై , భావంపై పట్టు ఉన్న ఓ మహాకవి వారు.

తొలి సామాజిక కవి 
-------------------------

“ఏ మనిషీ తనకు తానే చెరసాలను నిర్మించుకోడు ఆపై అందులోకి వెళ్ళడు” అనీ, “ఇసుకలో బావి తవ్వడం లాగా” అనీ శంకరులు అనడం ఖలీల్ జిబ్రాన్ కవిని గుర్తుకు తెస్తోంది. జిబ్రాన్ కన్నా శంకరులు ఎంతో పూర్వం వారు. “ ఉనికిలో లేని కుండ సూర్యోదయమైనా కనిపించదు” అన్న శంకరుల మాటలు లావొచు కవిని తలపిస్తున్నాయి. గ్రామంలో ఉండే వ్యక్తి గ్రామంలోకి రావాలని తపించడు అడవిలో ఉన్న వ్యక్తి ఎప్పుడెప్పుడు గ్రామంలోకి వద్దామా అని తపించినట్టుగా” అనీ, “సముద్రపు కెరటం అంటాం కానీ కెరటపు సముద్రం అనం” అనీ శంకరుల అన్నప్పుడు రూమీ వంటి కొందరు సూఫీ కవులు తలపుకు వస్తారు. ఆ సూఫీ కవుల కన్నా శంకరులు చాల ముందటివారు. ఈ శంకరుల మాటలలోని ఇతివృత్తం మనిషే, చింతన సామాజికమే. భారతదేశపు తొలి సామాజిక కవి శంకరులే. 

మూర్ఖుడా, సోదరా
-----------------------

“నీ కుశలం అడిగేది నీకు ఊపిరి ఉన్నంత వరకే ఆ తరువాత నీ శవాన్ని చూసి నీ భార్య కూడా భయపడుతుంది” అని శంకరులు చెప్పిన సత్యం వేమనతో పాటు భారతదేశపు ఇతర కవులను కూడా కదిలించింది. 'మూర్ఖుడా', 'సోదరా', వంటి సంబోధనలతో శంకరులు కవితను చెప్పారు. బహుశా ఇలా చెప్పడానికి శంకరులే ఆద్యులేమో?

“జ్ఞానం స్వేచ్ఛకు అధారం” అనీ, వెలిగిన దీపానికి తన వెలుగును చూపించడానికి మరో దీపం అవసరం లేనట్టుగా” అనీ, నీళ్లలో నీళ్లులాగా, కాంతిలో కాంతిలాగా” అనీ అన్న శంకరుల మాటలు ఖలీల్ జిబ్రాన్, లావొచు భావాలుగానూ వినిపిస్తాయి.

“అద్దంలో నగరం ప్రతిబింబించినట్లుగా” అనీ, “అద్దంలో అంతఃపురం లాగా” అనీ శంకరులు అన్నప్పుడు “కొండ అద్దమందు కొంచమై ఉండదా?” అన్న వేమన గుర్తుకొస్తారు. తగిన కారణాలు చూపిస్తూ “అందువల్ల గురువైన శ్ర్రీ దక్షిణామూర్తికి నా నమస్కారం” అన్న వాక్యం పునరావృతం అయ్యే దక్షిణామూర్తి స్తోత్రం లోని శంకరల శైలి  ఈనాటి వఱకూ చాలా మంది కవుల కవితలకు మార్గదర్శకం అయింది. 

సహజ కవి
--------------

“ఈ ప్రపంచపు ఎండమావిలోని నీటి కోసం నాకున్న దాహాన్ని నిరోధించు” అని శంకరులు అన్నది చదివాక రవీంద్రనాథ్ టాగోర్ మీద ఆ మాటల ప్రభావం ఉందని తెలిసిపోతుంది. ఒక తల్లి ఎంత గొప్పదో చెబుతూ ‘చెడ్దకొడుకు పుడతాడు కానీ తల్లి చెడ్డదవడం ఉండదు” అన్నారు శంకరులు. ప్రపంచపు సాహిత్యంలో మరెక్కడా ఈ మాటలకు సమానమైవి ఉండవేమో?  “వందల రంధ్రాలున్న మట్టి కుండలో దీపాన్ని ఉంచితే ఆ దీపపు కాంతి లోపలా, బయటా ప్రసరిస్తూంటుంది” అని శంకరులన్నారు. ఈ మాటలన్నందుకు లావొచు, ఖలీల్ జిబ్రాన్, హాఫిజ్, ఉమర్ ఖయ్యామ్, షేక్స్‌పిఅర్, విలిఅమ్ బ్లేక్ వంటి కవులూ, సూఫీ కవులందఱూ “శంకరులు తమ ఆచార్యులు” అని అనకుండా ఉండలేరేమో? మనకు బాగా తెలిసిన సామెత లాంటి “పునరపి జననం, పునరపి మరణం” శంకరులదే. “నీడలా అనుసరించడం” అనడం, “మబ్బు తొలిగిన సూర్యుడిలా” అనడం, “పాలలో వెన్నలా” అనడం, “మహా స్వప్నం” అనడం శంకరులనుంచి వచ్చినవే. “ఆకలి దాహాలతో ఉన్నప్పుడు బిడ్డ తల్లినే తలుచుకుంటుంది” అనీ, “దుఃఖం చేత అనురాగం అనే తాడు ఖండించబడుతుంది” అనీ అన్న సహజ కవి శంకరులు. 

తత్త్వకవి
------------

“నువ్వు ఎవరివి?”, “ఎవరు నీకు సొంతం?’, “నువ్వు ఏ ప్రదేశం నుంచి వచ్చావు?” వంటి శంకరుల ప్రశ్నలు చాల భారతీయ రచనలలో కనిపిస్తాయి. భారతదేశపు తొలి తత్త్వకవి శంకరులే. భారతదేశపు గొప్ప కవులపై శంకరుల ప్రభావం కనిపిస్తూనే ఉంది. 

విప్లవకవి
------------

“వాక్చాతుర్యం, పద ప్రవాహం, శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం, పాండిత్యం, ఇవన్నీ భుక్తి కోసమే” అనీ, “శాస్త్రాన్ని వదిలెయ్” అనీ, కులం, గోత్రం, రూపం, వీటిపై అభిమానాన్ని  వదిలెయ్” అనీ అన్న ప్రపంచపు తొలి విప్లవకవి శంకరులే.

విశ్వమహాకవి
-----------------

“రాళ్లు, చెట్లు, గడ్డి, ధాన్యం, పొట్టు ఇవన్నీ అగ్నివల్ల కాలిపోతే అవి వాటికి మూలమైన మట్టిగా అయిపోతాయి” అని అన్న మట్టిపై మక్కువ ఉన్న కవి శంకరులు. “చెట్టు నుంచి రాలిన ఆకు కాలువలోనో, నదిలోనో, శివక్షేత్రంలోనో, వాకిట్లోనో, పడితే ఆ చెట్టుకు శుభా శుభాలు వర్తిస్తాయా?” అని అడగడం శంకరులకే చెల్లింది. దేశ, కాలాలకు అతీతమైన భావాలతో, భావనలతో, రచనా సంవిధానంతో ఎప్పటికీ నిలిచి ఉండే విశ్వమహాకవి ఆదిశంకరాచార్య.  

ప్రశ్నోత్తర రత్నమాలిక
-----------------------------

ప్రశ్నోత్తర రత్నమాలికలో అడగబడ్డ కొన్ని ప్రశ్నలకు శంకరులు ఇచ్చిన‌ జవాబులు మనకు దిశా నిర్దేశం చేస్తాయి; ఆలకించండి ... 

ఏది అన్నిటికన్నా  ప్రయోజనకరమైనది?
జవాబు: ధర్మం 
ఏది వాంఛింపదగినది?
జవాబు: స్వ , పర హితం
శత్రువు ఎవరు? 
జవాబు: సోమరితనం
ఏది దుఃఖం?
 జవాబు: ఉత్సాహం‌ లేకపోవడం
ఏది‌ జాడ్యం?
జవాబు:‌ నేర్చుకున్నది ఆచరించకపోవడం
ఏది వెలలేనిది? 
జవాబు: అవసరం వచ్చినప్పుడు ఇవ్వబడేది
ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది? 
జవాబు: సత్యం, ఓర్పు ఉన్న వ్యక్తి చేత
ఏది దానం? 
జవాబు: అకాంక్ష లేనిది
ఎవరు స్నేహితులు? 
జవాబు: పాపాన్ని నివారించే వాళ్లు‌
ఏది పాతకం? 
జవాబు:‌ హింస
ఎవరు ఎదుగుతారు?
జవాబు: వినయం ఉన్నవాళ్లు
ఎవరు ప్రత్యక్ష దేవత? 
జవాబు: అమ్మ
వేటిని మనుషులు సంపాదించాలి? 
జవాబు: విద్య, ధనం, బలం, కీర్తి , పుణ్యం
వేటిని కాపాడుకోవాలి? 
జవాబు:‌ కీర్తి , పతివ్రత, బుద్ధి 
ఎవరు శూరులు? 
జవాబు: భయంతో ఉన్నవాళ్లను రక్షించేవాళ్లు

సర్వజ్ఞ
---------

ఆదిశంకరాచార్య ఒక సర్వజ్ఞ. "మీకు చెప్పులు కుట్టడం వచ్చా"  అని అడిగినప్పుడు శంకరులు చెప్పును రెండు పాదాల మధ్యలో పెట్టకుని సూదిని‌ ముక్కు‌ పక్కభాగంలో రుద్దుకుని చెప్పు కుట్టారట‌. ఇలా సూదిని ముక్కు పక్కన రుద్దడం‌ వృత్తిగా చెప్పులు కుట్టే వాళ్లు చేస్తారు. శంకరులు మడికట్టుకుని కూర్చోలేదు. వీధిలోకి‌ వచ్చి ఉద్యమించారు. వారిని చంపాలని ప్రయత్నాలూ జరిగాయి. అయినా‌ భయపడకుండా సత్యం కోసం‌ పయనించారు; పని చేశారు; విజయం సాధించారు.

తప్పులు
-----------

శంకరుల విషయంలో కొన్ని విషయాలు తప్పిపోయాయి, కొన్ని తప్పులు నెలకొన్నాయి. ముఖ్యంగా వారి కాలం. వారి కాలం సామాన్య శకం 8వ శతాబ్ది అనడం సరికాదు. సామాన్య శకం 2000 తరువాతి పరిశీలనలు వారి జననం సామాన్య శకానికి పూర్వం 509వ సంవత్సరం అని తెలియజేస్తున్నాయి. 1920వ దశాబ్దిలోనే అంతర్జాతీయ పరిశీలనలు శంకరుల జననం సామాన్య శకానికి పూర్వం 509వ సంవత్సరం అని తెలియజెబుతున్నాయి. ఆదిశంకరులు ప్రచ్ఛన్న బౌద్ధులు అనీ, వారు బౌద్ధాన్ని తిరస్కరించారు అనీ మనం వింటూంటాం. ఈ రెండూ సరైనవి కావు. వారి రచనల్లో ఎక్కడా బౌద్ధం, బుద్ధుడి ప్రస్తావన లేదు.  

చండాలుడి ఉదంతం
-----------------------------

శంకరులను తప్పు పట్టేవాళ్లు చండాలుడి ఉదంతాన్ని తీసుకుంటారు.  ఆ ఉందంతాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ చండాలుడుగా వచ్చింది పరమ శివుడు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. రెండవది, అతి ముఖ్యమైంది... శంకరులు ఆ సందర్భంలో చండాలుడితో ఓడిపోయి (శంకరులు ఓడిపోయిన సందర్భం ఇదొక్కటే) అతడి పాదాలు పట్టుకుని తన తప్పు తెలుసుకున్నారు. ఆదిశంకరుల ఔన్నత్యం అది. సనాతనత్వం నేర్పే సంస్కారం తప్పు తెలుసుకోవడం; దిద్దుకోవడం. ఇవాళ కుసంస్కారం, అసంస్కారం, కుజ్ఞానం, అజ్ఞానం వ్యక్తులు అలా శంకరులలా విద్య, విజ్ఞతలతో  తమ తమ తప్పుల్ని ఒప్పుకుని దిద్దుకుంటారా? తప్పుల్ని దిద్దుకునే సంస్కారానికీ శంకరులే ఆదర్శం. ఆదిశంకరులను సరిగ్గా చదివి వారిని సమగ్రంగా అర్థం చేసుకోవాలి. 

వెఱపు లేని వెల్లువ 
-------------------------

ఆది శంకరులు అద్భుతాల్నీ చేశారు, ఆకలీ తీర్చారు, కవిత్వాన్నీ చెప్పారు, దైవాన్నీ స్తుతించారు, చెప్పులూ కుట్టారు. వైదికత్వం కోసం దుష్టుల దాడులకూ గురయ్యారు; ప్రాణాల మీదకూ తెచ్చుకున్నారు. శంకరులు వెఱపు లేని వెల్లువ అయి సాగారు. ఇవాళా దుష్టుల, ఉగ్రవాదుల, ఉన్మాదుల వల్ల సనాతనత్వంపై, సనాతనులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఆదిశంకరులను ఆదర్శంగా చేసుకుని మనమూ ఆ దాడులకు వెఱవకుండా మునుముందుకు సాగుతూండాలి. 'ఆదిశంకరులు మన మట్టి శక్తి; ఆది శంకరులు మన దేశ యుక్తి'. శంకరత్వాన్ని, శంకర తత్త్వాన్ని మనం మనకు ప్రయుక్తం చేసుకోవాలి.

ప్రణామం
------------

'ఆదిశంకరాచార్యుల వారికి సాటిరాగల మానవ మూర్తమత్వం ఈ విశ్వంలో మఱొకటి లేనేలేదు'. ఆ మహాశక్తికి,‌ ఆ మేధాభివ్యక్తికి; ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి, ఆ తాత్త్విక కాంతికి; ఆ‌ విశ్వమహాకవికి, ఆ భవ్య సాహిత్యానికి; ఆ విశేషనైజానికి, ఆ విశిష్ట వైప్లవ్యానికి; ఆ ధర్మజ్ఞతకు, ఆ దార్శనికతకు ఈ మట్టి మనుషులంగా మనసా, వాచా ప్రణామం చేద్దాం. 

'సత్'లోకి 
-------------

మన ఇళ్లల్లో, మన కార్యాలయాల్లో, మన ఉద్యానవనాల్లో, మన వ్యాపార స్థలాల్లో ఉండాల్సినవి బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు, చిత్రాలు, శిల్పాలు కాదు. మన ఇళ్లల్లో, మన కార్యాలయాల్లో, మన ఉద్యానవనాల్లో, మన వ్యాపార స్థలాల్లో తప్పకుండా ఉండాల్సినవి ఆదిశంకరాచార్యుల వారి ప్రతిమలు, చిత్రాలు, శిల్పాలు. మనం పంచుకోవాల్సింది బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు కాదు, ఆదిశంకరాచార్య ప్రతిమలు. మన చుట్టూనూ, మనలోనూ ఉండాల్సినవి అప్రయోజకత్వానికి, అపజయానికి, అమంగళానికి చిహ్నం అయిన బుద్ధుడి బొమ్మలు, చిత్రాలు కావు, తప్పుడుతనానికి, అనర్థానికి, అవైదికానికి చిహ్నమైన సాయిబాబా చిత్రాలు, శిల్పాలు కావు. మనకు కావాల్సినవి, మనలో నెలకొని ఉండాల్సినవి ఆదిశంకరాచార్య ప్రతిమలు, చిత్రాలు, శిల్పాలు. మనం మన చుట్టూనూ, మనలోనూ ఆదిశంకరాచార్య ప్రతిమల్ని, బోధల్ని, ఆచరణల్ని, నైజాన్ని ప్రతిష్ఠించుకుందాం. మనం 'అసత్' నుంచి విముక్తమౌదాం; ఆదిశంకరరాచార్య స్పూర్తి కాగా, ఆదిశంకరరాచార్య ప్రేరణ కాగా మనం 'సత్'లోకి వెళదాం.

ఆదర్శం
-----------

ఈ భారత(ప్ర)దేశంలో నడయాడిన న భూతో న భవిష్యతి మానవ అత్యద్భుతం ఆదిశంకరాచార్య.  వారిని స్మరించుకుంటూండడం ఈ మట్టి మనుషులు మనుషులుగా బ్రతుకుతూండడం అవుతుంది. ఆదిశంకరుల పనితీరు, దూసుకుపోయే నైజం, క్రియాశీలకత్వం, ఫలితాల్ని సాధించగలిగే నేర్పు, ఉద్యమస్ఫూర్తి, నిర్మాణాత్మకత, తెలివిడి, ప్రజ్ఞ, మేధ, రచనా పటిమ, దార్శనికత మనకు ఆచరణాత్మక ఆదర్శం కావాలి.  


శంకరుల గురుత్వం
------------------------

మన భారతదేశంలో ఆదిశంకరాచార్యుల అవతరణం ఒక చారిత్రిక, సామాజిక, సైద్ధాంతిక, వైదిక, తాత్త్విక, సాత్విక అవసరం. వారు అవతరించి సనాతనత్వానికి ప్రవాహాన్నిచ్చారు. ఆ ప్రవాహం మనందరికీ ఇప్పటికీ, ఎప్పటికీ ఎంతో ప్రయోజనకరం. మనదేశానికి సంబంధించినంత వఱకూ వారే గురువు. ఆది శంకరుల గురుత్వంలో మనదేశ గమనం మునుముందుకు సాగుతూండాలి.

"శంకరత్వం ఒక‌ సుజ్ఞాన సత్వం;
సదా అనుగమించాల్సిన తత్త్వం"

"ఆదిశంకరాచార్య భారతీయతా పతాక
అదిశంకరాచార్య ఒక సనాతన ప్రతీక"

Wednesday, February 19, 2025

ఛత్రపతి శివాజీ జయంతి 2025 Chhatrapathi Shivaji Maharaj Jayanthi


అందరికీ 'ఛత్రపతి శివాజీ జయంతి' శుభాకాంక్షలు 💐 TELUGU VOICE

స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత, ఛ‌త్ర‌ప‌తి శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన శివాజీ రాజే భోంస్లే, 1630 ఫిబ్ర‌వ‌రి 19న షాహాజీ, జిజాబాయి పుణ్య దంప‌తుల‌కు జ‌న్మించాడు. శివాజీ తండ్రి, వ్య‌వ‌సాయ బోస్లే కులానికి చెందిన వారు. అత‌ను నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. త‌ల్లి జిజాబాయి యాద‌వ క్ష‌త్రియ వంశ‌పు ఆడ ప‌డుచు. శివాజీకి ముందు పుట్టిన వారంద‌రూ మృతి చెందారు. దాంతో జిజాబాయి, తాను పూజించే పార్వ‌తీ దేవి మరోపేరైన శివై పేరును క‌లిపి శివాజీకి పెట్టింది. ఆమె సంర‌క్ష‌ణ‌లో పెరిగిన శివాజీ, రామాయ‌ణ‌ మ‌హాభార‌తాల‌ విశిష్ట‌తనూ, హిందూమ‌తం యొక్క గొప్ప‌త‌నాన్నీ తెలుసుకున్నాడు. ప‌ర‌మ‌త స‌హ‌నం, స్త్రీలను గౌర‌వించ‌డం, శివాజీకున్న గోప్ప ల‌క్ష‌ణం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/it7JY1jp20A ]


దాదాజీ ఖాండ్ దేవ్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్న శివాజీ, వీరుడిగా యుద్ద రంగంలో అడుగుపెట్టాడు. తండ్రి ప‌రాజ‌యాల‌కు గ‌ల కార‌ణాల‌ను క్షుణ్ణంగా తెలుసుకుని, యుద్దతంత్రంలో నిష్ణాతుడ‌య్యాడు. స‌క‌ల విద్యా పారంగ‌తుడైన శివాజీ, మ‌రాఠా సామ్రాజ్య స్థాప‌నకు న‌డుం బిగించాడు. భవానిదేవి భక్తుడు అయిన‌ప్ప‌టికీ, తన సామ్రాజ్యంలో ఉన్న‌ అన్ని మతాల వారినీ సమానంగా చూసేవాడు శివాజీ. త‌న రాజ్యంలో కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా, ఎన్నో మసీదులను కట్టించిన ఘ‌న‌త శివాజీకే సొంతం. ఆయ‌న‌ సైన్యంలో మూడొంతుల మంది ముస్లిములు ఉన్నారు. ఎందరో ముస్లిములకు, ఉన్నత పదవులు క‌ట్ట‌బెట్టారు శివాజీ. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికీ, ఇబ్రహీం ఖాన్ నావికాదళానికీ, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ అనే ఇద్దరూ కూడా ముస్లింలే. శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, ఆగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తీ, మదానీ మెహ్తర్‌ కూడా ముస్లిమే. త‌న రాజ్యంలోని, ఎంతో ముఖ్య‌మైన ప‌ద‌వుల‌ను సైతం, ప‌ర‌ మ‌తాల వారికి అప్ప‌గించిన ఘ‌న‌త, శివాజీకే దక్కుతుంది.

ఛ‌త్ర‌ప‌తి శివాజీ, యుద్ద తంత్రాల‌లోనే కాదు, ప‌రిపాల‌నా విధానాలు రూపోందించ‌డంలో కూడా నిష్ణాతుడు. ప్రజలకోసమే ప్రభువు, అన్న సూత్రాన్ని అనుస‌రించి, వ్యక్తిగత విలాసాలను ప‌క్క‌న‌పెట్టి, ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డ మ‌హా వ్య‌క్తి. శివాజీ లౌకిక పాలకుడు. అన్ని మతాల వారికీ  అనుకూలంగా ఉంటూ, అన్ని మతాల ప్రజలనూ ఆద‌రించేవాడు. మ‌రాఠా సామ్రాజ్య స్థాప‌న‌ కోసం, ఎంతో  మంది ముస్లింలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసినప్పటికీ, ఆయన పాలనలో ఉన్న‌ ముస్లింలను, తగిన విధంగా స‌త్క‌రించేవాడు. అనేక మసీద్ లు నిర్మించిన ఏకైన హిందూ రాజు కూడా ఛ‌త్ర‌ప‌తి శివాజీనే. నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావంతో ఉండ‌డం, మచ్చలేని ఆయ‌న వ్యక్తిత్వమే, అనుచరులకూ, ప్రజలకూ, ఆదర్శంగా నిలిచాయి. మ‌న భారతదేశాన్ని ఎందరో రాజులు పాలించిన‌ప్ప‌టికీ, శివాజీలో ఉన్న ఈ లక్షణాలే అత‌న్ని చ‌రిత్ర లో చిరస్మరణీయుడిగా చేసాయి. ఛ‌త్ర‌ప‌తి శివాజీ, ఎన్నో విరోచిత‌మైన యుద్దాలుచేసి విజ‌యాన్ని సాధించి, మ‌రాఠా రాజ్యాన్ని విస్త‌రించాడు.

17 ఏళ్ళ వయసులో, మొట్టమొదటి యుద్ధం చేసిన శివాజీ, బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన, తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. త‌రువాత మూడేళ్ళలోనే, కొండన, రాజ్‌ఘడ్ కోటలను కూడా సొంతం చేసుకొని, పూణే ప్రాంతాన్నంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. తమ కోటలను సొంతం చేసుకున్నాడ‌న్న కోపంతో, ఆదిల్షా సుల్తాన్, శివాజీ తండ్రి షాహాజీని, మోస‌పూరిత కుట్ర‌తో బంధించాడు. అంతేకాదు, శివాజీనీ, బెంగుళూరులో ఉన్న అత‌ని అన్న‌ శంభాజీనీ పట్టుకోవడానికి, రెండు సైన్యాలను పంపాడు ఆదిల్షా. అయితే, అన్నదమ్ములిద్ద‌రూ, ఆ సైన్యాలను ఓడించి, తమ తండ్రిని విడిపించుకున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న‌ ఆదిల్షా, యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను, శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ చేసిన మెరుపుదాడులూ, గెరిల్లా యుద్ధ నీతినీ తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్, అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి, శివాజీని రెచ్చకొట్టే ప్ర‌య‌త్నం చేసాడు. శివాజీకి ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చేశాడు అఫ్జ‌ల్‌.

ఆల‌యాల‌ను కూల్చేశాడ‌న్న‌ విష‌యాన్ని తెలుసుకుని, తాను యుద్ధానికి సిద్దంగా లేననీ, అఫ్జ‌ల్‌ను చర్చలకు ఆహ్వానించాడు శివాజీ. దాంతో, ఇరు వ‌ర్గాల వారూ, ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ మోస బుద్ధి తెలిసిన శివాజీ, ఉక్కు కవచాన్ని ధరించి, పిడిబాకును లోపల దాచుకున్నాడు. ఇద్దరూ తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా, అఫ్జల్ ఖాన్ త‌న వెంట ర‌హ‌స్యంగా తెచ్చుకున్న కత్తితో, శివాజీ పైన దాడి చేసాడు. ఉక్కు కవచం ధ‌రించ‌డం వ‌ల్ల, శివాజీ తప్పించుకున్నాడు. వెంట‌నే లోప‌లికి రావడానికి ప్రయత్నించిన అఫ్జ‌ల్ ఖాన్ సైన్యాధికారులను, శివాజీ సైన్యం అడ్డుకుంది. శివాజీ, తన‌తోపాటు తెచ్చుకున్న పులి గోర్ల‌తో, అఫ్జ‌ల్ ఖాన్ పొట్ట‌ను చీల్చేశాడు. గుడారం నుండి బ‌య‌ట‌కు పారిపోదామ‌ని ప్ర‌య‌త్నించిన అఫ్జ‌ల్ త‌ల‌ను, ఒకే వేటుకు న‌రికేశాడు. ఇక మిగిలిన అఫ్జ‌ల్ సేన‌ను కూడా, శివాజీ సేన మెరుపు దాడులు చేసి, వారిని అంత‌మొందించింది.

అఫ్జ‌ల్ ఖాన్‌ పై విజ‌యంతో, శివాజీ పేరు మ‌రాఠా యోధుడిగా, మహారాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోయింది. దీంతో, ఎలాగైనా శివాజీ పై ప‌గ సాధించాల‌ని వేచి ఉన్నాడు, బీజాపూర్ సుల్తాన్‌. అందుకోసం, యుద్ధ‌వీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పష్తున్ సైనికులను, శివాజీపై యుద్ధానికి పంపాడు. శివాజీ సేన, పష్తున్ ల‌ను కూడా మ‌ట్టిక‌రిపించి, ఈ యుద్ధంలో కూడా విజ‌యం సాధించింది. ఇక‌ ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్ఠలు, భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచాడు శివాజీ మ‌హారాజ్‌. పష్తున్ ల‌పై శివాజీ విజ‌యాన్ని స‌హించ‌లేని బిజాపూర్ సుల్తాన్, అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ ల నుండి, మెరికల్లాంటి 10,000 మంది, కిరాయి సైనికులను తెప్పించాడు. వారిని శివాజీపై యుద్ధానికి పంపించాడు. అప్పుడు శివాజీ, తన వద్దనున్న 5,000 మంది మరాఠా యోధులతో కలసి, కొల్హాపూర్ వద్ద, వారి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ', అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి, శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో, కేవలం సుల్తానులకే కాక, మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ కు సైతం, శివాజీ అంటే భయం పుట్టింది.

శివాజీ నుండి, ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబ్ భావించి, శివాజీని అంత‌మొందించ‌డానికి, సన్నాహాలు మొదలు పెట్టాడు. ఔరంగజేబ్ తన మేన మామ Shaista Khan ను, శివాజీ పై యుద్ధానికి పంపాడు. రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న Shaista Khan, మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి, అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అప్ప‌గించి, కొల్హాపూర్ పంపించాడు. అప్ప‌టికే కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్‌హాలా కోటలో, శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు.  అయితే, సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ, ఎలాగయినా పన్‌హాలా కోట నుండి తప్పించుకొని, త‌న సైన్యం మొత్తం ఉన్న విశాల్‌ఘడ్ కోటకు చేరుకొని, సిద్దితో యుద్ధం చేయడానికి వ్యూహం ర‌చించాడు. కానీ, అప్పటికే పన్‌హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో, తాను యుద్ధానికి సిద్దంగా లేననీ, దయ తలచవలసినదిగా సిద్ది జోహార్‌కు వర్తమానం పంపాడు శివాజీ. అది తెలుసుకొన్న‌ సిద్ది జోహార్ సైనికులు, నిఘా సరళం చేసి, విశ్రాంతి తీసుకున్నారు. ఇక శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని, తన సైన్యం ఉన్న విశాల్ ఘ‌డ్ కోటవైపు పయనించాడు. చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్, తన బలగాలతో శివాజీని వెంబడించాడు.

శివాజీ సేన కోటకు చేరుకొనేలోపు, శత్రువులు తమను సమీపిస్తున్నార‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన‌ బాజీ ప్రభు దేశ్‌పాండే అనే సర్దార్, 300 మంది అనుచరులతో కలసి, తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామనీ, శివాజీని తన అంగరక్షకులతో స‌హా ఎలాగయినా కోట చేరుకోమనీ చెప్పి, ఒప్పించాడు. శివాజీని కోట వైపు పంపిన వెంటనే బాజీ ప్రభు దేశ్‌పాండే, త‌న రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని, శత్రువులతో యుద్ధం చేశాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి, అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. వీరి యుద్ధం ముగిసే స‌రికి, శివాజీ తన కోట చేరుకున్నాడు.

కోటలో తన అనుచరులతో చర్చించిన శివాజీ, అనంతరం, తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించి, సంధికి అంగీకరించాడు. ఈ సంధిలో భాగంగా, శివాజీ సామ్రాజ్యం, స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా, పన్‌హాలా కోటను ఇచ్చాడు శివాజీ. త‌న యుద్ధ‌నీతికీ, రాజ‌నీతికీ గుర్తుగా, జూన్ 6, 1674 న, రాయఘడ్ కోటలో, వేద పఠనాల మధ్య, శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ, 'ఛత్రపతి’ అనే బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు, 50,000 బలగంతో, దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి, వెల్లూరు, గింగీ లను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి, హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి, సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ, మూడు వారాలపాటు తీవ్ర జ్వరంతో బాధపడుతూ, 1680, ఏప్రిల్ 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు, రాయఘడ్ కోటలో స్వర్గస్థులైనారు. శివాజీ త‌ద‌నంత‌రం, ఆయన పెద్దకొడుకయిన శంభాజీ, రాజ్యాధికారాన్ని చేపట్టి, మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని, రాజ్యాన్ని పరిపాలించాడు.

ఈ శంభాజీ మహరాజ్ చరిత్ర ఆధారంగా నిర్మించిన 'చావా' అనే చిత్రాన్ని ఈ వారం విడుదల చేశారు. ప్రతి భారతీయుడూ తప్పనిసరిగా, కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా ఇది.. తెలుసుకో వలసిన చరిత్ర ఇది..

ॐ 🚩 జై భారత్ 🚩 జై హింద్ 🚩 జై భవాని 🚩జై జగదంబా 🙏

Saturday, February 8, 2025

భీష్మ ఏకాదశి 2025 Bhishma Ekadashi


ఈ రోజు 08-02-2025 'భీష్మ ఏకాదశి' విశేషం TELUGU VOICE

మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్శ్మ విషయాలను తెలుసుకుందురు రండి' అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకు వచ్చాడు.

భీష్ముడు సుమారు నెలన్నర నుండి భాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది, అసలే మాఘమాసం ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు, కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపొయ్యాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు.  దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించు కోగలిగేవాడు ఆయన. తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగే వాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆరోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతుంది. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది.ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి "మాతా పితా బ్రాతా నివాసః శరణం సుహ్రుత్ గతిః గమ్యం సర్వం నారాయణః" అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయిజ్యం కలగక మానదు.

మరి అన్ని రోజులు అంపశయ్య పై ఎందుకు ఉండిపోయాడు ?

ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరం పైనే రాసి ఉంటుందట! అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేసాడాయన ? ద్రౌపతికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేక పోయాడు. భగవత్ భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తు కూర్చుండి పోయాడు. ద్రౌపతికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వసిష్ఠులవారు చెప్పారట "మహత్యాపది సంప్రాప్తే స్మత్తవ్యః భగవాన్ హరిః" హే ద్రౌపతి! ఇతరులు ఎవ్వరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన అయిదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేక పోయారు. వారు కౌరవులకి బానిసలై పోయారు. కౌరవులను ఎదురించడానికి వీలులేకుండా పోయ్యింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు, కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాడు. ఆ దోషంతో పాండవులకూ అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకునాడో ఆ ద్రౌపతికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపతికి అవమానం చేసారో వారందరిని అప్పుడే తీసి పాడేసాను, ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప, వారిని నేను ఎప్పుడో ఏరిపారేసాను, నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చేయమని చెబుతున్న అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు.

భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే, ప్రక్కనే ఉన్న ద్రౌపతి నవ్వుతూ 'తాతా! ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమైయ్యాయీ ధర్మాలు' అని అడిగిందట. అందుకు భీష్ముడు 'అవును ద్రౌపతి! నా దేహం దుర్యోదనుడి ఉప్పు తిన్నది, నా ఆధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేసాను కనక, ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాల్లూ అంపశయ్యపై పడి ఉన్నాను' అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ, పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. ' హే ద్రౌపతీ! కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు, కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను, అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును' అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మపితామహుడికి దేహబాదలు కలగకుండా వరం ఇచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు, నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చుకానీ, నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వ ద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా! ఆ నేలలో పండిన మ్రొక్క చెబుతుంది, ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి, నీవు ఉపదేశంచేస్తే అది లోకానికి శ్రేయస్సు.

భగవంతుడు సముద్రం లాంటి వాడు, నీరు ఉంటుంది కానీ పాన యోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవత్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరం ఇచ్చి, భీష్ముడి ద్వారా ధర్మ సారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు, శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించ వీలు ఉంది.

ముఖ్యంగా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి, ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాం.

మఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్యాణం జరిగిన రోజు. మరుసటి ఏకాదశి ఆ మహానుభావుని పేరిట ఏర్పాటు చేయబడిన తిథి. అది ఆయనకి దక్కిన గౌరవం. కావున నేడు మనమంతా భీష్మ పితామహుల ద్వారా లభించిన విష్ణు సహస్ర నామ పారాయణం చేసి పునీతులమవుదాం.

🚩 శుభంభూయాత్ 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...