I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!


శివోహం - నేను శివుడిని!
‘నేను శివుడిని, నేనే శివుడిని’ – అసలు శివతత్వమేమిటి?

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని, ఒక ఆధ్యాత్మిక గురువు, ‘నీ వెవరివి?’ అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి, ‘చిదానందరూపః శివోహం శివోహం’ అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అని అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకుంటే, సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని, నేనే శివుడిని’ అని మనస్సులో అనుకున్నా, పైకి అన్నా, బాగానే ఉంటుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని, శివుడిలాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది. మరి ఆ శివతత్వమేమిటో ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/UafRztjHW04 ]


శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు, లోకాలన్నీ భయకంపితాలై, హాహాకారాలు చేస్తుంటే, శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకుని, ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకూ, తనకు లోపల ఉన్న లోకాలకూ ఇబ్బంది కలగకుండా, దానిని తన కంఠ ప్రదేశంలో నిలుపుకున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవలసినది, ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పనయినట్లయితే, మనం ఆ పని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదే శివతత్వం!

శివుడు అభిషేక ప్రియుడు. భక్తిప్రపత్తులతో ఒక్క ఉద్ధరిణెడు నీళ్లు తీసుకుని, ‘హరహర మహాదేవ!’ అంటూ శివలింగం మీద పోస్తే చాలు. ఒక్క మారేడు దళాన్ని తెచ్చి, ‘ఓం నమశ్శివాయ!’ అంటూ శివలింగం మీద ఉంచితే చాలు - శివుడు పొంగిపోతాడు. అతడి కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఇక్కడ గమనించవలసినది, మన వద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువును తెచ్చాడనేది కాదు.. ఎంత ఆప్యాయతతో తెచ్చాడనేది ప్రధానం. మనం చూడవలసింది అర్థాన్ని కాదు, ఆత్మీయతనే.. ఇదీ శివతత్వం!

శివుడు రుద్రుడు. అపరిమితమైన ఆగ్రహం కలవాడు. అదే శివుడు, పరమ శాంతమూర్తి కూడా! శివుడి ఫాలనేత్రంలో భయంకరమైన అగ్ని ఉంది. తలమీద చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడున్నాడు. మన్మథుడు తన మీద బాణంవేసిన సమయంలో, శివుడు కాలాగ్నిరుద్రుడయ్యాడు. తన మూడవ కన్ను తెరచి, అతణ్ని భస్మీపటలం చేశాడు. మన్మథుడి భార్య రతి దీనంగా ప్రార్థించగానే చల్లబడి, ఆమెకు పతిభిక్ష పెట్టాడు. ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకోవలసినది, కోపమనేది మనిషికి చాలా సహజమైన లక్షణం. దీర్ఘక్రోధం పనికిరాదు. ఇరుగు పొరుగుకు నష్టాన్ని కలిగించే క్రోధం, అసలు పనికిరాదు. పశ్చాత్తాపం చెందినవారిని క్షమించే గుణం ఉండాలి. ఇదీ శివతత్వమే!

ఎక్కడో గగనతలంలో ఉన్న గంగానదీ ప్రవాహం, ఒక్క వూపున భూమి మీదకు దూకితే, చిన్న మట్టిముద్దలాంటి భూగోళం మొత్తం తడిసి బద్దలైపోవటం ఖాయం. అటువంటి సంకట పరిస్థితిలో భగీరథుడు, ‘త్వమేవ శరణం మమ’ అంటూ ప్రార్థిస్తే, శివుడు తన రెండు చేతులనూ నడుంమీద మోపి, రెండు పాదాలనూ కైలాస పర్వతశిల మీద స్థిరంగా పూని, గంభీరంగా నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఒక్క వూపున దూకిన గంగను, తన శిరస్సు మీద భరించి, జటాజూటంలో బంధించాడు. ఒక్క పాయను వదిలి, గంగను నిదానంగా, హిమవత్పర్వతం మీదకు పంపాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినది, మన సమక్షంలో ఏదైనా మహాప్రమాదం జరగబోతూ ఉంటే, దానిని ఆపగలిగిన సామర్థ్యం మనకుంటే, ఎట్టి పరిస్థితులలోనూ దానిని మనం ఆపవలసిందే. ఇదీ శివతత్వం!

శివుడు విభూతిరాయుడు. విభూతి అంటే ఐశ్వర్యం. అన్ని విధాలైన ఐశ్వర్యాలకూ ఆయన అధిపతి. సమస్త సంపదలకూ అధీశ్వరుడైన కుబేరుడు, ఆయనకు ప్రియమిత్రుడు. అయినప్పటికీ, శివుడు నిరాడంబరుడే! ఇక్కడ మనం పాటించవలసినది, మన ఘనత అనేది మన వ్యక్తిత్వంలో, మన ప్రవర్తనలో ఉండాలి. మన కర్తవ్య నిర్వహణలో ఉండాలి. అంతేకానీ, బాహ్యవేషధారణలో కాదనటానికి, శివుడే ఉదాహరణ, ఆదర్శం. ఇదీ శివతత్వం!

మహాన్యాసం అనే శివాభిషేకంలో, దశాంగరౌద్రీకరణం అని ఉంది. అదే విధంగా, షోడశాంగ రౌద్రీకరణం కూడా ఉంది. ఇవి మన శరీరంలోని లలాటం, నేత్రం, మొదలైన పది అవయవాల్లోనూ, శిఖ, శిరస్సు మొదలైన పదహారు అవయవాల్లోనూ, శివుడున్నాడని తెలియజేస్తున్నాయి. అంటే, మన శరీరం యావత్తూ, శివస్వరూపమేనన్నమాట. మన శరీరం ఇంత పవిత్రమైనదీ, విలువైనదీ కనుక, దీనిని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని, దీని అంతరార్థం. ‘శివోహం - నేను శివుడిని, నేనే శివుడిని’ అనే మాటకు అసలైన అర్థమిదే!

చిదానందరూపః శివోహం శివోహం!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History