Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, April 27, 2026

రోమన్ దేవుళ్ళ వెనుక ఉన్నది మన సనాతన ధర్మమేనా! Shocking Links Between Roman & Hindu Gods! Out of India Theory!

 

Shocking Links Between Roman & Hindu Gods! Out of India Theory!

రోమన్ దేవుళ్ళ వెనుక ఉన్నది మన సనాతన ధర్మమేనా!
రోమన్ దేవుళ్ళకు, మన హిందూ దేవుళ్ళకు మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలు!
Shocking Links Between Roman & Hindu Gods! Out of India Theory!

భూగోళం మీద రెండు వేర్వేరు ప్రాంతాలు... మధ్యలో వేలాది కిలోమీటర్ల దూరం... ఏనాడూ కలుసుకోని రెండు విభిన్న సంస్కృతులు... కానీ, వారి నమ్మకాలు ఒకటే! వారి ఆచారాలు ఒకటే! చివరికి వారు పూజించే దేవుళ్ళ పేర్లు, ఆయుధాలు, వాహనాలు కూడా ఒకటే! ఇది ఎలా సాధ్యం? ఆధునిక చరిత్రకారులు చెబుతున్నట్లుగా ఇదంతా కేవలం యాదృచ్ఛికమా? లేక ప్రపంచమంతా ఒకప్పుడు విస్తరించి ఉన్న ఒకే ఒక్క మహా ధర్మమైన 'సనాతన ధర్మానికి' మిగిలిన ఆనవాళ్ళా?

ఈరోజు మనం చరిత్ర పుస్తకాల్లో దాచబడిన, లేదా ఎవరికీ అంతుచిక్కని ఒక అద్భుతమైన రహస్యాన్ని ఛేదించబోతున్నాం. రోమన్ దేవుళ్ళకూ, మన హిందూ దేవుళ్ళకూ మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన పోలికలూ, ప్రాచీన గ్రంథాలలోని ఆధారాలూ, మరియు భాషాశాస్త్రం (Linguistics) చెబుతున్న నిజాలు తెలిస్తే... మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి.. ఎందుకంటే చివరలో మనం తెలుసుకోబోయే నిజం మన చరిత్రను మరోసారి తిరగ రాసేలా చేస్తుంది.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/83ugVQgcnG4 ]


రోమన్ మైథాలజీ గురించి విన్న ప్రతి ఒక్కరికీ 'జూపిటర్' (Jupiter) గురించి తెలిసే ఉంటుంది. రోమన్లకు ఆయనే దేవుళ్ళందరికీ రాజు. ఆకాశానికి, ఉరుములకు, మెరుపులకు అధిపతి. గ్రీకు పురాణాల్లో ఇతన్నే 'జ్యూస్' (Zeus) అంటారు. ఇప్పుడు మన సనాతన ధర్మానికి వద్దాం. వేదాల ప్రకారం ఆకాశానికి, వర్షానికి, ఉరుములకు అధిపతి ఎవరు? దేవేంద్రుడు! జ్యూస్ చేతిలో ఉండే ఆయుధం థండర్ బోల్ట్ (Thunderbolt), ఇంద్రుడి చేతిలో ఉండే ఆయుధం 'వజ్రాయుధం', రెండూ ఒకటే.

కానీ అసలు రహస్యం ఇక్కడే ఉంది. భాషాశాస్త్రవేత్తలు, (Linguists) సంస్కృతానికీ లాటిన్ భాషకూ ఉన్న సంబంధాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఋగ్వేదంలో ఆకాశ దేవుడిని 'ద్యావస్ పితృ' (Dyaus Pita) అని పిలుస్తారు. ద్యావస్ అంటే ఆకాశం, పితృ అంటే తండ్రి (Sky Father). అదే పదం గ్రీకు భాషలోకి వెళ్ళేసరికి 'Deus Pater' (డ్యూస్ పేటర్) అయింది. రోమన్ భాషలోకి వెళ్ళేసరికి 'Deus Pater' కాస్తా కాలక్రమేణా పలకడానికి సులువుగా 'Ju-piter' (జూ-పిటర్) గా మారిపోయింది! ఆలోచించండి... ఇది నేను చెబుతున్న థియరీ కాదు. ఆక్స్ ఫర్డ్ మరియు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలకు చెందిన ఇండో-యూరోపియన్ లింగ్విస్టిక్స్ (Indo-European Linguistics) నిర్ధారించిన పచ్చి నిజం. మన ఋగ్వేదంలోని 'ద్యావస్ పితృ' ఏ వేలాది సంవత్సరాల క్రితమో రోమ్ చేరుకుని జూపిటర్ గా పూజలందుకున్నాడు.

హిందూ ధర్మంలో సృష్టి, స్థితి, లయకారులుగా మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కొలుస్తాం. ఈ 'ట్రినిటీ' (Trinity) కాన్సెప్ట్ రోమన్లలో ఉందా? అంటే కచ్చితంగా ఉంది. వారిని 'క్యాపిటోలిన్ ట్రైయాడ్' (Capitoline Triad) అంటారు - జూపిటర్, నెప్ట్యూన్, ప్లూటో.

జూపిటర్ ఆకాశానికి అధిపతి అయితే... నెప్ట్యూన్ (Neptune) సముద్రాలకు అధిపతి. నెప్ట్యూన్ చేతిలో ఏముంటుందో తెలుసా? 'ట్రైడెంట్' (Trident)... అంటే మన పరమశివుడి చేతిలో ఉండే త్రిశూలం! మన పురాణాల ప్రకారం వరుణ దేవుడు సముద్రాలకు అధిపతి, శివుడు లయకారుడు. ఈ ఇద్దరి లక్షణాలను కలిపి రోమన్లు నెప్ట్యూన్ గా కొలిచారు. త్రిశూలం కేవలం శివుడికి మాత్రమే స్వంతమైన ఆయుధం. మరి అది రోమ్ కు ఎలా వెళ్ళింది?

ఇక మరణానికి, పాతాళ లోకానికి అధిపతి అయిన యమధర్మరాజు గురించి మనకు తెలుసు. యముడికి రోమన్ కౌంటర్ పార్ట్ ఎవరు? ప్లూటో (Pluto) లేదా గ్రీకుల్లో అయితే హేడిస్ (Hades). యముడి వాహనం ఒక నల్లటి దున్నపోతు. ఆయన లోకానికి కాపలాగా భయంకరమైన కుక్కలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరంగా, ప్లూటో అధిపత్యం వహించే పాతాళ లోకానికి కూడా 'సెర్బెరస్' (Cerberus) అనే మూడు తలల కుక్క కాపలా ఉంటుంది. ఇదంతా కేవలం ఒక కో-ఇన్సిడెన్స్ (Coincidence) అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే.

ఆదివారం, సోమవారం, మంగళవారం అని, మనం రోజూ వారాల పేర్లు వాడుతుంటాము... ఈ నవగ్రహాల కాన్సెప్ట్ మన సనాతన ధర్మానిదే అని అందరికీ తెలుసు. మరి ఇంగ్లీషులో వారాల పేర్లు ఎలా వచ్చాయి? Sunday - Sun's Day (సూర్యుడు/రవి). Monday - Moon's Day (చంద్రుడు/సోమ). Saturday - Saturn's Day (శని). మనం ఏ క్రమంలో అయితే గ్రహాలను పూజిస్తున్నామో, అదే క్రమంలో రోమన్లు కూడా గ్రహాలకు పేర్లు పెట్టారు.

మన సూర్య భగవానుడికి ఏడు గుర్రాలు ఉన్న రథం ఉంటుంది. ఋగ్వేదంలో సూర్యుడిని ప్రపంచానికి కన్నుగా అభివర్ణించారు. రోమన్లు పూజించే సూర్య దేవుడి పేరు 'సాల్ ఇన్విక్టస్' (Sol Invictus) మరియు గ్రీకుల్లో 'అపోలో' (Apollo). అపోలో దేవుడు కూడా సూర్యకాంతితో, గుర్రాలు లాగే రథంపై ఆకాశంలో ప్రయాణిస్తాడని రోమన్ గ్రంథాలు ఘోషిస్తున్నాయి.

ఇక చదువుల తల్లి సరస్వతీ దేవి విషయానికి వస్తే... రోమన్లకు జ్ఞానానికి, కళలకు అధిదేవత 'మినర్వా' (Minerva). సరస్వతీ దేవి చేతిలో వీణ ఎలా ఉంటుందో, గ్రీకు / రోమన్ గాడ్ ఆఫ్ మ్యూజిక్ అయిన అపోలో చేతిలో 'లైర్' (Lyre) అనే వాయిద్యం ఉంటుంది. జ్ఞానానికి ఒక స్త్రీ మూర్తిని దేవతగా పూజించడం ప్రపంచంలో కేవలం సనాతన ధర్మంలోనూ, దాని శాఖలుగా విడిపోయిన ఈ గ్రీకో-రోమన్ సంస్కృతులలో మాత్రమే కనిపిస్తుంది.

దేవుళ్ళ పేర్లు పోలి ఉన్నంత మాత్రాన సంస్కృతి ఒకటే అని ఎలా అంటామని మీరు అడగవచ్చు. దానికి సమాధానం వారి ఆచారాల్లో దొరుకుతుంది.

మన హిందూ ధర్మంలో ఎలాంటి శుభకార్యం జరిగినా అగ్నిహోత్రం సాక్షిగా జరుగుతుంది. అగ్ని దేవుడి ద్వారానే మన ప్రార్థనలు ఇతర దేవతలకు చేరతాయని వేదాలు చెబుతున్నాయి. 'అగ్నిమీళే పురోహితం' అంటూ ఋగ్వేదం మొదటి శ్లోకమే అగ్ని దేవుడితో మొదలవుతుంది.

రోమన్ సంస్కృతిలో 'వెస్టా' (Vesta) అనే దేవత ఉంది. ఈమె హార్త్ (Hearth) మరియు పవిత్రమైన అగ్నికి దేవత. ప్రాచీన రోమ్ నగరంలో 'టెంపుల్ ఆఫ్ వెస్టా' లో ఎప్పటికీ ఆరిపోకుండా ఒక పవిత్రమైన అగ్నిని వెలిగించి ఉంచేవారు. ఆ అగ్నిని కాపాడటానికి 'వెస్టల్ వర్జిన్స్' (Vestal Virgins) అనే పూజారిణిలు ఉండేవారు. లాటిన్ లోని 'Ignis' (ఇగ్నిస్) అనే పదం నుండే ఇంగ్లీషులో Ignite అనే పదం వచ్చింది. ఆ ఇగ్నిస్ మరేదో కాదు... మన సంస్కృత పదం 'అగ్ని'! ఆలోచించండి.. అగ్ని - ఇగ్నిస్.

ఇంతటి బలమైన ఆధారాలు చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? ఒకప్పుడు ఇండో-ఆర్యన్ మైగ్రేషన్ (Aryan Migration Theory) పేరుతో కొంతమంది యూరోపియన్లు భారతదేశానికి వచ్చి మనకు వేదాలు నేర్పించారని తప్పుడు చరిత్రను మనకు నూరిపోశారు. కానీ ఆధునిక పరిశోధనలు, DNA స్టడీస్, మరియు ఇలాంటి భాషా శాస్త్ర ఆధారాలు (Linguistics) చెబుతున్న నిజం వేరు. దీన్నే 'అవుట్ ఆఫ్ ఇండియా థియరీ' (Out of India Theory) అంటారు.

అంటే మన సనాతన ధర్మం, మన వేదాలు, మన జీవన విధానం, ఇక్కడి నుండి పశ్చిమ దేశాలకు వలస వెళ్ళాయి. వాళ్ళు మన దేవుళ్ళనే తీసుకువెళ్ళారు. కాలక్రమేణా భౌగోళిక పరిస్థితుల వల్ల, భాషా మార్పుల వల్ల ద్యావస్ పితృ జూపిటర్ గా మారాడు, వరుణుడు నెప్ట్యూన్ అయ్యాడు, అగ్ని ఇగ్నిస్ గా మారాడు.

రోమన్ సామ్రాజ్యం కాలగర్భంలో కలిసిపోయింది. వారి దేవుళ్ళు కేవలం మ్యూజియంలలో విగ్రహాలుగా మిగిలిపోయారు. కానీ మన సనాతన ధర్మం, వేలాది సంవత్సరాల దాడులను తట్టుకుని, ఈనాటికీ అదే ఋగ్వేద మంత్రాలతో, అదే అగ్నిహోత్రంతో సజీవంగా ఉంది. ఎందుకంటే ఇది ఏ ఒక్క వ్యక్తో స్థాపించిన మతం కాదు... ఇది సృష్టితో పాటు పుట్టిన ధర్మం. సనాతన ధర్మం!

ఈ వీడియో ద్వారా మీరు ఒక కొత్త, అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియోని లైక్ చేసి, మన 'వాయిస్ ఆఫ్ మహీధర్' ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన మిస్టరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు...

జై హింద్!

Monday, April 20, 2026

మనిషిని అజ్ఞానం నుండి వెలుగులోకి నడిపించే అక్షరాలపై ఒక ఉన్మాదికి అసూయ పుడితే? How Nalanda University Was Destroyed by Bakhtiyar Khilji!

 

How Nalanda University Was Destroyed by Bakhtiyar Khilji!

ఉన్మాదం!
మనిషిని అజ్ఞానం నుండి వెలుగులోకి నడిపించే అక్షరాలపై ఒక ఉన్మాదికి అసూయ పుడితే?
How Nalanda University Was Destroyed by Bakhtiyar Khilji!

అక్షరం... మనిషిని అజ్ఞానం నుండి వెలుగులోకి నడిపించే ఆయుధం. కానీ, అదే అక్షరాలపై ఒక ఉన్మాదికి అసూయ పుడితే? ప్రపంచానికే జ్ఞానాన్ని పంచిన ఒక మహా వృక్షాన్ని, తన అహంకారంతో ఒక రాక్షసుడు నరికివేస్తే? ఆరు నెలల పాటు నిరంతరాయంగా మండిన ఆ జ్ఞానపు మంటలలో... కాలిపోయింది కేవలం పుస్తకాలు కాదు.. మన చరిత్ర! మన వారసత్వం! మన అస్తిత్వం!

చరిత్ర పుటలను నిశితంగా పరిశీలిస్తే... నలంద విశ్వవిద్యాలయం ఒక్కసారి కాదు, తన సుదీర్ఘ ప్రయాణంలో ఏకంగా మూడుసార్లు దారుణమైన దాడులకు గురైంది. ఐదవ శతాబ్దంలో హూణుల పాలకుడైన 'మిహిరాకుల' హయాంలో మొదటిసారి, ఆ తర్వాత ఏడవ శతాబ్దంలో 'గౌడ' రాజ్య పాలకుల చేతిలో రెండవసారి ఈ విద్యా నిలయం పై విధ్వంసం జరిగింది. కానీ, అప్పటి పాలకుల, పండితుల కృషితో ఆ జ్ఞానదేవాలయం మళ్లీ మళ్లీ ప్రాణం పోసుకుని సగర్వంగా నిలబడింది. అయితే... సామాన్య శకం 1193లో టర్కీ సేనాధిపతి 'భక్తియార్ ఖిల్జీ' చేసిన మూడవ మరియు అంతిమ దాడి మాత్రం నలంద అస్తిత్వాన్నే శాశ్వతంగా తుడిచిపెట్టేసింది. ఒకప్పుడు పడినా లేచిన ఆ మహా వృక్షాన్ని, ఖిల్జీ సమూలంగా ఎలా నాశనం చేశాడు? అసలు ఆ చివరి దాడికి దారితీసిన ఆ చీకటి కారణాలు ఏమిటి?

ఈరోజు మనం చూడబోయే చరిత్ర... ఒక వైద్యుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక క్రూరుడిని ఎలా రక్షించాడు? దానికి ప్రతిఫలంగా ఆ మూర్ఖుడు మన దేశానికి చేసిన ద్రోహం ఏమిటి? 90 లక్షల పుస్తకాలు ఆరు నెలల పాటు ఎందుకు మండుతూనే ఉన్నాయి? నలంద విశ్వవిద్యాలయం విధ్వంసం వెనుక ఉన్న ఆ చీకటి రహస్యాలను ప్రాచీన గ్రంథాల ఆధారాలతో ఈరోజు డీకోడ్ చేద్దాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nKaI7VEfQhw ]


అది ఐదవ శతాబ్దం. అప్పటికి ఇంకా ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి విశ్వవిద్యాలయాల ఊసే లేదు. అప్పుడే మన భారతదేశంలో, బీహార్‌లోని రాజగృహ అంటే నేటి రాజ్‌ గిర్ సమీపంలో, సామాన్య శకం 427లో  గుప్త సామ్రాజ్య పాలకుడైన కుమారగుప్తుడు లేక శక్రాదిత్యుడు ఒక మహాద్భుతానికి శంకుస్థాపన చేశాడు. అదే 'నలంద విశ్వవిద్యాలయం'.

నలంద అంటే సంస్కృతంలో, 'జ్ఞానాన్ని ప్రసాదించేది' (నలం + దా). 30 ఎకరాల సువిశాల ప్రాంగణం. 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది ఆచార్యులు. కొరియా, జపాన్, చైనా, టిబెట్, ఇండోనేషియా, పర్షియా, గ్రీస్... ఇలా ప్రపంచ నలుమూలల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు.  'ద్వార పండితులు' (Erudite gatekeepers) విద్యార్థులను మౌఖికంగా పరీక్షించేవారు. ప్రవేశ పరీక్ష ఎంత కఠినంగా ఉండేదంటే, కేవలం 20 - 30 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యేవారు.

నలంద విశ్వవిద్యాలయం గొప్పదనం కేవలం దాని భవనాల్లో లేదు... అక్కడ పాఠాలు బోధించే ఆచార్యుల మేధస్సులో ఉంది. అసలు అక్కడ ఎలాంటివారు విద్యాబోధన చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచానికి 'సున్నా' (Zero) ను పరిచయం చేసిన మహా గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త 'ఆర్యభట్ట'... 6వ శతాబ్దంలో ఈ విశ్వవిద్యాలయానికి అధిపతిగా (కులపతిగా) వ్యవహరించారని చరిత్రకారులు చెబుతారు. ఒక్కసారి ఆలోచించండి... ఆనాడు ఆర్యభట్ట ఆ సున్నాను కనుగొనకపోతే, ఈరోజు ఈ డిజిటల్ టెక్నాలజీ లేదు, మనం వాడుతున్న కంప్యూటర్లు లేవు, అంతరిక్ష పరిశోధనలు లేవు. ఆధునిక ప్రపంచానికి పునాది పడిన ఆ జ్ఞాన కేంద్రం... మన నలంద!

ఆర్యభట్ట మాత్రమే కాదు... రసాయన శాస్త్రం (ఆల్కెమీ), లోహ విజ్ఞానంలో ప్రపంచాన్ని నివ్వెరపరిచిన గొప్ప తత్వవేత్త ఆచార్య 'నాగార్జునుడు', నలంద కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఆచార్య 'ధర్మపాల', అలాగే ప్రసిద్ధ చైనా యాత్రికుడు హ్యూయెన్ త్సాంగ్ (Xuanzang) కు స్వయంగా విద్యను బోధించిన మహాపండితుడు ఆచార్య 'శీలభద్ర'... ఇలా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఎందరో మహానుభావులు నలందలో ఆచార్యులుగా తమ జీవితాలను జ్ఞాన దానానికి అంకితం చేశారు. కేవలం మంత్రాలు, శ్లోకాలే కాదు... గణితం, సైన్స్, మెడిసిన్, ఆస్ట్రానమీ అన్నీ ఇక్కడ పురివిప్పుకున్నాయి.

నలందకు గుండెకాయ... దాని గ్రంథాలయం. దాని పేరు 'ధర్మగంజ్' (Dharmaganja). ఇది మూడు భారీ బహుళ అంతస్తుల భవనాల సముదాయం.

1. రత్నసాగర (రత్నాల సముద్రం) (Ratnasagara - 9 అంతస్తుల భవనం)
2. రత్నోదధి (రత్నాల మహాసముద్రం) (Ratnodadhi)
3. రత్నరంజక (రత్నాల అలంకారం) (Ratnaranjaka) ఆయుర్వేదం, ఖగోళ శాస్త్రం, గణితం, తర్కం, వ్యాకరణం, బౌద్ధ తత్వశాస్త్రం, ఇలా ఏకంగా 90 లక్షల (9 Million) అరుదైన తాళపత్ర గ్రంథాలు అక్కడ ఉండేవి. ఆ జ్ఞానం ప్రపంచంలో మరెక్కడా దొరకదు. కానీ, ఈ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు.

సామాన్య శకం 1193. టర్కిష్-ఆఫ్ఘన్ సైన్యాధ్యక్షుడు ఇఖ్తియారుద్దీన్ ముహమ్మద్ బిన్ భక్తియార్ ఖిల్జీ. కుతుబుద్దీన్ ఐబక్ సేనానిగా, భారత భూభాగాలను ఆక్రమిస్తూ, దారిలో కనిపించిన ప్రతిదాన్నీ నాశనం చేస్తూ బీహార్ చేరుకున్నాడు. ఖిల్జీకి ఒకటే పిచ్చి... ఇస్లామిక్ రాజ్యస్థాపన, తన మతమే గొప్పదనే అహంకారం.

కానీ ఒకరోజు, ఖిల్జీకి ఒక వింత వ్యాధి సోకింది. అతని శరీరమంతా నొప్పులు, ప్రాణాలు పోయే పరిస్థితి. తన ఆస్థానంలో ఉన్న గొప్ప గొప్ప హకీమ్‌లందరినీ పిలిపించాడు. రకరకాల మందులు ఇచ్చారు. కానీ వ్యాధి తగ్గలేదు సరికదా, మరింత ముదిరింది. ఖిల్జీ చావు అంచున నిలబడ్డాడు. అప్పుడు ఒక సలహాదారుడు నలంద విశ్వవిద్యాలయంలోని ఆయుర్వేద పండితుల గురించి చెప్పాడు.

"నా హకీమ్‌ల కంటే ఆ కాఫిర్లకు (హిందువులు/బౌద్ధులకు) ఎక్కువ జ్ఞానం ఉందా? అసాధ్యం! నా ప్రాణాలు పోయినా సరే, వాళ్ళ మందు నేను వేసుకోను!" అని అన్నాడు..

అయినా ప్రాణభయంతో, నలంద ఆచార్యుడైన ఆయుర్వేద పండితుడు 'రాహుల్ శ్రీభద్ర' ను పిలిపించాడు ఖిల్జీ. కానీ ఒక విచిత్రమైన, అహంకారపూరితమైన షరతు పెట్టాడు.

ఖిల్జీ పండితుడితో ఇలా అన్నాడు: 'నువ్వు నన్ను బతికించాలి, కానీ నువ్వు ఇచ్చే ఎలాంటి ఆయుర్వేద మందు, కషాయం నేను మింగను. భారతీయ వైద్యం నేను తీసుకోను. నన్ను బాగు చేయకపోతే నిన్ను ప్రాణాలతో వదలను.' ఇదొక మూర్ఖపు షరతు. మందు తినకుండా వ్యాధి ఎలా తగ్గుతుంది?

రాహుల్ శ్రీభద్ర భయపడలేదు. వారిది నలంద జ్ఞానం. ఒకరోజు తర్వాత ఆయన ఖిల్జీ దగ్గరకు ఒక ఖురాన్ గ్రంథాన్ని తీసుకువెళ్లారు. 'ప్రభూ! ఈ ఖురాన్‌లోని కొన్ని పేజీలను ప్రతిరోజూ చదవండి. మీరు త్వరగా కోలుకుంటారు' అని చెప్పారు.

ఖిల్జీకి ఆయుర్వేద పండితుడు వాడిన అద్భుతమైన ట్రిక్ ఇది. ఖురాన్ పేజీల చివరన కంటికి కనిపించని ఒక ఆయుర్వేద మూలికా లేపనాన్ని రాహుల్ శ్రీభద్ర పూశారు. ఖిల్జీ గ్రంథం చదివేటప్పుడు, వేలితో పేజీలు తిప్పడానికి నోటిలోని లాలాజలాన్ని ఉపయోగించేవాడు. అలా పేజీలు తిప్పుతున్నప్పుడు, శ్వాస ద్వారా ఆ ఆయుర్వేద ఔషధం ఖిల్జీ శరీరంలోకి ప్రవేశించింది. కొద్ది రోజులకే ఖిల్జీకి పూర్తిగా నయమైంది!

సాధారణంగా ఎవరైనా ప్రాణాలు కాపాడితే కృతజ్ఞత చూపిస్తారు. కానీ ఖిల్జీ ఒక సైకోపాత్. తన మతంలో, తన దేశంలో లేని అద్భుతమైన వైద్య జ్ఞానం భారతీయ పండితుల దగ్గర ఎలా ఉంది? తన హకీమ్‌ల కన్నా వీరు ఎందుకు గొప్పవారు? తన సొంత వైద్యుల కంటే భారతీయ వైద్యుడికి ఎక్కువ జ్ఞానం ఉందన్న విషయాన్ని ఖిల్జీ భరించలేకపోయాడు.  ఈ ఆలోచన అతడిలో భయంకరమైన అసూయను రగిల్చింది. 'ఈ జ్ఞానం అంతా ఎక్కడిది?' అని ఆరా తీశాడు. మూలం 'నలంద విశ్వవిద్యాలయం' అని తెలిసింది. ఆ జ్ఞానాన్ని నాశనం చేయమని ఆదేశించాడు ఆ ఉన్మాది.

చరిత్రకారుడు మిన్హాజ్-ఇ-సిరాజ్ తన గ్రంథమైన 'తబకత్-ఇ నసిరి' (Tabaqat-i Nasiri) లో ఈ మారణహోమాన్ని స్పష్టంగా రాశాడు. ఆయుధాలు పట్టుకోవడం కూడా తెలియని అమాయక విద్యార్థులను, గురువులను సజీవ దహనం చేశారు, కొందరి తలలు నరికారు. ఆ జ్ఞాన సముదాయం హాహాకారాలతో దద్దరిల్లింది. తన ప్రాణాలు కాపాడిన వైద్యుడికీ, ఆ వైద్యుడిని తయారుచేసిన బడికీ, ఖిల్జీ ఇచ్చిన పైశాచిక బహుమతి... మరణం.

నలందను నాశనం చేసిన తర్వాత ఖిల్జీ కన్ను అపార విద్యాభాండాగారమైన లైబ్రరీపై పడింది. రత్నసాగర, రత్నోదధి భవనాలకు నిప్పు పెట్టాడు. మీరు నమ్మగలరా? ఆ లైబ్రరీలో ఉన్న 90 లక్షల పుస్తకాలు కాలిపోవడానికి ఏకంగా ఆరు నెలల (6 Months) సమయం పట్టింది.

ఆ అగ్ని అంత కాలం ఎందుకు మండిందంటే... అప్పటి పుస్తకాలు కాగితంతో చేసినవి కావు. అవన్నీ తాళపత్ర గ్రంథాలు (Palm Leaf Manuscripts). వాటిని భద్రపరచడానికి ప్రత్యేకమైన చెట్ల బెరడులు, సహజమైన నూనెలు ఉపయోగించేవారు. ఆ నూనెల వల్ల ఆ గ్రంథాలు ఒక మహా యజ్ఞవాటికలా, ఆరు నెలల పాటు మండుతూనే ఉన్నాయి. ఆకాశమంతా నల్లటి పొగ ఆవరించింది.

ఈ మారణహోమం నుండి కొందరు పండితులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కొన్ని అతిముఖ్యమైన గ్రంథాలను తీసుకుని టిబెట్, నేపాల్ దేశాలకు పారిపోయారు. 1234 వ సంవత్సరంలో టిబెట్ యాత్రికుడు ధర్మస్వామి (Dharmasvamin) నలందను దర్శించినప్పుడు, ఆ శిథిలాల మధ్య 90 ఏళ్ల ఒక వృద్ధ ఆచార్యుడు, ఒక బ్రాహ్మణుడి సహాయంతో, ప్రాణాపాయ స్థితిలో కూడా విద్యను బోధిస్తున్న దృశ్యాన్ని తన రికార్డులలో రాశాడు. మంటల నుండి బ్రతికి బట్టకట్టిన ప్రజ్ఞాపారమిత సూత్ర (Prajnaparamita Sutra) లాంటి కొన్ని గ్రంథాలు, ఈరోజుకీ టిబెట్ ఆశ్రమాల్లో భద్రంగా ఉన్నాయి. కానీ మనం కోల్పోయిన జ్ఞానంతో పోలిస్తే అది సముద్రంలో ఒక నీటిబొట్టు మాత్రమే.

ఖిల్జీ తగలబెట్టింది కొన్ని పుస్తకాలను మాత్రమే కాదు... భారతీయ శాస్త్ర సాంకేతిక రంగాలను, మన ఆయుర్వేదాన్ని, ఖగోళ శాస్త్రాన్ని. నలంద కనుక ఆరోజు కాలిపోకుండా ఉండి ఉంటే, ఈరోజు భారతదేశం వైజ్ఞానికంగా ప్రపంచాన్ని ఏలేది. ఒక ఉన్మాది అసూయ, ఒక సామ్రాజ్యపు మూర్ఖత్వం... మన దేశ చరిత్రను వందల ఏళ్లు వెనక్కి నెట్టేసింది.

కానీ శిథిలమైనా, నలంద గొప్పదనం చెరిగిపోదు. ఆ బూడిదలో నాటి మన పూర్వీకుల అపారమైన మేధస్సు దాగి ఉంది. ఈ నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలి. మన చరిత్ర అంటే రాజుల యుద్ధాలు మాత్రమే కాదు. అక్షరం కోసం మన పూర్వీకులు చేసిన త్యాగాలు కూడా!

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బూడిదలో నుంచి పుట్టుకొచ్చే ఫీనిక్స్ పక్షిలా... నలంద మళ్లీ ప్రాణం పోసుకుంది! నలంద ప్రాచీన వైభవాన్ని పునరుద్ధరించాలనే సంకల్పంతో, మన భారత ప్రస్తుత ప్రభుత్వం, అదే రాజ్‌గిర్ భూమిపై ఒక అద్భుతమైన నూతన క్యాంపస్‌ను నిర్మించింది. జూన్ 19, 2024 న మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ నూతన నలందను ప్రపంచానికి అంకితం చేశారు.

ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ బి.వి. దోషి, ప్రాచీన నలంద ఆకృతినీ, ఆత్మనూ ప్రతిబింబించేలా దీనిని డిజైన్ చేశారు. ఇది కేవలం ఒక యూనివర్సిటీ మాత్రమే కాదు, ఇది ఒక 'నెట్ జీరో గ్రీన్ క్యాంపస్' (Net Zero Green Campus). 100 ఎకరాల విస్తీర్ణంలో అలనాటి కమల్ సాగర్ చెరువులు, సోలార్ మరియు నీటి శుద్ధి ప్లాంట్లతో పూర్తి పర్యావరణ హితంగా దీన్ని తీర్చిదిద్దారు.

నలంద ఒకప్పుడు ప్రపంచాన్ని ఎలా ఏకం చేసిందో, ఇప్పుడు కూడా భారతదేశంతో పాటు చైనా, సింగపూర్, జపాన్ వంటి 17 దేశాల సహకారంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ఇప్పుడు మళ్లీ ఇక్కడ బౌద్ధ అధ్యయనాలు, తత్వశాస్త్రం, పర్యావరణం మరియు అంతర్జాతీయ సంబంధాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఖిల్జీ నలంద భవనాలను, గ్రంథాలనూ కాల్చగలిగాడేమో కానీ... భారతీయ జ్ఞాన దాహాన్ని కాదు. అవును... నలంద ఆగిపోలేదు, దాని అక్షర ప్రయాణం మళ్లీ మొదలైంది!

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఆనాటి మన పండితుల గొప్పదనానికి నివాళిగా ఈ వీడియోను ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. ఇది కేవలం చరిత్ర కాదు, మన ఐడెంటిటీ. వీడియోను LIKE చేయడం మర్చిపోకండి. 

జై హింద్!

Monday, April 13, 2026

Causes of Short Life Span According to Garuda Purana! గరుడపురాణం ప్రకారం అల్పాయువు రహస్యం!

Causes of Short Life Span According to Garuda Purana!

గరుడపురాణం ప్రకారం అల్పాయువు రహస్యం!
ఒకరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తే, మరొకరు అర్ధాంతరంగా ఎందుకు తనువు చాలిస్తున్నారు?
Causes of Short Life Span According to Garuda Purana!

ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికీ తప్పని ఒకే ఒక సత్యం, ‘మరణం’... "పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మరల పుట్టక తప్పదు" అనేది భగవద్గీత శ్లోకం మాత్రమే కాదు, ప్రకృతి ధర్మం కూడా. కానీ... ఒకరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తే, మరొకరు అర్ధాంతరంగా ఎందుకు తనువు చాలిస్తున్నారు?

సృష్టి ధర్మం ప్రకారం మనిషి ఆయుర్దాయం వంద సంవత్సరాలు. కానీ నేటి కలియుగంలో, 60 లేదా 70 ఏళ్లు బతకడమే గగనమైపోయింది. ఎందుకిలా జరుగుతోంది? మన ఆయుష్షును హరించివేస్తున్న ఆ అదృశ్య శక్తులు ఏమిటి? ఆధునిక వైద్యం, సైన్స్ కూడా సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలకు... వేల సంవత్సరాల క్రితమే "గరుడ పురాణం" స్పష్టమైన సమాధానాలు ఇచ్చింది.

శ్రీ మహావిష్ణువుకూ, పక్షిరాజైన గరుత్మంతుడికీ మధ్య జరిగిన అద్భుతమైన సంవాదమే ‘గరుడ పురాణం’. ఈరోజు మన చానెల్ లో... గరుడ పురాణం ప్రకారం ఒక మనిషి తక్కువ వయసులోనే మరణించడం, అంటే "అల్పాయుష్కుడు" కావడానికి గల అసలైన కారణాలు ఏమిటో, ప్రాచీన గ్రంథాల ఆధారంగా, శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషిద్దాము. ఈ వీడియోను చివరి వరకు చూడండి.. ఇందులో చెప్పబడిన కొన్ని విషయాలు మీ జీవనశైలినే మార్చేయవచ్చు.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/l0Fpyq7G6as ]


ఓ గరుడా! మనిషి నూరేళ్ళూ బ్రతకాలనే వేదం చెప్పిందని, సాక్షాత్తూ ఆ నారాయణుడు పక్షిరాజుతో అన్నాడు. ఒకప్పుడు మనుషులు ప్రకృతితో మమేకమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ, పరిపూర్ణమైన ఆయుష్షును అనుభవించేవారు. కానీ, కలికాలం ప్రవేశించిన తర్వాత, ఆ మాటకు అవాంతరం ఏర్పడింది.

ఎందుకు మనిషి ఆయుష్షు క్షీణిస్తోంది? దానికి గరుడ పురాణం చెప్పిన మొదటి కారణం... "కర్మ సిద్ధాంతం". నిందిత కర్మలను, అంటే, సమాజం, ధర్మం అసహ్యించుకునే పనులను నిరంతరాయంగా ఎవరైతే చేస్తారో, వారు ఎక్కువ కాలం జీవించరు. పాప కర్మలు శరీరంలోని ప్రాణశక్తిని ఎలా క్షీణింపజేస్తాయో మన ప్రాచీన గ్రంథాలు చాలా స్పష్టంగా వివరించాయి.

అంతేకాదు, వేద జ్ఞానం కొరవడడం ప్రధాన కారణం. ఆధునికత మోజులో పడి, వంశ పారంపర్యంగా వస్తున్న సదాచారాలను మనం గాలికొదిలేశాము. పొద్దున్నే లేవడం, సూర్యనమస్కారాలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం లాంటి సదాచారాలు మూఢనమ్మకాలు కావు. అవి మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే అదృశ్య కవచాలు. ఆ కవచాలను వదిలేసినప్పుడే, మనిషి అల్పాయుష్కుడు అవుతున్నాడు.

గరుడ పురాణంలో విష్ణుమూర్తి, మనిషి ఆయుష్షును క్షీణింపజేసే దైనందిన తప్పులను చాలా స్పష్టంగా ఎత్తి చూపాడు.

1. బద్ధకం: బద్ధకస్తుడై, తాను చేయవలసిన సత్కర్మలను అంటే, బాధ్యతలను చేయకపోవడం. సోమరితనం శరీరాన్నే కాదు, ఆత్మను కూడా తుప్పు పట్టిస్తుంది.
2. దుష్టకర్మలు: ఇతరులకు హాని తలపెట్టే దుష్టకర్మలు చేసేవాడు, ప్రకృతి ఆగ్రహానికి గురవుతాడు.
3. ఆహార నియమాలు లేకపోవడం: "భోజనం కూడా ఎవరింట్లోనో చేసి వేస్తూ..." అని గ్రంథం చెబుతోంది. అంటే ఆహారం ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వారు వండినది తినడం. వండేవాడి మనస్తత్వం తినేవాడిపై ప్రభావం చూపుతుందని, మన పెద్దలు చెబుతారు.. అపవిత్రమైన, వాడిపోయిన, ప్రాణశక్తి లేని ఆహారం తినడం వల్ల, ఆయుష్షు కచ్చితంగా తగ్గుతుంది.
4. కుటుంబ బాధ్యతారాహిత్యం మరియు పరస్త్రీ వ్యామోహం: సొంతంగా కుటుంబాన్ని నెలకొల్పుకోకుండా, భార్యాబిడ్డలను పోషించకుండా, పరస్త్రీ సంగంతో అంటే, ఇతరుల భార్యల పట్ల వ్యామోహంతో కాలక్షేపం చేసే వాడికి, ఆయుష్షు దారుణంగా క్షీణిస్తుంది. అనైతిక సంబంధాలు మనిషిలోని ఓజస్సునూ, తేజస్సునూ హరించివేస్తాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది.

సమాజంలో ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతలను విస్మరించడం కూడా ఆయువును తగ్గిస్తుంది.

మన గ్రంథాల ప్రకారం... సమాజానికి మార్గనిర్దేశం చేయాల్సిన బ్రాహ్మణులు, శ్రద్ధాహీనులు, అపవిత్రులు, నాస్తికులు అయితే, శుభకార్యాలను చేపట్టనివారూ, పరద్రోహులూ, అసత్యవాదులూ అయితే, వారు ఎక్కువ కాలం బ్రతకరు. సమాజపు జ్ఞాన దీపాన్ని వెలిగించాల్సిన వారే చీకటిలో ఉంటే, అది ఘోరమైన పాపం.

ఇక పాలకుల విషయానికి వస్తే... ప్రజలను కంటికి రెప్పలా రక్షించవలసిన వారే, ఆ పని చేయకుండా, క్రూరులై, ధర్మాచరణ చేయక, వ్యసనపరులై, మూర్ఖులై, వేద శాసనాన్ని పక్కనపెట్టి, ప్రజలను పీడించే పాలకులు ఉంటే... ఆ పాపాన్ని సాక్షాత్తూ భూమాత కూడా భరించలేదు. అలాంటి పాలకులకు పతనం, అర్ధాంతర మరణం తథ్యం అని, మన పురాణాలు ఘోషిస్తున్నాయి.

సామాన్య మానవులు కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. స్నాన, దానాదులు లేకుండా రోజును గడిపేవారు వ్యర్థులే అని పురాణాలు చెబుతున్నాయి. ధర్మ శాస్త్రంలోని 24వ అధ్యాయం, 18-19 శ్లోకాల్లో ఒక అద్భుతమైన మాట చెప్పబడింది.

స్నానందానం జపోహోమో స్వాధ్యాయో దేవతార్చనం ।
యస్మిన్ దినే నసేవ్యంతే స వృధా దివసో నృణాం ।।

దీని అర్థం ఏమిటో తెలుసా? ఏ రోజునైతే మనిషి.. పవిత్ర స్నానం, దానం, జపం, హోమం, స్వాధ్యాయం అంటే తనను తాను విశ్లేషించుకోవడం లేదా మంచి గ్రంథాలను చదవడం, మరియు దేవతార్చన... ఈ ఆరింటిలో కనీసం ఒక్కటైనా చేయకుండా ఆ రోజును ముగిస్తాడో... ఆ రోజు అతని జీవితంలో వృధా అయిపోయినట్టే. ఆ వృధా అయిన రోజులు మన ఆయుష్షు ఖాతాలోంచి మైనస్ అయిపోతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోనివాడికి, ఎక్కువ కాలం బ్రతికే హక్కును ప్రకృతి ఇవ్వదు.

ఇప్పటివరకు మనం పెద్దలైన వారు తెలిసీ తెలియక చేసే పాపాల వల్ల ఆయుష్షు ఎలా క్షీణిస్తుందో చూశాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరి మదిలో మెదిలే, గుండెను కలచివేసే ఒకే ఒక్క ప్రశ్న... పుట్టగానే, లేదా అభం శుభం తెలియని పసి వయసులోనే చనిపోయే వారి పరిస్థితి ఏమిటి? వారు ఎలాంటి పాపం చేయలేదు కదా, మరి వారి ఆయుష్షు ఎందుకు అంత త్వరగా ముగిసిపోతుంది?

దీనికి సైన్స్ జన్యుపరమైన లోపాలు అనో, ఇన్ఫెక్షన్లు అనో కారణాలు చెబుతుంది. కానీ సనాతన ధర్మం, గరుడ పురాణం దీని వెనుక ఉన్న అతి సూక్ష్మమైన "కర్మ సిద్ధాంతాన్ని" మరియు ఆత్మ ప్రయాణాన్ని వివరిస్తాయి.

పురాణాల ప్రకారం, దీని వెనుక నాలుగు ప్రధాన కారణాలు ఉంటాయి.

• మొదటిది ప్రారబ్ద కర్మ: సంచిత కర్మలో, ప్రస్తుత జన్మలో అనుభవించవలసిన కొంత భాగాన్ని ప్రారబ్ద కర్మ అంటారు. చూడటానికి వారు పసిపిల్లలే కావచ్చు, కానీ ఆ ఆత్మ ఎన్నో జన్మల ప్రయాణం చేసి వస్తుంది. ఆ శరీరంతో కేవలం కొన్ని రోజులు మాత్రమే గడపాలన్న ఆత్మ ప్రారబ్ధ కర్మ తీరగానే, అది దేహాన్ని వదిలేస్తుంది.
• రెండవది ఋణానుబంధం: "ఋణానుబంధ రూపేణ పశు పత్నీ సుతాలయః" అన్న పద్మ పురాణం లోని శ్లోకాన్ని మీరు వినే ఉంటారు. ఆ పసికందు రూపంలో వచ్చిన ఆత్మకూ, తల్లిదండ్రులకూ మధ్య ఉన్న ఋణం, ఆ కొద్ది రోజులకే పరిమితమై ఉండవచ్చు. ఆ బాకీ తీరగానే, ఆత్మ తన దారిన తాను వెళ్ళిపోతుంది.
• మూడవది తల్లిదండ్రుల కర్మ: చాలా సందర్భాల్లో, శిశువు అర్ధాంతరంగా మరణించడం అనేది, గత జన్మలలో తల్లిదండ్రులు చేసుకున్న కర్మ ఫలితం కారణంగా, ఆ పుత్ర శోకాన్ని అనుభవించక తప్పదు.
• కానీ ఇందులో ఉన్న ఒకే ఒక ఊరట ఏమిటంటే... అభం శుభం తెలియని వయసులో చనిపోయిన పిల్లలకు, ఈ జన్మలో ఎలాంటి కొత్త కర్మలూ అంటవు కాబట్టి, గరుడ పురాణం ప్రకారం ఆ ఆత్మలకు నరక బాధలు ఉండవు. అవి వెంటనే ఉన్నత లోకాలకో, లేదా మరో ఉత్తమ జన్మకో వెళతాయి.

ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న తర్వాత మనకు తెలిసేది ఒకటే.. "పక్షీంద్రా! పుట్టినవాడు గిట్టడం ఎంత సత్యమో, మరణించినవాడు మరల పుట్టుడం కూడా అంతే సహజం. కానీ దీనిని తప్పించిన వారు కూడా ఉన్నారు.." అని గరుత్మంతుడితో శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు...

మనిషి తనకు మరణం లేకుండా ఉండాలని కోరుకోవడం అన్యాయం, ప్రకృతి విరుద్ధం. కానీ, "మరల పుట్టుక ఉండకూడదు" అని కోరుకోవడం అంటే.. జనన మరణ చక్రం నుండి బయటపడి, "జన్మరాహిత్యం" అంటే మోక్షాన్ని వాంఛించడం చాలా మంచిది.

కానీ ఆ కోరిక తీరాలంటే... లెక్కలేనన్ని త్యాగాలు చేయాలి, అనంతంగా శ్రమ పడాలి. తనకెంతో ప్రియమైన వాటన్నింటినీ వదులుకోవాలి, దానం చేసి వేయాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన, ప్రాక్టికల్ సూత్రం మన పురాణాలలో చెప్పబడింది.

మానవ జీవితంలో ఈ మూడు శక్తులు అత్యంత దుర్లభమైనవి.. అవి:

1. తిన్నది అరిగించుకునే శక్తి అంటే ఆరోగ్యం
2. రతి శక్తి అంటే శారీరక పటుత్వం / సంతానోత్పత్తి సామర్థ్యం
3. దాన శక్తి అంటే, ఇతరులకు ఇవ్వాలనే విశాల హృదయం

అలాగే ఒక మనిషిని మోక్షం వైపు నడిపించే మూడు అత్యుత్తమ వస్తువులు లేక వరాలు ఏవో తెలుసా?

1. సరైన భోజనం అంటే, సాత్వికమైన, పవిత్రమైన ఆహారం.
2. అనుకూలవతియైన స్త్రీని భార్యగా పొందటం – దీని అర్ధం, జీవితాంతం ధర్మ మార్గంలో నడిపించే సహధర్మచారిణి.
3. ధర్మ న్యాయార్జిత ధనం - ఎవరినీ మోసం చేయకుండా, ఎవరి ఏడుపూ కొట్టకుండా, ధర్మబద్ధంగా సంపాదించిన డబ్బు.

ఈ మూడు వస్తువులూ, పైన చెప్పుకున్న మూడు శక్తులూ ఏ మనిషికైతే ఉంటాయో... అతడు అల్పాయుష్కుడు కాడు. అతడు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి, అంతిమంగా మోక్షం వైపు ప్రయాణిస్తాడు.

గరుడ పురాణం కేవలం మరణం తర్వాత జరిగే శిక్షల గురించి మాత్రమే చెప్పే గ్రంథం కాదు. బ్రతికున్నప్పుడు ఎలా జీవించాలో చెప్పే అద్భుతమైన సైన్స్ అందులో ఉంది. అల్పాయువుకు కారణాలు దేవుడి శాపాలు కావు. మనం రోజూ చేసే చిన్న చిన్న తప్పులే. బద్ధకాన్ని వీడదాం, ధర్మాన్ని ఆచరిద్దాం, స్వచ్ఛమైన ఆహారం తీసుకుందాం, మనకు ఉన్నదానిలో కాస్తయినా దానం చేద్దాము. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తే, వందేళ్ల ఆయుష్షు మన సొంతం అవుతుంది.

ఇలాంటి మరెన్నో లోతైన, ప్రాచీన రహస్యాల కోసం మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మిమ్మల్ని ఏమాత్రం ఆలోచింపజేసినా, మీ మిత్రులతో పంచుకోండి.

జై శ్రీకృష్ణ!

Monday, April 6, 2026

The Dark Mystery of Konark Temple: How a 12-Year-Old Boy Defied 1200 Master Architects!

The Dark Mystery of Konark Temple: How a 12-Year-Old Boy Defied 1200 Master Architects!

కోణార్క్ సూర్య దేవాలయం: ఆ 12 ఏళ్ల పసివాడు ఏం చేశాడు?
రాత్రికి రాత్రి ఆలయ నిర్మాణం పూర్తిచేసి, ఆ పసివాడు ఎందుకు ఆత్మ త్యాగం చేసుకున్నాడు?
The Dark Mystery of Konark Temple: How a 12-Year-Old Boy Defied 1200 Master Architects!

భారతదేశ చరిత్ర అనగానే మనకు రాజుల పరాక్రమాలు, వారు నిర్మించిన ఎన్నో అద్భుతమైన కట్టడాలూ గుర్తొస్తాయి. కానీ, కాలగర్భంలో కలిసిపోయిన కొన్ని కన్నీటి గాథలు, మనకు చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా కనిపించవు.

మిత్రులారా... ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక రాతి కట్టడం గురించి కాదు... ఆ రాళ్ల మధ్య సమాధి అయిన ఒక 12 ఏళ్ల బాలుడి ఆత్మబలిదానం గురించి.

1200 మంది మహా శిల్పులు... 12 సంవత్సరాల పాటు అహోరాత్రులూ శ్రమించినా సాధించలేని ఒక అసాధ్యమైన పనిని... కేవలం 12 ఏళ్ల పసి ప్రాయంలో ఉన్న ఒక బాలుడు ఎలా సాధించాడు? అసలు కోణార్క్ సూర్య దేవాలయం పైభాగంలో ఉన్న ఆ భారీ అయస్కాంతం (Magnetic stone) వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ఆ బాలుడు ఆ ఆలయం పైనుండి దూకి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?

ఈ రోజుటి మన వీడియోలో... ఒడిశా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన, మన కంట తడి పెట్టించే 'ధర్మపదుడి' (Dharmapada) అజరామర గాథను, ప్రాచీన శిల్ప శాస్త్రాల ఆధారంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి.. ఎందుకంటే ఈ కథ మీ గుండెల్ని బరువెక్కిస్తుంది.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Jq3jKHOJKVw ]


అది సామాన్య శకం 1243వ సంవత్సరం. కళింగ రాజ్యాన్ని, అంటే ప్రస్తుత ఒడిశాను, తూర్పు గంగ వంశానికి చెందిన మొదటి నరసింహదేవ మహారాజు పాలిస్తున్న కాలమది. ఆయనను 'లాంగుల నరసింహదేవ' అని కూడా పిలుస్తారు. ఆయన సూర్య భగవానుడికి పరమ భక్తుడు. తన రాజ్యంలోని చంద్రభాగా నదీ తీరంలో, సూర్యుడికి ఒక అద్భుతమైన రథం లాంటి దేవాలయాన్ని నిర్మించాలని ఆయన కలలు కన్నాడు.

అది సామాన్యమైన దేవాలయం కాదు. 24 చక్రాలతో, 7 గుర్రాలు లాగుతున్నట్లుగా ఉండే ఒక బ్రహ్మాండమైన సూర్య రథాన్ని పోలిన ఆలయం. ఈ సూర్య దేవాలయం కేవలం రాతితో కట్టిన గుడి మాత్రమే కాదు... ఆధునిక సైన్స్ కు కూడా అంతుచిక్కని ఒక అద్భుతమైన ఖగోళ యంత్రం (Astronomical marvel). ఈ రథానికి ఉన్న 24 చక్రాలు, రోజులోని 24 గంటలకు ప్రతీకలు. ఆ చక్రాలలోని 8 ఆకులు (Spokes), ఒక్కో ప్రహరం 3 గంటలచొప్పున, రోజులోని 8 ప్రహరాలను సూచిస్తాయి.

మీకు తెలుసా? ఈ రోజుకీ ఆ చక్రంపై పడే సూర్య కిరణాల నీడను బట్టి... కచ్చితమైన సమయాన్ని, నిమిషాలతో సహా చెప్పవచ్చు! 13వ శతాబ్దంలో, ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ కాలంలో... ఇంతటి కచ్చితమైన గణిత, ఖగోళ శాస్త్రాలను ఆ శిల్పులు ఎలా ఉపయోగించారనేది, ఈనాటికీ ఒక పెద్ద మిస్టరీ! ఇటువంటి అద్భుతమైన జ్ఞానమే, ఆ 12 ఏళ్ల ధర్మపదుడి రక్తంలోనూ ప్రవహిస్తోంది.

దీని కోసం రాజు తన రాజ్యంలోని 12 సంవత్సరాల ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ మహా నిర్మాణ బాధ్యతను, ఆ కాలంలో అత్యంత ప్రతిభావంతుడిగా పేరూపొందిన ప్రధాన శిల్పి, "బిషు మహారాణా" (Bisu Maharana) కు అప్పగించాడు.

అందుకుగాను రాజు పెట్టిన షరతు ఒక్కటే - "సరిగ్గా 12 సంవత్సరాలలో ఆలయ నిర్మాణం పూర్తి కావాలి. 1200 మంది అత్యుత్తమ శిల్పులు ఇందులో పాల్గొనాలి."

బిషు మహారాణా గర్భిణిగా ఉన్న తన భార్యను వదిలి, సూర్య దేవాలయ నిర్మాణానికి బయలుదేరాడు. అలా వెళ్ళిన అతనికి, తాను తిరిగి ఇంటికి వచ్చే సరికి తన జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని ఆనాడు తెలియదు..

అలా బిషు మహారాణా కోణార్క్ వెళ్లిపోయిన కొద్ది నెలలకే, అతని భార్య కరుణామయి ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డడే "ధర్మపదుడు". ఊరివాళ్లంతా అతన్ని ముద్దుగా 'ధర్మా' అని పిలిచుకునేవారు.

ధర్మపదుడు పెరుగుతున్నాడు. ఇతర పిల్లల్లా ఆడుకునే వయసులో, అతను తన తండ్రి ఇంట్లో వదిలివెళ్లిన ప్రాచీన శిల్ప శాస్త్రాలనూ, తాళపత్ర గ్రంథాలనూ చదవడం మొదలుపెట్టాడు. పుట్టుకతోనే అతను ఒక చైల్డ్ ప్రాడిజీ (Child Prodigy). ఎంతో సంక్లిష్టమైన ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ సూత్రాలను ఆ చిన్న వయసులోనే అతను అవపోసన పట్టాడు.

"అమ్మా... నాన్న ఎక్కడ?" అని ధర్మపదుడు అడిగినప్పుడల్లా, "నీ తండ్రి సూర్య భగవానుడికి గుడి కడుతున్నాడు నాయనా" అని చెప్పేది తల్లి. తండ్రిని చూడాలన్న ఆరాటం ఒకవైపు... శిల్పకళపై ఉన్న అంతులేని ఆసక్తి మరోవైపు... ధర్మపదుడిని ముందుకు నడిపించాయి.

12 సంవత్సరాలు గడిచిపోయాయి. కోణార్క్ సూర్య దేవాలయం దాదాపు పూర్తయింది. దాని శిల్పకళ చూసి దేవతలు కూడా అసూయపడేంత అద్భుతంగా తీర్చిదిద్దారు 1200 మంది శిల్పులు కలిసి.

ఇక కోణార్క్ గుడి పైకప్పుపై అమర్చాల్సిన ఆ 52 టన్నుల అయస్కాంత శిల (Loadstone) చుట్టూ అల్లుకున్న మిస్టరీ, సామాన్యమైనది కాదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం... ఆలయం అడుగున, గోడల్లో, మరియు పైకప్పు మీద అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలను ఒక నిర్దిష్ట కోణంలో (Specific angle) అమర్చాలి. అలా అమర్చినప్పుడు ఏర్పడే మాగ్నెటిక్ ఫీల్డ్ (Magnetic field) వల్ల... గర్భగుడిలోని సూర్య భగవానుడి విగ్రహం ఎవరి సపోర్ట్ లేకుండా గాలిలో అలా తేలుతూ (Floating idol) ఉండాలి!

అంతేకాదు... ఆ అయస్కాంత శక్తి ఎంత బలంగా ఉండేదంటే, బంగాళాఖాతంలో ప్రయాణించే విదేశీ నౌకల దిక్సూచీలు (Compasses) కూడా దారితప్పేవి. కొన్ని నౌకలు నేరుగా వచ్చి సముద్ర తీరంలోని రాళ్లను గుద్దుకుని ధ్వంసమయ్యేవి. ఆ అయస్కాంత శక్తిని తట్టుకుని, ఆ బ్రహ్మాండమైన శిలను పైకప్పుపై సమతుల్యంగా (Balance) నిలపడమే, ఆ 1200 మంది శిల్పులకు సవాలుగా మారింది. ఏ చిన్న లెక్క తప్పినా... మొత్తం గుడి కుప్పకూలిపోతుంది!

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్లు... అక్కడే ఒక ఊహించని ఆటంకం ఎదురైంది.

ఆలయం పైకప్పు నిర్మాణం 'దధినౌటి' అంటే ‘కలశం, లేదా ఆలయ కిరీటం’ నిలబడటం లేదు. ప్రాచీన గ్రంథాల ప్రకారం కోణార్క్ దేవాలయం పైభాగంలో, 52 టన్నుల బరువైన ఒక భారీ లోడ్ స్టోన్ అంటే అయస్కాంతం అమర్చాలి. దాని ఆకర్షణ శక్తి వల్లే గుడిలోని సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలుతూ ఉండాలి.

కానీ ఆ భారీ అయస్కాంత శిలను పైకప్పు మీద అమర్చడంలో, 1200 మంది శిల్పులూ విఫలమయ్యారు. వారు ప్రయత్నించిన ప్రతిసారీ అది కూలిపోతోంది. ప్రధాన శిల్పి బిషు మహారాణాకు ఏం చేయాలో పాలుపోలేదు.

సరిగ్గా అప్పుడే నరసింహదేవ రాజు ఆకస్మిక తనిఖీకి వచ్చాడు. కలశం ఇంకా పూర్తి కాకపోవడం చూసి అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

"బిషు మహారాణా! నా సహనానికి పరీక్ష పెట్టొద్దు. రేపు ఉదయం సూర్యోదయం లోపు ఈ దేవాలయ కలశం పూర్తి కావాలి. లేదంటే... ఈ 1200 మంది శిల్పుల తలలు తీయించేస్తాను!" అని భయంకరమైన శాసనం చేశాడు రాజు.

1200 మంది శిల్పుల కుటుంబాల్లో మరణ మృదంగం మోగింది. ఆ రాత్రి బహుశా వారి జీవితాలలో చివరి రాత్రి కావచ్చు.

సరిగ్గా అదే రోజు... తన తండ్రిని చూడటానికి 12 ఏళ్ల ధర్మపదుడు కోణార్క్ కు చేరుకున్నాడు. 12 సంవత్సరాల తర్వాత తండ్రీకొడుకుల కలయిక... కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. తండ్రి కళ్ళలో కన్నీళ్లు చూసిన ధర్మపదుడు, కారణం అడిగాడు. 1200 మంది ప్రాణాలు గాలిలో దీపంలా తయారయ్యాయని తెలుసుకున్నాడు.

"నాన్నా... బాధపడకు. నేను ఒకసారి ఆ ఆలయ నిర్మాణ పత్రాలు చూడొచ్చా?" అని అడిగాడు ధర్మపదుడు.

పసివాడి మాటలకు బిషు మహారాణా ఆశ్చర్యపోయినా, కొడుకు పట్టుబట్టడంతో ప్లాన్స్ చూపించాడు. ఆ 12 ఏళ్ల బాలుడు క్షణాల్లో అందులోని ఇంజనీరింగ్ లోపాన్ని పసిగట్టాడు. బేస్ మెంట్ లెక్కల్లో జరిగిన చిన్న పొరపాటు వల్ల పైకప్పు నిలబడటం లేదని గ్రహించాడు.

అర్ధరాత్రి వేళ... ఎవరికీ తెలియకుండా ఆ బాలుడు వందల అడుగుల ఎత్తున్న ఆ కోణార్క్ శిఖరం పైకి ఎక్కాడు. తన తండ్రి నేర్పకపోయినా, తను స్వయంగా నేర్చుకున్న ప్రాచీన శిల్ప శాస్త్ర గణితాన్ని ఉపయోగించి... ఆ భారీ అయస్కాంతంతో కూడుకున్న అసాధ్యమైన కలశాన్ని, సరైన కోణంలో అమర్చాడు. దధినౌటి పరిపూర్ణంగా, సుస్థిరంగా నిలబడింది!

1200 మంది మహా శిల్పులు 12 ఏళ్లుగా చేయలేని పనిని, ఒక 12 ఏళ్ల బాలుడు ఒక్క రాత్రిలో పూర్తి చేశాడు!

ఉదయం సూర్య కిరణాలు కోణార్క్ ఆలయం పై పడ్డాయి. కలశం పూర్తయింది. శిల్పులంతా ఆనందంతో గంతులు వేశారు. కానీ ఆ ఆనందం క్షణకాలమే.

వారిలో మానవ సహజమైన స్వార్థం తలెత్తింది. "మన 1200 మంది వల్ల కాని పనిని, నిన్నగాక మొన్న వచ్చిన ఒక పిల్లాడు చేశాడని రాజుకు తెలిస్తే... మన పరువు ఏమవుతుంది? మనం అసమర్థులమని రాజు మనందరి తలలు నరికిస్తాడు. ఈ పిల్లాడు బతికి ఉంటే మనందరికీ ప్రమాదమే" అని గుసగుసలు మొదలయ్యాయి.

ఆ రాత్రి... 1200 మంది శిల్పుల మధ్య జరిగిన ఆంతరంగిక సంఘర్షణ, బహుశా మానవ నైజానికి అద్దం పడుతుంది. "బిషు మహారాణా... నీ కొడుకు దేవుడిలా వచ్చి మనందరి ప్రాణాలు కాపాడాడు. కానీ ఆలోచించు... రేపు ఉదయం రాజుగారు వచ్చి, ఈ మహా కార్యాన్ని ఒక పసివాడు చేశాడని తెలిస్తే... మనల్ని బతకనిస్తాడా? మన 1200 మంది తలలు తీసేయడా? ఒక పిల్లాడి ప్రాణం ముఖ్యమా? 1200 కుటుంబాల ప్రాణాలు ముఖ్యమా?"

ఆ మాటలు విన్న బిషు మహారాణా గుండె పగిలిపోయింది. కన్నకొడుకును రక్షించుకోవాలా... తనని నమ్ముకున్న 1200 మంది తోటి శిల్పులను కాపాడుకోవాలా? ఆ తండ్రి పడుతున్న నరకప్రాయమైన వేదన వర్ణనాతీతం. తండ్రి కళ్లలో కురుస్తున్న ఆ నెత్తుటి కన్నీరే... ధర్మపదుడిని ఓ కఠోరమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. తన వల్ల తన తండ్రి, మరో 1200 మంది శిల్పులూ ప్రాణాలు కోల్పోవడం, ఆ పసి మనసుకు ఇష్ట పడ లేదు.

ధర్మపదుడు నిర్ణయించుకున్నాడు. 1200 మంది ప్రాణాలు కాపాడటం కోసం, తన ప్రాణాన్ని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. గుడి అత్యున్నత శిఖరం పైకి చేరుకున్నాడు పసివాడు. చివరిసారిగా, ఉదయిస్తున్న సూర్య భగవానుడికి నమస్కరించాడు.

"నాన్నా... నా జన్మ ధన్యమైంది. 1200 మంది ప్రాణాల ముందు నా చిన్ని ప్రాణం ఎంత?" అంటూ... కన్నీరు కారుస్తున్న తండ్రిని కడసారి చూసుకుని, ఆలయం పైనుండి కింద ప్రవహిస్తున్న చంద్రభాగా నదిలోకి దూకేశాడు.

ఆకాశం మూగబోయింది. సముద్రం స్తంభించిపోయింది. కోణార్క్ ఆలయం కోసం ఒక మహా శిల్పి తన నెత్తురును ధారపోశాడు. చంద్రభాగా నది అలలలో, ఆ 12 ఏళ్ల పసివాడు శాశ్వతంగా కనుమరుగయ్యాడు.

ధర్మపదుడి ఆత్మబలిదానం తర్వాత... ఆ చంద్రభాగా నది ఎరుపెక్కింది. అప్పటివరకు ఉత్సాహంగా సాగిన నిర్మాణ పనులు ఒక్కసారిగా మూగబోయాయి. ఒక పసివాడి రక్తం చిందిన చోట దేవుడు ఎలా కొలువై ఉంటాడు? ఆ ప్రదేశం అపవిత్రమైందని పండితులు నిర్ధారించారు.

ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సూర్య దేవాలయం అది. కానీ, విచిత్రం ఏమిటంటే... ఆ గుడిలో ఒక్కరోజు కూడా, ఒక్కటంటే ఒక్క పూజ కూడా జరగలేదు! ఆ గాలిలో తేలే సూర్య విగ్రహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూరీ జగన్నాథుని ఆలయంలోని ఒక రహస్య గదిలోకి తరలించారని చరిత్రకారులు చెబుతారు. 12 ఏళ్లు, 1200 మంది శ్రమ, రాజు ఆశయం... అన్నీ ఆ 12 ఏళ్ల బాలుడి రక్తపు మడుగులో కొట్టుకుపోయాయి. దేవుడి కోసం కట్టిన గుడి... చివరికి ఒక పసివాడి సమాధిగా మిగిలిపోయింది. కాలక్రమంలో ఆ అయస్కాంత శిల తొలగించబడింది. ఆలయం కొంతమేర శిధిలమైంది.

కానీ ఈ రోజుకీ, ఒడిశాలో ఏ తల్లిని అడిగినా, ధర్మపదుడి కథను కన్నీళ్లతో వివరిస్తుంది. నేటికీ భువనేశ్వర్ లోని 'మధుసూదన్ దాస్ పార్క్' లో ధర్మపదుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. అతను కేవలం ఒక శిల్పి కాదు... త్యాగానికీ, బాధ్యతకూ, నిస్వార్థ ప్రేమకూ నిలువెత్తు రూపం.

చరిత్ర పుటల్లో పేర్లు లేకుండా పోయిన ఇలాంటి ఎంతోమంది గొప్ప వ్యక్తుల త్యాగాల పునాదుల మీదే, మన భారతదేశ సంస్కృతి నిలబడి ఉంది.

ఈ వీడియో మీకు నచ్చితే, ఆ చిన్నారి ధర్మపదుడి త్యాగానికి గుర్తింపుగా ఒక లైక్ చేయండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరికీ షేర్ చేయండి. మన చరిత్రను, అందులోని నిగూఢ సత్యాలను తెలుసుకోవడానికి 'వాయిస్ ఆఫ్ మహీధర్' ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.

మరో అద్భుతమైన మిస్టరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను...

జై హింద్! వందే మాతరం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...