జీవన్ముక్తుడు! అద్భుత సత్యం.. Story of Jeevan Mukta
జీవన్ముక్తుడు! అద్భుత సత్యం..
అంత్యకాల చింతనలే మరుజన్మను నిర్ణయిస్తాయా?
"జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ" అని గీతాచార్యుడు చెప్పినట్లు.. “పుట్టినవానికి మరణం తప్పదు; మరణించినవానికి మరల జన్మము తప్పదు”. కానీ, అంత్య సమయంలో ఆ జీవి మనస్సులో మెదిలే ఆలోచనలను బట్టే, మరుజన్మ ఉంటుందన్నది సనాతన సత్యం. ఆ సమయంలో ‘దైవ నామ స్మరణ’ మోక్ష దాయకమని పెద్దలు చెబుతారు. అయితే, అలాంటి సద్భావన అటువంటి క్షణాలలో కలగాలంటే, ముందునుండే నిత్య దైవ నామ స్మరణ అలవరచుకోవాలి, లేదా, ఆ సమయంలో మనస్సును దైవంపై నిలకడగా నిలబెట్టగల సత్సాంగత్యమైనా ఉండాలి. వీటన్నింటికీ ఉదాహరణగా, ఈ రోజు ఒక అద్భుతమైన కథను చెప్పుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/y6vublgZiQ0 ]
చాలా కాలం క్రితం మాధవపురి అనే ఊరిలో, భక్తాగ్రేసరుడొకాయన జీవించేవాడు. భగవంతుని పట్ల అచంచల భక్తిని పెంపొందించుకోవడం ఒక్కటే ఆయన లక్ష్యం. అనునిత్యం జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడం ఆయనకు పరిపాటి. తన లక్ష్యం నుండి ఎప్పుడూ, ఏ కారణంచేతా ఆయన వైదొలగే వాడు కాడు. ఇలా ఆయన తపోమయ జీవితాన్ని దృఢనిశ్చయంతో గడపేవాడు. దాంతో కాలక్రమంలో ఆయన ఆధ్యాత్మికంగా చక్కని పురోగతిని సంతరించుకున్నాడు. ఆయన వద్దకు ఆత్మోపదేశం పొందడానికి పలువురు యువకులు వచ్చేవారు. ఆయన వారికి దైవభక్తి కలిగి ఉండటం ఒక్కటే జీవిత లక్ష్యమని స్పష్టంగా, వారి హృదయాలలో బాగా నాటుకుపోయేటట్లు వివరించి చెప్పేవాడు. తాను ఎటువంటి జీవితం గడుపుతూ వచ్చాడో, అటువంటి జీవితాన్నే తు.చ. తప్పక పాటిస్తూ గడపమని, తన శిష్యులకు బోధించేవాడు. దానినే ఆయన తన జీవితంలో ప్రతిఫలింపజేశాడు.
కాలానుగుణంగా, వృద్ధాప్యం ఆయనను కమ్ముకోసాగింది. తన ఆయుర్దాయం త్వరలోనే ముగియనున్నదని గ్రహించిన ఆయన, తన అవసాన కాలాన్ని ముక్తి ధామమైన కాశీలో గడపాలని అభిలషించాడు. గురువుగారి మనోభావనను శిష్యులు అవగతం చేసుకుని ఆయనను సమీపించి వినమ్రంగా, “స్వామీ! మీ అభిలాష ప్రకారమే, మిమ్మల్ని ఒక పల్లకీలో కూర్చుండబెట్టుకుని మేం కాశీకి తీసుకుపోతాము. ఎక్కడా పెద్దగా ఆగకుండా పయనిస్తే కొద్ది రోజుల్లోనే కాశీకి చేరుకోగలము” అని అన్నారు. వారి ప్రతిపాదనకు ఆయన మనస్ఫూర్తిగా సమ్మతించాడు. శిష్యులు తమ గురువును పల్లకీలో మోసుకుంటూ కాశీకి బయలుదేరారు. ప్రయాణం కొద్ది రోజులు సాగింది. శిష్యులు పల్లకీని ఒకింత వేగంగానే మోసుకు వెళ్ళసాగారు. త్వరలోనే కాశీకి చేరుకుంటారన్న తరుణంలో, గురువుకు తన అవసానం ముంచుకు వచ్చేసిందని అర్ధం అయింది. అప్పుడాయన ఎక్కడున్నామని శిష్యులను ప్రశ్నించాడు. పల్లకీ కాశీని చేరుకున్నదేమో అని నిర్ధారణ చేసుకోవడానికి, ఆయన అలా అడిగాడు. అప్పటికి పల్లకీ ఇంకా కొన్ని గంటల ప్రయాణానంతరం మాత్రమే కాశీని చేరుకునే స్థితిలో ఉంది. ఇంకా కాశీని చేరుకోలేదు. కనుక శిష్యులు, “స్వామీ పల్లకీ ఇప్పుడు ఒక మురికివాడ చేరువలో ఉంది” అని జవాబిచ్చారు. పల్లకీలో ఉన్న గురువు చెవులలో, శిష్యులు జవాబు చెబుతున్న సమయంలోనే, గురువు శ్వాస ఆగింది.
మరణిస్తున్న సమయంలో మనిషి ఎటువంటి చింతనలు చేస్తూ ఉంటాడో, ఆ చింతనలే ఆతడి మరుజన్మను నిర్ణయిస్తాయని, మహాత్ములు చెబుతారు. మరణిస్తున్నప్పుడు, “మురికివాడ” అనే మాట చెవులలో పడడంవలన, మురికివాడ జ్ఞాపకం గురువు హృదయంలో పాతుకుపోయింది. ఆ కారణంగా, ఆయన మరుజన్మలో అంత్యకులజులు నివసించే ప్రాంతమైన ఒక గూడెంలో జన్మించాడు! కానీ, తపోమయ జీవితం గడపడం వలన, ఆ ఉత్తమ సంస్కారాలు వృథా పోలేదు. రాజు కొలువులో పని చేస్తున్న ఒక అంత్యకులస్థుని ఇంట్లో ఆయన జన్మించాడు. ఆ అంత్యకులస్థుడి కర్తవ్యం, ప్రతి రోజూ రాత్రంతా రాజధాని నగరం చుట్టూ గస్తీ తిరుగడం, రాత్రి నాలుగు జాముల్లోనూ, వీథుల్లో డప్పు వాయిస్తూ, 'పారా హుషార్! జాగ్రత్తగా ఉండండి!” అంటూ కేకలు పెట్టి, జనులను హెచ్చరించడం. రాత్రి వేళ దొంగలు తమ హస్తలాఘవాన్ని చూపడానికి అవకాశం లేకుండా, రాజు చేసిన ఏర్పాటు అది.
ఆ అంత్యకులస్థునికే, గురువు మరుజన్మలో కుమారునిగా జన్మించాడు. ఈ జన్మలోనూ, ఆయనకు తన గతజన్మకు సంబంధించిన భావనలు కొనసాగాయి. అతడికి లౌకిక జీవితం పట్ల చెప్పలేనంత ఏవగింపు. జనుల్లో అత్యధిక పాలు, అవిద్యకు లోబడే జీవితం గడుపుతున్నారు. కనుక అతడు, లౌకిక అనురక్తి గల జనులతో మెలగకుండా, ఏకాంతంలో ఉండిపోయేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఇలా జీవిస్తున్న అతణ్ణి, జన్మతః మూగవాడని, కుటుంబ సభ్యులూ, ఊరి జనం జమకట్టారు. ఈ స్థితిలో తండ్రి, కుమారుణ్ణి నిష్ప్రయోజకుడు, ఒట్టి మొద్దని భావించి, పెద్దగా పట్టించుకునేవాడు కాదు. దాంతో పిల్లవాడు, తన ధోరణిలోనే ఎదుగుతూ వచ్చాడు.
ఇలా ఉండగా ఒకసారి, తండ్రి అత్యవసరమైన పని మీద హఠాత్తుగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత తండ్రి రాజు వద్దకు వెళ్ళి, తను హఠాత్తుగా ఊరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురైందనీ, తనకు బదులుగా మూగవాడైన తన కుమారుడు నగరం చుట్టూ గస్తీ తిరుగుతూ, నాలుగు జాముల్లోనూ డప్పు మోగిస్తాడనీ విన్నవించాడు. అందుకు రాజు నిరాక్షేపణీయంగా సమ్మతించాడు. మారువేషంలో రాత్రివేళ నగరంలో తిరుగుతూ, పర్యవేక్షించడం రాజుకు అలవాటు. ఈ మూగ మొద్దు తన కర్తవ్యం ఎలా నిర్వర్తిస్తాడో చూడాలనుకున్నాడు రాజు. మూగవాడు వీథి వెంట వీథిగా, డప్పు మ్రోగించుకుంటూ గస్తీ తిరిగుతున్నాడు. అతడికి తెలియకుండా రాజు అతని వెంట నీడలా అనుసరిస్తున్నాడు. డప్పు మ్రోగించి, హెచ్చరికగా కేక పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. అంతలో.. కామః క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః । జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత ॥ “కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు, మనలోని జ్ఞానమనే విలువైన రత్నములను దొంగిలించటానికి మన దేహంలో దాగి వున్న దొంగలు. కావున ఓ మానవులారా.. సావధానులై ఉండండి.” అని కేకలుపెడుతూ, మూగవాడిగా భావింపబడే అతడు వీధులలో నడవసాగాడు. మరుగున ఉండి ఇదంతా గమనిస్తున్న రాజు దిగ్భ్రాంతుడయ్యాడు. “ఈ యువకుడు నిజానికి మూగ కాదు, అతడొక జీవన్ముక్తుడు” అన్న విషయాన్ని గ్రహించి మహదానందం చెందాడు.
మొదటి జాము ముగిసింది; కొంతసేపటికి రెండవ జాము కూడా వచ్చింది. రాజు ఆ జీవన్నుక్తుణ్ణి గమనిస్తూనేవున్నాడు. అతడు డప్పు మ్రోగించి ఈ సారి ఇలా పలికాడు: జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః । సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత ॥ “ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము, ఇవన్నీ దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి!” అంటూ జీవన్ముక్తుడైన యువకుడు పలకడం రాజు విన్నాడు. ఇక మూడవ జాములో యువకుడు డప్పు మ్రోగించి ఇలా అన్నాడు: మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధుహ్ సహోదరః | అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత ॥ “తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవన్నీ మిధ్యయే. ఇవేవీ నిజము కాదు. కనుక ఓ మానవులారా, సావధానులై ఉండండి!” మూడవ జాములో జీవన్నుక్తుడు డప్పు మ్రోగించి హెచ్చరిస్తూ పలికిన మాటలను, రాజు తన్మయత్వంతో విన్నాడు. తరువాత యథాప్రకారం జీవన్ముక్తుణ్ణి రహస్యంగా అనుసరిస్తూ వెళ్ళసాగాడు. ఇంతలో నాలుగవ జాము వచ్చింది. వీథుల్లో డప్పు మ్రోగిస్తూ వెళుతున్న ఆ యువకుడు, “పారాహుషార్” చెబుతూ ఇలా పలికాడు: ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా । ఆయుః క్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత ॥ “మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకూ, కర్మకూ కట్టుబడి, ఏవేవో ఆలోచనలతో జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్దాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి!” నాలుగు జాముల్లోనూ, ఆ యువకుడు డప్పు మ్రోగించి వెలిబుచ్చిన వేదాంత సత్యాలు, రాజు హృదయాన్ని అమితంగా ఆకర్షించాయి. రాజు ఆ జీవన్ముక్తుని మనస్సులోనే స్తుతించి, ప్రణమిల్లాడు. ఆ మహాత్ముడు సమ్మతిస్తే, ఆయనకు నచ్చిన పనిలో నియుక్తుని చేసి, తనకు చేరువలోనే ఉంచుకోవాలని రాజు భావిస్తూ, అంతఃపురానికి తిరిగి వెళ్ళిపోయాడు.
మర్నాడుదయం, జీవన్ముక్తుడి తండ్రి రాజ దర్శనానికి వచ్చినప్పుడు రాజు అతడితో, “ఇంతవరకూ మూగవాడిలా ఉంటూ వచ్చిన నీ కుమారుడు, నిజానికి ఒక జీవన్ముక్తుడు. అటువంటి మహోన్నతుడు మన రాజ్యంలో జీవిస్తూ ఉండటం, మన పూర్వులు చేసిన పుణ్య ఫలమే! ఆయన ఒకసారి మన అంతః పురం విచ్చేయడానికి సమ్మతిస్తే బాగుంటుంది. ఈ నా మనవిని ఆయనకు తెలుపండి” అని అన్నాడు. అయోమయంలో పడిపోయిన ఆ తండ్రి, రాజు చెప్పిన ప్రకారమే తన కుమారుణ్ణి తీసుకు వచ్చాడు. రాజు ఆనందభరితుడై జీవన్ముక్తునితో, “అయ్యా, అంతఃపురంలో మీకు ఏ పని ఇష్టమో తెలియజేయండి. నేను మిమ్మల్ని అందులో నియుక్తుని చేస్తాను” అని వేడుకుంటున్న ధోరణిలో చెప్పాడు. అందుకు జీవన్ముక్తుడు ఇలా స్పందించాడు.. “ఘోరమైన నేరాలకు పాల్పడిన వారికి శిరచ్ఛేదన దండన విధిస్తున్నారు కదా! అటువంటి నేరస్థులను నా వద్దకు పంపండి. వారికి నేనే స్వయంగా శిరచ్ఛేదన చేసి, మరణ దండనను అమలు పరుస్తాను. ఈ నా వేడుకోలును ఆమోదింపమని విన్నవించుకుంటున్నాను” అని అన్నాడు. జీవన్ముక్తుడు అటువంటి విచిత్రమైన విధి నిర్వహణను ఎందుకడుగుతున్నాడనే మర్మం రాజుకు అర్థం కాకపోయినా, ఎదురు చెప్పలేదు. జీవన్ముక్తుని వేడుకోలును వెంటనే నెరవేర్చమని ఆదేశించాడు. వధ్య స్థలానికి దగ్గరే జీవన్ముక్తుడు బస చేయడానికి అనువుగా, ఒక కుటీరాన్ని నిర్మించారు అధికారులు. ఆ కుటీరానికి ప్రక్కనే, నేరస్థులు ఉండటానికి ఒక చోటును కేటాయించారు. మూగగా పరిగణింపబడుతూ వచ్చిన యువకుడు, నేరస్థులకు శిరచ్ఛేదన చేస్తూ, మరణ దండనను అమలుపరిచే పనిని సక్రమంగా నిర్వర్తించసాగాడు. ఇలా కొంతకాలం గడిచింది..
ఒక రోజు యమధర్మరాజు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వద్దకు విచారవదనుడై వెళ్ళాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విషయం అడుగగా, అందుకు యమధర్మరాజు, “దేవా! భూలోకంలో ఘోర నేరాలు చేసిన వారిని, నేను నరకానికి ఈడ్చుకొచ్చి, నరక యాతనలకు గురిచేయడం నా ధర్మము! నాకు అప్పగించిన ఈ కర్తవ్యాన్ని ధర్మం తప్పకుండా నిర్వర్తిస్తున్నాను. ఇప్పుడు పరిస్థితి మారింది. గత కొన్ని నెలలుగా నాకు పని తగ్గింది. నరకానికి వచ్చే వారు కరువయ్యారు. ఒక ప్రాంతంలోని పాపులు ఏమైపోతున్నారో, ఎక్కడికి పోతున్నారో అంతుబట్టడం లేదు.” అని అన్నాడు. కారణం తెలుసుకోవడానికి బ్రహ్మదేవుడు దృష్టి సారించి చూడగా, రాజసభలో జరుగుతున్న తతంగమూ, ఘోరమైన నేరాలు చేసిన వారికి రాజు మరణ దండన విధించడమూ, భటులు నేరస్థులను వధ్యస్థలానికి ఈడ్చుకుపోవడమూ గమనించాడు.
అక్కడొక యువకుడు, నేరస్థులకు శిరచ్ఛేదన చేయడం కూడా బ్రహ్మదేవుడు చూశాడు. కానీ, వధ్యస్థలంలో మరణ దండనను ఒక విచిత్రమైన పద్ధతిలో అమలుపరుస్తున్నాడు, ఆ యువకుడు. వధ్యస్థలం ఎదురుగా రెండు పెద్ద చిత్రపటాలను ఉంచాడు. వాటిలో ఒకటి మహాశివుడిది, రెండవది మహావిష్ణువుది. రెండు చిత్రాలూ హృదయాలను అలవోకగా ఆకర్షించేటంత దివ్యత్వం ఉట్టిపడుతున్నవిగా ఉన్నాయి. చిత్రాలకు అలంకరించిన పూలమాలలనుండి వస్తున్న పరిమళం, చుట్టూ వ్యాపిస్తోంది. దేవాలయాలలో వెలుగొందే తీరులో, ధూప దీపాలు వెలుగుతున్నాయి. వాటి పరిమళం, వధ్యస్థలం అంతటా వ్యాపించి ఉంది. మొత్తం మీద ఆ స్థలంలో, దేవాలయాలలోని విశేష పవిత్రత సంతరించుకుని ఉన్నది. అక్కడకు తీసుకు రాబడిన నేరస్థులను ఆ యువకుడు, అలంకరించబడిన రెండు దైవ చిత్తరువుల ముందు నిలబెట్టి, శివుడు, విష్ణువుల మహిమలను వారి హృదయాలలో హత్తుకుపోయే రీతిలో, సరళంగా ప్రవచించాడు. అతడు చెబుతున్నది వింటున్న నేరస్థుల కళ్ళు దైవ చిత్తరువులలో లయించిపోయి, మనస్సులు దైవ చింతనలో ఓలలాడసాగాయి. ఆ స్థితిలో, యువకుడు వారి వెనుక నిలబడి, కత్తితో వారి తలలను ఖండించివేశాడు. ఏం జరుగుతున్నదో తెలియని స్థితిలో, దైవ తలంపే తమ మనస్సులను పూర్తిగా ఆక్రమించి ఉండగా, నేరస్థుల శిరచ్ఛేదన జరిగిపోసాగింది. ఇదంతా చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి, ఆ యువకుని ఎదుట ప్రత్యక్షమై, అలా ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించాడు.
అప్పుడా యువకుడు, తన గత జన్మలో అంత్య కాలంలో జరిగిన సంఘటనను గుర్తుచేశాడు. “అంతిమ సమయంలో నా చెవిలో మురికివాడ” అనే మాట పడడం వలన, మనస్సులో మురికివాడ గురించిన తలంపు తలెత్తిన స్థితిలో, నా ప్రాణం పోయింది. నా మనస్సును అప్పుడు ఆక్రమించిన భావనే, నా మరు జన్మకు కారణమైంది. పైగా, “మరణ సమయంలో నన్నే తలచుకుంటూ ప్రాణం విడిచేవాడు నన్నే పొందుతాడ”ని, గీతలో సాక్షాత్తు భగవానుడే చెప్పాడు. “కనుక ఇక్కడకు తీసుకురాబడే నేరస్తులు, భగవంతుడిని తలచుకుంటూ ప్రాణం విడిస్తే, అ భగవంతుడినే చేరుకుంటారు. అందుకే నేరస్థుల ప్రాణం పోతున్నప్పుడు, వారి మనస్సులలో భగవంతుడే ఉండిపోయే రీతిలో, ఇక్కడ ఏర్పాట్లు చేయించాన”ని జీవన్ముక్తుడు వ్యక్తపరిచాడు.
భగవంతుడిని చేరి, ఆయన సాయుజ్యం పొందడమే, ప్రతి ప్రాణీ చేరవలసిన లక్ష్యం. కానీ, జనన మరణ వలయాన్ని అధిగమించి, భగవంతుని సాయుజ్యం పొందడం అంత సులువు కాదు. మరణ దండనను అమలుపరిచే కర్తవ్యాన్ని స్వీకరించిన యువకుడు, అతి సులువుగా నేరస్థులకు భగవంతుడిని పొందే మార్గాన్ని ఆవిష్కరించాడు. అందుకే బ్రహ్మదేవుడు ఆ యువకుని ప్రశంసించి, ఆశీర్వదించి, అంతర్ధానమయ్యాడు. మనుష్యులను సన్మార్గం వైపు నడిపించే ఇటువంటి మంచి కథలను, మన చుట్టూ ఉన్నవారికి కూడా వినిపించి, లోకంలో మంచిని పెంచే ప్రయత్నం చేద్దాము..
Comments
Post a Comment