Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, March 4, 2024

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!


శివోహం - నేను శివుడిని! TELUGU VOICE
‘నేను శివుడిని, నేనే శివుడిని’ – అసలు శివతత్వమేమిటి?

పరమ జిజ్ఞాసువు, కారణజన్ముడైన ఒక విద్యార్థిని, ఒక ఆధ్యాత్మిక గురువు, ‘నీ వెవరివి?’ అని ప్రశ్నించాడు. ఆ విద్యార్థి సవినయంగా నమస్కరించి, ‘చిదానందరూపః శివోహం శివోహం’ అని సమాధానం ఇచ్చాడు. ఇక్కడ శివుడు అన్న పదానికి పరబ్రహ్మం అని అర్థం. మనం పరమేశ్వరుడు, శివుడు అని అర్థం చెప్పుకుంటే, సందర్భోచితంగా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ‘నేను శివుడిని, నేనే శివుడిని’ అని మనస్సులో అనుకున్నా, పైకి అన్నా, బాగానే ఉంటుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని, శివుడిలాగా ప్రవర్తిస్తే ఇంకా బాగుంటుంది. మరి ఆ శివతత్వమేమిటో ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/UafRztjHW04 ]


శివం అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభాన్ని కలిగించేవాడు. శం అంటే సుఖం. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాడు. పాలసముద్రం నుంచి హాలాహలం ఆవిర్భవించినప్పుడు, లోకాలన్నీ భయకంపితాలై, హాహాకారాలు చేస్తుంటే, శివుడు ఆ ఘోర విషాన్ని అరచేతిలోకి తీసుకుని, ఆనందంగా తాగాడు. తనకు వెలుపల ఉన్న లోకాలకూ, తనకు లోపల ఉన్న లోకాలకూ ఇబ్బంది కలగకుండా, దానిని తన కంఠ ప్రదేశంలో నిలుపుకున్నాడు. ఇక్కడ గుర్తుంచుకోవలసినది, ఇతరుల ఇబ్బందిని తొలగించడం మన పనయినట్లయితే, మనం ఆ పని చేసి తీరవలసిందే. వారికి వచ్చిన ఇబ్బందిని తీర్చవలసిందే. ఇదే శివతత్వం!

శివుడు అభిషేక ప్రియుడు. భక్తిప్రపత్తులతో ఒక్క ఉద్ధరిణెడు నీళ్లు తీసుకుని, ‘హరహర మహాదేవ!’ అంటూ శివలింగం మీద పోస్తే చాలు. ఒక్క మారేడు దళాన్ని తెచ్చి, ‘ఓం నమశ్శివాయ!’ అంటూ శివలింగం మీద ఉంచితే చాలు - శివుడు పొంగిపోతాడు. అతడి కోరికలన్నింటినీ తీరుస్తాడు. ఇక్కడ గమనించవలసినది, మన వద్దకు వచ్చిన వ్యక్తి ఎంత విలువైన వస్తువును తెచ్చాడనేది కాదు.. ఎంత ఆప్యాయతతో తెచ్చాడనేది ప్రధానం. మనం చూడవలసింది అర్థాన్ని కాదు, ఆత్మీయతనే.. ఇదీ శివతత్వం!

శివుడు రుద్రుడు. అపరిమితమైన ఆగ్రహం కలవాడు. అదే శివుడు, పరమ శాంతమూర్తి కూడా! శివుడి ఫాలనేత్రంలో భయంకరమైన అగ్ని ఉంది. తలమీద చల్లని వెన్నెలను కురిపించే చంద్రుడున్నాడు. మన్మథుడు తన మీద బాణంవేసిన సమయంలో, శివుడు కాలాగ్నిరుద్రుడయ్యాడు. తన మూడవ కన్ను తెరచి, అతణ్ని భస్మీపటలం చేశాడు. మన్మథుడి భార్య రతి దీనంగా ప్రార్థించగానే చల్లబడి, ఆమెకు పతిభిక్ష పెట్టాడు. ఇక్కడ మనం దృష్టిలో ఉంచుకోవలసినది, కోపమనేది మనిషికి చాలా సహజమైన లక్షణం. దీర్ఘక్రోధం పనికిరాదు. ఇరుగు పొరుగుకు నష్టాన్ని కలిగించే క్రోధం, అసలు పనికిరాదు. పశ్చాత్తాపం చెందినవారిని క్షమించే గుణం ఉండాలి. ఇదీ శివతత్వమే!

ఎక్కడో గగనతలంలో ఉన్న గంగానదీ ప్రవాహం, ఒక్క వూపున భూమి మీదకు దూకితే, చిన్న మట్టిముద్దలాంటి భూగోళం మొత్తం తడిసి బద్దలైపోవటం ఖాయం. అటువంటి సంకట పరిస్థితిలో భగీరథుడు, ‘త్వమేవ శరణం మమ’ అంటూ ప్రార్థిస్తే, శివుడు తన రెండు చేతులనూ నడుంమీద మోపి, రెండు పాదాలనూ కైలాస పర్వతశిల మీద స్థిరంగా పూని, గంభీరంగా నిలబడ్డాడు. ఆకాశం నుంచి ఒక్క వూపున దూకిన గంగను, తన శిరస్సు మీద భరించి, జటాజూటంలో బంధించాడు. ఒక్క పాయను వదిలి, గంగను నిదానంగా, హిమవత్పర్వతం మీదకు పంపాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసినది, మన సమక్షంలో ఏదైనా మహాప్రమాదం జరగబోతూ ఉంటే, దానిని ఆపగలిగిన సామర్థ్యం మనకుంటే, ఎట్టి పరిస్థితులలోనూ దానిని మనం ఆపవలసిందే. ఇదీ శివతత్వం!

శివుడు విభూతిరాయుడు. విభూతి అంటే ఐశ్వర్యం. అన్ని విధాలైన ఐశ్వర్యాలకూ ఆయన అధిపతి. సమస్త సంపదలకూ అధీశ్వరుడైన కుబేరుడు, ఆయనకు ప్రియమిత్రుడు. అయినప్పటికీ, శివుడు నిరాడంబరుడే! ఇక్కడ మనం పాటించవలసినది, మన ఘనత అనేది మన వ్యక్తిత్వంలో, మన ప్రవర్తనలో ఉండాలి. మన కర్తవ్య నిర్వహణలో ఉండాలి. అంతేకానీ, బాహ్యవేషధారణలో కాదనటానికి, శివుడే ఉదాహరణ, ఆదర్శం. ఇదీ శివతత్వం!

మహాన్యాసం అనే శివాభిషేకంలో, దశాంగరౌద్రీకరణం అని ఉంది. అదే విధంగా, షోడశాంగ రౌద్రీకరణం కూడా ఉంది. ఇవి మన శరీరంలోని లలాటం, నేత్రం, మొదలైన పది అవయవాల్లోనూ, శిఖ, శిరస్సు మొదలైన పదహారు అవయవాల్లోనూ, శివుడున్నాడని తెలియజేస్తున్నాయి. అంటే, మన శరీరం యావత్తూ, శివస్వరూపమేనన్నమాట. మన శరీరం ఇంత పవిత్రమైనదీ, విలువైనదీ కనుక, దీనిని మనం సత్కార్యాల కోసమే వినియోగించాలని, దీని అంతరార్థం. ‘శివోహం - నేను శివుడిని, నేనే శివుడిని’ అనే మాటకు అసలైన అర్థమిదే!

చిదానందరూపః శివోహం శివోహం!

Sunday, March 3, 2024

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని! - ‘నేను శివుడిని, నేనే శివుడిని’ – అసలు శివతత్వమేమిటి? | TELUGU VOICE

https://youtu.be/UafRztjHW04?si=7AeN4Z9brur793Ek


maheedhar planet leaf, m planet leaf, Telugu Videos, mpl, interesting facts in telugu, telugu facts, amazing facts in telugu, shivoham shivoham, voice of maheedhar, facts in telugu, శివోహం, I am Shiva, Aham Shivam Ayam Shivam, నేను శివుడిని, nirvana, nirvana shatakam, ultimate reality, manchi matalu, garuda purana, kathopanishad, shiva gita, shivoham full video, shivoham adipurush, ps2 shivoham, shivoham ps2, shivoham video, shivoham promo, chidananda roopah shivoham, sivoham

Monday, February 26, 2024

Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు


మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు TELUGU VOICE
మనం పుట్టింది ఎందుకు? చేస్తున్నదేమిటి? అసలు చేయాల్సిందేమిటి?

పుట్టిన ప్రతి జీవీ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. భగవంతుడు నిర్ణయించిన జనన మరణ చక్రంలో, ఆత్మ నిరంతర ప్రయాణం అనివార్యం. ఇది ఎవ్వరూ విస్మరించకూడని సత్యం. మన పురాణాల ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, తన శరీరాన్నీ, కుటుంబ సభ్యులనూ చూసి విచారిస్తుంది. ఆ తరువాత ఇహలోక బంధాలను వీడి, తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరణించిన తర్వాత ఆత్మలు మళ్ళీ మరో జన్మ తీసుకునే దాకా, ఒక్కోసారి ఈ క్రమంలో, కొన్ని వందల సంవత్సరాల తరువాత మళ్ళీ జన్మనెత్తుతాయి. మరి అటువంటి ఆత్మలు ఆ సమయంలో ఏం చేస్తాయి, ఎక్కడ ఉంటాయి? అనేది, చాలా మందికి కలిగే సందేహం! ఇటువంటి విషయాలు కొంత భయాన్ని కలిగించడం సహజమే.. కానీ, ఇటువంటి విషయాలే, మన జీవితాలను స్వార్ధపూరితం కాకుండా కాపాడి, సన్మార్గంలో నడిపించడానికి దోహద పడతాయి. ఈ మధ్య కొంతమంది టైటిల్ ను మాత్రమే చూసి కామెంట్ చేయడం, చిన్న చిన్న పొరపట్లను ఎత్తి చూపడం గమనించాను. దీని వలన అందరూ సన్మార్గ జీవనాన్ని అవలంభించాలనే సదుద్దేశం మరుగునపడి, నా ప్రయాస వ్యర్ధమైపోతుంది. అందరికీ మనస్ఫూర్తిగా నేను చేసుకునే విన్నపం, ప్రార్ధన.. వీడియోలో దొర్లే అచ్చుతప్పులను మన్నించి, చివరిదాకా చూసి, విషయాన్ని ఆకళింపుచేసుకుని, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/18lDmSF9Z2M ]


ఈ భూమి మీది కాలగణనను అనుసరించి, 24 గంటలను ఒక రోజుగా పరిగణించే విషయం తెలిసిందే. చనిపోయిన వారు, అంటే పితరులు నివసించేది, పితృలోకం. వీరికి శుక్ల పక్షం అంటే, 15 రోజుల కాలం ఒక పగలు కాగా, కృష్ణ పక్షం అంటే, మరో 15 రోజులు ఒక రాత్రి. వెరసి మనుషులు గడిపే ఒక మాసం, పితరులకు ఒక రోజుతో సమానం. పుట్టిన ప్రతి ప్రాణీ, ముందుగా ఈ పితరుల లోకాన్ని చేరి, అక్కడ తమ వారసులు తమకు జరిపే కర్మకాండలనూ, వాటి ఫలితాలనూ అనుభవిస్తుంది. ఇక అటుపైన ఉండేది, దేవలోకం. భూమి మీద మనుష్యుల లెక్కన ఆరునెలలకు ఉత్తరాయణం, మరో ఆరునెలలకు దక్షిణాయనంగా చెప్పబడుతుంది. మనం గడిపే ఈ పన్నెండు నెలలు, దేవలోకంలో ఉండేవారికి ఒక రోజుతో సమానం. అంటే, ఒక పగలు, ఒక రాత్రి అన్నమాట. పుణ్య కర్మలు చేసిన వారికి మరణానంతరం, దేవలోకం దక్కుతుంది. వారు చేసుకున్న కర్మ ఫలితానుసారం, అక్కడ స్వేచ్ఛగా, సుఖ సంతోషాలతో, ఆట పాటలతో, విందు భోజనాలతో, విలాసవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవించి ఉండగా వారు సంపాదించుకున్న కర్మఫలాలు పరిపక్వం చెందగానే, అంటే, మన లెక్కలో, ఖర్చులకు మనం తెచ్చుకున్న పుణ్యఫలం అనే డబ్బు అయిపోగానే, తిరిగి భూలోకంలో మంచి స్థితిమంతులూ, ఆచారవంతుల ఇళ్ళలో పుట్టిస్తాడు, కర్మ, కాలంగా చెప్పుకునే విధాత. తిరిగి ఈ జన్మలో కూడా పుణ్య కార్యాలనూ, నిత్య దైవ నామ స్మరణనూ ఆచరిస్తే, దివ్యదేహధారులై, దివ్యలోకాలకు చేరుతాయి జీవాత్మలు. ప్రతి మనిషీ ప్రయత్నించవలసినది ఈ గమ్యం చెరడానికే..

ఇక పాపకర్మలచేత మూటగట్టుకున్న పాపధనంతో నరకలోక యాత్ర అయిపోగానే, వారిని క్రమికీటకాలుగానూ, కౄరజన్ములుగానూ, లేదా వారు ఇదివరకూ ఎవరినైతే హింసపెట్టారో, తిరిగి వారి చేతుల్లోనే, అంతకు పదిరెట్లు హింస పొందే విధంగా, కాలం, కాలపురుషుడిగా చెప్పుకునే యముడు, అత్యంత కఠోరమైన శిక్షలను విధింపజేస్తాడు. ఇక్కడ మనం గుర్తుంచుకో వలసిన విషయం, పుణ్యాత్ములకైనా, పాపాత్ములకైనా కర్మఫలాలను ఖరారు చేసేది, కేవలం వారి కర్మలే. వాటిని మనచేత అనుభవింపజేసిది, కాలమే. ఇది ఖచ్ఛితమైన విధానంలో ఉంటుందని, పురాణ విదితం.

ఇక కాలం తీరకుండా బలవన్మరణం పొందిన వారు, అంటే, ఆత్మ హత్యలవంటివి చేసుకున్న వారి ఆత్మలు పిశాచాలై, చెట్లనూ, గుహలనూ, శిధిలాలనూ ఆవాసంగా చేసుకుని, కాలం పిలుపు అందేవరకూ అలాగే, భూమి మీదే నకారాత్మక శక్తులుగా తిరుగుతుంటారు. మరికొన్ని ప్రేతాత్మలు, వారి ఆత్మీయుల శాప వచనాలతో, మరింత కాలం ఈ భూమి మీదే అదృశ్యరూపంలో తిరుగుతూ, భూత, రాక్షస రూపాలతో, రాత్రి రెండు ఝూములు దాటిన తర్వాత, కొన్ని ప్రాణులకూ, కొంతమంది మానవులకూ హాని కలిగిస్తూ మరి కొన్ని కర్మ ఫలాలను మూటగట్టుకుంటూ ఉంటాయి..

ఇక మరణం తరువాత ఏమిటనే విషయానికి వస్తే, మనం మనకు ఈ స్థూలశరీరం ఉన్నంతవరకూ, దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా, నేను ఇంకా బ్రతికే ఉంటానని అనుకుంటూ, కాలయాపన చేస్తూ ఉండిపోతాము. కొందరయితే, ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందనీ, మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకు వెళ్లి ఉంటారనీ, ఇలా ఎన్నెన్నో ఊహాగానాలు చేస్తూ ఉంటారు. కానీ, నిజంగా ఏం జరుగుతుందని మాత్రం, ఎవ్వరికీ తెలియదు. మరణం తరువాత ఏమిటన్న ఈ సందేహానికి జవాబు, "కఠోపనిషత్తు" లో స్పష్టంగా తెలియజేయబడింది.

కఠోపనిషత్తులో ప్రస్థావించబడిన నచికేతుడు, యమధర్మరాజును మూడు వరాలడిగాడు. వాటిలో ఒకటి, మరణం తరువాత ఏం జరుగుతుందనేది..! అప్పుడు యమధర్మరాజు నచికేతుడితో, అది చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి, అది కాక ఇంకేదైనా వరం కోరుకోమని అన్నాడు. కానీ, నచికేతుడు పట్టుబట్టి, తనకు మృత్యువు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందన్నాడు. అప్పుడు యమధర్మరాజు నచికేతుడికి, సనాతనమయిన బ్రహ్మాన్ని గురించీ, చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందనే విషయాలను గురించీ చెప్పడానికి అంగీకరించాడు. యమధర్మరాజు చెప్పినట్లు, ఇది చాలా సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుండీ, భౌతిక పరమైన పనులలో తలమునకలై, కాలం వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే, తను ఏం సాధించాలి? తానెందుకు పుట్టాడు? అని మాత్రం ఆలోచించడు. మంచి జీవితం, అందమైన భార్యా పిల్లలు, వారి పోషణ, ఆస్తిపాస్తుల సముపార్జన, వీటితోనే సతమతమవుతూ, తాను ఎందుకు పుట్టాడో తెలుసుకునేంత తీరిక కూడా లేకుండా గడిపేస్తాడు. కానీ, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతి జీవినీ ఎదో ఒక రోజు మృత్యువు పలుకరించక మానదు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా సంభవించే ఈ కఠోర సత్యాన్ని గమనించే పరిస్థితులలోనూ ఉండము.

తల్లి గర్భం నుండి బయట పడేటప్పుడు, వెంట తెచ్చుకున్న పాప పుణ్యాలను నిర్మూలించుకుంటే, ఆత్మ పరమాత్మునిలో ఐక్యమవుతుంది. లేకపోతే, కర్మల అనుసారంగా ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు చేసి వుంటే స్వర్గానికీ, లేక దుష్కర్మలు చేసి వుంటే నరకానికీ వెళుతుంది. ఈ ప్రక్రియ అనివార్యం. ఒకవేళ శరీరంతో ఉన్నప్పుడు, భగవద్ జ్ఞానాన్ని గ్రహించి, కొద్దోగొప్పో తెలుసుకుని వుంటే, మరల మనిషి జన్మ లభిస్తుందనే విషయంలో, ఎటువంటి సందేహం లేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జుడికి వివరించాడు. అట్లా కాక, సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి, మనస్సునూ బుద్దినీ అదుపులో వుంచుకుని, యోగాన్ని అవలంభించి, అన్ని కర్మలనూ తొలగించుకుని విముక్తుడయితే, అతడి ఆత్మ ఆ పరంధామునిలో ఐక్యమౌతుంది. కానీ, మన కర్మలన్నీ నశించిపోయాయో లేదో మనకు తెలియదు. కాబట్టి, మనం ఈ స్థూల శరీరాన్ని ధరించి ఉండగానే ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే, మనకు మరల జన్మలు రావని నిశ్చింతగా ఉండాలంటే, దానికి మనం చేయవలసిన పని, ధ్యాన సాధన. ధ్యానం చేసి, ఆ భగవంతుడిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మార్గము. అప్పుడు మనకు తెలియని విషయమంటూ, ఈ లోకంలో ఏదీ ఉండదు. మన గురించీ, దేవుడి గురించీ, ఈ ప్రకృతి గురించీ, అసలు మనుష్యులను ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సును గురించీ, మనకుండే ప్రతి సందేహమూ తీరిపోతుంది. మనస్సనేదే లేదనే విషయం తేటతెల్లమై, అది ఒక భ్రమ అని తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే, అందరూ చేయవలసిన పని, ఆ పరమాత్మను హృదయంలో దర్శించుకోవడమే. ఈ విధంగా మరణించిన తరువాత, వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి, మరు జన్మ అనేది, వారి మీదనే ఆధారపడి వుంటుంది.

పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ।
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ।।

మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భమున శయనిస్తూ, ఈ సంసారమును దాటలేక, నానా బాధలకూ గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము.

ఈ సంసార సాగరంలో చిక్కి, మాయా మొహమనే అంధకార బద్ధులమైన మనకు, పుట్టడం, చనిపోవడం, మళ్ళీ తల్లి గర్భంలో తొమ్మిది నెలల వాసమనే సుడిగుండంలో, జన్మలకు జన్మలు గడుపుతున్నాము. ఈ అపార దుఃఖ సంసార సాగారంనుండి బయటపడే మార్గం కనిపించక, శోకచిత్తులమైన మనకు, శ్రీహరి పాదారవిందములు తప్ప, వేరే మార్గం లేదు. మన ప్రయత్నంగా, అపారమైన భక్తితో శ్రీహరిని ధ్యానిస్తూ, జ్ఞాన వైరాగ్య సాధనలతో, భక్తి తత్వము తెలుసుకుని, శరణాగతితో శ్రీహరి కరుణకు పాత్రులమవ్వాలి. అంతకు మించి ఈ మాయను ఛేదించి, జనన మరణ సుడిగుండం నుండి బయటపడే వేరే మార్గమే లేదు. జ్ఞాన వైరాగ్యములు తత్వ సాధనకు సరియైన మార్గాన్ని తెలుపుతాయి. కానీ, వాటి వలన మాత్రమే మోక్ష ప్రాప్తి చేకూరదు. మోక్ష ప్రాప్తికి అవి రెండు ఉపకరణములు మాత్రమే. దానికి అనువైన సాధనము, భక్తి. శరణాగతితో కూడిన భక్తితో, భగవంతుని కరుణను పొందవచ్చు. ఇలా పరమాత్మ దయను పొందగలిగితే,  మోక్షం చాలా సులభసాధ్యమౌతుంది.

అందరూ భగవద్ తత్వాన్ని గ్రహించి, ఆయనను నిరంతరం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ, ఆ దేవదేవుడిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే, మనిషి పుట్టుక యొక్క అంతిమ లక్ష్యం.. ఇదే గమ్యం, ఇదే నిత్యం, ఇదే శాశ్వతం..

శుభం భూయాత్!

Thursday, February 22, 2024

ఖర్చులేని స్వర్గం!? Inexpensive Heaven


ఖర్చులేని స్వర్గం!? TELUGU VOICE
              
ఒక గురువు శిష్యుడితో ఇలా అన్నాడు.. “స్వర్గానికి ప్రవేశం ఉచితం.. నరకానికి వెళ్లడానికి మాత్రం బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి”.. శిష్యుడు ఆశ్చర్యపోయి, 'అదెలా?' అని అడిగాడు.

[ అంత్యకాల చింతనలే మరుజన్మను నిర్ణయిస్తాయా?: https://youtu.be/y6vublgZiQ0 ]


అప్పుడు గురువు.. "జూదం ఆడటానికీ, చెడు వ్యసనాలైన వ్యభిచారం, మత్తు పానీయాల సేవనం, ధూమ పానం, ఇలా పాపాలతో ప్రయాణించడానికి ఎంతో డబ్బు అవసరం.. కానీ, ప్రేమను పంచడానికీ, దైవ ప్రార్ధనకీ, సేవ చేయడానికీ డబ్బుతో పని లేదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అప్పుడప్పుడు ఉపవాసం ఉండడానికి డబ్బు అవసరం లేదు.. ఎదుటి వారిని క్షమించమని అడగడం కూడా ఖర్చులేని పనే.. కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి సంపదలు అవసరంలేదు.. దేవుడిపై నమ్మకం ఉండాలి.. మనపై మనకు, తోటి ప్రాణులపై ప్రేమ, విశ్వాసం ఉండాలి.." అని అన్నాడు. 

మరి గురువు చెప్పిన ప్రకారం, "డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఉచితంగా లభించే స్వర్గ ప్రాప్తిని ఇష్టపడతారా?" ఇది ఎవరికీ వారు నిర్ణయించుకోవలసిన విషయం..

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం ।
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి ।।

‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదవ శ్లోకం ఇది. సత్పురుషుల సాంగత్యం వల్ల, ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ, లేదా మోహం తొలగిపోతుంది. మోహం తొలగిపోతే, మనస్సు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతుంది (నిశ్చలతత్వం). అలా మనస్సు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతే, ఇక సమస్త కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం. జీవన్ముక్తి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

శుభం భూయాత్!

Monday, February 19, 2024

లలాట లిఖితం! ..మంచి కథ If Death Occurs in 7 days - Real Incident of Sant Eknath


లలాట లిఖితం! ..మంచి కథ TELUGU VOICE
ఇంకో వారంలో చనిపోతాడని తెలిసిన ఆ మనిషి ఏం చేశాడు? ..జీవిత సత్యాలు!

మన హిందూ పురాణాలలోనూ, చరిత్ర పుటలలోనూ మంచి కథలు అసంఖ్యాకం. వాటిలో కొన్ని మనోల్లాసానికీ, ఇంకొన్ని మనో వికాసానికీ ఉద్దేశింపబడినవయితే, మరికొన్ని సన్మార్గ జీవనానికి తోడ్పడతాయి. కారుణ్యం, దయ, పరోపకారం, త్యాగం, సత్యనిష్ఠ, నిస్వార్థత వంటి సద్గుణాలు, మానవుణ్ణి ధర్మపథం వైపుకు నడిపించి, అంతిమంగా భగవంతునికి చేరువ చేస్తాయి. అటువంటి సద్గుణాలను పెంపొందించే స్ఫూర్తిదాయక కథలలో ఒకదానిని, ఈ రోజుటి మన వీడియోలో చెప్పుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C-3v8R8fZQQ ]


మహారాష్ట్ర ప్రాంతంలో జీవించిన మహాత్ముడూ, భక్తాగ్రగణ్యులలో ఒకరు, సంత్ ఏక్‌నాథ్‌ గా ప్రసిద్ధి చెందిన ఏకనాథుడు. ఆయన ఘనతను గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఒక వ్యక్తి, ఒక రోజు ఆయనను దర్శించుకోవడానికి వచ్చాడు. ఏకనాథుడు గడుపుతున్న నిరాడంబర జీవితాన్ని చూసి, అతడు ఆశ్చర్య చకితుడయ్యాడు. ఏకనాథుడి ముఖారవిందాన ద్యోతకమవుతున్న దివ్యత్వం, తేజస్సునూ గమనించి, ఆయన పట్ల అమితంగా ఆకర్షితుడయిన అతను ఆయనతో, “స్వామీ! మీ జీవితంలో ఎంతో ప్రశాంతతను చూస్తున్నాను. ఎటువంటి ఆరాటమూ, ఆందోళనా లేకుండా, నిర్మలమైన నీటిప్రవాహంలా మీరు ఎలా మనగలుగుతున్నారో అర్ధం కావడం లేదు! నిరాడంబరతకూ, పావనతకూ మీ జీవితం అద్దంపడుతోంది. కానీ, ప్రాపంచికులమైన మేము, జీవితంలో సదా అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్నాము. ప్రశాంతత మూర్తీభవించిన మీ జీవితం ఎక్కడ? సదా అల్లకల్లోలాలతో నిండిన మా జీవితం ఎక్కడ? మన జీవన విధానాలలో హస్తిమశకాంతర వ్యత్యాసం ఉంది. సమస్యలతో మీ మనస్సు ఎన్నడూ గురయినట్లు తెలియడం లేదు. కానీ, మమ్మల్ని గందరగోళంలో ముంచెత్తే పగ, విసుగు, అహంకారం వంటి దుర్గుణాలు, సదా పట్టి పీడిస్తున్నాయి. మీలాంటి ప్రశాంతమయమైన జీవితం మాకు లభించడం సాధ్యమా? నేనూ మీలా జీవించాలని అభిలషిస్తున్నాను. అందుకు ఏమైనా తరుణోపాయం ఉంటే సెలవివ్వండి స్వామీ!” అని విన్నవించుకున్నాడు.

అతడు చెప్పినది సావధానంగా విన్న ఏకనాథుడు, క్షణం ఆలోచించి ఇలా జవాబిచ్చాడు.. “నాయనా! నువ్వు ఇప్పుడు చెప్పినదంతా అలా ఉంచు. నీ లలాట లిఖితం ఇప్పుడే గమనించాను. వెంటనే నీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. నీకు మరణ కాలం సమీపిస్తోంది. ఇంకో వారం రోజులలో నువ్వు మరణిస్తావు!” ఏకనాథుడి వంటి మహనీయుడి నోటివెంట వచ్చిన ఆ మాట వినగానే, అతడి గుండె ఝల్లుమన్నది. మరణానికి చేరువలో ఉన్నాననే చింతన అతడి మనస్సును సంపూర్ణంగా ఆక్రమించింది. ఆ కారణంగా ఆతడి మనోస్థితిలో అసాధారణమైన పెను మార్పు చోటుచేసుకుంది. ఆ పైన అతడిక ఏకనాథుడితో ఏమీ మాట్లాడలేకపోయాడు. 'అయ్యో! వారం రోజులే మిగిలి ఉన్నాయి. ఏడు రోజుల్లో నేను మరణించబోతును? అని తనలో తను గొణుక్కుంటూ, ఇంటిముఖం పట్టాడతను.

ఇంటికి వెళ్ళగానే, అనురాగం ఉట్టిపడుతుండగా, భార్యను చేరబిలిచి, ఆమెతో ఇలా అన్నాడు.. “నేను నిన్ను ఎన్నో రకాలుగా కష్టపెట్టాను. అవన్నీ తలచుకుని ఎంతగానో విచారిస్తున్నాను. నన్ను క్షమించు. ఇంకో వారం రోజులలో, నా జీవితం ముగియబోతోంది. ఇంతవరకూ అనవసరమైనవన్నీ మాట్లాడి నీ మనస్సును నొప్పించినందుకు పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నా తప్పులను మన్నించు.” అని కన్నీటి పర్యంతం భార్యతో చెప్పుకుని, తరువాత తన పిల్లలను పిలిచి, వారిని గుండెలకు హత్తుకున్నాడు. “నాయనలారా! ఇప్పటికైనా మిమ్మల్ని అక్కున చేర్చుకున్నాను. మీపై అనవసరంగా కోపించి, ఎన్నోసార్లు కొట్టాను, తిట్టాను. నా కథ ఇక వారం రోజులలో ముగిసిపోతుంది. మీ పట్ల నేను వ్యవహరించిన తీరును తలచుకుని కుమిలిపోతున్నాను. నన్ను మీరందరూ మన్నించండి” అని అన్నాడు గద్గద స్వరంతో.

తరువాతి పనిగా అతడు ఇరుగుపొరుగు, మిత్రులు, బంధువుల వద్దకు వెళ్ళి, తన మరణకాలం సమీపించినదని నిర్లిప్తంగా తెలిపి, ఇదివరలో తను ఎవరెవరితో దెబ్బలాడి గొడవపడ్డాడో, వారందరినీ కలుసుకుని, “అయ్యా! గతంలో మీ పట్ల నేను ప్రవర్తించిన తీరుతెన్నులను తలచుకుని సిగ్గుతో కుంచించుకుపోతున్నాను. ఇక వారం రోజులే నేను బతికి ఉంటాను. ఇంకో ఏడు రోజులలో నా జీవితం అస్తమించబోతోంది. మీతో గొడవ పడినందుకు నన్ను మనస్పూర్తిగా క్షమించండి” అని వారితో చెప్పాడు. ఈ విధంగా, తన అనుచిత చర్యల మూలంగా ఇబ్బందులకు గురైన వారిని కూడా పని కట్టుకుని కలుసుకుని, తన మరణకాలం గూర్చి తెలిపి, తనను క్షమించమని వారిని వేడుకున్నాడు. ఇలా రోజులు గడిచి, ఏడవ రోజు రానే వచ్చింది.

ఆశ్చర్యం! ఆ రోజు అతడి ఇంటికి ఏకనాథుడు విచ్చేశాడు. ఆయనను చూడగానే, అతడు సాష్టాంగ నమస్కారం చేసి, “స్వామీ! నా మరణకాలం వచ్చేసిందా?” అని అడిగాడు ఆతృతగా. ఆ ప్రశ్నకు ఏకనాథుడు ఇలా స్పందించాడు.. “దానిని గూర్చిన నిజం ఆ భగవంతునికే ఎరుక. అది సరే.. నిన్నొక ప్రశ్న అడగాలి. ఈ ఏడు రోజులనూ నువ్వు ఎలా గడిపావో నాకు చెప్పు. ఎందరిని తిట్టావు? ఎందరితో గొడవపడ్డావు? ఎందరి మనస్సులను నొప్పించావు? ఎందరిని అవమానించావు?” అని అడిగాడు. ఆ ప్రశ్నలు విని తెల్లమొహం వేస్తూ, అతడు ఇలా జవాబిచ్చాడు.. “స్వామీ! ఈ ఏడు రోజులూ మరణమే నా కళ్ళ ముందు తాండవించింది. ఈ స్థితిలో ఒకరిని తిట్టడమూ, మరొకరితో గొడవ పడటమా? అందుకు నాకు సమయం ఎక్కడిది? నేను గతంలో గొడవపడ్డ అందరి వద్దకూ వెళ్ళి, నా తప్పిదాన్ని పెద్ద మనస్సుతో మన్నించమని వేడుకున్నాను. మిమ్మల్ని కలుసుకుని మాట్లాడిన క్షణం నుండీ, ఈ క్షణం దాకా ఏ విధమైన గొడవల జోలికీ పోలేదు. ఈ ఏడు రోజులూ మంచిగా, ప్రయోజనకరంగా గడిపాను.” అని చెప్పాడు.

అతడు చెప్పినది విన్న తరువాత, ఏకనాథుడు ఇలా చెప్పసాగాడు.. “నాయనా! ఈ విచిత్రాన్ని గమనించావా? గత ఏడు రోజులుగా నువ్వు మరణాన్నే తలచుకుంటూ ఉండిపోయావు. ఆ కారణంగానే, మంచిగా, ఇతరులకు ప్రయోజనకరంగా జీవించావని తెలుస్తోంది. మా వంటి వారి స్థితి ఏమిటో తెలుసా? మేము మా జీవిత పర్యంతం, ప్రతి క్షణమూ, సదా, సర్వవేళలా మరణాన్నే జ్ఞప్తిలో ఉంచుకుని జీవితం గడుపుతాము. అందుకే మేము ప్రశాంతంగా జీవించగలుగుతాము. మనం ఈ దేహంలో ఎంత కాలం జీవిస్తాము? జీవితంలో ఏం జరుగబోతుందో నిశ్చయంగా తెలియదు. కానీ, మన ఈ దేహం త్వరలోనో, లేక కొంతకాలం గడిచిన తరువాతనో, ఏదో ఒక రోజు నశించి మట్టిలో కలిసి పోవడం మాత్రం తథ్యం. కనుక మనం, నశించిపోయే దేహం పట్ల అనురక్తీ, లేక అనుబంధం కలిగి ఉండకుండా, నాశ రహితమైన భగవంతుని పట్ల అనురక్తి వహించి జీవించాలి. అంటే, ఏ స్థితిలోనూ, మనం దేహానికి బానిస కాకుండా, భగవంతునికే దాసునిగా మనగలగాలి. పరుల పట్ల పగ వహించకుండా, వారి పట్ల ప్రేమను పెంచుకుని జీవించాలి. మనసా, వాచా, కర్మణల యందు ధార్మికత భాసించాలి. ఇతరుల మనస్సు నొచ్చుకునే రీతిలో ససేమిరా మాట్లాడకూడదు. మనసా, వాచా, కర్మణా, ఏ ఒక్కరినీ నొప్పించని రీతిలో, మధురంగా మాట్లాడి, నిస్స్వార్ధతతో, ప్రేమతో సేవలందించాలి.

మన వద్ద ఉన్న దానిని, ముఖం చిట్లించుకోకుండా, వికసిత వదనంతో, అవసరం ఉన్న వారికి ఇవ్వాలి. దీనిని గురించి బాగా ఆలోచించు. మన ప్రతిభా, మన దగ్గరున్న వస్తువులూ మనవి కావు. అవన్నీ భగవంతునికే సొంతం. భగవంతుడు మనలను ఒక ఉపకరణగా ఉపయోగించి, ఇతరులకు అందించడానికే, వాటిని మనకు ఇచ్చాడని తెలుసుకుని, ఇతరులకు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. భగవంతుడు, తనకు సొంతమైన వస్తువులను మన వద్ద ఉంచినప్పుడు, వాటిలో ఒక పాలు, మన వద్దకు వచ్చే ఆయన బిడ్డలకు లేదని చెప్పడానికి, మనకు ఎలాంటి హక్కూ లేదు. భగవంతునికి చెందిన వస్తువును, ఆయన బిడ్డలకే ఇవ్వ నిరాకరించడం న్యాయమా? భగవంతుని పట్ల భక్తిప్రపత్తులు చెల్లించే మనం, ఆయన బిడ్డల యెడ అభిమానం చూపక, ద్వేషించటం సబబు అనిపించుకుంటుందా? నశించిపోయే ఈ దేహాన్ని, ఇతరులకు ఉపయోగపడే కార్యకలాపాలలో వినియోగించాలి. మెరుపులా మన దేహంలోనుంచి జీవం మాయమయ్యే లోపుగా, భగవంతుని ప్రాప్తించుకోగోరిన ఏ కొద్దిమందికో, ఏ విధంగానైనా దోహదపడగలిగితే, అది ఎంత ఘనతరం! నీటి బుడగ వంటి దేహంతో కూడిన జీవితం అంతరించే లోపుగా, ఏ కొద్దిమందికైనా, ఏ కించిత్తయినా ఉపయోగ పడగలిగితే, ప్రశాంతతనూ, సాంత్వననూ అందివ్వగలిగితే, అదే స్తుతినీయం. జన్మించినప్పుడే మరణమూ నిశ్చయమై వుంటుంది. కనుక అది సంభవించే లోగా, భగవంతునికీ, లోకానికీ సేవలు చేస్తూ జీవించటమే, మన జన్మకు సార్థకత.”

ఏకనాథుడు చేసిన ఉపదేశాన్ని అతడు అమిత శద్ధగా విని, చక్కగా ఆకళింపు చేసుకుని, తన శేష జీవితంలో తు.చ. తప్పక ఆచరించి, జీవితాన్ని సార్ధకం చేసుకుని, తరించాడు.

ధర్మో రక్షతి రక్షితః

Friday, February 16, 2024

అందరికీ 'రథ సప్తమి 2025' శుభాకాంక్షలు 🙏 Ratha Sapthami


అందరికీ 'రథ సప్తమి 2024' శుభాకాంక్షలు 🙏 TELUGU VOICE

[ రథ సప్తమి చరిత్ర: https://youtu.be/RcSzefZE3ow ]


రథ సప్తమి రోజున స్నానం చేసే సమయంలో పఠించవల్సిన శ్లోకాలు: 

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః।
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే।।

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు।
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ।।

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్।
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః।।

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే।
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ।।

Wednesday, February 14, 2024

వసంత పంచమి 2026

 

అందరికీ 'వసంత పంచమి' శుభాకాంక్షలు 🙏 TELUGU VOICE

చదవుల తల్లి సరస్వతీ దేవి పుట్టిన రోజు కాబట్టి వసంత పంచమిని సరస్వతీ పంచమి అని అంటారు. జనవరి 23 2026, మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి (Vasant Panchami), శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి, స్మరించి, పూజించే రోజే వసంత పంచమి. ఆ తల్లి కటాక్షం కోసం అందరూ పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి. ఈ రోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమి అని కూడా పేర్కొంటారు.

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ।।
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।।

సరస్వతీ కటాక్షం:

* బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.
* గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో, సూర్యుని ఆరాధించగా, ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహా విద్వాంసుడయ్యాడు.
* వాల్మీకి సరస్వతీ దేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేశాడని మన పురాణాలు చెబుతున్నాయి.
* అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీ దేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడనీ ప్రతీతి.
* తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్ట కూటి కోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెబుతారు.

🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...