Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, December 30, 2024

BARBARIK the Ancient Indian AI Robot బర్బరీకుడు! - 18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒక్కడే ఒకే నిమిషంలో ముగించగల పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడు?


18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒక్కడే ఒకే నిమిషంలో ముగించగల పాండవ వీరుడి మరణాన్ని కృష్ణుడు ఎందుకు కోరాడు? TELUGU VOICE

ఒకే ఒక్క నిముషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించ‌గ‌ల వీరుడూ, అభిమన్యుడికంటే చిన్నవాడైనా, భీమార్జునులను మించిన మహాయోధుడూ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్బరీకుడు. మరి అంతటి మహావీరుడిని, పైగా పాండవుల సంతతికి చెందినవాడిని, పాండవ పక్షపాతిగా ముదరింపబడిన శ్రీకృష్ణుడు  ఎందుకు వధించాడు? తన తలను శ్రీ కృష్ణుడికి సమర్పించి ప్రాణ త్యాగం చేసికూడా, బ‌ర్బరీకుడు అమ‌రుడెలా అయ్యాడు? కృష్ణ పరమాత్ముడి చేత వధింపడిన అతడు, ‘ఖాటూశ్యాం బాబా’గా భారతదేశంలో పూజలు అందుకోవడం ఏమిటి? అసలు ఎవరీ బర్బరీకుడు? అత‌ని చరిత్రేమిటి? మహా భారతంలో బర్బరీకుడి చావుకూ, అతని ముందు జన్మకూ ఉన్న కర్మ బంధం ఏమిటి? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fgnxOIlHXL0 ]


నేటికి సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే, సామాన్య శకం 1027 వ సంవత్సరంలో, రాజస్థాన్ లోని ఒక ప్రాంతంలో ఒక ఆవు ప్రతి రోజూ వచ్చి, ఎవరి ప్రమేయమూ లేకుండా తనంత తానుగా ఒక చోట తన పొదుగునుండి పాలను ధారగా విడిచేది. అది గమనించిన స్థానికులు అక్కడ త్రవ్వకాలు జరపగా, సుమారు 30 అడుగుల లోతున‌ లోహంతో చేయబడిన ఒక పేటిక లభించింది. గాలి కూడా చొర‌బ‌డ‌లేనంత ప‌క‌డ్బందీగా మూయబడి ఉందది. ఆ పేటికపై "బర్బరీక" అని వ్రాయబడి ఉంది. దానిని తెరిచి చూడ‌గా, అందులో వారికి ఒక మానవ కపాలం క‌నిపించింది. అది మామూలు పుర్రెల మాదిరిగా ఎముకలతో కాక, ఒక రకమైన లోహంతో నిర్మితమైనట్లుగా అనిపించింది వారికి. ఆ పుర్రెలోని క‌ళ్ళు చెక్కు చెదరకుండా, మ‌నిషి క‌ళ్లలాగే ఉన్నాయి. దానిని చూసిన స్థానికులు బిత్తరపోయి, వెంటనే ఆ విషయాన్ని నాటి రాజు రూప్ సింగ్ చౌహన్ కు తెలియజేశారు. ఆసక్తి కలిగిన రాజు వివరాలు తెలుసుకోగోరాడు. దక్షిణాదినుంచి వచ్చిన ఒక పండితుడు, బ‌ర్బరీకుని చ‌రిత్రను రాజుకు వివ‌రించాడు.

బర్బరీకుడు ‌సాధారణ వ్యక్తి కాదు. ధర్మపరులూ, దైవాంశ సంభూతులూ అయిన పాండ‌వ వంశీయుడూ, సాక్ష్యాత్తూ భీముడి మ‌నుమడూ, స్వయానా ఘటోత్కచుడూ, మౌర్విలకు కలిగిన సంతాన‌మే బర్బరీకుడు. అమిత బలసంపన్నుడైన బర్బరీకుడు, పసివయస్సులోనే యుద్ధ విద్యలలో ఆరి తేరాడు. అతడి తల్లి మౌర్వే, బ‌ర్బరీకుడికి సకల విద్యలూ నేర్పింది. ఒకానొక సమయంలో విజయుడు దేవీ దీక్షను నిరాటంకంగా ముగించ‌డానికి బ‌ర్బరీకుడు స‌హాయం చేయ‌గా, అతడు చేసిన స‌హాయానికి కృతజ్ఞతగా యజ్ఞ భస్మాన్ని ఇచ్చి, దానిని శత్రువుల పై జల్లితే వారు భస్మమ‌వుతారని దీవించాడు విజయుడు. కానీ, ప్రతిఫలాపేక్షతో తాను ఆ పని చేయలేదని చెప్పి, బర్బరీకుడు ఆ భస్మాన్ని తిరస్కరించాడు. ఆ స‌మ‌యంలో ఆకాశవాణి, రాబోయే కాలంలో కౌరవులు, పాండవుల మధ్య జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని గురించి చెప్పి, ఆ భస్మం కౌరవుల హస్తగతమయితే, ధర్మపరులైన పాండవ నాశ‌నానికి వినియోగిస్తారు గనుక, అది అతడి ద‌గ్గర ఉండ‌డ‌మే లోక శ్రేయ‌స్కరమని తెలిపింది. అలా సిద్ధి వలన భస్మాన్ని పొందాడు కాబట్టి, బర్బరీకుడిని 'సిద్ద సేనుడ'ని కూడా పిలిచేవారు. అలాగే ఒకానొక సందర్భంలో తెలియక భీముడితో యుద్ధం చేసి ఓడించి, సంహరింప జూసిన సమయంలో, పరమేశ్వరుడు ప్రత్యక్షమై బర్బరీకుడిని వారించి, వారి మధ్య ఉన్న రక్త సంబంధం గురించి తెలియజేశాడు. ప‌శ్చాత్తప్త హృద‌యంతో బర్బరీకుడు ప్రాణ‌త్యాగం చేయ‌బోగా, పరమేశ్వరుడు అడ్డుకుని స‌ర్ది చెప్పాడు. స్పృహలోకి వచ్చిన భీముడు, ప‌రాక్రమ‌వంతుడైన బర్బరీకుడు స్వయానా తన మనుమ‌డ‌ని తెలుసుకుని అక్కున చేర్చుకున్నాడు. ఆ తరువాత బర్బరీకుడు చేసిన ఘోర తప‌స్సుకు మెచ్చిన శివుడు, మూడు అమిత శక్తివంతమైన బాణాలను అతడికి ప్రసాదించాడు.

కురుక్షేత్ర సమరం ఆరంభమవుతున్న తరుణంలో, తాను ఎవరి ప్రక్కన నిల‌బ‌డాలని బర్బరీకుడు తల్లిని అడుగగా, బలహీనుల పక్షాన పోరాడమని చెప్పిందామె. తల్లి మాట మేర‌కు పాండవుల తరుపున యుద్ధం చేయడానికి సిద్ధ పడ్డాడు బ‌ర్బరీకుడు. ఒకనాడు పాండవుల మధ్య, కురుక్షేత్ర యుద్ధం ఎవరు ఎన్ని రోజులలో ముగించగలరనే చర్చ రాగా, భీముడు 20 రోజులూ, అర్జునుడు 28 రోజులూ, ఇలా ఒకొక్కరు ఒకొక్క స‌మాధానం చెప్పారు. బర్బరీకుడు మాత్రం, ఒక్క నిముషంలోనే యుద్ధం ముగిస్తానని చెప్పి అంద‌రినీ ఆశ్చర్యప‌రిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న బ‌ర్బరీకుడి ద‌గ్గర‌కు, అతడిని పరీక్షించదలచిన శ్రీ కృష్ణుడు మారువేషంలో ఒక బ్రాహ్మణుడిలా వెళ్లాడు. అతడి దగ్గరున్న అస్త్రాలను గురించి అడుగగా, శివుడు తనకు ప్రసాదించిన మూడు బాణాలను చూపించాడు, బర్బరీకుడు. వాటిని చూసి మాయా శ్రీ కృష్ణుడు నవ్వి, మూడు బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా ముగించగలవని అడిగాడు. ఒక బాణం శత్రువులను, రెండవది మిత్రులనూ గుర్తిస్తుంది. మూడవ‌ది, ఆ గుర్తించిన శత్రువులను హతమారుస్తుందని వివ‌రించాడు, బర్బరీకుడు. ఆ బాణాల గొప్పద‌నం తనకు చూపించమ‌న్నాడు, బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు. బర్బరీకుడు త‌న అస్త్రాన్ని ఒక చెట్టు ఆకులకు సంధించ‌గా, అది ఆ చెట్టు ఆకులన్నింటినీ ఛిద్రం చేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరుగ‌డం మొద‌లుపెట్టింది. అప్పుడు బర్బరీకుడు, ‘మహానుభావా.. మీ కాలి క్రింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దానిని ఛేదించనిదే, నా బాణం వెనుకకు రాదు. దయచేసి మీ పాదాన్ని ప్రక్కకు జరపండ’ని కోరగా, శ్రీ కృష్ణుడు త‌న కాలిని తీసిన వెంట‌నే ఆ ఆకును ఛేదించి, తిరిగి బర్బరీకుని అమ్ముల పొదిలోకి చేరిందది.

‘నీ తల్లి నిన్ను బలహీన పక్షాన యుద్ధం చేయమని అన్నది కదా? నీవు ఎవరి ప‌క్షాన‌ పోరాడబోతున్నావ’ని, ఏమీ తెలియనివాడిలా బర్బరీకుని అడిగాడు మాయా కృష్ణుడు. త‌న త‌ల్లితో ర‌హ‌స్యంగా చ‌ర్చించిన విష‌యం కూడా తెలిసిన ఆ వ్యక్తి సామాన్యుడు కాద‌ని గ్రహించి, తన నిజ స్వరూపం చూపించమని కోరాడు, బర్బరీకుడు. సాక్ష్యాత్తు శ్రీ కృష్ణుడిని దర్శించిన బర్బరీకుడు అమితానంద భరితుడై, ‘మీ కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాన’ని వాగ్దానం చేశాడు. ‘నీవు ఏ పక్షాన చేరితే అది బలపడుతుంది. నీ తల్లి మాట ప్రకారం, మళ్ళీ నీవు బలహీన పక్షానికి మారాలి. అది లోక శ్రేయస్కరం కాదు. లోక క‌ల్యాణార్థం నీ శిర‌స్సును నాక‌ర్పించి, నువ్వు నాకిచ్చిన మాటను నిల‌బెట్టుకో’ అన్న శ్రీ కృష్ణుడి మాట‌ల‌కు సంతోషంగా అంగీక‌రించాడు బర్బరీకుడు. తనకు సంగ్రామంలో పాల్గొనే అవకాశం లేకపోయినా, చివరిదాకా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని, త‌న తుది కోరిక‌గా ప్రార్థించి, తన శిరస్సును తానే ఖండించుకున్నాడు. శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఒక ఎత్తైన‌ పర్వత శిఖరంపై నిలబెట్టించి, మహా భారత సంగ్రామాన్ని ఆద్యంతం తిలకించే ఏర్పాటు చేయించాడు.

మహాభారత యుద్ధానంతరం, ఎవరు ఎంత మందిని చంపివుంటారన్న చర్చ మొదలై శ్రీకృష్ణుడిని అడుగగా, తాను కూడా యుద్ధంలో పాల్గోన‌డం వల్ల గమనించలేదనీ, ఆద్యంతం వీక్షించిన బర్బరీకుని శిరస్సునడగమనీ చెప్పాడు, శ్రీకృష్ణుడు. ‘వారిలో ఎవరూ ఎవరినీ చంపినట్లుగా తనకు కనిపించలేదనీ, అందరినీ శ్రీ కృష్ణుని చక్రాయుధమే సంహ‌రించిన‌ట్లు తనకు గోచరించింద’నీ చెప్పాడు బ‌ర్బరీకుడు. గీతలో గీతాచార్యుడు చెప్పిన‌ట్లుగా, ‘చంపేదీ, చంపించేదీ, సమస్తాన్నీ న‌డిపించేదీ ఆ ప‌ర‌మాత్ముడే’న‌ని అందరికీ తేటతెల్లమయ్యింది మరోసారి.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత బర్బరీకుడి తలను పెట్టెలో భద్రపరచి రూపవతీ న‌దిలో విడిచారు. కాలగమనంలో నేడు లభించినదదేనని, దక్షిణాదినుంచి వచ్చిన పండితుడు రూప్ సింగ్ చౌహన్ మహారాజుకు వివ‌రించాడు. ఆ పెట్టె దొరికిన ‘ఖాటూశ్యాం’ అనే ఊరిలోనే బ‌ర్బరీకుని పుర్రెను ప్రతిష్ఠించి, మందిరాన్ని స్థాపించారు. ఆ గుడి ప్రాంగణంలోనే ‘రూప్ కుండ్’ అనే పేరుతో ఒక కోనేటిని నిర్మించారు. అందులో స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని స్థానికుల నమ్మిక. ద్వాపరయుగంలో ప్రాణత్యాగం చేసిన బ‌ర్బరీకుడి తల ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండ‌డంతో, అందులోని శ‌క్తులు అలాగే ఉన్నాయ‌న్న నమ్మికతో, భక్తులు ఆయ‌న‌ను దైవాంశ సంభూతునిగా నేటికీ కొలుస్తున్నారు.

ఇక అంతటి మహావీరుడైన బర్బరీకుడు, శ్రీ కృష్ణుడి ఉపాయంతో అర్ధాంతరంగా ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితికి, అతడు ముందు జన్మలో చేసిన ఓ తప్పు కారణమనే విషయం, చాలా మందికి తెలియకపోవచ్చు. అతడి ముందు జన్మ గురించిన ప్రస్థావన, వ్యాస విరచిత జయకావ్యంలో ఎక్కడా లేక పోయినా, స్కాంద పురాణంలో పేర్కొన బడినట్లు పౌరాణికులు చెబుతున్నారు. దాని ప్రకారం, భూమిపై మానవుల మనుగడ సక్రమంగా సాగటానికి, రాక్షస సంహారం తప్పదని తెలిసన దేవతలు, యుగయుగాలుగా వారు తలపెట్టిన ధర్మ కార్యాలను నిర్విరామంగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా త్రేతాయుగం వచ్చేటప్పటకి, రాముడు రావణ సంహారం చేసే సమయంలో, నాడు భూమిపై ఉన్న ఎన్నో రాక్షస జాతులను సమూలంగా నాశనం చేశాడు. దానితో మానవ ప్రగతికి దారులు సుగమంకావటంతో పాటు, నాడు ఉన్న జ్ఞాన సంపదను అందిపుచ్చుకుని, రాజులు మరింత శక్తి వంతులయ్యారు. రామ రావణ యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతి కొద్ది మంది రాక్షసులను కూడా రాజులు దాదాపుగా అంతం చేసేశారు. తమకిక అడ్డు అదుపు లేదని గ్రహించిన నాటి మానవులు, ముఖ్యంగా రాజులు, అధర్మం వైపుకు మొగ్గు చూపడం మొదలయ్యింది. ఇది గమనించిన దేవతలూ, గంధర్వులూ, యక్షులూ, భూమిపై నాడున్న పరిస్థితి అలాగే కొనసాగితే, సమస్త జీవకోటి అంతమయ్యే అవకాశం ఉందని చర్చించుకుని, ఆ విషయం బ్రహ్మ దేవుడికి నివేదించారు.

దేవతలు చెప్పిన మాటలు విని, తనకు భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నాయనీ, ఆ సమస్యకు పరిష్కారం కేవలం ఆ శ్రీ మహా విష్ణువే చూపిస్తాడానీ చతుర్ముఖుడన్నాడు. అనుకున్నదే తడవుగా దేవతలూ, గధర్వులూ, యక్షులతో సహా, బ్రహ్మ దేవుడు కూడా వైకుంఠానికి వెళ్ళి, విష్ణు మూర్తికి భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలియజేసి, ఆ సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకున్నారు. భూమండలంపై ప్రక్షాళన కార్యక్రమానికి తానే స్వయంగా మానవ జన్మ ఎత్తి, కరుక్షేత్ర సంగ్రామంతో అనుకున్న పనిని పూర్తి చేస్తానని తెలియజేశాడు, శ్రీ మహా విష్ణువు.

ఆ మాటలు విన్న వారందరూ హర్షించారు. కానీ, వారిలో ఒక యక్షుడు వెంటనే, ‘ఈ మాత్రం దానికి సాక్ష్యత్తు విష్ణు మూర్తే అవతారం ఎత్తడం అవసరమా? తుచ్ఛ మానవులను సంహరించడానికి తానొక్కడే సరిపోతాన’ని పొగరుగా అన్నాడు. అది విన్న బ్రహ్మ దేవుడికి కోపం వచ్చి, “భూమిపై ఉన్న దుష్టులనందరినీ సంహరించాలంటే, దేవతలకు పెద్ద పని కాకపోవచ్చు. కానీ, ధర్మ సంస్థాపన చేయడం, సాధారణ విషయం కాదు. యక్షుడవై ఉండి, అటువంటి ధర్మ సూక్ష్మాలు గ్రహించలేక, సాక్ష్యత్తు శ్రీ మహా విష్ణువు ముందు ఇలాంటి మాటలు మాట్లాడటం సముచితంకాదు. ఈ తప్పిదానికి నీవు మానవ జన్మ ఎత్తి, దుష్టులను సంహరించే అవకాశం వచ్చినప్పుడు, ముందుగా నీవే ప్రాణత్యాగం చేస్తావు” అని శపించాడు. ఆ విధంగా బ్రహ్మ దేవుడి శాపం పొంది, ఆ యక్షుడు బర్బరీకుడిగా జన్మించడం, సరిగ్గా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణుడికి ఎదురుపడి, రణరంగానికి బలిగా మారిన ఘటనలు, మనం ఇదివరకు చెప్పుకున్నవే.

ఇక మరోకోణంలో, బర్బరీకుడు భీముడి మనుమ‌డు కాద‌నే వాదనా లేకపోలేదు. అతడు భీముడి మనుమ‌డైతే, వ్యాస‌ భారతంలో ఆ వివ‌ర‌ణ‌ ఉండి ఉండేద‌‌ని వారి భావన. బర్బరీకుడు కేవలం మానవాతీత శక్తులు కలిగిన ఒక మహావీరుడు మాత్రమేన‌నీ, శ్రీ కృష్ణుడు పాండవులను కాపాడటానికే, అత‌డిని యుద్ధంలో పాల్గొనకుండా వారించి, అతడి తలను ఒక యంత్రంలా వాడి, కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలను అతడి మెద‌డులో భద్రపరిచి ఉండవచ్చనీ వారి అభిప్రాయం. కురుక్షేత్రానికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న సంజయుడు, ధృతరాష్ట్రుడూ, గాంధారిలకు యుద్ధ విశేషాలను ఎలా వివరించి ఉంటాడు? బహుశా బర్బరీకుడు తన అద్భుత శక్తులతో మహాభారత యుద్ధాన్ని వీక్షిస్తూ, వేరే ప్రదేశాలలో ఉన్న వ్యక్తులకు ప్రసరింపజేసే వాడేమో! ఏది ఏమయినప్పటికీ బ‌ర్బరీకుడి తలలో మహాభారత యుద్ధ ఘ‌ట్టాలన్నీ నిక్షిప్తమై ఉన్నట్లుగా భావించ‌వ‌చ్చు.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Thursday, December 26, 2024

హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. Harihara Ashtottara Shatanama Stotram


హరిహర 108 నామాలు.. యమధర్మరాజ కృతం.. TELUGU VOICE
హరిహర అష్టోత్తర శతనామ స్తోత్రమ్ - Harihara Ashtottara Shatanama Stotram

108 శివకేశవుల నామాలు జీవితంలో ఒక్కసారైనా పఠిస్తే, యమధర్మరాజు నుంచి విముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అదీ ముఖ్యంగా వారణాసికి వెళ్లినప్పుడు, మణికర్ణిక తీర్థం వద్ద శివకేశవులను 108 నామాలతో స్తుతించిన వారికి ఇక నరక బాధలంటూ ఉండవని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శివకేశవులను స్తుతించడం మాత్రమే చేయాలి.

గోవిన్ద మాధవ ముకున్ద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే ||
దామోదరాచ్యుత జనార్దన వాసుదేవ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౧||

గఙ్గాధరాన్ధకరిపో హర నీలకణ్ఠ వైకుణ్ఠ కైటభరిపో కమఠాబ్జపాణే||
భుతేశ ఖణ్డపరశో మృడ చణ్డికేశ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౨ ||

విష్ణో నృసింహ మధుసూదన చక్రపాణే గౌరీపతే గిరిశ శఙ్కర చన్ద్రచూడ ||
నారాయణాసురనిబర్హణ శార్ఙ్గపాణే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౩||

మృత్యుఞ్జయోగ్ర విషమేక్షణ కామశత్రో శ్రీకాన్త పీతవసనాంబుద నీల శౌరే ||
ఈశాన కృత్తివసన త్రిదశైకనాథ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౪||

లక్ష్మీపతే మధురిపో పురుషోత్తమాద్య శ్రీకణ్ఠ దిగ్వసన శాన్త పినాకపాణే ||
ఆనన్దకన్ద ధరణీధర పద్మనాభ త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౫||

సర్వేశ్వర త్రిపురసూదన దేవదేవ బ్రహ్మణ్యదేవ గరుడధ్వజ శఙ్ఖపాణే ||
త్ర్యక్షోరగాభరణ బాలమృగాఙ్కమౌలే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౬||

శ్రీరామ రాఘవ రమేశ్వర రావణారే భూతేశ మన్మథరిపో ప్రమథాధినాథ ||
చాణూరమర్దన హృషీకపతే మురారే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౭||

శూలిన్ గిరీశ రజనీశ కలావతంస కంసప్రణాశన సనాతన కేశినాశ ||
భర్గ త్రినేత్ర భవ భూతపతే పురారే త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౮||

గోపీపతే యదుపతే వసుదేవసూనో కర్పూరగౌర వృషభధ్వజ భాలనేత్ర ||
గోవర్ధనోద్ధరణ ధర్మధురీణ గోప త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి  ||౯||

స్థాణో త్రిలోచన పినాకధర స్మరారే కృష్ణానిరుద్ధ కమలాకర కల్మషారే ||
విశ్వేశ్వర త్రిపథగార్ద్రజటాకలాప త్యాజ్యా భటా య ఇతి సన్తతమామనన్తి ||౧౦||

అష్టోత్తరాధికశతేన సుచారునామ్నాం సన్దర్భితాం లళితరత్నకదంబకేన ||
సన్నాయకాం దృఢగుణాం నిజకణ్ఠగతాం యః కుర్యాదిమాం స్రజమహో స యమం న పశ్యేత్ ||౧౧||

గణావూచతుః ||

ఇత్థం ద్విజేన్ద్ర నిజభృత్యగణాన్సదైవ సంశిక్షయేదవనిగాన్స హి ధర్మరాజః ||
అన్యేఽపి యే హరిహరాఙ్కధరా ధరాయాం తే దూరతః పునరహో పరివర్జనీయాః ||౧౨||

అగస్త్య ఉవాచ ||

యో ధర్మరాజరచితాం లళితప్రబన్ధాం నామావళిం సకలకల్మషబీజహన్త్రీమ్ ||
ధీరోఽత్ర కౌస్తుభభౄతః శశిభూషణస్య నిత్యం జపేత్స్తనరసం న పిబేత్స మాతుః ||౧౩||

ఇతి శ్రృణ్వన్కథాం రమ్యాం శివశర్మా ప్రియేఽనఘామ్ ||
ప్రహర్షవక్త్రః పురతో దదర్శ సరసీం పురీమ్ ||౧౪||

ఇతి హరిహరాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ||

🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే 🙏

Monday, December 23, 2024

Shocking Facts About Shiva's Physical Appearance | శివుడి గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు!


శివుడి గురించి చాలామందికి తెలియని నమ్మలేని నిజాలు!? TELUGU VOICE

ఆది మధ్యాంత రహితుడు, నిరాకారుడు, నిష్కళంకుడు, జటాజూట ధారి, నీలకంఠుడు, తినేత్రుడు, స్మశాన వాసి, కైలాస నివాసి, త్రిశూల ధరుడు అంటూ శత కోటి నామాలతో, అంతులేని సద్గుణాలు కలిగిన ఆ పరేమేశ్వరుడిని కొలుస్తూ ఉంటాము. స్వభావరీత్యా లయకారుడే అయినా భోళా శంకరుడు ఆ మహేశ్వరుడు. ఇలా వర్ణిస్తూ పోతే జీవిత కాలం సరిపోదు. మన వేద, పురాణ, ఇతిహాసాలలో, ఆ శివయ్య స్వభావం గురించీ, ఆయన రూపు రేఖల గురించీ ఎంతో వివరణ ఉంది. అందులో స్వామి ఎక్కువగా నాగుపామును మేడలో ధరించి, ఒంటికి పులి చర్మం కట్టుకుని, ఒళ్ళంతా చితాభస్మం పూసుకుని తిరుగుతాడనీ, లింగ రూప ప్రియుడనీ తెలిసిందే. అసలు ఆయన నిజ స్వరూపం ఎలాంటిది? ఆయన ఎంత ఎత్తు ఉంటాడు? ఆయనకి శివుడనే పేరెలా వచ్చింది? అసలు ఆయన మానవ రూపంలో ఉంటాడా? లేక గ్రహాంతర వాసిలా కనిపిస్తాడా? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/vPad4lqMF48 ]


మానవ మేధస్సు ఎంత వృద్ధి చెందినా, ఈ విశాల విశ్వాన్ని సృష్టించిందీ, నడిపించేదీ, అవసరమైతే లయం చేసి పునఃసృష్టి చేసేదీ, అంతులేని శక్తులు కలిగిన భగవంతుడేనని నమ్మక తప్పదు. ఆ నమ్మకానికి నిదర్శనంగా ఎన్నో సంఘటనలు జరిగాయని ఆధారాలతో సహా మన మహా ఋషులు, వివిధ గ్రంధాలలో పొందు పరిచారు. ఈ సమస్త సృష్టిలో నిండి ఉన్న శక్తి స్వభావాన్ని బట్టి, ఆ ఆది దేవుళ్లను గుర్తించి, వారి వారి స్వభావాలను గ్రంథస్థం చేశారు. అలా ఆది దేవుడైన పరమేశ్వరుడి గురించి తెలుసుకుని, యుగయుగాలుగా మానవులు ఆరాధిస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో ఆ పరమేశ్వరుడి స్వరూపం, స్వభావం గురుంచీ చాలా మందిలో ఎన్నో సందేహాలు మెదులుతుంటాయి. అటువంటి సందేహాలకు సమాధానాలు మన వేదాలూ, పురాణాలూ, ఇతిహాసాలలో స్పష్టీకరించబడి ఉన్నాయని, ఆధ్యాత్మిక వేత్తలంటున్నారు.

దాని ప్రకారం ఆ పరమేశ్వరుడికి ఒక రూపం లేదనీ, ఆద్యంతయాలు లేని ఒక అపార శక్తి అనీ తెలుస్తోంది. Science చెప్పినా, మన శాస్త్రాలు చెప్పినా, ఆ అంతరీక్షం, కోటాను కోట్ల గ్రహాలూ, గ్రహ శకలాలూ, నక్షత్రాలూ, పాలపుంతలతో నిండి ఉంటుంది. అయితే, ఇవన్నీ కలిపి చూసినా, అంతేలేని అంతరిక్షంలో అవి కేవలం కొద్ది శాతాన్ని మాత్రమే ఆక్రమించుకున్నాయనీ, తక్కినదంతా ఏమీ లేని సూన్యమనీ తెలుస్తోంది. కానీ, సూన్యంలా కనబడే ఆ ప్రదేశంలో మానవ మేధస్సుకు అందని అపారమైన శక్తి దాగి ఉందనీ, ఆ శక్తినే ‘శివశక్తి’ అని అంటారనీ వేదాలలో ప్రస్థావించబడివుంది. మన వేద పురాణ ఇతిహాసాలన్నీ కట్టు కథలుగా, పుక్కిటి పురాణాలుగా కొట్టి పారేసే కుహనా మేధావులకు చెంప పెట్టులా, మన వేదాలలో ప్రస్తావించబడిన శివశక్తి స్వరూపానికి ఆధారాలను కనుగొన్న కొందరు శాస్త్రవేత్తలు, మన నమ్మకమే వాస్తవమని ఒప్పుకున్నారు.

ఏళ్ల తరబడీ ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్షం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో నేటి శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం అంతరిక్షంలో పాలపుంతలూ, గ్రహాలూ, నక్షత్రాలను మొత్తం కుప్పగా పోగేసినా, ఇంకా అంతులేని శూన్యం ఎంతో ఉందని గుర్తించారు. అయితే అది ఏమీ లేని శూన్యం కాదనీ, అక్కడ కంటికి కనపడని ఎదో శక్తి ఉందనీ గుర్తించారు. అలా కంటికి కనపడని శక్తులకు మన వారు కొన్ని పేర్లు పెట్టుకున్నారు. వాటిలో ముఖ్యంగా అణు శక్తీ, విధ్యుత్, అయాస్కాంత తరంగాల వంటివి చెప్పుకోదగినవి. ఆ కనపడని శక్తులను గుర్తించీ, వాటి గుణగణాలను గురించీ పాఠాలుగా మనం తెలుసుకుంటున్నాము. అయితే అంతులేని శూన్యంలో కనుగొనబడిన ఆ శక్తిని కొలిచే సాధనాలు తమవద్ద లేవనీ, అసలు ఆ శక్తి ఏంటో తమకు తెలియడం లేదనీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, లక్షల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మన వేదాలలో ఆ శక్తిని గుర్తించి, దాని పేరు ‘శివశక్తి’ అని స్పష్టీకరించబడి ఉంది.

ఇదిలా ఉంటే, మన వేదాలలో చెప్పబడిన ఈ తత్వాలూ, తర్కాలూ, సామాన్యులకు సులభంగా అర్థంకావని గ్రహించిన మన మహర్షులు, ఎన్నో ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసి, ఆ స్వామిని శరణు వేడారు. దానికి సంతోషించిన ఆ పరమేశ్వరుడు మానవ రూపంలో వారి మనో నేత్రాలకు దర్శనమిచ్చి, ఆ రూపాన్ని ప్రతిష్టించి చరితార్థులు కమ్మని చెప్పినట్లు, మన పురాణాలలో పేర్కొనబడివుంది. ఇదే క్రమంలో శివ పార్వతుల కళ్యాణాన్ని పరిశీలిస్తే, శివుడి రూపాన్ని గురించి స్పష్టంగా చెప్పబడిందని, ఆధ్యాత్మిక వేత్తలంటున్నారు. మన పురాణాల ప్రకారం, దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవి, పరమేశ్వరుడిని అనుదినం కొలుస్తూ, ఆయనను పెళ్లాడాలని అకుంఠిత దీక్ష బూనింది.

ఆమె వాంఛితార్ధం నెరవేర్చడానికి ఒకనాడు పరమేశ్వరుడు సతీ దేవిని చేపట్టడానికి, సపరివార సమేతంగా దక్ష ప్రజాపతి దగ్గరకు వచ్చాడు. ఒంటి నిండా చితా భస్మం పూసుకుని, మొల చుట్టూ అప్పుడే కాలం తీరి మృతిచెందిన ఏనుగు చర్మం చుట్టుకుని ఉన్న ఆయనను దక్షుడి భార్య చూసింది. చితా భస్మంతో, రక్తం కారుతున్న చర్మం చుట్టుకుని, మేడలో నాగుపామును ధరించిన శివయ్యనూ, అయన చుట్టూ వింత వింత శబ్దాలు చేస్తూ, ఎవరికీ అర్ధం కాని భాషలో మాట్లాడుతూ, భయంకరంగా ఉన్న ఆయన పరివారాన్నీ చూసి, భయంతో సొమ్మసిల్లి పడిపోయిందామె. దానితో సతి దేవి శివుడిని ప్రార్ధించింది. 'స్వామీ, తమరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. కానీ, మీ తత్వం బోధపడని మా అమ్మ, మిగతా వారూ మీ రూపాన్ని చూసి భయపడుతున్నారు. అందుకే నా కోసం, ఈ ఒక్కసారికీ మీ రూపాన్ని మార్చుకోండి' అని ప్రార్ధించింది. సతీదేవి కోరికను మన్నించి, వెంటనే తన రూపాన్ని మార్చుకున్నాడు ఆ భోళాశంకరుడు. ముగ్ధమనోహరమైన రూపం, అత్యంత దృఢమైన శరీరం, గుర్రం ఎత్తు, లేదా ఇద్దరు స్త్రీల ఎత్తు కలిగి, మగ జాతిలోనే అత్యంత సుందరమైన వ్యక్తిగా మన పురాణాలలో వర్ణించబడివుంది.

పాదం నుంచి తల వరకూ చూసుకుంటే గుర్రాల ఎత్తు తొమ్మిదడుగుల వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం, దక్ష ప్రజాపతి దక్షిణ భారత దేశ నివాసి. నాటి దక్షిణ భారత స్త్రీలు నాలుగున్నర నుంచి, ఐదు అడుగుల ఎత్తు మాత్రమే ఉండేవారని తెలుస్తోంది. ఈ లెక్కన కూడా శివుడు మానవ రూపం ధరించినప్పుడు, రమారమి తొమ్మిది అడుగుల ఎత్తు, అత్యంత దృఢమైన శరీరంతో ఉన్నాడని రూఢీ అవుతోంది. అంతేకాదు, శివ స్వరూపం గురించి ద్వాపర యుగంలో కూడా ప్రస్తావన ఉంది.

ద్వాపర యుగ పురుషుడైన శ్రీ కృష్ణుడు, కంస వధ తర్వాత మధురను పాలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జనులు ధర్మ బద్ధంగా జీవించాలనీ, భక్తి మార్గంలో పయనించాలనీ చెబుతూ, ప్రతి రోజు వారితో మమేకమై, ఎంతో అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండేవాడు శ్రీకృష్ణుడు. ఆ నృత్యం చూడటానికి రెండు కళ్ళూ చాలేవి కావనీ, అసలు వర్ణించనలవి కాదనీ చెప్పుకునేవారు. ఆ మాట ఆ నోటా ఈ నోటా పడి కైలాసంలో తపస్సు చేసుకుంటున్న శివుడి చెవులకు చేరింది. ఆ నృత్యం ఎలా ఉంటుందో కళ్లారా చూడాలని భావించిన శివుడు, యమునా నది సమీపానికి మానవ రూపంలో వచ్చాడు. ఆ నదీ తీరంలో పడవ నడుపుకునే ఓ వ్యక్తి దగ్గరకు వెళ్లి, తనను తీరం దాటించమని కోరాడు. తొమ్మిది అడుగుల పొడవు, బలమైన శారీరంతో, ఒంటి నిండా చితా భస్మ లేపనం, చర్మాంబరధారి అయిన శివయ్యను చూసి ఆశ్చర్యపోయాడు, ఆ పడవ నడుపుకునే వ్యక్తి. అంత వింత స్వరూపంతో ఎక్కడికి వెళుతున్నారని అడిగాడు. దానికి కృష్ణ నృత్యం చూడటానికి వెళ్తున్నట్లు, స్వామి చెప్పాడు.

'నువ్వు ఈ రూపంలో వెళితే ఎవ్వరూ నిన్ను లోపలకి రానీయరు. అయితే కృష్ణ పరంధాముడి నృత్యం చూడాలని అంటున్నావు గనుక, మా ఆవిడ బట్టలను ఇస్తాను. వాటిని ధరించి, కాస్త సౌమ్యమైన స్త్రీ వేషంలో అక్కడికి వేళ్ళు. నీకు వెంటనే ప్రవేశం దొరుకుతుంది' అని చెప్పాడు. దానికి అంగీకరించాడు శివుడు. కానీ, ఆ పడవ నడుపుకునే వ్యక్తి కడు బీదరికంలో ఉండడంతో, అతని భార్య వద్ద తను ధరించి ఉన్న ఒక్క చీర మాత్రమే ఉంది. పరోపకారమే మాధవ సేవ అని బలంగా నమ్మే ఆ భార్య భర్తలు ఏమీ ఆలోచించకుండా శివయ్యకు సహాయం చేస్తానని చెప్పడంతో, వెంటనే అతని భార్య గుడిసెలోకి వెళ్లి, తన ధరించి ఉన్న చీరనే విప్పి, భర్త ద్వారా ఆ చీరను స్వామికి ఇస్తే, ఆ స్వామి దానం తీసుకుంటున్నట్లు ఆ చీరను స్వీకరించి, అదే వస్త్రాన్ని ధరించి, కృష్ణ పరంధాముడి నృత్యం చూడటానికి వెళ్ళాడు. అంత పేదరికంలోనూ, లేదనకుండా వారు చేసిన సహాయానికి మెచ్చిన శివయ్య కరుణా కటాక్షాలను పొంది, ఆ భార్యాభర్తలు ఐశ్వర్యవంతులవ్వడమే కాకుండా, అంత్య కాలంలో మోక్షగతులు పొందినట్లు పురాణ విదితం. ఈ సంఘట ద్వారా స్వామి స్వరూప వివరణ మరో మారు తెలియవస్తుందని పౌరాణికులు చెబుతున్నారు.

శుభం భూయాత్!

Monday, December 16, 2024

జంతుబలి! Pashu Bali - Animal Sacrifice: Ritual Mystification and Mythical Demystification in Hinduism


జంతుబలి! TELUGU VOICE
Animal Cruelty vs Religious Sacrifice - Is Animal Sacrifice an Ethical Act?

ఆది నుంచీ మానవుడు అవలంభిస్తున్న ఓ పద్ధతి ‘శక్తి ఆరాధన’. నేల, నీరు, నింగి, నిప్పు, వాయువు అనబడే పంచ భూతాలతో పాటు, సృష్టికి వెలుగునిచ్చే సూర్య చంద్రుల వంటి వాటిని కూడా అపూర్వ దైవ శక్తులుగా భావించి, అనాదిగా భూమిపై మనుగడ సాగించిన మానవులందరూ కొలిచే వారని చరిత్ర చెబుతోంది. కోరకుండానే మంచి చేసే ఆ దేవతలను సంతృప్తి పరిచేలా పూజలు చేసి వరాలడిగితే వాటిని వెంటనే తీరుస్తారనే నమ్మకం, రాను రాను మనుష్యులలో బలంగా నాటుకు పోయింది. ఈ క్రతువులోనే జంతు బలుల ప్రక్రియ పుట్టుకొచ్చినట్లు చరిత్రకారుల వాదన. ఈ మాట వినగానే మనకి గ్రామదేవతల ముందిచ్చే జంతుబలులు గుర్తుకు వస్తాయి. నేడు చాలా మంది జంతుబలి ఇవ్వకూడదనీ, అది అనాగరిక చర్య అనీ వాదించడం కూడా మనం వింటూ ఉంటాము. మరి అసలు జంతుబలి ఇవ్వవచ్చా? మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? అసలు గ్రామ దేవతలకే ఎక్కువగా జంతుబలులు ఎందుకు ఇస్తూ ఉంటారు? వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PzFTGZ3NNw0 ]


బలి అనగా దైవప్రీతి కోసం ఏదో ఒక జీవాన్ని చంపే ఒక క్రతువుగా మనకు తెలిసినదే. హిందూ మతంలో జంతు బలి ఆచారం, ఎక్కువగా వేద శ్రౌత ఆచారాలు, స్థానిక గిరిజన సంప్రదాయాలలో బలంగా పాతుకుపోయిన హిందూ జానపద ఆచారాలతో ముడిపడి ఉంది. అయినప్పటికీ జంతు బలులు భారత దేశంలోని పురాతన వైదిక మతంలో భాగంగా ఉన్నాయి. జంతుబలులనగానే, మన దేశంలోని గ్రామ దేవతలకు ఇచ్చే బలులు ముందుగా మనకు గుర్తుకు వస్తాయి. గురివింద గింజ తన క్రింద నలుపెరుగదన్నట్లు, ముక్క లేనిదే రోజూ ముద్ద దిగని పాశ్చాత్యులూ, Science పేరుతో వారు చెప్పే మాటలను గొర్రెలలా నమ్మి, నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడే మన కుహనా మేధావులూ, మన దేశంలో ఏ నాటినుంచో వస్తున్న సంప్రదాయాలను తప్పుగా చూపించడం ఫ్యాషన్ గా మారిపోయింది. అటువంటి వారి కోసమే కాకుండా, మన మందరమూ జంతుబలుల వెనుక ఉన్న అనేక వాస్తవాలను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. జంతుబలులనేవి, కేవలం హిందూ ధర్మం పాటించే వారే కాకుండా, ప్రపంచంలో ఉండే ఎన్నో ఇతర మతాల వారు కూడా నేటికీ పాటిస్తూనే ఉన్నారు. అలా అని, తక్కిన మతాల వారు జీవ హింస చేయటంలేదా? అంటే, దానికి సమాధానం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

ఇక మన దేశంలో కనపడే జంతు బలుల వెనుక చాలా పెద్ద కథే ఉంది. సంస్కృత భాషలో ‘బలి’ అంటే ఇవ్వటం అనే అర్ధం ఉంది. దేవతలకూ భూతగణాలకూ సమర్పించే ప్రసాదాన్ని కూడా ‘బలి’ అంటారు. దక్షిణ భారత దేశంలో కాస్త పెద్దగా ఉన్న ఏ ఆలయానికి వెళ్లినా, ఆ ఆలయం చుట్టూ చిన్న చిన్న రాళ్లను ఏర్పాటు చేసి, వాటిపై పెసరపప్పు, లేదా మినప్పప్పుతో వండిన అన్నాన్నిగానీ, లేదా పెరుగన్నాన్నిగానీ, సృష్టిలో ఉండే వివిధ గణాలను సంతృప్తి పరచడానికి, బలి అన్నంగా పెట్టడం ఆనవాయితీ. సాధారణంగా, మన కడుపులు నింపుకోవడం మనకి ఎంత ముఖ్యమో, ఈ సృష్టిలో జీవించే అన్ని జీవరాసుల కడుపులు నింపడం కూడా అంతే ముఖ్యమని, మన హైందవ ధర్మం చెబుతుంది. ఆ విధంగా దేవుడి పేరుచెప్పి, భూమిపై తిరిగే అనేక జీవరాశులకు ఈ బలి అన్నం ఆహారంగా పెట్టాలని, మన పెద్దల ఉద్దేశ్యం. ఇలా బలి అనే పద్ధతికి శ్రీకారం చుట్టారు మన పూర్వీకులు.

ఇక జంతుబలులు ఎందుకు ఇస్తారనే సందేహానికి కూడా మన వేదాలలో జవాబు ఉంది. సాధారణంగా మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే, అందుకు కృతజ్ఞతగా వారికి తిరిగి ఏదైనా ఇవ్వడం మానవ సహజం. అలాగే, ఈ సృష్టిని ప్రారంభించి, అందులో మనలాంటి జీవరాశి మనుగడకు అవసరమయ్యే అన్ని వనరులనూ సమకూర్చిన ఆ దైవానికి కృతజ్ఞతగా మానవుడు, భక్తి పూర్వకంగా ప్రసాదం చేసి నివేదించడం, ముఖ్యంగా మన హైందవ ధర్మాన్ని పాటించే వారికి ఒక ఆచారంగా వస్తోంది. ఈ క్రమంలో ఆ దేవుడిని ఆర్ధికంగా బలపరచమనీ, మంచి నడవడికనూ, బుద్ధినీ ప్రసాదించమని కోరుకుంటూ ఉంటాము. ఈ సృష్టిలో ఒక్కో ప్రాణికి ఒక్కో గుణం ఉంటుంది. ఉదాహరణకు, కోడికి ఎక్కువగా భయపడే గుణం ఉంటుంది. గొర్రెలకు గుడ్డిగా ఎదుటి వాటిని నమ్మే గుణం ఉంటుంది. మేకలకు మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుందని విజ్ఞులు చెబుతారు. వాటన్నిటినీ దుర్గుణాలుగా ఎంచి, అటువంటి దుర్గుణాలు మానవుడి ఎదుగుదలకు అవరోధాలవుతాయని భావించి, వాటిని దేవుడికి బలిగా ఇస్తే, ఆయన మనకు మంచి గుణాలు ప్రసాదిస్తాడని వేదాలు చెబుతున్నాయి. అందువల్ల, మానవులలో ఉండే ఒక్కో అవలక్షణాన్నీ పోగొట్టుకోవడానికి, ఒక్కో విధమైన నియమ నిష్ఠలతో కొన్నేళ్ల పాటుండి, కొన్ని ద్రవ్యాలను భగవంతుడికి అర్పిస్తే, ఆయా లక్షణాలు పోయి మంచి గుణాలు అబ్బుతాయని, వేదాలలో స్పష్టీకరింపబడింది. ఆ విధంగా మొదలైన ఆచారాలూ, పద్దతులలో షార్ట్ కట్ ని పాటిస్తూ ముందుకు తెచ్చిన మరో పద్ధతే, ఈ జంతుబలులని పండితులంటున్నారు. కాల గమనంలో ఎన్నో పద్ధతులు పక్క దారులు పట్టినట్లు, ‘మనలోని జంతు ప్రవృత్తిని బలి ఇవ్వమని చెబితే, మనవారు ఆ జంతువులను బలి ఇవ్వడం మొదలు పెట్టినట్లు, పండితుల వాదన.

ఈ జంతు బలులు మొదలవ్వడానికి మరో కారణం కూడా ఉందని మన పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రామాలకు రక్షణగా నిలిచే గ్రామ దేవతల ఎదుట, జంతు బలులను సమర్పించడం చూస్తూ ఉంటాము. దానికి సంబంధించి వేదాలలో చెప్పబడిన విషయంతో పాటు, సగటు మానవుడి ఆలోచనా ధోరణి కూడా తోడవుతుంది. మన పురాణాల ప్రకారం, శక్తి స్వరూపంగా కొలిచే ఆ జగదాంబ యొక్క కళాంశలలో కొన్ని అంశలు, గ్రామ, కుల, ఇంటి దేవతలుగా మారి, ఆయా ప్రజలను రక్షిస్తూ ఉంటాయి. అందువల్ల మనకి మేలు చేసే అమ్మవార్లను తగిన విధంగా పూజించి, నైవేద్యాలు సమర్పించడం మన సంప్రదాయంలో ఒక భాగం. అయితే, పెద్ద పెద్ద ఆలయాలలో ఉండే అమ్మవార్లను పూజించేటప్పుడు, వేదాల ప్రకారం పూజలూ, నైవేద్యాలు సమర్పించడం పూర్వం నుంచీ వస్తోంది. బలుల గురించి యజుర్వేదం వంటి గ్రంథాలలో ప్రస్థావనలున్నాయి. ఇరవై ఒక్క వైదిక శ్రౌత యజ్ఞాలలో ఏడింటికి, జంతు బలి అవసరం. సోమ యాగంలో మేకను, అశ్వమేథ యాగంలో గుర్రాన్ని బలి యిస్తారు. అయితే, బలి ఇచ్చే వ్యక్తికి అతని వంశం, కులాన్ని బట్టి మాంసాన్ని తినడం, తినకపోవడం అనేది వర్తిస్తుంది. ఇల్వలుడు, వాతాపి ఉదంతం తర్వాత అగస్త్య మహర్షి శాపం కారణంగా, చాలా బ్రాహ్మణ కులాలు మాంసాహారాన్ని అర్పిస్తారు కానీ తినరు. దేవీ భాగవత పురాణం, కాళికా పురాణం వంటి పద్దెనిమిది ప్రధాన పురాణాలూ, వాటి ఉపపురాణాలూ, జంతు బలిని సూచిస్తున్నాయి. ఆది శంకరాచార్యుల సనాతన స్మార్త అద్వైత వేదాంత సంప్రదాయం, బ్రహ్మ సూత్రాలను అనుసరిస్తుంది. ఆ గ్రంధాల ప్రకారం జంతు బలి, బాధితుడి ఆత్మ విముక్తికి మార్గంగా పరిగణించ బడుతుంది.

పూర్వం చాలా గ్రామాలలో ఉండే గ్రామ దేవతలను పూజించడానికి, వేదాలు చదివిన పండితులు అందుబాటులో లేక పోవడంతో, ఆ చుట్టప్రక్కల నివసించే వారే తమకు తోచిన విధంగా ఆయా దేవతలను పూజించే వారు. వారిలో కొంతమంది పూర్తి శాకాహారులయితే, మరికొందరు మాంసాహారులవ్వడంతో, వారు ఎలాంటి ఆహారాన్నయితే తింటారో, అటువంటి వాటినే గ్రామ దేవతలకు నైవేద్యంగా సమర్పించేవారు. అలా మొదలైన పద్ధతులే, నేటికీ గ్రామ దేవతల సమక్షంలో ఓ ఆచారంగా జరుగుతూ ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

లక్షల సంవత్సరాల చరిత్రగలిగిన మన సనాతన ధర్మాన్ని అణగద్రొక్కాలనే దూరాలోచనతో, హిందువులను వారి మతాలవైపుకు తిప్పుకోవాలనే కుతంత్రంతో సాగే పాశ్చాత్యులు, మన సంప్రదాయాలనూ, ఆచారాలనూ తప్పు పట్టడం మొదలు పెట్టారు. వారానికోసారి వీకెండ్ పేరుతో తాగి తందానాలాడటమే కాకుండా, కొన్ని వేల జీవాల ప్రాణాలు తీసి పార్టీలు చేసుకోవడం వారికి తప్పుగా కనపడదు కానీ, నమ్మినవారిని చల్లగా చూడటమే కాకుండా, ఆయా గ్రామాలలోని ప్రజలు ధర్మం తప్పకుండా కాచే శక్తి స్వరూపాలకు భక్తితో ఇచ్చే బలులు తప్పుగా కనపడటం, నిజంగా శోచనీయం.

ధర్మో రక్షతి రక్షితః!

Monday, December 9, 2024

MIND-BLOWING Secrets of HELL (Narakam) Punishments Revealed నరకము - శిక్షలు!


నరకము - శిక్షలు! TELUGU VOICE
ఇక్కడే మనం ఇన్ని బాధలు పడుతున్నప్పుడు మళ్ళీ నరకము, శిక్షలు అవసరమా?

దైవం కరుణాసముద్రుడు. సకల ప్రాణికోటికీ ఆయన సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు. తాననుకున్న పనులను చేసుకుంటూనే సచ్చిదానందాన్ని పొందవచ్చు. ఎవరు ఎన్ని తప్పులు చేసినా, ఆ పరమేశ్వరుడు కోపగించుకోడు, ద్వేషంతో దండించడు. కానీ, ఆయన రచించిన వ్యవస్థలో, జీవులు తమ తప్పులకు తగిన దండనను అనుభవించ వలసి రావటం అనేది, భవిష్యత్తులో మనం ఎక్కువ యోగ్యతను పొందటం కోసమే. స్వర్గ నరకాల వ్యవస్థ ఈ దృష్టికోణంతో రచింప బడినదే. మృత్యువు తరువాత వెంటనే మరో దేహం ధరించటం వీలుకాదు. నూతన దేహ ప్రాప్తికి ముందు జీవి, మనోమయ, ప్రాణమయ దేహం చేత, సుకృత, దుష్కృత, సుఖ దుఃఖాల ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది. గరుడ పురాణంలో, కఠోపనిషత్తు వంటి గ్రంధాలలో చెప్పబడిన వివరణతో, గతంలో మనం కొన్ని వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు అవి కూడా చూస్తే మరికొంత అవగాహన వస్తుంది. ఇక వాస్తవంగా స్వర్గ నరకాలేమిటి, అక్కడి శిక్షలు, భోగాల వంటి విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/v67DQWZTpik ]


భగవంతుడి సృష్టిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నరకం అనే వ్యవస్థ ఎలాంటిదంటే, మన న్యాయ స్థానాలలో ఎవరికైనా జైలు శిక్ష విధించడానికి, న్యాయమూర్తి మనస్సులో అతని మీద ఉన్న ద్వేషం కారణం కాదు. అతడు చేసిన తప్పులకు పర్యవసానంగా శిక్షను అనుభవించి, తద్వారా నేరస్థునిలో మార్పు వచ్చి, అతడు ఉత్తముడిగా మారాలనేదే, ఇక్కడ ప్రధాన ఉద్దేశం. మృత్యువు అనంతరం జీవునికి స్వర్గం గానీ, నరకం గానీ ప్రాప్తిస్తాయి. దీనిని అన్ని మతాలూ అంగీకరించాయి. మృత్యువు, పునర్జన్మ మధ్య గడిచే కాలంలో, తప్పని సరిగా జీవుడు స్వర్గ నరకాలను అనుభవించ వలసిందే. ఈ వ్యవస్థ వలన, గతంలో చేసిన తప్పులనూ, పాపాలనూ ప్రక్షాళన చేసుకుని, భావి జీవితం నిరపాయకరంగా గడపాలన్నదే, భగవంతుడి కోరిక.

మరణానంతరం జీవుడు మూడు సంవత్సరాల కాలం గానీ, అంతకు ఎక్కువ తక్కువలతో గానీ, ఊర్ధ్వలోకాలలో అంటే, పరలోకంలోనే నివాసం చేయాలని అదృశ్య చేతన భావిస్తుంది. అందులో మూడవ వంతు నిద్రలోనే గడిచి పోతుంది. అందువలన జీవుడికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. ఆ తరువాత జీవుడు ఆరోగ్యవంతంగా నిద్ర లేస్తాడు. అప్పుడు గతాన్ని గురించి ఆలోచన ప్రారంభమవుతుంది. మరో మూడవ వంతు కాలం, ఈ సింహావలోకనంలో గడచిపోతుంది. పూర్వం అతడు చేసిన పాపకర్మాదులూ, పుణ్యకార్యాలూ, అతడి చేతనలో పొరలు పొరలుగా ఏర్పడి ఉంటాయి. ఉల్లి పొరలలాగా ఒక్కొక్కటి ఊడిపోయి, చివరకు కర్మ ఫలాన్ని అనుభవించడానికి తగిన బీజం మాత్రమే మిగులుతుంది. మానవుడు తప్పులు చేసి మరచి పోతాడు. కానీ, సాక్షీ భూతమైన అతని ఆత్మ మాత్రం, వాటిని విస్మరించదు. ఉదాహరణకు, మనం దొంగతనం చేసేటప్పుడు అది తప్పని అంతరాత్మ హెచ్చరిస్తూనే వుంటుంది. కానీ ఆ హెచ్చరికను మనం పెడచెవిన పెట్టి, దొంగతనం చేస్తాము. ఎవరూ ఆ దొంగతనాన్ని చూడక పోవచ్చు. అందువల్ల దండన లభించకపోవచ్చు. కానీ ఆ దొంగతనం యొక్క బీజం, సారవంతమైన భూమిలో గోధుమ గింజ నాటబడినట్లు, ఆత్మక్షేత్రంలో అలా నిలిచిపోయి, నిదానంగా పెరిగి పెద్దదవుతుంది.

మన పురాణాలలో నరకం, అనేక రకాలుగా వర్ణించబడింది. ఒక్కో మత గ్రంధం దానిని ఒక్కో విధంగా వర్ణించింది. అంధకూపం, కుంభీ పాకం, వైతరణీ నది, రౌరవము, అలాగే జహన్నుం, హెల్‌ అన్నీ సత్యమే. ఒక అభిప్రాయం ప్రకారం, ఎవరి నరకం వారిది. ఎన్ని ప్రాణులుంటే అన్ని నరకాలుంటాయి. ఎవరి దృష్టి కోణం వారిది కావటమే అందుకు కారణం. అది ఎలా అంటే, ఒకరికి అంగ వైకల్యం దుఃఖ కారణం కావచ్చు. ఆ అంగ వైకల్యమే ఒక బిచ్చగాడికి వరము. అది తొలగిపోతే అతనికి భిక్ష లభించక, దుఃఖ కారణమవుతుంది. నెరస్థులకు వేసే ఉరిశిక్ష అంటే కొందరు భయ భ్రాంతులకు లోనవుతారు, కొందరు ఆనందంగా పాటలు పొడుతూ ఉరిశిక్షను అనుభవిస్తారు. కుంభీపాక నరక వర్ణన ప్రకారం, అది ఒక నుయ్యి వంటిది. అందులో కత్తులు ఉండి, కదిలినప్పుడల్లా శరీరాన్ని ఛేదిస్తూ, భాధకు గురిజేస్తాయి. అదే నరకం, కొందరి మానసిక పరిస్థితి వల్ల వారికి బాధ కలిగితే, కొందరు కొంతసేపు బాధ పడి, తరువాత నవ్వుకోగలరు. ఎవరి మానసిక పరిస్థితి వారిది.

మన పురాణాలలో వర్ణింప బడిన దానిని బట్టి, యమ దూతలు యమ పాశంతో జీవుని బంధించి, నరకానికి ఈడ్చుకు వెళతారు. ఆ యమ దూతలు స్వతంత్ర ప్రాణులు కారు. కేవలం జీవుని మానస పుత్రులు. జీవుడు నరకంలో ఉన్నంత వరకే వారు ఉంటారు. తరువాత నశిస్తారు. ఒకరి కొరకు జన్మించిన యమ దూతలు, మరొకరికి దండన విధించలేరు. నిజానికి ఊర్ధ్వలోకంలో భౌతిక జీవనం సమాప్తమై, ఆధ్యాత్మిక జీవనం మొదలవుతుంది. వైజ్ఞానికుల ప్రకారం, బాహ్య మనస్సు అంతరించిపోయి, అంతర్మనస్సు జన్మిస్తుంది. న్యాయవాదుల వాక్చాతుర్యము, పండితుల సాహితీ చర్చలూ ఇక్కడ మచ్చుకకైనా కనిపించవు. జీవించి ఉన్నప్పుడు బాహ్య మస్తిష్కంలాగా, జీవుని పాప ఫలం కొమ్మలు రెమ్మలతో, ఫల పుష్పాలతో నిండుగా వుంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములూ, పది ఇంద్రియములతో కూడిన సూక్ష్మ శరీరము, జీవించి ఉన్నవుటి గుప్త మస్తిష్కంలాగా అచేతనంగా వుంటుంది.

ఇంద్రజాలం అంటే Hypnotism చేసేటప్పుడు, బాహ్య మస్తిష్కం నిద్రిస్తుంది. అంతర మస్తిష్కానికి నీటిలో ఈదమని ఆజ్ఞాపిస్తే, నీటిలో ఈదుతున్న భావన కలుగుతుంది. నరకం యొక్క అనుభవం కూడా ఇదే విధంగా వుంటుంది. నరకమూ, యమ దూతలూ, ప్రత్యేకంగా వుండవు. ఊర్ధ్వలోకంలో న్యాయ వాదులూ, న్యాయమూర్తులూ వుండరు. ప్రతి రోజూ కోట్ల ప్రాణులు మరణిస్తూ వుంటాయి. వాటన్నిటికీ దండన విధించడానికి, అంతకు రెట్టింపు యమ దూతలు కావాలి. లక్షల, కోట్ల జైళ్ళు, నరకాలు కావాలి. అందువల్ల వాస్తవానికి జరిగేది, ఎవరి నరకాన్ని వాళ్ళు సృష్టించుకోవటమే. ఆ నరకం వారితోనే నశించి పోతుంది.

అంతరాత్మలో పేరుకుని వున్న పాప సంస్కారాలు ప్రకాశ రూపంలో ప్రత్యక్షమైనప్పుడు, ఎంతో శక్తి వంతంగా వుండి, సూక్ష్మ శరీరాన్ని బలవత్తరంగా ఆకర్షిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే, సర్పం కళ్లతో తీక్షణంగా చూచి, పక్షులను బలవత్తరంగా ఆకర్షించినట్లే ఇది కూడా. అటువంటి సమయంలో, వేరే ఏదో స్వతంత్ర శక్తి, యమ దూతల రూపంలో ఈడ్చుకు పోతున్నట్లు భావన కలగ వచ్చు. ఈ యమ దూతల రంగు, రూపం, ఆకారం, ఎవరి భావనలను బట్టి, వారికి ప్రత్యేకంగా వుండవచ్చు. హిందువులకు తిలకం పెట్టుకుని, గదను ధరించిన యమదూతలు ప్రత్యక్షం కావచ్చు. ఇంకొకరికి గడ్డంతో, టర్కీ టోపీతో ప్రత్యక్షం కావచ్చు. ఆంగ్ల యమ దూతలు, టోపీ, నెక్‌ టై ధరించి కనిపించ వచ్చు. వారు మాట్లాడటం కూడా ఆ భాషలలోనే ఉండవచ్చు. ఎవరి విశ్వాసాలను బట్టి, వారికి అనుగుణంగా ఈ యమదూతలు కనిపిస్తారు.

ఒకరికి కనిపించే యమ దూతలు, పెద్ద కోరలు కలిగివుండవచ్చు. మరొకరికి మిడిగుడ్లతో కనిపించవచ్చు. ఈ యమ దూతలను, చూచేవారి సంస్కార తేజంగా భావించవచ్చు. సూక్ష్మ శరీరం, తన కోరికకు విరుద్ధంగా దండనలు విధించ వచ్చు. అంతిమంగా దుష్కర్మల ఫలితం దుఃఖమే. సూక్ష్మ శరీరం, వేదనలు, బాధలు, కష్టాలు అనుభవించడానికి, అంతరాత్మ ఒక స్వతంత్ర నరకాన్ని నిర్మిస్తుంది. ఇందులో ఇనుప ముక్కుల కాకులు, గ్రద్దలు, దాటనలవి కాని వై తరణీ నది, చమురు బాండీలలో భారీగా వేయించడానికి ఏర్పాట్లు, ఇవన్నీ వుంటాయి. లేదా కేవలం అవమానాలు, అపహస్యాలు, తిట్లు పొందటంతో సరిపోవచ్చు. ఎవరి మానసిక పరిస్థితిని బట్టి, వారి అనుభవం ఉంటుంది. ఈ నియంత్రణ అంతా జీవుడు దుఃఖాన్ని అనుభవించటానికి మాత్రమే. తాము చేసిన పాపాలకి తగిన ఫలితం అనుభవించాలని, జీవుడు గ్రహంచాలి. తనను తాను సంస్కరించుకునేటంత వరకూ, జీవునికి ఈ నరక లోకానుభవం ఉంటుంది. ఉదాహరణకు, న్యాయమూర్తి చిన్నచిన్న అపరాధాలకు స్వల్ప దండన విధిస్తే, పెద్ద నేరాలకు దండన పెద్దదిగా వుంటుంది. దానికి కారణం, చిల్లర నేరాలు చేసే వారి మనో భూమి, శీఘ్రంగా పరిష్కరింప బడుతుంది. కానీ, హత్యలూ మొదలైన పెద్ద అపరాధాలు చేసే వారి మనో భూమి కఠోరంగా వుండి, సంస్కరింప బడటానికి చాలా కాలం పట్టవచ్చు. నరక దండనలు కూడా ఇదే విధంగా వుంటాయి. దుష్కర్మల ప్రభావం పొరలు పొరలుగా ఊడి నశించి పోతుంది. సూక్ష్మ శరీరానికి ఇంద్రియాలు, మనస్సు కూడా వుంటాయి.

ఇక శారీరక పాపాలకు శారీరక దండన, మానసిక పాపాలకు మానసిక దండన, విధింప బడుతుంది. చేసిన పాపాలకు తగిన శిక్షను ఆ జీవి అంతరాత్మయే విధిస్తుంది. ఇందులో మరొకరి ప్రమేయము ఉండదు. కొంత వరకు పాపానికి తగిన శిక్ష జీవిత కాలంలోనే అనుభవించ వలసి రావచ్చు. మిగిలిన దానికి ఫలితాన్ని పరలోకంలో అనుభవించవలసి ఉంటుంది. పరమాత్మ ఏర్పాటు చేసిన వ్యవస్థననుసరించి, తిరిగి జన్మ ఎత్తే ముందే పాపాలకు తగిన ప్రాయశ్చిత్తం విధింప బడి, ప్రక్షాళనం చేయ బడుతుంది. తిరిగి జన్మించినపుడు, వాటి ప్రభావం చూపే అవసరం రాకుండా ఉండటానికే ఈ వ్యవస్థ. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్పితే, పాప ఫలమంతా ఊర్ధ్వలోకంలోనే అనుభవంలోకి వస్తుంది. నరక లోకానుభవం, పాప ఫలాన్ని అనుభవించి నశింపజేసుకోవటం మాత్రమే గాక, పాత అలవాట్లనూ, దుష్ప్రవృత్తులనూ మాని, మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి కూడా ఉద్దేశింపబడింది. దొంగతనం చేసేటప్పుడు దొంగ గొంతు పొడారిపోతుంది. దుర్మార్గం చేసేటప్పుడు, కాళ్ళు వణుకుతాయి. అదంతా గతంలో పాపాలకు పొందిన ప్రాయశ్చిత్తం యొక్క స్మరణ వల్లే జరుగుతుంది. కానీ, దురదృష్ట వశాత్తూ, అంతరాత్మ ప్రబోధాన్ని పెడ చెవిన బెట్టి, మనిషి పాప కర్మలకు ఉద్యుక్తుడవుతూనే వున్నాడు.

అందుకే మనిషి ధ్యానం, లేక Meditation ని తప్పనిసరిగా అలవరుచుకుని, మనస్సును స్వీయ నియంత్రణ చేసుకోవాలి. సత్యం లేదా వ్యక్తిగత ఆధీనం నుంచి ఎలాంటి ఆలోచనలూ మనలను పక్కద్రోవ పట్టించకుండా, ఇబ్బంది పెట్టే సమస్యల నుంచి మనస్సును ప్రశాంత పరిచే విధమైన స్థితిని అలవరుచుకుని, ఇప్పటివరకు మనం చెప్పుకున్న నరకము, శిక్షలు, తప్పించుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. ఇక స్వర్గ లోకం, దాని వివరణా, మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము..

ధర్మో రక్షతి రక్షితః!

Monday, December 2, 2024

STOP Ignoring the Power of Time and Karma - Scientific Proof You Won't Believe | కాలం! కర్మం! సైన్స్ పరంగా


సైన్స్ పరంగా - కాలం! కర్మం! TELUGU VOICE
40 లక్షల సంవత్సరాల తరువాత భూమికి తిరిగి వచ్చిన అతడికి ఏం తెలిసింది?

‘కాలం’, ‘కర్మం’ కలిసి రావడమో, లేక అడ్డుపడడమో అనే పద ప్రయోగం మనం నిత్యం వింటూ ఉంటాము. ఈ సువిశాల విశ్వంలో ఎంతో విలువైనదీ, అద్భుతమైనదీ, అంతుచిక్కని ఎన్నో రహస్యాల గనీ ‘కాలం’. కాలం యొక్క తీరుతెన్నులు తెలుసుకోవడానికి ప్రయత్నించే ఏ మనిషికైనా, ఆ కాలం చేసే మాయను చూసి నోట మాటరాదు. ఇక కర్మ గురించి చెప్పనవసరమే లేదు. ఆ కారణంగానే, ఆది కాలం నుంచీ మానవుడు, కాలం గురించీ, కర్మల గురించీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నా, నేటికీ వాటి గురించి తెలిసింది కేవలం గడ్డిపోచ మొన భాగమంత కూడా లేదు. ఆధునిక మానవుడి మనుగడలో ఎంతో వ్యత్యాసం రావడంతో పాటు, నేటి పరిజ్ఞానం కూడా మానవ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఈ పరిజ్ఞానం సహాయంతోనే, కొన్ని దశాబ్దాల క్రితం, Albert Einstein అనే శాస్త్రవేత్త, The Theory of Relativity అనే సిద్ధాంతాన్ని మన ముందుంచారు. ఆ సిద్ధాంతం ప్రకారం, కాలం నడిచే తీరుతెన్నుల గురించి, వెయ్యిలో ఒకటో వంతు మానవుడికి తెలుసుకునే అవకాశం దక్కింది. ఈనాడు Einstein చెప్పిన ఆ సాపేక్ష సిద్ధాంతం, కొన్ని యుగాల పూర్వమే మన మహాపురుషులు కనిపెట్టి, దానితో ఎన్నో ప్రయోగాలు కూడా చేశారు. కేవలం మన పురాణాలలో రాయడమే కాకుండా, హిందువులు ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక పండగకీ, Einstein చెప్పిన సాపేక్ష సిద్ధాంతానికి కూడా సంబంధం ఉంది! అలాగే, Newton అనే శాస్త్రవేత్త 3వ సూత్రానికీ, కర్మ సిద్ధాంతానికీ సంబంధం ఉంది! మరి ఆ విషయాలు తెలుసుకోవడం కోసం, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Nb12ylQ-zd0 ]


ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలలో ముందుగా, “ప్రతి చర్యా దానికి వ్యతిరేకమైన సమాన ప్రతిచర్యను కలిగి ఉంటుంది” - న్యూటన్‌ అనే శాస్త్రజ్ఞుని 3వ సూత్రం ఇది. కర్మ సిద్ధాంతం కూడా ఒక విధంగా ఇదే భావనను వ్యక్తం చేస్తుంది. ప్రతి కర్మా, దానికి తగ్గ సమాన ఫలితాన్ని తిరిగి ఇచ్చి తీరుతుంది. పాపకర్మ పాప ఫలాన్నీ, పుణ్యకర్మ పుణ్య ఫలాన్నీ ఇస్తుంది. దానిని ప్రతి జీవీ అనుభవించక తప్పదు. కర్మ ఫలం ఎప్పుడూ ఆ కర్మకు తగిన రీతిలో సమానంగానే ఉంటుంది. అందులో ఏ మాత్రం హెచ్చు తగ్గులుండవు. మనం అనుభవిస్తున్న సుఖానికీ, దుఃఖానికి కూడా ఒక విధంగా కారకులం మనమే. వివిధ జన్మలలో మనం చేసుకున్న కర్మలు వాటికి సరిపోయే సమాన ఫలితాలను ఆ తరువాతి జన్మలలో మనకు అందిస్తాయి. అంటే, ప్రతి కర్మా, దానికి తిరిగి ఎదురొచ్చే సమాన కర్మ ఫలితాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇందులో న్యూటన్‌ 3వ సూత్రం, అచ్చంగా ప్రతిధ్వనిస్తుంది.

ఎవరి కర్మ ఫలం, వారికే చెంది తీరుతుందని కృష్ణ పరమాత్ముడు స్పష్టంగా వివరించాడు. అంటే, పుణ్య కర్మకు సౌఖ్యాన్నీ, పాప కర్మకు శిక్షనూ, ఎవరిది వారే అనుభవించి తీరాలని అర్ధం. అప్పుడే పాపభీతీ, దైవభక్తీ నిలుస్తాయి. విచ్చలవిడితనానికి అడ్డుకట్ట పడుతుంది. ఒకరి పాప భారాన్ని మరొకరు మోస్తారని భావించడం, వట్టి భ్రమ. గాయం చేసుకున్న వారికే రక్త స్రావం జరుగుతుంది గానీ, వారి ఆత్మీయులకు కాదు కదా! 'చేసుకున్న వారికి చేసుకున్నంత! ఎవరి కర్మ వారిదే! అనే విషయం సత్యం.. కర్మ సిద్ధాంతం గురించి, గరుడపురాణం, కఠోపనిషత్తు, భాగవత, రామాయణ, మహాభారతాలలోని ప్రస్థావనలతో, గతంలో మనం చాలా వీడియోలు చేసి ఉన్నాము. చూడని వారు తప్పక చూడండి..

ఇక Einstein చెప్పిన The Theory of Relativity కీ, మన పురాణాలూ, వేదాలలో చెప్పబడిన అంశాలకూ గల సంబంధం ఏంటో తెలియాలంటే, ముందు అసలు ఈ సాపేక్ష సిద్ధాంతం అంటే ఏంటో తెలియాలి. నేటి ఆధునిక యుగంలో గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరైన Einstein, కాలం యొక్క పోకడపై ఎన్నో ఏళ్లపాటు శ్రమించి, The Theory Of Relativity ని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారం, కాలం తీరు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉంటుంది. అంటే, ఒక పది సంవత్సరాల వయస్సున్న పిల్లవాడిని, కాంతి వేగంతో ప్రయాణించే వాహనంలో కూర్చో పెట్టి, భూమికి ఇరవై ఐదు లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న Andromeda Galaxy కి పంపితే, తిరిగి వచ్చే సరికి అతడి వయస్సు, 56 సంవత్సరాలు పెరుగుతుంది. కానీ, అతడు భూమికి తిరిగి వచ్చేసరికి, దాదాపు, నలభై లక్షల సంవత్సరాల పైనే గడిచిపోయి ఉంటుంది. బాగా వేగంగా ప్రయాణించడం వల్ల, ఆ వాహనంలో ఉండే వ్యక్తి కాలం, బయటి వ్యక్తుల కంటే మెల్లగా కదులుతుంది. ఆ వాహనంలో ప్రయాణించే వ్యక్తికి ఆ విషయం తెలియదు. అందుకు కారణం, అతడు కూడా కాలంతో ప్రయాణించడమే. ఇక కాంతి వేగం అంటే, దాదాపు ఒక సెకనుకు మూడు లక్షల కిలోమీటర్లని, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ విధంగా కాంతి వేగంతో ప్రయాణించే వాహనంలో ఉండే వ్యక్తుల కాలం, భూమిపై జరిగే కాలం కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది. అందులో ఉన్న వారికి ఆ వ్యత్యాసం తెలియదని పరిశోధకులు చెబుతున్నారు.

అదే విధంగా, మన galaxy ని దాటి ఇతర galaxy లలో ఉండే గ్రహాలకు చేరుకున్నప్పుడు, అక్కడ ఉండే gravity, మరియూ, ఆ గ్రహం రొటేటింగ్ టైం ఆధారంగా కూడా, ఆ గ్రహంపై జరిగే కాలానికీ, భూ గ్రహంపై జరిగే కాలానికీ చాలా వ్యత్యాసాలు ఉంటాయని, Einstein బలపరిచిన సాపేక్ష సిద్ధాంతం ద్వారా తెలుస్తోంది. ఈ theory ల ఆధారంగానే, మొన్నామధ్య Hollywood లో, ప్రముఖ దర్శకుడైన Christopher Nolan, ‘Interstellar’ అనే సినిమా తీశారు. ఆ సినిమాలో భూమిపై మానవ జాతి మనుగడ సంకటంలో పడే సమయానికి, కథానాయకుడు అతని బృందంతో కలిసి, మానవ మనుగడకు అనుకూలమైన గ్రహాలను వెతికే పనిలో, వేరే galaxy లో ఉన్న ఒక గ్రహానికి వెళతాడు. అలా వెళ్లిన హీరో బృందానికి, ఆ గ్రహంపై ఒక గంటసేపు గడిపితే, భూ గ్రహంపై ఏడు సంవత్సరాలు గడిచిపోతాయనే విషయం తెలుస్తుంది. ఆ విధంగా, హీరో తన Mission ని కొన్ని రోజుల్లోనే పూర్తి చేసుకుని, పలు నాటకీయ పరిణామాల మధ్య భూమికి చేరుకునేటప్పటికి, అతని వయస్సు 124 సంవత్సరాలు. అయినా తను నలభైలలో ఉన్న మనిషిలానే ఉంటాడు. తనకు ఎంతో ఇష్టమైన కూతురు మాత్రం బాగా ముసలిదయిపోయి, హాస్పిటల్ లో చావు బ్రతుకులమధ్య ఉందని తెలుసుకుంటాడు. ఈ సినిమా చూసిన వారికి, టైం చేసే మాయ ఏంటో అర్ధమవుతుంది.

కొన్ని దశాబ్దాల క్రితం Einstein బలపరిచిన సిద్ధాంతం ప్రకారం ఈ సినిమా రాగా, కొన్ని యుగాలకు పూర్వమే మన దేశంలో ఇలాంటి గాథలు జరిగినట్లు మన పురాణాలలో చెప్పబడి ఉంది. అందుకు ఒక ఉదాహరణ.. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం రైవంతకుడనే యాదవ రాజుకు, రేవతి అనే కూతురుండేది. ఆమె దాదాపు ఎనిమిదిన్నర అడుగుల ఎత్తుకు పెరిగిపోవడంతో, రేవతికి వరుడు దొరకలేదు. కొన్నేళ్ల పాటు ఆమె పెళ్లి సంబంధాల గురించి వెతికి వేసారిన రైవంతకుడు, అంత పొడవైన కూతురునిచ్చిన బ్రహ్మదేవుడినే, ఆ సమస్యకు పరిష్కారం అడగాలని నిశ్చయించుకున్నాడు. రైవంతక మహారాజు మహా తపోశక్తి సంపన్నుడు. ఇక్కడ తపోశక్తి అంటే, శాస్త్ర పరిజ్ఞానం బాగా తెలిసినవాడని అర్ధం చేసుకోవాలి. ఆయనకున్న శక్తితో, అంతరీక్షయానానికి అవసరమయ్యే వాహనాన్ని సిద్ధం చేసుకుని, కూతురు రేవతితో సహా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అతను అక్కడికి చేరే సరికి, బ్రహ్మా సరస్వతీ దేవిల ముందు గంధర్వులు నాట్యం చేయడం చూసి, కొంత సమయం వేచివున్నాడు. ఆ తంతు పూర్తయ్యాక, తన కూతురితో సహా బ్రహ్మ దేవుడి ముందుకు వెళ్లి, తన సమస్యను చెప్పుకున్నాడు. దానికి బ్రహ్మదేవుడు, అతను తన కూతురిని తనతో పాటు తీసుకువచ్చి మంచి పని చేశాడని అన్నాడు. ఎందుకంటే, అతనక్కడికి వచ్చాక, అక్కడ జరుగుతున్న గంధర్వ నాట్యం ముగిసే లోపు, భూమిపై నలభై లక్షల సంవత్సరాలు గడిచిపోయాయని చెప్పాడు. అందుకు కారణం, బ్రహ్మలోకానికీ, భూలోకానికీ జరిగే కాలంలో వ్యత్యాసాలు ఉన్నాయని తెలియజేశాడు. ఒకవేళ అతని కూతురు అక్కడే ఉండి ఉంటే, ఆ పాటికి ఎప్పుడో చనిపోయి ఉండేదనీ, రేవతి కూడా అక్కడికి రావడం వలన, ఆమె వయస్సులో ఎటువంటి మార్పూ రాలేదనీ చెప్పాడు. అతడిని బయలుదేరి భూలోకానికి వెళ్ళమని ఆదేశించాడు. ఆ సమయంలో భూమిపై బలరాముడనే యాదవ రాజు ఉన్నాడని చెప్పి, ఆయన ఎత్తు దాదాపు పదడుగులు ఉంటుంది కాబట్టి, రేవతికి తగిన వరుడతడేనని రైవంతకుడికి చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన మహారాజు, క్షణం ఆలస్యం చేయకుండా, రేవతితో కలిసి భూమిపైకి వచ్చేశాడు. అలా వచ్చిన రైవంతకుడికి, భూమిపై పరిస్థితులన్నీ మారిపోయాయని తెలిసివచ్చింది. తన వారెవరూ లేరనే విషయం తెలిసి, ఆశ్చర్యపోయాడు. బ్రహ్మ దేవుడు చెప్పినట్లు, బలరాముడి వద్దకు వెళ్లి జరిగినది చెప్పి, తన కూతురినిచ్చి వివాహం జరిపినట్లు, భాగవతంలో ప్రస్థావన వుంది.

అంతేకాదు, ప్రతి సంవత్సరం, విష్ణు మూర్తి నిద్ర నుంచి లేచే రోజును, వైకుంఠ ఏకాదశి పేరుతో పండుగగా జరుపుకునే ఆచారం మన హైందవ ధర్మంలో ఉంది. ఇలా ప్రతి సంవత్సరం, శ్రీ మహా విష్ణువు లేచి ఉన్న కాలాన్ని ఉత్తరాయణం అని అంటాము. అది ఆరు నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత దక్షిణాయన కాలం వస్తుంది. అదొక ఆరు నెలలపాటు ఉంటుంది. ఆ కాలంలో విష్ణుమూర్తి పడుకుని ఉంటాడని మన వేదాలలో ప్రస్థావించబడివుంది. ఇక్కడ ఉత్తరాయణం, దక్షిణాయన కాలాలు, వైకుంఠంలో ఒక రాత్రి, ఒక పగలుగా చెబుతారు. అంటే, ఆ లక్ష్మీనాథుడికి ఒక రోజు, మనకి ఒక సంవత్సరంగా లెక్కించబడుతుంది. ఈ విధంగా కూడా ఆ స్వామి వారు ఉండే గ్రహానికీ, మన గ్రహానికీ మధ్య కాలంలో ఉన్న తేడాలను గురించి, ఎన్నో యుగాల పూర్వమే మన వేదాలలో చెప్పబడింది. ఆ విధంగా మన మహా ఋషులకూ, యోగులకూ, కాలం ప్రయాణించే తీరూ, దాని వల్ల పరిణమించే మార్పుల వంటి అన్ని విషయాలపై, ఎంతో అవగాహన ఉన్నట్లు మనం గుర్తించాలి. సనాతన ధర్మం అంటే కేవలం నచ్చిన దేవుడిని గుడ్డిగా, మూఢ నమ్మకంతో కొలవడం కాదు. ఇది శాస్త్ర, సాంకేతిక సమాహారమనీ, ఇదో జీవన విధానమనీ ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి.

ధర్మో రక్షతి రక్షితః!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...