KALKI AVATAR: The Final Chapter of Kaliyuga | Hindu Prophecy Revealed | కల్కి జన్మరహస్యం

 

‘కల్కి జన్మరహస్యం’
ప్రతి కలియుగంలోనూ ‘కల్కి భగవానుడు’ అవతరిస్తాడా?

సంస్కృతంలో ‘కల్కి’ అంటే దోషాలను హరించేదని అర్థం. దోషాల నుంచి విముక్తి కలిగించే అవతారం కాబట్టే ఆయనకు కల్కి అని నామకరణం జరిగిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్ర విదితం..  ధర్మపరులనూ, భగవద్బంధువులనూ హింసిస్తూ, ఈ భూమిపై అధర్మం పెచ్చుమీరిన వేళ తాను స్వయంగా అవతరించి అధర్మాన్ని నాశనంగావించి, ధర్మ సంస్థాపన చేస్తానని భగవత్ గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశాడు. ఈ క్రమంలో మన పురాణాలలో ప్రస్థావించబడిన దశావతారాల గురించీ, వాటిలో మొదటి మూడు యుగాలలో ఆ నారాయణుడు పూనుకున్న తొమ్మిది అవతారాల గురించీ మనం గతంలో చేసిన ‘దశావతారాల’ వీడియోలో చెప్పుకున్నాము. ఇక ప్రస్తుతం నడుస్తున్న కలియుగంలో పాపం పెచ్చుమీరి పోయినప్పుడు, చెడును నాశనం చేసి ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం ఆయన పదవ అవతారమైన కల్కి భగవానుడిగా అవతరించి, కలి ప్రభావం చేత భారంగా తయారైన భూమిని ఉద్ధరిస్తాడన్న విషయం కూడా తెలిసిందే. అలా ఆయన కలియుగాన్ని ముగించి, భూమిపై సత్యయుగాన్ని తిరిగి స్థాపిస్తాడని వివరించబడింది. భాగవతంలోని పన్నెండవ స్కందంలోని రెండవ అధ్యాయంలో, కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు పేర్కొనబడి ఉన్నాయి. అసలు కల్కి అవతార విశేషాలేమిటి? ఆయన మనం ఉంటున్న ఈ భూమిపైకి ఎలా రాబోతున్నాడు..? ప్రతి మహాయుగంలోని కలియుగంలో కల్కి అవతరిస్తాడా? వంటి సందేహాలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PW44FirZJ6Q ]


మన పురాణాల ప్రకారం, కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలపై హుందాగా నడిస్తే, త్రేతాయుగంలో మూడు పాదాలపై, ద్వాపర యుగంలో రెండు పాదాలపై నడిచినట్లు వివరించబడింది. ఇక కలి యుగంలో ధర్మం కేవలం ఒక్క పాదంపై మాత్రమే నడుస్తుందన్న విషయం కనిపిస్తూనే వుంది. అంటే కలి ప్రభావం చేత ఈ యుగంలో దాదాపుగా ధర్మం అంతరించిపోనుందని తెలుస్తోంది. అటువంటి దారుణ పరిస్థితుల నుంచి భూమిని కాపాడి, మళ్ళీ ధర్మం నాలుగు పాదాలపై నడిచే కృత యుగాన్ని తీసుకురావడానికి, సాక్ష్యత్తు శ్రీ మహా విష్ణువు కల్కి అవతారంలో వస్తాడని, వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో చెప్పబడింది. అగ్ని పురాణం, పద్మ పురాణం, విష్ణు పురాణం వంటి పురాణాలలోనూ కల్కి భగవానుడి ఆగమన వివరాలూ, వచ్చిన తరువాత ఆయన చేయబోయే పనులను గురించీ పేర్కొనబడివుంది.

ఇక కల్కి అవతారం గురించి ప్రస్థావించుకుంటే, కలియుగంలో దాదాపుగా మనుష్యులంతా దుర్మార్గులుగానూ, మ్లేచ్ఛులుగానూ మారిపోయి, విపరీత ధోరణిలో పాపాలు మితిమీరిన సమయంలో, విష్ణుమూర్తి ఈ భూమిపై రహస్యంగా ఉన్న శంభల నగరంలో కల్కిగా జన్మించి ధర్మసంస్థాపన జేస్తాడనీ, అప్పటి తన అవతారం గురించీ, తన దేవేరుల జననం గురించీ వివరించినట్లు, భాగవత పురాణంలో ప్రస్తావించబడి ఉంది.

అలా స్వామి చెప్పిన విధంగా కలియుగాంతంలో, హిమాలయాలలో కృత యుగం నుంచి అత్యంత రహస్యంగా ఉన్న శంభల నగరంలో, విష్ణు యశస్సు, సుమతీ అనే పుణ్య దంపతులకు జన్మిస్తాడు. ఆయన జన్మించిన సమయంలో నాలుగు చేతులతో, సాక్ష్యత్తు విష్ణు స్వరూపంలోనే కనిపిస్తాడు. అది చూసి తల్లిదండ్రులు కంగారూపడుతుండగా, ఆయన తన మాయతో అదంతా ఒక భ్రమలా, మళ్ళీ రెండు చేతులతో పుట్టిన సాధారణ పిల్లవాడిలా కనిపిస్తాడని పురాణ ప్రస్థావన. ఆ విధంగా పుట్టిన పిల్లవాడికి మహర్షులు కల్కి అని నామకరణం చేస్తారు. విష్ణు మూర్తి 10వ అవతారం కోసం ఒక పవిత్రమైన ప్రాంతం ఉండాలనే తలంపుతో, దేవ శిల్పి అయిన విశ్వకర్మ, మన దేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలలో, ‘కలి’ కూడా కనిపెట్టలేని అత్యంత రహస్య ప్రదేశమైన శంభల నగరాన్ని నిర్మించాడని, పురాణాల ద్వారా తెలుస్తోంది.

శంభల నగరంలో దైవీక శక్తులు గల వారితోపాటు, మహిమాన్వితమైన పరికరాలు కూడా ఎన్నో ఉన్నాయనీ, అక్కడికి వెళ్ళడం మామూలు మనుష్యులకు సాధ్యపడదనీ, భారతీయులతో పాటు యూరోపియన్స్ కూడా నమ్ముతారు. ఆ నమ్మకంతోనే ఆనాడు జర్మన్ నియంత హిట్లర్ ఒక బృందాన్ని శంభల నగరాన్ని వెతకడానికి పంపాడు. ఆ ప్రయత్నం ఫలించకపోగా, అలా శంభల నగరాన్ని గురించి వెతకడానికి ప్రయత్నించిన వారిలో చాలామంది చనిపోయారు. విశ్వకర్మచే నిర్మితమైన ఆ అదృశ్య శంభల నగరం గురించీ, అక్కడుండే ‘దివ్య మణి’ కి సంబంధించీ మనం గతంలో చేసిన వీడియోల లింక్స్ ని చూడని వారి కోసం పొందుపరుస్తున్నాను.

ఇక కల్కి భగవానుడు జన్మించిన తర్వాత, ఆయన ఆగమనం గురించి కొంత కాలం ఎవరికీ తలియకుండా రహస్యంగానే పెరుగుతాడు. విద్యార్థియై గురువుకోసం వెతికే సమయంలో, మహేంద్ర గిరి పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడు కనిపిస్తాడు. పరశురాముడు బాల కల్కికి శిక్షణ ఇచ్చి, సకల విద్యాలలో తీర్చి దిద్దుతాడు. అలా కల్కి విధ్యాభ్యాసం పూర్తయిన తర్వాత, పరశురాముడే ఆయన జన్మ రహస్యాన్ని తెలియజేస్తాడు.

భూమిని ఉద్ధరించడానికి మానవ రూపంలో ఉన్న తనకు మరిన్ని శక్తులు కావాలని తలచి, పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికై తపస్సుకు పూనుకుంటాడు స్వామి. ఆది దంపతులు ప్రత్యక్షమై, గరుత్మంతుడి అంశ కలిగిన తెల్లటి ఎగిరే గుర్రాన్నీ, ప్రపంచంలో ఏ శక్తీ ఎదిరించి నిలువలేని ఒక దివ్య ఖడ్గాన్నీ, సర్వజ్ఞుడనే ఒక మాట్లాడే చిలుకనూ ప్రసాదిస్తారు కల్కి భగవానుడికి. ఆ చిలుక కొన్ని దేవతా శక్తులను కలిగి ఉంటుందని పురాణ విదితం. వాటి సహాయంతో కల్కి భగవానుడు ఈ భూమిపై ధర్మ సంస్థాపన గావిస్తాడని ఆశీర్వదిస్తారు ఆది దంపతులు.

ఇదిలా ఉంటే, మన భారత దేశానికి దక్షిణాన సముద్ర మధ్యలో ఉన్నది సింహళ దేశం. దానినే నేడు శ్రీలంక అనే పేరుతో పిలుస్తున్నాము. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఒకప్పుడు లంక చాలా పెద్దగా ఉండేది. అదంతా కాల గమనంలో వచ్చిన మార్పుల కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ప్రస్తుతం మిగిలివున్న శ్రీలంక, ఒకప్పటి లంకలో ఒక చిన్న దీవి మాత్రమే. ఈ వివరాలతో కూడా మనం గతంలో చేసిన వీడియో లింక్ ను పొందు పరుస్తున్నాను. శ్రీలంకనే కొన్ని సంవత్సరాల ముందు వరకు, సింహళ రాజ్యాంగా పిలిచేవారు. దాదాపు ఒక దశాబ్ద కాలం క్రితమే అక్కడి ప్రభుత్వం తమ దేశానికి శ్రీలంక అనే పేరు పెట్టుకున్నది.

ఇక లక్ష్మీమాత పద్మావతి అనే పేరుతో, ఆ సింహళ దేశంలోని బృహద్రథుడు, కౌముది అనే రాజ దంపతులకు జన్మిస్తుంది. మన పురాణాల ప్రకారం, కలియుగం ఏర్పడి చాలా ఏళ్లు గడచినా, భూమిపైనుండే కొన్ని ప్రాంతాలూ, కొంతమంది మనుషులు మాత్రం కలి ప్రభావానికి లోనవ్వకుండా ఉంటారని ప్రస్థావన. అటువంటి వారే ఈ బృహద్రథుడు, కౌముది అనే దంపతులు. ఇలా వారికి లక్ష్మీ మాత పద్మావతిగా జన్మించి, చిన్న తనం నుంచి నారాయణుడికి భార్య కావాలనే తలంపుతో పేరుగుతుంది. మహర్షుల సూచనల మేరకు ఆమె పార్వతీ పరమేశ్వరులకై తపస్సు చేసి, తాను కేవలం విష్ణుమూర్తిని మాత్రమే వివాహం చేసుకునేలా కటాక్షించమని వేడుకుని, విష్ణువు తప్ప తనను వేరే దృష్టితో చూసిన వారందరూ స్త్రీలుగా మారిపోయేలా వరం పొందుతుంది.

ఆ తర్వాత పద్మావతి తల్లిదండ్రులు స్వయం వరం ఏర్పాటు చేస్తారు. అక్కడికి విచ్చేసిన రాజులు పద్మావతిని చూసి మోహించగానే, వారంతా స్త్రీలుగా మారిపోతారు. విష్ణు మూర్తి ఎంతకీ రాకపోవడంతో, తనకు ఆది దంపతులు ప్రసాదించినది వరమో శాపమో తెలియక, ఆత్మ త్యాగం చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది పద్మావతి. సరిగ్గా అదే సమయానికి అక్కడకు చేరిన సర్వజ్ఞుడనే మాట్లాడే చిలుక, ఆమెకు విష్ణుమూర్తి యొక్క కల్కి అవతారం గురించి చెప్పి, ఆయన త్వరలోనే వస్తాడని తెలియజేస్తుంది.

తరువాత చిలుక కల్కి భగవానుడికి విషయం చెప్పి, సింహళ దేశానికి తీసుకు వెళుతుంది. కల్కి భగవానుడు పద్మావతిని చూసిన తరువాత కూడా స్త్రీ రూపంలోకి మారక పోవడంతో, వచ్చినవాడు సాక్ష్యత్తు విష్ణువే అని తెలుసుకుని, కల్కిని పెళ్లి చేసుకుంటుంది.

కల్కి భగవానుడి రాక కలియుగాంతంలో ఉంటే, అప్పటికి ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా అత్యాధునిక టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో ఈ గుర్రాలు, కత్తులు, రాజ వంశాలనేవి ఉంటాయా అనే సందేహం కలగడం సహజం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రామాయణ, మహాభారతాలలో వాడిన చాలా అస్త్రాల పేర్లు సాధారణంగా వినిపించినా, వాటి వెనుక ఎంతో సైన్స్ దాగి ఉందని ఈ మధ్య పరిశోధనలలో బయటపడుతోంది. అలాగే, కల్కి భగవానుడి అవతారం గురించిన వర్ణన ఎప్పుడో, కొన్ని యుగాలకు పూర్వం వ్రాయబడింది. ఆ కాలంలో ఉపయోగించిన ఆయుధాలూ, వాహనాల పేర్లు ఏవయినా, వాటికి ఉండే శక్తుల వర్ణనలు గమనిస్తే, అవి advanced weapons గా అర్ధం అవుతుంది. అలాగే రాజ వంశాల విషయంలోనూ.. మనకు తెలిసిన గత ఐదు వేల సంవత్సరాల చరిత్రలోనే ఎన్నో మార్పులను చూశాము. ఇక కల్కి అవతారం, కలియుగాంతంలో జరుగుతుందని మన పురాణాలలో పేర్కొనబడి ఉంది. కలియుగ కాల పరిమితి, 4 లక్షల 32 వేల సంవత్సరాలు. అందులో ఇప్పటి వరకు ఇంచుమించు 5 వేల ఏళ్లు మాత్రమే గడిచాయి. అంటే, ఇంకా 4 లక్షల, 27 వేల సంవత్సరాల సమయం మిగిలి ఉంది. అప్పటికి మన భూమి పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం ఎవరి తరమూ కాదు.

ఇక కల్కి భగవానుడి రాకకు కారణమైన ధర్మ స్థాపన విషయానికి వస్తే, విష్ణు మూర్తి ఒక్కో అవతారం ఎత్తినప్పుడల్లా, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణుడి వంటి రాక్షసులను చంపడం తెలిసిందే. భాగవతం ప్రకారం వారంతా వైకుంఠంలోని విష్ణుమూర్తి నివాసానికి ద్వారపాలకులుగా ఉన్న జయ, విజయులు. సనకాది మునుల శాపం కారణంగా వివిధ జన్మలలో రాక్షసులుగా పుట్టి, విష్ణు మూర్తి చేతిలో వారు మరణించారు. కల్కి పురాణం ప్రకారం కలియుగంలో జయ, విజయలు రాక్షసులుగా కాకుండా, ఆ స్వామికి కొడుకులుగా పుడతారని చెప్పబడి ఉంది. పైగా వారిద్దరి కారణంగానే కల్కి భగవానుడి అవతారంలో ఆయన చేయాల్సిన ధర్మసంస్థాపనకు నాంది పడుతుందని కూడా పేర్కొనబడి ఉంది.

అదెలా అంటే, సింహళ దేశ రాజ దంపతులైన బృహద్రథుడు, కౌముదిల పుత్రిక పద్మావతిని కల్కి భగవానుడు వివాహమాడటం వంటి విషయాలు ముందు చెప్పుకున్నాము. ఆ తర్వాత స్వామి అమ్మవారిని తీసుకుని శంభల నగరానికి వెళ్లిపోతారు. అక్కడ వారికి ఇద్దరు కుమారులు పుట్టగా, వారికి జయ, విజయులనే పేర్లు పెడతారు. వారిద్దరూ శంభల నగరంలోనే పెరిగి పెద్దవ్వడంతో పాటు, సకల విద్యలలోనూ ప్రావీణ్యం పొందుతారు.

అలా వారి విద్యాభ్యాసం పూర్తయిన తరువాత, ఒకనాడు జయ విజయులు కల్కి భగవానుడిని చేరి, గత యుగాలలో శ్రీరాముల వారు, ధర్మరాజు చేసినట్లు అశ్వమేధ యాగం చేయమని కోరతారు. తన అవతార ధర్మం నెరవేర్చే సమయం ఆసన్నమైందని అర్ధమైన స్వామి, శంభల నగరం నుంచి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు.

ఇక్కడ కల్కి భగవానుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ, మానవ రూపంలో భూమిపై జన్మించడం వలనా, చేయనున్నది కఠినమైన రణం కావడంతో, మరింత మద్దతుకోసం ఆయన అశ్వమేధ యాగానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన, అప్పటికి కలి ప్రభావం వల్ల పీడింపబడని నగరాలకు ముందుగా వెళ్ళి, అశ్వమేధ యాగం కోసం అక్కడి రాజుల మద్దతు కూడబెట్టుకుని, వారి సైన్యాలను కూడా తన సైన్యంలో కలుపుకుంటాడు.

ఆ తర్వాత కల్కి భగవానుడు విశాలమైన సైన్యంతో, ముందుగా కలి ప్రభావం చేత పూర్తిగా నాశనమైన కీటక పురం అనే రాజ్యానికి వెళతాడని పురాణ విదితం. అక్కడి రాజు, ప్రభుత్వం, ప్రజలు, కలి ప్రభావం చేత అమాయకులను హింసిస్తూ, పరమ దుర్మార్గాలను అనుసరిస్తూ, ధర్మాన్ని పూర్తిగా విడిచి విశృంఖల జీవితాలను గడుపుతూ, గో మాంసాన్ని భుజిస్తూ ఉంటారు. అటువంటి రాజ్యంపై కల్కి భగవానుడు ముందుగా దాడి చేయగా, అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుందనీ, ఆ యుద్ధంలో కీటక రాజైన జినుడూ, అతడి తమ్ముడైన శుద్ధోధనుడూ కలిసి కల్కి భాగవానుడితో యుద్ధం చేస్తారనీ తెలుస్తోంది. ఆ యుద్ధంలో కల్కి భగవానుడు, జినుడి మర్మాంగాలను నరికేయగా అతడు చనిపోతాడు. ఆ తర్వాత శుద్ధోధనుడి తల నరికి చంపుతాడు. వారిద్దరి మరణం తర్వాత శుద్ధోధనుడి భార్య అయిన మాయ కూడా స్వయంగా యుద్ధ రంగంలోకి రాగా, కల్కి లో వున్న విష్ణుమాయ ఆమెను లీనం చేసుకుంటుంది. దాంతో ఆ యుద్ధం ముగిసి, అక్కడ ధర్మ స్థాపన జరుగుతుందని తెలుస్తోంది.

కల్కి సాధించిన తొలి విజయం తర్వాత, సప్త చిరంజీవులలో ఒకడైన అశ్వత్థామ వచ్చి ఆ స్వామి సేనకు శిక్షణ ఇస్తాడాని పురాణ విదితం. వివిధ యుగాలలో జన్మించి, సప్త చిరంజీవులుగా కలియుగాంతం వరకు కొనసాగుతున్న వారంతా, ధర్మ స్థాపన కోసం కల్కి భగవానుడు చేసే యుద్ధంలో పాలుపంచుకోవడం కోసమే రహస్యంగా జీవిస్తున్నారని పురాణాలు పేర్కొంటున్నాయి.

అలా సిద్ధమైన సైన్యంతో కల్కి భగవానుడు, మన భారత దేశంతో పాటు ఈ భూమండలం మొత్తం వ్యాపించి ఉన్న మ్లేచ్చులు, కిరాతులు, అధర్ములందరనీ సంహరిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా మిగిలిన అధర్మ వర్తన రాజులంతా కలిసి, కోకా, వికోకా అనబడే రాజుల దగ్గరకు చేరి, కలి పురుషుడితో సమావేశమై, కల్కి భాగవానుడిని ఓడించడానికి భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. విషయం తెలుసుకున్న జగన్నాటక సూత్రధారి తదనుగుణంగా వారిపై యుద్ధం చేసి, అధర్మపలందరనీ సంహరిస్తాడు. చివరకు స్వామి చేతిలో చావు దెబ్బలు తిన్న కలి పురుషుడు ఒక గాడిదపై ఎక్కి పారిపోతాడు. అలా కలియుగం అంతం అయ్యి, తిరిగి సత్య యుగం మోదలవుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. యుద్ధంలో దెబ్బ తిని పారిపోయిన కలి, మరో మహా యుగంలో మళ్ళీ వచ్చే కలియుగం సమయానికి కోలుకుని, మళ్ళీ తన ప్రభావాన్ని చూపించడం, కాల చక్ర ప్రభావం.

ఇక కల్కి భగవానుడు తిరిగి తన సైన్యంతో శంభలకు చేరి, అక్కడే దాదాపు వెయ్యేళ్ళ పాటు రాజ్య పాలన చేస్తాడు. ఆ క్రమంలో కల్కి భగవానుడు భూమాత అవతారమైన రమ అనే రాజ కన్యను కూడా వివాహం చేసుకుంటాడు. అప్పటి వరకు రహస్యంగా ఉన్న శంభల నగరం, అక్కడినుంచి సాధారణ ప్రజలకు కూడా కనిపిస్తుంది. కలి పురుషుడు పారిపోవడం, కల్కి భగవానుడు ఆఖరి అధర్ముడిని కూడా సంహరించడం, మనుష్యులందరినీ తిరిగి పూర్తి ధర్మ మార్గంలోకి తీసుకురావడంతో కాల చక్రం తిరిగి, తరువాతి మహా యుగంలో మరో సత్య యుగం మొదలవుతుంది. వెయ్యేళ్ళ పాలన తర్వాత స్వామి అవతారం చాలించి, దేవేరుల సమేతంగా తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడని పురాణాలు చెబుతున్నాయి.

ఇక ప్రతి మహా యుగంలోని కలియుగంలోనూ కల్కి భగవానుడు అవతరిస్తాడా? అనే ప్రశ్నకు సమాధానం, లేదనే చెప్పాలి. కొన్ని కలియుగాలలో విభిన్న రూపాలలో వస్తాడని, మహాభారత, మత్స్య, స్కంద పురాణాలు పేర్కొంటున్నాయి. ఒక కలియుగాన్ని పరుశురాముడు ముగించాడని మహాభారతం చెబుతోంది. మరో కలియుగంలో మహాదేవి అవతారంగా వచ్చి, రాక్షస సంహారం చేసినట్లు దేవీ భాగవతం చెబుతోంది.

🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏





Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka