11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

 

సృష్టి వినాశనం చేయగలిగే 11 భయంకరమైన అస్త్రాలు!
మహాభారతంలో వాడిన ఆ ఆయుధాలు అణ్వాయుధాలా?

చరిత్రలోనే అత్యంత భయాంకరమైన యుద్ధం, పాండవులకూ, కౌరవులకూ మధ్య జరిగిన మహాభారత యుద్ధం. సృష్టి ఆది నుండి నేటి వరకూ, అత్యంత ఘోరమైన యుద్ధంగా పేర్కొనబడేది, కురుక్షేత్ర సంగ్రామమే. దాదాపుగా అప్పుడు మనుగడలో ఉన్న రాజ్యాలన్నీ ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ మహా సంగ్రామం జరిగిన కురుక్షేత్రమనే ప్రదేశం, ఉత్తర భారత దేశం లోని ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉంది. 18 రోజులపాటు నిర్విరామంగా సాగిన ఆ యుద్ధంలో, 47 లక్షల, 23 వేల, 920 మంది పాల్గోంటే, అందులో కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. అంత భారీ జన నష్టం సంభవించడానికి కారణం, మహాభారత యుద్ధంలో ప్రయోగించబడిన అణ్వస్త్రాలే అనే వాదన కూడా ఉంది. ఆ నాడు జరిగినది మాములు యుద్ధం కాదని, పాశ్చాత్య చరిత్రకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు శతాబ్ది కాలంగా, ఆ ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలూ, సుదీర్ఘ చర్చలూ జరుగుతూనే ఉన్నాయి. కేవలం 18 రోజుల్లో, 47 లక్షల పై చిలుకు జనాభా మరణించడం అంటే, సామాన్యమైన విషయం కాదు. సాధరణ ఆయుధాలతో సాధ్యపడే విషయమూ కాదు. మన ధార్మిక గ్రంథాలను చూసుకున్నట్లయితే, రెండు రకాల ఆయుధాలను వివరించాయి. ఒకటి అస్త్రం, అంటే, మంత్రించి ప్రయోగించేది. రెండవది శస్త్రం, అంటే, హనికరమైన ఆయుధం. నేటి తరంలో చూసుకుంటే, మిస్సైల్ లాంటివి.  మరి మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించీ, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/hOduy8rQEBM?si=-5_A25TVmp8y0G6T ]


అన్ని ఆయుధాలూ, అస్త్రాలలో కెల్లా అత్యంత ప్రముఖమైన ఆయుధం, మొదటగా చెప్పుకోవల్సినది, ‘బ్రహ్మాస్త్రం’.. అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం గురించి, మన పురాణ గ్రంథాలలో వివరించబడింది. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటిగా, వర్ణించబడింది. మన పురాణాల ప్రకారం, బ్రహ్మ దేవుడు బ్రహ్మాస్త్రాన్ని సృష్టించాడని, పండితులు చెబుతున్నారు. విశ్వం యొక్క అన్ని కార్యకలాపాలూ సక్రమంగా జరగడానికీ, నియంత్రణను కొనసాగించడానికీ, ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే, బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తివంతమైన ఆయుధం. దీనిని కేవలం, రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. రామాయణ కాలంలో విభీషణుడూ, లక్ష్మణుడూ మాత్రమే దీనిని వాడారు. మహాభారత యుద్ధంలో, ద్రోణాచార్యుడూ, అశ్వత్థామ, శ్రీ క్రిష్ణుడు, కువలాశ్యుడు, యుధిష్ఠిరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, అర్జునుడూ, ఈ అస్త్ర ప్రయోగం తెలిసిన వారు. కురుక్షేత్ర యుద్ధంలో, కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. అయితే, కర్ణుడి గురువైన పరశురాముడి శాపం కారణంగా, ఆఖరి క్షణంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే పద్ధతిని మరచిపోయాడు.

2. బ్రహ్మశీర్షాస్త్రం: ఇది బ్రహ్మాస్త్రం కంటే, నాలుగు రెట్లు శక్తివంతమైన ఆయుధం. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల, వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం, 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారి పోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని, పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తివంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు, తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా, దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి, రామ రావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీనివలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తివంతమైనదో నువ్వు అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప, ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని చెప్పి, అర్జునుడికి అందించాడు.

3. బ్రహ్మండాస్త్రం: ఈ ఆయుధం, మొత్తం సౌర వ్యవస్థను, అంటే, ఈ బ్రహ్మాండాన్నే నాశనం చేసేంత శక్తివంతమైనది. ఈ ఆయుధం కొనపై, బ్రహ్మ యొక్క ఐదు తలలు ఉంటాయి. ఇది బ్రహ్మాస్త్రం, అలాగే బ్రహ్మశీర్షాస్త్రం, ఈ రెండింటి శక్తీ కలిపి ఉంటుంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని విడిచిన తరువాత, దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. అది ప్రయోగించబడిన వారు రక్షింపబడే అవకాశమే లేదు. ఈ ఆయుధం, ద్రోణాచార్యుడి వద్ద ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు, ధర్మం కోసం పోరాడుతున్నందున, వారిపై దీనిని ప్రయోగించవద్దని దేవతలు ద్రోణాచార్యుడిని కోరడంతో, ఆయన దానిని ప్రయోగించలేదు.

4. నాగాస్త్రం: ఇది పాము రూపాన్ని పోలి ఉంటుంది. కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి వ్యతిరేకంగా, కర్ణుడు దానిని సమర్థవంతంగా ప్రయోగించ లేక పోయాడు. యుద్ధంలో అర్జునుడి బాణాల పరంపర నుండి తప్పించుకుంటూ, కర్ణుడు అత్యంత శక్తివంతమైన నాగాస్త్రాన్ని పంపాడు. దానిని అర్జునుడి ఛాతీపై గురి పెట్టవలసి ఉంది. కానీ, కర్ణుడు అర్జునుడి మెడపై గురిపెట్టాడు. ఆ సమయంలో అర్జునుడి రథ సారధి అయిన శ్రీ కృష్ణుడు, దానిని గురి తప్పేలా చేశాడు. అందుకే అది అర్జునుడి కిరీటానికి తగిలింది. నాగాస్త్రం తగిలిన వెంటనే, ఆ కిరీటం వెయ్యి ముక్కలుగా విరిగి నేల మీద పడిపోయింది. అంతటి శక్తివంతమైన ఆయుధం, నాగాస్త్రం.

5. నారాయణాస్త్రం: ఈ అస్త్రం, శ్రీహరికి చెందినది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ అస్త్రాన్ని అశ్వత్థామ, సుయోధనుని ఆజ్ఞ మేరకు, అభిమంత్రించి, పాండవ సేనపై ప్రయోగించాడు. ఆ సమయంలో మహాస్త్ర మహిమో ఏమోగానీ, ప్రకృతి అంతా అల్లకల్లోలమయి పోయింది. గగనాంగణంలోకి ప్రవేశించిన నారాయణాస్త్రం, రకరకాల ఆయుధాల రూపంలో, వేల కొలది మహాగ్ని జ్వాలలతో, పాండవేయుల సైన్యాలన్నిటా విజృంభించసాగింది. దానిని కన్నెత్తి చూడలేని పాంచాల, పాండవేయ సైన్యాలు, ఘోర ఆర్తనాదాలతో పరుగులు తీశాయి. ఆ బీభత్సాన్ని కృష్ణార్జునులు చూస్తూ, అచేతనులయ్యారు. ధర్మరాజు ఆందోళనకు అంతులేకుండా పోయింది. అందరినీ పారిపొమ్మంటూ గగ్గోలు పెట్ట సాగాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు, యోధులందరినీ వాహనాల మీద నుంచి కిందకి దూకమనీ, ఆయుధాలు వదిలేసి తలలొంచుకుని నిలబడమనీ, సూచించాడు. శ్రీ కృష్ణ భగవానుడి ఆదేశానుసారం, అందరూ నిరాయుధులై, నారాయణాస్త్రాన్ని తప్పించుకున్నారు. వేల ఆయుధాల సమాహారమైన నారాయణాస్త్రాన్ని ఎదిరించడం, ఎవరి తరమూ కాదు. దాని నుండి తప్పించుకునే మార్గం, లొంగి పోవడం మాత్రమే.

6. పాశుపతాస్త్రం: ఈ అస్త్రం కలిగినవారు ఇద్దరు మాత్రమే, మనపురాణ గాథలలో మనకు కనిపిస్తారు. ఒకరు రావణుని పుత్రుడు మేఘనాధుడు, మరోకరు పాండవమధ్యముడు అర్జునుడు. ఈ పాశుపతాస్త్రం పొందడం కోసం, అర్జునుడు కుడికాలి బొటన వేలిపై నుంచుని, చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తర్వాత జరిగిన మహాభారత యుద్ధంలో, పరమేశ్వరుడు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని కర్ణుడిపై ప్రయోగించి, అర్జునుడు విజయం సాధించాడు.

7. మహేశ్వరాస్త్రం: ఈ ఆయుధం పరమేశ్వరుడి మూడవ కన్ను యొక్క శక్తిని కలిగి ఉంటుంది. అది ఒక్కసారిగా, శత్రువులందరినీ బూడిదగా మార్చేసే శక్తికలిగినది. సమస్త లోకాలనూ, భగవంతుడి లోకి లయం చేయగలగే శక్తి సామర్థ్యాలను పొందినటువంటిది, ఈ మహేశ్వరాస్త్రం.

8. వాసవీ శక్తి: వాసవీ శక్తి, ఇంద్రుని ఆధీనంలో ఉన్న ఆయుధం. అది ఎటువంటి శత్రువులనైనా చంపగలదు. వాసవీ శక్తిని ఇంద్రుడు, కర్ణుడికిచ్చాడు. కర్ణుడు కవచ కుండలానికి బదులుగా, ఇంద్రుడి నుండి ఈ ఆయుధాన్ని పొందాడు. ఇది చాలా బలమైన ఆయుధం. ఈ ఆయుధానికి ఇంద్రుడిచ్చిన "అజేయత" అనే వరం కూడా ఉంది. దాంతో అది మరింత శక్తివంతం అయ్యింది. ఈ ఆయుధంతో, దేవతలూ, అసురులూ, మానవులూ, గంధర్వులూ, ఉరగలూ, మరియు రాక్షసులలో, ఎవరిని చంపాలనుకున్నా, వారు ఖచ్చితంగా చంపబడతారు. అయితే, దానిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. కురుక్షేత్రంలో, అర్జునుడిపై వాసవీ శక్తిని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు, కర్ణుడు. కానీ, అనివార్య కారణాలవల్ల, యుద్ధంలో భీముని కుమారుడైన ఘటోత్కచడిపై, దానిని ఉపయోగించవలసి వచ్చింది.

9. వారుణాస్త్రం: వరుణ దేవుడికి చెందిన ఈ అస్త్రం, ఏ ఇతర ఆయుధ రూపాన్నయినా పొందగలదు. దీనిని ప్రయోగించడంతో పాటు, పొందడం కూడా ఎంతో కఠినతరం. అర్జునుడూ, సాత్యకీ, ధృష్టద్యుమ్నుడూ, ద్రోణాచార్యుల వంటి ప్రఖ్యాత యోధులు మాత్రమే, ఈ ఆయుధాన్ని కలిగి ఉన్నారు.

10. భార్గవాస్త్రం: బ్రహ్మశీర్షాస్త్రంతో సమానమైనది ఇది. ప్రపంచం మొత్తాన్నీ నాశనం చేయగలిగిన శక్తి, ఈ అస్త్రానికి ఉంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తే, బూడిద కూడా మిగలదు. రక్షించుకోవడం కోసం ఈ అస్త్రాన్ని వాడితే, బ్రహ్మాస్త్రాన్నీ, బ్రహ్మశీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగిన శక్తి, దీనికి ఉంది. కురుక్షేత్రంలో ద్రోణాచార్యులు, పాండవులపై ఈ అస్త్రాన్ని ప్రయోగించారు.

11. గాండీవం: ఖాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతివ్వడంతో, అగ్నిదేవుడు సంతోషించి, అర్జునునికి గాండీవాన్ని ప్రసాదించాడు. గాండీవం అనేది, స్వర్గంలోని గాండీవ వృక్షం ద్వారా రూపొందించబడింది కాబట్టి, గాండీవానికి తగిన రక్ష వుంది. లక్షలాది ఆయుధాలకు ఇది సమానమైనది. పలు రంగులతో కూడినది, మృదువైనది. ఈ గాండీవం, వెయ్యేళ్లు బ్రహ్మదేవుని వద్ద వుండగా, ప్రజాప్రతి వద్ద, 503 సంవత్సరాలూ, ఇంద్రుడి వద్ద 85 సంవత్సరాలూ, చంద్రుడి వద్ద 500 సంవత్సరాలూ, వరుణుడి వద్ద 100 సంవత్సరాలు ఉండింది. ఈ విల్లును గంధర్వులూ, దేవతలూ పూజించారని పురాణాలు చెబుతున్నాయి. చిత్రమేమిటంటే, దానికి అక్షయ తూణీరం ఉంది. ఎన్ని బాణాలు తీసివేస్తున్నా, అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది.

ఇవి మాత్రమే కాక, ఇంకా ఎన్నో అత్యద్భుత శక్తులు కలిగిన మంత్ర పూరితమైన అస్త్ర శస్త్రాలతో, కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అయితే, అన్ని అస్త్రాలలో కెల్లా అత్యంత బలమైన ఆయుధం, ఎంతటి శక్తి కలిగిన ఆయుధాన్నయినా మట్టి కరిపించగల ఆయుధం, సుదర్శన చక్రం. శ్రీ కృష్ణుడు యుద్ధంలో పాల్గొననందున, ఆయన దానిని కురుక్షేత్రంలో ఉపయోగించలేదు. అయితే, శ్రీ కృష్ణుడు, శిశుపాలుడిని చంపడానికి, సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. త్రిశూలం మహాదేవుని కుండలినీ శక్తి అయినట్లే, సుదర్శన చక్రం శ్రీ హరి యొక్క కుండలినీ శక్తి. కృష్ణావతారానికి పూర్వమే, సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్టసంహారణార్థం, సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు, పురాణగాథల ద్వారా తెలుస్తోంది. సుదర్శనశక్తి అద్భుతమైనది. ఇది శత్రువులను అగ్నివలె దహించివేస్తుంది. శత్రుసంహారం కోసం, విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో, అప్పుడది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రుసంహారం చేసి తిరిగి భగవానుని చెంతకు చేరుకుంటుంది. మహాభారత యుద్ధంలో పాల్గోన్న యోధులు, ఈ ఆయుధాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించారని గమనించాలి. ఎందుకంటే, ఇవి సమాజానికి కలిగించే సంభావ్య విధ్వంసం గురించి వారికి తెలుసు. సామూహిక విధ్వంసక ఆయుధాలను, బాధ్యతతో ఉపయోగించడం, ఆ రోజుల్లో ఒక ఆచారం. వీటిలో కొన్ని అణ్వాయుధాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయనే వాదనలు, నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి.

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur