Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, June 24, 2024

Humbling of Thondaman's pride | తొండమాన్ గర్వభంగం!


తొండమాన్ గర్వభంగం! భవిష్యోత్తర పురాణంలోని గాధ! TELUGU VOICE
అహంకారం గర్వం ఎంత కొంచమైనా నిలువునా దహించివేస్తుంది!

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేఙ్కటేశ్వరునికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి పద్మావతీ దేవిని, కన్యాదానమిచ్చిన మహానుభావుడు, తొండమండలాధీశుడైన ఆకాశరాజు. ఆ ఆకాశరాజు సోదరుడే, తొండమానుడు. అతడు అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై, తిరుమల భవ్య మందిరమైన ‘ఆనందనిలయ’ నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వేఙ్కటపతిని సేవించుకునేది, తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే, నిత్యం స్వామితో నేరుగా సంభషణ చేసేవాడు! మరి అంతటి వాడికి గర్వభంగమా!? అసలేం జరిగిందో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/hAPcbmTx3F4 ]


అలా తొండమానుడు స్వామి వారితో అత్యంత సన్నిహితంగా మెలగుతూ, సేవలు చేసుకుంటుండగా, ఒకరోజు ఆకాశవాణి, “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుమూ నీ చేతుల మీదుగా, శ్రద్ధా భక్తులతో, అంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా” అని అన్నది. అంత వరకూ స్వామి గురించి తప్ప, మరో ఆలోచన లేని తొండమానుడు, ఆకాశవాణి మాటలు విని, “నిజమే కదా! నా వంటి భక్తుడు మరొకడు లేడు” అని అనుకున్నాడు.

అహంకారమెంత దుర్భరమైనదో కదా? చివరకు మహనీయుడైన తొండమానుడిని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకూ మూలం. అహంకారం, గర్వం ఎంత కొంచమైనా, అది ఉన్నవాడిని నిలువునా దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమ శత్రువునైనా అక్కున జేర్చుకుంటాడు. అలాంటిది, సర్వ సుగుణవంతుడు, మహాభక్తుడు అయిన తొండమానుడి పతనం జరుగనిస్తాడా? వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.

ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ, “నా వంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరు మందహాసంతో సమాధానమిచ్చి, తొండమానునికి గుణపాఠం నేర్పే నాటకానికి శ్రీకారం చుట్టాడు.

ఒకరోజు తొండమానుడు, రోజూలాగానే, ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకుని, నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుని ధ్యానించి, కలిదోష నివారణములైన శ్రీపాదాలను దర్శించాడు. శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల లాగా ప్రకాశిస్తున్నాయి, తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం! కనులు మిరుమిట్లు గొలిపే అంతటి సువర్ణకాంతులలోనూ, రాజుకు వాడిపోయి, మట్టి అంటుకుని ఉన్న కమలాలూ, తులసీ దళాలూ కనిపించాయి. “ఏమిటీ చిత్రము? వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అయినా ఈ సుమాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని సువర్ణ కమలాలతో తప్ప పూజించను కదా!” అని తర్కించుకుని, నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు.

“నాయనా! ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పల్లెలో, ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి, అందులో నా చెక్క బొమ్మ ఒకటి మలచి, అందులోనే నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎలా భావిస్తే, అలా కారుణించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు! పాపం భీముడికి మంత్ర తంత్రాలు, తపో యోగాలూ తెలియవు. త్రికరణ శుద్ధిగా, నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా, ఎప్పుడూ నా ఊసే! నా ధ్యాసే! తన కులాచారం, ధర్మం, ఎల్ల వేళలా పాటిస్తాడు. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి, తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు పూర్తిజేసుకుని, నా పేరు స్మరిస్తూ, తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే, నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా.. వారి కుటుంబమంతా అంతే.. నా మాట, నా పాట తప్ప, వారికింకేదీ రుచించదు. నేను ఆ భీమకులాలుని భక్తి పాశాలకు బందీనయిపోయాను!”

స్వామి చెప్పిన మాటలతో, విషయం తెలిసి వచ్చింది తొండమానుడికి. భాష్ప పూరిత నయనాలతో, “ప్రభూ..!” అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, “జగన్నాథా! నా తప్పును మన్నించు. నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవమెంత..? నా పై దయతో, నా బుద్ధి దోషాన్ని పోగొట్టి, నిజమైన భక్తుడిని చేశావు తండ్రీ. ఇదుగో, ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం జేసుకుని వస్తాను. నాకు సెలవు ఇప్పించండి” అని చెప్పి బయలుదేరాడు రాజు.

నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ |
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద! ||

అన్న సూక్తి ప్రకారం, భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి, తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలి నడకనే ప్రయాణము చేయాలనే నియమం ఉంది కదా! అలా రాజు భీముడి ఇల్లు చేరే సమయానికి, స్వామి భజనలతో మారు మ్రోగుతోంది భీముడి ఇల్లు. రాజు అతని పాదాలపై పడి, “అయ్యా! శ్రీ వేఙ్కటేశుని ద్వారా నీ మాహాత్మ్యాన్ని తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే, నీ భక్తిని కొనియాడాడు! నీ పాదధూళి తాకి, పునీతుడనవుదామని వచ్చాను” అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి అంతటి వాడు తన పాదలు తాకడం ఏమిటని భీముడు, వెనక్కు జరిగి చేతులు జోడించి, “రాజా! అంత పని చేయవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావులు మీరు” అని అన్నాడు.

ఇంతలో గరుడారూఢుడైన వేఙ్కటేశుడు, లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. భీముడి ఆనందానికి అంతులేకుండా పోయింది. “ఓ దయామయా! నా పూరి గుడిసెకు వచ్చారా! మీ లీలలే లీలలయ్యా.. మా తప్పులను ఎన్నక, దయావర్షం కురిపించే కాలమేఘం స్వామీ మీరు! నేను హనుమంతుని లాగా వారధి దాటి మిమ్మల్ని మెప్పించలేను.. శబరి లాగా భక్తి శ్రద్ధలు చూపి మిమ్మల్ని ఆకట్టుకోలేను.. జనకుని లాగా సీతమ్మను ఇవ్వలేను.. నారదుని లాగా, గంధర్వగానంతో మీ గుణగణాలను కీర్తించలేను.. జటాయువు లాగా మీ కోసం నా ప్రాణాలు ఇవ్వలేను.. అయినా, మిమ్మల్ని శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తులు మీరు” అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో అంటున్న మాటలను, వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి.

మహాభక్తురాలైన భీముడి భార్య తమాలిని కూడా, గద్గద స్వరంతో అమ్మను కీర్తించింది. ఆది దేవుడూ, మహాలక్ష్మీ స్వయంగా తమ యింటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదని బిడియ పడింది. అది గమనించిన శ్రీనివాసుడు, “తమాలినీ! నీ చేతులతో ఏది వండి పెట్టినా తింటానమ్మా” అని అన్నాడు. తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తనకు పెద్దల ద్వారా తెలిసినంతలో, యథా శక్తిగా, శుచిగా, తామర తూడులతో వంటకాన్ని వండి, లక్ష్మీ నారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగా, శ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే, దివ్య శరీరధారులై, వైకుంఠ ధామానికి చేరారు, భీమకులాల దంపతులు.

ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయిన తొండమానుడు, “ప్రభూ! మరి నా సంగతేమిటి?” అని ప్రాధేయ పడ్డడు. అప్పుడు జగన్నాథుడు, “రాజా! నీ తరువాతి జన్మలో, నీవు విరాగివై, నా ఏకాంత భక్తుడవవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి, తొండమానుడిని ఊరడించాడు. ఇలా తొండమానుడికీ, భీముడికీ ముక్తిని ప్రసాదించాడు భక్త సులభుడయిన శ్రీ వేఙ్కటేశ్వరుడు.

ఇక ఈ కథలోని నీతి విషయానికి వస్తే, అహంకారం, గర్వం, ఎంతటి వారికైనా, ఎంత కొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానుడికే, అహంకారం వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఎప్పుడూ వినయ విధేయతలతో మెలగాలి. కుల ధర్మం, కర్తవ్యం పాటిస్తూ, భగవంతుడిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని, ఆయన కరుణిస్తాడని నిరూపించాడు, భీముడు. కులం కన్నా, గుణం ప్రధానం అనేది మనం గమనించాలి.

ఓం నమో వేఙ్కటేశాయ!

Monday, June 17, 2024

The Journey to Hell - Story of Kathopanishad (Nachiketa) | కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి!


కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి! TELUGU VOICE
యమధర్మ రాజు నుండి అతి రహస్యమైన విద్యను ఎలా పొందాడు?

పూర్వం వాజస్రవసుడనే సత్పురుషుడుండేవాడు. గౌతమవంశసంజాతుడైన అతడు, గౌతముడు, ఔద్దాలకుడు, ఆరుణి అనే పేర్లతోకూడా ప్రసిద్ధుడు. అతడొకసారి విశ్వజిత్ యజ్ఞం చేశాడు. ఆ బృహత్ యజ్ఞం చేసినవారు, యాగం చివరలో, తమ సర్వస్వాన్నీ దానం చేసేయాలి! వాజస్రవసుడు కూడా అలాగే తనకున్నదంతా దానం చేయసాగాడు. అనాదినుంచీ భారతీయులకు పశువృక్షాదులే ముఖ్యమైన సంపదలు. అందులోనూ, గో సంపద అతి ముఖ్యమైనది. మరకత మాణిక్యాలూ, హిరణ్య రజితాలకంటే గొప్పది గో సంపద. కాబట్టి, వాజస్రవసుడు ఋత్వికులకు గోదానాలు చేయసాగాడు. వాజస్రవసుడికి, మహాబుద్ధిశాలి, గుణసంపన్నుడు, పితృభక్తి పరాయణుడైన పుత్రుడున్నాడు. అతడి పేరు నచికేతుడు. చిన్న వయస్సులోనే సకల ధర్మ శాస్త్రాలనూ అభ్యసించాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/D9Uk9VwwZTs ]


ఆ సమయంలో నచికేతుడి దృష్టి, తన తండ్రి దానమిస్తున్న గోవుల మీద పడింది. ఆ గోవులు చాలావరకూ ముసలివి, పళ్ళు లేనివి, పాలివ్వడానికీ, ప్రసవించడానికీ శక్తిలేనివని గమనించిన నచికేతుడు, ఇలా అనుకున్నాడు.. “ఎవరైతే నిస్సారమైన గోవులను దానం చేస్తారో, వారికి సద్గతులుండవని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయ్యో! మహనీయులైన మా తండ్రిగారు, విశిష్టమైన విశ్వజిత్ యజ్ఞము చేసికూడా, ఈ తామస దానము వలన పూర్ణఫలాన్ని పొందలేక పోతున్నారే” అని బాధపడి, చివరిలోనైనా తండ్రిగారికి హితవు చెబుదామని తలచి ఇలా అన్నాడు.. “తండ్రీ! ఈ యజ్ఞంలో మీకున్నవన్నీ దానం చేయాలి కదా? మరి నన్ను ఎవరికిస్తున్నారు?” అని అడిగాడు. బాలచేష్టగా భావించి, అతడి ప్రశ్నకు బదులివ్వలేదు వాజస్రవసుడు. “నన్నెవరికిస్తున్నారు నాన్నా?” అని నచికేతుడు మళ్ళీ అడిగాడు.

“సహనావవతు..” మొదలైన శాంతి మంత్రాలతో ప్రతిధ్వనిస్తున్న యాగశాలలో ఉన్న వాజస్రవసుడు, సహనం వహించాడు. తండ్రికి మహా పుణ్యాన్ని ఎలాగైనా కట్టబెట్టాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న నచికేతుడు, మూడవసారి కూడా అదే ప్రశ్న వేశాడు. ఇక సహనాన్ని కోల్పోయిన వాజస్రవసుడు, “నిన్ను యమునికిస్తాను” అని కోపంగా అన్నాడు! అలా మాట జారిన వాజస్రవసుడు, “అయ్యో! కోపంలో నేనెంత మాటన్నాను? ‘తన కోపమే తన శత్రువు’ అన్న సూక్తిని చిన్న నాటి నుంచీ వింటూ వచ్చినా, ఒక్క క్షణం సహనాన్ని కోల్పోయి, ఎంత తప్పుచేశాను!” అని బాధ పడ్డాడు.

అప్పుడు నచికేతుడు తన మనస్సులో, “దానమిచ్చేటప్పుడు, అది స్వీకరించేవారికి పనికివచ్చేదై ఉండాలి. నా వంటి సామాన్యుడు, ధర్మ ప్రభువైన యముడికి ఏ విధంగా ఉపయోగపడగలడు? అయినా, పితృవాక్య పాలనమే పుత్రుడి ధర్మం” అని అనుకుని, బాధపడుతున్న తండ్రిని చూచి ఇలా అన్నాడు.. “తండ్రీ! విచారించవద్దు. మన పూర్వీకులందరూ సత్యనిష్ఠాగరిష్ఠులు. అన్న మాట ఎన్నడూ జవదాటి ఎరుగని వారు. సత్యమే ఈ చరాచర సృష్టికి మూలాధారము. సత్యభ్రష్టుడైన వాడికి నరకం తప్పదు.. తండ్రీ! మీరు అన్న మాటను నేను సత్యము చేస్తాను. నా గురించి విచారించకండి. పండిన పంట ఎలా జీర్ణమయి పోతుందో, అదే విధంగా, పాంచ భౌతిక శరీరమూ, పుట్టి పెరిగి, మళ్ళీ ఆ పంచ భూతముల లోనే లీనమవ్వాలి.. కాబట్టి, ఈ శరీరం శాశ్వతం కాదు. సత్యమొక్కటే శాశ్వతము. సత్యమే భగవంతుడు. కనుక బాధ పడకుండా, యముడి దగ్గరకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వండి.”

ఇలా తన అమృత వాక్కులతో సుధలను కురిపించాడు నచికేతుడు. దశరథ మహారాజు ఎలా అయితే శోకతప్త హృదయంతో రాముడిని ఆడవులకు పంపాడో, అలా వాజస్రవసుడూ, బాధాతప్త హృదయంతో నచికేతుడిని యముడి దగ్గరకు పంపాడు. ఆ యమపురికి వెళ్ళే దారి అత్యంత దుర్గమమైనది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు కూడా అంత సులభంగా దాటలేని వైతరణీ నదిని, నచికేతుడు తన సత్యసంధత, పితృభక్తి ప్రభావాలతో సునాయాసంగా దాటి, యమపురికి చేరాడు. తను చేరే సమయానికి యమ ధర్మరాజు నగరంలో లేరని తెలుసుకుని, ద్వారం దగ్గరే నిరీక్షించాడు. అలా ఆ పసివాడు, మూడు రోజులు అన్నపానీయాదులు లేకుండా కాలుని కోసం నిరీక్షించాడు.

మూడు దినాల అనంతరం ధర్ముడు వచ్చాడు. మహా తేజస్సుతో అగ్నిలాగా వెలిగి పోతున్న నచికేతుడిని చూసి, “అయ్యో! తెలియక నా వలన ఎంత అపరాధం జరిగింది? ధర్మానికి రాజునైన నా ఇంటనే ఇంతటి అధర్మం జరిగినదే! ఇంట్లోని వారి వలన తప్పు జరిగినా, ఆ తప్పుకు బాధ్యత యజమానిదే! అగ్నితుల్యుడైన అతిథి ఎవరింట్లో పస్తుంటాడో, వాడి ఇష్టాపూర్తులూ, పుత్రులూ మొదలైన సంపదలు నశిస్తాయి! నిప్పును తెలిసి తాకినా, తెలియక తాకినా కాలక మానదు. అలాగే తెలిసి చేసినా, తెలియక చేసినా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించక తప్పదు. ఈ అధర్మ కార్యానికి ఫలితము నాకు రాక మానదు.

ఇప్పటికైనా ఈ అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరిస్తాను” అని నిశ్చయించుకుని, యముడు నచికేతుడి వద్దకు వెళ్ళి, “అభ్యాగతః స్వయం విష్ణుః.. కావున చిన్న వాడివైనా నీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారమును స్వీకరించు. ఇంటికి వచ్చిన అతిథి అగ్ని దేవునితో సమానుడని తెలిసి కూడా, నిన్ను మూడు రోజులు నిరీక్షింపజేసినందుకు నన్ను క్షమించు. నాకు శుభం కలిగేటట్లు ఆశీర్వదించు. మూడు రోజులు నిన్ను కష్ట పెట్టినందుకు ప్రాయశ్చిత్తంగా, నీకు మూడు వరాలను ప్రసాదిస్తాను.. కోరుకో..” అని అన్నాడు.

వంశ దీపకుడైన నచికేతుడు, ధర్మదేవతతో ఇలా అన్నాడు.. “ఓ యమధర్మరాజా! మా తండ్రిగారు ఆందోళనా రహితుడు, శాంత చిత్తుడు అయ్యేటట్లు ఆశీర్వదించండి. నేను ఇంటికి చేరిన తరువాత, ఆయన నా పై కోపమును విడచునట్లు ఆశీర్వదించండి. నాకు అగ్ని విద్యను ఉపదేశించండి” అని కోరాడు. యముడు ఆ వరములను ప్రసాదించి, మూడవ వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు నచికేతుడు, “స్వామీ! ఆత్మ శాశ్వతమని కొందరు, కాదని మరికొందరు అంటున్నారు. ఈ సందేహము తీరేటట్లు, నాకు అతి రహస్యమైన బ్రహ్మ విద్యను ఉపదేశించండి” అని ప్రార్ధించాడు.

ఆత్మవిద్యను యోగ్యత, అర్హతలున్న వారికే బోధించాలి. అనర్హులకు బోధిస్తే, అది వారికీ, సమాజానికీ హానికారకమని తెలిసిన యమధర్మరాజు, నచికేతుడు జ్ఞానోపదేశానికి అర్హుడో కాదో తెలుసుకో దలచాడు. “ఈ విద్యను నేర్చుకోవడం చాలా కష్టము. ఇంకేదైనా వరం కోరుకో. ఉత్తమ సంతానం, ఏనుగులు, గుఱ్ఱాలు, ఆవులు, సిరిసంపదలు, ఇంకా మానవులకు దుర్లభమైన భోగభాగ్యాలు ఏవైనా కోరుకో.. వెంటనే తీరుస్తాను. ఈ భూమండలాన్నంతా కోరినా ఇచ్చేస్తాను. దీర్ఘాయువు, అమరత్వము కోరుకున్నా ప్రసాదిస్తాను.. ఆత్మవిద్య తప్ప” అని ప్రలోభ పెట్ట జూశాడు కాలుడు. ధీరుడైన నచికేతుడు, ఐహికార్థాలను తృణప్రాయంగా ఎంచి, ఆత్మవిద్యను నేర్చుకోవడానికే ఉత్సుకతను చూపించాడు. నచికేతుని పట్టుదలను చూసి సంతోషించి, ప్రలోభాలకు లొంగని అతడు ఆత్మవిద్యను నేర్చుకోవడానికి అర్హుడని నిశ్చియించుకుని, అతడికి తెలియజేసిన వివరణే కఠోపనిషత్ సారము..

ఇక ఈ కథలోని నీతి విషయానికి వస్తే.. దానమిచ్చే సమయంలో, మన వద్దనున్నవాటిలో మంచివీ, గ్రహీతకు ఉపకరించేవీ మాత్రమే ఇవ్వాలని, నచికేతుడు మనకు బోధించాడు. ఇదే ఉత్తమ దానం యొక్క లక్షణము. పితృ వాక్య పాలనం, పుత్రుల ప్రథమ కర్తవ్యం. అంతేగాక, తండ్రి అడగకుండానే, అప్రియమైనా, తండ్రికి హితవు చేయాలని తపించేవాడు, ఉత్తమ పుత్రుడు. శ్రీరాముడు, భీష్మ పితామహుడు, నచికేతుడు, ఈ కోవకు చెందిన వారు. తండ్రికి పూర్ణ దాన ఫలం ఇప్పించాలన్న దృఢసంకల్పం గలవాడు, నచికేతుడు. తండ్రి అన్న మాటను నిజం చేయటానికి, తన ప్రాణాలనే తృణప్రాయంగా ఎంచి, యమపురికి బయలుదేరాడు. ఇటువంటి పితృభక్తి పరాయణులు మనకు ఆదర్శ ప్రాయులు. క్షణికావేశం మనచేత ఎంతటి తప్పునైనా చేయిస్తుంది. పసివాడి మాటలకు విసుగు చెంది, సహనం కోల్పోయిన వాజస్రవసుడు, “యమునికిస్తాను” అని నోరు జారి, తరువాత పశ్చాత్తాప పడి ఏం లాభం? కాబట్టి, ఎప్పుడూ శాంత చిత్తంతో ఉండాలి.“అభ్యాగతః స్వయం విష్ణుః” అన్న సూక్తిని మనకు తెలియజేశాడు యమధర్మరాజు. అతిథిని నిరీక్షింపచేయవలసి వచ్చిందని ఎంతో బాధపడ్డాడు. దిక్పాలకుడయి ఉండి కూడా, తనను క్షమించమని ఒక పసి బాలునితో అన్నాడు! సకల శాస్త్రాలూ తెలిసి ఉండి కూడా నచికేతుడు, తన వంటి సామాన్యుడు యమునికి ఎందుకు పనికివస్తాడని అనుకుని, వినయంతో మెలగడం మనం నేర్చుకోవాలి.

సర్వేజనాః సుఖినోభవంతు!

Monday, June 10, 2024

హిందూత్వం - 2 | Hinduism - History


హిందూత్వం - 2 (Hinduism - History) TELUGU VOICE

ఆంగ్లేయులూ, వామ‌ప‌క్షీయులూ క‌లిసి, మ‌న దేశ‌పు చ‌రిత్రను క‌ల‌గాపుల‌గం చేసి, ఏలా విప్పాలో తెలియ‌ని విధంగా పీట‌ ముడులు వేసి మ‌న‌పై వ‌దిలారు. ప్రాచీన కాలంలో మ‌న భార‌తీయ మేధావులు త‌మ గ్రంథాల‌లో, కాల నిర్ణయానికి శాలివాహ‌న శ‌కాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నారు. ఈ శ‌కం సా. శ‌. 79 మార్చి 22 న, చైత్ర మాసారంభ‌మున ప్రారంభించారు. ఈ చైత్ర మాస‌పు తొలి దిన‌మే, దైవ అహోరాత్ర యుగ‌మున‌కు ఆది క‌నుక, యుగాది అనే పేరును ఆపాదించి, దానికి చాలా విశిష్టత‌ను చేకూర్చారు. కానీ ఈ కాలంలో యువ‌త, జ‌న‌వ‌రి 1 న చూపే ఉత్సాహంలో స‌గం కూడా ఉగాది నాడు క‌నిపించ‌దు. ఇప్పుడు ఎటు చూసినా ప‌రాధీనంలో ఉన్న దౌర్భాగ్యమే క‌నిపిస్తుంది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PUzEWDiAhOw ]


గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణితో ప్రారంభించ‌బ‌డిన నాటినుండి, 1879 సంవ‌త్సర‌ములు గ‌డిచిన త‌రువాత, 1957 మార్చి 22 నుండి భార‌త ప్రభుత్వం, ఈ శాలివాహన శ‌కాన్ని అధికారికంగా కాల‌మానంగా స్వీక‌రించింది. అంటే, ఇప్పుడున్న గ్రిగేరియ‌న్ క్యాలెండ‌ర్ లోని సంవ‌త్సర‌ము నుండి, 79 తీసివేస్తే, శ‌క సంవ‌త్సరం వ‌స్తుంది. ఒక గ్రిగేరియ‌న్ తేదీకి స‌మాన‌మైన శాలివాహ‌న సంవ‌త్సర‌పు తేదీని లెక్కించాలంటే, చాలా త‌తంగాలున్నాయి. దీనిని ఒక ఉత్సాహ‌వంతుడు చేధించి వివ‌రించాడు. దాని ప్రకారం గ్రిగేరియ‌న్ తేదీ "2015, October 04, Sunday" నకు సమానమైన శాలివాహన సంవత్సరము లోని తేదీ "1937, ఆశ్వీజము 12, రవివారము అని వివ‌రించారు. ఈ శాలివాహ‌నులనే, శాత‌వాహ‌నులు అనికూడా అంటారు. మొద‌ట్లో నాగ‌జాతికి చెందిన వారి ఆధిప‌త్యం ఉండేది. ఈ నాగ మ‌రియు నాంధ్ర అనే ప‌దాలు, ప్రాచీన సాహిత్యంలో కొన్ని చోట్ల స‌మానార్థంలో వాడారు. విశ్వామిత్రుని చేత "ఏతమేవా ఆంధ్రేన పుళిందేన చాపి... అని శ‌పించ‌బ‌డిన‌ట్లు వీరిని ఉదహ‌రించి ప్రస్తావించారు. అందుచేత, వీరు బ‌హుశా ఆట‌విక జాతి అయ్యి ఉండ‌వ‌చ్చు. చ‌రిత్రకారులు కూడా దీనిని దృఢ‌ప‌రుస్తున్నారు. ఈ జాతి వారి శాలివాహ‌నుని త‌ల్లికి ఒక సాధువు, 'నీ కూమారుడు రాజ్య స్థాప‌న చేస్తాడ‌'ని జోస్యము చెప్పార‌ట‌. ఆ మాట‌ను త‌ల్లి శాలివాహ‌నునికి చెప్పగా, అత‌ను క్రమంగా ఆట‌వికత్వమున‌కు దూర‌మై, నాయ‌క‌త్వ ల‌క్షణాల‌ను పెంపోందించుకున్నాడ‌ట‌.

ఆ విధంగా రాజ్య స్థాప‌న చేసి, శాలివాహ‌న వంశ మూల‌పురుషుడు అయ్యాడ‌ని ఒక ఐహిత్యం ఉంది. ఒక రాజున‌కు వ‌చ్చిన క‌ల‌లో, పులి మీద స్వారీ చేసే బాలుడు క‌నిపించాడు. ఈ క‌ల వృత్తాంత‌మే దీనిని సూచించింది కాబోలు. మౌర్యులు వీరిని ఢీ కోని, సామంతులుగా చేసుకొన్నారన‌డానికి త‌గిన ఆధారాలు ఏమి లేవు. అందుకే, వారి ఇష్ట పూర్వకంగానే మౌర్యుల‌కు సామంతులై, విధేయ‌త చూపినందుకు గాను, వీరికి యాంధ్రభృత్యులను మాట తిర‌స్కారంగా కాక పుర‌స్కారంగా ఉద‌హ‌రించ‌బ‌డింది.

సుమారు సా.శ‌. 230 ప్రాంతంలో, మౌర్య సామ్రాజ్య ప‌త‌నం కార‌ణంగా, గ‌త్యంత‌రం లేక, శ్రీముఖ శాత‌క‌ర్ణి స్వతంత్రించి "యేకరాట్" బిరుదాంకితునిగా యాంధ్ర శాతవాహన రాజ్యస్థాపన చేసాడు. సా.శ‌. 78 నుండి సా.శ‌. 102 మ‌ధ్య కాలానికి చెందిన శాత‌వాహ‌న ప్రభువైన గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణియే, శాలివాహ‌న శ‌క ప్రారంభ‌కుడు. త‌న తాత తండ్రుల కాలంలో పోగోట్టుకున్న రాజ్యాల‌ను విడిపించుకొని, రాజ్యవిస్తర‌ణ చేసారు. క్రమ‌క్రమంగా, శ‌క, ప‌ల్లవ, క్షహ‌రాటులు మొద‌లు, అనేక రాజ్యాల‌ను జ‌యించారు. మ‌రుస‌టి చైత్రమాసం నుండి, శాలివాహ‌న శ‌కాన్ని ప్రక‌టించాడు. ఇంత‌వ‌ర‌కు మ‌న‌కు అర్థమ‌య్యే రీతిలో ఉంది. కానీ, మ‌న చ‌రిత్రకారులు దీనికి ఒక అద‌న‌పు వివ‌ర‌ణ ఇచ్చారు. శాలివాహ‌న అనే ప‌దానికి గానీ, వారి వంశానికి కానీ, ఏ సంబంధం లేని క‌నిష్కునికి, శాలివాహ‌న శ‌కంతో ముడిపెట్టారు.

చ‌రిత్రకారులు, సా.శ‌. 1913 నుండి సా.శ‌. 1960 సంవ‌త్సర‌ముల మ‌ధ్యకాలంలో, ఎన్నో స‌ద‌స్సులు పెట్టి, చాలాసార్లు కూలంక‌షంగా చ‌ర్చించినా, అమోద‌యోగ్యమైన క‌నిష్కుని కాలాన్ని క‌నిపెట్ట లేక‌పోయారు. సా.శ‌ 57, సా.శ‌ 78, సా.శ‌ 115, సా.శ‌ 128, సా.శ‌ 134, సా.శ‌ 144, సా.శ‌ 230 మరియు ఇత‌ర కాలాల్లో ఎప్పుడైనా కావోచ్చట‌..? ఒక మానవునికి ఇన్ని జన్మదినాలుంటాయా? చివ‌ర‌గా 2001 లో, Harry Falk అనే అత‌ను, క‌నిష్కుని య‌వ్వన జాత‌కంలో ఉన్న ఒక ప్రస్తావ‌నను బ‌ట్టి, అత‌ని రాజ్యపాల‌న, సా.శ 127 గా తేల్చిచెప్పాడు. ప్రస్తుతం జ‌రుగుతున్న ప‌ద్దతి ప్రకారం, అన్ని తేదీల‌నూ ఒక ప‌ట్టిక‌లో వేసి, ఆ తేదీల‌కు కొత్త ఆధారాలు దొరికిన‌ప్పుడ‌ల్లా, ఆ గ‌డుల‌లో మార్కులు వేయ‌డం జ‌రుగుతుంది. ఇంత‌క‌న్నా విచిత్రమేమిటంటే, క‌నిష్కుని పేరుతోనే కుషాను శ‌క‌మ‌ని మ‌రోక శ‌కం కూడా ఉంది. దాని మొద‌టి  సంవ‌త్సర‌ము, సా.శ 227. క‌నిష్కుడొక్కడే, శాలివాహ‌న శ‌కాన్నీ, కుషాను శ‌కాన్నీ స్థాపించ‌డం ఏ విధంగా సాధ్యం?

శాత‌వాహ‌నుల చ‌రిత్రలో ఒక అపూర్వమైన ర‌హ‌స్యం ఇమిడి ఉంది. మొద‌ట్లో వీరు సామాన్య స్థితిని అనుభ‌వించారు. ఆ త‌రువాత రాజ్య స్థాప‌న చేసి, క్షత్రియులుగా మారారు. కానీ, కొంద‌రు చ‌రిత్రకారులు సాధ్వహ‌ణుల‌ను పేరుతో, వైశ్య వ‌ర్ణము వార‌ని వాదిస్తున్నారు. శ్రీముఖ శాత‌క‌ర్ణి ఒక బ్రాహ్మణుడని కూడా చెప్పారు. దానిని అంద‌రూ అంగీక‌రించారు. ఆది కాల‌మందు బ్రహ్మణులు కానివారు బ్రహ్మణులుగా ఎప్పుడు మారారు? అగ‌స్త్యుని కుంభ‌సంభ‌వుడ‌ని అంటారు. ఏ మాన‌వుడైనా కుంభ‌మునుండా పుట్టగ‌ల‌రా? బ‌హుశా కుంభ‌కారుల యందు పుట్టి, ఆయ‌న‌కు ఉన్న ఆధిక జ్ఞాన‌ముతో అంద‌రిని మెప్పించి, బ్రాహ్మణులు సైతం న‌మ‌స్కరించే స్థాయికి ఎదిగి ఉండ‌వ‌చ్చు. వారి ప్రతి భావ‌మునూ సౌంద‌ర్య భ‌రితంగా మార్చి, అలంక‌రించి చెప్పుట భార‌తీయుల జీవ‌ల‌క్షణ‌ము. వేద‌వ్యాస విర‌చిత‌మైన జ‌యేతిహాసంలో ఒక కుంభ‌ సంభ‌వుడున్నాడు. ద్రోణాచార్యుడు స్వయంగా తానే అబ్రాహ్మణ‌త్వం నుండి బ్రాహ్మణ‌త్వానికి ఎదిగాడు. కానీ, నిష్కార‌ణంగా ఏక‌ల‌వ్యుడిపై ఎలా కులాధిక్యత‌ను ప్రద‌ర్శించాడు? ఎవ‌రైనా దీనిని సాధించ‌గ‌ల‌ను, అని ఆత్మవిశ్వాస‌ముక‌లిగి ఉన్నప్పుడు, ఏ చాతుర్వర్ణములు, ఏ కుల భేద‌ములు, ఏ బ్రాహ్మణ్యము వానిని ఆప‌లేవు క‌దా. శాత‌వాహ‌నులు అది సాధించారు. అది మాత్రమే కాక, స‌నాత‌న ధ‌ర్మమునూ ద్రవిడ సంప్రదాయ‌మునూ క‌లిపి, మొత్తం భార‌త‌దేశంలో ఏక‌త్వాన్ని సాధించారు.

ఈ శాలివాహ‌న శ‌కానికి ముందు, విక్రమ శ‌క‌మును బ‌ట్టి కాల‌నిర్ణయ‌ము చేసేవారు. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి, త‌న విజ‌య యాత్రలో గెలిచిన ఉజ్జయిని ప్రభువైన విక్రమార్కుడే, ఈ విక్రమ శ‌క స్థాప‌కుడు. ఈ శ‌కము సా.శ‌.పూ 57 నుండి సాగుతుంది. య‌జ్ఞశ్రీ శాత‌క‌ర్ణి ఉజ్జయిని పై విజ‌యం సాధించేవ‌ర‌కు ఉన్న కాలంలో ర‌చించ‌బ‌డిన గ్రంధాల‌లో ఇది చెప్పబ‌డింది. ఇప్పటి నేపాల దేశంలో, ఇదే అధికారిక కాల‌మానం. కానీ, మ‌న చ‌రిత్రకారుల‌కు ఉజ్జయిని రాజ్యాన్ని ఏలిన విక్రమ‌మార్కుని జాడ క‌నిపించ‌లేదు. ఇదేం చోద్యమో..

అనామ‌కుడయిన రాజు, శ‌క స్థాప‌కుడు కాలేరు క‌దా? మ‌రి శ‌క స్థాప‌కుడు వాస్తవ ప్రపంచంలో లేర‌న‌డం, ఏ విధంగా స‌మంజ‌సం? అత‌డు దొర‌క‌క‌పోవ‌డం వ‌ల్లనే ఈ శ‌కానికి క‌ర్తగా, గుప్త వంశ‌పు చంద్రగుప్త విక్రమాదిత్యుని తెచ్చి పెట్టారు. ఇత‌ని కాలం, సా.శ 375 నుండి, సా.శ 415 వ‌ర‌కు ఉంది.  ఏ ప్రభువైనా త‌న కీర్తినిబ‌ట్టి శ‌క‌మును స్థాపించాల‌నుకున్నప్పుడు, అన్ని సంవ‌త్సర‌ములు వెన‌క‌నుండి ప్రారంభించ‌డం ఏ విధంగా స‌రియైన‌ది? ఈ శ‌కాన్ని ముందు కృత‌శ‌క‌మ‌నీ, త‌రువాత మాల్వేశ‌ శ‌క‌మ‌నీ పిలిచారు. త‌రువాత సా.పూ. 57 నుండి, విక్రమార్కుని ప్రాభ‌వాన్నిబ‌ట్టి, విక్రమ శ‌క‌మ‌ని పొందుప‌రిచారు.

మ‌హాక‌వి కాళిదాసు జ్యోతిర్విద్యాభ‌ర‌ణం అనే కావ్యాన్ని ర‌చించి, అందులోని ప్రధ‌మాధ్యాయంలో, క‌లియుగం ప్రారంబ‌మై 3,045 సంవ‌త్సరాలు గ‌డిచిన త‌రువాత, విక్రమ శ‌కం ప్రారంభ‌మ‌య్యింద‌ని ప్రస్తావించారు. క‌లియుగ ప్రారంభం సా.శ‌. పూ. 3102 అని ఖ‌చ్చితంగా తెలిసింది క‌నుక, దానిని బ‌ట్టి లెక్కిస్తే సా.శ. 57 నుండి విక్రమ శ‌కం మొద‌ల‌య్యింద‌ని నిర్ధారించ‌వ‌చ్చు. మ‌రియు విక్రమార్కుడు వాస్తవ ప్రపంచంలో లేడ‌ని చెప్పడం దుర్మార్గమే కాక, ఈ కాళిదాసు మ‌హాక‌విని కూడా గుప్త వంశ‌పు చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలానికి జ‌రిపారు. కానీ, అదే జ్యోతిర్విద్యాభ‌ర‌ణ కావ్యంలోని గ్రంధ ర‌చనా కాలాన్ని, క‌లి ప్రారంభ‌మైన త‌రువాత 5.067 అని చెప్పుకున్నారు. ఈ సంవ‌త్సరం విక్రమ శ‌కారంభ‌ము. త‌రువాత వ‌చ్చే సా.శ‌.పూ. 35 తో స‌రిపోతుంది. మ‌రి విక్రమార్కుని ఉనికిని గ‌ల సాక్ష్యాల‌ను క‌నిపెట్టటం మాని, ఈ ఎగ‌లాగుడు దిగ‌లాగుడు వ్యవ‌హారాలేంటో మ‌రి? అందుకే పెద్దలు.. ‘నాయ‌నా, ప‌రిధిని దాటిన జ్ఞాన‌ము శిరోభార హేతువు. క‌నిపించిన ప్రతిదానికీ ప్రశ్నలు సంధించ‌కురా...’ అని ప‌దే ప‌దే చెప్పేవారు.

మా తాత ఎడ్ల బండి మీద తిరిగారు. నేను కూడా ఎడ్ల బండి మీద జ‌ర్మనీకి పోతాను. అనుకోవ‌డ‌మే భార‌తీయ సంస్కృత‌ని, హిందువుల‌ను వెక్కిరించే వారికి, వారి దేశంలోనే ఉన్న 14 విశ్వ విద్యాల‌యాల్లో, మ‌న సంస్కృత భాష‌ను బోధిస్తున్నార‌ని తెలియ‌దేమో మ‌రి... ఈ థాయిలాండ్ వారు ఏ దేశాన్ని చూసి, ‘మ‌న’ దేశం క‌న్నా గొప్పదని లొట్టలు వేస్తున్నారో, ఆ దేశంలో గ‌ల ప‌రిశోధ‌క‌లు, మ‌న భార‌త‌య విజ్ఞాన శాస్త్ర ప్రతిభ‌కు త‌లొగ్గిన సంగ‌తి ఇంకా తెలుసుకోలేదేమో.. సూర్యుని అఖండ తేజోమ‌య‌మైన కాంతిని ఒక గ్రుడ్డివాడు చూడ‌లేడు క‌దా.... స్వతంత్ర భార‌తావ‌నిలో మొద‌టి ప్రధాని హైంద‌వ ధ‌ర్మ ద్వేషి అవ్వడం వ‌ల్లే, ఇక్కడి విశ్వవిద్యాల‌యాల్లో ఉన్నవారు, కోతి మూక‌లా అడ్డూ అదుపూ లేకుండా చేల‌రేగి పోతున్నారు. ఇప్పటికి వారి ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డింది. హిందువులు ఇంత‌కు ముందు వారివ‌లె లేరు. వీరు క‌క్కిన హైంద‌వ ద్వేషం యెక్క నిజ‌రూపాన్ని తెలుసుకుని, వారి వ‌ల్ల ఈ నాటికి హిందువులు జాగ్రత్త ప‌డ్డారు.

ఏ ప్రజ‌లూ త‌మ దేశానికి చేయ‌ని అప‌కారాన్ని, భార‌త దేశ‌పు వామ‌ప‌క్షాలు చేశాయి. ముఖ్యంగా, మ‌న దేశ చ‌రిత్రను ఏం ఆశించి వ‌క్రీక‌రించారు? మ‌న దేశానికి సంబంధించి ప్రతీదీ చెత్తగానే భావించారు. మ‌న దేశాన్ని ఆక్రమించి, మ‌న ద‌గ్గర నెల‌కొని ఉన్న శాంతిని ధ్వంసం చేసిన విదేశీయులు జ‌గ‌దేక‌వీరులా? మ‌న దేశ‌పు రాజులు శివాజీ మ‌హారాజ్ మెద‌లుకొని, మ‌హారాణా ప్రతాప్ వ‌ర‌కు ఎవ్వరైనా క్రూరులే. బాబ‌రు నుండి ఔరంగ జేబు వ‌ర‌కు ఉన్న వారు మాత్రమే ధ‌ర్మ ప్రభువులుగా క‌నిపించారా? వీరు మ‌న దేశానికి రాక‌పోతే, మ‌న‌కు చాలా న‌ష్టము వాటిల్లేదనే భావ‌న‌లో ఉన్నారు. ఏంటి ఈ పైత్యకారి సిద్ధాంతాలు? మ‌న ఆచార వ్యవ‌హారాల‌న్నీ అనాగ‌రిక‌ములే అని, విదేశీయుల సిద్దాంతాల‌ను మ‌న‌పై రుద్దమ‌ని ప్రక‌టించిన వాడూ, వ్యభిచారీ, లౌకిక‌త్వముతో అగ్రగ‌ణ్యుడైన వాడూ, పండితుడ‌య్యాడు. అత‌ని త‌ప్పుల‌నూ, వీరి అబ‌ద్దముల‌ను బ‌య‌ట‌పెడితే, అది లౌకిక‌త‌త్వమున‌కు విరుద్దమ‌ట. ఇదేం చోద్యమో...

🚩 జై శ్రీ కృష్ణ 🙏

Link: https://www.youtube.com/post/UgkxNkF7ZHn7e05R2t5qeV8xkn377PNPQkla

Monday, June 3, 2024

హిందూత్వం - 1 - Science and Hinduism


హిందూత్వం - 1 TELUGU VOICE

మ‌నం కాలాన్ని ఏ విధంగా కొలుస్తాము?.. భూమి మీద ఒక ప్రామాణిక దూర‌ములోగల బిందువుల‌ను తీసుకుని, ఆ రెండు బిందువుల‌నూ, నిర్దేశిత వేగంతో చేరే స‌మ‌యాన్నీ, కాలాన్నీ, ఒక ప్రమాణంగా తీసుకోవ‌డం జ‌రుగుతుంది. అంతేక‌దా.. మ‌రి మీరు దూరాన్ని ఏ విధంగా కొలుస్తారు? అని అడిగితే దానికి  స‌మాధానం, ఇంత‌కు ముందు చెప్పిన విధానాన్నే చెప్పవ‌ల‌సి వ‌స్తుంది. ఏ విధంగా అంటే, ఒక రెండు బిందువుల‌ను తీసుకుంటే, మీరు ఒకే స‌మ‌యంలో, రెండు బిందువుల వ‌ద్దా ఉండ‌లేరు గ‌నుక, మొద‌టి బిందువు నుండి ఒక ప్రామాణిక వేగంతో, ప్రామాణిక కాలంలో, రెండ‌వ బిందువు చేర‌గ‌లిగితే, దానిని దూర‌ము అంటాం.. ఇలా ఈ రెండూ ఒక దానితో ఒక‌టి ముడిప‌డి, ఈ కాల‌ము, విశ్వముతో ఉన్న సంబంధాన్ని మ‌నకు తెల‌య‌జేస్తుంది. ఈ విష‌యాన్ని ఐన్స్టీన్ మ‌హ‌శ‌యుడు సాపేక్షతా సిద్ధాంత రూపంలో తెలియ‌ప‌రిచారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/HAU_0e-RybQ ]


నిన్న మొన్నటి వ‌ర‌కూ వీదేశీయుల కాల‌గ‌మ‌నం ప్రకారం, సెక‌ను, నిమిష‌ము, గంట‌, దిన‌ము, వార‌ము, మాస‌ము, ఋతువు, సంవ‌త్సరం మాత్రమే ఉండేవి. సంవ‌త్సర‌ములు, అంటే, కేవ‌లం అంకెలు మాత్రమే .. ర‌శ్మ్యుద్గార‌క‌త‌, ప‌ర‌మాణు విచ్చిత్తి వంటివి జ‌రిగిన త‌రువాతే, వారు మైక్రొ సెక‌ను పై దృష్టి పెట్టారు. కానీ, ప్రాచీన వైదిక కాలంలోనే, మ‌న భార‌తీయులు, కాల‌గ‌ణ‌నాన్ని ప‌ర‌మాణువు నుండి మొద‌లు పెట్టి, మ‌హా యుగాల వ‌ర‌కు విస్తరించి ఉన్నారు. విదేశీయుల కాల‌గ‌ణ‌న‌ము ప్రకారం, 26 మైక్రొ సెక‌న్లకు స‌మాన‌మైన‌ది ఒక ప‌ర‌మాణువు.. రెండు ప‌ర‌మాణువులు ఒక అణువు, మూడు అణువులు ఒక త్రస‌రేణువు, మూడు త్రస‌రేణువులు క‌లిపి ఒక తృటి, వంద తృటులు క‌లిస్తే ఒక వేధ‌, మూడు వేధ‌లు ఒక ల‌వ‌ము, మూడు ల‌వ‌ములు క‌లిపి, ఒక నిమిష‌మవుతుంది. ఆ విధంగానే, మూడు నిమిష‌ములు, ఒక క్షణ‌ము, అయిదు క్షణ‌ములు ఒక కాష్ఠము, ప‌దిహేను కాష్ఠములు క‌లిపితే ఒక ల‌ఘువు, ప‌దిహేను ల‌ఘువులు క‌లిపితే ఒక దండ‌, అదే రెండు దండ‌లు అయితే, విదేశీయుల కాల‌మానం ప్రకారం, 48 నిమిష‌ముల‌కు స‌రిప‌డే ఒక ముహుర్తం. ఇలాంటి ముప్పది ముహుర్తములు కలిపి, ఒక అహోరాత్ర దినం, 30 దిన‌ములు ఒక మాస‌ము, రెండు మాస‌ములు క‌లిపి ఒక ఋతువు. మూడు ఋతువులు క‌లిసి ఒక ఆయ‌న‌ము, అదే రెండు ఆయ‌న‌ములు కలిస్తే, దేవ‌త‌ల అహోరాత్రముల‌కు స‌మాన‌మైన ఒక సంవ‌త్సర‌ము.. దేవ‌త‌ల మాస‌మున‌కు 30 దిన‌ములు. దేవ‌త‌ల సంవ‌త్సర‌ముల‌కు రెండు ఆయ‌న‌ములు మ‌రియు 12 మాస‌ములు...  దేవ‌త‌ల సంవ‌త్సర‌ముల ప్రకారం, 4,800 దివ్యవత్సర‌ములు, ఒక స‌త్య యుగం. 3,600 దివ్యవ‌త్సర‌ములు ఒక త్రేతాయుగం, 2,400 దివ్యవ‌త్సర‌ములు క‌లిపి, ఒక ద్వాప‌ర యుగం, 1,200 దివ్యవ‌త్సర‌ముల‌కు, ఒక క‌లయుగం. ఈ నాలుగు యుగ‌ములూ క‌లిపితే, మానవ సంవ‌త్సర‌ముల లెక్క ప్రకారం, 43,20,000 సంవ‌త్సరాల‌న్న మాట‌...

సూర్యు గ్రహ‌ము త‌న చుట్టు తాను తిరిగే 12,000 భ్రమ‌ణ‌ముల‌కు స‌మాన‌మైన కాలాన్ని,  ఒక మ‌హా యుగం అంటారు. 1000 మ‌హా యుగాల కాలాన్ని క‌ల్పము అంటారు. 2 క‌ల్పముల స‌మ‌యం, విధాత‌కు ఒక అహోరాత్రము. విధాత మాస‌మున‌కు 30 దిన‌ములు, విధాత సంవ‌త్సరానికి 12 మాస‌ములు. అన‌గా మ‌న లెక్క ప్రకారం 3.1104 ట్రిలియ‌న్ సంవ‌త్సర‌ములన్న మాట‌. ఇటువంటివి 50 విధాత సంవ‌త్సర‌ములు గ‌డిస్తే, ఒక ప‌రార్థము, రెండు ప‌రార్ధములు క‌లిస్తే, 311.04 ట్రిలియ‌న్ మాన‌వ సంవ‌త్సర‌ములకు స‌మాన‌ము. ఈ మ‌హా క‌ల్ప స‌మ‌యాన్ని, విధాత పూర్ణాయుర్ధాయ స‌మ‌యంగా నిర్వచించారు మ‌న పూర్వీకులు. 30,67,20,000 సౌర సంవ‌త్సర‌ముల‌కు స‌మాన‌మైన 71 మ‌హాయుగాల‌ను, ఒక మ‌న్వంత‌రం అంటారు. ప్రతి మ‌న్వంత‌రానికి, ఒక మ‌నువు శాస‌న కర్త, మ‌రియు ప్రతి రెండు మ‌న్వంత‌ర‌ముల‌కు మ‌ధ్య, కృత‌యుగ కాలంతో స‌మాన‌మైన ఒక సంధికాలం ఉంటుంది. ఈ సంధి కాలమంతా, భూమి నీటితో మునిగి ఉంటుంది. ఇంత సూక్ష్మ వివ‌ర‌ణ‌ల‌తో  కాలాన్ని వివ‌రించిన ఘ‌న‌త మ‌న పూర్వీకుల‌కు చెందుతుంది.

భార‌తీయుల సంవ‌త్సర‌ములు అంటే కేవ‌లం అంకెలు మాత్రమే కాదు. వాటికి పేర్లు నిర్దేశించారు. ప్రతి సంవ‌త్సరానికీ ఒక అధిష్టాన దేవ‌త ఉన్నారు. ప్రభ‌వ నుండి క్షయ వ‌ర‌కు గ‌ల 60 సంవ‌త్సర‌ములు కూడా గొలుసుక‌ట్టు విధంగా ఒక‌దానితో ఒకటి ముడిప‌డి ఉంది. ఈ 60 సంవత్సర‌ముల చ‌క్రములో ఒక విశేషం ఇమిడి ఉంది. శ్రద్దగా ప‌రిశీలించిన‌ట్లయితే, మ‌న‌కు అర్దమ‌వుతుంది. మొద‌టి 20 సంవ‌త్సర‌ములు శుభ‌క‌ర‌మైన, వృద్ది క‌లిగే గుణ‌మును క‌లిగి ఉంటాయి. పెరుగుట విరుగుట కొర‌కే అనే సామెత ప్రకారం, త‌దుప‌రి వ‌చ్చే 20 సంవ‌త్సర‌ములూ అభివృద్ది లేని స‌మ‌తా స్థితిని క‌లిగి ఉంటాయి. ఇక చివ‌రి 20 సంవ‌త్సర‌ములు ప్రశాంత‌త  క‌రువై  క్రమంగా అశాంతితో మిగిలి ఉంటుంది. ఈ మాన‌వ స‌మాజాన్ని చారిత్రకంగా, ఇన్ని ద‌శ‌ల‌లో చూచి, వాటికి త‌గిన పేర్లతో, ఒక చ‌క్రంగా స‌మ‌కూర్చిన వారి మేధ‌స్సుకు మ‌నం త‌లోగ్గక త‌ప్పదు.

ఈ 20 సంవ‌త్సర‌ముల‌కు మ‌రొక విశేషం కూడా ఉంది.  భార‌త‌దేశ‌మంత‌టా క‌లియ‌దిరిగి, హైంద‌వధ‌ర్మ త‌త్వాన్ని నిరూపించి, ఎన్నో లెక్కకు మించిన స‌ద్గురు పీఠ‌ముల‌ను నిర్మించి, అక్కడ జ‌రగ‌వ‌ల‌సిన ప్రతి కార్యాన్నీ వివ‌రించి, భ‌విష్యత్త్ కాలంలో కూడా వాటికి ఎటువంటి ఆటంకాలూ రాకుండా, అన్ని విధాల ఏర్పాట్లను చేసిన శ్రీ శంక‌ర భ‌గ‌వ‌త్పాదుల ఆయుర్ధాయం, 32 సంవ‌త్సర‌ములు మాత్రమే క‌దా... అందులో ఆయ‌న బాల్యాన్నీ, ఆయ‌న శక్తి అంద‌రికి స్పష్టంగా తెలిసేవ‌ర‌కూ ప‌ట్టిన స‌మ‌యాన్నీ వ‌దిలేస్తే, ఆయ‌న‌కు ఉన్న కాలం 20 ఏండ్లు మాత్రమే.. ఆంధ్రులు ఇప్పటికీ త‌మ‌కు ఆద‌ర్శ ప్రభువుగా భావించే, ఆంధ్రభోజుడ‌నే కీర్తిని సాధించిన శ్రీకృష్ణ దేవ‌రాయ‌ల ప‌రిపాల‌నా కాలం కూడా, 20 ఏండ్లే..  దీనిని బ‌ట్టి మ‌నం అర్థం చేసుకోవాల్సింది, మాన‌వ జ‌న్మను సార్థకం చేసుకోవాలంటే, వంద‌ల ఏండ్లు బ్రత‌కాల్సిన అవ‌స‌రం లేదు. 20 ఏండ్ల స‌మ‌యం స‌రిపోతుంద‌ని అర్థం అవుతుంది.

భార‌తీయ కాల‌మానం ప్రకారం ఈ విశ్వమంతా ఒక క‌ల్పము వెనుక పుట్టింది. ఆనాటి ప‌ద్మక‌ల్పము నుండి మొద‌లై, నేటికి శ్వేత వ‌రాహ క‌ల్పానికి చేరుకున్నాం. ఇప్పటికి విధాత ఆయుర్థాయం 50 ఏండ్లు పూర్తయి ప‌రార్ధమున తొలి దిన‌ము న‌డుస్తున్నది. ఆరు మ‌న్వంత‌రాలు గ‌డిచి, ఏడ‌వ‌ద‌యిన వైవ‌స్వత మ‌న్వంత‌ర‌ము సాగుతున్నది. ఈ వైవ‌స్వత మ‌న్వంత‌ర‌ములో, 28 వ మ‌హా యుగంలోని క‌లియుగంలో ఉన్నాము.

సామాన్య శ‌కం పూర్వం, 3102 లో, క‌లి ప్రారంభ‌య‌య్యింద‌ని అంద‌రి చేత నిర్ధారించ‌బ‌డింది. ఇవ‌న్నీ కూడా  ప‌నిపాట లేక, ముక్కుమూసుకొని, కార‌డ‌వుల‌లో ఆశ్రమ‌ములు క‌ట్టుకుని, ఒంట‌రి ప‌క్షులవ‌లె తిరిగే మునుల కాకిలెక్కలు కావు. ఈ నాటి ఆధునిక వైజ్ఞానిక శాస్త్రపు లెక్కల‌తో స‌రిస‌మానంగా నిరూపించ‌బ‌డి ఉన్నాయి. విష్ణు పురాణం ప్రకారం లెక్కిస్తే, ప్రస్తుత సృష్టి కాలం 4.32 బిలియ‌న్ సంవ‌త్సర‌ములు.. ఇటీవ‌లి కాలంలో ఆధునిక శాస్త్రం, భూమి వ‌య‌స్సు 4.5 బిలియ‌న్ సంవ‌త్సర‌ములు అని తెలియ‌జేసింది.  ఈ లెక్క మ‌న పురాణాల లెక్కకు ఇంచుమించు ద‌గ్గర‌గా ఉంది. తొలి ఆరు మ‌న్వంత‌రాలు, సంధి కాలంతో క‌లిపి, (6 X 71 X 43,20,000 ) + 7 X 1.728 X 106 = 1.852 ) ఇప్పటికి 1.852 బిలియ‌న్ సంవ‌త్సర‌ములు పూర్తయ్యాయి. ప్రస్తుత మన్వంతరంలో గడిచిన 27 మహాయుగముల కాలము 116.640000 మిలియన్ సంవత్సరాలు. ఇప్పటి మహాయుగంలో (1.728 X 106 + 1.296 X 106 + 8,64,000 = 3.888) 3.888 మిలియన్ సంవత్సరాలు గడిచాయి. కలి కాలం  ప్రారంభమై (3102 + 2019 = 5119) 5119 సంవత్సరములు నిండాయి. వీటన్నింటిని కలిపితే, మొత్తము (155.52 X 1012 + 1.973X109 + 0.00012053302 = 155,521,972,949,113) 155 ట్రిలియన్ సంవత్సరాల‌న్నమాట‌. మ‌హా విస్ఫోట‌నం జ‌రిగిన‌ప్పటి నుండి, పాశ్చాత్యుల లెక్క ప్రకారం, మ‌న విశ్వం యెక్క వ‌య‌స్సు 13.7 బిలియ‌న్లు మాత్రమే. కానీ, వారి లెక్క ప్రకారం, ఒక చిన్న త‌ప్పు ఉంది. ఒక విస్ఫాట‌నం జ‌రిగింది అంటే, అంత‌కుముందే దాని ప్రభావం వ్యాపించి ఉంటుంద‌ని వారు ఆలోచించ‌లేదు. వారు లెక్కించిన విలువ మొట్టమొద‌టిది కాదు. ద‌ప‌ద‌ఫాలుగా మారుతూ వ‌స్తూ ఉంది. అదే విధంగా, బావి త‌రాల‌లో మ‌రిన్ని ఆవిష్కారాల త‌ర్వాత, దాని విలువ కొంచెం అటు ఇటుగా మారి, మ‌న పూర్వీకుల లెక్కకు మ‌రింత ద‌గ్గర‌గా చేర‌వ‌చ్చు.  భూమి యొక్క గోళాకారాన్ని నిరూపించాలి అనుకున్న వారికి, అత్యంత క్రూరమైన మ‌ర‌ణ శిక్ష  విధించ‌క ముందే, మ‌న భార‌తీయ ఖ‌గోళ శాస్త్రజ్ఞులంద‌రూ ముక్త కంఠంతో దానిని నిరూపించారు. మార్కండేయ పురాణంలో, భూమి ఒక అంచున నొక్కబ‌డి ఉంద‌ని వ‌ర్ణించ‌బ‌డింది. మ‌న దేశ పూర్వీకుల శాస్త్ర విజ్ఞాన ప్రతిభ‌కు, ఇంకా ఎవ‌రైనా సాక్ష్యాల‌డిగితే, వారిని మ‌న దేశం నుండి బ‌హిష్కరించి, వారికి న‌చ్చిన దేశంలోకి వెళ్లి బ్రత‌క‌మ‌ని మ‌ర్యాద‌పూర్వకంగా పంప‌డం మంచిది.

"INCEPTION" అనే ఆంగ్ల చిత్రం మీకు సులువుగా అర్థమ‌వ్వాలంటే, భార‌తీయ విశ్వ సృష్టి వాదం తెలియాలి. ఎందుకంటే, అందులో ఉన్న క‌థ అంతా ఒక క‌ల. ఆ క‌ల‌లో మ‌రొక క‌ల‌ను క‌లిపి చిత్రిక‌రించారు. ఇదంతా బ్రహ్మసత్యం, జగన్మిధ్య అనే దానికి, బింబ‌రూపంగా అనిపిస్తుంది. ‌"MATRIX అనే మ‌రొక చిత్రంలో కూడా, న‌టీన‌టులు చెప్పే మాట‌లన్నీ, మ‌న భార‌తీయ క‌ర్మ సిద్ధాంతానికి  ప్రతిధ్వనిలా విన‌బ‌డుతుంది. మ‌న భార‌త‌దేశ‌పు సంస్కృతి వైభ‌వాన్ని, విదేశీయులు సైతం పార‌వ‌శ్యంతో కీర్తిస్తుంటే, మ‌న ప్రజ‌లు మాత్రం, మ‌న దేశ‌పు గొప్పత‌నాన్ని తెలుసుకోలేక, ఈ దేశంలో ఏముంద‌ని చిన్నచూపు చూస్తున్నారు. మ‌రి ఏ దేశ‌మైనా, ఇంత‌టి కీర్తిని సాధించి ఉంటే, క‌న్ను మిన్ను కాన‌రాక, త‌మ గోప్పలు చెప్పుకుంటూ, భూమి ఆకాశాన్ని ఏకం చేసేవారు. గురుత్వాక‌ర్షణ సిద్దాంతాన్ని తెలియ‌జేసిన మ‌హానుబావుడు,  ఐజాక్ న్యూట‌న్. కానీ,  64 శ‌తాబ్ధాల‌ క్రిత‌మే, ఋగ్వేద సంహిత‌లో ఈ ప్రపంచంలో ప్రతి వ‌స్తువూ మ‌రొక వ‌స్తువుకు ఆక‌ర్షించ‌బ‌డుతుంద‌ని స్పష్టముగా వివ‌రించి ఉంది. నేటి కాలంలో ఈ విష‌యం అంద‌రికి తెలిసినా స‌రే, గుర్తింపు ఎవరికి చెందింది. ఇంటి దొంగ‌ను ఈశ్వరుడైనా ప‌ట్టలేడు క‌దా... ఆ విధంగానే, గ‌డిచిన మ‌న చ‌రిత్ర వాస్తవాల‌ను మఱుగున ప‌డేసి, అస‌త్యాలను ప్రచారం చేసే దుష్కర్ములూ, మ‌న శ‌కక‌ర్తల ఉనికిని క‌నిపెట్టలేని ఈ అస‌మ‌ర్థులూ, మ‌న దేశపు కీర్తి ప్రతిష్ఠల కోసం పోరాడ‌డం సాద్యమ‌య్యే ప‌నేనా?

🚩 జై శ్రీ కృష్ణ 🙏
Contd.. in Part 2

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...