Audi9 – Telugu Mythology & Temple History Stories | Voice of Maheedhar (Planet Leaf), Shadow Madhu Babu Audiobooks, Facts Hive Youtube Channels. Here I bring you Bhagavad Gita in Telugu, Stories of Mahabharata, Ramayana, Science behind Sanatana Dharma, Hinduism, Interesting and Unknown Facts and Mysteries in Telugu, and Writer Madhu babu's Shadow, Folklore, Fantasy Fiction Novels as Audiobooks / Podcasts. Watch interesting videos Every Day in the original Voice of Maheedhar and Sudha..
ఈ రోజు 'మాస శివరాత్రి'.. ఎందుకు? ఎలా జరుపుకోవాలి? TELUGU VOICE
ప్రతి నెలా అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్ధశి తిధిని, మాస శివరాత్రిగా జరుపుకుంటాము. అసలు శివరాత్రి అంటే శివుడి జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం. శివుని జన్మ తిధిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి.
మహా శివుడు లయ కారకుడు. కనీనికా నాడీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, లయానికి (మృత్యువుకు) కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. 'చంద్రోమా మనస్సో జాతః' అనే సిద్దాంతం ప్రకారం, చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడు, జీవుల పై ఈ కేతు ప్రభావం ఉండటం వలన, వారి వారి ఆహారపు అలవాట్ల పై ప్రభావం చూపడం వలన, జీర్ణ శక్తి మందగిస్తుంది. తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఈ సమయంలో మానసికంగా సంయమనాన్ని కోల్పోవడమో, చంచల స్వభావులుగా మారడమో, మనోద్వేగముతో తీసుకో కూడని నిర్ణయాలు తీసుకోవడమో జరిగి, కొన్ని సమయాలలో తమకే కాకుండా, తమ సమీపంలో ఉన్న వారి యొక్క మనస్సు, ఆరోగ్యం, ధనం, ప్రాణాలకు సైతం హాని తలపెట్టే ప్రయత్నం, తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనం గమనించవచ్చు.. అమావాస్య తిధి ముందు ఘడియలలో కొందరి అనారోగ్యం మందగించండం, లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు.
కాబట్టి, ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా, లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా, మనం అవకాశం ఉన్నంత మేర, ప్రతి మాసమూ ఈ మాస శివరాత్రిని జరుపుకోవలసిన అవసరం ఉంది.
మాస శివరాత్రిని శాస్త్రయుక్తంగా ఎలా జరుపుకోవాలి?
ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసముండి, సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత స్నానాధికాలు ముగించుకుని, దగ్గరలోని శివాలయ దర్శనం చెయ్యాలి. అవకాశం ఉన్న వారు, వారి శక్తి మేర 5, 11, 18, 21, 56, 108, ఇలా ప్రదక్షణాలు చేయవచ్చు. అలాగే, ఈ రోజు శివాలయంలో పూజలో ఉంచిన చెరకు రసాన్ని భక్తులకు పంచడం వలన, వృత్తి అంశములో ఇబ్బందులను ఎదుర్కొనే వారికి అటువంటి ఆటంకాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే, ఈ రోజు ప్రదోష వేళ శివుడికి మారేడు దళాలతో, లేదా కనీసం గంగా జలంతో అభిషేకాది అర్చనలు చేయడం మంచిది. ఇవేవీ చేయడానికి అవకాశం లేని వారు, ఆరోగ్యవంతులు, అలాగే గృహంలో అశుచి దోషం లేని వారు, ఈ రోజు ఉపవాసముండి, మూడు పూటలా చల్లటి నీటితో వీలయినంత ఎక్కువ సమయం స్నానం చెయ్యాలి. మంచం మీద కాకుండా నేలపై పవళించాలి.
మాస శివరాత్రిని జరుపుకోవడం వలన కలిగే ఉపయోగాలు!
ప్రత్యేకించి ఈ రోజును సశాస్త్రీయంగా జరుపుకోవడం వలన, మన జాతకములోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది. సంతానలేమి సమస్యలనుండి విముక్తి లభిస్తుంది. వృత్తి అంశంలో ఉన్న ఆలస్యాలు , అవరోధాలు అంశంలో మార్పు కలుగుతుంది. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మొండిగా, పెంకిగా, బద్దకంగా, మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల చేత, వారి తల్లిదండ్రులు ఈ రోజు ఉపవాసమును చేయించి, దేవాలయానికి వెళ్ళే అలవాటు చేయించగలిగితే, వారిలో కాలక్రమంగా, ఖచ్చితంగా మార్పు వస్తుందని భావించవచ్చు. మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
కాబట్టి, ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి అవకాశం ఉన్నంత మేర, ప్రతి మాస శివరాత్రినీ సశాస్త్రీయంగా జరుపుకోవడం ద్వారా శుభాలను పొందవచ్చు..
ఆత్మ తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందు, తండ్రి శరీరంలో 3 నెలలు ఉంటుందా? జీవుడి 5 శరీరాలేమిటి?
సైన్స్ పరంగా మానవుడు ఎంతో పురోగతి సాధించినప్పటికీ, కొన్ని విషయాలు ఎప్పటికీ మన చేతులలో ఉండవు. అటువంటి వాటిలో చావు పుట్టుకలు ఒకటి. శాస్త్రాల పుణ్యమా అని, జనన మరణ వలయాన్ని గురించి కూడా సైన్స్ పరంగా కొంత తెలుసుకోగలిగాడు మానవుడు. మనిషి తల్లి గర్భం నుంచి బయటపడి జన్మనెత్తుతాడనేది, అందరికీ కనిపించే యధార్థమే! అలా కనిపించని యధార్థం మరొకటి వుందని మీకు తెలుసా!? మనిషి పుట్టడానికి ముందే, అంటే, 270 రోజులకు పూర్వమే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి, జన్మించడం జీవితానికి మొదలు కాదు. తల్లి గర్భంలో ప్రవేశించడమే ప్రారంభము. మనిషి, జన్మనెత్తడానికి పూర్వ దశ పిండ రూపంగా వున్నట్టే, శరీరంలోకి ప్రవేశించక ముందు కూడా, ఈ జననానికి పూర్వ దశ ఒకటుంది..! చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
మనిషి మరణించిన వెంటనే శరీరాన్ని విడిచిపెట్టి బయటికి పోతున్నాడు. అంటే, మనిషి శరీరాన్ని విడిచిపెట్టి బయటపడ్డాక, కంటికి కనిపించని అపర దశ ఒకటి వుంది. ఆ దశలో, జీవాత్మ స్థితిలో, శరీరం లేకుండా గాలిలో సంచరిస్తుంటుంది. ఆ స్థితిని గురించి సైన్స్ కు ఏమీ తెలియదు. అప్పుడే మరణించిన జీవాత్మలను, Kirlian Photography ద్వారా ఫోటోలు తీసిన కొందరు విదేశీ సైంటిస్టులు, తమ పరిశోధనల ద్వారా, శరీరం లేని జీవాత్మలు ఎలా వుంటాయో కనుగొనడానికి ప్రయత్నించారు.
మన ప్రాచీన వేద ఋషులు, యోగాభ్యాసం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టి, 'పరకాయ ప్రవేశం', అంటే, ఒక శరీరంనుంచి బయటకువచ్చి, ఇంకొక శరీరంలోకి ప్రవేశించడమనే యోగ ప్రక్రియ సిద్ధిని పొందారు. ఈ పరకాయ ప్రవేశ విద్య లాగానే, సామాన్య మానవుడు నిద్రావస్థలో మరణించి, అపస్మారక స్థితి అంటే, Coma లో, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు గనుక, అలాంటి వాడు తెలుసుకో లేని పునర్జన్మ విజ్ఞానమే, వేదాలూ ఉపనిషత్తులూ తెలిపే ‘పునర్జన్మ రహస్యము’. అదేమిటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము.
మనిషి బ్రతికి వున్నప్పుడు, మనకు బైటికి కనిపించే ఆకారాన్ని, స్థూల శరీరం, లేదా Material Body అంటాము. అంటే, ఒక పదార్థంతో తయారైన శరీరమని అర్ధం. ఇది మనం తినే ఆహారంతో ఏర్పడుతుంది గనుక, అన్నశరీరం లేదా అన్నమయకోశం అంటాము. మరణించే సమయంలో మనిషి, ఈ అన్నమయ శరీరాన్ని వదిలేస్తాడు. సాధారణంగా మనం ఎలాగైతే స్నానం చేసి బట్టలు మార్చుకుంటామో, మరణాసన్న సమయంలో, అంటే, ఈ భూలోక యాత్రను ముగించే సమయంలో, శరీరాన్ని ఇక్కడే వదిలేసి, లోపలి జీవుడు బయటికి వస్తున్నాడు. అలా, మరణించాక బయటకు వచ్చే జీవాత్మను, ప్రాణమయ శరీరం అంటారు. అంటే, ఇది మనలోని ప్రాణశక్తితో తయారైన శరీరము.
ఈ ప్రాణమయ శరీరాన్ని, సెంయోన్ కిర్ణియన్ (Semyon Kirlian) అనే రష్యన్ సైంటిస్ట్, తాను కనిపెట్టిన ప్రత్యేక Camera ద్వారా, మరణించిన వారి శరీరాలనుంచి బయటకు వచ్చే జీవాత్మలనూ, వాటి చుట్టూ ప్రకాశించే ప్రాణ శక్తినీ ఫోటోలు తీసి, వివరించాడు. ఈ ప్రాణమయ శరీరమే, మనం అనుభవించే నొప్పులకూ, శరీర సౌష్టవానికీ కారణమయిన జీవాత్మ. అంటే, మనం ఎదుర్కొనే ఆకలి దప్పులూ, నీరసమూ, పుష్టీ, ఆరోగ్యమూ, అనారోగ్యమూ, శారీరక సుఖ దుఃఖాలూ, మొదలైన అనుభూతులన్నీ అనుభవంగా తెలిసేది, ఈ ప్రాణమయ శరీరం వల్లనే. ఇందుకు science పరంగా చెప్పుకోదగిన ఒక ఉదాహరణ, సహజంగా డాక్టర్లు ఆపరేషన్ చేసే ముందు, Patient కి Anesthesia అంటే, మత్తు మందు ఇస్తారు. అలా చేయడం వలన వారు, వారికి తెలియకుండానే ఈ ప్రాణమయ శరీరాన్ని వేరు జేస్తున్నారు. అందుకే Patient కి ప్రాణమయ శరీరం తెలిపే నొప్పి, బాధ, లేక ఏం జరుగుతున్నదో తెలిసే స్పృహ నశించిపోయి, అపస్మారక స్థితి కలుగుతోంది. ఇదే, మనిషి మరణించి, స్థూలశరీరం నుండి బయటపడే జీవము. దీనినే ఆత్మ, దయ్యం, లేక ప్రేతమని కూడా అంటాము.
మనిషి మరణించిన తరువాత రెండవ దశలో, ఈ ప్రాణమయ శరీరాన్ని కూడా వదిలి, తన ఆలోచనలూ, జ్ఞాపకాలూ, అనుభూతులూ నెమరు వేసుకునే మనోమయ శరీరంతో బయటకు వస్తాడు. ఇది మనిషి స్థూల శరీరం లోపల, ప్రాణమయ శరీరంలో నిగూఢంగా ఉంటుంది. ఉల్లి పొరల లాగా, మనిషి మరణానంతరం, ఈ శరీరాలు ఒక్కొక్కటీ బయట పడతాయి. మనోమయ శరీరాన్ని కూడా వదిలి జీవుడు బయటకు రాగానే, అంతవరకూ తాను ఆ జీవితంలో అనుభవించిన సంఘటనలూ, సుఖ దుఃఖాలూ, వాటికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ మరచిపోతాడు. అయినా ఆ మనోమయశరీరాన్ని యోగులు తమ దివ్యదృష్టితో వీక్షించి, మరణించిన జీవుడి పూర్వ జన్మ చరిత్రనంతా చదవ గలరు. నాడీ గ్రంధాలలోని పూర్వజన్మ చరిత్ర కూడా, అలాగే తెలుస్తుంది. మనోమయ శరీరాన్ని విడిచి బైటకు వచ్చిన జీవుడు, గతాన్ని మరచి పోతాడనే విషయాన్నే, విరజానదిని దాటడంతో గతం గుర్తులు నశిస్తాయని, మన సనాతనధర్మ గ్రంధాలలో తెలిపిన సత్యం..
ఇక మనోమయ శరీరం లోపల వుండే నిగూఢమైన 'జీవాత్మ'నే, ‘విజ్ఞానమయ శరీరం’ అంటారు. ఇది ప్రతి జన్మలోని అనుభవాలను సేకరించి, ఆ జన్మలో మనం అనుభవించిన సుఖ దుఃఖాలూ, సంఘటనలూ, వ్యక్తులూ, శత్రుత్వ మిత్రత్వాదుల వంటి జ్ఞాపకాలనూ విడిచి పెట్టి, అనుభవాల సారమైన జీవిత గుణపాఠాన్ని మాత్రం తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఈ అనుభవం దృష్ట్యా, తను పుట్టబోయే మరుజన్మలో ఏ రూపాన్ని పాందాలో, ఆ జీవాత్మయే నిర్ధారించుకుంటుంది. అంటే పై మూడు శరీరాలూ గతజన్మకు సంబంధించిన అనుభవాలకు ముద్రితాల వంటివి. విజ్ఞానమయ శరీరం మాత్రం, ఆ అనుభవాల సారాన్ని తీసుకుని, తిరిగి జన్మించే మనలోని సిసలైన జీవాత్మ, అంటే, Individual Soul. అయితే, వేదాలూ ఉపనిషత్తులూ ఉపదేశించేది, ఈ జీవాత్మ కూడా అనేక జన్మల పరిణామక్రమంలో, సక్రమంగా గనుక ముందుకు సాగితే, పొదగబడిన కోడిగుడ్డు పగిలినప్పుడు, అందులోనుంచి చైతన్య మయమైన కోడి పిల్ల వచ్చినట్టే, అజ్ఞానమనే జీవస్థితి పగిలి, అందులోనుంచి అంతర్యామి, లేక ఈశ్వరుడుగా ప్రస్తావించే, దైవ స్వరూపుడైన భగవదంశతో కూడుకున్న దివ్య స్వరూపం వెలికి వస్తుంది.
ఆ స్థితిలో ఇక మరి జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు. ఆ స్థితిని చేరుకునేలోగా, జీవాత్మ ఎత్త వలసిన అనేక జన్మలూ, పాంద వలసిన అనుభవాలూ, సుఖ దుఃఖాలన్నిటినీ అనుభవించాల్సింది, ఈ విజ్ఞానమయ శరీరం, లేక జీవాత్మయే!
ఈ జీవాత్మయే, మరణించిన చాలా కాలానికి, తిరిగి బయట ఆకాశంలోకి ప్రవేశిస్తుంది. ఆకాశంలోని విద్యుత్తులో లీనమై పైకి ప్రయాణించి, చంద్రుడిలోనూ, సూర్యుడిలోనూ ప్రవేశించి, కొంత కాలానికి తిరిగి క్రిందకు ప్రయాణం చేస్తుంది.
మళ్ళీ సూర్యుని నుండి చంద్రునికీ, చంద్రుడిలోనుంచి ‘మెరుపు’ అంటే విద్యుత్తులోనికీ, వర్షపు బిందువులలోనికీ, తరువాత ప్రాణ చైతన్యంగా మొక్కలకూ, వాటిని తినే పశు పక్ష్యాదులకూ, ఆ పశువుల పాలను త్రాగే మానవ శరీరంలోకీ, అలా ప్రాణ స్వరూపంగా ప్రవేశిస్తుంది. ఈ ప్రాణ కళ, ముందుగా పురుషుడి శరీరంలో ఏర్పడి మూడు మాసాలుండి, అతడి సహస్రారం నుండి ఆజ్ఞాచక్రంలోకి దిగుతుంది. సంకల్పాలకు స్థానమైన ఆజ్ఞాచక్రంలోనుంచి, అభిమాన స్థానమైన హృదయంలోకి ప్రవేశించి, భార్యాభర్తల ప్రేమశక్తి ద్వారా భార్య హృదయంలోకీ, నాభి వద్ద మణిపూరక చక్రంలోకీ ప్రయాణించి, తల్లి యొక్క కుండలినీ శక్తి ద్వారా, ఆమె గర్భంలో ఒక శరీరాన్ని నిర్మాణం చేసుకుంటుంది.
అందుకే ఈ పునర్జన్మల చక్రానికి చంద్రుడూ, సూర్యుడూ ముఖ్యమైన సంబంధం. సూర్యుడికీ, చంద్రుడికీ మధ్య ఏర్పడే నక్షత్రాలూ తిథుల వల్లనే, మన జన్మ కాలంలోని తిథులూ, రాశి చక్రమూ, మన జీవితంలో రాగల ఫలితాలను సూచించే దశలూ, మన జన్మ నక్షత్రం నుంచే ఏర్పడుతున్నాయి. అందుకే మన సనాతనధర్మంలో, మనిషి పుట్టిన రోజు పండుగ అయిన నక్షత్రానికీ, మరణించిన తిథి నక్షత్రానికీ సంబంధించిన సంవత్సరీక, శ్రాద్ధ కర్మకూ, జీవునికీ, సంబంధం చెప్పబడింది. ఈ జన్మ నక్షత్రం, రాశి ద్వారానే, మన మహర్షులు యోగదృష్టి ద్వారా చూసి, ఆ జీవుని గత జన్మనూ, రానున్న జన్మలనూ, నాడీ గ్రంధాలలో ముందుగానే వ్రాసి పెట్టారు. దీనివల్ల జాతకంలోని గ్రహస్థితులకూ, ఆకాశంలో అవి ఏర్పడ్డ సమయానికీ, జీవుడు తల్లి గర్భం నుండి జన్మించే గ్రహస్థితికీ, జాతకంలో ఎందుకంత ప్రాముఖ్యత వున్నదో బోధపడుతుంది.
అలా తండ్రి శరీరంలో మూడు నెలలూ, తల్లి శరీరంలో 9 నెలలూ గడిపి, మొత్తం 12 రాశుల చక్రంలో జీవుడు ప్రయాణిస్తున్నాడు. ఇది, క్లుప్తంగా జనన మరణ చక్రం. దీనిని జాగ్రత్తగా విని అర్ధం చేసుకుంటే, అనేక రహస్యాలు బోధ పడతాయి.
కృష్ణుడు తనువు చాలించే ముందు చెప్పిన ఆఖరి మాటలేంటి?
కడలి లోతులను గుర్తుకు తెచ్చేటంతటి చరిత్రగల మహాభారత గాధలలో, నేటికీ మనలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు నిబిడీకృతమై వున్నాయి. అటువంటి వాటిలో ఒకటి, ఆ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన చివరి మాటలు. ఆ స్వామి అవతార పరిసమాప్తికి ముందు చెప్పిన కొన్ని విషయాలు, ఆశ్చర్యం కలిగించక మానవు. ఇది ఆయన చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత ఇక ఆయన మాట్లాడ లేదు. ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు. ఇంతకీ శ్రీకృష్ణ పరంధాముడు చెప్పిన ఆ చివరి పలుకులేంటి? చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
‘ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’ అని చెప్పినట్లుగా, సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువే దిగివచ్చి, ద్వాపర యుగంలో కృష్ణావతారాన్ని ఎత్తిన విషయం తెలిసిందే. మానవ జన్మ అయినప్పటికీ, పుట్టినప్పటి నుంచీ ఒక పక్క ఎన్నో మహిమలను చూపుతూ, మరోపక్క అందరితో కలివిడిగా తిరగడం, తోటి స్నేహితులతో ఆటలాడటం, కొంటెపనులు చేయడం వంటి కార్యాలు చేస్తూనే వున్నాడు. అందువల్ల ఆయనంటే బృందావన వాసులు పంచ ప్రాణాలూ ఒడ్డే వారు. అటువంటి వారిలో, శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడు కూడా ఒకడుగా చరిత్ర చెబుతోంది. ఉద్ధవుడు వృష్ఠి వంశానికి చెందినవాడు. ఆయన సాక్షాత్తు దేవతలకు గురువైన బృహస్పతికి ప్రియ శిష్యుడు కూడా అని, భారతం చెబుతోంది. శాస్త్ర విజ్ఞానంలో మహా జ్ఞానిగా పేరు తెచ్చుకున్న ఉద్ధవుడు, శ్రీకృష్ణ పరంధాముడు రాజుగా పట్టాభిషక్తుడయిన కొద్ది రోజులకే, మథురా నగారానికి చేరుకున్నాడు. అప్పటి నుంచీ ఉద్ధవుడు కృష్ణ భగవానుడికి ఆంతరంగికుడిగా, ఆయన మంత్రులలో ఒకడిగా ఉండేవాడు.
కురుక్షేత్ర యుద్ధం తర్వాత, గాంధారి శాప ప్రభావంతో ద్వారకలో అనర్ధాలు సంభవిచడం కృష్ణ భగవానుడు గమనించి, ఇక తన అవతారం చాలించే సమయం ఆసన్నమయిందని నిర్ణయించుకున్నాడు. అంతంలో తాను చక్కబెట్టవలసిన కార్యాలన్నీ ముగించుకుని, తుది ప్రయాణానికి సిద్ధమవుతున్న సమయంలో, ఆయన చిన్ననాటి స్నేహితుడైన ఉద్ధవుడికి కబురు బెట్టాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వచ్చి, ‘మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, కలిసి తిన్నాము, సంతోషంగా గడిపాము. అటువంటిది నీ అవతారం పరిసమాప్తమవుతోందంటే, జీర్ణించుకోలేక పోతున్నాను కృష్ణా. నాదొక ప్రార్థన.. నా మనస్సు శాంతించేటట్లూ, నిరంతరమూ నీతోనే ఉండిపోయేటట్లూ ఏదయినా ఉపదేశం చేయి’ అని ప్రార్థించాడు. దానికి పరంధాముడు చిరు దరహాసంతో, మనుష్యులు జీవితంలో పాటించవలసిన నియమాలనూ, రాబోయే కలియుగం యొక్క స్వరూపాన్నీ, భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలనూ ముందుగానే ఉద్ధవుడితో చెప్పాడు. ఆ పలుకులే కృష్ణావతారంలో చివరి పలుకులని భాగవతం 10వ స్కంధంలో ఉంది.
పరమాత్ముడు ఉద్ధవుడితో చెప్పిన ఆ చివరి మాటల ప్రాకారం, ‘నేటికి సరిగ్గా ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవ రాత్రి లోపు ద్వారకా నగరం మొత్తం కడలి గర్భంలో కలిసి పోతుంది. దానితో ద్వారక వాసులందరూ మృత్యువు పాలవుతారు. ఆ తరువాత కలి ప్రవేశంతో కలియుగం ప్రారంభమవుతుంద’ని శ్రీ కృష్ణుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. కలియుగం ప్రారంభం కాగానే, కలి ప్రభావం మనుషులపై చూపడం మొదలై, మానవులలో అపారమైన కోర్కెలూ, విపరీతమైన కోపం పెరిగిపోతాయనీ, కలియుగంలో ఎవ్వరూ తమ తప్పులను తాము తెలుసుకునే ప్రయత్నం చేయక, ఈ రెండు కారణాల వల్లా వివిధ రోగాలకు గురై, వారి ఆయుర్దాయం క్రమక్రమంగా క్షీణించి పోతుందని, శ్రీకృష్ణుడు చెప్పాడు..
అలాగే, కలియుగంలో మనుష్యులకు వేదాలపై అవగాహన పూర్తిగా నశించిపోయి, వేద ప్రోక్తమయిన భగవన్మూర్తులను మరచి పోతారు. అందువల్ల వారు చేసే పూజలకు అర్ధం పర్ధం లేకుండా పోతుంది. దానిని అలుసుగా తీసుకుని, అవన్నీ మూఢ నమ్మకాలని చెప్పే వర్గాలవారు తయారవుతారు. వారిని నమ్మి చాలా మంది వేద విహిత కర్మలను విడిచి పెట్టేస్తారు. వేదాల చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పూజించ వద్దని చెప్పిన మాటలు బాగా రుచించి, కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలి, తమంత తాముగా పాషండ మతాలను కౌగలించుకుని, అభ్యున్నతిని విడిచి వేరు మార్గాలలోకి వెళ్ళి పోతారు.
పూజలు తమ మనస్సును సంస్కరించు కోవడానికీ, ఆచారాలు తమంత తాము పాటించడానికీ ఏర్పడినవి. తక్కువ పదార్ధాలను తిని శరీరాన్ని నిలబెట్టుకుని, మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని, ఉపవాసమనే ఆచారం వచ్చింది. కలియుగంలో రానురానూ ఆచారాలను విడిచి పెట్టేయడానికే, ప్రజలు ఇష్ట పడతారు. ఆచారం లేని పూజ చేయడానికే సుముఖత చూపెడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏవేవి ఉంటాయో, వాటిపై మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోలేరు.
అంతః శ్శుద్ధి ఉండదు, చిత్త శుద్ధి ఏర్పడదు. ఆచారాలనూ, సంప్రదాయాలనూ విడిచిపెట్టిన పూజలపై మక్కువ చూపించి, అటు మొగ్గుజూపడం ప్రారంభిస్తారు. మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానేసి, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే, ఏ పూజజేస్తే ఆచారం అవసరంలేదని ప్రచారం ఉంటుందో, అటు వైపుకే అడుగులు వేస్తారు. కానీ దాని వలన తాము పొంద వలసిన స్థితిని పొందలేమని తెలుసుకోలేక పోతారని, శ్రీకృష్ణుడు వ్యక్త పరిచాడు.
అంతేగాకుండా, కలియుగంలో మానవులందరూ ఇంద్రియాలకు వశమై, దానివల్ల కలిగే సుఖాలే అసలైన స్వర్గమని అపోహపడి, వారి జీవితాలను నరక ప్రాయం జేసుకుంటారు. ఇంద్రియ సుఖాలకు లోబడి, పాప కర్మలను మూటగట్టుకుని, మరణాంతరం నరకానికి చేరుకోవడమే కాకుండా, ఆ పాప కర్మల వల్ల మరు జన్మలలో కూడా ఎన్నో కష్టాలకు లోవనవుతారు. ఇంద్రియ సుఖాల వల్ల తమకు అంత నష్టం జరుగుతున్నా, కలియుగ మానవులు వారి దారిని ససేమిరా మార్చుకోరు. కలియుగంలో ధనార్జనే మానవులకు ప్రధానంగా మారుతుంది. రాజులు ప్రజల సొమ్మును దోచుకుంటుంటే, ప్రజలు రాజుల మీద తిరగబడి, ప్రజా ఉద్యమాలు మొలకెత్తుతాయి. అయినా అందరూ ధనానికే ప్రాధాన్యతనిస్తారు. ఎవరికీ పాండిత్యాన్ని బట్టిగానీ, యోగ్యతను బట్టిగానీ గౌరవం లభించదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్న దానికన్నా, ఎంత వెనకేసుకున్నాడన్నదే ప్రధానమవుతుంది. ఐశ్వర్యవంతుడే పండితుడిగా కొనియాడబడతాడని, శ్రీకృషుడు తెలియజేశాడు.
కలియుగం గురించిన విషయాలన్నీ ఉద్ధవుడికి చెప్పిన తర్వాత, ఆ స్వామి ఆయనను వెంటనే ద్వారకను వదలి, బదిరకాశ్రమానికి వెళ్లిపొమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్లిన తరువాత, బంగారం, లేదా వెండి, లేదా కంచు వంటి లోహాలలో ఏదైనా ఒక లోహంతో తన ప్రసన్న మూర్తిని తయారుజేయించుకుని, దానిని పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం పూజించమని చెప్పాడు. ‘విగ్రహారాధన’గా అన్యమతస్థులు ఎత్తి పొడిచే ఆ పద్ధతి గురించి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాము. ఆ విధంగా ఓ సాత్విక మూర్తికి పూజలు చేయడం వలన, కొద్ది రోజులకు అతడు అర్పిస్తున్న పుష్పాలను భగవంతుడు స్వీకరిస్తున్నట్లూ, సమర్పించిన ప్రసాదం సేవిస్తున్నట్లూ అనిపిస్తుంది. అలా క్రమంగా అతడి అహంకారాన్ని ఆ మూర్తి హరించడం మొదలు పెడుతుంది. క్రమక్రమంగా అతడు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తాడు. మనస్సు తొందరగా నిలబడడానికి, ‘విగ్రహారాధన’ అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకు ప్రతి జీవి గుండెలలోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని గ్రహించ గలుగుతాడు.
అప్పుడు ఎక్కడ చూసినా అతడికి నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపాలతో దర్శనమిస్తాడు. అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు, జీవునిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. అతడు నన్నే చూస్తూ వెళ్ళిపోతాడు కాబట్టి, నా యందే చేరిపోతాడని, పరమాత్ముడు చెప్పాడు. ఆ విధంగా పరంధాముడు ఉద్ధవుడికి తన అమృత వాక్కులను వినిపించి, అవతార పరిసమాప్తి కోసం వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఉద్ధవుడు కూడా బదరికాశ్రమం చేరి, తన శేష జీవితం మొత్తం, భగవన్నామ స్మరణలో గడిపి, కలి ప్రభావం నుంచి తప్పించుకుని ముక్తినొందాడని, భాగవతంలో చెప్పబడి ఉంది.
HONDURAS: Secrets of a Lost City of the Monkey God!
అనిలాత్మజుడు ఆజన్మ బ్రహ్మచారనీ, శివుడికి కైలాసంలాగా, విష్ణుమూర్తికి వైకుంఠంలాగా, ఆంజనేయ స్వామికి ఒక చోటంటూ ఉండదనీ, ఆయన నిరంతర రామనామ జపం జరిగే ప్రదేశాలలో, అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడనీ మనకు తెలిసిందే. మరి అటువంటి హనుమంతుడి కొడుకు ఎవరు? అతడేలిన ఒక మహా నగరాన్ని కొత్తగా కనుగొన్నారా?... అవును.. ఆ నగరం మన దేశంలోనో, లేక ఆసియా ఖండంలోనో కాకుండా, భూమికి ఆవలి వైపున ఉన్న మరో ఖండంలో ఉంది! అక్కడ కొన్ని వేల ఏళ్లుగా హనుమంతుడిని కోలుస్తున్నారు! మరి చాలామందికి తెలియని ఆ విషయాలకోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
అది 1940వ సంవత్సరం.. దక్షిణ అమెరికా ఖండంలోని Honduras అనే ఒక చిన్న దేశం. నేటివ్ అమెరికన్ల సంస్కృతీ సంప్రాదాయలకు సంబంధించిన వివిధ రకాల పురాతన వస్తువులను సేకరించి, తన మ్యుజియంలో భద్రపరిచే George Gustav Heye అనే వ్యక్తి, మొదటి సారి ఆ దేశంలో అడుగుపెట్టాడు. అతను ఆ దేశానికి వచ్చినప్పటి నుంచి, అతని మెదడును తొలిచేస్తున్న ఒకే ఒక్క పేరు, La Ciudad Blanca. Gustav ఆ దేశంలో దిగినప్పటి నుంచి, ఎంతో మందిని ఆరా తీసింది, ఈ ‘La Ciudad Blanca’ గురించే. అప్పుడే అతడికి, Theodore Morde అనే వ్యక్తి పరిచయం అయ్యాడని, చరిత్రకారులు చెబుతున్నారు.
Theodore Morde, అమెరికాకు చెందిన ఒక సాహస యాత్రీకుడు, జర్నలిస్ట్ గా కూడా పనిచేసిన వ్యక్తి. అతడికి అప్పటికే ‘La Ciudad Blanca’ గురించి కొంత అవగాహన ఉంది. తనకు ఆర్ధిక సాహయం, కొన్ని ఆధునిక పరికరాలూ సమకూర్చితే, La Ciudad Blanca ను కనిపెట్టి తీరతానని, Gustav కి చెప్పాడు. దాంతో వారిద్దరూ కలిసి, దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న అతి భయంకరమైన La Mosquitia అనే వర్షారణ్యంలోకి వెళ్ళారు. అక్కడ వారు అనేక నదులూ, సరస్సులూ, పెద్ద పెద్ద పర్వతాలూ దాటుతూ... అప్పటివరకు ప్రపంచం చూడని ఎన్నో ప్రమాదకర విష సర్పాలనూ, మనుషులను ఆమాంతం మింగేయగల భారీ అనకొండాలనూ, చిన్న కాటుతో పైలోకాలకు పంపించగల కీటకాల నుంచీ తప్పించుకుంటూ, ఎట్టకేలకు La Ciudad Blanca ను చేరుకోగలిగారు.
అక్కడ తెల్లటి రాతితో కట్టబడిన పెద్ద పెద్ద ఆలయాలూ, పలు ఇతర రాతి నిర్మాణాలూ, దాదాపు శిధిలమైన స్థితిలో, అంతరించిపోయిన ఓ మహానగరమే వారికి కనిపించింది. దాని పేరే, La Ciudad Blanca అనీ, స్పానిష్ భాషలో, ‘The White City’ అనే అర్ధం వస్తుందనీ, నిపుణుల మాట. ఆ నగరంలో ఉన్న వివిధ కట్టడాలను పరిశీలించిన Theodore Morde కి, కొన్ని విరిగిన రాతి మెట్లు కనిపించాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించగా, అక్కడ భారీ కప్ప ఆకారంలో ఉన్న శిల్పం ఒకటి కనిపించింది. దానిని ఇంకాస్త పరిశీలించగా, అందులో మొసలి ఆకారం కూడా కనిపించింది. దానిని బట్టి, ఆ విగ్రహాన్ని ఒక కోణంలో చూస్తే మొసలిగా, మరో కోణంలో చూస్తే కప్పగా కనిపించే తీరులో, ఆ విగ్రహాన్ని మలచడం జరిగింది. దాంతో అవి ఓ పురాతన ఆలయానికి చెందిన శిధిలాలని, వారికి అర్ధం అయ్యింది. ఆ మెట్లను పట్టుకుని ఇంకాస్త దూరం వెళ్తే, వారికి చాలా కోతుల బొమ్మలు కనిపించాయి. అవన్నీ చూడటానికి ఒకే విధంగా ఉన్నా, ఒక్క కోతి బొమ్మ మాత్రం, తెల్లటి రాయితో కాకుండా, గోధుమ రంగు రాయితో చెక్కారనీ, దానికి ఒక చేతిలో గద ఉందనీ Morde గమనించాడు. పూర్వం ఆ మెట్లకు చివరన పై భాగంలో, ఓ భారీ కోతి విగ్రహం ఉండేదని, స్థానిక కథల ద్వారా తెలుస్తుంది.
అక్కడ ఉన్న ఆ వింత కోతి ఆకారాన్ని మరింత లోతుగా పరిశీలించిన Morde కి, అది ఎక్కడో భారత దేశంలో ఉండే హిందువులు కొలిచే హనుమంతుడి విగ్రహంతో సరిపోలుతొందనిపించింది. దాంతో Morde, Gustav తో కలిసి ఆ ప్రాంతం గురించి మరింత లోతుగా పరిశోధనలు జరపగా, అది కొన్ని వేల ఏళ్ల క్రితం పూర్తిగా మానవ లోకం నుంచి వేరు పడిన, The Lost City of the Monkey God అని తెలిసివచ్చింది.
Morde, Gustav లు చాలా రకాలైన వస్తువులనూ, కొన్ని చిన్న చిన్న శిలలనూ అక్కడి నుంచి బయటి ప్రపంచానికి తీసుకు వచ్చారు. అంతేకాదు, వారు తీసుకువచ్చిన వాటిలో, రాళ్ళతో చేసిన పనిముట్లు, ఆయుధాలు, లోహంతో చేసిన ఆయుధాలు కూడా ఉన్నాయి. అవే కాకుండా, వారిద్దరూ అక్కడ బంగారం, ప్లాటినం, శిలాజ ఇంధన అవశేషాలు కూడా కనుగొన్నట్లు తెలుస్తుంది. నాడు Morde, Gustav లు తీసుకువచ్చిన ఆ అవశేషాలను, అమెరికా New York సిటీలో ఉన్న The National Museum of American Indian లో చూడవచ్చు.
వారి తర్వాత మరికొంతమంది చరిత్రకారులూ, శాస్త్రవేత్తలూ, అతి కష్టంమీద Honduras లో గల ఆ పురాతన నగరానికి చేరుకుని, మరికొన్ని పరిశోధనలు చేశారు. వారి పరిశోధనల ప్రకారం, దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితమే, Honduras అడవులలో ఈ మహానగరం వేలసిందనీ, దానిని అక్కడ నివసించిన నేటివ్ ప్రజలు నిర్మించి ఉంటారనీ తెలుసుకున్నారు. అప్పట్లో అక్కడ నివశించిన ప్రజలు, కోతులను దేవుళ్ళుగా కొలిచేవారు. అంతేగాకుండా, అక్కడున్న ప్రత్యేకమైన కోతి విగ్రహానికి, కొన్ని విశేష పూజలు నిర్వహించేవారు. ఆ కోతి విగ్రహం ముందు దీపం వెలిగించడం, ధూపం సమర్పించడం, పలు రకాల పళ్ళనూ, కందములాలనూ ప్రసాదంగా నివేదించడం వంటివి కూడా చేశారనీ, అటువంటి పూజా విధానం, భారత దేశంలోని సనాతన ధర్మస్తులు చేసే పూజా విధానంతో సరిపోలుతోందనీ, చరిత్రకారులు గుర్తించారు.
దాంతో అక్కడ ఉన్న Monkey God, మన పురాణాలలో చెప్పబడిన హనుమంతుల వారే అని, నిపుణులు నిర్ధారించారు. అందుకు రామాయణంలో చెప్పబడిన ఓ ఘట్టాన్ని సాక్ష్యంగా కూడా చూపిస్తున్నారు. రామాయణంలోని యుద్ధ కాండలో, ఒకనాడు తాను యుద్ధం ఓడిపోతానేమో అని భయపడిన రావణుడు, తన మేనమామ అయిన మైరావణుడి సహాయం కోరాడు. అతడు పాతాళ లోకానికి రాజుగా, మహా మాయావిగా, ముల్లోకాలలో పేరు తెచ్చుకున్నాడు. మేనల్లుడి కోరిక మేరకు ఒక రోజు సూర్యాస్తమయం తర్వాత, యుద్ధం ముగిసిన కొంతసేపటికి, మర్నాడు అవలంభించవలసిన యుద్ధ తంత్రాల గురించి చర్చలు జరిపిన రామ లక్ష్మణులు, విశ్రాంతికోసం వారి శిబిరంలోకి వెళ్ళారు. అక్కడ రాముల వారు నిద్రకుపక్రమించిగా, లక్ష్మణుడు అన్నగారి కాళ్ళు వత్తుతూ ఉన్నాడు. మాయావి అయిన రావణుడు స్వామికి అపకారం తలపెట్టే అవాకాశం ఉండటంతో, హనుమంతుల వారే ప్రతి రోజూ ఆ శిభిరానికి కాపలాగా ఉండేవారు. ఆ రోజు కూడా హనుమంతుల వారు కాపలా కాస్తుండగా, రావణుడి తమ్ముడూ, రామ భక్తుడైన విభీషణుడు, ఆ శిభిరం దగ్గరకు వచ్చి, ఓ ముఖ్యమైన సమాచారాన్ని రాముల వారికి చేరవేయాలని చెప్పడంతో, అతన్ని ఆ శిభిరంలోకి అనుమతించాడు, ఆంజనేయుడు. అలా లోపలకి వెళ్ళిన మాయా విభీషణుడు, తన మంత్రోచ్చాటనతో రామ లక్ష్మణులు మూర్చబోయేలా చేశాడు. ఆ తర్వాత వారిని సూక్ష్మ శరీరులుగా మార్చి, ఓ పెట్టెలో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఇది జరిగిన కొంత సమయానికి అక్కడికి అసలైన విభీషణుడు వచ్చి, రాముల వారితో మర్నాటి యుద్ధం గురించి చర్చించాలని, హనుమంతుల వారితో అన్నాడు. ఆ మాటకు ఖంగుదిన్న హనుమంతుడు, జరిగిన మోసాన్ని విభీషణుడితో అన్నాడు. దాంతో కంగారుగా ఆ గుడారంలోకి వెళ్లి చూడగా, అక్కడ రామ లక్ష్మణులు లేకపోవడం చూసి, ఆ పని తన మేన మామ అయిన మైరావణుడే చేసివుంటాడని అన్నాడు, విభీషణుడు. అతడు పాతాళ లోకానికి రాజనీ, ఆ లోకానికి తీసుకు వెళ్ళే స్వరంగ మార్గం తనకు తెలుసనీ, వెంటనే ఆ మార్గం గుండా వెళ్లి అతడిని పట్టుకోకపోతే, రామ లక్ష్మణుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదముందనీ, విభీషణుడు పవన తనయుడితో అన్నాడు. దాంతో ఆంజనేయుడు వెంటనే ఆ స్వరంగా మార్గం గుండా ప్రయాణించి, మైరావణుడుండే పాతాళ లోకానికి చేరుకున్నాడు.
పాతాళ లోక ద్వారం దగ్గర మకరధ్వజుడనే ఓ విచిత్రాకారుడు కాపలా కాస్తూ కనిపించాడు. అతడు సగం కోతి రూపంలో, సగం మొసలి రూపంలో ఉండడం చూసిన ఆంజనేయుడు తన దివ్యదృష్టితో, అతడు తన స్వేదంనుండి ఉద్భవించిన వాడని గ్రహించాడు. హనుమంతుల వారిని చుసిన మకరధ్వజుడు, వచ్చినది తన తండ్రి అని గ్రహించి, జరిగిన వృతాంతం చెప్పి, తండ్రి ఆశిస్సులను పొందాడు. అతను చెప్పిన మాటలకు సంతోషించిన హనుమంతుల వారు, మైరావణుడిని అప్పగించమని కోరాడు. దానికి సమ్మతించని మకరధ్వజుడు, ఆంజనేయుడితో యుద్ధం చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత హనుమంతుల వారు పంచముఖుడై, మైరావణుడిని వధించి, రామ లక్ష్మణులను రక్షించి భూమిపైకి తీసుకువచ్చాడు. అలా వచ్చే ముందు తన కొడుకైన మకరధ్వజుడికి ఆయన పాతాళలోక పాలన అప్పగించాడనీ, అతడి పాలనలో మకరధ్వజుడినీ, హనుమంతుల వారినీ అక్కడి ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలిచేవారనీ, చరిత్రకారులు చెబుతున్నారు. భౌగోళికంగా చూసుకుంటే... భారత దేశానికి సరిగ్గా దిగువన దక్షిణ అమెరికా ఖండం, మరీ ముఖ్యంగా బ్రెజిల్, Honduras వంటి దేశాలే వస్తాయి. ఆ ప్రకారంగా చూసుకుంటే, భారత ఇతిహాసాలలో చెప్పబడిన పాతాళ లోకం, దక్షిణ అమెరికా ఖండం అయ్యే అవాకాశం లేకపోలేదని, చరిత్రకారులు ఘంటాపథంగా చెబుతున్నారు.
కొంతమంది మాత్రం, ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతన నాగరికత గల దేశం భారత దేశమనీ, అందువల్ల ఇక్కడ ఉండే ప్రజలు, పూర్వకాలంలో వ్యాపార నిమిత్తం కానీ, కొత్త ప్రాంతాలను కనుగొనడానికి కానీ, ఓడలపై ప్రయాణాలు చేసేవారనీ, ఈ సందర్భంలో మన దేశానికి చెందిన పూర్వికులు, ప్రపంచంలో ఉన్న చాలా ప్రదేశాలకు వెళ్లి, అక్కడి ప్రజలకు నాగరికత నేర్పించాడంతో పాటు, మన దేవుళ్ళకు చెందిన ఆలయాలను నిర్మించి, అక్కడ పూజలు చేసేవారని, వారి వాదన. ఈ మధ్య కాలంలో, ప్రపంచ వ్యాప్తంగా బయటపడుతున్న పలు హిందూ దేవుళ్ళ విగ్రహాలూ, ఆలయాల వెనుక, ఈ కారణమే ఉంటుందని, వీరి వాదన. ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే, భారతీయులు దక్షిణ అమెరికా ఖండానికి వలస వెళ్లి, అక్కడి అడవులలో ఓ మహా నగరాన్ని నిర్మించి ఉండవచ్చనీ, ఆ నగరమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న The Lost City of the Monkey God అనీ, అంటున్నారు.
ఎవరి వాదన ఎలా ఉన్నా, భారత దేశం నుంచి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ఆ ప్రాచీన నగరాన్ని ఒకప్పుడు పాలించింది మన భారతీయులేననీ, అక్కడ దొరికిన ఆధారాలను బట్టి, అది కేవలం ఒక మహా నగరంగానే కాకుండా, నాడు బంగారు వర్తకం చేసిన ఓ ప్రముఖ నగరంగా కూడా ఉండేదని చెప్పడంలో, ఎటువంటి సందేహం లేదు. మరి అంతటి మహా నగరం నేడు శిధిలావస్థలో దర్శనమివ్వడం వెనుక ఉన్న అసలు కారణాలు మాత్రం, భగవంతుడికే తెలియాలి. మీరేమని అనుకుంటున్నారో comments ద్వారా తెలియజేయండి..
కార్తీక సోమవారం లాగానే, కోటి సోమవారం అనే ఒక సోమవారం వస్తుందనుకుంటే, అది పొరపాటే...
సోమవారం శివుడికి ఇష్టమైన రోజు, కోటి సోమవారాల పూజ ఫలితాన్ని ఇచ్చే విశేషమైన రోజు, 'కోటి సోమవారం'.
కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కలసి వచ్చే రోజునే, కోటి సోమవారంగా పిలుస్తారు.
ఈ 2024లో, కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం నవంబర్ 8న ఉదయం 9.18 నిముషాలకు ప్రారంభమై, నవంబర్ 9న శనివారం ఉదయం 8.42 నిముషాలకు ముగుస్తుంది. శ్రవణా నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉండడం వలన, నవంబర్ 9ని కోటి సోమవారంగా జరుపుకోవాలని అధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఆ రోజు చేసే ఏ పని అయినా సరే.. దీపం, స్నానం, దానం, ఉపవాసం లాంటివి, కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తాయని శాస్త్ర విదితం.
'కాల నాగు' మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాలను గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందనీ, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు'కు తెల్లని ఆదిశేషువుగా మారి, శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే, ఈ పాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.
పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి, దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా, నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాము. అలాగే మన బ్రతుకనే పాలను, జ్ఞానమనే వేడితో కాచి, వివేకమనే చల్ల కలిపితే, సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా, శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే, సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే, త్యాగము, యోగము, భోగమనే మూడు రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది. సకల వేదాల సారం, సకల జీవన సారం అయిన పాలను, జీవనానికి ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం ఇదే.
”దేవాః చక్షుషా భుంజానాః భక్తాన్ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం.. అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా, కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.
నాగులచవితి రోజు పుట్ట వద్ద పఠించ వలసిన శ్లోకం..
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!
నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్ ||
పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం, నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్ప దేవతలు ఉన్నప్పటికీ, 12 మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు.
చవితి నాడు సర్పాలను పూజిస్తే, కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి, నాగుపాము పుట్టకు పూజ చేస్తే, కళత్ర దోషాలు తొలగుతాయని, శాస్త్రాలు సూచిస్తున్నాయి.
దేవతా సర్పాలుగా పేర్కొనబడే - అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటక, ఆశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ అనే 12 దేవతా సర్పాలను ఈ రోజు పూజించి, ఆశీర్వాదాలు పొందుతారు. ఈ విశ్వంలో పాములు - ఆకాశంలో, స్వర్గంలో, సూర్యకిరణాలలో, సరస్సులలో, బావులూ చెరువులలో నివసిస్తాయి.
పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి, పిల్లల చేతా చెప్పించాలి.
"నడుము తొక్కితే నావాడనుకో
పడగ తొక్కితే పగవాడు కాదనుకో
తోక తొక్కితే తోటి వాడనుకో
నా కంట నువ్వు పడకు, నీ కంట నేను పడకుండా చూడు తండ్రీ.." అని చెప్పాలి.
ప్రకృతిని పూజిచటం, మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి, మన శత్రువును కూడా ఆదరిస్తామని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే, వారికి మంచి అలవాట్లు నేర్పించడం, మన ముఖ్య వుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారినీ, కష్టపెట్టేవారిని కూడా క్షమించాలని తెలియజేయటమే, ఇలాంటివి నేర్పటంలో ముఖ్య ఉద్దేశము.
నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసిన తరువాత, బియ్యం, రవ్వ, లేదా పిండిని చుట్టూ జల్లుతారు. ఎందుకంటే, మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారాన్ని సమకూర్చడానికి. ఉదాహరణకు, చీమలకు ఆహారంగా అదే కదా.. పుట్ట నుండి మట్టి తీసుకుని, ఆ మట్టిని చెవులకు పెడతాము. ఇది చెవికి సంభందించిన ఇబ్బందులు రాకుండా..
ఫలాన్ని ఆశించి చేసే 'కర్మ' వలన ఎటువంటి ఫలితాన్ని పొందుతాము?
ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడానికి, అంటే, నిష్కామకర్మకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరే, 'కర్మయోగం'. యోగం అంటే ఆసనాలు వేయడం, గాలి పీల్చడం అని మనం సాధారణ పరిభాషలో అనుకుంటూ వుంటాము. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది, లక్ష్మీ యోగం పట్టిందని అనడం వింటూంటాము. లేనిదానిని పొందడం, పొందినదానిని రక్షించుకోవడమే, యోగమంటే. ఇక్కడ కర్మయోగం అంటే, కర్మ అనే ఉపాయాన్ని పట్టుకుని, మరొకదానిని సాధించడం. ఆ మరొకటే, 'ఆత్మజ్ఞానం'. ఆ విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు, క్రమక్రమంగా పవిత్రంగా మారుతుంది. దీనినే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నప్పుడు, మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తిని పొందుతుందో, మనం స్వంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక మార్గం. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే, ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.
కర్మయోగం గురించి చెబుతూ, శ్రీకృష్ణుడు ‘యోగః కర్మసు కౌశలం’ అన్నాడు. ‘కర్మయోగం అంటే, పనులు చేయడంలో నేర్పరితనం’ అని చెప్పాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే, కర్మచేస్తూ ఉండి కూడా, దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. అది ఒక దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా, మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం.. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన చెప్పుకుందాము..
ఒకానొక సందర్భంలో కాశీలోని హనుమాన్ ఘాట్ దారి గుండా ఇద్దరు యువకులు వెళుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు నీళ్ళలో మునిగిపోయే స్థితిలో ఉండటం యాదృచ్ఛికంగా గమనించారు వాళ్ళు. మరు క్షణమే ఆ ఇద్దరూ ముందూ వెనుకా చూడకుండా నీళ్ళలోకి దూకి, మునిగి పోబోతున్న ఆ ఇద్దరు యువతులనూ సురక్షితంగా కాపాడి, వడ్డుకు చేర్చారు.
తమను కాపాడిన ఆ ఇద్దరు యువకులకూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు, ఆ యువతులు. కాపాడిన యువకుల్లో ఒకడు, తను కాపాడిన యువతితో తనను వివాహం చేసుకోమని అడిగాడు. అతడు “ఈ లోకమే సత్యం" అనే దృక్పథంగల వాడు. రెండవ యువకుడు, తనకన్నా వయస్సులో పెద్దవారైన స్త్రీలను తల్లి గానూ, సమ వయస్కులైన వారిని సోదరిగానూ, పిన్నలను పుత్రికలుగానూ భావించి మెలగేవాడు. కనుక అతడు, “సోదరీ, ఒక మంచి పని చేయడానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను నా కర్తవ్యాన్ని మాత్రమే చేశాను” అని తాను కాపాడిన యువతితో చెప్పాడు. అతడు "భగవంతుడు మాత్రమే సత్యం” అనే దృక్పథం గలవాడు.
బాహ్య స్థాయిలో చూసినప్పుడు, ఇద్దరు యువకులూ ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఒకే రకమైన కర్మనే చేశారు. కానీ వాస్తవ దృక్పథం ప్రకారం, ఇద్దరిలో వ్యత్యాసం ఉంది. ఆ కారణంగా, వారికి ఫలమూ విభిన్నంగానే దక్కింది.
కర్మయోగి కానివాడు, స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ, జనన మరణ చక్రంలో తిరుగుతూ వుంటాడు. అతడికి మోక్షం ప్రాప్తించదు. అలాకాకుండా, 'కర్మయోగి' లోకం మేలు కోసం, ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే, తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ, పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం, చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు, పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే, అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే, ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే, మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని, వేదాంతం చెబుతుంది.
ఫలితాన్ని ఆశించి చేసే 'కర్మ', బంధానికి దారి తీస్తుంది. తనను భగవంతుని ఉపకరణగా భావించి కర్మను ఆచరించటమూ, దాని ఫలాన్ని భగవంతునికే అర్పించడమూ, 'ఆత్మ విముక్తి'కి దారి తీస్తుంది. పైగా, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారు మాత్రమే, నిష్కళంక భావంతో లోకానికి సేవలు అందించగలరు. అలా కాని స్థితిలో, స్వార్ధం చోటుచేసుకోవడాన్ని నివారించలేము.
కర్మాచరణలో మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలాలలో ఎన్నడూ లేదు. కర్మ ఫలాలను రూపొందించే వానిగా అవ్వవద్దు. కర్మలు ఒనర్చకుండటంలో అనురక్తి కూడదు.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోஉస్త్వకర్మణి || -గీత, 2.47
మనం మన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలి. ఫలితాల గురించి చింతించకూడదు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించే హక్కు మనకు ఉంది కానీ, ఫలితాలు మన ప్రయత్నాలపై మాత్రమే ఆధారపడి ఉండవు. ఫలితాలను నిర్ణయించడంలో, అనేక అంశాలు అమలులోకి వస్తాయి.. అవి మన ప్రయత్నాలూ, విధి, అంటే, మన గత కర్మలూ, భగవంతుని సంకల్పం, ఇతరుల ప్రయత్నాలూ, పాల్గొన్న వ్యక్తుల సంచిత కర్మలూ, స్థలమూ మరియు పరిస్థితి, అంటే, అదృష్టానికి సంబంధించిన విషయం, మొదలైనవి. మనం ఫలితాల కోసం ఆత్రుతగా ఉంటే, అవి మన అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు, ఆందోళనను అనుభవిస్తాము. కాబట్టి, ఫలితాల కోసం చింతించవద్దనీ, మంచి పని చేయడంపై మాత్రమే దృష్టి పెట్టమనీ, శ్రీ కృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు. వాస్తవమేమిటంటే, ఫలితాల గురించి మనం పట్టించుకోనప్పుడు, మన ప్రయత్నాలపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతాము. ఫలితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
మరో కోణంలో భగవాన్ శ్రీరామకృష్ణులవారు ఇలా అన్నారు.. పడవ నీటి మీద తేలవచ్చు. కాని పడవలో నీరు ప్రవేశించ కూడదు. ఆ విధంగానే, మనిషి సంసారంలో ఉండవచ్చు కానీ, సంసారానురక్తి అతడిలో ప్రవేశించ కూడదు.