శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

 

దుర్యోధనుడికి భీష్ముడు వివరించిన శిఖండి జన్మ రహస్యం!

మహాభారత కావ్యంలో, శిఖండిది ఒక విచిత్రమయిన పాత్ర. ద్రుపదమహరాజుకు కూతురుగా, శిఖండిగా జన్మించి, తరువాత మహారథుడయిన కొడుకుగా మారిన విచిత్ర గాధ. ఎవరైనా పంతాలూ పట్టింపులకు పొయినా, అనుకున్నది సాధించేవరకూ నిద్రపోని లక్షణాలు కనిపించినా, ''శిఖండి'' అని గొణుక్కోవడం, చాలామందికి పరిపాటే. తన పూర్వ జన్మలో భీష్ముడిపై కక్షతో, ఆత్మత్యాగం చేసుకున్న అంబ, మరు జన్మలో శిఖండిగా జన్మించి, భీష్ముడి మరణానికి కారణమైందన్న సంగతి, అందరికీ తెలిసిందే. కానీ, శిఖండి స్త్రీ గా జన్మించి, పురుషుడిగా మారడమనే విషయం, కొంతమందికి మాత్రమే తెలుసు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు, దుర్యోధనుడు తన సైన్యానికి భీష్ముడిని, సర్వ సైన్యాధ్యక్షునిగా చేసినపుడు, భీష్ముడు తన శక్తి సామర్థ్యాలను గురించి, దుర్యోధనుడు మొదలైన ధార్తరాష్ట్రులకు చెబుతూ, "స్త్రీని గానీ, మొదట స్త్రీగా ఉండి, తరువాత పురుషుడిగా మారిన వ్యక్తిని గానీ చంపను. శిఖండి మొదట స్త్రీగా పుట్టి, తర్వాత పురుషుడయ్యింది. అలాంటి వాడు నన్నెదిరించి, నా మీద బాణాలు వేసినప్పటికీ, నేను అతని మీద బాణం వెయ్యను" అని చెప్పాడు. అలా ఎందుకు వెయ్యలేవని దుర్యోధనుడు భీష్ముణ్ణి ప్రశ్నించాడు. దానికి సమాధానంగా భీష్ముడు, అంబోపాఖ్యానాన్ని వివరించాడు. స్త్రీగా జన్మించిన శిఖండి పురుషత్వాన్ని ఎలా పొందిందో, భారతంలో భీష్ముడు వివరించిన శిఖండి జన్మ రహస్యాన్ని, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/rOzNea41xS0 ]


ద్రుపద మహారాజుకు భీష్మునిపై ఉన్న కోపం కారణంగా, అతనిని చంపగల కుమారుణ్ణి ప్రసాదించమని, శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, ద్రుపదుడికి పుట్టబోయే కూతురే పురుషుడిగా మారి, భీష్ముడి మరణానికి కారణమవుతుందని, అభయమిచ్చాడు. ద్రుపదుడు జరిగిన విషయమంతా తన భార్యకు వివరించాడు. ఈశ్వరుడు వరమిచ్చినట్లుగానే, వారికొక కుమార్తె జన్మించింది. వారు ఆమెకు శిఖండి అని నామకరణం చేసి, కుమారునిగానే పెంచారు. ఆమెకు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్పించారు. ఆమె యవ్వనవతి కాగానే, శివుని వరం వృధా పోదు అని విశ్వసించి, పురుషత్వం రాక మునుపే, ఆమెకు వివాహం చేయాలని నిశ్చయించారు. వారు దశార్ణ దేశ రాజైన హేమవర్మ కుమార్తెతో, వివాహం జరిపించారు. శిఖండి గురించిన రహస్యం తెలుసుకున్న భార్య, మౌనంగా ఉండి పోయింది.

కానీ, ఆమె చెలికత్తె ద్వారా ఈ విషయం తెలుసుకున్న దశార్ణ మహారాజు, తననూ, తన కుమార్తెనూ మోసం చేసినందుకు, తమ రాజ్యం మీదకు దండయాత్రకు వస్తున్నట్లు, ద్రుపదునికి దూతద్వారా తెలియపరచి, తన సేనలతో పాంచాల దేశాన్ని ముట్టడించాడు. శిఖండి తన పురుషత్వం గురించి, రెండుదేశాలు యుద్ధం చేసుకోవడం చూసి, సిగ్గుపడింది. అర్ధరాత్రి లేచి, అరణ్యంలోకి వెళ్ళింది. ఆ అరణ్యంలో స్థూలకర్ణుడనే యక్షుడు నివసించేవాడు. అతనికి భయపడి, మనుష్యులెవ్వరూ ఆ అరణ్యంలోకి ప్రవేశించేవారు కాదు. అది తెలిసే, శిఖండి అడవిలోకి ప్రవేశించింది. ఆ విషయం గ్రహించిన యక్షుడు శిఖండిని చూసి, "కుమారీ, నీవెవరు? ప్రాణముల మీద ఆశ వదలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగాడు. శిఖండి జరిగినదంతా అతనికి వివరించి, తనకు పురుషత్వం కావాలి కానీ, అది శివుని వలననే సాధ్యం కాగలదని చెప్పి, చింతించింది.

అది విన్న యక్షుడు ఒక ఉపాయం చెప్పాడు. "నేను నీకు ఒక్క పది రోజుల కాలం నా పురుషత్వాన్ని ఇచ్చి, నీ స్త్రీ రూపం నేను ధరిస్తాను. ఆ సమయంలో నీవు హేమవర్మ వద్దకు వెళ్ళి, నీ పురుషత్వం నిరూపించుకో. పరిస్థితిలు చక్కబడగానే ఇక్కడకు తిరిగి వస్తే, మరలా మనం ఎవరి రూపం వారు పొందవచ్చ"ని అన్నాడు. శిఖండి అందుకు అంగీకరించి, యక్షుని నుండి పురుషత్వం స్వీకరించి, తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. జరిగినది వారికి వివరించగానే వారు సంతోషించి, సమస్యకు కనీసం తాత్కాలిక పరిష్కారం లభించిందని తెలుసుకుని, హేమవర్మ వద్దకు దూతలను పంపి, తన వద్దకు రప్పించి, శిఖండి పురుషుడేనని నిరూపించాడు. హేమవర్మ తన తొందర పాటుకు చింతించి, ద్రుపదునికి క్షమాపణ చెప్పాడు. ద్రుపదుడు వారికి విందులూ, వినోదాలూ ఏర్పాటు చేసి, వారిని సగౌరవంగా సాగనంపాడు. ఇలా రెండు రోజులు గడిచిన తరువాత, కుబేరుడు తన విమానంపై విహరింస్తూ, యక్షుడైన స్థూలకర్ణుని మందిరానికి వెళ్ళాడు.

ఎంతకూ స్థూలకర్ణుడు తనను ఆహ్వానించడానికి రాకపోవడంతో కోపించి, కిన్నెరులను కొంత మందిని లోపలకు పంపి, స్థూలకర్ణుని విషయం కనుక్కుని రమ్మన్నాడు. కిన్నెరులు జరిగిన విషయమంతా స్థూలకర్ణునిద్వారా తెలుసుకుని, కుబేరుని వద్దకు వచ్చి చెప్పారు. దానికి కుబేరుడు శాంతించి, అతడిని స్త్రీరూపంతోనే రమ్మని చెప్పి, తన వద్దకు వచ్చిన స్థూలకర్ణునితో, "జరిగినదేదో జరిగింది. ఇది దైవ సంకల్పం. నీవు ఇక ఇలాగే ఉండు" అని అన్నాడు. స్థూలకర్ణుడు కుబేరుని కాళ్ళపై బడి విమోచన మార్గం చెప్పమని బ్రతిమాలాడు. దానికి కుబేరుడు, "స్థూలకర్ణా! దైవ సంకల్పానికి అనుగుణంగా జరిగినది, ఈ మార్పిడి. శిఖండిని జీవితాంతం పురుషునిగానే ఉండనివ్వు. జరగవలసిన ఈశ్వర సంకల్పం నెరవేరగానే, శిఖండి మరణిస్తాడు. ఆ తరువాత నీ పురుష రూపం నీకు వస్తుంది" అని చెప్పి, తన విమానంపై అలకాపురికి తిరిగి వెళ్ళాడు.

శిఖండి మాత్రం, తిరిగి స్థూలకర్ణుడిని కలుసుకుని, తన పురుషత్వాన్ని స్వీకరించి, స్త్రీత్వాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు. అప్పుడు స్థూలకర్ణుడు జరిగినదంతా వివరించి, ఇది దైవ సంకల్పం కనుక, నీవు ఇక పురుషుడిగానే సంచరించవచ్చని చెప్పాడు. శిఖండి పరమ సంతోషం చెంది, తన తల్లి తండ్రులకు జరిగనది వివరించాడు. అతడు బ్రాహ్మణులనూ, దేవతలనూ పూజించి, ఎన్నో వ్రతాలను ఆచరించి, ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి, అతడి శిష్యునిగా చేరి, ద్రోణాచార్యుని వలన విలువిద్యా ప్రావీణ్యాన్ని పొందాడు. మహాభారత యుద్ధములో, అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకుని చేసిన యుద్ధము వలన, భీష్ముడు అస్త్ర సన్యాసము చేసి, అంపశయ్యపై చేరటముతో, శిఖండి చరిత్ర ముగుస్తుంది. శిఖండిగా పుట్టిన అంబ, తన గత జన్మలో చేసిన శపథాన్ని నేరవేర్చుకుంది.

అంబ శిఖండిగా మారటం అనేది, భీష్ముని తనువు చాలించటానికే. ఎందుకంటే, భీష్ముడి లాంటి పరాక్రమవంతుడినీ, ధర్మ నిష్టాపరుడినీ, ఏ రకమైన శస్త్రాలూ, ఎటువంటి వీరులూ సంహరించలేరు. ఇందులో మరో ఆసక్తికరమైన విషయమేటింటే, అంబే శిఖండిగా జన్మించిందనీ, ఆమె వల్లే తనకు మరణం తథ్యమనీ, భీష్ముడికి కూడా తెలుసు. తనంతట తానుగా కోరుకుంటేనే మరణించే ‘ఇచ్ఛా మరణ’ వరం పొంది వుండి కూడా, శిఖండిని ఎదురించడానికి గానీ, మృత్యువు నుండి తప్పించుకోవడానికి గానీ, భీష్మ పితామహుడు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. స్వచ్ఛందంగా తన మరణాన్ని స్వాగతించి, అంపశయ్యపై ఉన్న భీష్ముడిని చూసి, సాక్షాత్తూ ఆ కృష్ణ భగవానుడే ఛలించిపోయాడంటే, ఆ మహా వీరుడి గొప్పదనం ఎంటో తెలుసుకోవచ్చు.

భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమినాటిని “భీష్మాష్టమి” గానూ, మాఘశుద్ధ ఏకాదశిని, “భీష్మ ఏకాదశి” గానూ, మనం నేటికీ ఆచరిస్తూ, ఆయనను స్మరిస్తున్నాం. భీష్మ నిర్యాణం జరిగి, సహస్రాబ్దాలు గతిస్తున్నా, ఆయన ప్రవచించిన “విష్ణు సహస్ర నామ స్తోత్రం”, యిప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఆయన దివ్య వాణి, విశ్వవ్యాప్తమై, ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం, సర్వ దుఃఖహరం, సకల శుభకరం.
     
ఓం నమో భగవతే వాసుదేవాయ!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur