Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, February 26, 2024

Kathopanishad Death Indic | మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు


మరణం నుండి మరుజన్మ దాకా! ..వాస్తవాలు TELUGU VOICE
మనం పుట్టింది ఎందుకు? చేస్తున్నదేమిటి? అసలు చేయాల్సిందేమిటి?

పుట్టిన ప్రతి జీవీ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. భగవంతుడు నిర్ణయించిన జనన మరణ చక్రంలో, ఆత్మ నిరంతర ప్రయాణం అనివార్యం. ఇది ఎవ్వరూ విస్మరించకూడని సత్యం. మన పురాణాల ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, తన శరీరాన్నీ, కుటుంబ సభ్యులనూ చూసి విచారిస్తుంది. ఆ తరువాత ఇహలోక బంధాలను వీడి, తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మరణించిన తర్వాత ఆత్మలు మళ్ళీ మరో జన్మ తీసుకునే దాకా, ఒక్కోసారి ఈ క్రమంలో, కొన్ని వందల సంవత్సరాల తరువాత మళ్ళీ జన్మనెత్తుతాయి. మరి అటువంటి ఆత్మలు ఆ సమయంలో ఏం చేస్తాయి, ఎక్కడ ఉంటాయి? అనేది, చాలా మందికి కలిగే సందేహం! ఇటువంటి విషయాలు కొంత భయాన్ని కలిగించడం సహజమే.. కానీ, ఇటువంటి విషయాలే, మన జీవితాలను స్వార్ధపూరితం కాకుండా కాపాడి, సన్మార్గంలో నడిపించడానికి దోహద పడతాయి. ఈ మధ్య కొంతమంది టైటిల్ ను మాత్రమే చూసి కామెంట్ చేయడం, చిన్న చిన్న పొరపట్లను ఎత్తి చూపడం గమనించాను. దీని వలన అందరూ సన్మార్గ జీవనాన్ని అవలంభించాలనే సదుద్దేశం మరుగునపడి, నా ప్రయాస వ్యర్ధమైపోతుంది. అందరికీ మనస్ఫూర్తిగా నేను చేసుకునే విన్నపం, ప్రార్ధన.. వీడియోలో దొర్లే అచ్చుతప్పులను మన్నించి, చివరిదాకా చూసి, విషయాన్ని ఆకళింపుచేసుకుని, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/18lDmSF9Z2M ]


ఈ భూమి మీది కాలగణనను అనుసరించి, 24 గంటలను ఒక రోజుగా పరిగణించే విషయం తెలిసిందే. చనిపోయిన వారు, అంటే పితరులు నివసించేది, పితృలోకం. వీరికి శుక్ల పక్షం అంటే, 15 రోజుల కాలం ఒక పగలు కాగా, కృష్ణ పక్షం అంటే, మరో 15 రోజులు ఒక రాత్రి. వెరసి మనుషులు గడిపే ఒక మాసం, పితరులకు ఒక రోజుతో సమానం. పుట్టిన ప్రతి ప్రాణీ, ముందుగా ఈ పితరుల లోకాన్ని చేరి, అక్కడ తమ వారసులు తమకు జరిపే కర్మకాండలనూ, వాటి ఫలితాలనూ అనుభవిస్తుంది. ఇక అటుపైన ఉండేది, దేవలోకం. భూమి మీద మనుష్యుల లెక్కన ఆరునెలలకు ఉత్తరాయణం, మరో ఆరునెలలకు దక్షిణాయనంగా చెప్పబడుతుంది. మనం గడిపే ఈ పన్నెండు నెలలు, దేవలోకంలో ఉండేవారికి ఒక రోజుతో సమానం. అంటే, ఒక పగలు, ఒక రాత్రి అన్నమాట. పుణ్య కర్మలు చేసిన వారికి మరణానంతరం, దేవలోకం దక్కుతుంది. వారు చేసుకున్న కర్మ ఫలితానుసారం, అక్కడ స్వేచ్ఛగా, సుఖ సంతోషాలతో, ఆట పాటలతో, విందు భోజనాలతో, విలాసవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. జీవించి ఉండగా వారు సంపాదించుకున్న కర్మఫలాలు పరిపక్వం చెందగానే, అంటే, మన లెక్కలో, ఖర్చులకు మనం తెచ్చుకున్న పుణ్యఫలం అనే డబ్బు అయిపోగానే, తిరిగి భూలోకంలో మంచి స్థితిమంతులూ, ఆచారవంతుల ఇళ్ళలో పుట్టిస్తాడు, కర్మ, కాలంగా చెప్పుకునే విధాత. తిరిగి ఈ జన్మలో కూడా పుణ్య కార్యాలనూ, నిత్య దైవ నామ స్మరణనూ ఆచరిస్తే, దివ్యదేహధారులై, దివ్యలోకాలకు చేరుతాయి జీవాత్మలు. ప్రతి మనిషీ ప్రయత్నించవలసినది ఈ గమ్యం చెరడానికే..

ఇక పాపకర్మలచేత మూటగట్టుకున్న పాపధనంతో నరకలోక యాత్ర అయిపోగానే, వారిని క్రమికీటకాలుగానూ, కౄరజన్ములుగానూ, లేదా వారు ఇదివరకూ ఎవరినైతే హింసపెట్టారో, తిరిగి వారి చేతుల్లోనే, అంతకు పదిరెట్లు హింస పొందే విధంగా, కాలం, కాలపురుషుడిగా చెప్పుకునే యముడు, అత్యంత కఠోరమైన శిక్షలను విధింపజేస్తాడు. ఇక్కడ మనం గుర్తుంచుకో వలసిన విషయం, పుణ్యాత్ములకైనా, పాపాత్ములకైనా కర్మఫలాలను ఖరారు చేసేది, కేవలం వారి కర్మలే. వాటిని మనచేత అనుభవింపజేసిది, కాలమే. ఇది ఖచ్ఛితమైన విధానంలో ఉంటుందని, పురాణ విదితం.

ఇక కాలం తీరకుండా బలవన్మరణం పొందిన వారు, అంటే, ఆత్మ హత్యలవంటివి చేసుకున్న వారి ఆత్మలు పిశాచాలై, చెట్లనూ, గుహలనూ, శిధిలాలనూ ఆవాసంగా చేసుకుని, కాలం పిలుపు అందేవరకూ అలాగే, భూమి మీదే నకారాత్మక శక్తులుగా తిరుగుతుంటారు. మరికొన్ని ప్రేతాత్మలు, వారి ఆత్మీయుల శాప వచనాలతో, మరింత కాలం ఈ భూమి మీదే అదృశ్యరూపంలో తిరుగుతూ, భూత, రాక్షస రూపాలతో, రాత్రి రెండు ఝూములు దాటిన తర్వాత, కొన్ని ప్రాణులకూ, కొంతమంది మానవులకూ హాని కలిగిస్తూ మరి కొన్ని కర్మ ఫలాలను మూటగట్టుకుంటూ ఉంటాయి..

ఇక మరణం తరువాత ఏమిటనే విషయానికి వస్తే, మనం మనకు ఈ స్థూలశరీరం ఉన్నంతవరకూ, దాని గురించి పెద్దగా ఆలోచించము. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా, నేను ఇంకా బ్రతికే ఉంటానని అనుకుంటూ, కాలయాపన చేస్తూ ఉండిపోతాము. కొందరయితే, ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందనీ, మరికొందరు స్వర్గానికో లేక నరకానికో తీసుకు వెళ్లి ఉంటారనీ, ఇలా ఎన్నెన్నో ఊహాగానాలు చేస్తూ ఉంటారు. కానీ, నిజంగా ఏం జరుగుతుందని మాత్రం, ఎవ్వరికీ తెలియదు. మరణం తరువాత ఏమిటన్న ఈ సందేహానికి జవాబు, "కఠోపనిషత్తు" లో స్పష్టంగా తెలియజేయబడింది.

కఠోపనిషత్తులో ప్రస్థావించబడిన నచికేతుడు, యమధర్మరాజును మూడు వరాలడిగాడు. వాటిలో ఒకటి, మరణం తరువాత ఏం జరుగుతుందనేది..! అప్పుడు యమధర్మరాజు నచికేతుడితో, అది చాలా సూక్ష్మమైన విషయం కాబట్టి, అది కాక ఇంకేదైనా వరం కోరుకోమని అన్నాడు. కానీ, నచికేతుడు పట్టుబట్టి, తనకు మృత్యువు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉందన్నాడు. అప్పుడు యమధర్మరాజు నచికేతుడికి, సనాతనమయిన బ్రహ్మాన్ని గురించీ, చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుందనే విషయాలను గురించీ చెప్పడానికి అంగీకరించాడు. యమధర్మరాజు చెప్పినట్లు, ఇది చాలా సూక్ష్మమైన విషయం. మనిషి పుట్టినప్పటినుండీ, భౌతిక పరమైన పనులలో తలమునకలై, కాలం వెళ్ళదీస్తూ వుంటాడు. అయితే, తను ఏం సాధించాలి? తానెందుకు పుట్టాడు? అని మాత్రం ఆలోచించడు. మంచి జీవితం, అందమైన భార్యా పిల్లలు, వారి పోషణ, ఆస్తిపాస్తుల సముపార్జన, వీటితోనే సతమతమవుతూ, తాను ఎందుకు పుట్టాడో తెలుసుకునేంత తీరిక కూడా లేకుండా గడిపేస్తాడు. కానీ, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రతి జీవినీ ఎదో ఒక రోజు మృత్యువు పలుకరించక మానదు. ప్రతి ఒక్కరి జీవితంలో తప్పనిసరిగా సంభవించే ఈ కఠోర సత్యాన్ని గమనించే పరిస్థితులలోనూ ఉండము.

తల్లి గర్భం నుండి బయట పడేటప్పుడు, వెంట తెచ్చుకున్న పాప పుణ్యాలను నిర్మూలించుకుంటే, ఆత్మ పరమాత్మునిలో ఐక్యమవుతుంది. లేకపోతే, కర్మల అనుసారంగా ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, సత్కర్మలు చేసి వుంటే స్వర్గానికీ, లేక దుష్కర్మలు చేసి వుంటే నరకానికీ వెళుతుంది. ఈ ప్రక్రియ అనివార్యం. ఒకవేళ శరీరంతో ఉన్నప్పుడు, భగవద్ జ్ఞానాన్ని గ్రహించి, కొద్దోగొప్పో తెలుసుకుని వుంటే, మరల మనిషి జన్మ లభిస్తుందనే విషయంలో, ఎటువంటి సందేహం లేదు. ఇది స్వయంగా శ్రీ కృష్ణుడు అర్జుడికి వివరించాడు. అట్లా కాక, సంపూర్ణంగా జ్ఞానాన్ని గ్రహించి, మనస్సునూ బుద్దినీ అదుపులో వుంచుకుని, యోగాన్ని అవలంభించి, అన్ని కర్మలనూ తొలగించుకుని విముక్తుడయితే, అతడి ఆత్మ ఆ పరంధామునిలో ఐక్యమౌతుంది. కానీ, మన కర్మలన్నీ నశించిపోయాయో లేదో మనకు తెలియదు. కాబట్టి, మనం ఈ స్థూల శరీరాన్ని ధరించి ఉండగానే ముక్తిని పొందే ఒక సదవకాశం వుంది. ఆ విధంగా మనం శరీరంతో ఉండగానే, మనకు మరల జన్మలు రావని నిశ్చింతగా ఉండాలంటే, దానికి మనం చేయవలసిన పని, ధ్యాన సాధన. ధ్యానం చేసి, ఆ భగవంతుడిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే మార్గము. అప్పుడు మనకు తెలియని విషయమంటూ, ఈ లోకంలో ఏదీ ఉండదు. మన గురించీ, దేవుడి గురించీ, ఈ ప్రకృతి గురించీ, అసలు మనుష్యులను ఇంతగా మభ్య పెడుతున్న ఈ మనస్సును గురించీ, మనకుండే ప్రతి సందేహమూ తీరిపోతుంది. మనస్సనేదే లేదనే విషయం తేటతెల్లమై, అది ఒక భ్రమ అని తెలుస్తుంది. అది తెలుసుకోవాలంటే, అందరూ చేయవలసిన పని, ఆ పరమాత్మను హృదయంలో దర్శించుకోవడమే. ఈ విధంగా మరణించిన తరువాత, వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని అనుసరించి, మరు జన్మ అనేది, వారి మీదనే ఆధారపడి వుంటుంది.

పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ।
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ।।

మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భమున శయనిస్తూ, ఈ సంసారమును దాటలేక, నానా బాధలకూ గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో సంసారము నుండి తరింపజేయుము.

ఈ సంసార సాగరంలో చిక్కి, మాయా మొహమనే అంధకార బద్ధులమైన మనకు, పుట్టడం, చనిపోవడం, మళ్ళీ తల్లి గర్భంలో తొమ్మిది నెలల వాసమనే సుడిగుండంలో, జన్మలకు జన్మలు గడుపుతున్నాము. ఈ అపార దుఃఖ సంసార సాగారంనుండి బయటపడే మార్గం కనిపించక, శోకచిత్తులమైన మనకు, శ్రీహరి పాదారవిందములు తప్ప, వేరే మార్గం లేదు. మన ప్రయత్నంగా, అపారమైన భక్తితో శ్రీహరిని ధ్యానిస్తూ, జ్ఞాన వైరాగ్య సాధనలతో, భక్తి తత్వము తెలుసుకుని, శరణాగతితో శ్రీహరి కరుణకు పాత్రులమవ్వాలి. అంతకు మించి ఈ మాయను ఛేదించి, జనన మరణ సుడిగుండం నుండి బయటపడే వేరే మార్గమే లేదు. జ్ఞాన వైరాగ్యములు తత్వ సాధనకు సరియైన మార్గాన్ని తెలుపుతాయి. కానీ, వాటి వలన మాత్రమే మోక్ష ప్రాప్తి చేకూరదు. మోక్ష ప్రాప్తికి అవి రెండు ఉపకరణములు మాత్రమే. దానికి అనువైన సాధనము, భక్తి. శరణాగతితో కూడిన భక్తితో, భగవంతుని కరుణను పొందవచ్చు. ఇలా పరమాత్మ దయను పొందగలిగితే,  మోక్షం చాలా సులభసాధ్యమౌతుంది.

అందరూ భగవద్ తత్వాన్ని గ్రహించి, ఆయనను నిరంతరం భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ, ఆ దేవదేవుడిని హృదయంలో సాక్షాత్కరించుకోవడమే, మనిషి పుట్టుక యొక్క అంతిమ లక్ష్యం.. ఇదే గమ్యం, ఇదే నిత్యం, ఇదే శాశ్వతం..

శుభం భూయాత్!

Thursday, February 22, 2024

ఖర్చులేని స్వర్గం!? Inexpensive Heaven


ఖర్చులేని స్వర్గం!? TELUGU VOICE
              
ఒక గురువు శిష్యుడితో ఇలా అన్నాడు.. “స్వర్గానికి ప్రవేశం ఉచితం.. నరకానికి వెళ్లడానికి మాత్రం బోలెడు డబ్బు ఖర్చుపెట్టాలి”.. శిష్యుడు ఆశ్చర్యపోయి, 'అదెలా?' అని అడిగాడు.

[ అంత్యకాల చింతనలే మరుజన్మను నిర్ణయిస్తాయా?: https://youtu.be/y6vublgZiQ0 ]


అప్పుడు గురువు.. "జూదం ఆడటానికీ, చెడు వ్యసనాలైన వ్యభిచారం, మత్తు పానీయాల సేవనం, ధూమ పానం, ఇలా పాపాలతో ప్రయాణించడానికి ఎంతో డబ్బు అవసరం.. కానీ, ప్రేమను పంచడానికీ, దైవ ప్రార్ధనకీ, సేవ చేయడానికీ డబ్బుతో పని లేదు.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అప్పుడప్పుడు ఉపవాసం ఉండడానికి డబ్బు అవసరం లేదు.. ఎదుటి వారిని క్షమించమని అడగడం కూడా ఖర్చులేని పనే.. కరుణ, సానుభూతి, మానవత్వం చూపడానికి సంపదలు అవసరంలేదు.. దేవుడిపై నమ్మకం ఉండాలి.. మనపై మనకు, తోటి ప్రాణులపై ప్రేమ, విశ్వాసం ఉండాలి.." అని అన్నాడు. 

మరి గురువు చెప్పిన ప్రకారం, "డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళడానికి ఇష్టపడతారా? ఉచితంగా లభించే స్వర్గ ప్రాప్తిని ఇష్టపడతారా?" ఇది ఎవరికీ వారు నిర్ణయించుకోవలసిన విషయం..

సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం ।
నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చల తత్వే జీవన్ముక్తి ।।

‘మోహముద్గరం’గా పేరొందిన 31 శ్లోకాల ‘భజగోవిందం’లో తొమ్మిదవ శ్లోకం ఇది. సత్పురుషుల సాంగత్యం వల్ల, ఈ ప్రాపంచిక విషయాల పట్ల సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ, లేదా మోహం తొలగిపోతుంది. మోహం తొలగిపోతే, మనస్సు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతుంది (నిశ్చలతత్వం). అలా మనస్సు చలించకుండా భగవంతునిపై నిలిచిపోతే, ఇక సమస్త కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం. జీవన్ముక్తి అని ఈ శ్లోకం యొక్క అర్థం.

శుభం భూయాత్!

Monday, February 19, 2024

లలాట లిఖితం! ..మంచి కథ If Death Occurs in 7 days - Real Incident of Sant Eknath


లలాట లిఖితం! ..మంచి కథ TELUGU VOICE
ఇంకో వారంలో చనిపోతాడని తెలిసిన ఆ మనిషి ఏం చేశాడు? ..జీవిత సత్యాలు!

మన హిందూ పురాణాలలోనూ, చరిత్ర పుటలలోనూ మంచి కథలు అసంఖ్యాకం. వాటిలో కొన్ని మనోల్లాసానికీ, ఇంకొన్ని మనో వికాసానికీ ఉద్దేశింపబడినవయితే, మరికొన్ని సన్మార్గ జీవనానికి తోడ్పడతాయి. కారుణ్యం, దయ, పరోపకారం, త్యాగం, సత్యనిష్ఠ, నిస్వార్థత వంటి సద్గుణాలు, మానవుణ్ణి ధర్మపథం వైపుకు నడిపించి, అంతిమంగా భగవంతునికి చేరువ చేస్తాయి. అటువంటి సద్గుణాలను పెంపొందించే స్ఫూర్తిదాయక కథలలో ఒకదానిని, ఈ రోజుటి మన వీడియోలో చెప్పుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/C-3v8R8fZQQ ]


మహారాష్ట్ర ప్రాంతంలో జీవించిన మహాత్ముడూ, భక్తాగ్రగణ్యులలో ఒకరు, సంత్ ఏక్‌నాథ్‌ గా ప్రసిద్ధి చెందిన ఏకనాథుడు. ఆయన ఘనతను గురించి ఆ నోటా ఈ నోటా విన్న ఒక వ్యక్తి, ఒక రోజు ఆయనను దర్శించుకోవడానికి వచ్చాడు. ఏకనాథుడు గడుపుతున్న నిరాడంబర జీవితాన్ని చూసి, అతడు ఆశ్చర్య చకితుడయ్యాడు. ఏకనాథుడి ముఖారవిందాన ద్యోతకమవుతున్న దివ్యత్వం, తేజస్సునూ గమనించి, ఆయన పట్ల అమితంగా ఆకర్షితుడయిన అతను ఆయనతో, “స్వామీ! మీ జీవితంలో ఎంతో ప్రశాంతతను చూస్తున్నాను. ఎటువంటి ఆరాటమూ, ఆందోళనా లేకుండా, నిర్మలమైన నీటిప్రవాహంలా మీరు ఎలా మనగలుగుతున్నారో అర్ధం కావడం లేదు! నిరాడంబరతకూ, పావనతకూ మీ జీవితం అద్దంపడుతోంది. కానీ, ప్రాపంచికులమైన మేము, జీవితంలో సదా అనేక సమస్యలతో తల్లడిల్లిపోతున్నాము. ప్రశాంతత మూర్తీభవించిన మీ జీవితం ఎక్కడ? సదా అల్లకల్లోలాలతో నిండిన మా జీవితం ఎక్కడ? మన జీవన విధానాలలో హస్తిమశకాంతర వ్యత్యాసం ఉంది. సమస్యలతో మీ మనస్సు ఎన్నడూ గురయినట్లు తెలియడం లేదు. కానీ, మమ్మల్ని గందరగోళంలో ముంచెత్తే పగ, విసుగు, అహంకారం వంటి దుర్గుణాలు, సదా పట్టి పీడిస్తున్నాయి. మీలాంటి ప్రశాంతమయమైన జీవితం మాకు లభించడం సాధ్యమా? నేనూ మీలా జీవించాలని అభిలషిస్తున్నాను. అందుకు ఏమైనా తరుణోపాయం ఉంటే సెలవివ్వండి స్వామీ!” అని విన్నవించుకున్నాడు.

అతడు చెప్పినది సావధానంగా విన్న ఏకనాథుడు, క్షణం ఆలోచించి ఇలా జవాబిచ్చాడు.. “నాయనా! నువ్వు ఇప్పుడు చెప్పినదంతా అలా ఉంచు. నీ లలాట లిఖితం ఇప్పుడే గమనించాను. వెంటనే నీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలి. నీకు మరణ కాలం సమీపిస్తోంది. ఇంకో వారం రోజులలో నువ్వు మరణిస్తావు!” ఏకనాథుడి వంటి మహనీయుడి నోటివెంట వచ్చిన ఆ మాట వినగానే, అతడి గుండె ఝల్లుమన్నది. మరణానికి చేరువలో ఉన్నాననే చింతన అతడి మనస్సును సంపూర్ణంగా ఆక్రమించింది. ఆ కారణంగా ఆతడి మనోస్థితిలో అసాధారణమైన పెను మార్పు చోటుచేసుకుంది. ఆ పైన అతడిక ఏకనాథుడితో ఏమీ మాట్లాడలేకపోయాడు. 'అయ్యో! వారం రోజులే మిగిలి ఉన్నాయి. ఏడు రోజుల్లో నేను మరణించబోతును? అని తనలో తను గొణుక్కుంటూ, ఇంటిముఖం పట్టాడతను.

ఇంటికి వెళ్ళగానే, అనురాగం ఉట్టిపడుతుండగా, భార్యను చేరబిలిచి, ఆమెతో ఇలా అన్నాడు.. “నేను నిన్ను ఎన్నో రకాలుగా కష్టపెట్టాను. అవన్నీ తలచుకుని ఎంతగానో విచారిస్తున్నాను. నన్ను క్షమించు. ఇంకో వారం రోజులలో, నా జీవితం ముగియబోతోంది. ఇంతవరకూ అనవసరమైనవన్నీ మాట్లాడి నీ మనస్సును నొప్పించినందుకు పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నా తప్పులను మన్నించు.” అని కన్నీటి పర్యంతం భార్యతో చెప్పుకుని, తరువాత తన పిల్లలను పిలిచి, వారిని గుండెలకు హత్తుకున్నాడు. “నాయనలారా! ఇప్పటికైనా మిమ్మల్ని అక్కున చేర్చుకున్నాను. మీపై అనవసరంగా కోపించి, ఎన్నోసార్లు కొట్టాను, తిట్టాను. నా కథ ఇక వారం రోజులలో ముగిసిపోతుంది. మీ పట్ల నేను వ్యవహరించిన తీరును తలచుకుని కుమిలిపోతున్నాను. నన్ను మీరందరూ మన్నించండి” అని అన్నాడు గద్గద స్వరంతో.

తరువాతి పనిగా అతడు ఇరుగుపొరుగు, మిత్రులు, బంధువుల వద్దకు వెళ్ళి, తన మరణకాలం సమీపించినదని నిర్లిప్తంగా తెలిపి, ఇదివరలో తను ఎవరెవరితో దెబ్బలాడి గొడవపడ్డాడో, వారందరినీ కలుసుకుని, “అయ్యా! గతంలో మీ పట్ల నేను ప్రవర్తించిన తీరుతెన్నులను తలచుకుని సిగ్గుతో కుంచించుకుపోతున్నాను. ఇక వారం రోజులే నేను బతికి ఉంటాను. ఇంకో ఏడు రోజులలో నా జీవితం అస్తమించబోతోంది. మీతో గొడవ పడినందుకు నన్ను మనస్పూర్తిగా క్షమించండి” అని వారితో చెప్పాడు. ఈ విధంగా, తన అనుచిత చర్యల మూలంగా ఇబ్బందులకు గురైన వారిని కూడా పని కట్టుకుని కలుసుకుని, తన మరణకాలం గూర్చి తెలిపి, తనను క్షమించమని వారిని వేడుకున్నాడు. ఇలా రోజులు గడిచి, ఏడవ రోజు రానే వచ్చింది.

ఆశ్చర్యం! ఆ రోజు అతడి ఇంటికి ఏకనాథుడు విచ్చేశాడు. ఆయనను చూడగానే, అతడు సాష్టాంగ నమస్కారం చేసి, “స్వామీ! నా మరణకాలం వచ్చేసిందా?” అని అడిగాడు ఆతృతగా. ఆ ప్రశ్నకు ఏకనాథుడు ఇలా స్పందించాడు.. “దానిని గూర్చిన నిజం ఆ భగవంతునికే ఎరుక. అది సరే.. నిన్నొక ప్రశ్న అడగాలి. ఈ ఏడు రోజులనూ నువ్వు ఎలా గడిపావో నాకు చెప్పు. ఎందరిని తిట్టావు? ఎందరితో గొడవపడ్డావు? ఎందరి మనస్సులను నొప్పించావు? ఎందరిని అవమానించావు?” అని అడిగాడు. ఆ ప్రశ్నలు విని తెల్లమొహం వేస్తూ, అతడు ఇలా జవాబిచ్చాడు.. “స్వామీ! ఈ ఏడు రోజులూ మరణమే నా కళ్ళ ముందు తాండవించింది. ఈ స్థితిలో ఒకరిని తిట్టడమూ, మరొకరితో గొడవ పడటమా? అందుకు నాకు సమయం ఎక్కడిది? నేను గతంలో గొడవపడ్డ అందరి వద్దకూ వెళ్ళి, నా తప్పిదాన్ని పెద్ద మనస్సుతో మన్నించమని వేడుకున్నాను. మిమ్మల్ని కలుసుకుని మాట్లాడిన క్షణం నుండీ, ఈ క్షణం దాకా ఏ విధమైన గొడవల జోలికీ పోలేదు. ఈ ఏడు రోజులూ మంచిగా, ప్రయోజనకరంగా గడిపాను.” అని చెప్పాడు.

అతడు చెప్పినది విన్న తరువాత, ఏకనాథుడు ఇలా చెప్పసాగాడు.. “నాయనా! ఈ విచిత్రాన్ని గమనించావా? గత ఏడు రోజులుగా నువ్వు మరణాన్నే తలచుకుంటూ ఉండిపోయావు. ఆ కారణంగానే, మంచిగా, ఇతరులకు ప్రయోజనకరంగా జీవించావని తెలుస్తోంది. మా వంటి వారి స్థితి ఏమిటో తెలుసా? మేము మా జీవిత పర్యంతం, ప్రతి క్షణమూ, సదా, సర్వవేళలా మరణాన్నే జ్ఞప్తిలో ఉంచుకుని జీవితం గడుపుతాము. అందుకే మేము ప్రశాంతంగా జీవించగలుగుతాము. మనం ఈ దేహంలో ఎంత కాలం జీవిస్తాము? జీవితంలో ఏం జరుగబోతుందో నిశ్చయంగా తెలియదు. కానీ, మన ఈ దేహం త్వరలోనో, లేక కొంతకాలం గడిచిన తరువాతనో, ఏదో ఒక రోజు నశించి మట్టిలో కలిసి పోవడం మాత్రం తథ్యం. కనుక మనం, నశించిపోయే దేహం పట్ల అనురక్తీ, లేక అనుబంధం కలిగి ఉండకుండా, నాశ రహితమైన భగవంతుని పట్ల అనురక్తి వహించి జీవించాలి. అంటే, ఏ స్థితిలోనూ, మనం దేహానికి బానిస కాకుండా, భగవంతునికే దాసునిగా మనగలగాలి. పరుల పట్ల పగ వహించకుండా, వారి పట్ల ప్రేమను పెంచుకుని జీవించాలి. మనసా, వాచా, కర్మణల యందు ధార్మికత భాసించాలి. ఇతరుల మనస్సు నొచ్చుకునే రీతిలో ససేమిరా మాట్లాడకూడదు. మనసా, వాచా, కర్మణా, ఏ ఒక్కరినీ నొప్పించని రీతిలో, మధురంగా మాట్లాడి, నిస్స్వార్ధతతో, ప్రేమతో సేవలందించాలి.

మన వద్ద ఉన్న దానిని, ముఖం చిట్లించుకోకుండా, వికసిత వదనంతో, అవసరం ఉన్న వారికి ఇవ్వాలి. దీనిని గురించి బాగా ఆలోచించు. మన ప్రతిభా, మన దగ్గరున్న వస్తువులూ మనవి కావు. అవన్నీ భగవంతునికే సొంతం. భగవంతుడు మనలను ఒక ఉపకరణగా ఉపయోగించి, ఇతరులకు అందించడానికే, వాటిని మనకు ఇచ్చాడని తెలుసుకుని, ఇతరులకు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. భగవంతుడు, తనకు సొంతమైన వస్తువులను మన వద్ద ఉంచినప్పుడు, వాటిలో ఒక పాలు, మన వద్దకు వచ్చే ఆయన బిడ్డలకు లేదని చెప్పడానికి, మనకు ఎలాంటి హక్కూ లేదు. భగవంతునికి చెందిన వస్తువును, ఆయన బిడ్డలకే ఇవ్వ నిరాకరించడం న్యాయమా? భగవంతుని పట్ల భక్తిప్రపత్తులు చెల్లించే మనం, ఆయన బిడ్డల యెడ అభిమానం చూపక, ద్వేషించటం సబబు అనిపించుకుంటుందా? నశించిపోయే ఈ దేహాన్ని, ఇతరులకు ఉపయోగపడే కార్యకలాపాలలో వినియోగించాలి. మెరుపులా మన దేహంలోనుంచి జీవం మాయమయ్యే లోపుగా, భగవంతుని ప్రాప్తించుకోగోరిన ఏ కొద్దిమందికో, ఏ విధంగానైనా దోహదపడగలిగితే, అది ఎంత ఘనతరం! నీటి బుడగ వంటి దేహంతో కూడిన జీవితం అంతరించే లోపుగా, ఏ కొద్దిమందికైనా, ఏ కించిత్తయినా ఉపయోగ పడగలిగితే, ప్రశాంతతనూ, సాంత్వననూ అందివ్వగలిగితే, అదే స్తుతినీయం. జన్మించినప్పుడే మరణమూ నిశ్చయమై వుంటుంది. కనుక అది సంభవించే లోగా, భగవంతునికీ, లోకానికీ సేవలు చేస్తూ జీవించటమే, మన జన్మకు సార్థకత.”

ఏకనాథుడు చేసిన ఉపదేశాన్ని అతడు అమిత శద్ధగా విని, చక్కగా ఆకళింపు చేసుకుని, తన శేష జీవితంలో తు.చ. తప్పక ఆచరించి, జీవితాన్ని సార్ధకం చేసుకుని, తరించాడు.

ధర్మో రక్షతి రక్షితః

Friday, February 16, 2024

అందరికీ 'రథ సప్తమి 2025' శుభాకాంక్షలు 🙏 Ratha Sapthami


అందరికీ 'రథ సప్తమి 2024' శుభాకాంక్షలు 🙏 TELUGU VOICE

[ రథ సప్తమి చరిత్ర: https://youtu.be/RcSzefZE3ow ]


రథ సప్తమి రోజున స్నానం చేసే సమయంలో పఠించవల్సిన శ్లోకాలు: 

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః।
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే।।

యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు।
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ।।

ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్।
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః।।

ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే।
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ।।

Wednesday, February 14, 2024

వసంత పంచమి 2026

 

అందరికీ 'వసంత పంచమి' శుభాకాంక్షలు 🙏 TELUGU VOICE

చదవుల తల్లి సరస్వతీ దేవి పుట్టిన రోజు కాబట్టి వసంత పంచమిని సరస్వతీ పంచమి అని అంటారు. జనవరి 23 2026, మాఘ శుక్ల పంచమి. దీనికే వసంత పంచమి (Vasant Panchami), శ్రీ పంచమి, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. జ్ఞానము మనిషిని మనీషిగా తీర్చిదిద్దుతుంది. జ్ఞానము, విద్య, చదువు పర్యాయపదాలు. విద్యకు అధిదేవత, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతీదేవి జన్మదినంగా భావించి, స్మరించి, పూజించే రోజే వసంత పంచమి. ఆ తల్లి కటాక్షం కోసం అందరూ పూజలు జరిపే పర్వదినమే వసంతపంచమి. ఈ రోజునే క్షీరసాగర మథన సమయంలో మహాలక్ష్మి ఆవిర్భవించిన కారణంగా మదన పంచమి అని కూడా పేర్కొంటారు.

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ ।
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ।।
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా ।
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా ।।
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా ।
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ।।

సరస్వతీ కటాక్షం:

* బ్రహ్మదేవుడంతటి వాడే పరాశక్తిని శారదామాత రూపంలో దర్శించి, ఆరాధించి ఆమె కృపవల్ల సృష్టి రచనను సృజనాత్మకంగా ఆరంభించాడు.
* గాయత్రీదేవికి గల ఐదు రూపాలలో సరస్వతీదేవి దొకటి. యాజ్ఞవల్క్యుడు గురుశాపం వలన విద్యలను కోల్పోవడంతో, సూర్యుని ఆరాధించగా, ఆతడు యాజ్ఞవల్క్యునికి సరస్వతీ ఉపాసనను ఉపదేశించాడు. సరస్వతీదేవి కృపవలన స్మృతి శక్తిని తిరిగి సంపాదించుకుని మహా విద్వాంసుడయ్యాడు.
* వాల్మీకి సరస్వతీ దేవిని ఉపాసించి శ్రీమద్రామాయణ రచనను చేశాడని మన పురాణాలు చెబుతున్నాయి.
* అలాగే వ్యాసమునీంద్రుడు కూడా సరస్వతీ దేవి అనుగ్రహం వల్లనే వేద విభజన గావించి పురాణాలను ఆవిష్కరించాడని, మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రాది రచనలు చేసి, భారతీయ సనాతన ధర్మ వ్యవస్థకు మూల పురుషుడిగా నిలిచాడనీ ప్రతీతి.
* తెలుగులో భాగవతాన్ని రచించిన పోతన మహాశయుడు సరస్వతీదేవి అనుగ్రహం పొందడమేకాక, ఆ గ్రంథాన్ని పొట్ట కూటి కోసం నరులెవ్వరికీ అంకితమివ్వనని వాగ్దానం చేసినట్లు చెబుతారు.

🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏

Monday, February 12, 2024

‘గరుడ పురాణం’ - గర్భస్థ శిశువు! Garuda Puranam


గర్భస్థ శిశువు! జీవిత సత్యాలు..
‘గరుడ పురాణం’ ప్రకారం తల్లి గర్భంలో శిశువు పడే ‘నరక యాతన’ తెలుసా?

మన సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తన కర్మలను అనుభవించి, తిరిగి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక ప్రాణికి జన్మనిచ్చే క్రమంలో, స్త్రీ మృత్యువు అంచులవరకూ చేరుకుని, ప్రాణికి జీవం పోస్తుంది. అందుకే మన పురాణాలు స్త్రీమూర్తికి ఎంతో ప్రాముఖ్యతనూ, వెలకట్టలేని గౌరవాన్నీ ఆపాదించాయి. కానీ, గర్భంలో ఉన్న శిశువు గురించి మనం ఏనాడైనా ఆలోచించామా! నెలలు నిండిన శిశువు గర్భంలో ఏం చేస్తుంది? చీకటి కుహరం వంటి తల్లి గర్భంలో ఆ శిశువు ఎలాంటి బాధలను అనుభవిస్తుందనే విషయాల గురించి, మనలో చాలామందికి అవగాహన లేదనే చెప్పవచ్చు. వేల ఏళ్ళ క్రితం రచించబడిన గరుడ పురాణంలో, గర్భస్థ శిశువు గురించీ, ఆ సమయంలో అది పడే బాధల గురించీ, స్పష్టంగా వివరించబడివుంది. గర్భస్థ శిశువు యొక్క అనుభవాలేంటి? చీకటి ఆగాధంలో బందీ అయిన శిశువు అనుభవించే బాధలేంటి? ప్రసూతి సమయంలో శిశువు శరీరోత్పత్తి ఎలా జరుగుతుంది? గరుడ పురాణంలో శ్రీ మహా విష్ణువు గరుడుడికి వివరించిన గర్భస్థ శిశువుకు సంబంధించిన, మనలో ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవలసిన నిగూఢ సత్యాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Ds4YszMGDug ]


‘పరంధామా! జీవుడు నరకం నుంచి తిరిగి జన్మఎత్తటానికి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు కదా! ఆ గర్భంలో అతడు ఎలాంటి నరక యాతనను అనుభవిస్తాడో, దయచేసి తెలియజేయండి!’ అని గరుత్మంతుడు శ్రీ హరిని ప్రార్థించాడు. అందుకు శ్రీ మహా విష్ణువు, "వైనతేయా! స్త్రీ పురుషుల సంయోగం వల్ల శుక్లశోణితాలు ఏకమై, జీవుడు ప్రాణం పోసుకుంటాడు. పాపం చేసిన జీవుడికి, ప్రసవసమయానికి మూడు రోజుల ముందే, శరీరోత్పత్తి జరుగుతుంది. ఎలాగంటే! ఇంద్రుడికి ఉన్న బ్రహ్మహత్యాదోషం, గర్భిణీ స్త్రీకి మొదటి మూడు రోజులు ఆవరించి ఉంటుంది. ఆ రోజుల్లో మొదటి రోజు స్త్రీని ఛండాలినిగా, రెండవ రోజు బ్రహ్మఘాతిగా, మూడవ రోజు, రజకి అని వ్యవహరించబడుతుంది. కాబట్టి, ఈ మూడు రోజుల్లోనే పాపాత్ములైన వారు జన్మిస్తారు.

ప్రతిజీవీ తాను చేసిన కర్మానుసారం, శరీరాన్ని పొందుతాడు. పురుషుడి వీర్యం ద్వారా స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. శుక్ల శోణితాలు రెండూ, ఒక్క రోజులో కలిసిపోతాయి. అవి అయిదు రోజులకు, నురగగా మారుతాయి. పది రోజులు గడిచేసరికి, మాంసాకారాన్ని పొంది, రేగుపండంత కఠినత్వాన్ని పొందుతాయి. తరువాత అది అండంగా మారుతుంది. గర్భంలో ఉన్న జీవికి ఒక నెలలో తల, రెండవ నెలలో చేతులూ మొదలైన అవయవాలు, మూడవ నెలలో గోళ్ళు, వెంట్రుకలు, చర్మం, మర్మావయవాలు, రంధ్రస్థానాలూ ఏర్పడతాయి. నాలుగవ నెల వచ్చేసరికి సప్తధాతువులూ, అయిదవ నెలలో ఆకలి దప్పికలూ, ఆరవ మాసంలో మావి చేత చుట్టుకోబడి, కుడిడొక్క తిరుగుతుంటుంది. ఆ విధంగా ఆకలి దప్పికలు పొందిన జీవి తల్లి గర్భంలోనే ఉండి, తల్లి తినే పదార్ధాలనే తనూ తింటూ, వృద్ధి చెందుతాడు.

మలమూత్రాలతో, దుర్వాసనలతో నిండి ఉండే తల్లి గర్భంలో శయనించి వుంటాడు. గర్భంలో ఉండే పురుగులు, శిశువును కుడుతూ ఉంటాయి. శిశువు శరీరం చాలా సుకుమారంగా ఉండటంతో, వాటి బాధను తట్టుకో లేక పోతాడు. తల్లి తినే ఉప్పుకారం, వేడి, పులుపు లాంటి పదార్ధాల వల్ల, తన అన్ని అంగాలూ ఎంతో బాధ పడతాయి. మావిచే చుట్టుకోబడ్డ శిశువు ప్రేగులతో వెలుపలి భాగమంతా ఆవరించబడి, నడుము, తల వంచుకుని, తల్లిగర్భంలో శయనిస్తాడు. పంజరంలో పక్షి వున్నట్టుగానే, జీవుడు మాతృ గర్భంలో కొలువుంటాడు. అలా గర్భంలోకి ప్రవేశించి రూపం పొందిన జీవుడు, పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి, ఎన్నో జన్మల నుంచీ తాను చేసిన పాపాలను తలచుకుని, చింతిస్తూ ఉంటాడు. సప్త ధాతువులతో పుట్టిన జీవుడు, గర్భంలోని నరక యాతన నుంచి విముక్తి కలగటం కోసం, ఒక మునిలాగా, తనను తల్లి గర్భంలోకి ప్రవేశ పెట్టిన భగవంతుడిని, దీనంగా ఇలా ప్రార్ధిస్తూ ఉంటాడు.

"విశ్వానికి ఆధారమైనవాడూ, లక్ష్మీ వల్లభుడూ, సకలజీవుల పాపాలనూ నశింపచేసేవాడూ, శరణన్న వారికి ఆపన్న హస్తాన్నందించే శ్రీహరిని శరణువేడుకుంటున్నాను. ఈ శరీరం మీదా, భార్యా పుత్రుల మీదా మాయా మోహంతో, అజ్ఞానంతో, ఇది నాది, ఇది నేనే అన్న అభిమానాన్నీ, అహంకారాన్నీ పొందాను ప్రభూ! నా కుటుంబ పోషణ కోసం, నా భార్యా బిడ్డలను సుఖపెట్టడం కోసం, ఎన్నో పాపకార్యాలను చేసి, ఎంతో సంపాదించాను. అయితే, నేను చేసిన పాప ఫలాలను నేను మాత్రమే అనుభవిస్తున్నాను కానీ, నా భార్యా బిడ్డలు నా పాపంలో భాగం పంచుకోవటం లేదు. స్వామీ! ఈ గర్భవాస నరకాన్ని భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ నరకకూపం నుంచి బైటపడెయ్యండి. మీ పాదకమలాలనే నిత్యం ధ్యానం చేసుకుంటాను. మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందే మార్గాన్ని ఆలోచించుకుంటాను. ప్రభూ! మలమూత్రాలతో నిండిన గర్భంలో చేరి, ఆకలిదప్పికలతో మలమల మాడిపోతున్నాను. గర్భంలోని ఈ యాతన నుంచి బైటపడాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు బైటికి వస్తానో నాకు తెలియటంలేదు.

దీనుల మీద దయచూపే ఏ పరమాత్మ నాకీ పూర్వజన్మ జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ పరమాత్మనే తిరిగి ఈ సంసార కూపంలో పడవేయవద్దని వేడుకుంటాను. స్వామీ! ఒక్కోసారి నాకు ఈ గర్భం నుంచి బైటికి రాకూడదని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే! ఇప్పటికే ఈ గర్భంలోకి ప్రవేశించి, నరకాన్ని అనుభవిస్తున్నాను. జన్మించాక మళ్ళీ పాపాలు చేసి, నీ యందు భక్తి ప్రపత్తులు లేకుండా ఉండేకన్నా, ఈ గర్భవాసనరకం ఎంత బాధపెట్టినప్పటికీ నేనిక్కడే ఉండి, నీ పాదపద్మాలను నమ్ముకుని, ఎలాంటి కష్టాలూ లేకుండా గడిపేస్తాను. తిరిగి సంసార బంధనంలో చిక్కుకోకుండా, నా ఆత్మను ముక్తిపథం వైపు పయనించేలా చేసుకుంటాను." అని గర్భస్థ జీవుడు భగవంతుడిని వేడుకుంటాడు. ఈ విధంగా నవమాసాల పాటు గర్భంలో ఉన్న ఆ జీవుడు, ఒక మునీశ్వరుడిలాగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు, అతడి బాధలు పోగొట్టటానికీ, తిరిగి కర్మఫలాన్ని అనుభవింపచేయటానికీ, ప్రసూతిగాలి వీచి, అతడు బైటికి రావటానికి వీలుగా, అధోముఖుడవుతాడు. ప్రసూతి ఘడియలు సమీపించగానే జీవుడు తల్లి గర్భం నుంచి యోనిమార్గం ద్వారా, అధోముఖంగా బయటికి వస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఎంతోబాధతో, తెలివి తప్పి, అతికష్టంగా బైటికి చేరతాడు. మలంలో ఉండే పురుగులా భూమిమీద పడ్డ జీవుడు, అప్పటిదాకా వున్న పూర్వజన్మ జ్ఞానం నశించగా, అటు ఇటు కొట్టుకుంటూ ఏడుస్తాడు.

గరుత్మంతా! గర్భంలో ఉన్నప్పుడూ, అనారోగ్యం కలిగినప్పుడూ, శ్మశానంలో ఉన్నప్పుడూ, పురాణ కథనాలు విన్నప్పుడూ కలిగిన వైరాగ్యం గనుక మానవులకు స్థిరంగా ఉంటే, వారికి మరలమరల సంసార బంధనాలలో చిక్కుకునే దుర్గతి కలుగదు. కర్మ ఫలాలను అనుభవించిన తరువాత గర్భం నుంచి బైటికి వచ్చిన వెంటనే, ఆ జీవుణ్ణి విష్ణుమాయ మోహింపచేస్తుంది. విష్ణుమాయతో ఆవరించబడిన జీవి భూమి మీదకు రాగానే, ఏ విధమైన జ్ఞానమూ లేకుండా, అలా నిశ్చలంగా ఉంటాడు. అతడికి ఏమీ చెప్పగలిగే సామర్థ్యం ఉండదు. అలా పుట్టిన తరువాత ఊహ వచ్చేంత వరకూ, నరకాన్నే అనుభవిస్తాడు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే, కడుపునొప్పి వచ్చిందేమో అనుకుని మందు వేస్తారు. నిజంగా కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంటే, ఆకలేసిందేమోనని పాలు తాగిస్తారు. ఇలా విరుద్ధంగా జరుగుతున్నప్పటికీ, శిశువుగా వున్నజీవుడు తానేదీ చెప్పగలిగే స్థితిలో ఉండడు. ఆ విధంగా జీవుడు నాలుగైదు సంవత్సరాలు వచ్చేవరకూ, బాల్య సంబంధిత దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటాడు. తరువాత కౌమార వయసులో విద్యాభ్యాసం లాంటి బాధలు పడతాడు. యౌవనదశలో దర్పాన్నీ, అహంకారాన్నీ పొంది, రాక్షస గుణాలు కలిగినవాడౌతాడు. యౌవన ప్రాయంలోకి చేరిన మానవుడు, జూదం, సురాపానం లాంటి వ్యసనాల చేత మోహింపబడి, ఇంద్రియనిగ్రహాన్ని కోల్పోయి, నిప్పులలో పడ్డ మిడతలాగా, మోహంలో పడి కొట్టుకుంటాడు.

గరుత్మంతా! లోకంలో లేడి, ఏనుగు, పక్షి, తుమ్మెద, చేప అనే ఈ అయిదు జంతువులూ, ఒక్కొక్కటీ ఒక్కో విషయం మీద తీవ్రమైన కోరిక ఉండటంతో, చెడిపోతున్నాయి. అయితే, మానవుడొక్కడే, వివేకశూన్యుడై, చర్మం, చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు అనే అయిదు ఇంద్రియాలకు వశమైపోయాక, ఇక చెడిపోకుండా ఎలా ఉంటాడు? ఇలా అత్యంత దుర్లభమైన మానవజన్మను పొందికూడా, ఎలాంటి సత్కర్మలూ ఆచరించకుండా, విషయ వ్యామోహంలో చిక్కి, తన జీవితాన్ని నశింపచేసుకునే మూర్ఖుడికన్నా పాపాత్ముడు, మరొకడుండడు. గరుత్మంతా! ఈవిధంగా పాపాత్ములు కర్మ అనే పాశంతో చుట్టబడి, నా విష్ణుమాయలో చిక్కుకుని, జన్మ తరింపచేసుకునే మార్గం తెలుసుకోలేక, వైరాగ్య భావం కలగక సంచరిస్తూ ఉంటారు. విషయాల మీద మమకారాన్ని పెంచుకుని సంచరిస్తే, తన చేతిలో ఉన్న అమృత కలశాన్ని జారవిడిచినవారే అవుతారు. ఈ విషయాన్ని గ్రహించక జీవితాన్ని వ్యర్ధంగా, దుర్వ్యసనాలతో, వ్యామోహాలతో గడిపిన మానవుడు, శ్లేష్మవ్యాధులతో కూడిన వార్ధక్యాన్ని పొంది, ఎన్నో బాధలు పడుతూ, చివరికి మరణించి, మళ్ళీ పూర్వంలాగానే నరకానికి చేరుకుంటాడు." అని శ్రీ మహా విష్ణువు గర్భంలో జీవి అనుభవించే బాధలను గరుడుడికి వివరించాడు.

జీవి గర్భంలో పడినది మొదలు, జీవంలేని శరీరం మన్నులో కలిసిపోయేదాకా, ఏదో ఒక రూపంలో బాధను అనుభవించాల్సిందే. ఈ నలభైనాలుగు లక్షల జీవరాశులలో, మానవ జన్మ మరీ దుర్లభం. అందుకే ఈ నరజన్మను అందరూ సార్ధకం చేసుకోవాలి. ధార్మిక కార్యక్రమాలు చేపట్టి, జీవితాన్ని తరింప చేసుకోవాలి.

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Wednesday, February 7, 2024

సన్మార్గ జీవనం! Sanmarga Jeevanam


సన్మార్గ జీవనం!

మనిషి జీవితాన్ని ధర్మబద్ధంగా కొనసాగించడానికి, సన్మార్గమే ఉత్తమ సాధనం. తోటివారికి సహాయం చేయడం, సంఘ శ్రేయస్సు కోసం పాటు పడటమే సన్మార్గం. స్వార్థంతో ప్రవర్తించి, ఇతరులకు కీడు చేయడం, దుర్మార్గమవుతుంది. సన్మార్గంలో నడిచిన వ్యక్తి ఎప్పటికప్పుడు తానేమిటో, తన స్థాయి ఏమిటో తెలుసుకుంటూ వుంటాడు. అనునిత్యం ఆత్మవిమర్శ చేసుకుంటూ, ఉన్నతమైన బాటలో ప్రయాణిస్తుంటాడు.

ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు. ఈ సమాజంలో మిగతావారు ఎలా ఉన్నా, మనవరుకూ మనం ఎలా ఉన్నామన్నదీ, మనం ఏం చేస్తున్నామన్నదీ మాత్రమే ముఖ్యం. పవిత్రమైన కమలం పుట్టేది బురదలోనే అయినా, తన తేజస్సును కోల్పోదు, కోమలత్వాన్ని వీడదు. మనిషి కమలాన్ని చూసి ప్రేరణ పొందాలి. సన్మార్గంలో సాగే మనిషి, సమాజంలో అత్యుత్తమ గౌరవాన్ని పొందగలడు. మానవత్వం వల్లనే అందరికీ ఆదర్శప్రాయుడవుతాడు. అందుకే మనిషి, భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మను సద్వినియోగ పరచుకుని, అందరికీ సహాయం చేసే స్థాయికి ఎదగాలని పెద్దలంటారు.

మరుజన్మ ఉన్నదో లేదో, గత జన్మ ఎలాంటిదో తెలియనప్పుడు, ఈ జన్మలో లభించిన పవిత్రమైన మానవ జన్మను, ప్రతి మనిషి సార్థకం చేసుకునే ప్రయత్నం చేయాలి. కనీసం తనచుట్టూ ఉన్నవారిని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. ఒక్కసారి మనిషి సన్మార్గం వైపు ప్రయాణించడం మొదలుపెడితే, చెడుమార్గం వైపు కన్నెత్తి కూడా చూడడు. సత్‌ కార్యాలు చేస్తూ ముందుకు సాగిపోతుంటాడు.

అలనాడు దారి దోపిడీలు చేసి బ్రతికిన రత్నాకరుడనే బోయవాడు, నారద మహర్షి ఉపదేశం వల్ల పరివర్తన చెంది, రామనామ జపంతో వాల్మీకిగా ఎదిగాడు. సర్వలోకాలకూ మార్గదర్శకం, ఆదికావ్యమైన రామాయణాన్ని లోకానికి అందించాడు. రాజభోగాలను అనుభవించిన సిద్ధార్థుడు, అన్నింటినీ వదులుకుని సన్మార్గాన్ని అవలంభించి, జ్ఞానోదయం పొంది బుద్ధుడయ్యాడు. మహా బోధకుడిగా మారి, అమరుడయ్యాడు.

శ్రేష్ఠులైనవారు దేనిని ధర్మంగా భావించి ఆచరిస్తారో, సజ్జనులూ దానినే ఆచరిస్తారని బోధించాడు, శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞానులూ, మహాత్ములూ, సన్మార్గాన్ని అనుసరించి చరితార్థులయ్యారు. ప్రతి మనిషీ మహనీయుల మార్గాన్నే అనుసరించి, కీర్తి శిఖరాలను చేరుకోవాలి. ఉదాహరణకి, పరమ శివభక్తుడైన రావణ బ్రహ్మ, స్త్రీ వ్యామోహం వల్ల దుర్మార్గంగా ప్రవర్తించి, చివరికి అధోగతిపాలయ్యాడు. అలాగే, వివేకం కోల్పోయి, బంధుమిత్రుల హితవచనాలు పెడచెవిన పెట్టినందువల్ల, కురువంశ నాశనానికి కారకుడయ్యాడు, దుర్యోధన సార్వభౌముడు.

మనిషి దుర్మార్గుడిగా మారడానికి ఎంతోకాలం అవసరంలేదు. కానీ మంచివాడిగా, ఉత్తముడిగా గుర్తింపు పొందడానికి మాత్రం చాలా కాలం పడుతుంది. అయినా, తద్వారా వచ్చే కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది. సన్మార్గమే మనిషికి నిజమైన సంపద. సన్మార్గంలో ప్రయాణించే మనిషికి ధనధాన్యాలు లేకపోయినా, అన్ని సంపదలూ ఉన్నట్లే. సత్ప్రవర్తన లేనివారికి ఎంత సంపద ఉన్నా, అవి ఎందుకూ కొరవడవన్నది, నీతికోవిదుల మాట.

చూసిన ప్రతిదానినీ ఆశించడం, ఆశించినదానికోసం ప్రాకులాడటం, కోరుకున్నది దొరక్కపోతే బాధపడటం.. ఇవన్నీ మనిషిలోని అశాంతికి కారణాలు. ఇవే మనిషిని దుర్మార్గం వైపు నడిపించి, అతడి పతనానికి కారణమవుతాయి. అందుకే మనిషి ఎప్పటికప్పుడు కోరికలను నియంత్రించుకుంటూ, స్థిరచిత్తం ఏర్పరచుకోవాలి. సన్మార్గం మనిషికి సుఖశాంతులను ప్రసాదిస్తుంది. సన్మార్గంలో నడిచే వ్యక్తుల మనస్సులు కడిగిన ముత్యాలలా నిర్మలంగా ఉంటాయి. వారు అందరితోనూ మృదు మధురంగా మాట్లాడతారు. కలిమిలోనూ, లేమిలోనూ నిబద్ధత కలిగి ఉంటారు. మంచి పనుల ద్వారా అందరినీ ఆకట్టుకుంటారు. సన్మార్గంలో ప్రయాణించే మనిషి, మనీషిగా ఎదుగుతాడు. ఉన్న స్థితి నుంచి, ఉన్నత స్థితికి చేరుకుంటాడు. మంచి బాటలో నడిచే మనిషికి, ఒక్కోసారి ఆలస్యమైనా, దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. అందుకే సన్మార్గం అందరికీ అనుసరణీయం.

ధర్మో రక్షతి రక్షితః

Monday, February 5, 2024

జీవన్ముక్తుడు! అద్భుత సత్యం.. Story of Jeevan Mukta


జీవన్ముక్తుడు! అద్భుత సత్యం..
అంత్యకాల చింతనలే మరుజన్మను నిర్ణయిస్తాయా?

"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ" అని గీతాచార్యుడు చెప్పినట్లు.. “పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి మరల జన్మము తప్పదు”. కానీ, అంత్య సమయంలో ఆ జీవి మనస్సులో మెదిలే ఆలోచనలను బట్టే, మరుజన్మ ఉంటుందన్నది సనాతన సత్యం. ఆ సమయంలో ‘దైవ నామ స్మరణ’ మోక్ష దాయకమని పెద్దలు చెబుతారు. అయితే, అలాంటి సద్భావన అటువంటి క్షణాలలో కలగాలంటే, ముందునుండే నిత్య దైవ నామ స్మరణ అలవరచుకోవాలి, లేదా, ఆ సమయంలో మనస్సును దైవంపై నిలకడగా నిలబెట్టగల సత్సాంగత్యమైనా ఉండాలి. వీటన్నింటికీ ఉదాహరణగా, ఈ రోజు ఒక అద్భుతమైన కథను చెప్పుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/y6vublgZiQ0 ]


చాలా కాలం క్రితం మాధవపురి అనే ఊరిలో, భక్తాగ్రేసరుడొకాయన జీవించేవాడు. భగవంతుని పట్ల అచంచల భక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే ఆయన లక్ష్యం. అనునిత్యం జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడం ఆయనకు పరిపాటి. తన లక్ష్యం నుండి ఎప్పుడూ, ఏ కారణంచేతా ఆయన వైదొలగే వాడు కాడు. ఇలా ఆయన తపోమయ జీవితాన్ని దృఢనిశ్చయంతో గడపేవాడు. దాంతో కాలక్రమంలో ఆయన ఆధ్యాత్మికంగా చక్కని పురోగతిని సంతరించుకున్నాడు. ఆయన వద్దకు ఆత్మోపదేశం పొందడానికి పలువురు యువకులు వచ్చేవారు. ఆయన వారికి దైవభక్తి కలిగి ఉండటం ఒక్కటే జీవిత లక్ష్యమని స్పష్టంగా, వారి హృదయాలలో బాగా నాటుకుపోయేటట్లు వివరించి చెప్పేవాడు. తాను ఎటువంటి జీవితం గడుపుతూ వచ్చాడో, అటువంటి జీవితాన్నే తు.చ. తప్పక పాటిస్తూ గడపమని, తన శిష్యులకు బోధించేవాడు. దానినే ఆయన తన జీవితంలో ప్రతిఫలింపజేశాడు.

కాలానుగుణంగా, వృద్ధాప్యం ఆయనను కమ్ముకోసాగింది. తన ఆయుర్దాయం త్వరలోనే ముగియనున్నదని గ్రహించిన ఆయన, తన అవసాన కాలాన్ని ముక్తి ధామమైన కాశీలో గడపాలని అభిలషించాడు. గురువుగారి మనోభావనను శిష్యులు అవగతం చేసుకుని ఆయనను సమీపించి వినమ్రంగా, “స్వామీ! మీ అభిలాష ప్రకారమే, మిమ్మల్ని ఒక పల్లకీలో కూర్చుండబెట్టుకుని మేం కాశీకి తీసుకుపోతాము. ఎక్కడా పెద్దగా ఆగకుండా పయనిస్తే కొద్ది రోజుల్లోనే కాశీకి చేరుకోగలము” అని అన్నారు. వారి ప్రతిపాదనకు ఆయన మనస్ఫూర్తిగా సమ్మతించాడు. శిష్యులు తమ గురువును పల్లకీలో మోసుకుంటూ కాశీకి బయలుదేరారు. ప్రయాణం కొద్ది రోజులు సాగింది. శిష్యులు పల్లకీని ఒకింత వేగంగానే మోసుకు వెళ్ళసాగారు. త్వరలోనే కాశీకి చేరుకుంటారన్న తరుణంలో, గురువుకు తన అవసానం ముంచుకు వచ్చేసిందని అర్ధం అయింది. అప్పుడాయన ఎక్కడున్నామని శిష్యులను ప్రశ్నించాడు. పల్లకీ కాశీని చేరుకున్నదేమో అని నిర్ధారణ చేసుకోవడానికి, ఆయన అలా అడిగాడు. అప్పటికి పల్లకీ ఇంకా కొన్ని గంటల ప్రయాణానంతరం మాత్రమే కాశీని చేరుకునే స్థితిలో ఉంది. ఇంకా కాశీని చేరుకోలేదు. కనుక శిష్యులు, “స్వామీ పల్లకీ ఇప్పుడు ఒక మురికివాడ చేరువలో ఉంది” అని జవాబిచ్చారు. పల్లకీలో ఉన్న గురువు చెవులలో, శిష్యులు జవాబు చెబుతున్న సమయంలోనే, గురువు శ్వాస ఆగింది.

మరణిస్తున్న సమయంలో మనిషి ఎటువంటి చింతనలు చేస్తూ ఉంటాడో, ఆ చింతనలే ఆతడి మరుజన్మను నిర్ణయిస్తాయని, మహాత్ములు చెబుతారు. మరణిస్తున్నప్పుడు, “మురికివాడ” అనే మాట చెవులలో పడడంవలన, మురికివాడ జ్ఞాపకం గురువు హృదయంలో పాతుకుపోయింది. ఆ కారణంగా, ఆయన మరుజన్మలో అంత్యకులజులు నివసించే ప్రాంతమైన ఒక గూడెంలో జన్మించాడు! కానీ, తపోమయ జీవితం గడపడం వలన, ఆ ఉత్తమ సంస్కారాలు వృథా పోలేదు. రాజు కొలువులో పని చేస్తున్న ఒక అంత్యకులస్థుని ఇంట్లో ఆయన జన్మించాడు. ఆ అంత్యకులస్థుడి కర్తవ్యం, ప్రతి రోజూ రాత్రంతా రాజధాని నగరం చుట్టూ గస్తీ తిరుగడం, రాత్రి నాలుగు జాముల్లోనూ, వీథుల్లో డప్పు వాయిస్తూ, 'పారా హుషార్‌! జాగ్రత్తగా ఉండండి!” అంటూ కేకలు పెట్టి, జనులను హెచ్చరించడం. రాత్రి వేళ దొంగలు తమ హస్తలాఘవాన్ని చూపడానికి అవకాశం లేకుండా, రాజు చేసిన ఏర్పాటు అది.

ఆ అంత్యకులస్థునికే, గురువు మరుజన్మలో కుమారునిగా జన్మించాడు. ఈ జన్మలోనూ, ఆయనకు తన గతజన్మకు సంబంధించిన భావనలు కొనసాగాయి. అతడికి లౌకిక జీవితం పట్ల చెప్పలేనంత ఏవగింపు. జనుల్లో అత్యధిక పాలు, అవిద్యకు లోబడే జీవితం గడుపుతున్నారు. కనుక అతడు, లౌకిక అనురక్తి గల జనులతో మెలగకుండా, ఏకాంతంలో ఉండిపోయేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఇలా జీవిస్తున్న అతణ్ణి, జన్మతః మూగవాడని, కుటుంబ సభ్యులూ, ఊరి జనం జమకట్టారు. ఈ స్థితిలో తండ్రి, కుమారుణ్ణి నిష్ప్రయోజకుడు, ఒట్టి మొద్దని భావించి, పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో పిల్లవాడు, తన ధోరణిలోనే ఎదుగుతూ వచ్చాడు.

ఇలా ఉండగా ఒకసారి, తండ్రి అత్యవసరమైన పని మీద హఠాత్తుగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత తండ్రి రాజు వద్దకు వెళ్ళి, తను హఠాత్తుగా ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైందనీ, తనకు బదులుగా మూగవాడైన తన కుమారుడు నగరం చుట్టూ గస్తీ తిరుగుతూ, నాలుగు జాముల్లోనూ డప్పు మోగిస్తాడనీ విన్నవించాడు. అందుకు రాజు నిరాక్షేపణీయంగా సమ్మతించాడు. మారువేషంలో రాత్రివేళ నగరంలో తిరుగుతూ, పర్యవేక్షించడం రాజుకు అలవాటు. ఈ మూగ మొద్దు తన కర్తవ్యం ఎలా నిర్వర్తిస్తాడో చూడాలనుకున్నాడు రాజు. మూగవాడు వీథి వెంట వీథిగా, డప్పు మ్రోగించుకుంటూ గస్తీ తిరిగుతున్నాడు. అతడికి తెలియకుండా రాజు అతని వెంట నీడలా అనుసరిస్తున్నాడు. డప్పు మ్రోగించి, హెచ్చరికగా కేక పెట్టవలసిన సమయం ఆసన్నమైంది.  అంతలో.. కామః క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః । జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత ॥ “కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు, మనలోని జ్ఞానమనే విలువైన రత్నములను దొంగిలించటానికి మన దేహంలో దాగి వున్న దొంగలు. కావున ఓ మానవులారా.. సావధానులై ఉండండి.” అని కేకలుపెడుతూ, మూగవాడిగా భావింపబడే అతడు వీధులలో నడవసాగాడు. మరుగున ఉండి ఇదంతా గమనిస్తున్న రాజు దిగ్భ్రాంతుడయ్యాడు. “ఈ యువకుడు నిజానికి మూగ కాదు, అతడొక జీవన్ముక్తుడు” అన్న విషయాన్ని గ్రహించి మహదానందం చెందాడు.

మొదటి జాము ముగిసింది; కొంతసేపటికి రెండవ జాము కూడా వచ్చింది. రాజు ఆ జీవన్నుక్తుణ్ణి గమనిస్తూనేవున్నాడు. అతడు డప్పు మ్రోగించి ఈ సారి ఇలా పలికాడు: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః । సంసార సాగరం దుఃఖం తస్మాత్‌ జాగ్రత జాగ్రత ॥ “ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము, ఇవన్నీ దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి!” అంటూ జీవన్ముక్తుడైన యువకుడు పలకడం రాజు విన్నాడు. ఇక మూడవ జాములో యువకుడు డప్పు మ్రోగించి ఇలా అన్నాడు: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధుహ్ సహోదరః | అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్‌ జాగ్రత జాగ్రత ॥ “తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిధ్యయే. ఇవేవీ నిజము కాదు. కనుక ఓ మానవులారా, సావధానులై ఉండండి!” మూడవ జాములో జీవన్నుక్తుడు డప్పు మ్రోగించి హెచ్చరిస్తూ పలికిన మాటలను, రాజు తన్మయత్వంతో విన్నాడు. తరువాత యథాప్రకారం జీవన్ముక్తుణ్ణి రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళసాగాడు. ఇంతలో నాలుగవ జాము వచ్చింది. వీథుల్లో డప్పు మ్రోగిస్తూ వెళుతున్న ఆ యువకుడు, “పారాహుషార్‌” చెబుతూ ఇలా పలికాడు: ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా । ఆయుః క్షీణం న జానాతి తస్మాత్‌ జాగ్రత జాగ్రత ॥ “మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకూ, కర్మకూ కట్టుబడి, ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్దాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి!” నాలుగు జాముల్లోనూ, ఆ యువకుడు డప్పు మ్రోగించి వెలిబుచ్చిన వేదాంత సత్యాలు, రాజు హృదయాన్ని అమితంగా ఆకర్షించాయి. రాజు ఆ జీవన్ముక్తుని మనస్సులోనే స్తుతించి, ప్రణమిల్లాడు. ఆ మహాత్ముడు సమ్మతిస్తే, ఆయనకు నచ్చిన పనిలో నియుక్తుని చేసి, తనకు చేరువలోనే ఉంచుకోవాలని రాజు భావిస్తూ, అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు.

మర్నాడుదయం, జీవన్ముక్తుడి తండ్రి రాజ దర్శనానికి వచ్చినప్పుడు రాజు అతడితో, “ఇంతవరకూ మూగవాడిలా ఉంటూ వచ్చిన నీ కుమారుడు, నిజానికి ఒక జీవన్ముక్తుడు. అటువంటి మహోన్నతుడు మన రాజ్యంలో జీవిస్తూ ఉండటం, మన పూర్వులు చేసిన పుణ్య ఫలమే! ఆయన ఒకసారి మన అంతః పురం విచ్చేయడానికి సమ్మతిస్తే బాగుంటుంది. ఈ నా మనవిని ఆయనకు తెలుపండి” అని అన్నాడు. అయోమయంలో పడిపోయిన ఆ తండ్రి, రాజు చెప్పిన ప్రకారమే తన కుమారుణ్ణి తీసుకు వచ్చాడు. రాజు ఆనందభరితుడై జీవన్ముక్తునితో, “అయ్యా, అంతఃపురంలో మీకు ఏ పని ఇష్టమో తెలియజేయండి. నేను మిమ్మల్ని అందులో నియుక్తుని చేస్తాను” అని వేడుకుంటున్న ధోరణిలో చెప్పాడు. అందుకు జీవన్ముక్తుడు ఇలా స్పందించాడు.. “ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి శిరచ్ఛేదన దండన విధిస్తున్నారు కదా! అటువంటి నేరస్థులను నా వద్దకు పంపండి. వారికి నేనే స్వయంగా శిరచ్ఛేదన చేసి, మరణ దండనను అమలు పరుస్తాను. ఈ నా వేడుకోలును ఆమోదింపమని విన్నవించుకుంటున్నాను” అని అన్నాడు. జీవన్ముక్తుడు అటువంటి విచిత్రమైన విధి నిర్వహణను ఎందుకడుగుతున్నాడనే మర్మం రాజుకు అర్థం కాకపోయినా, ఎదురు చెప్పలేదు. జీవన్ముక్తుని వేడుకోలును వెంటనే నెరవేర్చమని ఆదేశించాడు. వధ్య స్థలానికి దగ్గరే జీవన్ముక్తుడు బస చేయడానికి అనువుగా, ఒక కుటీరాన్ని నిర్మించారు అధికారులు. ఆ కుటీరానికి ప్రక్కనే, నేరస్థులు ఉండటానికి ఒక చోటును కేటాయించారు. మూగగా పరిగణింపబడుతూ వచ్చిన యువకుడు, నేరస్థులకు శిరచ్ఛేదన చేస్తూ, మరణ దండనను అమలుపరిచే పనిని సక్రమంగా నిర్వర్తించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది..

ఒక రోజు యమధర్మరాజు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు విచారవదనుడై వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విషయం అడుగగా,  అందుకు యమధర్మరాజు, “దేవా! భూలోకంలో ఘోర నేరాలు చేసిన వారిని, నేను నరకానికి ఈడ్చుకొచ్చి, నరక యాతనలకు గురిచేయడం నా ధర్మము! నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ధర్మం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి మారింది. గత కొన్ని నెలలుగా నాకు పని తగ్గింది. నరకానికి వచ్చే వారు కరువయ్యారు. ఒక ప్రాంతంలోని పాపులు ఏమైపోతున్నారో, ఎక్కడికి పోతున్నారో అంతుబట్టడం లేదు.” అని అన్నాడు. కారణం తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు దృష్టి సారించి చూడగా, రాజసభలో జరుగుతున్న తతంగమూ, ఘోరమైన నేరాలు చేసిన వారికి రాజు మరణ దండన విధించడమూ, భటులు నేరస్థులను వధ్యస్థలానికి ఈడ్చుకుపోవడమూ గమనించాడు.

అక్కడొక యువకుడు, నేరస్థులకు శిరచ్ఛేదన చేయడం కూడా బ్రహ్మదేవుడు చూశాడు. కానీ, వధ్యస్థలంలో మరణ దండనను ఒక విచిత్రమైన పద్ధతిలో అమలుపరుస్తున్నాడు, ఆ యువకుడు. వధ్యస్థలం ఎదురుగా రెండు పెద్ద చిత్రపటాలను ఉంచాడు. వాటిలో ఒకటి మహాశివుడిది, రెండవది మహావిష్ణువుది. రెండు చిత్రాలూ హృదయాలను అలవోకగా ఆకర్షించేటంత దివ్యత్వం ఉట్టిపడుతున్నవిగా ఉన్నాయి. చిత్రాలకు అలంకరించిన పూలమాలలనుండి వస్తున్న పరిమళం, చుట్టూ వ్యాపిస్తోంది. దేవాలయాలలో వెలుగొందే తీరులో, ధూప దీపాలు వెలుగుతున్నాయి. వాటి పరిమళం, వధ్యస్థలం అంతటా వ్యాపించి ఉంది. మొత్తం మీద ఆ స్థలంలో, దేవాలయాలలోని విశేష పవిత్రత సంతరించుకుని ఉన్నది. అక్కడకు తీసుకు రాబడిన నేరస్థులను ఆ యువకుడు, అలంకరించబడిన రెండు దైవ చిత్తరువుల ముందు నిలబెట్టి, శివుడు, విష్ణువుల మహిమలను వారి హృదయాలలో హత్తుకుపోయే రీతిలో, సరళంగా ప్రవచించాడు. అతడు చెబుతున్నది వింటున్న నేరస్థుల కళ్ళు దైవ చిత్తరువులలో లయించిపోయి, మనస్సులు దైవ చింతనలో ఓలలాడసాగాయి. ఆ స్థితిలో, యువకుడు వారి వెనుక నిలబడి, కత్తితో వారి తలలను ఖండించివేశాడు. ఏం జరుగుతున్నదో తెలియని స్థితిలో, దైవ తలంపే తమ మనస్సులను పూర్తిగా ఆక్రమించి ఉండగా, నేరస్థుల శిరచ్ఛేదన జరిగిపోసాగింది. ఇదంతా చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి, ఆ యువకుని ఎదుట ప్రత్యక్షమై, అలా ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించాడు.

అప్పుడా యువకుడు, తన గత జన్మలో అంత్య కాలంలో జరిగిన సంఘటనను గుర్తుచేశాడు. “అంతిమ సమయంలో నా చెవిలో మురికివాడ” అనే మాట పడడం వలన, మనస్సులో మురికివాడ గురించిన తలంపు తలెత్తిన స్థితిలో, నా ప్రాణం పోయింది. నా మనస్సును అప్పుడు ఆక్రమించిన భావనే, నా మరు జన్మకు కారణమైంది. పైగా, “మరణ సమయంలో నన్నే తలచుకుంటూ ప్రాణం విడిచేవాడు నన్నే పొందుతాడ”ని, గీతలో సాక్షాత్తు భగవానుడే చెప్పాడు. “కనుక ఇక్కడకు తీసుకురాబడే నేరస్తులు, భగవంతుడిని తలచుకుంటూ ప్రాణం విడిస్తే, అ భగవంతుడినే చేరుకుంటారు. అందుకే నేరస్థుల ప్రాణం పోతున్నప్పుడు, వారి మనస్సులలో భగవంతుడే ఉండిపోయే రీతిలో, ఇక్కడ ఏర్పాట్లు చేయించాన”ని జీవన్ముక్తుడు వ్యక్తపరిచాడు.

భగవంతుడిని చేరి, ఆయన సాయుజ్యం పొందడమే, ప్రతి ప్రాణీ చేరవలసిన లక్ష్యం. కానీ, జనన మరణ వలయాన్ని అధిగమించి, భగవంతుని సాయుజ్యం పొందడం అంత సులువు కాదు. మరణ దండనను అమలుపరిచే కర్తవ్యాన్ని స్వీకరించిన యువకుడు, అతి సులువుగా నేరస్థులకు భగవంతుడిని పొందే మార్గాన్ని ఆవిష్కరించాడు. అందుకే బ్రహ్మదేవుడు ఆ యువకుని ప్రశంసించి, ఆశీర్వదించి, అంతర్ధానమయ్యాడు. మనుష్యులను సన్మార్గం వైపు నడిపించే ఇటువంటి మంచి కథలను, మన చుట్టూ ఉన్నవారికి కూడా వినిపించి, లోకంలో మంచిని పెంచే ప్రయత్నం చేద్దాము..

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...