Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, November 24, 2025

The Lost Hindu Empire in China: The Untold Story of Khotan ఖోటాన్ సామ్రాజ్యం!

 

The Lost Hindu Empire in China: The Untold Story of Khotan

ఖోటాన్ సామ్రాజ్యం!
చైనాలో బయటపడిన అతిపెద్ద హైందవ సామ్రాజ్యం! నాటి అఖండ భారతావనిలో చైనా కూడా భాగమా?


తాము ఎదగడానికి పక్క వాడిని తొక్కేయడం, వాడిపై దౌర్జన్యం చేసి వాడికి సంబంధించినవన్నీ బలవంతంగా లాక్కుని తాము గొప్పవారిగా చలామణీ అవ్వాలనేది యురోపియన్ దేశాలు పాటించే ప్రధమ సూత్రం. ఈ సూత్రాన్ని అందిపుచ్చుకునే అమెరికా ప్రపంచ పెద్దన్నగా నిలిచింది. చాలాకాలంగా అదే సూత్రాన్ని పాటిస్తూ చైనా ఆ స్థానంలో కూర్చోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో చైనా ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తోందని భావించి మన భారత దేశాన్ని దెబ్బ కొట్టడానికి వేసిన ఓ ఎత్తుగడ, మన దేశ భూభాగంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని తమకు చెందినదిగా చైనా ప్రచారం చేయడం. అంతటితో ఆగకుండా కొద్ది రోజుల క్రితం ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు చైనాకు సంబంధించిన పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో మన దేశ చరిత్రకారులతో పాటు, అంతర్జాతీయ చరిత్రకారులూ చైనా అసలు చరిత్రను గురించి కూపీ లాగడం మొదలు పెట్టారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ ఎవరూ బయటపెట్టని చరిత్ర, చైనా వెన్నులో వణుకు పుట్టించే చరిత్ర, అలనాటి మన అఖండ భారతావని వాస్తవ చరిత్ర, చైనాకు సంస్కృతి అంటే ఏమిటో తెలియజేసిన ఓ మహా సామ్రాజ్య చరిత్ర బయటపడింది. ఈ మాటలు వినగానే, చైనాకి మనం సాంస్కృతిక పాఠాలు నేర్పడం ఏమిటి? అఖండ భారతావనిలో చైనా కుడా భాగంగా ఉండేదా? చైనాను కూడా మన వారు పాలించారా? చైనాలో హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ రాజులు ఎవరు? ఏ కాలంలో వారు చైనాను పాలించారు - వంటి ఎన్నో సందేహాలు కలగడం సహజం. మరి ఆ సందేహాలకు కొంతవరకైనా సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ALbUJMkMkWo ]



ఒక దేశాన్ని సొంతం చేసుకోవాలన్నా, ఆ దేశంలో ఉన్న వనరులు దోచుకుపోవలన్నా, ఆ దేశంలో దారుణం ఎదో జరుగుతోందని కానీ, చరిత్రాత్మకంగా ఆ ప్రాంతంతో సంబంధాలున్నాయని కానీ, ప్రపంచ దేశాలను ముందుగా నమ్మించాలి. గత కొన్ని దశాబ్దాలుగా చైనా కుడా ఈ సూత్రాన్ని పాటిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలా ఆ దేశం ముందుగా టిబెట్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. అక్కడితో ఆగని చైనా మన అరుణాచల్ ప్రదేశ్ కూడా తమ టిబెట్ లోని భాగమే అనీ, అది దక్షిణ టిబెట్ అనీ పేర్కొంటూ, అదనుదోరికినప్పుడల్లా మన దేశంలోని భూభాగాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు ఏకంగా తమ పేర్లను పెట్టేసింది చైనా.

అయితే చాలా ఏళ్లుగా చైనా చేస్తోన్న ఈ ఆరోపణల కారణంగా అసలు చైనా చరిత్ర ఏమిటి అని ఆరా తీయడం ప్రారంభమయ్యింది.. నిజంగానే టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ లు చైనాలో భాగమా - అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలయింది. ఈ కోణంలో అనేక పరిశోధనలు జరగగా, చాలా ఏళ్ల క్రితమే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. విదేశీ శక్తుల కుట్ర వల్ల బయటి ప్రపంచానికి అంతగా తెలియకుండా పోయిన ఓ మహా హైందవ సామ్రాజ్య చరిత్ర వెలుగులోకి వచ్చింది. అలా వెలుగులోకి వచ్చిన ఓ గొప్ప హిందూ సామ్రాజ్యం పేరే ‘ఖోటాన్ సామ్రాజ్యం’.

ఈ సామ్రాజ్యం ఒకప్పుడు యురోపియన్ దేశాలకూ, చైనాకూ ఎంతో ముఖ్యమైన వాణిజ్య మార్గంగా ఉన్న సిల్క్ రోడ్ ప్రాంతం. ఇది Taklamakan ఎడారి ప్రాంతం చుట్టూ ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంటే ఈ నాడు Xinjiang గా పేర్కొంటున్న ప్రాంతంలో ఒకప్పుడు ఖోటాన్ సామ్రాజ్యం ఉండేదని, చరిత్రకారులు చెబుతున్నారు. ఎంతో ముఖ్యమైన సిల్క్ రోడ్ ఈ సామ్రాజ్యంగుండా వెళుతుండడంతో, ఒకప్పుడు ఆ రాజ్యం చైనాలోనే అతి పెద్ద రాజ్యంగా, సంపన్న ప్రాంతంగా, బలమైన రాజ్యంగా ఉండేదని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు చైనాలో ఉన్న అంతగొప్ప రాజ్యన్ని స్థాపించింది మాత్రం, మన భారతియులేనని చరిత్ర స్పష్టంగా చెబుతోంది.

చైనా, టిబెట్ ప్రాంతాలతో పాటు కొన్ని పశ్చిమ దేశాలలో దొరికిన చారిత్రక ఆధారాలూ, శిలాశాసనాలలో కూడా, ఖోటాన్ సామ్రాజ్యం భారత దేశం నుంచి వచ్చిన హిందువుల చేత స్థాపింప బడిందని తెలుస్తోంది. అసలు భారత దేశానికి చెందిన హైందవులు హిమాలయాలకు అవతల ఉన్న చైనా వరకూ ఎందుకు వెళ్లారు? అక్కడ ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారనే చరిత్ర తెలియాలంటే, అశోకుడి కాలంలో జరిగిన ఓ సంఘటన గురించి ముందుగా తెలుసు కోవాలని, చరిత్ర కారులంటున్నారు.

దాదాపుగా 2500 సంవత్సరాల ముందు అంటే, మన దేశాన్ని మౌర్య వంశానికి చెందిన అశోక చక్రవర్తి పాలిస్తున్న కాలంలో జరిగిన ఓ ఘటనతో ఖోటాన్ సామ్రాజ్యం స్థాపించబడింది. మన దేశాన్నేలిన గొప్ప చక్రవర్తులలో అశోకుడు ఒకరు. అశోకుని ధమ్మం కేవలం ఒక నైతిక నియమావళి మాత్రమే కాదనీ, అదొక సామ్రాజ్యవాద సాధనం అనీ ప్రముఖ చరిత్రకారులు రోమిల్లా థాపర్ అభిప్రాయం. అశోకుని సామ్రాజ్యం ఎంతో విస్తృతమైంది. సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో వైవిధ్యంతో కూడుకున్న సామ్రాజ్యమిది. నాడు దక్షిణ భారతంలో అతిపెద్ద సామ్రాజ్యమైన కళింగ దేశాన్ని ఓడించి, దక్షిణ భారతాన్ని కూడా ఆక్రమించి అఖండ భారతావనిని స్థాపించాడు. అస్సాం, తమిళ ప్రాంతాలు మినహాయించి మిగతా భారతదేశమంతా ఆయన సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని స్వికరించాడనే విషయం మనలో చాలా మందికి తెలిసిందే. నేటికీ అశోకుడు స్థాపించిన సాంచి స్థూపం మన భారతీయుల నిత్య జీవితాలతో ముడిపడి ఉంది. మన భారత జాతీయ జెండా మధ్యలో ఉన్న అశోక చక్రాన్ని సారనాథ్ స్థూపం నుండి తీసుకున్నారు. అశోకుడు స్థాపించిన సారనాథ్ స్తంభం మీద ఉన్న నాలుగు సింహాల విగ్రహం భారత జాతీయ చిహ్నం. ఇది భారతీయ కరెన్సీ, అధికారిక పత్రాలు, మరియు ప్రభుత్వ భవనాలపై ఉపయోగించబడుతుంది. ఈ సింహాలు శక్తి, ధైర్యం మరియు విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అంతటి అశోక చక్రవర్తికి కూడా నాడు తక్కిన రాజులలాగానే బహు భార్యలు కలిగి ఉండటంతో, ఆయనకు పుత్ర సంతానం కూడా ఎక్కువే అని చరిత్రకారులు చెబుతారు. వారిలో కొంతమంది బౌద్ధ ధర్మ వ్యాప్తికి పాటు పడగా, కొందరు మాత్రం రాజ్య పాలన, విస్తరణలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఆ విధంగా నాడు అశోకుడి కొడుకులలో మహీంద్రుడు, సంఘమిత్రుడు అని పేర్కొనబడిన ఇద్దరు కొడుకులు శ్రీలంకకు ప్రయాణమైనట్లూ, వారు ఆ ద్వీప దేశంతో పాటు, ఇటు దక్షిణ భారత భూభాగంలోనూ బౌద్ధ ధర్మ వ్యాప్తికి కృషి చేసినట్లూ, చరిత్రకారులంటున్నారు. ఇదిలా ఉండగా, రాచరిక కట్టుబాట్ల ప్రకారం రాజుకు కలిగిన మొదటి సంతానం, ఆయన తదనంతరం రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాల్సి వుంటుంది. ఆ విధంగా చూసుకుంటే, అశోకుడికి కలిగిన పుత్ర సంతానంలో, మహీంద్ర మొదటి వాడు. కానీ ఆయన బౌద్ధ భిక్షువుగా మారి సర్వంసంగ పరిత్యాగి కావడంతో, ఆయన తరువాతి స్థానంలో ఉన్న కునాలుడిని రాజును చేయాలని సిద్ధపడ్డాడు అశోకుడు.

అధికార దాహంతో అశోకుడి నీడలోనే ఓ క్రూరమైన కుట్రకు అంకురార్పణ జరిగింది. తన కొడుకు మహీంద్రుడు రాజు కాకపోవడంతో అతని తల్లి ఓ పథకం ప్రకారం, కునాలుడి కళ్ళు పోయేలా చేసిందని కొంతమంది చరిత్రకారులంటారు. అశోకుడి భార్యలలో చివరిదైన తిష్య రక్షిత అనే మహిళ కుతంత్రంతో కునాలుడి కళ్ళు పోయేటట్లు చేసి, తన కొడుకును రాజును చేయాలని భావించినట్లు మరి కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. కునాలుడు తక్ష శిలలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో, అశోకుడు అక్కడి గురువులకు "ప్రాకృత" భాషలో ఒక లేఖ వ్రాశాడు. ఆ లేఖలో "అధీతం కరో" అనగా - కునాలుని విద్యావంతుడిని చేయమనే మాటను వ్రాశాడు. తిష్య రక్షిత ఆ లేఖను చేజిక్కుంచుకుని, "అధీతం కరో" అన్న మాటలో చిన్న మార్పు చేసి, "అంధీతం కరో" అనగా, కునాలుని అంధుడిని చేయండనే అర్ధం వచ్చేటట్లు మార్చింది. అది తన తండ్రి ఆజ్ఞగా భావించి కునాలుడు తనను తాను ఇనుప సూదులతో కళ్ళలో గుచ్చు కున్నాడు.

అలా నాడు అశోకుడి మహా సామ్రాజ్యానికి రాజు కావలసిన కునాలుడు అంధుడైపోవడంతో అశోక చక్రవర్తి కునాలుడి కొడుకు, తన మనుమడు అయిన ‘సంప్రతి’ని చక్రవర్తిగా ప్రకటించాడు. అంతేకాకుండా, కునాలుడి కళ్ళు పోవడానికి కారకురాలయిన తిష్య రక్షితనూ, ఆమెకు సహకరించిన వారందరినీ శిక్షించదలిచాడు. ఈ క్రమంలో వారందరి కళ్ళూ పెకలింపజేయాలని నిర్ణయించుకున్న అశోకుడిని కునాలుడు వారించాడు. అదంతా తన పూర్వజన్మల కర్మ ఫలమేననీ, అందులో ఇంకోకరిని నిందించడం తగదనీ అన్నాడు. తన పినతల్లి చేసిన తప్పే తిరిగి తానూ చేయవద్దని అశోకుడికి హితవు చెప్పాడు కునాలుడు. తాను అమితంగా ప్రేమించే కొడుకు మాట కాదనలేక, వారందరికీ రాజ్య బహిష్కరణ శిక్ష విధించి, హిమాలయాలకు ఆవల ఉన్న ప్రాంతానికి వెళ్ళిపొమ్మని అశోకుడు ఆజ్ఞాపించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

అలా నాడు అశోకుడి చేత రాజ్య బహిష్కరణకు గురికాబడిన వ్యక్తులే చైనా వైపు వెళ్ళి, అక్కడ అతి ముఖ్యమైన సిల్క్ రోడ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఖోటాన్ సామ్రాజ్యాన్ని స్థాపించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు. ఇంకొందరు మాత్రం, సిల్క్ రోడ్ ప్రాంతంలో జరిగే వ్యాపారానికి ఆకర్షితులైన కొంతమంది ఉత్తర భారత వ్యాపారాలు అక్కడికి చేరి, మెల్ల మెల్లగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించారనీ, అదే ఖోటాన్ సామ్రాజ్యంగా ఏర్పడిందనీ చెబుతున్నారు. ఏది ఏమైనా నేటి చైనా ప్రాంతంలో వెలసిన అతిపురాతన సామ్రాజ్యం మన హైందవ సామ్రాజ్యమేనని ఒప్పుకోక తప్పదు.

అంతేకాదు, అలా అక్కడికి వెళ్ళిన ఖోటాన్ వంశస్తులూ, వారితో పాటు వెళ్ళిన పండితులూ, చైనా సాంస్కృతిక, ఆర్ధిక ఎదుగుదలకు ఎంతగానో కృషి చేసినట్లు చరిత్ర విదితం. వారి వల్లనే అక్కడి స్థానికులు ఆయుర్వేదం, వ్యాపారం, వివిధ కళలు, విద్యల వంటివి నేర్చుకున్నారని చరిత్ర కారులు చెబుతారు. మన దక్షిణ భారతదేశ అగ్నికులక్షత్రియ పల్లవ రాజవంశానికి చెందిన రాజు యొక్క మూడవ కుమారుడు పహ్లవ యువరాజు తన కుండలినిని మేల్కొలిపి, సన్యాసిగా మారడానికి రాచరిక జీవితాన్ని త్యజించాడు. బౌద్ధ సన్యాసిగా మారి, బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి చైనాకు ప్రయాణించాడు. షావోలిన్ కుంగ్ ఫూ యొక్క సంప్రదాయానికి మార్గదర్శకుడిగా, కుంగ్ ఫు ను అక్కడి వారికి నేర్పించాడని అంటారు. అతనినే అక్కడివారు బోధి ధర్ముడని పిలుస్తారని చరిత్ర కారులంటారు. అలా ఆనాటి చైనా పాలకులుగా, చైనా సాంస్కృతిక ఎదుగుదలలో మనవారి హస్తమే ప్రధానమని చరిత్ర చెబుతోంది. అటువంటిది నేడు చైనా తన స్వలాభం కోసం చరిత్రలో లేని విషయాలను పుట్టించి, మన దేశాన్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని ఏ దేశ మూలాలను కదిలించినా, అవి ఖచ్చితంగా మన దేశానికో, మన సనాతన ధర్మానికో ముడిపడి ఉండడం గమనార్హం.

🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏

Channel Post Link: See post on YouTube Channel Community




























Monday, November 17, 2025

The Real Tipu Sultan | Debunking Myths & Revealing Hidden History | టిప్పు సుల్తాన్!


టిప్పు సుల్తాన్!
ఈ మైసూర్ మహారాజు మహానియుడా, లేక నీచుడా?

ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. ఒకొక్కడు మహాహంతకుడు.. అని మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు గుర్తు చేసుకోక తప్పదు.. అయినా, హిందూ ఆలయాల పునరుద్ధరణ చేసిన మహామనీషి, శృంగేరీ పీఠానికి ఆర్ధిక తోడ్పాటు అందించిన సహృదయుడు, హిందువులను తన కొలువులో పోషించిన గొప్ప లౌకికవాది, బ్రిటిషర్లతో వీరోచితంగా పోరాడిన భారతీయ యోధుడు, మైసూర్ మహా రాజు టిప్పు సుల్తాన్ అని వామపక్ష చరిత్రకారులూ, సెక్యులర్ నేతలూ ముక్త కంఠంతో అబద్ధాలను చాటుతుంటారు. కొందరు వాస్తవ చరిత్రకారులు మాత్రం, దాదాపు ఎనిమిది వేల ఆలయాలను కూల్చివేసి, లక్షలాది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి, శాస్త్రం తెలిసిన వేలాది మంది పండితుల ప్రాణాలను దుర్మార్గంగా హరించిన కర్కోటకుడు టిప్పు సుల్తాన్ అని చెబుతారు. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వర్ధంతీ, జయంతి రోజులను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జరిగే చర్చ ఇది. ఇవన్నీ వింటూ ఉంటే మనలో చాలా మందికి అతను అసలు నిఖార్సైన నాయకుడేనా? లేక కరుడుగట్టిన రాక్షసుడా? అసలైన టిప్పు సుల్తాన్ వాస్తవ చరిత్ర ఏమిటి? అతనిపై నేటికీ మన దేశంలో పెద్ద ఎత్తున రాజకీయం ఎందుకు జరుగుతోంది - వంటి సందేహలెన్నో కలుగుతాయి. మరి అటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/zKCQ9dh7LLI ]


బ్రిటిష్ వాడి దాస్య శృంఖలాలనుండి బయటపడి ఏడు పదుల వత్సరాలు దాటినా, మన భారత దేశంలో నేటికీ మనకు తెలియకుండా మనపై చేస్తున్న అతి పెద్ద కుట్ర, చరిత్ర వక్రీకరణ. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా సర్దుకుపోయే మీమాంసలో మనం ఉన్నంత కాలం, తమ పెత్తనానికి ఎటువంటి లోటూ ఉండదనేది, మన దేశ రాజకీయ నాయకుల అభిప్రాయం. అందుకే స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచీ వారి మోచేతి నీళ్ళ రుచి మరిగిన కుహనా మేధావులూ, సెక్యులర్ ముసుగు ధరించిన రాజకీయ తోడేళ్ళూ కలిసి ఆడుతున్న నాటకం, మన దేశ అసలు చరిత్రను వక్రీకరించడం. అందుకోసం తాము చెప్పాలకున్న విషయాన్ని నయానో భయానో మన మెదళ్ళలోకి ఎక్కించే ప్రయత్నం చేయడం, అది కుదరని పక్షంలో మనను తికమక పెట్టడం అనే సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. అందువల్లనే టిప్పు సుల్తాన్ వాస్తవ చరిత్ర మరుగున పడిందని చెప్పవచ్చు.

మరి ఆ మైసోర్ ముస్లిం రాజు నిజ స్వరూపం ఏమిటో తెలియాలంటే అతని అసలు చరిత్రను లోతుగా పరిశీలించాలని అంటున్నారు చరిత్రకారులు. వాస్తవ చరిత్ర ప్రకారం టిప్పు సుల్తాన్ గా పిలువబడే Fateh Ali పూర్వులు మన దేశానికి చెందిన వారు కాదు. కనీసం ఇతర ఇస్లాం రాజుల లాగా ఇక్కడి రాజులపై దండయాత్ర చేసి మన దేశంలో తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న చరిత్రా లేదు. టిప్పు పూర్వికులు ఈ దేశానికి పొట్టకూటి కోసం వలస వచ్చిన సామాన్య ఇస్లాం వలసదారులలో ఒకరు.

టిప్పు ముత్తాత అయిన Muhammad Ali, పర్షియా నుంచి భారత్ కు తన కుటుంబంతో వలస వచ్చాడని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ఇంకొందరు అతడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని అంటారు. కొందరు చరిత్రకారులు మాత్రం టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ, తాము స్వయంగా ముహమ్మద్ ప్రవక్త తెగ అయిన అరబ్ ఖురేషికి చెందినవారుగా ప్రచారం చేసుకుంటుండే వాడని అంటారు. అయితే ఆ మాటలు కేవలం తాము ఉన్నత ముస్లిం వర్గానికి చెందిన వారని నిరూపించు కోవడానికి హైదర్ అలీ ఆడిన అబద్ధమని చాలామంది చరిత్రకారుల వాదన. ఏది ఏమైనా టిప్పు సుల్తాన్ వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ముస్లిం సామజిక వర్గంలో వారి స్థాయి ఏమిటి? వంటి విషయాలు మాత్రం గోప్యంగానే ఉండి పోయాయి. దీనిని బట్టి టిప్పు మూలాలు మన దేశానికి చెందినవి కావని మాత్రం తేటతెల్లమవుతోంది.

ఆ విధంగా టిప్పు ముత్తాత Muhammad Ali మన దేశానికి వచ్చి స్థిరపడి, కాలగమనంలో నాటి మైసూర్ వడయార్ రాజుల దగ్గర పనికి చేరాడు. ఆ తర్వాత టిప్పు తాత అయిన Fateh Muhammad, వడయార్ రాజుల సైన్యంలో చేరి, అనతి కాలంలోనే ఉన్నత పదవులు అందుకున్నాడు. దాంతో వడయార్ రాజులు Fateh Muhammad చేసిన సేవలకు గాను, అతనికి కోలార్ జిల్లాలోని బుధికోట ను జాగీరు గా ఇచ్చారు. అప్పటి నుంచి మెల్ల మెల్లగా వడయార్ రాజుల దగ్గర Fateh Muhammad తన ప్రాభవాన్ని పెంచుకుంటూ, తన కొడుకైన హైదర్ అలీని కూడా వడియార్ సైన్యంలో చేర్చాడు. అయితే, ఒక యుద్ధంలో ఆకస్మికంగా Fateh Muhammad చనిపోవడంతో, హైదర్ అలీ తన తమ్ముడు షాబాజ్ తో కలిసి వడయార్ రాజుల సైన్యంలో మరింత చురుకుగా పనిచేయడం మొదలు పెట్టాడు. నాడు వడయార్ రాజులకు ఇటు హైదరాబాద్ నవాబులతోనూ, అటు మరాఠాలతోనూ, మరోపక్క మలయాళ దేశ నాయకర్ రాజులతోనూ, కర్ణాటకలోని కొంతమంది సామంత రాజులతోనూ తగాదాలు ఉండేవి. అందులోనూ హైదరాబాద్ నవాబులకు నాటి బ్రిటిష్ పాలకుల అండదండలు కూడా ఉండటంతో, వడయార్ రాజులు ఆధునిక ఆయుధ సంపత్తి కోసం ఫ్రెంచ్ సేనలకు దగ్గరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో హైదర్ అలీ పలువురు ఫ్రెంచ్ అధికారులతో కలిసి పోరాటాలలో పాల్గొనడం, అక్కడ అతడు చాలా చురుకుగా పనిచేయడంతో, మెల్ల మెల్లగా వడయార్ రాజుల సైన్యంలో పెద్ద హోదాలకు చేరుకున్నాడు. ఒకానొక సందర్భంలో వడయార్ రాజు అజ్ఞాతంలోకి వెళ్ళవలసి రాగా, అదే అదనుగా తీసుకున్న హైదర్ అలీ కుట్ర పన్ని మైసూర్ పై పట్టుసాధించి, తనకు తానుగా సుల్తాన్ నని ప్రకటించుకున్నాడు.

అలా మోసపూరితంగా మైసూర్ మహారాజుగా మారిన హైదర్ అలీ, తనకు అడ్డు వస్తారని భావించిన వడయార్ రాజులకు నమ్మకస్తులనందరినీ అత్యంత కిరాతకంగా మట్టుబెట్టాడు. ఆ తర్వాత కొన్నేళకు మరాఠాలతో జరిగిన యుద్ధంలో తన కొడుకైన టిప్పును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. టిప్పుకు అదే మొదటి యుద్ధం అనీ, అందులో వారు విజయం సాధించారనీ చరిత్రకారులంటున్నారు. ఇదిలా ఉండగా, కొన్నేళ్ళకు హైదర్ అలీ వీపుపై ఏర్పడిన క్యాన్సర్ కణితి కారణంగా మరణించిన వెంటనే, అతని రెండవ భార్యకు పుట్టిన టిప్పు సుల్తాన్ మైసూర్ మహారాజుగా గద్దెనెక్కాడు.

అప్పటి నుంచి తన తండ్రి మోసంతో ఆక్రమించుకున్న రాజ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా, దక్షిణ భారతం మొత్తాన్నీ తన ఆధినంలోకి తెచ్చుకోవాలని కలలుగన్నాడు. అతనికున్న మరో అతి పెద్ద కల, దక్షిణ భారతావని మొత్తాన్నీ ఇస్లాం రాజ్యంగా మార్చడం. అందుకతను తన రాజ్యంలోని కొన్ని వేల ఆలయాలను ద్వంసం చేయించాడు. ఎంతో మంది హిందువులను చిత్ర హింసలు పెట్టి ఇస్లాంలోకి మార్చాడు, ఎదురు తిరిగిన వారిని అత్యంత కిరాతకంగా చంపించాడని, Lewis Rice అనే చరిత్రకారుడు వ్రాసిన Mysore and Coorg అనే పుస్తకంలో స్పష్టంగా ప్రస్థావించాడు.

టిప్పు సుల్తాన్ పాలనలో అతడు పెట్టిన బాధలను తట్టుకోలేక మతం మారినవారు మారిపోగా, చాలా మంది ఘోరమైన మరణాన్ని పొందగా, ఎంతోమంది హిందువులు దేశంలోని ఇంతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు. ఇక రాజ దర్బార్ లో కీలక పదవులలో నుంచి దాదాపుగా హిందువులందరినీ తొలగించి, వారి స్థానాలలో అర్హత ఉన్నా లేకున్నా ముస్లింలను మాత్రమే చేర్చుకునే వాడు. అయితే ఒక్క దివాన్ పదవిలో మాత్రం పూర్ణయ్య అనే బ్రాహ్మణ పండితుడిని కొనసాగించాడు. దీని వెనుక టిప్పు తండ్రి హైదర్ అలీ నిర్ణయం ఉందని తెలుస్తోంది.

హైదర్ అలీ సైన్యాధికారిగా మారినప్పుడు, అతడు పాల్గొన్న యుద్ధాలలో ఇతర రాజ్యాల నుంచి పెద్ద మొత్తంలో సంపదను దోచుకుని వచ్చేవాడు. అందులో చాలా భాగం వడయార్ రాజులకు ఇవ్వకుండా హైదర్ అలీ రహస్యంగా దాచుకునేవాడు. అలా దాచిన సొత్తు పెద్ద ఎత్తున ఉండటంతో, చదువురాని హైదర్ అలీ ఖండే రావు అనే బ్రాహ్మణుడి సహాయంతో, ఆ సొత్తు వివరాలను గ్రంధస్తం చేయించాడు. ఈ క్రమంలో ఖండే రావు హైదర్ అలీ దోచుకువచ్చిన సంపదను లెక్క కట్టడానికి, ఓ పద్దతిని కనుగొన్నాడు. దాని ద్వారా హైదర్ అలీ కూడా సులువుగా తన సంపదను లేక్కపెట్టగలిగే వాడని చరిత్రకారులు చెబుతారు. హైదర్ అలీ వడియార్ రాజులను మోసం చేసి మైసూర్ ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఈ ఖండే రావ్ హైదర్ అలీ కి ఎదురు తిరిగి వడయార్ రాజులకు మద్దతుగా నిలిచాడు. దాంతో హైదర్ అలీ మైసూర్ ని ఆక్రమించుకున్న తర్వాత, ఖండే రావ్ ను వెతికి పట్టుకుని మరీ అత్యంత కిరాతకంగా చంపేశాడు.

అప్పటి నుంచి అతనికి చాలా రోజులపాటు సరైన దివాన్ లోటు ఉండి పోయింది. ఒకనాడు Krishnacharya Purnaiah అనే బ్రహ్మణుడు కోటలో సరైన దివాన్ లేడని తెలుసుకుని, తనకు తెలిసిన వారి ద్వారా హైదర్ అలీ కొలువులోని ఆర్ధిక శాఖలో చేరాడు. పనిలో బాగా కష్టపడే స్వాభావం, అందమైన చేతి వ్రాత, అద్భుతమైన జ్ఞాపక శక్తి, లెక్కలలో అపారమైన పట్టు, పలు భాషలలో అనర్గళంగా మాట్లాడగలగటం వంటి అతడి ప్రత్యేక నైపుణ్యతలు హైదర్ అలీ దృష్టిలో పడ్డాయి. చాలా కాలంగా తాను వెతుకుతున్న మనిషి అతనేనని నిర్ణయించుకుని, అతనికి దివాన్ పదవిని అప్పగించాడు హైదర్ అలీ. అప్పటి నుంచి అతనిని దివాన్ పూర్ణయ్య అని పిలిచేవారు. అయితే హైదర్ అలీ చనిపోయే ముందు మాత్రం, తన తర్వాత కూడా పూర్ణయ్యను దివాన్ గా కొనసాగించమనీ, ఖజానా లెక్కలపై అతకి ఉండే పట్టు మరెవరికీ ఉండదనీ చెప్పాడు. అలా తండ్రి నిర్ణయించిన పూర్ణయ్యను తన అవసరం దృష్ట్యా ఆస్థానంలో కొనసాగనిచ్చాడు టిప్పు.

అలా పుర్ణయ్యతో పాటు, మరో ఇద్దరు బ్రాహ్మణలు కూడా టిప్పు సంస్థానంలో ఉండేవారు. వారిద్దరూ జ్యోతిష్యంలో అమోఘమైన ప్రతిభావంతులు. టిప్పుకు స్వయంగా జాతకాలపై అమితమైన నమ్మకం ఉండటంతో, ఆ ఇద్దరు బ్రాహ్మణులను కూడా టిప్పు తన దగ్గర ఉండనిచ్చాడని తెలుస్తోంది. తన స్వలాభం కోసం తప్పనిసరి పరిస్థితులలో తన దగ్గర కొనసాగనిచ్చిన ముగ్గురు బ్రాహ్మణులను చూపించి టిప్పును మహోన్నత వ్యక్తిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు, నేటి కుహనా చరిత్రహీనులు.

M H Gopal అనే చరిత్రకారుడు రాసిన Tipu Sultan’s Mysore, an Economic History అనే పుస్తకం చదివితే, అతడు చేసిన దారుణాల గురించి కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. ఆయన రాసిన దాని ప్రకారం, నాడు టిప్పు రాజ్యంలోని హిందువులు ముస్లింలుగా మారితే, భారీ మొత్తంలో డబ్బు ముట్ట చెప్పవాడనీ, తన రాజ్యంలో విధించే పన్నులలో ముస్లింలకూ, ఇస్లాం మతంలోకి మారిన వారికీ, భారీ మినహాయింపులు ఉండేవనీ తెలుస్తోంది. హిందువులుగా కొనసాగిన వారిపై మాత్రం చిత్ర విచిత్రమైన పన్నులు విధించి, వారిని అష్టకష్టాల పాలు చేసేవాడు. ఆ పన్నులు కట్టలేక చేతులెత్తేసినవారిని ఇస్లాంలోకి మారమని బలవంత పెట్టే వాడనీ, అప్పటికీ ఒప్పుకోకపోతే వారి ఆస్థులను జప్తు చేసి, కట్టు బట్టలతో నడిరోడ్డుపైకి గెంటించేవాడనీ, M H Gopal రాసిన పుస్తకంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది.

టిప్పుకు ముందు వరకూ మైసూర్ లో ఉండే అధికారిక లెక్కలనూ, ఇతర వివరాలనూ గ్రంధస్తం చేయడానికి కన్నడ భాషనే ఉపయోగించే వారు. అలా రాసిన పుస్తకాలను ఆ తర్వాత మరాఠా భాషలోకి తర్జుమా చేసే వారు. అయితే టిప్పు ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, తన రాజ్యంలో అధికారిక లెక్కలూ, గ్రంధాలూ, ఉత్తర ప్రత్యుత్తరాలలో పర్షియన్ భాష ఉండేలా చర్యలు తీసుకున్నాడు.

ఇక టిప్పు రాసిన రక్త చరిత్రలో అత్యంత దారుణమైన అధ్యాయాలుగా మలబార్ యుద్ధాన్ని పేర్కొంటారు. అతడు చేసిన ఆ యుద్ధంలో మలబార్ పై ఘన విజయం సాధించాడు. అయితే ఈ క్రమంలో అతడు హిందువుల రక్తం ఏరులై పారించాడనీ, ఆడవారూ, పిల్లలు అనే తేడా లేకుండా హిందువులను చిత్ర హింసలు పెట్టి చంపించాడనీ, కొన్ని వేల హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడనీ, K. N. Panikkar తెలిపారు. ఇదే విషయాన్ని William Logan అనే ఆంగ్ల రచయిత, Malabar Manual అనే పుస్తకంలో వివరంగా వ్రాశారు.

మలబార్ యుద్ధంలో అతడు చేసిన దారుణ మారణకాండను గొప్ప విజయంగా భావిస్తూ, ఆఫ్ఘానిస్తాన్, పర్షియా దేశాలలోని ఇతర రాజులకు ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాలలో తాను ఏకంగా నాలుగు లక్షల మంది హిందువులను ముస్లింలుగా మార్చేశాననీ, దానికోసం కాఫిర్లుగా వారికి వారు పరిగణించుకునే హిందువులను, ముఖ్యంగా బ్రాహ్మణులను వేలాది మందిని చంపించాననీ వ్రాశాడు. హిందుస్థాన్ ని అల్లా రాజ్యంగా మర్చేవరకూ తన పోరాటం కొనసాగుతుందనీ, అందుకు వారి సహాయం కూడా కోరినట్లుగా ఆ ఉత్తరాలలో ఉన్నదని, వాస్తవ చరిత్రకారులంటున్నారు.

ఇలా చెప్పుకుంటూ పొతే టిప్పు సుల్తాన్ ఆగడాలకు పెద్ద పెద్ద పుస్తకాలు కూడా సరిపోవని వాస్తవ చరిత్రకారులంటున్నారు. అయితే అతను బ్రిటిష్ వారిపై చేసిన పోరాటం కారణంగా నేటి సెక్యులర్ నాయకులూ, కుహనా మేధావులూ టిప్పును గొప్ప దేశ భక్తుడిగా చిత్రీకరించడం మొదలు పెట్టారు. చరిత్ర ప్రకారం టిప్పుకూ బ్రిటిష్ వారికీ రెండు విషయాలలో వ్యవహారం చెడటం వల్లనే యుద్ధాలు జరిగాయని చరిత్రకారులంటున్నారు. మొదటి సందర్భంలో టిప్పు తండ్రి హైదర్ అలీ వడయార్ రాజుల దగ్గర సైన్యాధికారిగా ఉన్నప్పుడు, వడయార్ శత్రువైన ఒక సామంత రాజును యుద్ధంలో ఓడించి, అతని సంపదను దోచుకు వెళ్ళాడు. ఆ రాజ్యం రాయలసీమను ఏలుతున్న నవాబులకు సన్నిహిత రాజ్యం కావడం, వారికి బ్రిటిష్ వారి అండదండలు ఉడటంతో, బ్రిటిష్ వారితో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న హైదర్ అలీ కి, ఆ ఘటన పెద్ద ఎదురు దేబ్బగా తయారయ్యింది. దాంతో అప్పటి నుంచీ బ్రిటిష్ పాలకులు హైదర్ అలీని అణచడానికి తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇక టిప్పు సుల్తాన్ అయ్యాక.. దక్షిణ భారతాన్ని మొత్తం తన నియంత్రణలోకి తీసుకోవాలనే దురాశతో, బ్రిటిష్ పాలకుల ఆలోచనలపై నీళ్ళు చల్లాడు. ఎలాగైనా భారత దేశాన్ని తమ హస్తగతం చేసుకోవాలని భావించిన బ్రిటిష్ పాలకులు, టిప్పు ఆలోచనకు అడ్డుగా నిలిచారు. దాంతో టిప్పు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయక తప్పలేదు. ఒకపక్క బ్రిటిష్ వారికీ, మరో పక్క హిందువులను నాశనం చేస్తున్న టిప్పు కీ బుద్ధి చేప్పాలనే ఉద్దేశంతో, మరాఠాలు మైసూరు పై పలు దఫాలుగా దాడులు చేయడంతో, టిప్పు కి హిందువుల మద్దతు తప్పనిసరిగా మారింది. అప్పటి నుంచీ టిప్పు హిందువుల మద్దతుపొంది, వారి ద్వారా యుద్ధాలలో తాను బలం పుంజుకోవాలనే తలంపుతో, కొన్ని ఆలయాలకు మరమ్మతులు చేయించడం, శృంగేరీ పీఠానికి విరాళాలు ఇవ్వడం, తన ఆస్థానంలో హిందూ అధికారుల సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకున్నాడని, చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని బట్టి, కుహనా మేధావులూ, సెక్యులర్ నాయకులూ చిత్రీకరిస్తున్న విధంగా టిప్పు మన దేశపు ఉత్తమ నాయకుడు మాత్రం కాదనీ, మిగిలిన ముస్లిం రాజులలాగానే అతను కూడా కరుడుగట్టిన రాక్షసుడేననీ వాస్తవ చరిత్రకారులు ఘంటాపధంగా చెబుతున్నారు. అసలైన చరిత్రను తెలుసుకుని భావితరాలకు తెలియజేయడం, సరైన నాయకులను జాగ్రత్తగా ఎన్నుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ అలక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకూ లోనుకాకుండా వినియోగించుకోవాలని ప్రార్ధిస్తున్నాను..

🚩 జై భారత్ 🙏

Monday, November 10, 2025

Science vs Faith: Can the Miracles of Sabarimala Be Explained? శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు!

 

శబరిమల అయ్యప్ప స్వామి గురించి నమ్మలేని నిజాలు!

‘స్వామియే శరణమయప్ప’ అంటూ మండలం రోజులపాటు నిష్టగా స్వామి మాల ధరించి, హరిహరసుతుడికై ఆర్తిగా భజనలు చేస్తారు అయ్యప్ప భక్తులు. ఆ మణికంఠుడిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనంగా, ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఎంతో నిష్టతో కూడుకున్న అయ్యప్ప మాలను ధరించి, మండలం రోజుల పాటు తూచా తప్పకుండా నియమ నిబంధనలు పాటించడం, మండలం పూర్తయ్యాక శబరిమలకు వెళ్లి దీక్ష విరమించడం వంటివి చూస్తూ ఉంటాము. మరీ ముఖ్యంగా కార్తిక మాసం వచ్చిందంటే ఎక్కడ చూసినా అయ్యప్ప మాల ధరించిన స్వాములు మన చుట్టూ ఎంతో మంది మనకు కనిపిస్తుంటారు. స్వాములు చేసే భజనలలోనూ, ప్రవచించే గాధలను వింటుంటే, అసలు అయ్యప్ప స్వామి ఎవరు? ఆయన ఎప్పుడు? ఎలా జన్మించారు? ఎక్కడ వెలిశారు - వంటి సందేహాలు కొంతమందికి కలుగుతుంటాయి. ఇప్పుడున్న ఆలయం ఎవరు? ఎప్పుడు కట్టారు? ఆ క్షేత్ర విశేషాలేమిటి? అసలు అయ్యప్ప స్వాములు శనికి ప్రీతిపాత్రమైన నలుపు రంగు వస్త్రాలు ధరించడానికి కారణం ఏమిటి వంటి విషయాలు మనలో చాలా మందికి తెలియదు. ఈ ఆలయంలోని మూలవిరాట్టుకు సంబంధించి మనం గతంలో చేసిన వీడియో లింక్ ను చూడని వారి కోసం పొందు పరుస్తున్నాను. ఇక క్షేత్ర విశేషాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Cn6pqpQdUTw ]


క్షీరసాగరమధనానంతరం, దేవతలకూ రాక్షసులకూ అమృతం పంచేందుకు శ్రీ మహావిష్ణువు మోహినిగా అవతరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత మోహినిని చూసి గరళ కంఠుడు ఆకర్షింపబడడం, వారి కలయిక వలన శివకేశవుల తేజస్సుతో, ధనుర్మాసం 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చిక లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఆ తరువాత తండ్రియైన జగత్పిత ఆజ్ఞమేరకు పంపా సరోవర తీర ప్రాంతంలో, కంఠంలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు స్వామి.

ఆ సమయంలో దైవ ప్రేరణవలన వేట నిమిత్తం అటుగా వచ్చిన పందళ దేశాధీశుడూ, గొప్ప శివభక్తుడూ అయిన రాజశేఖరుడు, సంతానం లేక అల్లాడిపోతున్న తనను కరుణించి ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలచి, ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురానికి తీసుకువెళ్ళాడు. మణికంఠుని సాత్విక గుణాలవల్ల కొందరు 'అయ్యా అని, మరికొందరు 'అప్పా అని, ఇంకొందరు రెండు పేర్లూ కలిపి 'అయ్యప్ప' అని పిలిచేవారు. తగిన వయసు రాగానే మహారాజు అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం జరపాలని అనుకున్నాడు. కానీ తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని, తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు మణికంఠుడు. అందుకు నియమం ఏమిటంటే, తానొక బాణం వదులుతాననీ, ఆ బాణం ఎక్కడ పడుతుందో అక్కడ తనకు ఆలయం నిర్మించాలనీ చెప్పాడు. అలా కట్టిన ఆలయమే శబరిమల ఆలయం. శబరిమల ఆలయ నిర్మాణంలో పరశురాముడు కీలక పాత్ర పోషించారు. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని, భక్తుల పూజలందుకుంటున్నాడని చరిత్ర విదితం.

అధికారిక సమాచారం ప్రకారం మొదటిలో శబరిమలకు వెళ్ళడానికి ఎరుమేలి అని పిలువబడే ఒకే ఒక్క మార్గం ఉండేది. మాస పూజలకూ, ప్రత్యేక పూజలకూ, ఆలయ సిబ్బందీ, తాంత్రి, మేల్ శాంతి వంటి వారెవరైనా ఈ మార్గంలోనే వెళ్ళి వచ్చేవారు. పూర్తిగా అడవి ప్రాంతం కావడం చేత ఆలయానికి ఎప్పుడు, ఎవరు వెళ్లాలన్నా బృందాలుగా మాత్రమే వెళ్లేవారు. అందుకే భక్తులు కూడా జట్లుగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

[ శబరిమల అయ్యప్ప! దైవ స్థాపిత విగ్రహం ఏమయ్యింది?: https://youtu.be/Z1osWZdk17g ]


సుమారు 200 సంవత్సరాల క్రితం, అంటే, 1819 లో, 70 మంది శబరిమల యాత్ర చేశారనీ, ఆ సంవత్సరం అన్ని ఖర్చులూ పోను, ఆలయానికి వచ్చిన ఆదాయం ఏడురూపాయలనీ, పందళరాజ వంశీయుల రికార్డులలో ప్రస్తావించబడి ఉంది. 1907వ సంవత్సరం వరకూ శబరిమల అయ్యప్ప ఆలయ పైకప్పు కేవలం ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అక్కడే స్వామి శిలా విగ్రహానికి పూజలు జరిగేవి. కొన్ని దశాబ్దాల క్రితం దేవాలయం అగ్ని ప్రమాదానికి గురి కావడంతో మరల ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది.

ఈ సారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేయించి ప్రతిష్టించారు. పంచ లోహ విగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఈ దేవాలయం 1935 వరకు ట్రావెన్‌కోర్ మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో ఆలయ బాధ్యతలు ట్రావెన్‌కోర్ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడ్డాయి. ఆ తరువాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో, జ్యోతి దర్శనానికే కాకుండా, మండల పూజలకు కూడా శబరిమల ఆలయం తెరవడం మొదలుపెట్టారు.

పంబా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చాలక్కాయ మార్గం, వడిపెరియార్ మార్గం ఏర్పడిన తరువాత, శబరిమలకు వచ్చే భక్తుల తాకిడి బాగా పెరిగింది. 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో, విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగ దినాలలో కూడా ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి, 1950లో, దెవలయాన్నీ, విగ్రహాన్నీ ధ్వంసం చేశారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయ్యింది. భక్తుల విరాళాలతో దేవస్థానం బోర్డు వారు ఇప్పుడున్న ఆలయాన్ని పునర్నిర్మించి, ఇప్పుడు మనకు కనిపించే స్వామివారి పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులైన శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులు తయారు చేసినట్లు తెలుస్తోంది.

దేవస్థానం ముఖ్యతాంత్రి అయిన శ్రీకాంతారు శంకర తాంత్రి, 1951, జూన్ 7వ తేదీన వేదపండితుల మంత్రాలూ, భక్తుల శరణుఘోషల మధ్య ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి వరకు కేరళీ కేళి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప, అక్కడి నుంచి భారత కేళి విగ్రహంగా కీర్తించబడుతూ, ఈ నాడు భూతళ కేళి విగ్రహంగా ప్రపంచమంతటా పూజింప బడుతున్నాడు.

[ శబరిమల కొండలపై నెలకొన్న ఆశ్చర్యకర నిజాలు - మకరజ్యోతి రహస్యాలు!: https://youtu.be/307e0iCsUdE ]


ఈ విషయంలో శబరిమల తపస్వి శ్రీ విమోచనానంద స్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది. 1950లో శబరిమలలోని అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రీ విమోచనానంద స్వామి హిమాలయాలలో సంచరిస్తూ, బదరీనాథ్ లో ఉన్నప్పుడు ఈ వార్త విన్నారు. శబరిమల ఆలయాన్ని ధ్వంసం చేశారు కాబట్టి, భారతదేశమంతటా అయ్యప్ప ఆలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా సామిని కీర్తించేటట్లు చేస్తానని శపథం చేశారాయన. ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, ముంబయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం మొదలైన ప్రాంతాలలో అయ్యప్ప ఆలయాలు నిర్మింపచేయడానికి దోహదపడ్డారు. ఆయన కోరిక నెరవేరి, దేశమంతటా ఎన్నో అయ్యప్ప ఆలయాలు నిర్మితమవ్వడమే కాకుండా, దేశ విదేశాలనుంచి భక్తులు శబరిమలకు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, 1980కి వచ్చేసరికి, శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరిగిపోవడంతో, దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకుని, పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలూ, మంచి నీటి కొళాయిలూ, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద పెద్ద షెడ్లూ నిర్మించినట్లు, ఆలయ రికార్డ్స్ పేర్కొంటున్నాయి.

ఇక శబరిమల పేరు చెప్పగానే అందరకీ గుర్తుకు వచ్చేది, పదునెట్టాంబడిగా పిలువబడే 18 బంగారు మెట్లు. అయ్యప్ప స్వామి సన్నిధానంలోని పదునెట్టాంబడిని స్వయంగా పరశురాముడే నిర్మించారు. ఆ రాతి మెట్లపైనే 1984 వరకు భక్తులు ఎక్కేవారు. ఈ మెట్లను తాకడం వల్ల తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్వాములు వెళ్ళే పడిని బట్టి, ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లెక్కే ఆచారం ఉండేది. అందువల్ల మెట్లు కొంత మేర అరిగిపోయాయి. పైగా అలా మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన ఆ ముక్కలు కాళ్ళకు గుచ్చుకుని భక్తులు ఇబ్బంది పడే వారు. దానితో 1985 లో భక్తుల విరాళాలతో ఆ 18 మెట్లకూ పంచలోహ కవచాన్ని మంత్ర సహితంగా కప్పివేశారు. దీనివలన 18 మెట్లు ఎక్కడం స్వాములకు సులభరతమైంది. దీనికి ముందు భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి, దానిపై నుండి 18 మెట్లు ఎక్కిన తర్వాత, క్యులో వెళ్ళడానికి ఏర్పాట్లు చేసారు.

1985 నుండి అక్కడ స్థిర నిర్మాణాలెన్నో చేయడంవలన, శబరిమల స్వరూపం పూర్తిగా మారిపోయింది. బెంగళూరుకు చెందిన భక్తుడొకరు శబరిమల ఆలయంపైన బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకుని, 2000వ సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది. శబరిమల ఆలయంలో వంశ పారంపర్య ముఖ్య పూజారిని తాంత్రి లేక తంత్రి అని పిలుస్తారు. పరశురాముడు వీరిని పూజ కొరకు ఆంధ్రా కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో, శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి, మేల్ శాంతిగా పిలువబడే పూజారిని, ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తరువాత, వాటిలో పదింటిని ఎంపిక చేసి, ఆ పేర్లను చీటీలపై రాసి ఒక డబ్బాలో ఉంచుతారు. దానిని అయ్యప్ప విగ్రహం ముందుంచి, ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. అందులో ఎవరి పేరు వస్తే, వారు ఆ సంవత్సరానికి శబరిమలలో మేల్ శాంతిగా వ్యవహరిస్తారు.

ఇక స్వామి వారి ఆభరణాలను పందళలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14వ తారీఖు నాటికి, అంటే, మకరసంక్రాంతి రోజున పందళం నుండి శబరిమలకు మూడు పెట్టెలలో, 84 కిలోమీటర్ల ఆడవి మార్గంలో నడుచుకుంటూ మోసుకు వస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలోని భాస్కరన్ పిళ్లై వారి కుటుంబం బాధ్యత వహిస్తుంది. వీరు మొత్తం 11 మంది. వారంతా 65 రోజులు దీక్షలో ఉండి, తిరువాభరణాలను శబరిమలకు తీసుకు వస్తారు.

వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంనుండి బయలుదేరి, మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకుని, 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరతారు. ఆభరణాల వెంట పందళరాజ వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకుని నీలిమల వరకు వచ్చి, అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే, తూర్పుదిక్కు పొన్నాంబళమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరు ఆభరణాలు మోసేవారూ పదునెనిమిది మెట్లెక్కుతారు. మరల జనవరి 20వ తారీఖు నాడు, పందళరాజు వెంటరాగా, తిరు ఆభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు. ప్రతి ఏటా స్వామివారి ఆభరణాలు తరలిస్తున్న సమయంలో వాటికి రక్షణగా ఆకాశంలో ఒక గరుడ పక్షి తిరుగుతుండడం స్వామి వారి లీలగా భక్తులు భావిస్తారు.

ఇక అయ్యప్ప మాలధారణ చేసిన 41 రోజులపాటు నల్లటి వస్త్రాలు ధరించడానికి కారణం విషయానికి వస్తే, నవగ్రహాల ప్రభావం మానవలోకంలో దుష్ప్రభావం చూపించకుండా, శని, రాహు, కేతు మొదలైన గ్రహాల వల్ల ఆపదలు రాకుండా సదా కాపాడే మహిమాన్వితమైన దైవం అయ్యప్ప స్వామి! అయ్యప్ప భక్తులపై తన ప్రభావం చూపించనని, 'శని' భగవానుడు అయ్యప్పకు వాగ్దానం చేశాడు. అందుకే శనికి ప్రీతిపాత్రమైన నల్లని దుస్తులను తన దీక్షాకాలంలో ధరించాలని అయ్యప్ప మానవులకు నియమం పెట్టాడు. దీక్ష సమయంలో ఒక్కసారి నల్లని దుస్తులను ధరించిన వారికి, జీవితాంతం శని ప్రభావం వుండదని 'అయ్యప్ప' స్వాముల నమ్మకం.

ॐ 🚩 స్వామియే శరణమయ్యప్ప 🙏

Monday, November 3, 2025

KALKI AVATAR: The Final Chapter of Kaliyuga | Hindu Prophecy Revealed | కల్కి జన్మరహస్యం

 

‘కల్కి జన్మరహస్యం’
ప్రతి కలియుగంలోనూ ‘కల్కి భగవానుడు’ అవతరిస్తాడా?

సంస్కృతంలో ‘కల్కి’ అంటే దోషాలను హరించేదని అర్థం. దోషాల నుంచి విముక్తి కలిగించే అవతారం కాబట్టే ఆయనకు కల్కి అని నామకరణం జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్ర విదితం..  ధర్మపరులనూ, భగవద్బంధువులనూ హింసిస్తూ, ఈ భూమిపై అధర్మం పెచ్చుమీరిన వేళ తాను స్వయంగా అవతరించి అధర్మాన్ని నాశనంగావించి, ధర్మ సంస్థాపన చేస్తానని భగవత్ గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు. ఈ క్రమంలో మన పురాణాలలో ప్రస్థావించబడిన దశావతారాల గురించీ, వాటిలో మొదటి మూడు యుగాలలో ఆ నారాయణుడు పూనుకున్న తొమ్మిది అవతారాల గురించీ మనం గతంలో చేసిన ‘దశావతారాల’ వీడియోలో చెప్పుకున్నాము. ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో పాపం పెచ్చుమీరి పోయినప్పుడు, చెడును నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఆయన పదవ అవతారమైన కల్కి భగవానుడిగా అవతరించి, కలి ప్రభావం చేత భారంగా తయారైన భూమిని ఉద్ధరిస్తాడన్న విషయం కూడా తెలిసిందే. అలా ఆయన కలియుగాన్ని ముగించి, భూమిపై సత్యయుగాన్ని తిరిగి స్థాపిస్తాడని వివరించబడింది. భాగవతంలోని పన్నెండవ స్కందంలోని రెండవ అధ్యాయంలో, కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు పేర్కొనబడి ఉన్నాయి. అసలు కల్కి అవతార విశేషాలేమిటి? ఆయన మనం ఉంటున్న ఈ భూమిపైకి ఎలా రాబోతున్నాడు..? ప్రతి మహాయుగంలోని కలియుగంలో కల్కి అవతరిస్తాడా? వంటి సందేహాలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PW44FirZJ6Q ]


మన పురాణాల ప్రకారం, కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలపై హుందాగా నడిస్తే, త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపర యుగంలో రెండు పాదాలపై నడిచినట్లు వివరించబడింది. ఇక కలి యుగంలో ధర్మం కేవలం ఒక్క పాదంపై మాత్రమే నడుస్తుందన్న విషయం కనిపిస్తూనే వుంది. అంటే కలి ప్రభావం చేత ఈ యుగంలో దాదాపుగా ధర్మం అంతరించిపోనుందని తెలుస్తోంది. అటువంటి దారుణ పరిస్థితుల నుంచి భూమిని కాపాడి, మళ్ళీ ధర్మం నాలుగు పాదాలపై నడిచే కృత యుగాన్ని తీసుకురావడానికి, సాక్ష్యత్తు శ్రీ మహా విష్ణువు కల్కి అవతారంలో వస్తాడని, వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో చెప్పబడింది. అగ్ని పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం వంటి పురాణాలలోనూ కల్కి భగవానుడి ఆగమన వివరాలూ, వచ్చిన తరువాత ఆయన చేయబోయే పనులను గురించీ పేర్కొనబడివుంది.

ఇక కల్కి అవతారం గురించి ప్రస్థావించుకుంటే, కలియుగంలో దాదాపుగా మనుష్యులంతా దుర్మార్గులుగానూ, మ్లేచ్ఛులుగానూ మారిపోయి, విపరీత ధోరణిలో పాపాలు మితిమీరిన సమయంలో, విష్ణుమూర్తి ఈ భూమిపై రహస్యంగా ఉన్న శంభల నగరంలో కల్కిగా జన్మించి ధర్మసంస్థాపన జేస్తాడనీ, అప్పటి తన అవతారం గురించీ, తన దేవేరుల జననం గురించీ వివరించినట్లు, భాగవత పురాణంలో ప్రస్తావించబడి ఉంది.

అలా స్వామి చెప్పిన విధంగా కలియుగాంతంలో, హిమాలయాలలో కృత యుగం నుంచి అత్యంత రహస్యంగా ఉన్న శంభల నగరంలో, విష్ణు యశస్సు, సుమతీ అనే పుణ్య దంపతులకు జన్మిస్తాడు. ఆయన జన్మించిన సమయంలో నాలుగు చేతులతో, సాక్ష్యత్తు విష్ణు స్వరూపంలోనే కనిపిస్తాడు. అది చూసి తల్లిదండ్రులు కంగారూపడుతుండగా, ఆయన తన మాయతో అదంతా ఒక భ్రమలా, మళ్ళీ రెండు చేతులతో పుట్టిన సాధారణ పిల్లవాడిలా కనిపిస్తాడని పురాణ ప్రస్థావన. ఆ విధంగా పుట్టిన పిల్లవాడికి మహర్షులు కల్కి అని నామకరణం చేస్తారు. విష్ణు మూర్తి 10వ అవతారం కోసం ఒక పవిత్రమైన ప్రాంతం ఉండాలనే తలంపుతో, దేవ శిల్పి అయిన విశ్వకర్మ, మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలలో, ‘కలి’ కూడా కనిపెట్టలేని అత్యంత రహస్య ప్రదేశమైన శంభల నగరాన్ని నిర్మించాడని, పురాణాల ద్వారా తెలుస్తోంది.

శంభల నగరంలో దైవీక శక్తులు గల వారితోపాటు, మహిమాన్వితమైన పరికరాలు కూడా ఎన్నో ఉన్నాయనీ, అక్కడికి వెళ్ళడం మామూలు మనుష్యులకు సాధ్యపడదనీ, భారతీయులతో పాటు యూరోపియన్స్ కూడా నమ్ముతారు. ఆ నమ్మకంతోనే ఆనాడు జర్మన్ నియంత హిట్లర్ ఒక బృందాన్ని శంభల నగరాన్ని వెతకడానికి పంపాడు. ఆ ప్రయత్నం ఫలించకపోగా, అలా శంభల నగరాన్ని గురించి వెతకడానికి ప్రయత్నించిన వారిలో చాలామంది చనిపోయారు. విశ్వకర్మచే నిర్మితమైన ఆ అదృశ్య శంభల నగరం గురించీ, అక్కడుండే ‘దివ్య మణి’ కి సంబంధించీ మనం గతంలో చేసిన వీడియోల లింక్స్ ని చూడని వారి కోసం పొందుపరుస్తున్నాను.

ఇక కల్కి భగవానుడు జన్మించిన తర్వాత, ఆయన ఆగమనం గురించి కొంత కాలం ఎవరికీ తలియకుండా రహస్యంగానే పెరుగుతాడు. విద్యార్థియై గురువుకోసం వెతికే సమయంలో, మహేంద్ర గిరి పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడు కనిపిస్తాడు. పరశురాముడు బాల కల్కికి శిక్షణ ఇచ్చి, సకల విద్యాలలో తీర్చి దిద్దుతాడు. అలా కల్కి విధ్యాభ్యాసం పూర్తయిన తర్వాత, పరశురాముడే ఆయన జన్మ రహస్యాన్ని తెలియజేస్తాడు.

భూమిని ఉద్ధరించడానికి మానవ రూపంలో ఉన్న తనకు మరిన్ని శక్తులు కావాలని తలచి, పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికై తపస్సుకు పూనుకుంటాడు స్వామి. ఆది దంపతులు ప్రత్యక్షమై, గరుత్మంతుడి అంశ కలిగిన తెల్లటి ఎగిరే గుర్రాన్నీ, ప్రపంచంలో ఏ శక్తీ ఎదిరించి నిలువలేని ఒక దివ్య ఖడ్గాన్నీ, సర్వజ్ఞుడనే ఒక మాట్లాడే చిలుకనూ ప్రసాదిస్తారు కల్కి భగవానుడికి. ఆ చిలుక కొన్ని దేవతా శక్తులను కలిగి ఉంటుందని పురాణ విదితం. వాటి సహాయంతో కల్కి భగవానుడు ఈ భూమిపై ధర్మ సంస్థాపన గావిస్తాడని ఆశీర్వదిస్తారు ఆది దంపతులు.

ఇదిలా ఉంటే, మన భారత దేశానికి దక్షిణాన సముద్ర మధ్యలో ఉన్నది సింహళ దేశం. దానినే నేడు శ్రీలంక అనే పేరుతో పిలుస్తున్నాము. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఒకప్పుడు లంక చాలా పెద్దగా ఉండేది. అదంతా కాల గమనంలో వచ్చిన మార్పుల కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం మిగిలివున్న శ్రీలంక, ఒకప్పటి లంకలో ఒక చిన్న దీవి మాత్రమే. ఈ వివరాలతో కూడా మనం గతంలో చేసిన వీడియో లింక్ ను పొందు పరుస్తున్నాను. శ్రీలంకనే కొన్ని సంవత్సరాల ముందు వరకు, సింహళ రాజ్యాంగా పిలిచేవారు. దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితమే అక్కడి ప్రభుత్వం తమ దేశానికి శ్రీలంక అనే పేరు పెట్టుకున్నది.

ఇక లక్ష్మీమాత పద్మావతి అనే పేరుతో, ఆ సింహళ దేశంలోని బృహద్రథుడు, కౌముది అనే రాజ దంపతులకు జన్మిస్తుంది. మన పురాణాల ప్రకారం, కలియుగం ఏర్పడి చాలా ఏళ్లు గడచినా, భూమిపైనుండే కొన్ని ప్రాంతాలూ, కొంతమంది మనుషులు మాత్రం కలి ప్రభావానికి లోనవ్వకుండా ఉంటారని ప్రస్థావన. అటువంటి వారే ఈ బృహద్రథుడు, కౌముది అనే దంపతులు. ఇలా వారికి లక్ష్మీ మాత పద్మావతిగా జన్మించి, చిన్న తనం నుంచి నారాయణుడికి భార్య కావాలనే తలంపుతో పేరుగుతుంది. మహర్షుల సూచనల మేరకు ఆమె పార్వతీ పరమేశ్వరులకై తపస్సు చేసి, తాను కేవలం విష్ణుమూర్తిని మాత్రమే వివాహం చేసుకునేలా కటాక్షించమని వేడుకుని, విష్ణువు తప్ప తనను వేరే దృష్టితో చూసిన వారందరూ స్త్రీలుగా మారిపోయేలా వరం పొందుతుంది.

ఆ తర్వాత పద్మావతి తల్లిదండ్రులు స్వయం వరం ఏర్పాటు చేస్తారు. అక్కడికి విచ్చేసిన రాజులు పద్మావతిని చూసి మోహించగానే, వారంతా స్త్రీలుగా మారిపోతారు. విష్ణు మూర్తి ఎంతకీ రాకపోవడంతో, తనకు ఆది దంపతులు ప్రసాదించినది వరమో శాపమో తెలియక, ఆత్మ త్యాగం చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది పద్మావతి. సరిగ్గా అదే సమయానికి అక్కడకు చేరిన సర్వజ్ఞుడనే మాట్లాడే చిలుక, ఆమెకు విష్ణుమూర్తి యొక్క కల్కి అవతారం గురించి చెప్పి, ఆయన త్వరలోనే వస్తాడని తెలియజేస్తుంది.

తరువాత చిలుక కల్కి భగవానుడికి విషయం చెప్పి, సింహళ దేశానికి తీసుకు వెళుతుంది. కల్కి భగవానుడు పద్మావతిని చూసిన తరువాత కూడా స్త్రీ రూపంలోకి మారక పోవడంతో, వచ్చినవాడు సాక్ష్యత్తు విష్ణువే అని తెలుసుకుని, కల్కిని పెళ్లి చేసుకుంటుంది.

కల్కి భగవానుడి రాక కలియుగాంతంలో ఉంటే, అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా అత్యాధునిక టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈ గుర్రాలు, కత్తులు, రాజ వంశాలనేవి ఉంటాయా అనే సందేహం కలగడం సహజం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రామాయణ, మహాభారతాలలో వాడిన చాలా అస్త్రాల పేర్లు సాధారణంగా వినిపించినా, వాటి వెనుక ఎంతో సైన్స్ దాగి ఉందని ఈ మధ్య పరిశోధనలలో బయటపడుతోంది. అలాగే, కల్కి భగవానుడి అవతారం గురించిన వర్ణన ఎప్పుడో, కొన్ని యుగాలకు పూర్వం వ్రాయబడింది. ఆ కాలంలో ఉపయోగించిన ఆయుధాలూ, వాహనాల పేర్లు ఏవయినా, వాటికి ఉండే శక్తుల వర్ణనలు గమనిస్తే, అవి advanced weapons గా అర్ధం అవుతుంది. అలాగే రాజ వంశాల విషయంలోనూ.. మనకు తెలిసిన గత ఐదు వేల సంవత్సరాల చరిత్రలోనే ఎన్నో మార్పులను చూశాము. ఇక కల్కి అవతారం, కలియుగాంతంలో జరుగుతుందని మన పురాణాలలో పేర్కొనబడి ఉంది. కలియుగ కాల పరిమితి, 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో ఇప్పటి వరకు ఇంచుమించు 5 వేల ఏళ్లు మాత్రమే గడిచాయి. అంటే, ఇంకా 4 లక్షల, 27 వేల సంవత్సరాల సమయం మిగిలి ఉంది. అప్పటికి మన భూమి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం ఎవరి తరమూ కాదు.

ఇక కల్కి భగవానుడి రాకకు కారణమైన ధర్మ స్థాపన విషయానికి వస్తే, విష్ణు మూర్తి ఒక్కో అవతారం ఎత్తినప్పుడల్లా, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడి వంటి రాక్షసులను చంపడం తెలిసిందే. భాగవతం ప్రకారం వారంతా వైకుంఠంలోని విష్ణుమూర్తి నివాసానికి ద్వారపాలకులుగా ఉన్న జయ, విజయులు. సనకాది మునుల శాపం కారణంగా వివిధ జన్మలలో రాక్షసులుగా పుట్టి, విష్ణు మూర్తి చేతిలో వారు మరణించారు. కల్కి పురాణం ప్రకారం కలియుగంలో జయ, విజయలు రాక్షసులుగా కాకుండా, ఆ స్వామికి కొడుకులుగా పుడతారని చెప్పబడి ఉంది. పైగా వారిద్దరి కారణంగానే కల్కి భగవానుడి అవతారంలో ఆయన చేయాల్సిన ధర్మసంస్థాపనకు నాంది పడుతుందని కూడా పేర్కొనబడి ఉంది.

అదెలా అంటే, సింహళ దేశ రాజ దంపతులైన బృహద్రథుడు, కౌముదిల పుత్రిక పద్మావతిని కల్కి భగవానుడు వివాహమాడటం వంటి విషయాలు ముందు చెప్పుకున్నాము. ఆ తర్వాత స్వామి అమ్మవారిని తీసుకుని శంభల నగరానికి వెళ్లిపోతారు. అక్కడ వారికి ఇద్దరు కుమారులు పుట్టగా, వారికి జయ, విజయులనే పేర్లు పెడతారు. వారిద్దరూ శంభల నగరంలోనే పెరిగి పెద్దవ్వడంతో పాటు, సకల విద్యలలోనూ ప్రావీణ్యం పొందుతారు.

అలా వారి విద్యాభ్యాసం పూర్తయిన తరువాత, ఒకనాడు జయ విజయులు కల్కి భగవానుడిని చేరి, గత యుగాలలో శ్రీరాముల వారు, ధర్మరాజు చేసినట్లు అశ్వమేధ యాగం చేయమని కోరతారు. తన అవతార ధర్మం నెరవేర్చే సమయం ఆసన్నమైందని అర్ధమైన స్వామి, శంభల నగరం నుంచి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు.

ఇక్కడ కల్కి భగవానుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ, మానవ రూపంలో భూమిపై జన్మించడం వలనా, చేయనున్నది కఠినమైన రణం కావడంతో, మరింత మద్దతుకోసం ఆయన అశ్వమేధ యాగానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన, అప్పటికి కలి ప్రభావం వల్ల పీడింపబడని నగరాలకు ముందుగా వెళ్ళి, అశ్వమేధ యాగం కోసం అక్కడి రాజుల మద్దతు కూడబెట్టుకుని, వారి సైన్యాలను కూడా తన సైన్యంలో కలుపుకుంటాడు.

ఆ తర్వాత కల్కి భగవానుడు విశాలమైన సైన్యంతో, ముందుగా కలి ప్రభావం చేత పూర్తిగా నాశనమైన కీటక పురం అనే రాజ్యానికి వెళతాడని పురాణ విదితం. అక్కడి రాజు, ప్రభుత్వం, ప్రజలు, కలి ప్రభావం చేత అమాయకులను హింసిస్తూ, పరమ దుర్మార్గాలను అనుసరిస్తూ, ధర్మాన్ని పూర్తిగా విడిచి విశృంఖల జీవితాలను గడుపుతూ, గో మాంసాన్ని భుజిస్తూ ఉంటారు. అటువంటి రాజ్యంపై కల్కి భగవానుడు ముందుగా దాడి చేయగా, అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుందనీ, ఆ యుద్ధంలో కీటక రాజైన జినుడూ, అతడి తమ్ముడైన శుద్ధోధనుడూ కలిసి కల్కి భాగవానుడితో యుద్ధం చేస్తారనీ తెలుస్తోంది. ఆ యుద్ధంలో కల్కి భగవానుడు, జినుడి మర్మాంగాలను నరికేయగా అతడు చనిపోతాడు. ఆ తర్వాత శుద్ధోధనుడి తల నరికి చంపుతాడు. వారిద్దరి మరణం తర్వాత శుద్ధోధనుడి భార్య అయిన మాయ కూడా స్వయంగా యుద్ధ రంగంలోకి రాగా, కల్కి లో వున్న విష్ణుమాయ ఆమెను లీనం చేసుకుంటుంది. దాంతో ఆ యుద్ధం ముగిసి, అక్కడ ధర్మ స్థాపన జరుగుతుందని తెలుస్తోంది.

కల్కి సాధించిన తొలి విజయం తర్వాత, సప్త చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ వచ్చి ఆ స్వామి సేనకు శిక్షణ ఇస్తాడాని పురాణ విదితం. వివిధ యుగాలలో జన్మించి, సప్త చిరంజీవులుగా కలియుగాంతం వరకు కొనసాగుతున్న వారంతా, ధర్మ స్థాపన కోసం కల్కి భగవానుడు చేసే యుద్ధంలో పాలుపంచుకోవడం కోసమే రహస్యంగా జీవిస్తున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి.

అలా సిద్ధమైన సైన్యంతో కల్కి భగవానుడు, మన భారత దేశంతో పాటు ఈ భూమండలం మొత్తం వ్యాపించి ఉన్న మ్లేచ్చులు, కిరాతులు, అధర్ములందరనీ సంహరిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన అధర్మ వర్తన రాజులంతా కలిసి, కోకా, వికోకా అనబడే రాజుల దగ్గరకు చేరి, కలి పురుషుడితో సమావేశమై, కల్కి భాగవానుడిని ఓడించడానికి భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. విషయం తెలుసుకున్న జగన్నాటక సూత్రధారి తదనుగుణంగా వారిపై యుద్ధం చేసి, అధర్మపలందరనీ సంహరిస్తాడు. చివరకు స్వామి చేతిలో చావు దెబ్బలు తిన్న కలి పురుషుడు ఒక గాడిదపై ఎక్కి పారిపోతాడు. అలా కలియుగం అంతం అయ్యి, తిరిగి సత్య యుగం మోదలవుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. యుద్ధంలో దెబ్బ తిని పారిపోయిన కలి, మరో మహా యుగంలో మళ్ళీ వచ్చే కలియుగం సమయానికి కోలుకుని, మళ్ళీ తన ప్రభావాన్ని చూపించడం, కాల చక్ర ప్రభావం.

ఇక కల్కి భగవానుడు తిరిగి తన సైన్యంతో శంభలకు చేరి, అక్కడే దాదాపు వెయ్యేళ్ళ పాటు రాజ్య పాలన చేస్తాడు. ఆ క్రమంలో కల్కి భగవానుడు భూమాత అవతారమైన రమ అనే రాజ కన్యను కూడా వివాహం చేసుకుంటాడు. అప్పటి వరకు రహస్యంగా ఉన్న శంభల నగరం, అక్కడినుంచి సాధారణ ప్రజలకు కూడా కనిపిస్తుంది. కలి పురుషుడు పారిపోవడం, కల్కి భగవానుడు ఆఖరి అధర్ముడిని కూడా సంహరించడం, మనుష్యులందరినీ తిరిగి పూర్తి ధర్మ మార్గంలోకి తీసుకురావడంతో కాల చక్రం తిరిగి, తరువాతి మహా యుగంలో మరో సత్య యుగం మొదలవుతుంది. వెయ్యేళ్ళ పాలన తర్వాత స్వామి అవతారం చాలించి, దేవేరుల సమేతంగా తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇక ప్రతి మహా యుగంలోని కలియుగంలోనూ కల్కి భగవానుడు అవతరిస్తాడా? అనే ప్రశ్నకు సమాధానం, లేదనే చెప్పాలి. కొన్ని కలియుగాలలో విభిన్న రూపాలలో వస్తాడని, మహాభారత, మత్స్య, స్కంద పురాణాలు పేర్కొంటున్నాయి. ఒక కలియుగాన్ని పరుశురాముడు ముగించాడని మహాభారతం చెబుతోంది. మరో కలియుగంలో మహాదేవి అవతారంగా వచ్చి, రాక్షస సంహారం చేసినట్లు దేవీ భాగవతం చెబుతోంది.

🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏





Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...