శ్రీకృష్ణావతారతత్వం! కుచేలుడు! Sri Krishna Kuchela - Sri Krishnavatara Tatvam


కుచేలుడు! శ్రీకృష్ణావతారతత్వం!
నిజానికి మానవుడికి ముగ్గురు గురువులుంటారు! వారు ఎవరు?

పరీక్షిత్ మహారాజు అంతరంగంలో, భక్తి భావం సంపూర్ణంగా నాటుకుంది. శ్రీకృష్ణుని మహిమలను చెప్పే కథలు ఎన్ని విన్నా, ఇంకా వినాలన్న కోరిక పెరుగుతోంది. ఎంతటి విషయలోలుడైనా, ఒక్కసారి శ్రీకృష్ణుని చరిత్ర వింటే, ఇక సంసార లంపటంలో చిక్కుకోడు. పశుపక్ష్యాదులకూ, మానవులకూ ఒక్క విషయంలోనే భేదం ఉంది. అది, చేతులతో భగవంతునికి సేవలు చేయగలగడం, చెవులతో భగవానుని పుణ్య గాథలను వినడం, శిరస్సు వంచి ఆయన పాద పద్మాలకు నమస్మరించడం, కన్నులతో ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించగలగడం, భక్తుల పాదోదకాన్ని గ్రహించడం, ఇలా ఒక్కటేమిటి, ఈ విధంగా అంగాంగం భగవంతునికై వినియోగించగలగడమే, మానవ జన్మకు సాఫల్యం. ఎవరు భగవంతుడిచ్చిన అవయవాలను భగవత్సేవకు వినియోగించరో, అతడు పాపాత్ముడు, కృతఘ్నుడు అవుతాడు. కావున ఓ మునీంద్రా! నా చివరి ఘడియల వరకూ శ్రీహరి సేవలోనే గడపాలని ఉంది. అందుకే ఆయన లీలలను నాకు చెబితే, తనివితీరా వినాలని ఉందన్నాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C7kNPs6Rn3E ]


పరీక్షిత్ మహారాజు మాటలకు శుకమహర్షి ఇలా బదులిచ్చాడు. రాజా! శ్రీకృష్ణుడితోపాటు గురుకులంలో విద్యాభ్యాసం చేసిన చిన్ననాటి స్నేహితుల్లో, సుదాముడనే వాడొకడున్నాడు. సాందీపుని వద్ద విద్యాభ్యాసం కాగానే, ఇంటికి పోయి వివాహం చేసుకుని, వేదాధ్యయనం చేస్తూ, అగ్నిహోత్రాది కర్మలతో కాలం గడిపేవాడు. అయాచితంగా లభ్యమయ్యే ద్రవ్యంతో తృప్తి పడి జీవించేవాడు. ఒంటినిండా గుడ్డకూ, కడుపునిండా తిండికి కూడా ముఖం వాచి ఉండేవాడు. దానికి తోడు, గంపెడు పిల్లలు. అతడి భార్య అనుకూలవతి, పరమ పతివ్రత. భర్తను అది కావాలి, ఇది కావాలని ఎన్నడూ వేధించేది కాదు.

అందువల్ల అతడి జీవితం చాలా సంతోషంగా ఉండేది. అయినా పిల్లలకు కడుపునిండా పట్టెడన్నం కూడా పెట్టలేక పోతున్నామే అని బాధపడేది ఆమె. అలా బాధపడుతూ, ఒక రోజున భర్తతో ఇలా అన్నది. “మహాత్మా! కుటుంబ పోషణ రోజు రోజుకూ భారమై పోతున్నది. పెద్ద వాళ్ళం మనం ఆకలి బాధకు తట్టుకున్నా, పిల్లలు ఆకలితో అలమటించి పోతున్నారు. నాకో ఆలోచన వచ్చింది. అదేమిటంటే, మీకు చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణ పరమాత్మ, ఇప్పుడు రాజయ్యాడు కదా.. అదీకాకుండా, ఆయన సాక్షాత్తూ లక్ష్మీదేవికి భర్త. ఆయన తన భక్తులన్నా, బ్రాహ్మణులన్నా, తనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడని విన్నాము. మీరొకసారి వెళ్ళి, ఆయన పాదపద్మాలనాశ్రయించి, మన దారిద్ర్యాన్ని గూర్చి ఆయన చెవిలో పడేస్తే, మనకు అంతో ఇంతో సహాయం చేయకపోడు” అని సలహా ఇచ్చింది.

భార్యమాటలు విన్న సుదాముడు ఇలా అన్నాడు. “కల్యాణీ! నువ్వు చెప్పినదంతా బాగానే ఉంది. అతడు ఎప్పుడో చదువు కునే రోజులలో నాకు స్నేహితుడే గానీ, ఈనాడతడు దేశాన్నేలే రాజు. ప్రభువును దర్శించాలంటే, ఏదైనా కానుక లేకుండా, ఒట్టి చేతులతో వెళితే బాగుంటుందా? ప్రభువుకు సమర్పించుకో దగిన కానుకేదైనా ఉంటే, వెతికి తీసుకునిరా! నువ్వు చెప్పినట్లే వెళ్ళి, దర్శనం చేసుకుని వస్తాను” అని అన్నాడు. భర్త అంగీకరించినందుకే పరమానందం చెందిన ఆ సాధ్వి, ఏదైనా దొరకకపోతుందా అని, చుట్టు ప్రక్కల బ్రాహ్మణుల ఇళ్ళకు వెళ్ళి యాచించింది. ఒకరింట్లో నాలుగు పిడికిళ్ళ అటుకులు దొరికాయి. వాటిని భర్త పై పంచె కొంగున కట్టి, ద్వారకకు సాగనంపింది.

సుదాముడు కొన్నాళ్ళకు కాలినడకన, ద్వారకకు చేరుకున్నాడు. ఇతర బ్రాహ్మణులతో కలసి, అంతఃపురంలోని మూడు ద్వారాలు దాటాడు. ఆ తర్వాత పదహారు వేలమంది భార్యల భవనాలను దాటుకుంటూ, రుక్మిణీదేవి నివాసానికి చేరుకో గలిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పట్టు పానుపుపై పవళించి ఉండగా, రుక్మిణీ దేవి ఆయన పాదాలు వత్తుతోంది. సుదాముడిని అల్లంత దూరం నంచే గుర్తుపట్టి, చివాలున లేచి ఎదురువెళ్ళి తీసుకు వచ్చి, తన పట్టు పానుపుపై కూర్చోబెట్టుకున్నాడు. సుదాముడికి అది కలో, నిజమో తేల్చుకోలేక, కళ్ళవెంట ఆనంద బాష్బాలు కారుతూ ఉంటే, శ్రీకృష్ణుడే చేత్తో తుడిచాడు. పూజా ద్రవ్యాలు తెప్పించి, పాదాలు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు. రుక్మిణీదేవి వింజామర విసురుతూ ఉంటే, కుచేలుడి ప్రక్కన కూర్చుని, చిన్ననాటి ముచ్చట్లన్నీ గుర్తు చేసుకున్నారు. ఇదంతా చూస్తున్న పరిచారికలు అవాక్కయ్యారు. “ఈ దరిద్రుడు చిరిగిపోయిన గుడ్డలతో, అడుక్కుతినే వాడిలా ఉన్నాడు. ఆహా! ఇతడు ఎన్నెన్ని జన్మలలో, ఎన్నెన్ని పుణ్యకర్మలు చేశాడో గదా? లేకపోతే, ఇటువంటి వాడు శ్రీకృష్ణుని పట్టు పానుపుపైనే కూర్చోవడం, రుక్కిణీ దేవి అతడికి వింజామర విసరడం వంటివి, ఎన్నడూ కనలేదు, వినలేదు” అని ముక్కున వేలేసుకున్నారు.

అప్పుడు శ్రీకృష్ణుడు సుదాముడితో ఇలా అన్నాడు. “మిత్రమా! మనం గురుకులంలో ఉన్నంతకాలం, ఒకరిని విడిచి ఒకరం ఉండే వారము కాదు. గురు దక్షిణ సమర్పించుకుని, ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళి పోయాము. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ చెబితే వినాలని ఉంది. వివాహం చేసుకున్నావా? చూస్తే గృహస్థు లాగానే కనిపిస్తున్నావు. అయినా విషయ భోగాలేవీ నిన్ను బాధిస్తున్నట్లుగా లేదు. వివాహం అయినా కూడా, విరక్తితో ఎలా జీవించ గలుగుతున్నావు? కొంతమంది గృహస్థులు కర్మలు చేస్తున్నా, స్వార్ధంతో చేయకుండా, లోక హితం కోసమే చేస్తూ ఉంటారు. వాళ్ళంతా నన్నే ఆదర్శంగా పెట్టుకుంటారు.

విప్రశ్రేష్టుడా! సంసారంలో చిక్కుకోకుండా ఉండాలంటే, అందుకు గురు కృప కావాలి. నిజానికి మానవుడికి ముగ్గురు గురువులుంటారు. మొదటి గురువు జన్మనిచ్చిన తండ్రి, రెండవ గురువు, ఉపనయనం చేయించి, వేద విద్యకు అర్హత కల్పించే వాడు.. ఇక మూడవ గురువు, జ్ఞాన ప్రదాత. అతడు సర్వోత్తముడు. అనగా నా ప్రతిరూపమే. అటువంటి గురువు ఉపదేశాన్ని ఎవరు త్రికరణ శుద్ధిగా ఆచరించి, సంసారాన్ని అధిగమిస్తారో, అతడే నిజమైన పండితుడు.

పండితుడా! గురువులందరికీ గురువునైన నేను జగద్గురువును. అందువల్లనే, గురుసేవ అన్ని సేవలలోకీ ఉత్తమమైనది. యజ్ఞయాగాల వంటి క్రతువులకన్నా, గురుసేవా తత్పరులనే నేను ఎక్కువగా ఇష్టపడతాను. గురుసేవ అంటే, నేను చెప్పిన ధర్మాలను తు. చ. తప్పకుండా ఆచరించడమే.

మిత్రమా! ఒకరోజు గురుపత్ని మనిద్దరినీ, అగ్నిహోత్రానికి సమిధలు తెమ్మని అడవికి పంపింది. మనం వెళ్ళిన ఆ అడవి అతి భయంకరమైనది. మనం కట్టెలు కొడుతూ ఉండగా, కారు మబ్బులు కమ్మి, కుండ పోతగా వర్షం కురిసింది. కన్ను పొడుచుకున్నా కనిపించని గాఢాంధకారంలో, మనం దారి తప్పాము. ఒక ప్రక్కన ఆకలి, మరొక ప్రక్కన భయం. బిక్కుబిక్కుమంటూ ఒకరి చేతులు ఒకరం పట్టుకుని, రాత్రంతా అడవిలోనే గడిపాము. మన గురువు సాందీపుల వారు మనలను వెదుక్కుంటూ వచ్చి, అడవి అంతా గాలించారు. మనం కంట పడగానే, “నాయనలారా! ప్రాణులన్నింటికీ దేహం మిక్కిలి విలువైనది. మీరిద్దరూ, అటువంటి దేహాన్ని కూడా లెక్కచెయ్యకుండా, నా కోసం ఇన్ని కష్టాలకు ఓర్చారు. గురువుకు తన సర్వ సంపదలనే కాకుండా, నిస్వార్ధంగా శరీరాన్ని కూడా అర్పించడమే, నిజమైన గురుదక్షిణ. మీరు నా పై చూపిన ప్రేమకు ఎంతో సంతోషించాను. మీరు నా వద్ద నేర్చుకున్న విద్య ఈ లోకంలో, పరలోకంలో కూడా మీకు మేలు చేస్తుంది” అని మనిద్దరినీ ఆశీర్వదించారు. సుదామా! నీకా సంఘటన గుర్తుందా? ఇంకా ఇలాంటివి ఎన్నో జరిగాయి.

తనువెల్లా పులకరించి పోతుండగా, సుదాముడు ఆనందాశ్రువులతో, “జగద్గురూ! దేవదేవా! భక్తుల కోరికలను తీర్చే వాడివైన నీతో గురుకులంలో ఉండటం, నా పూర్వ జన్మల పుణ్య ఫలమని భావిస్తున్నాను. నా జన్మ ధన్యమై పోయింది.” అని అన్నాడు, పరవశించిపోతూ..

సర్వ ప్రాణులలోనూ అంతర్భూతుడిగా ఉంటూ, బ్రాహ్మణ హితాన్నే కోరే శ్రీకృష్ణ పరమాత్మ, సుదాముడితో ఆ మాటా ఈ మాటా చెబుతూ, సుదాముడిలో ఉన్న బెరుకునంతా పోయేటట్లు చేశాడు. ఆ తరువాత.. “మిత్రమా! నువ్వు ఎంతో దూరం నుండి వచ్చావు. వస్తూ నాకేదైనా తీసుకుని వచ్చావా? నువ్వు ప్రేమతో ఇచ్చినది పత్రమైనా, ఫలమైనా, పుష్పమైనా, కనీసం ఉద్ధరిణెడు నీళ్ళిచ్చినా సరే.. సంతోషిస్తాను. కానీ, ప్రేమ లేకుండా, వస్తువు ఎంత విలువైనదైనా, నన్ను సంతోష పెట్టలేదు...” అని అన్నాడు.

పరీక్షిత్ మహారాజా! శ్రీకృష్ణుడన్న ఈ మాటలు సుదాముడిని సిగ్గుతో మరీ క్రుంగదీశాయి. అప్పుడు శ్రీకృష్ణుడే చొరవ చూపి, అతడి చిరుగుల పై పంచెలో కట్టి ఉంచిన మూటను సుతారంగా విప్పాడు. చిరిగిన వస్త్రాలను ధరించిన వాడు కాబట్టే, సుదాముడికి కుచేలుడనే పేరు స్థిరపడింది. ఆ చిరిగిన పై వస్త్రంలో ఉన్న అటుకులను చూసిన శ్రీకృష్ణుడు బ్రహ్మానందంగా, “ఆహా! ఏమి నా భాగ్యం! నా కోసం అటుకులు కానుకగా తెచ్చాడు. తను ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఇంతవరకు నోరు విప్పి నన్నేమీ కోరలేదు. పతివ్రత అయిన భార్య మాటలు విని, పిల్లల ఆకలి బాధలు చూడలేక, నా వద్దకు వచ్చాడు. ఇప్పుడితడికి సర్వ సంపదలనూ ప్రసాదిస్తాను” అని మనస్సులో అనుకుని, గుప్పెడు అటుకులను తీసుకుని నోట్లో పోసుకున్నాడు. రెండవ గుప్పెడు తీసుకోబోతుండగా, రుక్మిణీ దేవి చెయ్యి పుచ్చుకుని ఆపుతూ, “నాథా! మీరు నోటిలో పోసుకున్న ఒక గుప్పెడు అటుకులకే, నా సర్వ సంపదలూ అతడి పరమయ్యాయి. ఇక రెండవ గుప్పెడు కూడా తింటే, నేను కూడా ఇతగాడి అధీనంలో ఉండాల్సి వస్తుంది” అని అన్నది.

సుధాముడు ఆ రాత్రి శ్రీకృష్ణుని తోనే గడిపాడు. శరీరం గాలిలో తేలిపోతున్నట్లనిపించింది. బ్రహ్మానందాన్ని అనుభవించాడు. మరునాడు తన గ్రామానికి ప్రయాణమయ్యాడు. శ్రీకృష్ణుడు కూడా అతడితో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ, ఊరి చివరిదాకా సాగనంపి వచ్చాడు. కానీ, ఆ బాహ్మణుడు శ్రీకృష్ణుని ఎటువంటి సహాయాన్నీ కోరలేదు. శ్రీకృష్ణుని దర్శనమే పరమ భాగ్యమనుకున్నాడు. పైగా “ఆహా! ఎల్ల వేళలా లక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకునే భగవానుడు నన్ను ఆలింగనం చేసుకున్నాడు గదా! దరిద్రుడనైన నేనెక్కడ? పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడెక్కడ? తాను రుక్కిణీదేవితో కలసి శయనించే శయ్యపైన, ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు. అంతేకాదు.. సాక్షాత్తూ రుక్కిణీదేవియే, నాకు వింజామర విసిరింది. శ్రీకృష్ణుని పాదపద్మాలను సేవించేవారికి, ముక్తి లభిస్తుంది. అటువంటిది, శ్రీకృష్ణుడంతటివాడు నా కాళ్ళు కడిగి, ఆ నీటిని నెత్తిన చల్లుకుని పవిత్రుడైనట్లు సంతోషపడిపోయాడు. శ్రీకృష్ణుడు, తనను కొలిచిన వారందరికీ సర్వైశ్వర్యాలనూ ప్రసాదించి పంపుతాడు. నా వంటి దరిద్రునికి సంపదలిస్తే, తనను ఎక్కడ మరచిపోతానోనని, నా మేలు కోరి, ఉత్తిచేతులతో ఇంటికి పంపుతున్నాడ”నుకున్నాడు ఆ పిచ్చి బ్రాహ్మణుడు.

సుదాముడు ఈ విధంగా ఆలోచిస్తూ, ఇంటికి చేరుకున్నాడు. ఇంటిముందు సూర్య చంద్రులలా వెలిగిపోతున్న విమానాలు నిలబెట్టి ఉన్నాయి. తమ పూరిపాక స్థానంలో, ఒక పెద్ద భవనం వెలసింది. ఇంటి ముందు పెద్ద ఉద్యానవనం, ఖరీదైన దుస్తులను ధరించిన స్తీ పురుష నౌకర్లు ఇంటినిండా బిలబిలా తిరుగుతూ, పనీపాటలలో మునిగి పోయారు. వారంతా సుదాముణ్ణి గుర్తుపట్టారు. యజమానికి చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేశారు. సుదాముడికి అంతా అయోమయంగా ఉంది. తాను ద్వారకకు పోయినప్పుడు, పూరిపాక స్థానంలో పెద్ద భవనం వెలిసింది. నౌకర్లంతా సంగీత వాద్యాలతో బ్రాహ్మణునికి స్వాగతం పలికారు.

ఇంతలో భార్య ఎదురు వచ్చింది. ఆమె అలంకారాలతో సాక్షాత్తూ లక్ష్మీదేవిలా ఉంది. భార్యను చూసి ఇంకా ఆశ్చర్య పోయాడు. ఇల్లంతా భోగ వస్తువులతో నిండిపోయింది. ఇదంతా శ్రీకృష్ణుని మహిమేనని అర్ధమైంది. వానదేవుడు, సమయం వస్తే అడగకుండానే వర్షిస్తాడు. అలాగే, శ్రీకృష్ణుడు పట్టెడటుకులు తిని, ఇంతటి భాగ్యాన్ని ప్రసాదించాడు గదా! అని అనుకుంటూ, శ్రీకృష్ణుని మనస్సులోనే అనేక విధాలుగా స్తుతించాడు.

సుదాముడు ఈ విధంగా ఆలోచిస్తూ, మనస్సును శ్రీకృష్ణుని యందే స్థిరంగా నిలిపి, విషయలంపటుడు కాకుండా, భార్యబిడ్డలతో సుఖంగా జీవించాడు. సకల బ్రాహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణుల యెడల దైవీ భావం కలిగి ఉండేవాడు. బ్రాహ్మణుల కన్నా పరమదైవం మరొకడు లేడని, శ్రీకృష్ణ పరబ్రహ్మ లోకానికి చాటి చెప్పాడు.

ఈ విధంగా సుదాముడు, సకల భోగాలనూ అనుభవిస్తున్నా, ఏ భోగంపైనా కోరిక లేని వాడై, శ్రీకృష్ణుడి పాదపద్మాలనే ఆశ్రయించి, పరమ భక్తుడై, భగవద్దాశ్యాన్ని పొంద గలిగాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana