Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, March 31, 2025

Bhoot Mela: Unique ghost fair held in India | భూత్ మేళా!


భూత్ మేళా! TELUGU VOICE
దేవీ నవరాత్రులలో దయ్యం పట్టిన వారు మాత్రమే వచ్చే దేవీ ధామ్ ఆలయం!

మనం కొత్తగా ఒక ఊరికి వెళ్ళినప్పుడు, అదీ దేవీ నవరాత్రుల సమయం అయితే, అమ్మవారి ఆలయాలలో ఎంతో వైభవంగా ఆ తల్లి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉండడం చూస్తుంటాము. ఆ 9 రోజులలో ఏదో ఒక రోజు దగ్గరలో ఉన్న అమ్మవారి అలయానికి వెళ్ళి, ఆ తల్లిని దర్శించుకుని, ఆమె అనుగ్రహాన్ని పొందాలని అనుకోవడం సర్వ సాధారణం. ఒకవేళ ఈ లోపు మనకు దగ్గరలో ఒక పురాతన దేవీ ఆలయం ఉందని తెలిస్తే, మన అడుగులు ఆ ఆలయం వైపుకు ఖచ్చితంగా పడతాయి. దేవీ నవరాత్రుల సమయం, అందులోనూ పురాతన అమ్మవారి ఆలయం అన్నప్పుడు, ఆలయం చుట్టూ కోలాహలం ఉండడం సహజమే.. ఎటు చూసినా జనాలు బారులు తీరి ఉండటమూ మామూలే.. మనం చెప్పుకోబోతున్న ఈ ఆలయం దగ్గర కూడా అదే విధంగా ఉంటుంది కానీ, అక్కడి వాతావరణం కాస్త వింతగా అనిపిస్తుంది. ఎన్నో అనుమానాలతో ఆలయంలోకి అడుగు పెడితే, అక్కడి జనం ముఖాలలో ఆలయ సందర్శనానికి వచ్చిన ఆనందం కనిపించకపోగా, జుట్టు విరబోసుకుని, కోపంగా చూస్తూ, ఒక విధమైన భయానక రూపాలలో ఉంటారు. అర్చకుడు అమ్మవారికి హారతి ఇవ్వడం మొదలు పెట్టగానే, గర్భగుడి బయటి జనాలందరూ బిగ్గరగా, భయంకరంగా అరుస్తూ, కాళ్ళు, చేతులూ కొట్టుకుంటూ, తల అటు ఇటు ఆడిస్తూ, ఎర్రటి కళ్ళతో, మామూలు మనుషులలా కాకుండా వింతగా ప్రవర్తించడం చూసి అయోమయంగా అర్చకుడిని ప్రశ్నిస్తే, నవరాత్రుల సమయంలో అక్కడికి వచ్చే భక్తులంతా దెయ్యం పట్టినవారే అన్న సమాధానం ఆయన చెబుతున్నప్పుడు గుండెలు జారిపోతాయి.. వెన్నులోంచి వణుకు పుడుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆలయంలో ఈ తతంగం మనం ప్రతి ఏడాదీ దేవీ నవరాత్రులలో చూడవచ్చు. అసలు ఈ ఆలయం ఎక్కడుంది..? దెయ్యం పట్టిన వారంతా దేవీ నవరాత్రుల సమయంలోనే అక్కడకి ఎందుకు చేరుకుంటున్నారు..? ఆ తరువాత అక్కడ ఏం జరుగుతుంది? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Y91WoDf3PXw ]


ఈ అమ్మవారి ఆలయం గురించి తెలియాలంటే, Jharkhand రాష్ట్రానికి వెళ్ళాల్సిందే. ఆ రాష్ట్రంలోని Palamu జిల్లాలో గల Haidarnagar లో ఉన్న Devi Dham మందిరం గురించే మనం మాట్లాడుకుంటున్నది. ఈ ఆలయంలోని అమ్మవారిని దేవీ భగవతి అనే పేరుతో పిలుస్తారు. ఎక్కడయినా అమ్మవారి ఆలయాలకు సామాన్య భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటే, ఈ దేవీ ధామ్ మందిరానికి మాత్రం, దెయ్యం పట్టిన వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని అర్చకులు చెబుతున్నారు.

ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక పెద్ద అగ్ని గుండం ఉంటుంది. ఆ గుండం చుట్టూ దెయ్యం పట్టిన వారు కూర్చుని అరవడం, జుట్టు విరబోసుకుని ఊగడం, వింత వింతగా ఎగరడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ ఆలయ పరిసరాలలో కూడా దెయ్యం పట్టిన వారితో, వెంట వచ్చిన వారి బంధువులతో నిండి ఉంటుంది.

మరీ ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలోనూ, చైత్ర మాసంలో వచ్చే నవ రాత్రుల సమయంలోనూ దేవి ధామ్ మందిరానికి దెయ్యం పట్టిన వారు అధికంగా వస్తారు. అర్చకులు చెబుతున్నదాని ప్రకారం, ఈ రెండు సమయాలలో ప్రతి రోజూ వేల మంది భక్తులు దేవి ధామ్ మందిరాన్ని సందర్శించుకుంటారని తెలుస్తోంది. Jharkhand రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా, మధ్య ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, మహా రాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్‌ ఘఢ్ రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తారని తెలుస్తోంది.

నవరాత్రుల సమయంలో దేవీ ధామ్ మందిరానికి వచ్చే భక్తులు ఎక్కువగా దెయ్యం పట్టినవారే కావడంతో, ఆ ఆలయ ప్రాంగణం అత్యంత భయానకంగా ఉంటుంది. ఆలయ అర్చకులు చెబుతున్నదాని ప్రకారం, అక్కడికి వచ్చే దయ్యాల బాధితులలో కొంతమందికి ఒకటి రెండు రోజులలో నయమైతే, మరికొంతమందికి 9 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. అలా రోజుల తరబడి అక్కడ ఉండవలసిన వారంతా, ఆలయానికి సమీపంలోనే చిన్న చిన్న టెంట్లు వేసుకుని ఉంటారు.

ఇక దెయ్యాన్ని వదిలించే పూజ మొదలు పెట్టిన తర్వాత, మేకులతో చేసే ఓ తతంగం ప్రత్యేకంగా ఉంటుంది. పూజ పూర్తయ్యాక, దెయ్యం పట్టిన వ్యక్తి ముందు అద్దాన్ని ఉంచి, ఆ వ్యక్తి లోని ఆత్మను ఆ అద్దంలో బంధిస్తాడు మంత్రగాడు. ఆ తర్వాత ఆ అద్దంపై కొద్దిగా బియ్యం పోసి మంత్రాలు చదివి, మిగిలిన బియ్యం మొత్తం కిందకి వదిలేస్తాడు. ఇలా చేసిన తర్వాత కొన్ని బియ్యం గింజలు ఆ వ్యక్తికి అంటుకుని ఉండిపోతాయి. అద్దంలోకి వెళ్ళిన దెయ్యం అలా ఉండిపోయిన బియ్యపు గింజలలోకి చేరినట్లుగా భావిస్తారు. అలా ఉండిపోయిన బియ్యపు గింజలను సేకరించి, ప్రత్యేకంగా తయారు చేసిన గొట్టం లాంటి మెకులలో పోసి, దానిపై సీల్ వేస్తారు. ఇక దెయ్యాన్ని పోగొట్టే తతంగంలో చివరి ప్రహసనం, దేవి ధామ్ ఆలయనికి సమీపంలో ఉన్న అత్యంత పురాతనమైన రావి చెట్టు మొదలుకు ఆ మెకును దిగగొట్టడం. దీనితో ఆ దెయ్యాన్ని పూర్తిగా బంధించినట్లని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

ఎక్కడా లేని విధంగా, కేవలం దేవీ ధామ్ ఆలయానికి మాత్రమే ఇంతమంది దెయ్యాల బాధితులు ఎందుకు వస్తున్నారనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, ఆలయ విశిష్టత, చరిత్ర గురించీ తెలుసుకోవాలని అర్చకులు చెబుతున్నారు. ఆ వివరాల ప్రకారం, దేవీ ధామ్ మందిరంలో కొలువైన తల్లి సప్త మాతృకలలో ఒకరు. ఆమె ఉగ్ర స్వరూపిణి, దుష్ట శక్తి సంహారిణి, ఆవిడకు ఉన్న ప్రత్యేకమైన శక్తుల కారణంగా, దెయ్యాలు ఆ తల్లి ముందు నిలవలేవనీ అర్చకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దేవీ నవరాత్రుల సమయంలోనూ, చైత్ర మాసంలో వచ్చే నవరాత్రుల సమయంలోనూ, దేవీ ధామ్ ఆలయంలోని అమ్మవారికి శక్తి ద్విగుణీకృతమై ఉంటుందని అంటున్నారు. ఆ సమయంలో దెయ్యాలను వదిలించే క్రతువులు చేస్తే, ఫలితం త్వరగా దక్కుతుందని భక్తుల విశ్వాసం. అందుకే నవరాత్రుల సమయంలో అక్కడ భూత్ మేళాను విశేషంగా నిర్వహిస్తారు.

ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహం ఏ కాలం నాటిదో చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. ఆలయాన్ని మాత్రం 1877లో నిర్మించినట్లు తెలుస్తోంది. బీహార్ లోని Aurangabad జిల్లాలో గల Jamhaur అనే గ్రామానికి చెందిన ఒక జమీందారు, అనుకోకుండా ఒకనాడు ఇప్పుడున్న దేవీ ధామ్ ఆలయ పరిసరాలలో గుడారం వేసుకుని సేద తీరుతుండగా, ఆయనకు కలలో అమ్మవారు సాక్షాత్కరించి, సమీపంలోని ఒక పుట్టలో విగ్రహ రూపంలో తానున్నాననీ, ఆ విగ్రహాన్ని వెలికి తీసి పూజలు చేయించి, దెయ్యం ఆవహించి బాధపడుతున్న ఆయన కూతురిని తీసుకువచ్చి తనకు పూజ చేయిస్తే ఆమెకు నయం అవుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. మర్నాడుదయం ఆ జమీందారు ఊరి జనాలతో ఆ పరిసరాలలో వేతికించగా, కలలో అమ్మవారు చెప్పినట్లుగానే విగ్రహం దొరికింది. ఆ తల్లి చెప్పినట్లే చేయగా, ఆయన కూరతురికి నయం అయ్యింది. వెంటనే జమీందారు అమ్మవారికి అక్కడే ఆలయాన్ని నిర్మింపజేశాడు. అదే ఈ నాటి దేవీ ధామ్ ఆలయం.

ఇక దేవీ ధామ్ భూత్ మేళాగా ప్రసిద్ధి నొందిన ఉత్సవానికి, ఒకప్పుడు కేవలం దెయ్యాల బాధితులు మాత్రమే వచ్చేవారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ వింతను చూడటానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఆలయ అర్చకులు చెబుతున్నారు.

🚩 ॐ శ్రీమాత్రే నమః 🙏

Monday, March 24, 2025

Father Of The Atomic Bomb About Destroyer of Worlds - Anu Gita అణు గీత!

 

అణు గీత! TELUGU VOICE
ప్రపంచాన్ని నాశనం చేసే అణుబాంబు సృష్టిలో ప్రపంచ శ్రేయస్సు కోరే భగవద్గీత పాత్ర ఉందా?

సాక్ష్యాత్తు ద్వాపర యుగ పురుషుడైన శ్రీ కృష్ణ భగవానుడు మానవాళికి అందించిన మహోత్కృష్ట గ్రంథరాజం, శ్రీమద్ భగవద్గీత. ప్రపంచ మానవాళికి మార్గదర్శకమైన 700 పైచిలుకు శ్లోకాలుండే భగవద్గీతను, ప్రతి ఒక్కరూ తప్పక చదివి తీరాలని అంటారు. కలియుగ ఆరంభానికి ముందు, అంటే దాదాపు 5000 సంవత్సరాలకు పూర్వం, సాక్ష్యాత్ పరమాత్ముడు చెప్పిన విషయాలను మనకు అందించారు, వ్యాస భగవానులవారు. మతాలకు అతీతమైన ఈ అద్భుత గ్రంథాన్ని చదివి ఆకళింపు చేసుకున్న వ్యక్తి, తన జీవితంలోని ప్రతి సమస్యనూ సులువుగా ఎదుర్కోవడమే కాకుండా, ఆదర్శ పురుషుడిగా కీర్తింపబడతాడన్నది చారిత్రక వాస్తవం. అంతెందుకు, 8 రోజుల అంతరీక్ష యాత్ర కోసం వెళ్లి, 286 రోజుల పాటు అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి, Nasa వ్యోమగామి సునీత విలియమ్స్, 9 నెలల తన సుదీర్ఘ రోదశి యాత్రను ముగించుకుని, 2025, మార్చి 19 న భూమిపైకి సురక్షితంగా చేరిన విషయం తెలిసిందే. తన సంకల్ప బలానికీ, తాను క్షేమంగా తిరిగి రావడానికీ దైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తనకు ఎల్లవేళలా తోడుండే వినాయక ప్రతిమ, భగవద్గీత పుస్తకం గురించి వెల్లడించడం గమనార్హం. అంతటి మహోన్నత గ్రంధానికీ, ప్రపంచాన్ని క్షణాలలో నాశనం చేయగల న్యూక్లియర్ బాంబ్ కీ సంబంధం ఉందా?... అసలు ప్రపంచ శ్రేయస్సును కోరే భగవద్గీతకూ, ప్రపంచాన్ని సమూలంగా నాశనం చేయగల అణుబాంబుకూ సంబంధం ఏమిటి? వినాశకర అణుబాంబు నిర్మాణం వెనుక భగవద్గీత ప్రభావం ఉందా? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/zCiU6xTk4zs ]


రెండేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్త సినీ అభిమానులంతా చర్చించుకున్న పేరు, Oppenheimer. ఆ సినిమాకు దర్శకత్వం వహించిన Christopher Nolan కి ఉన్న ట్రాక్ రికార్డ్ అటువంటిది. అద్భుతమైన కథ, కథనం కలగలిసిన సినిమాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయగల అతి కొద్ది మంది దర్శకులలో, Christopher Nolan ముందు వరసలో ఉంటారు. అటువంటి వ్యక్తి దర్శకత్వంలో 2023 లో వచ్చిన సినిమా, Oppenheimer. దశాబ్దాల క్రితం ప్రపంచ గతినే మార్చిన గొప్ప శాస్త్రవేత్త Oppenheimer జీవిత వాస్తవాల ఆధారంగా తీసిన సినిమా ఇది. అసలు ఎవరీ Oppenheimer? అతని గాధనే సినిమాగా తియ్యాలని Nolan ఎందుకనుకున్నారు? ఈ సినిమాకీ, న్యూక్లియర్ బాంబ్ కీ, భగవద్గీతకీ ఉన్న సంబంధం ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే, కొన్ని దశాబ్దాల క్రితం ఘటించిన ప్రపంచ చరిత్ర గురించి తెలుసుకోవాలి.

1945, July 16 న, అమెరికాలోని New Mexico కి సరిగ్గా 210 కిలోమీటర్ల దూరంలోని Jornada del Muerto అనే ఎడారి వైపుకు ప్రపంచం మొత్తం చూసి గజగజా వణికి పోయింది. ఆ రోజే మానవ చరిత్రలో తొలిసారిగా అణు బాంబు పరీక్ష జరిగింది. ఆ నాడు ప్రపంచం మొత్తం రెండే రెండు విషయాలపై మాట్లాడుకున్నారు. అందులో, మహా సామ్రాజ్యాలను సైతం క్షణాలలో బూడిద చేసే న్యూక్లియర్ బాంబ్ టెక్నాలజీని అమెరికా సాధించిందనే వార్త ఒకటయితే, రెండవది, ఆ బాంబుని సృష్టించిన Oppenheimer అనే శాస్త్రవేత్త గురించి..

ఆయన పూర్తి పేరు Julius Robert Oppenheimer. ఆయనను ప్రపంచ చరిత్రలో మరో పేరుతో కూడా గుర్తు చేసుకుంటారు. అదే, ‘Father Of The Atomic Bomb’. Jewish మతానికి చెందిన Oppenheimer తల్లితండ్రులు, అతడు పుట్టక మునుపే బ్రతుకు తెరువు కోసం అమెరికాకు వలస వెళ్ళారు. అలా వెళ్ళిన వారికి ఆయన, 1904, April 22 న అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జన్మించాడు. చిన్న తనం నుంచీ చదువులలో తోటి విద్యార్థులకంటే ముందు ఉండేవాడు, Oppenheimer. 19 ఏళ్ళు వచ్చేసరికి, అతనికి chemical science లో శాస్త్రవేత్తగా ఎదగాలనే కోరిక జనించింది. ప్రపంచంలోని అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఒకటిగా పేరుపొందిన Harvard University లో జాయిన్ అయ్యాడు తన ఆశయాన్ని సాధించుకోవడానికి. అక్కడ చేరిన తొలి రోజులలో తన ఆరోగ్యం దెబ్బతినడంతో, ఒక ఏడాది కాలం పాటు చదువుకు దూరంగా ఉన్నాడు, Oppenheimer. అయినా అమోఘమైన తెలివి తేటలు కలిగిన Oppenheimer, తన నాలుగేళ్ల చదువును కేవలం మూడేళ్ళలో పూర్తి చేశాడు.

ఆ తర్వాత Physics పై మక్కువ పెంచుకుని, అమెరికా నుంచి జర్మని వెళ్లి, అక్కడ ఉన్న University of Göttingen లో చేరాడు. అలా తన జీవితాన్ని కేవలం మేధస్సును పెంచుకోవడానికే ఉపయోగిస్తూ సాగాడు Oppenheimer. ఈ క్రమంలో Albert Einstein వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తలతో కూడా పని చేశాడు. అలా Nuclear physics పై కూడా ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చాడు.

Oppenheimer జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించినా, మనస్సులో అంతర్లీనంగా ఎదో తెలియని ఆవేదన దాగుండేది. దానితో ఎప్పుడు చూసినా ఎదో పోగొట్టుకున్న వ్యక్తిలా depression లో ఉండేవాడు Oppenheimer. ఆ depression వల్ల ప్రతి రోజు లెక్కలేనన్ని సిగరెట్లు కాల్చేవాడు. రోజులో ఎక్కువ సమయం ఏదైనా పరిశోధనలో మునిగిపోవడం, లేదా సిగరెట్లు కాల్చడంపైనే దృష్టి పెట్టడం అతని దినచర్యగా మారింది. ఈ క్రమంలో ఆహారం కూడా సరిగ్గా తీసుకునేవాడు కాదు. అతని క్షేమం కోరే బంధుమిత్రులు ఆరోగ్యం గురించి అతనికి ఎంత హితవు చెప్పినా, Oppenheimer వారి మాటలు పట్టించుకునేవాడు కాదు.

ఈ క్రమంలో అతనికి దగ్గరై, అతని జీవితంలో ఒక భాగమై, అతని మానసిక ప్రశాంతతకు కారణం అయ్యింది, మన భగవద్గీత. మానవాళి మేలు కోసం, కురుక్షేత్ర సంగ్రామ సమయంలో ఆ యుగ పురుషుడు చెప్పిన భగవద్గీత, Oppenheimer కి ఆ నాడు సర్వస్వం అయ్యింది. మొదట ఆంగ్లంలో అనువదించబడిన భగవద్గీతను చదివిన Oppenheimer, ఆ తర్వాత university of California లోని Sanskrit professor సహాయంతో సంస్కృత భాషను నేర్చుకుని, సంస్కృతంలో రాసిన భగవద్గీతను చదవడం మొదలు పెట్టాడు. అలాగే సంస్కృత భాషలో అందుబాటులో ఉన్న ఎన్నో భారతీయ ఇతిహాసాలనూ, Meghaduta వంటి కావ్యాలనూ చదివి ఆకళింపు చేసుకున్నాడు. ఎన్ని చదివినా, అతని అభిమాన గ్రంధం మాత్రం, శ్రీమద్ భగవద్గీతే. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే, ఎన్నో సందర్భాలలో, ఎంతో మందితో ప్రస్థావించడమే కాకుండా, చాలా మందికి భగవద్గీత పుస్తకాలను బహుమానంగా ఇచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఆయన ఆఫీస్ డెస్క్ పై ఎప్పుడూ భగవద్గీత పుస్తకం ఉండేలా చూసుకునేవాడు. ఆఖరికి Oppenheimer కారుకు శ్రీ మహా విష్ణువు వాహనం అయిన గరుత్మంతుడి పేరును సూచించేలా, గరుడ అనే పేరు పెట్టుకున్నాడు. ఒక నాడు Oppenheimer సోదరుడు ఒక interview లో మాట్లాడుతూ, Oppenheimer భౌతికంగా హిందూ మతాన్ని తీసుకోవడం కానీ, హిందూ ఆలయాలకు వెళ్ళడం కానీ ఎప్పుడు చేయకపోయినా, అతని అంతరాత్మ మాత్రం పూర్తిగా హిందువుగా మారిపోయిందని చెప్పాడు. మన భగవద్గీత Oppenheimer జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో, దీనిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఇదిలా ఉండగా, 1939 లో జర్మన్ నియంత రెండవ ప్రపంచ యుద్ధానికి తేర తీసినప్పటినుంచీ, ప్రపంచ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం మొదలయ్యింది. ఈ క్రమంలో ఆ యుద్ధాన్ని కేవలం ఒక్క బాంబ్ తో ముగించి, ఈ ప్రపంచం మొత్తాన్నీ తానే నియంత్రించాలనీ హిట్లర్ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా జర్మనీలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను ఒక్క తాటిపైకి తెచ్చాడు. Quantum Mechanics లో Pioneer గా పేరుగాంచిన Werner Heisenberg అనే శాస్త్రవేత్తను, ఆ బృందానికి అధ్యక్షుడిగా నియమించాడు.

జర్మనీలో జరుగుతున్న ఈ విషయాలను తెలుసుకున్న Albert Einstein, హిట్లర్ చేతికి ఆ విధ్వంసకర ఆయుధం గనుక చిక్కితే, ప్రపంచ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని గ్రహించి, అదే విషయాన్ని ఒక ఉత్తరం ద్వారా నాటి అమెరికా అధ్యక్షుడయిన Franklin Roosevelt కి తెలియచేశాడు. దాంతో Franklin Roosevelt, అమెరికాలోని Top శాస్త్రవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి, హిట్లర్ ఆ విధ్వంసకర ఆయుధాన్ని సాధించడానికి మునుపే వారు తయారు చేయాలని ఆదేశించాడు. ఆ సమావేశం తర్వాత Manhattan Project అనే ఒక చారిత్రాత్మక project కి రూపకల్పన జరిగింది.

తొలుత ఈ Manhattan Project కి Einstein ని అధ్యక్షుడిగా నియామిద్దాం అని అనుకున్నారు. కానీ Einstein పుట్టుక రిత్యా జర్మనీకి చెందినవాడు కాబట్టి, అతని వల్ల ప్రాజెక్ట్ details leak అయ్యే ప్రమాదం ఉందని భావించిన నాటి అమెరికా ప్రధాని, ఆయన స్థానంలో వేరొక వ్యక్తిని నియమించమని కోరాడు. దానితో అమెరికా వాసి అయిన Oppenheimer పేరు తెరపైకి వచ్చింది. అతను కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త కావడం, Nuclear physics లో ఎన్నో పరిశోధనలు చేసి ఉండటంతో, Oppenheimer ని Manhattan Project కి హెడ్ గా నియమించారు.

ఈ ప్రాజెక్ట్ కోసం అమెరికా ‘మెక్సికో నగరం’ దగ్గర ఒక రహస్య నగరాన్నే నిర్మించింది. దాని పేరే, Los Alamos. Manhattan Project కోసం దాదాపు లక్షా ముప్పై వేల మంది పని చేశారు. ఇందులో క్రింది స్థాయి సాధారణ పనులు చేసేవారి దగ్గర నుంచి, శాస్త్రవేత్తల వరకూ అందరూ ఉన్నారు. Manhattan Project కి సంబంధించిన ఏ విషయమూ బయటకి పోక్కకూడదన్న ముందు జాగ్రత్తతో, అందులో పనిచేసేవారికి ఎన్నో ప్రత్యేకమైన పరీక్షలు నిర్వహించి వారిని ఎంపిక చేశారు. వారిలో ప్రతి ఒక్కరకీ ఒక నకిలీ పేరును నిర్ణయించి, ఆ పేరుతోనే చలామణీ చేసేవారు. ఒకవేళ వారి అసలు identity ని పొరపాటున బయటపెట్టినా, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. అనుకోని పరిస్థితులలో ఎవరైనా తమ అసలు పేరును తోటివారితో పంచుకున్నారని తెలిస్తే, వెంటనే వారిని కఠినంగా శిక్షించేవారు.

అంతేకాదు, Manhattan Project జరుగుతున్న సమయంలో ఎవరికైనా పిల్లలు పుడితే, Birth Certificate లో పుట్టిన ఊరి పేరుకి బదులుగా, P O Box 1663, New Mexico అని మాత్రమే ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా చరిత్రలోనే అత్యంత రహస్యమైన ప్రాజెక్ట్ గా, Manhattan Project ని పేర్కొనవచ్చు. మూడేళ్ళ పాటు ఇన్ని కష్టాలు పడి, దాదాపు రెండు బిలియన్ డాలర్లు ఖర్చు చేసిన తర్వాత, ప్రపంచ గతిని మార్చే మొదటి విధ్వంసకర న్యూక్లియర్ బాంబ్ తయారయ్యింది.

ఆ బాంబ్ ని Nuclear Fusion అనే థియరీ ఆధారంగా తయారు చేశారు. ప్రకృతిలో దొరికే ఎన్నో రకాల కెమికల్ పదార్ధాలలో అత్యంత అరుదైన పదార్ధం ఉరేనియం. దీని atomic number 238. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులలో ఈ ఉరేనియంని శుద్ధి చేసి, Uranium Number 235 ని వేరు చేశారు. ఇదే అణుబాంబు తయారీలో ప్రాధాన మూలకంగా మారింది. కారణం, ఇదో Unstable Element. ఈ Uranium 235 ని ఒక Neutron తో ఢీ కొట్టిస్తే, ఒక కొత్త Neutron ఆవిర్భవిస్తుంది. అలా పుట్టిన Neutron, మళ్లి వెళ్లి Uranium Particle ని ఢీ కొడుతుంది. ఒక చైన్ రియాక్షన్ లాగా ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇలా జరిగే సమయంలో, విపరీతమైన energy రిలీజ్ అవుతుంది. ఆ energy యే, సమస్త ప్రకృతినీ మసి చేసేస్తుంది.

మొదటి న్యూక్లియర్ పరీక్ష జరిగిన తర్వాత, ఆ బాంబ్ తామనుకున్నదానికంటే అత్యంత విధ్వంసకరంగా మారిందని శాస్త్రవేత్తలు గ్రహించారు. జర్మనీ కంటే ముందే అమెరికా న్యూక్లియర్ బాంబ్ ని సాధించడం వల్ల, ప్రపంచ శ్రేయస్సు జరుగుతుందని Oppenheimer కూడా భావించాడు. కానీ, ఆ బాంబ్ ని తయారుచేసి తను ప్రపంచ నాశనానికి కారకుడినయ్యానని తెలిసి, depression లోకి వెళ్ళిపోయాడు. అయితే, తాను నమ్మిన భగవద్గీతలోని ఓ శ్లోకం, అతడిని ఆ depression నుంచి బయట పడేసిందని Oppenheimer స్వయంగా ఒక interview లో చెప్పాడు. అందుకు నిదర్శనం ఈ వీడియో.. ఇక్కడ Oppenheimer ప్రస్తావించిన భగవద్గీత 11 వ అధ్యాయంలోని 32 వ శ్లోకం..

ఆధునిక శాస్త్రవేత్తలలో దిగ్గజం వంటి Oppenheimer చెప్పిన ఆ మాటలతో, మన భగవద్గీత గొప్పదనం ప్రపంచం మొత్తానికీ తెలిసి వచ్చింది. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత Christopher Nolan Oppenheimer సినిమా తీయడం, ఆ సినిమా రిలీజ్ కి ముందు, అందులో heimer పాత్రను పోషించిన Cillian Murphy పలు interviews లో, ఆ పాత్ర కోసం తాను భగవద్గీతను చదివినట్లు చెప్పడం, ఆ గ్రంధం గొప్పదనాన్ని పొగడటం, సినిమాలో కూడా భగవద్గీత శ్లోకాలు ఉండటంతో, గీత గొప్పతనం ప్రపంచ వ్యాప్తంగా మళ్ళీ మారు మ్రోగింది. ఇదే విషయాన్ని ఈ రోజు సునీత విలియమ్స్ మాటలు మరోసారి గుర్తు చేశాయి. వారెవరో చదవడం గురించి పక్కన పెడితే, మనలో ఎంతమంది భగవద్గీతను అధ్యయనం చేసిన వారున్నారు? సరే, భాషా పరమైన ఇబ్బందితోనో, సరిగా అర్ధం కాకనో చాలామంది చదవకపోయి ఉండవచ్చు. అటువంటి వారికోసం మనం సంపూర్ణ భగవద్గీత 18 అధ్యాయాలనూ, శ్లోక, అర్థ, తాత్పర్య, విశ్లేషణలతో, 140 వీడియోలుగా పోస్ట్ చేసి ఉన్నాము. Description లో లింక్ ను పొందుపరుస్తున్నాను. అందరూ సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాను..

ॐ🚩కృష్ణం వందే జగద్గురుం 🙏

Sunday, March 16, 2025

5000-year-old statue within a 1500-year-old temple | వింత ఆలయం!


వింత ఆలయం! TELUGU VOICE
గ్రహణ సమయంలోనూ మూయని గుడి! నైవేద్యం అలస్యమైతే శుష్కించిపోయే విగ్రహం!

ధర్మనిరతికీ ఎనలేని విజ్ఞానికీ పుట్టినిల్లు మన భారత దేశం అన్నది చారిత్రక వాస్తవం. అదే చరిత్ర, ఈ దేశం ఎన్నో అంతు చిక్కని మిస్టరీలకూ, ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్ధంకాని రహస్యాలకూ పుట్టినిల్లని చెబుతోంది. మరీ ముఖ్యంగా మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాలు అటువంటి రహస్యాలకు కేంద్రంగా నిలుస్తున్నాయి. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలన్నీ, గ్రహణ సమయంలో మూసి వేస్తారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆలయం మాత్రం ఆ సమయాలలో కూడా తెరిచే ఉంటుంది. గ్రహణ సమయంలో ఆహార పదార్ధాలు విషపూరితమవుతాయని సైన్స్ పరంగా కూడా నిరూపితమయ్యింది. మనుషులు తీసుకోకపోవడమే కాకుండా, మనం పూజించే దేవతా విగ్రహాలకు కూడా ఆ సమయంలో ఎటువంటి ఆహారమూ నివేదించడం జరగదు. కానీ ఈ ఆలయంలోని స్వామివారికి మాత్రం పసందైన ఫలహారాలను వండి సమర్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరంలో 365 రోజులూ, గ్రహణం వచ్చినా, వరదొచ్చినా, సునామీయే వచ్చినా, ఈ ఆలయంలోని దేవతా మూర్తికి నైవేద్యం పెట్టడం మాత్రం మానరు. ఒకవేళ అలా గనుక పెట్టకపోతే, ఆ విగ్రహం వెంటనే బక్కచిక్కి పోతుందని అంటున్నారు. లోహపు విగ్రహం బక్కగా అయిపోవడమేమిటని ఆశ్చర్యం కలగవచ్చు. అవును, ఒక్క పూట సమయానికి నైవేద్యం పెట్టకపోతే, వెంటనే విగ్రహం బక్కగా అయిపోతుందని అంటున్నారు అర్చకులు. ఇక్కడ మరో విశేషమేమిటంటే, ఈ విగ్రహ చరిత్ర ఏకంగా 5000 ఏళ్లనాటి మహా భారత కాలానికి ముడిపడి ఉందని చెబుతున్నారు. మరి అటువంటి వింత ఆలయం ఎక్కడుంది..? అక్కడ ఎవరిని పూజిస్తారు..? ఎందువల్ల అక్కడ విగ్రహం ఆహారం లేకపోతే శుష్కించి పోతుంది..? వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/VyGhUyDsABQ ]


‘కేరళ’ అంటే, దేవ భూమి, God's Own Country అనే పేరుంది. అందమైన ప్రకృతి సోయగాలతో పాటు, ఎంతో పురాతమైన ఆలయాలకూ, సంప్రదాయ సంస్కృతులకూ, విద్యలకూ, కళలకూ పుట్టినిల్లు వంటిది, కేరళ. కేరళ చరిత్రకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియోను తప్పనిసరిగా చూడండి.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వింత ఆలయం కూడా, సాక్ష్యత్తు పరశురామ నిర్మితమైన కేరళ రాష్ట్రంలోనే ఉంది. అదే.. తిరువరప్పు శ్రీకృష్ణ మందిరం.

ఈ ఆలయం కొట్టాయం నగరానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువరప్పు అనే ఊరిలో ఉంది. కేరళలో ఉన్న అతి ముఖ్యమైన విష్ణుమూర్తి అవతారాలకు చెందిన ఆలయాలలో, తిరువరప్పు శ్రీకృష్ణ మందిరం ముఖ్యమైనదిగా చెబుతారు. చరిత్రకారులూ, ఆద్యాత్మిక వేత్తలూ చెబుతున్నదాని ప్రకారం, ఈ ఆలయంలో ఉన్న శ్రీ కృష్ణుడి విగ్రహం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదనీ, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడి ఆత్మ శక్తితో నిబిడీకృతమై ఉందనీ, అందుకే ఈ విగ్రహానికి సమయానికి నైవేద్యం అందకపోతే, మనుషులు తిండిలేకపోతే ఏ విధంగా శుష్కించి పోతారో, అదే విధమైన మార్పు ఈ విగ్రహంలో కూడా కనిపిస్తుందనీ తెలుస్తున్న వింత విషయం. ఇక్కడ స్వామి వారికి నైవేద్యం పెట్టే విధానాన్ని గమనించినా, దానికి వారు చేసుకునే సన్నాహాలు చూసినా నోట మాట రాదు.

సాధారణంగా మన దేశంలో ఉన్న ఇతర ఆలయాలన్నీ, ఉదయం 4 గంటలకో 5 గంటలకో తెరుస్తారు. కొన్ని ప్రముఖ పుణ్య క్షేత్రాలు మాత్రం 3 గంటలకు తెరిచి, ముందుగా ఆలయాన్ని శుభ్రం చేసుకుని, ఆ తరువాత స్వామివారికి అభిషేకం చేసి, ఆఖరున నైవేద్యం పెట్టి, పూజను ముగిస్తారు. ఈ తంతు మొత్తం పూర్తవ్వడానికి, దాదాపు గంట లేదా రెండు గంటల సమయం పడుతుంది. కానీ, తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం మాత్రం, తెల్లవారు జామున 2 గంటలకే తెరుస్తారు. ఆ వెంటనే ఒక బృందం ముందుగా వంట గదిలోకి వెళ్ళి, ఆక్కడి పాత్రలనూ, పరిసరాలనూ శుభ్రం చేసుకుని నైవేద్యం వండటం మొదలు పెడతారు. ఇక ప్రధాన అర్చకుడూ, ఆయనకు సహాయం చేసే పరివారం, స్వామి గర్భ గుడిని శుభ్రం చేసి, స్వామివారికి అతి వేగంగా అభిషేకం నిర్వహించి, అత్యంత వేగంగా ఆయన తలనీలాలను పూర్తిగా ఆరబెడతారు. తల ఆరగానే నైవేద్యం తెచ్చి స్వామి వారి చేతిలో కాస్త పెట్టి, ఆయన చేత ఆ నైవేద్యం ఆరగింప చేస్తారు. ఆ తర్వాత మాత్రమే తక్కిన శరీరంపై తడి లేకుండా తుడిచి, వాస్త్రాలూ, ఆభరణాలూ అలంకరించి, భక్తుల దర్శనానికి సిద్ధం చేస్తారు. ఇలా తెల్లవారు జామునే పెట్టే నైవేద్యాన్ని, ‘ఉషా పాయసం’గా పేర్కొంటున్నారు.

మిగిలిన క్షేత్రాలతో పోల్చి చూస్తే ఈ తంతు మొత్తం చాలా వింతగా అనిపిస్తుంది! ఇక్కడ మరో వింత ఏమిటంటే, ఒకవేళ ఏ కారణం చేతనయినా తెల్లవారు జామునే ప్రధాన ఆలయ ద్వారాలకు ఉన్న తాళం తెరుచుకోకపోతే, వెంటనే దాన్ని బద్దలు గొట్టే అధికారం, అక్కడి పూజారులకు ఉంది. ఏ కారణం చేతనయినా, ఇతర ఆలయాలలోని తాళాలు తెరుచుకొకపోతే, అవి తెరుచేంత వరకు వేచి వుంటారు. ఈ ఆలయంలో మాత్రం, తాళం తెరుచుకోవడంలో కాస్త అలస్యమైనా, వెంటనే దాన్ని బద్దలు గొట్టేస్తారు. అందుకోసం ప్రతి పూజారీ తమతో పాటు ఒక తాళం చేవీ, ఒక సుత్తిని కూడా వెంట తెచ్చుకుంటారు. ఎట్టి పరిస్థితులలోనూ స్వామి వారికి నైవేద్యం పెట్టడం ఆలస్యం కాకుండా చూసుకోవడమే వారి లక్ష్యమని, ఆధ్యాత్మిక వేత్తలంటున్నారు.

తిరువరప్పు శ్రీకృష్ణ మందిర పూజారులు ఇలా వింతగా చేయడం వెనుక ఒక చారిత్రక గాధ ఉందని, ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు. ఒకానొక సమయంలో, అన్ని ఆలయాలలో పాటించిన విధంగా, గ్రహణం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని కూడా మూసేసి, తల్లవారు జామునే వచ్చి ఆలయ ద్వారం తెరిచారు. అక్కడ కనిపించిన పరిణామం చూసి అర్చకుల కాళ్ళు చేతులు వణికి పోయాయి. ముందు రోజు రాత్రి వరకు ఎంతో అందంగా ఉన్న స్వామివారి విగ్రహం, తెల్లవారు జామున వచ్చి చూసేసరికి, చక్కటి రూపం పోయి, శుష్కించిపోయి కాంతి విహీనంగా కనిపించింది. అది చూసిన అర్చకులు కంగారు పడుతున్న సమయంలో, అక్కడికి వచ్చిన ఆది శంకరాచార్యుల వారికి పరిస్థితి వివరించి చెప్పారు. అప్పుడాయన అది సాధారణ విగ్రహం కాదనీ, సాక్ష్యత్తు శ్రీకృష్ణ పరమాత్ముడి ఆత్మ శక్తి అందులో నిక్షిప్తమై ఉందనీ, ఎట్టి పరిస్థితులలో ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టడం ఆగకూడదనీ తెలియజేశారు. అసలు ఆ విగ్రహం అలా ఉండటానికి గల మూల కారణాన్ని కూడా వివరించారు.

ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు కంస వధ గావించి, తల్లితండ్రులయిన దేవకీ వసుదేవులను విడిపించి, రాజుగా పట్టాభిషిక్తుడైన విషయం తెలిసిందే. కంసుడు సాధారణ వ్యక్తి కాదు. మహా బలశాలి అవ్వడంతో పాటు, తంత్ర విద్యలలోనూ ఆమోఘమైన ప్రావీణ్యం పొందిన వ్యక్తి. అతడిని ఓడించడం సాధారణ వ్యక్తుల వల్ల అయ్యేపని కాదు. అలాంటి వ్యక్తితో బాల కృష్ణుడు పోరాడి ఓడించి వధించడం జరిగింది. అంతటి భీకర యుద్ధం తర్వాత కృష్ణుడు బాగా అలిసిపోవడమే కాకుండా, విపరీతమైన కోపంతో, ఆకలితో ఉన్నాడు. అయితే వెంటనే చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి, ఆ ఉగ్ర స్వరూపాన్ని ఒక విగ్రహంగా మార్చి, ఒక ప్రత్యేకమైన విధానంలో భద్రపరచడం జరిగింది. ఇప్పుడు తిరువరప్పులో ఉన్నది ఆ విగ్రహమే అనీ, అందుకే ఎట్టి పరిస్థితులలో స్వామికి నైవేద్యం పెట్టి తీరాలనీ, ఆది శంకరుల వారు అక్కడున్న అర్చకులకు తెలియజేశారు.

అప్పటి నుంచి స్వామివారికి నైవేద్యం పెట్టె విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు అర్చకులు. ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకే ఆలయాన్ని మూసివేసి, తిరిగి తెల్లవారు జామున 2 గంటలకల్లా తెరుస్తారు. ఈ నాటికీ స్వామి వారికి నైవేద్యం పెట్టడంలో క్షణాలు అలస్యమైనా, విగ్రహానికి కట్టి ఉన్న మొలతాడు వదులవ్వడం గమించవచ్చని అర్చకులు చెబుతున్నారు. అంతేకాదు, సాధారణంగా కృష్ణ విగ్రహాలన్నీ చిరు మందహాసంతో ఎంతో అందంగా ఉంటాయి. తిరువరప్పు ఆలయంలోని విగ్రహం మాత్రం, కోపంగా చూస్తున్నట్లుంటుంది. కంసవధ సమయంలో ఆవేశంతో పోరాడిన రూపం ఎలా ఉంటుందో, అచ్చుగుద్దినట్లు ఇక్కడ ఉన్న విగ్రహం కూడా అలాగే ఉంటుంది. సరిగ్గా గమనిస్తే, ఆయన కళ్ళలో కోపం, కండలు తిరిగిన శరీరాన్ని కూడా చూడవచ్చు. నాలుగు చేతులు కలిగిన ఆ విగ్రహంలో వెనుక వైపు ఉన్న రెండు చేతులలో శంఖ చక్రాలు ఉంటే, ముందు వైపు ఉన్న కుడి చెయ్యి నైవేద్యం తినడానికి అనువుగా ఉన్నట్లుండి, మరో చెయ్యి భక్తులను ఆశీర్వాదిస్తున్నట్లు ఉంటుంది.

ఇదిలా ఉంటే, అసలు మహా భారత కాలం నాటి ఆ విగ్రహం, ఎక్కడో మధురలో మొదటిసారి బయటపడి, దేశానికి మరో పక్కన ఉన్న కేరళ రాష్ట్రానికి ఎలా చేరింది..? ఇక్కడ పూజలు ఎలా అందుకుంటోంది..? అనే సందేహాలు కలుగుతాయి. ఆ విషయం తెలియాలంటే, పాండవ వనవాసం సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకోవాలని చరిత్రకారులు చెబుతున్నారు.

మహాభారత కాలంలో పాండవ వనవాసం గురించి తెలిసిందే. జూదంలో సర్వస్వం పోగొట్టుకున్న పాండవులు, అన్నీ వదిలి అడవులకు వెళ్లబోయే ముందు వారు శ్రీ కృష్ణుడిని ప్రార్ధించారు. వనవాస సమయంలో తమకు రక్షణగా ఉండమని కృష్ణుడిని వేడుకున్నారు. ధర్మ పరిరక్షకుడైన శ్రీ కృష్ణుడు, పాండవుల భక్తికీ, ధర్మ నిరతికీ మెచ్చి, కంస వధ సమయంలో తన శక్తిని భద్రపరచి ఉంచిన విగ్రహాన్ని ఇచ్చాడు. అందులో ఉన్న తన ఆత్మ శక్తి గురించి తెలియజేసి, ఆ విగ్రహాన్ని కొలిస్తే శత్రు భయం ఉండదు, అనారోగ్యం దరిచేరదు, ఆకాల మృత్యు దోషాలను తొలగిస్తుంది, అమితమైన బలాన్ని ఇస్తుంది, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. అలా పాండవులు వనవాసంలో ఉన్నంత కాలం ఆ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో కొలిచారు.

ఇక వారి వనవాస సమయం పూర్తయ్యి, అజ్ఞాత వాసానికి బయలుదేరే సమయంలో జరిగిన ఓ సంఘటనే, కృష్ణ పరమాత్ముడి ఆత్మ శక్తి కలిగిన ఆ విగ్రహం కేరళ వరకు వచ్చి, నేడు భక్తకోటి పాలిట కొంగు బంగారంగా మారడానికి కారణమైందని, చరిత్రకారులు చెబుతున్నారు. పాండవులు వనవాస సమయంలో ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలలో ఉండటం జరిగింది. అలా వారు ఆఖరుగా ఉన్న ప్రాంతానికి దగ్గరలో, సముద్రం ఉండేది. దానితో అక్కడకి దగ్గరలోనే చేపలు పట్టుకునే వారి చిన్న గ్రామం ఒకటి ఉండేది. అక్కడి బెస్త వారు, మహా తేజోవంతులైన పాండవులకు పలు విధాలుగా సేవలు చేస్తూ ఉండేవారు. ఇక వన వాసం పూర్తయి వారు అక్కడి నుంచి వెళ్ళే సమయంలో, ఆ బెస్త వారు చింతించి, గుర్తుగా వారు నిత్యం పూజించే కృష్ణ విగ్రహాన్ని ఇవ్వమని కోరారు. ఆ మత్స్యకారుల కోర్కెను మన్నించిన పాండవులు, శ్రీకృష్ణుడి ఆత్మ శక్తిగల ఆ విగ్రహాన్ని ఇచ్చి, అజ్ఞాత వాసానికి వెళ్ళిపోయారు.

ఇది జరిగిన కొన్నేళ్లకు ఆ గ్రామంలో తీవ్రమైన కరవు రావడంతో పాటు, పదే పదే సముద్రం పోటెత్తి, గ్రామాన్ని ముంచెత్తుతూ ఉండేది. కొంత కాలానికి అటుగా ఒక ఋషి రావడంతో వారు తమ బాధలు చెప్పుకున్నారు. తన తపోశక్తితో ఆయన జరుగుతున్న పరిణామాలను గ్రహించి, వారి వద్ద ఉన్న విగ్రహం అమిత శక్తివంతమైనదనీ, దానికి వారు సరిగ్గా పూజలు చేయాలకపోవడం మహా దోషమనీ, వెంటనే ఆ విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. వారు ఆ ఋషి చెప్పినట్లే చేశారు. అలా ఆ నాడు శ్రీ కృష్ణుడి ఆత్మ శక్తి నిక్షిప్తమైన ఆ విగ్రహం సముద్ర గర్భంలో కలిసిపోయింది.

కొంతకాలానికి ద్వాపర యుగం ముగిసి, కలియుగం ఆరంభమైంది.. సముద్రంలో కలిసిన విగ్రహం నీటి ఆటుపోట్ల కారణంగా కొంతకాలానికి కేరళ సముద్ర తీరం సమీపానికి చేరింది. ఇదిలా ఉండగా, రమారమి 1500 ఏళ్ల పూర్వం ఒకనాడు బిల్వమంగళ స్వామి అనే మహా యోగి పడవలో వెళ్తుండగా, అళప్పురా నగరానికి సమీపంలోని సముద్ర తీరానికి రాగానే, పడవ కదలకుండా ఆగిపోయింది. పడవ నడుపుతున్న వ్యక్తి ఎంత ప్రయత్నించినా అది కదలకపోవడంతో, ఆయన తన తపో శక్తితో వీక్షించి, నీటిలో అతి శక్తివంతమైన విగ్రహం ఉందని గ్రహించాడు. వెంటనే నలుగురు వ్యక్తుల సహాయంతో నీటిలోంచి ఆ విగ్రహాన్ని తీయించి చూడగా, తేజోవంతంగా ప్రకాశిస్తూ 5 అడుగుల ఎత్తున్న శ్రీ కృష్ణుడి విగ్రహం కనిపించింది.

ఆ విగ్రహంతో తీరం చేరుకున్న యోగి Kottayam వైపు వెళుతూ, మార్గ మధ్యలో సంధ్యా వందనం కోసం విగ్రహాన్ని కిందకి దించి, దగ్గరలోని ఓ కొలనులో స్నానం చేసి, సంధ్యా వందనం పూర్తిజేసుకుని వచ్చిన తర్వత, విగ్రహం కదలలేదు. దానితో కృష్ణుల వారు అక్కడే కొలువై ఉండాలని తలచినట్లు భావించి, అదే స్థలంలో విగ్రహ ప్రతిష్ట చేసి, దానిపై కోవెల కట్టించాడు. అదే ఇప్పుడు మనం చూస్తున్న తిరువరప్పు శ్రీకృష్ణ మందిరం.

అయితే, కొంతమంది చరిత్రకారుల వాదన ప్రకారం, ఆ నాడు విగ్రహాన్ని ప్రతిష్టించినది బిల్వమంగళ స్వామి కాదనీ, పద్మపాదాచార్యుల వారనీ అంటారు. ఏది ఏమైనా, ఎక్కడో మధురలో మొదలై, పాండవ వనవాస సమయానికి గుజరాత్ తీరంలో గల అటవీ ప్రాంతానికి చేరి, ఆపై అరేబియా సముద్రంలో కలిసి, అక్కడి నుంచి కేరళ తీరానికి చేరి, సముద్ర తీరానికి దూరంగా ఉన్న తిరువరప్పు అనే చిన్న ఊరిలో స్థిరపడి, ప్రపంచాన్ని మొత్తం ఆ గ్రామం వైపు తిరిగి చూసేలా చేశాడు కృష్ణయ్య. అలా 1500 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో నేటికీ ఎంతో నిష్టతో, భక్తితో సమర్పించే పూజలందుకుంటూ, భక్తుల పాలిట కొంగు బంగారంగా మారాడు, కృష్ణ పరంధాముడు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో, విళక్కెడుప్పు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ ఉత్సవాన్ని చూడటానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు అక్కడికి వస్తారు. కేరళ సంప్రదాయ పద్ధతిలో జరిగే ఆ ఉత్సవం అద్భుతంగా ఉంటుందని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే చూడటానికి రెండు కళ్ళు చాలవని అంటారు. ఇంతటి ఘన చరిత్ర, శక్తి కలిగిన ఆ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా చూసి తరించాల్సిందే.

ॐ 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Monday, March 10, 2025

Aurangzeb: The Man and the Myth | ఔరంగ్ జేబ్!

 

ఔరంగ్ జేబ్! TELUGU VOICE
మన పాఠ్య పుస్తకాలు తెలియజేయని, నివురుగప్పిన నిప్పువంటి వాస్తవాలను కొంతకాలమే దాయగలరు!

భూమి అట్టడుగు పొరల్లో దాగున్న శిలాద్రవంలా అసలైన చరిత్ర కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటకు తన్నుకు రాకమానదు! ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా, ఇది ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక విధంగా జరిగి తీరుతుంది. సాధారణంగా మన ఛానల్ లో ఇంతవరకూ, బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని చారిత్రక గాధలూ, కావాలని కుహనా మేధావులు దాచిన హైందవ వీరుల అపురూప చరిత్ర, ఒకప్పుడు అఖండ భారతవనిని ఏలిన గొప్ప చక్రవర్తుల అపూర్వ గాధల గురించి మాత్రమే చెప్పుకున్నాము. మంచితో పాటు, చెడు గురించిన అవగాహన కూడా భావితరాలకు కల్పించాలన్న సదుద్దేశ్యంతో ఈసారి మాత్రం, ఒక హిందూ ద్వేషి, పరమ కిరాతకుడు, నరరూప రాక్షసుడి జీవితం, హైందవ ఆలయాలను ధ్వంసం చేయడమే పరమావధిగా పెట్టుకున్న ఒక నీచుడి గుట్టు, కోట్లాదిమంది ఆమాయక హిందువుల జీవితాలను మత మార్పిడి పేరుతో కాలరాసిన నరహంతకుడి కుతంత్ర భాగోతం గురించిన వాస్తవాలను తెలుసుకుందాము. అతనెవరో కాదు, ఆఖరి మొఘల్ చక్రవర్తి, పరమ హిందూ ద్వేషిగా పేరు పొందిన Aurangzeb. అసలు Aurangzeb ఎవరు..? అతనికీ మనవారికీ యుద్ధం ఎలా జరిగింది..? అసలు అతను చక్రవర్తి ఎలా అయ్యాడు..? వంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xtH92PF3sR4 ]


16వ శతాబ్దం మధ్యలో బాబర్ తో మొదలైన మొఘల్ సామ్రాజ్యం, 1862 లో మరణించిన రెండవ Bahadur Shah Zafar వరకూ కొనసాగింది. అయితే, Aurangzeb మరణం తర్వాత మొదలైన మొఘల్ సామ్రాజ్య పతనం, 19వ శతాబ్దం నాటికి పూర్తిగా అంతరించిపోయినట్లు చరిత్ర చెబుతోంది. ఇక ‘Aurangzeb’ అంత క్రూరమైన పాలకుడిగా మారాడానికి కారణాలు తెలియాలంటే, ముందుగా అతను చిన్నతనం నుంచి ఎదుర్కొన్న విషయాలతో పాటు, అతడి తండ్రి అయిన Shah Jahan దౌర్భాగ్యపు చరిత్రను ముందుగా తెలుసుకోవాలి. 

Shah Jahan అనే పేరు వినగానే, ఆయనొక ప్రేమ పిపాసి, ముంతాజ్ ని అత్యంత ఘాడంగా ప్రేమించిన అమర ప్రేమికుడు, ఆమె కోసం ఏకంగా తాజ్ మహల్ నే కట్టించాడు వంటి విషయాలు, అభూత కల్పనలు మాత్రమే, మన కుహనా చరిత్రకారులు ఇంతవరకు మనకు నూరిపోస్తూ వచ్చారు. వాడంత నీచుడు మరొకడు ఉండడనే విషయాలను పొరపాటునకూడా మనకు తెలియకుండా మన కుహనా మేధావులు దాస్తూ వచ్చారు. Shah Jahan.. మొఘల్ చక్రవర్తి Jahangir కీ, అతడి రెండవ భార్య Jagat Gosain కీ పుటిన మూడవ సంతానం. Jahangirకి దాదాపు 20 మంది భార్యలు, లెక్కలేనంతమంది ఉంపుడు గత్తెలూ ఉండేవారు. అయితే వారిలో Jahangirకి బాగా దగ్గర వ్యక్తి, తెలివైన భార్య, Nur Jahan. Shah Jahan లో ఉన్న భయంకరమైన మనస్తత్వాన్ని ముందుగానే పసిగట్టిన ఆమె, అతడిని అదుపులో పెట్టడానికి చేయని ప్రయత్నం లేదు. కానీ, Jahangir చనిపోయిన వెంటనే Nur Jahan తో పాటు, తనకు అడ్డుగా ఉన్న అన్నదమ్ములనూ, బావలనూ, ఇలా దాదాపు 36 మందిని అత్యంత ఘోరంగా చంపించాడు, Shah Jahan. సొంత అన్నతోనే యుద్ధం చేసి ఓడించి, అతడిని అత్యంత కిరాతకంగా చంపాడు.

ఇక ఆడవారి విషయానికొస్తే, Shah Jahan ని మించిన కామాంధుడు మరొకడు ఉండడు. ఇతనికి ఐదుగురు భార్యలు, దాదాపు వెయ్యికి పైగా ఉంపుడుగత్తెలు ఉండేవారు. ఇతని కంటికి అందంగా కనపడ్డ ప్రతి ఆడదాన్ని చెరిచాడు. అందుకు ఉదాహరణగా, సొంత భావమరిది ఆఖరి భార్యను చెరిచిన ఘటనను చరిత్రకారులు ప్రత్యేకంగా చెబుతారు. Shah Jahan భార్య ముంతాజ్ సొంత అన్న Shaista Khan, బెంగాల్ కి మొఘల్ గవర్నర్ గా పనిచేసేవాడు. అతనికి చాలా మంది భార్యలు ఉండగా, వారిలో ఆఖరి భార్య వయసులో చాలా చిన్నది కావడంతో పాటు, అత్యంత అందగత్తె కూడా అని చరిత్రకారులు చెబుతున్నారు. ఒకనాడు ఆమె ఆగ్రాకోటకు వచ్చినప్పుడు, ఆమె అందానికి ఒళ్ళు తెలియని Shah Jahan ఆమెను బాలాత్కరించాడు. కానీ లెఫ్ట్ చరిత్రకారులు మాత్రం, Shah Jahan గొప్పవాడు, అమర ప్రేమికుడు, తాజ్ మహల్ కట్టించాడంటూ గొప్పలు చెప్పి, ఆ అబద్ధాలనే చిన్న పిల్లల పాఠ్య పుస్తకాలలో చేర్చి, తప్పుడు చరిత్రను భావితరాలకు నూరి పోశారు.

వావి వరుసలు లేని ఇలాంటి వ్యక్తుల మధ్య పెరిగిన Aurangzeb మంచి నాయకుడు ఎలా అవ్వగలడు! Shah Jahan కి పుట్టిన నలుగురు కొడుకులలో Aurangzeb మూడవ వాడు. Dara Shikoh, Murad Bakhsh, Shah Shuja అతని అన్నదమ్ములుగా తెలుస్తోంది. వీరిలో పెద్దవాడు Dara Shikoh కాగా, మొదటి నుంచి అతనే కాబోయే మొఘల్ చక్రవర్తి అని అందరూ భావించేవారు. Shah Jahan కూడా ఎన్నో సందర్భాలలో తన తర్వత రాజు Dara Shikoh అని చెబుతుండడం, అతనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, చరిత్ర విదితం. ఒక విధంగా Aurangzeb, Shah Jahan పై పగ పెంచుకోడానికి ఈ విషయం కూడా కారణం అని చెప్పవచ్చు.

చిన్నతనం నుంచి అమిత కుంచిత మనస్తత్వం గల Aurangzeb ఆలోచనా విధానాన్ని Shah Jahan గమనిస్తూనే ఉండేవాడు. ఒకనాడు Aurangzeb తో పాటు అతని సోదరులు యమునా నది ఒడ్డిన ఏనుగుల పోరు చూడటానికి వెళ్ళగా, వాటిలో ఒక ఏనుగు అదుపు తప్పి Shah Jahan కొడుకులు ఉన్న వైపు దూసుకు వచ్చింది. భయంతో అక్కడున్న వారంతా తప్పించుకోగా, Aurangzeb ఒక్కడు ఆ ఏనుగుపైకి బల్లెం విసిరి, దాని వేగాన్ని నియంత్రించడంలో మావటి వాడికి సహకరించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఘటనతో తన కొడుకు ధైర్య సహసాలకు మెచ్చి, Shah Jahan పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపడమే కాకుండా, Aurangzeb కి భారీ ఎత్తున నగదు బాహుమానంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది చరిత్రకారులు మాత్రం, ఆ సందర్భంలో Dara Shikoh, Murad Bakhsh చాలా దూరంలో ఉన్నారనీ, ఆ సమయంలో Aurangzeb పక్కన Shah Shuja కూడా ఉన్నాడనీ, అతను కూడా ఏనుగుపై బల్లెం విసిరి దాన్ని తీవ్రంగా గాయపరిచాడనీ చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఘటన Shah Jahan కి సంతోషంతో పాటు భయాన్ని కూడా పెంచింది. Aurangzeb కుంచిత ఆలోచనలతో పాటు, తెగువ కూడా కలిసి, ఎప్పటికైనా తన పెద్ద కుమారుడు Dara Shikoh కి ద్రోహం తలపెట్టవచ్చనీ, అతడి మరణానికి కూడా కారణం కావచ్చనీ భావించి, Aurangzeb ని ఢిల్లీ నుంచి దూరంగా, ఆఫ్ఘనిస్తాన్ వైపు పంపించేశాడు. ఆ కాలంలో రాజ కుమారాలకు రాజ్యంలోని ఒక్కో ప్రాంతాన్ని ఇచ్చి, అక్కడ వచ్చే పన్నులు వసూలు చేయడంతో పాటు, ఆ ప్రాంత రక్షణ, విస్తరణ వంటి బాధ్యతలను అప్పచెప్పేవారు. ఆ విధంగా Aurangzeb ని మొదట అతి కఠిన పరిస్థితులు ఉండే ఆఫ్ఘనిస్తాన్ కి పంపగా, ఆ తర్వాత కొన్నేళ్లకు దక్కన్ ప్రాంత గవర్నర్ ను చేశారు.

పెద్ద కొడుకు Dara Shikoh కి అత్యంత సుసంపన్నమైన పంజాబ్ వంటి ప్రాంతాలు ఇచ్చాడు. రెండవ కొడుకు Murad Bakhsh కి గుజరాత్ నూ, ఆఖరి కొడుకు Shah Shuja కి నార్త్ ఈస్ట్రన్ స్టేట్స్ అయిన నాగాలాండ్ వంటి ప్రాంతాలనూ అప్పజెప్పాడు. ఇలా తన తక్కిన కొడుకులందరు పెద్దగా గొడవలు లేని, బాగా ఆదాయం వచ్చే ప్రాంతాలు పొందగా, Aurangzeb కి మాత్రం ఎప్పుడూ సమస్యాత్మకంగా ఉంటూ, దక్షిణాదిలో మొఘల్ పాలనకు అడ్డుపడుతూ ఉండే దక్కన్ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. ఈ దక్కన్ ప్రాంతంలో, ముఖ్యంగా బీజాపూర్ సుల్తానులూ, గోల్కొండ కుతుబ్ షాహీలూ తమ సత్తాను కాపాడుకోవడానికి మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పనిచేసేవారు. అటువంటి వారిని నీయంత్రించడానికీ, వారిని అణగద్రొక్కడానికీ, Aurangabad లో మకాం పెట్టాడు Aurangzeb.

Dara Shikoh ఇస్లాంలోని సూఫీ సున్నిత బోధనలకు ప్రాధాన్యత ఇస్తూ, సంస్కృతంపై పట్టు సాధించడం, హిందూవులను చేరదీయడం, కళలు, రచనలపై ఎక్కువగా దృష్టి పెట్టేవాడు. దానితో Dara Shikoh తన జీవితంలో ఒక్కసారి కూడా యుద్ధ క్షేత్రాన్ని చూడలేదు. ఇక రెండవ వాడైన Murad Bakhsh మత్తుకు బానిసై, తన స్నేహితులతో కలిసి ఎప్పుడూ మత్తులో మునిగి తేలుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మత్తు మందు కొనడానికి అతని స్నేహితులు Diwan Ali Naqi ని సంప్రదించగా, అతను నిరాకరించడంతో వారు Murad Bakhsh కు ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పారు. దానితో Murad Bakhsh ఆవేశంలో Diwan తల నరికి చంపాడు. ఇతని పరిస్థితి ఇలా ఉంటే, ఆఖరి కొడుకు Shah Shuja అతిపెద్ద స్త్రీ లోలుడని చరిత్ర చెబుతోంది. అతనికి చాలా మంది భార్యలతో పాటు, దాదాపు 5 వేలకు పైగా ఉంపుడు గత్తెలు ఉండేవారనీ, ఉదయం నుంచి రాత్రి వరకు ఆడవాళ్ళతోనే ఉండేవాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఇవన్నీ Aurangzeb కు వరంగా మారాయని చెప్పవచ్చు.

Aurangzeb మాత్రం, అత్యంత కష్టమైన ప్రాంతాలలో పనిచేస్తూ, ఆయా ప్రాంతాలలో ఉన్న రెబల్స్ ని నాశనం చేయడమే కాకుండా, తనకు ఎదురైన ప్రాంతాలను బలంతోనూ, కుతంత్రంతోనూ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇలా Aurangzeb ఒక పెద్ద మిలటరీ జనరల్ గా మారాడని చరిత్రకారులు చెబుతున్నారు.

కొంత కాలానికి Shah Jahan తీవ్రమైన అనారోగ్యం బారిన పడడంతో, ఆగ్రా కోటలో పాలన మొత్తం తండ్రి పేరుమీద Dara Shikoh చేస్తున్నాడని గ్రహించిన Murad Bakhsh, Shah Shuja, తమకు తాము మొఘల్ చక్రవర్తులుగా ప్రకటించుకుని, వారి పేరుమీద నాణాలు కూడా విడుదల చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడినుంచే Aurangzeb తన కుతంత్రానికి పదును పెట్టాడు. Murad Bakhsh, Shah Shuja లకు తానొక సూఫీ ఫకీరు వంటివాడిననీ, తనకు రాజ్యాధికారంపై ఎటువంటి మామకారమూ లేదనీ నమ్మబలికాడు. Dara Shikoh ను హిందూ పక్షపాతిగా, ఇస్లాం మత వ్యాప్తికి అడ్డు పడుతున్న వాడిగా ముద్రించాడు. అతడిని అధికారంనుంచి తప్పిస్తే నెమలి సింహాసనంపై వారిని కూర్చోపెడతానని చెప్పి, వారి నమ్మకాన్ని చూరగొన్నాడు. ఈ రాయబారాల కారణంగా ఆ ఇద్దరితో కలిసి భారీ సైన్యాన్ని పోగేసుకున్నాడు. వారికి Shaista Khan సైన్యం కూడా తొడవ్వడంతో పాటు, ఒంటెలపై నుంచి పేల్చగలిగే చిన్నపాటి ఫిరంగులను కూడా పెద్ద సంఖ్యలో పోగేసుకున్నాడు. ఆ కాలానికి అది అధునాతన టెక్నాలజీగా చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విధంగా ఆగ్రా కోటపై దండయాత్ర చేసి, Dara Shikoh ని ఓడించి, పారిపోతున్న అతనిని వెంటాడి పట్టుకుని, ఢిల్లీ మొత్తం ఊరేగించి మరీ చంపాడు. Dara Shikoh ముస్లిం మతాన్ని పాటించడం లేదనీ, హిందువులకు సన్నిహితంగా మెలుగుతూ ఇస్లాం మతానికి అత్యంత వ్యతిరేకమైన విగ్రహ పూజలు కూడా చేస్తున్నాడని చెప్పి, అతడిని ఊరి తీయించి, తర్వాత అతని తల నరికి, ఆ తలను ఒక పెట్టెలో పెట్టి, Shah Shuja కి పంపాడు.

అప్పటి వరకు తనతో సహకరించిన Murad Bakhsh మత్తులో ఉనప్పుడు నిర్బంధించి, ఉరి తీయించాడు. ఇక ఆఖరి వాడైన Shah Shuja ని కూడా బంధించమని అజ్ఞాపించగా, అతడు పరివారంతో పాటు నాగాలాండ్ వైపు పారిపోయాడు. అలా వెళ్ళిన Shah Shuja ఏమైపోయాడో ఇప్పటి వరకు తెలియదు. కొంతమంది ప్రకారం, అతడిని అక్కడి ఆటవిక తెగల వాళ్ళు చంపి తినేసి ఉండవచ్చనీ, మరికొంతమంది Aurangzeb సేనలు వేటాడి చంపేశారని అంటున్నారు. ఏది ఏమైనా ఇక తనకు అడ్డు లేకపోవడంతో, 1668, july 31 న మొఘల్ చక్రవర్తిగా గద్దెనెక్కాడు, Aurangzeb. ఇక అనారోగ్యంతో ఉన్న తండ్రి Shah Jahan ని, ఆగ్ర కోటలో గల ఒక మీనార్ లో బంధించి ఉంచగా, చివరి రోజులు ఆ మీనార్ లోనే గడిపి చనిపోయాడు Shahensha Shah Jahan.

ఇక్కడి వరకు జరిగిన సంఘటనలు Aurangzeb జీవితంలో ఒక భాగం అయితే, చక్రవర్తిగా మారిన తర్వాత నుంచి మరో భాగం మొదలైందని చెప్పవచ్చు. మొదటి నుంచి హిందూ ద్వేషి అవ్వడంతో పాటు, భారత దేశంలో ఇస్లాం మతస్థుతలు మాత్రమే ఉండాలన్న దూరాశాపరుడు. అందువల్ల Aurangzeb, ఆఫ్గనిస్థాన్, దక్కన్ ప్రాంతాలకు గవర్నర్ గా ఉన్నప్పటి నుంచీ, హిందువులు, బౌద్ధులు, సిక్కుల వంటి మతాలను వ్యతిరేకించే వాడు. ఆయా మతాలకు చెందిన ఆలయాలనూ, విగ్రహాలనూ ధ్వంసం చేయడం, వాటిపై మసీదులు కట్టడం వంటి పనులు చేసేవాడు.

ఆ క్రమంలో దక్కన్ ప్రాంత గవర్నర్ గా ఉన్నప్పుడే అతనికి ఎదురొచ్చిన వ్యక్తి, హిందూ ఆశాజ్యోతి, అమిత ప్రకారమ వీరుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్. గెరిల్లా యుద్ధ తంత్రంతో నాటి మొఘల్ సేనలనే కాకుండా, ఆ ప్రాంతంపై పట్టున్న బీజాపూర్ సుల్తాన్ లను కూడా ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించడం మొదలు పెట్టారు శివాజీ. ఆ విధంగా ఒక్క కోటతో మొదలైన ఆయన ప్రయాణం, వరుస విజయాలతో అనేక కోటలను దక్కించుకుంటూ ముందుకు సాగారు.

దక్షిణ భారతాన్ని మొత్తం మొఘల్ పాలనలోకి తీసుకురావలనే కోరికతో ఉన్న Aurangzeb, రానున్న కాలంలో శివాజీ మహరాజ్ తన కంట్లో నలుసులా, పక్కలో బల్లెంలా తయారవుతాడని ముందుగానే పసిగట్టి, ఆయనను అణగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా.. అప్పటికే బీజాపూర్ పై పట్టు తెచ్చుకున్న Aurangzeb, అక్కడి సుల్తాన్ తో కుమ్ముక్కయి, అతడి దగ్గర ఉన్న అత్యంత క్రూరుడు, బలశాలి అయిన Afzal Khan ని పంపాడు. భారీ కాయంతో ఎంతో బలంగా ఉండే Afzal Khan తెలివి, ధైర్యం, యుద్ధ కౌశలం చూసి Aurangzeb, బీజాపూర్ సుల్తాన్ లు సైతం భయపడేవారు. అలాంటి వ్యక్తిని శివాజీ మహరాజ్ ఒక్క దెబ్బతో చంపేయడంతో, Aurangzeb వెన్నులో వణుకు పుట్టింది. ఆ కారణంగానే, తన జీవిత కాలంలో ఏనాడూ, శివాజీ మహరాజ్ తో ఎదురుపడి యుద్ధం చేయలేదు.

తన జీవితంలో చాలా భాగం మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకోడానికే వెచ్చించాడు, Aurangzeb. అయినా అతని కోరిక నెరవేరలేదు. ఇంకా చెప్పాలంటే, ఈ ప్రయత్నంలో అప్పుల ఊబిలో కూరుకు పోయాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఆఖరికి నిరాశా నిస్పృహలతో, ఏకాగిగా, పేరు కూడా తెలియని ఘోరమైన జబ్బుతో, అదే మరాఠా గడ్డిపై కుక్క చావు చచ్చాడు.

Aurangzeb తన 50 ఏళ్ల సుధీర్ఘ పాలనలో ఎన్నో దారుణాలు చేశాడు. శివాజీ మహరాజ్ తర్వాత వచ్చిన శంభాజీ మహరాజ్ ని మోసంతో బంధించి, ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపాడో, మన గత వీడియోలో చెప్పుకున్నాము. అంతేకాకుండా శంభాజీ మహరాజ్ భార్యనూ, కొడుకునూ 17 ఏళ్ల పాటు, తన దగ్గర బందీలుగా ఉంచుకుని, మరాఠా విరులను బెదిరించడం మొదలుపెట్టాడు. అయితే శంభాజీ మరణం తర్వాత గద్దెనెక్కిన అతని సవతి తల్లి కొడుకు రాజా రామ్ కూడా, దాదాపు 11 ఏళ్ల పాటు Aurangzeb సేనలను వీరోచితంగా అడ్డుకున్నాడు. ఈ లోపు శంభాజీ మహరాజ్ కొడుకు సాహూ Aurangzeb దగ్గరే ఉంటూ, అతని నమ్మకాన్ని చూరగొని, రహస్యంగా మరాఠా వీరులకు సహాయం చేసేవాడు. Aurangzeb మరణం తర్వాత తన సామ్రాజ్యానికి వెళ్ళి, ఛత్రపతిగా అధికారం చేపట్టాడు.

Aurangzeb తన జీవిత కాలంలో ఏ ఇతర మతాన్నీ బ్రతకనిచ్చేవాడు కాదు. 9వ సిక్కు గురువైన Guru Tegh Bahadur ని కూడా మోసం చేసి పట్టుకుని, మతం మారమని బలవంత పెట్టాడు. Guru Tegh Bahadur అందుకు నిరాకరించడంతో, ఆయనను అత్యంత కిరాతకంగా చంపాడు. తన కళ్ల ముందే ఆయన అనుచరులను చిత్ర హింసలు పెట్టి, మరుగుతున్న పెద్ద పెద్ద నీళ్ళ తొట్టెలలో పడేయించి, పొడిచి పొడిచి చంపాడు. అదే విధంగా Guru Tegh Bahadur ని కూడా చిత్ర హింసలు పెట్టి, ఆఖరికి తల నరికి చంపాడు.

Guru Tegh Bahadur కొడుకు, సిక్కుల ఆఖరి మత గురువైన Guru Gobind Singh కొడుకులను బంధించి, మతం మారకపోతే చంపేస్తానని బెదిరించాడు. వారు చావునే ముద్దాడడానికి సిద్ధపడడంతో, బ్రతికి ఉండగానే వారిని సమాధి చేసి చంపించాడు, Aurangzeb జనరల్ అయిన Wazir Khan. ఇక్కడ అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, చనిపోయేనాటికి వారిలో ఒకరి వయసు 6, మరొకరి వయసు 9 ఏళ్లు. చిన్న పిల్లలని కూడా చూడకుండా అత్యంత దారుణంగా చంపించిన నరరూప రాక్షసుడు Aurangzeb.

Aurangzeb యొక్క హిందూ వ్యతిరేక పోకడుల కారణంగా, మరాఠాలూ, శిక్కులే కాకుండా, రాజ్ పుత్ లు, ఝాట్ ల వంటి ఎంతో మంది ఎదురు తిరిగారు. వీరిని అణచివేసే సమయంలో చాలాసార్లు ఘోరంగా ఒడిపోయినా, నెగ్గిన యుద్ధాలలో దొరికిన సైనికులను అత్యంత భయంకరమైన పద్ధతులలో చంపించాడు. మతం మారని హిందువులను చిత్ర హింసలు పెట్టి చంపుతూ, మగవారి ముందే వారి ఆడవాళ్లను వివస్త్రలను చేసి, వారి జననంగాలను కోయించి పైశాచికానందాన్ని పొందేవాడు. అత్యంత దారుణంగా ఆడవారిని చెరచి చంపించేవాడు. అందంగా ఉన్న కొంతమంది ఆడవారిని మధ్య ఆసియా దేశాలకు బానిసలుగా పంపేవాడు. 

తనకు ఎదురైన ప్రతి మందిరాన్నీ నెలమట్టం చేసి, దానిపై మసీదులు కట్టేవాడు. ఇలా Aurangzeb పాలనలో నాశమైన అత్యంత ముఖ్యమైన ఆలయాలలో, కాశీలోని జ్ఞానవాపి ఆలయం, మధుర శ్రీ కృష్ణ మందిరం ప్రముఖమైన ఆలయాలు. ఇలా ఒక్కటేమిటి, కొన్ని లక్షల హిందూ ఆలయాలనూ, బౌద్ధ, జైన క్షేత్రాలనూ సర్వ నాశనం చేశాడు. ఎప్పుడో రద్దు చేసిన జిజియా పన్నును మళ్ళీ ప్రవేశ పెట్టాడు. ఈ పన్ను ప్రకారం, ముస్లిమ్స్ కాని వారందరూ, ఇంట్లో చిన్న పూజ చేసుకున్నా పన్ను కట్టాలి. వ్రతం చేసుకుని నలుగురుకి భోజనం పెట్టినా పన్ను కట్టాలి. బ్రాహ్మణులు పిలకలు పెట్టుకుంటే, ఆ పిలకకు కూడా పన్ను కట్టాలి. జంధ్యము వేసుకుంటే పన్ను కట్టాలి. గుడికి వెళ్లాలంటే పన్ను కట్టాలి, అదే గుడి లోనుంచి బయటకు రావలన్నా పన్ను కట్టాలి. ఇలా Aurangzeb ప్రజల మాన ప్రాణాలను దోచుకు తిన్నాడు. ఇదిలా ఉంటే, ఇంత దారుణమైన, క్రూరమైన పాలకుడిని సైతం, మన కుహనా మేధావులు ఓ గొప్ప చక్రవర్తిగా వర్ణించే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మనవారు అసలు చరిత్రను తెలుసుకోవడంతో పాటు, భావి తరాలకు ఆ గాధలను తెలియజేసే ప్రయత్నం చేయాలి.

🚩 జై భారత్ 🙏

Monday, March 3, 2025

'Chhava' Sambhaji Maharaj: The Forgotten Maratha Prince శంభాజీ అసలు చరిత్ర!


శంభాజీ అసలు చరిత్ర! TELUGU VOICE
21 ఏళ్లలో ఓటమి ఎరుగని 140 యుద్ధాలు! చివరకు బావమరిది కుట్రకు బలి!

శూరత్వం, వీరత్వం, త్యాగం కలగలిసిన ఒక మహాయోధుడి చరిత్రను ఈ రోజు తెలుసుకుందాము. తండ్రి స్థాపించిన హైందవ స్వరాజ్య సంరక్షణకై తన సర్వస్వాన్నీ ఒడ్డిన పులిబిడ్డ చరిత్ర ఇది. 9 ఏళ్ల వయస్సులోనే తండ్రితో పాటు వెళ్ళి, చావును వెక్కిరించి మరీ బయటకొచ్చిన ఒక ధీరుడి సజీవ గాథ. కేవలం 31 సంవత్సరాల తన జీవితకాలంలో, 140 కి పైగా యుద్ధాలలో పాల్గొని, ఒక్క యుద్ధంలో కూడా ఒడిపోని రణధీరుడి మరపురాని చరిత్ర. శత్రువులకు చిక్కి, 40 రోజుల పాటు చిత్రహింసలను అనుభవిస్తూ, కళ్ళు పీకేస్తున్నా, కాళ్ళు నరికేస్తున్నా, చర్మం ఒలిచేస్తున్నా, తాను నమ్మిన ధర్మాన్ని వదలనని దృఢ చిత్తంతో నిలబడి, చివరకు మృత్యువు ఒడిలో సేదదీరిన మహానీయుడి ఆవేదన. అతడే మరాఠా ముద్దు బిడ్డ.. హైందవ సామ్రాజ్య రక్షణకు పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ కు పుట్టిన యువ సింహం, మరాఠా సామ్రాజ్యపు రెండవ ఛత్రపతీ, ధర్మవీరుడు శంభాజీ మహరాజ్. మరాఠా ప్రజలు ముద్దుగా ‘Chaava’ అంటే సింహం బిడ్డగా పిలుచుకున్న ఛత్రపతి శంభాజీ మహరాజ్ గురించి, ఇన్నేళ్లుగా మన కుహనా చరిత్రకారులు దాచేసిన అసలైన గాధను సవివరంగా తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ET5okujKS0U ]


చరిత్ర పుటలలో పృధ్విరాజ్ చౌహాన్ మరణానంతరం, భారత దేశంపై ఎడారి మతాల దురాక్రమణ పెచ్చుమీరింది. వీరిలో అనేక తెగలవారు ఉండగా, కేవలం మొఘల్ వంశస్థులు అత్యధిక భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు పాలించారు. ఈ క్రమంలో ఢిల్లీ గద్దెనెక్కిన ప్రతి ముస్లిం పాలకుడూ, మన ఆలయాలను ధ్వంసం చేసి దేశ సంపదను దోచుకుంటూ, హిందువులను చిత్ర హింసలకు గురిజేసి చంపుతూ, అత్యంత హ్యేయమైన రీతిలో ఆడవారి మాన ప్రాణాలను హరించడం, ఇలా చెప్పుకుంటూ పోతే వారు చేసిన అకృత్యాలకు అంతేలేదు.

ఆ సమయంలో మన భారతీయ రాజులు ఎంతో మంది తమ రాజ్యాలనూ, ప్రజలనూ కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశారు. దేశం అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు పుట్టుకొచ్చిన మహా వీరుడూ, భవానీ మాత ప్రియ సుతుడూ, ఛత్రపతి శివాజీ మహరాజ్. ఆ మహా యోధుడి గురించి మనం గతంలో చేసిన వీడియో లింక్ ను, చూడని వారి కోసం description లోనూ, i-cards లోనూ పొందు పరిచాను. తన చుట్టూ ఉన్న సామాన్యులనే తన సైన్యంగా ఎంచుకుని, అప్పటివరకూ ఎవ్వరూ ఎరుగని గెరిల్లా యుద్ధ తంత్రాన్ని తన ఆయుధంగా మార్చుకుని, హైందవ స్వరాజ్య స్థాపనకు మరాఠా గడ్డపై శంఖారావం పూరించిన యుగ పురుషుడు ఛత్రపతి శివాజీ మహరాజ్.

అలాంటి సింహానికీ, ఆయన మొదటి భార్య అయిన సైబాయి భోంస్లే కీ, 1657 మే 14వ తేదీన, అహ్మద్ నగర్ లో గల పురందర కోటలో జన్మించాడు, సింహాపు కూన వంటి శంభాజీ రాజే భోంస్లే. అయితే, ఆయన పుట్టిన రెండేళ్లకే తల్లి సైబాయి భోంస్లే చనిపోవడంతో, శివాజీ మహరాజ్ తల్లి అయిన జిజియాబాయి దగ్గరే పెరిగాడు. బహుశా ఇదే కారణం చేత, శంభాజీ కూడా శివాజీ మహరాజ్ అంతటి యోధుడయ్యి వుండవచ్చని, చరిత్రకారులంటున్నారు.

శంభాజీకి చావు భయం లేదని చెప్పడానికి, తన 9 ఏళ్ల వయసులో జరిగిన ఓ సంఘటన గురించి చరిత్రకారులు విశేషంగా చెబుతారు. పురందర్ యుద్ధ (Battle of Purandar) సమయంలో, ఔరంగజేబ్ తొత్తుగా పనిచేస్తున్న రాజా జై సింగ్ ఆధ్వర్యంలో, ఒక మహా సేనను శివాజీపైకి పంపించారు. కొద్ది రోజుల పాటు పోరాటం చేసిన ఛత్రపతి, యుద్ధం కంటే సంధి మంచిదని భావించి, జైసింగ్ ని మధ్యవర్తిగా పెట్టి ఔరంగజేబుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా శివాజీ మహరాజ్ ఆగ్రా కోటకు వెళుతూ, కాబోయే రాజుకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండాలనే తలంపుతో, 9 ఏళ్ల శంభాజీని కూడా వెంటపెట్టుకుని వెళ్లడం జరిగింది.

అయితే, వెన్నుపోటు నైజం నరనరానా నిండిన ఔరంగజేబ్, తన కుక్క బుద్ధిని ప్రదర్శించాడు. శివాజీ మహరాజ్ ని కొడుకు శంభాజీ తో సహా ఖైదు చేయించాడు. కోటలో పనిచేసేవారి తోడ్పాటుతో, కొడుకుతో సహా తప్పించుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకున్నారు, శివాజీ, శంభాజీ. సహజంగా 9 ఏళ్ల వయస్సు వారు అలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటే, భయంతో బిక్కచచ్చిపోతారు. కానీ ఆ పులిబిడ్డ కళ్ళలో చిన్నపాటి బేరుకు కూడా లేదనీ, తండ్రి వేసిన ప్రాణాలికకు పూర్తిగా సహకరిస్తూ, అక్కడి నుంచి తెలివిగా బయటపడ్డారనీ, చరిత్రకారులు చెబుతున్నారు.

చిన్నతనం నుంచే నాయనమ్మ జిజియాబాయి దగ్గర పెరగడంతో, శంభాజీకి పురాణాలూ, ఇతిహాసాలతో పాటు, హిందువులపై జరుగుతున్న అకృత్యాలూ, వాటిపై తన తండ్రి చేస్తున్న పోరాటం, ఇలా అన్ని విషయాలూ చెబుతూ, అతని వ్యక్తిత్వం ఒక యోధుడిలా, రాజులా, వివేకవంతుడిలా మారేలా చేసింది, జిజియాబాయి. అంతేకాదు, ఎంతో మంది గురువుల దగ్గర గణితం, రాజకీయం, భాష, యుద్ధ విద్యలూ, యుద్ధ తంత్రాల వంటి ఎన్నో విషయాలలో శిక్షణ తీసుకున్నాడు. అతడి వీరత్వం ఎంతటిదంటే, కేవలం 16 ఏళ్ల వయసులోనే మొదటి యుద్ధంలో పాల్గొని, తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

శంభాజీ మహరాజ్ యొక్క 27 ఏళ్ల యుద్ధ ప్రయాణంలో, ఆయన కేవలం మొఘలులూ, దక్కన్ నవాబులూ, బీజాపూర్ సుల్తాన్ లనే కాకుండా, ఆనాడు హిందువులపై దౌర్జన్యాలు చేస్తూ, హిందూ ఆలయాలను నాశనం చేస్తూ, భలవంతంగా మతమర్పిడులు చేస్తున్న పోర్చుగీస్ వారిని కూడా సప్త సముద్రాల నీరు తాగించాడు. ఆ విధంగా కొంకణ ప్రాంతాన్ని, గోవా నగరాన్ని కూడా మరాఠా సామ్రాజ్యంలో కలిపేసిన ధీరుడు, శంభాజీ మహరాజ్.

ఇక ఈ పులి బిడ్డ కేవలం రణధీరుడే కాకుండా, భాషా పండితుడూ, కళా పిపాసి కూడా అని చరిత్ర చెబుతోంది. ఆయన మరాఠా, సంస్కృతంతో పాటు, 15 భాషలలో ప్రావీణ్యం పొందాడు. వాటిలో తెలుగు కూడా ఉండడం విశేషం. శంభాజీ కేవలం 14 ఏళ్ల వయస్సులోనే,  సంస్కృతంలో ‘బుధ్ భూషణ్’ అనే పుస్తకాన్ని రచించారు. అంతేకాదు, మరాఠాకీ హిందీకీ దగ్గర పోలికలు ఉండే ‘బ్రజ్’ భాషలో, నఖ్ శిఖ్, నాయికాభేద్, సాత్ శతక్ అనే పుస్తకాలను కూడా వ్రాశారు. అంత చిన్న వయసులో నాలుగు పుస్తకాలను రాయడమంటే, ఆయన విద్వత్తు ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు.

ఇక 17 ఏళ్ల వయస్సులో శంభాజీకి జీవుబాయి అనే కన్యతో వివాహం జరిగింది. ఎంతో యశస్సు కలిగిన ఆమె, యశు బాయి అనే పేరుతో ప్రసిద్ధురాలు. శంభాజీ వివాహం, ఛత్రపతి శివాజీ మహరాజ్ కి రాజకీయంగా చాలా పెద్ద ప్రయోజనం కలిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఆమె తండ్రి విభాజీ నాయక్, మరాఠా సామ్రాజ్యంలో ఓ ముఖ్య దళపతి గానే కాకుండా, సామంత రాజుగా, కొంకణ్ రాజులలో అతి ముఖ్యమైన వాడిగా కూడా ఉన్నాడు. ఈ పెళ్ళితో కొంకణ ప్రాంతం మొత్తం ఛత్రపతి శివాజీ చేతుల్లోకి వచ్చేసింది.

1680 వరకు, ఛత్రపతి శివాజీ ఒక పక్క మొఘలుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని చిత్తు చేస్తుంటే, మరో పక్క శంభాజీ తన అద్భుతమైన రణతంత్రంతో, మరాఠా సామ్రాజ్య విస్తరణ చేసుకుంటూ ముందుకు సాగాడు. అయితే, శివాజీ మహారాజ వ్యక్తిత్వం, శంభాజీ వ్యక్తిత్వం మధ్య చాలా తేడాలుండేవనీ, ఆ కారణంగా ఎన్నో సార్లు శివాజీ మహరాజ్ చుట్టూ ఉండే ముఖ్యమైన అనుచరులతో శంభాజీ వాగ్వాదాలు పడేవాడనీ, చరిత్ర చెబుతోంది. దానితో శివాజీ మహరాజ్ చుట్టూ ఉండే కొంతమంది మంత్రులూ, సామంతులలో కొంతమందీ, శివాజీ తర్వాత రాజుగా శంభాజీ కంటే, ఛత్రపతి రెండవ భార్య అయిన సోయరాబాయి కుమారుడు రాజారాం ను ప్రకటించాలని కుతంత్రాలు పన్నేవారు. వారి పన్నాగాలలో సోయరాబాయి హస్తం కూడా బలంగా ఉండేది.

కొంతమంది చరిత్రకారుల ప్రకారం, ఒకసారి సోయరాబాయి తన గూఢచారుల సహాయంతో శంభాజీకి విషం పెట్టి చంపడానికి కూడా ప్రయత్నించింది. ఈ గొడవల కారణంగానే, 1678 లో, శంభాజీ, రాజా రామ్ ల మధ్య వివాదం తారా స్థాయికి వెళ్ళిపోయి, ఇద్దరూ వేరు వేరుగా తమ బలాలను పెంచుకునే వరకూ వెళ్ళిపోయింది. ఒక పక్క అనారోగ్యం కారణంగా ఛత్రపతి మంచం పట్టడం, మరో పక్క అన్నదమ్ముల మధ్య గొడవలూ, ఇదే అదనుగా భావించిన ఔరంగజేబ్, ఎడతెరిపి లేకుండా మరాఠా సామ్రాజ్యంపై దురాక్రమణలకు పాల్పడుతూ వచ్చాడు.

ఈ క్రమంలో 1680, ఏప్రిల్ 3 న అనారోగ్యం కారణంగా శివాజీ మహరాజ్ కన్నుమూయగా, సోయరా బాయి తనకు అనుకూలంగా ఉన్న మంత్రులతో కలిసి, కేవలం 10 ఏళ్ల వయసున్న రాజా రామ్ ను, 1680, ఏప్రిల్ 16 న సింహాసనంపై కూర్చోపెట్టేసింది. అయితే వయసులో చిన్నవాడు, ఎటువంటి అనుభవం లేనివాడి చేతుల్లోకి మారాఠా రాజ్యం వెళ్తే, మొఘలులను ఆపడం అసాధ్యమని మొదటి నుంచీ చెబుతున్న శంభాజీ, అటువంటి దుస్థితి తమ రాజ్యానికి రాకూడదని భావించి, వెంటనే రాయ్ ఘడ్ కోటను ఆక్రమించుకుని, అధిక శాతం మరాఠా సర్దార్ లను తన వైపుకు తిప్పుకుని, 1680, జులై 20 న తాత్కాలిక రాజుగా సింహాసనంపై కూర్చున్నాడు.

ఈ తతంగంలో సోయరా బాయి కి అస్సలు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అప్పటి వరకు తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె సొంత అన్న హంబీర్ రావ్ మోహితే కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి, రాజ్యం శంభాజీ చేతుల్లోకి వెళ్ళడానికి సహకరించాడు. దాంతో శంభాజీ మహరాజ్, సోయరా బాయినీ, తమ్ముడు రాజా రామ్ నీ, వారికి సహకరించిన వారినీ ఖైదు చేయించాడు. అయితే, ఇక్కడే కుహనా చరిత్రకారులు తమ కపట కలానికి పనిచెప్పారు.. సోయరాబాయినీ, ఆమె అనుచరులనూ, శంభాజీ మహరాజ్ అత్యంత దారుణంగా చంపించాడనీ, రాజా రామ్ చిన్నవాడు కావడంతో అతడిని మాత్రం వదిలేశాడనీ, పిచ్చి రాతలు రాశారు. వాస్తవానికి ఆ సమయంలో శివాజీ మహరాజ్ మరణ వార్త వినగానే, అతిపెద్ద మొఘల్ సైన్యం మరాఠా సామ్రాజ్యం వైపు అడుగులు వేసింది. అదే సమయంలో సోయరాబాయి, ఆమె అనుచరులూ, శంభాజీ మహరాజ్ ను అతడున్న పన్హాలా కోటలోనే బంధించి చంపాలని కుతంత్రం పన్నారు. దానిని పసిగట్టిన శంభాజీ మహరాజ్ అక్కడి నుంచి తప్పించుకుని, తన హక్కు అయినటువంటి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. తనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదం అని భావించి, సోయరాబాయి మినహా తక్కిన వారిని చంపించాడనీ, పినతల్లి సోయరాబాయినీ, తమ్ముడు రాజా రామ్ నూ వేరే ప్రాంతానికి తరలించి జాగ్రత్తగా చూసుకున్నాడనీ, ఇది జరిగిన కొన్నేళ్లకే సోయరాబాయి జబ్బున పడి చనిపోతే, ఆమెకు అంత్యక్రియలు కూడా శంభాజీ దగ్గరుండి చేయించాడనీ వాస్తవ చరిత్ర చెబుతోంది.

ఆ విధంగా 1681, జనవరి 16న శంభాజీ రాజే భోంస్లే సింహాసనాన్ని అధిరోహించి, ఛత్రపతి శంభాజీ మహరాజ్ గా, మరాఠా సామ్రాజ్యపు రెండవ ఛత్రపతిగా మారాడు. సరిగ్గా ఆ సమయంలో ఔరంగజేబ్ కూ, అతని కొడుకులకూ మధ్య అధికారం కోసం తీవ్రమైన అలజడి చెలరేగింది. మరీ ముఖ్యంగా, అతని కొడుకు ముహమ్మద్ అక్బర్, తండ్రి ఔరంగజేబు చేస్తున్న అమానవీయ చర్యలపై వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాడు. ఇది తట్టుకోలేని ఔరంగజేబు, తన నాలుగవ కొడుకును అత్యంత కిరాతకంగా చంపి, అక్బర్ ను ఖైదు చేశాడు. అతన్ని కూడా చంపడానికి సన్నాహాలు మొదలుపెట్టగా, అక్బర్ తెలివిగా ఆగ్రా కోట నుంచి తప్పించుకుని, శంభాజీ మహరాజ్ ను శరణు వేడాడు.

అప్పటి నుంచి అక్బర్ శంభాజీకి దాసుడిగా మారిపోయాడు. ఒకానొక సమయంలో రాజా రామ్ ను ఎలాగైనా రాజును చేయాలని భావించిన కొంతమంది సామంత రాజులూ, నమ్మక ద్రోహులూ, శంభాజీ మహరాజ్ ని ఖైదు చేయడానికి తమకు సహకరించాలని కోరుతూ ఒక ఉత్తరం పంపారు. ఆ ఉత్తరాన్ని వెంటనే అక్బర్ శంభాజీకి పంపి, తన మిత్రత్వాన్ని నిలబెట్టుకున్నాడు. తనకు నమ్మక ద్రోహం చేయాలని చూసిన సామంతులను, వెంటాడి వేటాడి మరీ చంపేశాడు శంభాజీ.

ఇలా దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఒక పక్క మొఘల్ సైన్యంతో, మరో పక్క పోర్చుగీసువారితో, ఇంకో పక్క దక్కన్, బీజాపూర్ వంటి ముస్లిం రాజులతో పోరాటం చేస్తూనే, తన చుట్టూ తిరిగే నమ్మక దొరహులను ఏరిపారేసేవాడు శంభాజీ. అదే క్రమంలో మరాఠా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించడమే కాకుండా, తన రాజ నీతితో సస్యశ్యామలమైన రాజ్యంగా మార్చాడు. ఈ క్రమంలో ఔరంగజేబు తన సేనలను పోగేసుకుని, మరాఠా నేలపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ, కొన్ని చిన్న చిన్న కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ముందుకు వస్తున్న ఔరంగజేబు సేనలను వెనక్కి పంపడానికి, శంభాజీ మహరాజ్ రాయ్ ఘడ్ ను వదిలి, సంఘమేశ్వర్ కోటలో నివసించడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి మొఘల్ సేనలకు చుక్కలు చూపిస్తూ, వారిని వెనక్కి తరిమి కొట్టడం మొదలు పెట్టాడు.

ఇదిలా ఉంటే, ఒక రోజు శంభాజీ మహరాజ్ తన సేనలతో రాయ్ ఘడ్ కు వెళ్లాల్సి ఉండగా, కొంతమంది గ్రామ ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకోగా, వారి సమస్యలు తీర్చడానికి కేవలం 200 మందిని మాత్రమే తన దగ్గర ఉంచుకుని, తక్కిన సేనలను రాయ్ ఘడ్ కు పంపించేశాడు శంభాజీ. ఈ విషయం తెలుసుకున్న ఘనోజీ షిర్కె అనే మరాఠా సర్దార్, ఇతను ఎవరో కాదు. శంభాజీ భార్య యశుబాయికి స్వయానా సోదరుడు. గతంలో తను చేసిన ఒకానొక దుశ్చర్య వలన శంభాజీ చేత దండింపబడిన వాడు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి, శంభాజీ వివరాలను మొఘల్ సర్దార్ లలో ఒకడైన ముకర్రబ్ ఖాన్ కి తెలియజేసి, ఏకంగా 5 వేల మంది సేనలతో కేవలం మరాఠా వీరులకు మాత్రమే తెలిసిన రహస్య మార్గంగుండా వెళ్ళి, శంభాజీ ఉండే కోటను ముట్టడించారు.

5 వేల మంది సైన్యం ముందు 200 మంది సేనలు సరితూగలేక, శంభాజీ మహరాజ్ ఔరంగజేబు కి దొరికిపోయాడు. శంభాజీ మహరాజ్ జీవితంలో ఓడిపోయిన ఒకేఒక్క యుద్ధం ఇదే. ఇక అప్పటి నుంచి దాదాపు 40 రోజుల పాటు, హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరించమని, ప్రతి రోజు ఔరంగజేబు శంభాజీని అత్యంత కిరాతకంగా, క్రూరాతి క్రూరంగా హింసించడం మొదలు పెట్టాడు. ముందు కాలుతున్న ఇనుప చువ్వలతో కళ్ళు పొడిపించాడు. తర్వాత నాలుక కోయించాడు. చర్మం ఒలిపించాడు. అప్పటికీ హిందూ ధర్మాన్ని తప్ప వేరే మతాన్ని అంగీకరించనన్న దృఢ సంకల్పంతోనే ఉన్న శంభాజీని దారి మార్చడానికి, రోజుకో అంగాన్ని నరుకుతూ వచ్చారు. ఇలా 40 రోజులపాటు, మానవమాత్రుడు భరించలేని నరకయాతనను చూపించిన తర్వాత, 1689, మార్చి 11వ తేదీన తల నరికి చంపించాడు. ఆ తర్వాత శంభాజీ మహరాజ్ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి, షోలాపూర్ దగ్గరున్న భీమా నదిలో పారేయించాడు. ఇది తెలుసుకున్న మరాఠా వీరులు ఆ నదిలో వెతికి, దొరికిన కొన్ని భాగాలనే తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు జరిపించారు.

సజీవంగా ఉండగానే శరీరభాగాలు తెగిపడుతున్నా, ప్రాణం పోతున్నా, హైందవ స్వరాజ్యంపై ఉన్న శ్రద్ధ, హిందూత్వంపై ఉన్న అపారమైన గౌరవం, శంభాజీ మహరాజ్ లోని ధైర్యాన్ని కించిత్తు కూడా తొణక నివ్వలేదు. దేశం కోసం, ధర్మం కోసం, అత్యంత భయంకరమైన మరణాన్ని సైతం నవ్వుతూ ఆహ్వానించిన ఆయన విరత్వాన్ని చూసిన మరాఠా యోధుల రక్తం మరిగి పోయింది. వారి గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. ఆ తెగువే, ఔరంగజేబు జీవితానికి నికృష్టమైన ముగింపు పలకడంతో పాటు, ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో సహా పెకలించి వేసేలా చేసింది.

🚩 జై భారత్ 🚩 జై హింద్ 🚩 జై భవాని 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...