భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu


అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుత నీతి కథ!

మహాభారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలున్నాయి. ధర్మరాజు సందేహాల నివృత్తి కోసం, భీష్మపితామహుడు వివరించిన కథలు నేటికీ అనుసరణీయమే. అయితే, ఈ రోజు మనం తెలుసుకోబోయే కథకు, ఒక ప్రత్యేకత ఉంది. మామూలుగా మనం విన్నవీ, చదివినవీ, అంపశయ్య మీదున్న భీష్ముణ్ణి ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, భీష్ముడు చెప్పిన కథలను. ఈ కథను మాత్రం, ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే, తనంతట తానుగా తెలియజేశాడు భీష్మపితామహుడు. భారతీయుల చారిత్రక గ్రంధమైన మహాభారత కావ్యం, శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వం అనే ఉప పర్వంలో, 137వ అధ్యాయంలో, 24వ శ్లోకంలో ఉన్న ఈ కథతో, కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి? ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి? అనే అంశాలను అనుసంధానించి, భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు...

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HB27utkLXCo ]



ఈ కథ ఒకరకంగా, ప్రస్తుతం మన దేశంలో నెలకొని ఉన్న Secular పరిస్థితులకూ వర్తిస్తుంది. అది ఎలా అనేది అన్వయించుకుని, మీకేమనిపించిందో, మీ అభిప్రాయాలను Comment ద్వారా తెలియజేయండి.

ఒక చెరువులో మూడు చేపలుండేవి. దీర్ఘదర్శీ, ప్రాప్తకాలజ్ఞుడూ, దీర్ఘసూత్రుడనేవి వాటి పేర్లు. ముగ్గురి ఆలోచనలూ, నడవడికలూ వేరైనా, అవి మంచిమిత్రులు. నీరు నిండుగా ఉండి, చెరువు చల్లగా ఉండడంతో, హాయిగా కాలం గడిపేవవి. అయితే, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! వర్షాకాలం గడిచింది. శీతకాలం గడిచింది. ఇక ఎండాకాలం రానే వచ్చింది. ఎండాకాలం వస్తూనే, వేడి నిప్పులను చెరిగింది. ఎండ వేడిమికి వడగాడ్పులు తోడవడంతో, చెరువు ఎండి పోసాగింది. రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు, దీర్ఘదర్శి. మిత్రులిద్దరినీ పిలిచి, ఇలా చెప్పాడు. ‘చూశారుగా మిత్రులారా! ఈ ఏడు ఎండలు విపరీతంగా ఉన్నాయి. రోజు రోజుకీ చెరువు ఎండిపోతున్నది. ఎండిపోయిన చెరువులో మనం ఉండడం, ప్రమాదకరం. పైగా, ఈ చెరువుకీ, ఇంకో చెరువుకీ పల్లంలో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో, మన బ్రతుకే ప్రశ్నార్థకమవుతుంది. అందుకని ముందుగా మనం మేల్కోవడం మంచిది. కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడం, శ్రేయస్కరం.

’’దీర్ఘదర్శి ఆలోచనా, ఆందోళనా విన్న స్నేహితులిద్దరూ నవ్వుకున్నారు. వారిలో ప్రాప్తకాలజ్ఞుడు వెక్కిరింపుగా, ‘‘మొదలుపెట్టావా? ఎండాకాలం ప్రారంభమయింది, ఇంకా మొదలుపెట్టలేదేమిటా అని చూస్తున్నాను’ అని పగలబడి నవ్వి, ‘‘అన్నింటికీ ముందే భయపడకూడదు మిత్రమా! ప్రమాదం అని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకడం, దుఃఖ దాయకం. ప్రమాదం ముంచుకొస్తే, అప్పుడు ఆలోచిద్దాము. అప్పటిదాకా హాయిగా ఉండు. లేనిపోని భయాలు పెట్టుకోకు’’ అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. వెంటనే దీర్ఘసూత్రుడు మాట్లాడుతూ,‘‘ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడెండిపోయింది చెరువు? సముద్రంలా చల్లగా ఉంటేను. ప్రతి సారీ ఎండాకాలం వస్తుంది, ఆ తరువాత వర్షాకాలం వస్తుంది. అయినా ఇప్పుడప్పుడే ఈ చెరువు ఎండిపోదు. మనకే ఆపదా రాదు. తిని తిరక్కుండా, ఎందుకీ భయాలు’’ అని, దీర్ఘదర్శి మాటలను, వారిరువురూ కొట్టి పారేశారు. 

తన మాట వినిపించుకోని మిత్రులిద్దరినీ జాలిగా చూశాడు, దీర్ఘదర్శి. ఇక అక్కడ ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదనుకుని, పల్లంలో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి, వేరే చెరువుకు చేరుకున్నాడు. కొద్ది రోజులు గడిచాయి. దీర్ఘదర్శి చెప్పినట్లు, చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకి పోసాగింది. అది గమనించిన జాలరులు చేపల వేటకు సిద్ధమయ్యారు. నీరు సరిగాలేని ఆ చెరువులో, జాలరులకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి. దొరికిన చేపలను తాటినారకు గుది గుచ్చి, మళ్ళీ మరిన్ని చేపల కోసం చెరువును అల్లకల్లోలం చేయసాగారు. ప్రాప్తకాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి, ఒక పథకాన్ని ఆలోచించాడు. ‘జాలరి చేతికి చిక్కితే, ఇక అంతే సంగతులు. అందుకని ఇప్పుడు ఎంచక్కా తాటి తీగను నోటితో కరచి పట్టుకుని, చచ్చిన దానిలా వ్రేలాడతాను. పట్టిన చేపల మట్టిని వదిలించేందుకు, జాలరి ఎప్పుడయితే మంచి నీటిలో చేపలన్నిటినీ ముంచి తీస్తాడో, అప్పుడు అదే అవకాశంగా, నీటిలోకి జారుకుంటాను. అక్కడి నుండి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకుని, ఈ ప్రమాదాన్నించి తప్పించుకుంటాను’ అని ఆలోచించి, తన పథకాన్ని అనుకున్నట్టుగానే చేశాడు. చేపల గుత్తిని కరచి పట్టుకుని, చచ్చినట్టు నటించాడు ప్రాప్తకాలజ్ఞుడు.

జాలరి మరిన్ని చేపలను పట్టుకుని, అక్కణ్ణుంచి ముందుకు నడిచాడు. బురదలేని, తేటనీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు. అలసిపోయాడేమో! దాహమనిపిస్తే, దోసిట నీరు పట్టి త్రాగాడు. తర్వాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు. చేపలన్నీ బురద బురదగా ఉన్నాయి. వాటి బురదను పోగొట్టేందుకు, చేపల గుత్తిని మంచి నీటిలో ముంచి తీశాడు. జాలరి గుత్తిని ముంచడమే ఆలస్యం. ప్రాప్తకాలజ్ఞుడు చల్లగా నీటిలోకి జారుకుని, తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీర్ఘసూత్రుడు మాత్రం, దీర్ఘదర్శిలా ముందే మేల్కొనకుండా, ప్రాప్తకాలజ్ఞుడిలా తగిన సమయానికి, తగిన విధంగా ప్రవర్తించకుండా, ‘ఆఁ! ఏం కాదులే’ అనుకుంటూ రోజులు గడిపేసి, చివరకు జాలరి వలకు చిక్కి, చనిపోయి, మరొకరికి ఆహారమయిపోయాడు’’.. ఈ కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది..

ప్రాణం మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులూ, రాగల ఆపదను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులూ, దీర్ఘసూత్రునిలా ప్రమాదంలో చిక్కుకుని, మరణిస్తున్నారు. నేను తెలివి గలవాడిని, అవసరం వచ్చినపుడు ఆలోచించుకోవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండేవాడు, ప్రాప్తకాలజ్ఞుడిలా, ప్రాణసంకటంలో పడతాడు. రాగల ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన దీర్ఘదర్శిలాంటి జాగ్రత్తపరులు, చీకూ చింతా లేకుండా, హాయిగా, సుఖంగా ఉండగలుగుతారు.’’ అని భీష్ముడు ధర్మరాజుకు, తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏవిధంగా నిర్వర్తించాలో,  తెలియజేశాడు.

ఈ కథను మన పాఠ్యాంశాలలో, ప్రాథమిక స్థాయి తరగతులలో, చదివే ఉంటాము. అయితే, ఈ కథ భారతంలో ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఈ కథలోని దీర్ఘదర్శి, రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి, ఆపద రాకముందే సురక్షితంగా బయట పడాలనే నీతిని తెలుపుతోంది. ఈ పద్ధతి ఉత్తమమైనది. ఎలాంటి భయం, ఆందోళనా లేకుండా, ప్రశాంత జీవనం గడపడానికి, ఇది పనికి వస్తుంది. అపాయం ఎదురైనప్పుడు, ఉపాయంతో బయట పడడం, మధ్యమం. ఈ పద్ధతిలో, అపాయం నుంచి బయట పడేవరకూ, ప్రాణాలు అరచేతిలో చిక్కబట్టుకోవాలి. అపాయం నుంచి తప్పించుకోవడానికి, మన ఉపాయం నెరవేరుతుందో లేదో, తెలియదు. అందువల్ల, దాని కంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది. ఒక వేళ ఏ కారణం చేతనైనా మొదటి పద్ధతిని పాటించలేకపోతే, ప్రాప్తకాలజ్ఞుడిలా రెండవ పద్ధతి ద్వారా, ప్రాణాలు కాపాడుకోవాలి. ఈ రెండు పద్ధతులూ పాటింపని సోమరిలా ఉంటే, దీర్ఘసూత్రుని లాగా నశించిపోవలసి వస్తుందనే చక్కని నీతిని, ఈ కథ ద్వారా భీష్మపితామహుడు, ధర్మరాజు తోపాటు, మనందరికీ తెలియజేశాడు.

ఏ విషయమైనా, మన దాకా వచ్చిన తరువాత చూసుకుందాములే.. అని తాత్సారం చేసి, భావితరాలను ముంపుకు గురిచేయకుండా, సరైన నిర్ణయాలను తీసుకుని, జాగ్రత్త పడదాము. సనాతన ధర్మాన్ని మించిన ధర్మం లేదు..

సర్వం కృష్ణ మయం!

Comments

Popular posts from this blog

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur