Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, October 7, 2024

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai


అష్టదిగ్బంధనం! అష్టదిక్పాలకుల బంధనంలో అరుణాచలం! TELUGU VOICE
తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడు అష్టలింగాలతో దిగ్బంధనం చేయబడ్డాడా?

సనాతన సాంప్రదాయంలో అష్ట దిక్కులకూ, ఆ దిక్కులను పాలించే అష్ట దిక్పాలకులకూ ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం అలా ఎనిమిది దిక్కులలోనూ ఎనిమిది మంది ఉప దేవతలైన దిక్పాలకుల శక్తిని నిక్షేపించి, ఒక రక్షణ వలయాన్ని ఏర్పరచడమే, ‘అష్టదిగ్బంధనం’. సాధారణంగా ఒక ప్రదేశానికి రక్షణ ఏర్పాటు చేయడానికి, రత్నాధ్యాయ క్రియను వినియోగిస్తారు. అంటే, ఎనిమిది దిక్కులలో ఎనిమిది గ్రహాలకు చెందిన జాతి రత్నాలను, కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను పఠిస్తూ భూమిలో నిక్షిప్తం చేస్తారు. తద్వారా ఆ రత్నాలు Receivers లా పనిచేస్తూ, అంతరీక్షంలోని ఆ రత్నాలకు చెందిన గ్రహాల యొక్క శక్తిని ఆకర్షించి, ఆ ప్రదేశాన్ని చెడునుంచి రక్షిస్తూ, నిత్యం ఉత్కృష్టమైన Positive Energy ని ప్రసరింపజేస్తుంటాయి. అటువంటిది, సాక్షాత్తూ ఆ దిక్పాలకులే దిగివచ్చి, అరుణాచలేశ్వరుడి చుట్టూ వారి వారి స్థానాలలో ప్రతిష్ఠితమైన అరుణాచల క్షేత్రం గురించి ఇక వేరే చెప్పాలా! అంతటి అరుణాచలేశ్వరుడి విశిష్ఠతను వివరిస్తూ, గతంలో చేసిన వీడియోను కూడా తప్పక చూడండి. మరి అరుణాచలేశ్వరుడి అష్టదిగ్బంధనం వివరాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nyo3QJQ28AU ]


తమిళనాడులోని తిరువణ్ణామలై క్షేత్రంలో, పర్వత పాదం వద్ద స్వయంభువుగా వెలసి, అరుణాచలేశ్వరుడిగా ప్రసిద్ధి గాంచిన లింగ స్వరూపానికి చుట్టూ, ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలుండటం విశేషం. అరుణాచల పర్వతంపైనున్న అరుణాచలేశ్వరునికి ప్రదక్షణం చెయ్యాలనుకునే వారు, ఆ పర్వతానికి ఎనిమిది దిక్కులలో, భూమి మీద వెలసిన అష్టలింగాలను వరుసగా పూజించుకుంటూ ముందుకు వెళ్ళడం ఆనవాయితీ.

అరుణాచల గిరి పాదం వద్ద నిర్మించబడిన అరుణాచలేశ్వర ఆలయం, భారత దేశంలోని అతిపెద్ద ఆలయాలలో ఒకటి. సా.శ. 1502 - 1529 మధ్య కాలంలో, నాడు విజయ నగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయులు, ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయాన్ని నిర్మించినట్టుగా, శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడున్న ఆలయంలోని గర్భగుడి, 11వ శతాబ్దంలో నిర్మించబడింది. పంచభూత లింగాలలో ఒకటైన ఈ గుడిలోని శివలింగం, అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అరుణాచలేశ్వర ఆలయం, 24 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించివుండి, అందంగా చెక్కబడిన 13 అంతస్తుల గోపురాలుంటాయి. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా, తూర్పు వైపున ఆలయ ప్రాంగణంలో, వేయి స్తంభాలతో నిర్మించబడిన ఒక భవనం ఉంటుంది. ఇక సకల జీవరాశి శ్రేయస్సుకై వెలసిన అరుణాచలేశ్వర శక్తిని నిత్యం కాపుగాస్తూ, అరుణ గిరి చుట్టూ ఆ దిక్పాలకులు స్వయంగా ప్రతిష్ఠించి, అష్టదిగ్బంధనం చేసిన అష్టలింగాల వివరాలలోకి వెళితే..

తూర్పు.. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పుదిక్కుకు అధిపతి, ‘ఇంద్రుడు’. కనుక ఆ దిక్కున ఇంద్ర లింగం ఉంది. నేటి తిరువణ్ణామలై పట్టణంలోని రధం వీధిలో, ఈ ఇంద్రలింగం కనిపిస్తుంది. మన పురాణాల ప్రకారం, ఇంద్రుడు దేవతలకు రాజు. ఆయన భార్య ఇంద్రాణి. వారిద్దరూ నాలుగు దంతాలుగల అపూర్వమైన ఐరావతమనే ఏనుగుపై, ముల్లోకాలలో సంచరిస్తారు. ఇంద్రుడు ఏనుగుపై కూర్చుని చేతిలో వజ్రాయుధాన్ని ధరించి ఉంటాడు. ఈయన మానవులలో ఉన్న అజ్ఞాన తిమిరాంధత్వాన్ని తొలగించి, విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

ఆగ్నేయం.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఆగ్నేయ దిక్కుకు అధిపతి, ‘అగ్ని’. అగ్ని దేవుడు ఏడు హస్తాలను, ఏడు నాలుకలను కలిగి ఉంటాడు. అగ్ని మానవులకూ, మరియు దేవతలకూ మధ్య అనుసంధాన కర్తగా ఉంటాడు. మానవులు యజ్ఞ యాగాదులు చేసినపుడు ఉత్పన్నమైన హవిస్సులను, దేవతలకు అందజేసే బాధ్యత అగ్ని దేవుడిదే. అగ్ని భట్టారకుడి వాహనం, మేక. ఈ మేకను సంస్కృతంలో అజమని పిలుస్తారు. దీనికి పొడవాటి కాళ్ళు, వెచ్చటి దేహం ఉంటాయి. యజ్ఞాలలో మేకలను పవిత్రమైనవిగా భావించి, బలి ఇవ్వటం జరుగుతుంది. తిరువణ్ణామలైలోని శేషాద్రి వీధిలో, ఈ అగ్ని లింగం కనిపిస్తుంది. చంగం రోడ్డు మీద ఉన్న శేషాద్రి ఆశ్రమానికి దగ్గరలో, శేషాద్రి వీధి ఉంటుంది.

దక్షిణం.. దక్షిణ దిక్కు విషయానికి వస్తే, ఆ దిక్కుకు యమధర్మరాజు అధిపతి. ఆయన మృత్యు దేవత. ఈ క్షేత్రంలో యముడి యొక్క శిల్పం, మహిషుడనే పేరుగల ఒక భారీ దున్నపోతు పైన కూర్చుని, భూతాల వంటి రెండు కుక్కలను ప్రక్కన పెట్టుకుని ఉంటాడు. యముడి చేతిలో యమపాశం ఉంటుంది. జీవులకు ఈ లోకంలో ఉండే సమయం పూర్తవ్వగానే, యమ పాశం వాటికి తగులుకుని, వాటిని యమ లోకానికి తీసుకు వెళుతుంది. యమధర్మరాజు నిరంకుశంగా, అమానుషంగా జీవుల ప్రాణాలు తీస్తున్నట్టు కనపడినప్పటికీ, ఆయనలో ఎంతో సమధర్మం, కర్తవ్య పాలనా, కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒకప్పుడు మార్కండేయుడనే 16 సంవత్సరాల బాలుడు, నిత్యం శివ పూజలో నిమగ్నమై ఉన్నప్పుడు, అతని ఆయుర్దాయం తీరిపోయింది. అందువలన యముడు తన వాహనంపై భూలోకంలో, ఆ బాలుడు ఉన్నచోటుకు వచ్చి, అతడి ప్రాణాన్ని తియ్యటానికి యమపాశాన్ని ప్రయోగించాడు. యముడ్ని చూసి భయపడిన మార్కండేయుడు గజగజలాడుతూ, ప్రాణ భయంతో శివ లింగాన్ని కౌగలించుకున్నాడు. యముడు తన ధర్మాన్ని నిర్వర్తించటంకోసం, శివలింగాన్ని అంటుకుపోయి ఉన్న మార్కండేయుడి ప్రాణాలను హరించాలని మొండిగా ప్రయత్నించినప్పుడు, పరమశివుడు అక్మడ ప్రత్యక్షమై, మార్మండేయుడి ప్రాణాలను తియ్యాలని చూసిన యముడిని భస్మంచేశాడు. సాక్షాత్తు మరణానికి అధిపతియైన కాలుడిని సంహరించివ ఈశ్వరుడు, ఆనాటి నుండి కాలసంహారమూర్తి అనేపేరును పొందాడు. అంటే, మృత్యువును నాశనంజేసేవాడని అర్ధం. ఆనాటి యమలింగం, తిరువణ్ణామలై పట్టణంలోని చెంగం రోడ్డు మీద ఉన్న శ్మశానానికి ప్రక్కన ఉంది. శ్మశానానికి అధిపతియైన యమలింగం శ్మశానానికి దగ్గరలో ఉండటం ఇక్కడ విశేషం.

నైఋతి.. వాస్తు శాస్త్ర సూత్రాల ప్రకారం, ఈ దిక్కును నైఋతి అనే రాక్షస రాజు, తన మిత్రుడైన యమ ధర్మరాజుతో కలసి పరిపాలిస్తుంటాడు. ఈ నైఋతి మానవులలోని రాగద్వేషాలకూ, కామక్రోధాలకూ కారణమవుతాడు. వీటి కారణంగానే జీవులు జనన మరణ చక్రంలో చిక్కుకుని, నిరంతరం జన్నిస్తూ, మరణిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో వెలసిన నైఋతి లింగాన్ని ఆరాధించిన వారికి, భవ బంధాలు తొలగిపోతాయనీ, మనశ్శాంతి లభిస్తుందనీ, ప్రాజ్ఞులు వక్కాణిస్తారు. ఈ లింగం తిరువణ్ణామలై పట్టణంలోని సోనాగిరి, మరియు శాంతిమలై కాంపౌండ్స్‌ దాటిన తరువాత, కుడివైపున గిరివలం మార్గం మీద ఉంటుంది.

పశ్చిమం.. పశ్చిమ దిక్కునకు వరుణ దేవుడు అధిపతి. ఈయన వర్షాలను కురిపిస్తాడు. మూల్లోకాలలోనూ జలాలను ప్రవహింపజేస్తాడు. మానవులలోని సుఖ లాలసతకు కారకుడు వరుణ దేవుడు. వరుణ దేవుడు మొసలి వాహనంపై శరవేగంతో ప్రయాణిస్తాడు. మొసలి భూమిపైన, మరియు నీటిలోనూ నివసించగల ఉభయ చరి. ఈ మొసలిని వాహనంగా కలిగిన వరుణ దేవుడు, మానవునియొక్క కర్మలను నిరంతరం గమనిస్తూ ఉంటాడు. అదే విధంగా, అదుపు తప్పిన మానవులను జలంలో విలీనంజేస్తాడు. అంటే, పాపాలు పెరిగిపోయినప్పుడు, వరదలూ, తుఫానులూ వచ్చి, పాపాత్ములైన జనాలను తుడిచి పెడతాయి. చాలామందికి తెలియని ఒక శాస్త్ర రహస్యమేమిటంటే, సూర్యుడు వరుణ దేవుడి యొక్క కన్ను అని. సూర్య దేవుడు వరుణ దేవుడి వాహనమైన మకర రాశిలో ఉన్నప్పుడు, మకర సంక్రాంతి అని పిలువబడే పుణ్యకాలం సంభవిస్తుంది. జనవరి నెల మధ్య భాగంలో వచ్చే మకర సంక్రాంతి, అత్యంత పుణ్యప్రదమైనదని చెప్పబడుతుంది. ఈ వరుణ లింగం, ఆదిఅణ్ణామలై అనేగ్రామానికి ముందు ఒక కిలోమీటరు దూరంలో ఉన్న గిరివలం మార్గంలో ఉంది.

వాయవ్యం.. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ దిక్కుకు, పంచభూతాలలో ఒకడైన వాయు దేవుడు అధిపతి. వాయు దేవుడు నాలుగు హస్తాలను కలిగి ఉండి, శరవేగంతో ప్రయాణించే జింకను వాహనంగా చేసుకుని, ప్రపంచమంతటా వాయు వేగంతో పర్యటిస్తూ ఉంటాడు. మానవులకు పాణప్రదాత వాయు దేవుడే. ఈ వాయు లింగం, గోశాలై అనబడే గ్రామానికి ప్రక్కన, గిరివలం మార్గం వద్ద ఉంది. ఈ లింగం యొక్క విశేషం ఏమిటంటే, ఈ ఆలయంలో ఎప్పుడూ ఈదురుగాలి వీస్తూ ఉంటుంది. అంటే, వాయుదేవుడు నిరంతరమూ అక్కడ వెలసి ఉన్న వాయులింగాన్ని పూజిస్తున్నాడని తెలుస్తుంది.

ఉత్తరం.. సమస్త సంపదలకూ అధిపత్తి అయిన కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. యక్షరాజైన కుబేరుడు, దేవతల యొక్క సంపదలను కాపలా కాస్తూ ఉంటాడు. కుబేరుడు శివుడికి ఆప్తమిత్రుడు. కుబేరుడికి మూడుకాళ్ళు, నోటిలో ఎనిమిది పళ్ళూ ఉంటాయి. బాగా బలిసిన ఒక ఆడమేక, కుబేరుడికి వాహనంగా ఉంటుంది. కుబేరుడు హిమాలయాలలో, తనభార్య అయిన యక్షితో కలసి నివసిస్తూ ఉంటాడు. తిరువణ్ణామలై పట్టణానికి చేరటానికి ముందు వచ్చే గిరివలం మార్గం కొస భాగంలో, ఈ కుబేర లింగం ఉంటుంది.

ఈశాన్యం.. శివుడికి చెందిన సప్త రుద్రులలో ఈశాన్యుడు ఒకరు. ఈశాన్యుడు జడలు కట్టిన జుట్టుతో, క్రోధ పూరితమైన కన్నులతో, పులి చర్మంపై ఆశీనుడై ఉంటాడు. ఈయన శరీరంపై విభూతి పూయబడి ఉంటుంది. చుట్టూ భూత, ప్రేత పిశాచాలు ఆవరించి ఉంటాయి. తలపై నెలవంక, జుట్టు కొప్పుపై గంగ ఉంటుంది. ఈయన శరీరాన్ని వందలాది పాములు చుట్టలు చుట్టకుని ఉంటాయి. చేతులలో ఢమరుకం, మరియు శూలం ఉంటాయి. ఈ ఈశాన్య శివలింగం, తిరువణ్ణామలై పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రక్కనున్న పాత శ్మశానానికి ప్రక్క రోడ్డుపై ఉంది.

ఇంతటి పవిత్రమైన, మహిమాన్వితమైన అరుణాచలేశ్వరుడి కృపా కటాక్షాలు అందరిపై ప్రసారించాలని మనసా, వాచా, కర్మణా ప్రార్ధిస్తున్నాను..

🚩 ఓం అరుణాచలేశ్వరాయ 🙏

Monday, September 30, 2024

The Aim of Human Life | మానవ జన్మ!


మానవ జన్మ! మనస్సును బుద్ధి నియంత్రణలో ఉంచగలిగితే! TELUGU VOICE
మయుడు నిర్మించిన మయసభను మరిపించే భ్రమల సౌధాన్ని కల్పించేది ఏది?

జన్మలలోకెల్లా అత్యుత్తమమైన మానవ జన్మను పొంది కూడా, సంసారజీవితంలో పడి కొట్టుకు పోతూ వుంటారు చాలామంది అమాయకంగా. అంతా తమ ప్రమేయంతోనే, తమ మూలకంగానే నడుస్తుందనే అహంకారంతో ఉంటారు ఎక్కువగా. కేవలం కుటుంబ జీవితాన్ని గడపడానికీ, మన వారసత్వాన్ని ఈ ప్రపంచంలో మిగిల్చి వెళ్ళడానికీ, ఈ లోకంలోకి రాలేదు మనం. అది అటూ ఇటుగా అన్ని జీవరాశులూ చేసే పనే.. మానవులకే కాదు, అన్ని జంతు జాతులకూ వారసులూ, కుటుంబాలూ వుంటాయి. కానీ మానవ జన్మను ఎత్తిన మనం, భగవత్ చింతన కోసం ఈ లోకంలోకి వచ్చామని, ఎవరికి వారు తెలుసుకుని తీరాలి. యుక్త వయస్సులో ఉన్నట్లుగా, ముదిమి వయస్సులో కూడా ఇల్లేమైపోతుందో, భార్య ఏమైపోతుందో, బిడ్డలేమైపోతారో అని చింతిస్తూ కూర్చుంటే, అంతకు మించిన అవివేకం మరొకటి లేదు. మనకు మనమే కాకుండా పోయే రోజులు దగ్గర పడుతున్నా కూడా, ఇంకెవరో, ఏదో అయిపోతారని ఆందోళన పడుతున్నామంటే, అది అచ్చంగా అవివేకమే! మరి ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iRjJtNLEQAo ]


ఈ విషయాన్ని గురించి గౌతమ బుద్ధుడు ఇలా అన్నాడు..

పుత్రా మే సంతి ధనం మే అస్తి ఇతి బాలో విహన్యతే |
ఆత్మా హి ఆత్మనో నాస్తి కుతః పుత్రః కుతో ధనమ్ ||

'నాకు కొడుకులున్నారు, ధనం ఉంది' అని ఆసక్త చిత్తులైన అజ్ఞానులు, కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. తనకు తానే లేనప్పుడు, ఇక కొడుకులూ, ధనం, తనదెలా అవుతుందని ఇక్కడ ప్రశ్నించాడు, బుద్ధ భగవానుడు. కళకళ లాడుతూ కళ్ళముందు తిరిగే భార్యా, సకలభోగాలలో ఓలలాడించిన ధనం కూడా మిమ్మల్ని విడిచిపెట్టే రోజొకటి వస్తుందనీ, సమస్త కాలచక్రాన్నీ తన కనుసన్నలలో తిప్పే కారుణ్యమూర్తి ఒకరున్నారనీ మనషులు ఎన్నడూ మరచిపోకూడదు. అలాగని, ఆత్మీయులను వదిలించుకోమని చెప్పడంలేదు.. వారి గురించే రేయింబవళ్ళూ చింతిస్తూ వుండిపోకుండా, దైవ చింతన అలవరచుకోమని, ఇందులోని సారాంశము. ఈ సృష్టిలో మనిషి తప్ప, ఏ జీవీ, తరతరాలకు సరిపడా పోగు చేసుకోవాలని తాపత్రయ పడదు. కారణం, వాటికి ప్రకృతిపైనా, పరమాత్మపైనా ఉన్న పూర్తి విశ్వాసం.

పేరుకు పరిణతి చెందిన జీవిగా చెప్పుకుంటూ, మరోవైపు ప్రకృతి నియమాలకు విరుద్ధంగా, పరమాత్మ ప్రణాళికకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు మనిషి. పులి కూడా ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. గుహ నిండా జింక మాంసాన్ని నింపుకుని, రోజుల తరబడీ తింటూ కూర్చోదు. పిల్లలను ఓ మూలన భద్రంగా కూర్చుండబెట్టి, తనే ఒళ్ళుగుల్ల చేసుకుని మాంసపు ముక్కలు తెచ్చి తినబెట్టదు. కానీ మనం మాత్రం, మునిమనుమళ్ళు కూడా ఏ చీకూ చింతా లేకుండా తింటూ కూర్చోవాలని, మనకున్న ఆయువునంతా హరింపజేసుకుంటూ, క్షణం తీరిక లేకుండా చింతిస్తూ, కాసులు కూడబెట్టుకుంటుంటాము.

ఇలాంటి సమయంలో ఎవరైనా మన పుణ్యం కొద్దీ వచ్చి, 'గుడికెళదామనో, ఏదైనా సంఘసేవ చేద్దామనో' అంటే, నాకు తీరిక లేదని చెప్పి తప్పించుకుంటూ వుంటాము. ఇలాంటి మన దుఃస్థితిని ముందే ఊహించిన ప్రహ్లాదుడు ఏనాడో.. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై, విషయ ప్రవిష్టులై, చచ్చుచు పుట్టుచున్ మరల చర్వితచర్వణులైన వారికిం జెచ్చెర బుట్టునే, పరులు సెప్పిననైన, నిజేచ్ఛనైన, నే మిచ్చిన నైన, కానలకు నేగిననైన, హరి ప్రబోధముల్? అని అన్నాడు. 'కొందరు గాఢమైన కారుచీకటి లాంటి ఈ మాయలో పడి, కోరికలను చంపుకోకుండా, సంసారం సాగిస్తూ ఉంటారు. అటువంటి మూర్ఖులకు, శ్రీహరిపై భక్తి దానంతట అదిగా పుట్టదు. ఒకవేళ ఇతరులు బోధించినా కలుగదు. ఏమైనా ఇచ్చి ఆశ చూపించినా, వారికి దేవుడి మీద భక్తి ఏర్పడదు. ఆఖరికి అడవులలోకి తీసుకు వెళ్ళినా, ఫలితం ఉండదు. భగవంతుడి మీదకు అంత త్వరగా మనస్సు పోతుందా!' అంటూ ఆవేదన పడ్డాడు ప్రహ్లాదుడు. కాబట్టి, మనిషికి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అలాగే, ఎప్పుడూ పనులు అంటూ, భగవంతుడినే దూరం పెట్టేలా ఉండకూడదు.

మనస్సు, బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి సేవకురాలు. మనసే బుద్ధిని నియంత్రిస్తే, అది ఒక నియంత. అది పాదరసం లాగా చురుకైనది. చేతికి దొరికినట్లే ఉంటుంది కానీ, తేలికగా జారిపోతుంది. భవ బంధాలకూ - మోక్షానికీ, రాగ - ద్వేషాలకూ, భయానికీ - ధైర్యానికీ, సంకల్ప - వికల్పాలకూ, శాంతికీ - అశాంతికీ, అన్నింటికీ మూలం మనస్సే. మనస్సును నియంత్రిస్తే, ప్రశాంతత, శాంతీ, సౌఖ్యాలూ లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే, కష్టమూ కాదు.

మచ్చికైన జవనాశ్వం రౌతు అధీనంలో ఉన్నట్లు, బుద్ధి అదుపులో మనస్సుండాలి. రౌతు కోరిన చోటుకు గుర్రం వెళ్ళాలిగానీ, అది తీసుకుపోయిన చోటుకు రౌతు వెళ్ళడం సరికాదు. మాలిమి చేసుకున్న మనస్సు మాత్రమే, బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది. ‘మనస్సు’ మాయాజాలం, మాటలకు అందనిది. మయుడు నిర్మించిన మయసభను మరిపించే భ్రమల సౌధాన్ని కల్పిస్తుంది. తనది కానిదాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైనదాన్ని శాశ్వతమన్నట్లుగా భ్రమింపజేస్తుంది, మురిపిస్తుంది. బుద్ధిని సక్రమంగా ఉపయోగించి గానీ, ఆ మాయ నుంచి బయటపడలేము. రాగద్వేషాలతో నిండిన మనస్సు, ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. అది ప్రసరింపజేసే రంగురంగుల కాంతిలో, గాజుముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది. బుద్ధి అనే సూర్యకాంతిలో మాత్రమే, వజ్రానికీ, గాజుముక్కకూ తేడా తెలుస్తుంది.

మనస్సు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అది విశ్వామిత్రుడి త్రిశంకు స్వర్గం కన్నా మిన్నయైనది. ఆ కాల్పనిక జగత్తులో మునిగితేలే వారు, నిజ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు, కొందరు మద్యపానాన్ని ఆశ్రయిస్తారు, కొందరు తమ బాధ్యతనూ, కర్తవ్యాన్నీ భగవంతుడిపై నెట్టేస్తారు. అటువంటి వారికి మద్యపానమైనా, భగవంతుడి ప్రార్థనలైనా, పెద్ద భేదం ఉండదు. ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా, వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకుని ఆచరించగలిగితేనే, వాటికి సార్థకత.

మనిషి బలం, బలహీనత, రెండూ మనస్సే. మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనస్సే, రాక్షసుడిగా దిగజార్చేదీ మనస్సే. బలహీనమైన మనస్సు, ప్రతి అల్ప విషయానికీ ఉద్విగ్న భరితమవుతుంది. ప్రశంసలకు, ఆకాశంలో విహరిస్తుంది. విమర్శిస్తే, పాతాళానికి క్రుంగిపోతుంది. తాళం చెవి ఎడమవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడిపక్కకు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. అలాగే మనస్సు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే, ఆధ్యాత్మికత వైపుకు తిరుగుతుంది. మనస్సులోని వ్యతిరేక భావనలను తొలగించి, సానుకూలమైన, ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే, శారీరక రుగ్మతలూ దరిజేరవు. నేటి శాస్త్రవేత్తలు కూడా, చాలా రోగాలకు కారణం మనస్సే అనీ, మనస్సును హాయిగా ఉంచుకున్నవారికి, రోగాలు దరిజేరవనీ ధ్రువీకరించారు.

ధర్మబద్ధమైన కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ, బుద్ధికి మనసును అప్పజెప్పి, జీవనయానాన్ని కొనసాగించాలి. ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ, మనస్సులో చెలరేగే ఆలోచనలనూ, ప్రలోభాలనూ, సంఘటనలనూ అవగాహన చేసుకుని, విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దికొద్దిగా తగ్గించుకోవాలి. అప్పుడు కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రియాలూ, దారి తప్పకుండా నడుచుకుంటాయి.

🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

Monday, September 23, 2024

ముసలం! కృష్ణుడి అంతిమ ప్రస్థాన సమయంలో ఏం జరిగింది? | The Mace and Annihilation Of the Yadavas - Krishna leaves the mortal world


ముసలం! కృష్ణుడి అంతిమ ప్రస్థాన సమయంలో ఏం జరిగింది? TELUGU VOICE
ముసలం పుట్టి యాదవులు అంతరించిన తరువత ఆ శవాల గుట్టల మధ్య కృష్ణుడి మనోగతం ఏమిటి?

పుట్టిన ప్రతి జీవీ మరణించక తప్పదు. ఎంతటి కీర్తి ప్రతిష్ఠలుగల వారయినా, ఎంత సంపద, అధికారాలు పొందిన వారయినా, చివరకు దైవాంశ సంభూతులైనా, ఏదో ఒక రోజు మరణాన్ని ఆహ్వానించక తప్పదు. ఇది భగవంతుడేర్పరచిన విధి విధానం. ద్వాపర యుగంలో అవతరించిన కృష్ణ భగవానుడు కూడా, ఈ విధి విధానాన్ని స్వయంగా పాటించాడు. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. 

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/rrd3t9MiZ_Q ]


ద్వాపర యుగాంతం దగ్గర పడుతోంది. దుష్ట శక్షణ, శిష్ట రక్షణ జరిపి, భూ భారాన్ని చాలావరకూ తగ్గించాడు శ్రీకృష్ణపరమాత్ముడు. తన అవతార లక్ష్యం నెరవేరడంతో, అవతార పరిసమాప్తికి ఏర్పాట్లు మొదలు పెట్టాడాయన. అప్పటికి భూమిపై మిగిలిన ఉన్న యోధుల్లో, యాదవులు మహా బలవంతులు. వారి సైన్యం చాలా పెద్దది. శ్రీకృష్ణుడి అండతో యాదవ కులం, శత్రువులెవరూ కన్నెత్తి కూడా చూడలేనిదిగా, అజేయమైనదిగా అయ్యింది. ఈ కారణంగా, యాదవ వీరులకు అహంకారం పెరిగిపోయింది. బల గర్వంతో విర్రవీగుతున్నారు వారందరూ. వారు అంతరించి పోవలసిన సమయం ఆసన్నమయిందని గ్రహించాడు, శ్రీకృష్ణుడు. స్వయంగా తానే వారందరికీ రక్షకుడుగనుక, ఇతరులెవరూ వారిని నశింపజేయలేరని, ఆయనకు తెలుసు. అందుకే, వారిలో వారే కలహించుకోవడం ద్వారా, యాదవకులాన్ని నశింపజేయాలని తలచాడు, పరంధాముడు. మన జీవితాలలో జరిగే ప్రతి ఘటనకూ, ముందే బీజం పడి ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ. యదుకుల నాశనానికి బీజం ఏనాడో పడింది. ఒకానొక సందర్భంలో మునులూ, కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధారీ ఇచ్చిన శాపాలు, శ్రీకృష్ణుని అభీష్టానికి అనుగుణంగా జరిగినవే అనేది, మనం గమనించాలి.

ఒకనాడు విశ్వామిత్రుడు, అసితుడు, కణ్వుడు, దూర్వాసుడు, భృగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, అత్రి, వశిష్టుడు, నారదుడు మొదలైన మహామునులు, పిండారక క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఆటలాడుకుంటున్న యాదవ యువకులు కొంతమంది, కర్మవశాన ఆ మునులను ఆటపట్టించాలనుకున్నారు. జాంబవతి కొడుకైన సాంబుడికి ఆడవేషం వేసి, గర్భవతిగా ఉన్నట్లు కడుపుకు చీరలు చుట్టి మునులవద్దకు తీసుకువెళ్ళారు. తనకు ఏ బిడ్డ జన్మిస్తుందో అడగడానికి సిగ్గుపడుతోందనీ, ఈమెకు మగబిడ్డ పుడతాడా? ఆడబిడ్డ పుడుతుందా? అని పరిహాసం ఆడారు. యాదవ యువకుల నాటకం మునులకు అర్థమై, వారిలో కోపం పెల్లుబికింది. “ఓరీ మూర్ఖులారా! ఈమెకు పుట్టేది ఆడపిల్లాకాదు, మగపిల్లవాడూ కాదు. మీ కులనాశనానికి కారణమయ్యే ముసలం పుడుతుంది” అని శపించారు. ముసలం అంటే, 'ఇనుప రోకలి' అని అర్థం. వారి శాపానికి భయపడిన యాదవ యువకులు, జరిగినదంతా శ్రీకృష్ణుడితో చెప్పారు. ఇది విధి విధానం! మునులు చెప్పినట్లే జరుగుతుందన్నాడాయన.

మరునాడు సాంబుడి కడుపు నుండి ముసలం బయటపడింది. దాన్నిజూసి యాదవులు భయంతో వణికి పోతూ, విషయమంతా కృష్ణుడితో మొరపెట్టుకున్నారు. తమ కులనాశనానికి కారణంకానున్న ఆ రోకలిని,  పరంధాముడి సూచన మేరకు ముక్కలు ముక్కలు చేసి చూర్ణం చేశారు. ఆ చూర్చాన్ని సముద్రజలాల్లో కలిపేశారు. అక్కడితో సమస్య తీరిపోయిందనుకుని శాంతించారు. ఎన్ని ఉపాయాలు పన్నినా, రాబోయే వినాశనం ఆగదని, శ్రీకృష్ణుడికి తెలుసు. ఇదంతా ఆయన సంకల్పమే. యాదవులు ముసలాన్ని చూర్ణంజేసి సముద్రంలో పారవేసినప్పుడు, ఆ చూర్ణంలో ఒక ఇనుప ముక్క ఉండిపోయి, సముద్రంలోని ఒక చేప దానిని మింగింది. చేప మింగిన ఆ ఇనుపముక్క కారణంగా, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ఎలా చాలించాడో చూద్దాము.

సముద్రంలో కలపబడిన మిగిలిన రోకలి చూర్ణమంతా, అలలతాకిడికి ఒడ్డుకు చేరి, పదునైన తుంగగడ్డిగా మొలిచింది. నిలువెత్తు పెరిగిన ఆ తుంగ, కరకు కత్తులలా తయారై, యాదవులను నాశనం చేసేందుకు సిద్ధంగా ఉంది. పితృ తర్పణాలు వదిలే నెపంతో, యాదవులందరినీ ప్రభాస తీర్థానికి తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు. ముసలం వల్ల పెరిగిన తుంగ, ఆ స్థలంలోనే ఉంది. అక్కడకు చేరుకున్న తర్వాత, విధి విధానాన్ని అనుసరించి, యాదవులకు మతి చెడింది. వారు అకారణంగా పరస్పర నిందలు చేసుకుంటూ, పోట్లాడుకున్నారు. తమ దగ్గరున్న ఆయుధాలు ధ్వంసం కాగా, అక్కడున్న తుంగను పెకలించి, దానితోనే ఒకరినొకరు కొట్టుకుని మరణించారు. చివరకు శ్రీకృష్ణ బలరాములూ, యాదవ స్రీలూ, వారి పిల్లలూ మాత్రమే మిగిలారు.

తన కళ్ళముందే తన వారంతా కొట్టుకుని చావడం, శ్రీకృష్ణుడికీ వ్యధను కలిగించక పోలేదు. ఎందుకంటే ఆయన అవతారం, మానవ, దైవత్వాల కలయిక. మనస్సులోని బాధను అణచుకుంటూ, చుట్టూ పరికించి చూశాడు. ఎటుజూసినా శవాల గుట్టలు. ఆందరూ తన వారే. తనంటే ప్రాణమిచ్చే అభిమానులే. కొద్ది క్షణాల క్రితం వరకూ వారంతా తనకోసం వున్నారు. ఈ క్షణంలో వారెవ్వరూ లేరు. తనను ఒంటరి వాడినిజేసి వెళ్లిపోయారు. చిన్న తనంలో తనను ముద్దుజేసి ఆడించిన పెద్దలూ, తన కుమారులూ, సోదారులూ, తనతో ఆటపాటల్లో, కష్టసుఖాల్లో కలిసి జీవించిన బంధుమిత్రులూ.. ఇలా మొత్తం అందరూ రక్తంలో మునిగి, విగతజీవులై పడి ఉన్నారు. శవాలపైబడి రోదిస్తున్న యాదవ స్త్రీలనుజూసి, ఆయనలోని మానవ లక్షణం, దైవతత్వం, క్షణకాలం పోటీ పడ్డాయి. బాధను మౌనంగా తట్టుకున్నాడు. మానవ లక్షణంపై దైవత్వం గెలిచింది. తనవారెవరు? పరాయివారెవరు? అందరూ తనలోని వారే.. తాను నడిపించే జగన్నాటకమే కదా ఇదంతా! అని సమాధాన పరచుకున్నాడు. తక్షణమే ఆయనలోని అభిమాన వ్యామోహాలు నశించాయి. భూ భారాన్ని తగ్గించవలసిన తన అవతార లక్ష్యం పూర్తిగా నెరవేరిందని తృప్తి చెందాడు.

యాదవ స్త్రీలను ద్వారకకు తీసుకు వెళ్లి, వసుదేవుని సంరక్షణలో ఉంచాడు. అప్పటికి ఏడవ రోజున ద్వారక సముద్రంలో మునిగిపోతుందని ఆయనకు తెలుసు. అందువల్ల ద్వారకలోని వారందరినీ, అక్కడినుండి తప్పించి రక్షించవలసినదిగా, అర్జునుడికి కబురుజేశాడు. అలా తన బాధ్యతను నెరవేర్చుకుని, తిరిగి ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ యోగమార్గం గుండా శరీరాన్ని వదలి వెళుతున్న బలరాముణ్ణి జూశాడు. మహావిష్ణువు శయనించే ఆదిశేషుడే, బలరామునిగా జన్మించాడనే విషయం, మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాము. బలరాముని ముఖం నుండి ఒక తెల్లని మహాసర్పం బయటకు వచ్చి, అది ఆదిశేషునిగా మారి, ఆకాశమార్గాన వెళ్ళిపోయింది. యాదవ కులనాశనం తర్వాత, తను వైకుంఠానికి చేరుకుంటానని బ్రహ్మదేవుడికీ, ఇంద్రాది దేవతలకూ ఇచ్చిన మాటను కృష్ణుడు గుర్తుకు తెచ్చుకున్నాడు.

శ్రీకృష్ణుడు కూడా యోగ మార్గంలోనే తన దేహాన్ని విడిచి, దివ్యంగా వెళ్ళిపోవచ్చు. కానీ, ఆయన అలా చేయలేదు. భూమిపై మానవ జన్మ తీసుకోవడం వలన, శరీర త్యాగం ద్వారానే తన అవతారాన్ని చాలించాలని, నిర్ణయించుకున్నాడు. యాదవులలో ఒకడైన తాను కూడా, ముసలం ద్వారానే అవతార త్యాగం చెయ్యాలని భావించి, అందుకు తగిన ఏర్పాట్లు ముందునుండీ చేసుకున్నాడు. అవేంటంటే, ముసలాన్ని చూర్ణం చేసి సముద్రంలో కలిపినప్పుడు, అందులో వాడియైన ఒక ఇనుప ముక్క ఉండిపోయిందనీ, దాన్ని ఒక చేప మ్రింగిందనీ, ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆ చేప ఒక కిరాతకుని వలలో చిక్కింది. వాడు దాన్ని కోసి, దాని కడుపులో దొరికిన ఇనుప ముక్కను, తన బాణానికి మొనగా చేసుకున్నాడు. ఆ బాణాన్నే, తన అవతార పరిసమాప్తి కోసం వినియోగించుకో దలచాడు, శ్రీకృష్ణుడు. ముసలం ద్వారానే తన అవతారాన్ని చాలించాలన్నదే కదా ఆయన సంకల్పం..

హుందాగా మరణాన్ని ఆహ్వానిస్తూ, ఒక రావిచెట్టు మొదట్లో నేలపై పవళించి, కుడి మోకాలి మీద ఎడమ పాదాన్ని ఠీవిగా పెట్టుకున్నాడు. అలా యోగనిద్రలోకి ప్రవేశించాడు. ముసలంలోని ఇనుప ముక్కతో బాణం తయారు చేసుకున్న కిరాతకుడు, అదే సమయంలో వేటాడుతూ, అటుగా వచ్చాడు. చెట్లచాటు నుండి శ్రీకృష్ణుని పాద పద్మాన్ని చూసి, అక్కడ ఏదో లేడి దాగున్నదని భ్రమించి, బాణాన్ని సూటిగా ప్రయోగించాడు. అది శ్రీకృష్ణుడి బొటన వ్రేలిలో దిగబడింది. కిరాతకుడు దగ్గరకు వెళ్ళిజూసి, తాను బాణం వేసినది కృష్ణపరమాత్ముడి పైనని తెలుసుకుని, తన మహాపరాధానికి ఎంతగానో విలపించాడు. తనను మన్నించమని ప్రార్ధించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతడిని ఓదార్చి, “నేను కోరుకున్న పనినే నువ్వు చేశావు, విచారించకు” అని చెప్పి, కిరాతకుడికి ముక్తిని ప్రసాదించాడు. ఈ విషయాన్ని విపులంగా వివరిస్తూ మనం గతంలో చేసిన వీడియోను చూడండి. ఆనంతరం శ్రీకృష్ణుడి శరీరం నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి, ఆకాశ మార్గాన వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆయన దివ్య రధమూ, గుర్రాలూ, గరుడ ధ్వజమూ, శంఖ చక్రాదులూ ఆయనను అనుసరించాయి. దేవ దుందుభులు మ్రోగాయి. దివి నుండి పూలవాన కురిసింది. కృష్ణావతార పరిసమాప్తిని బ్రహ్మాది దేవతలంతా కనుల పండువగా చూశారు.

ఇందులో ఒక విశేషాన్ని గమనించాలి. శ్రీకృష్ణుడు తన జీవిత కాలంలో, ఎన్నో యుద్ధాలలో నిలిచి, ఎన్నో ఆయుధాల దెబ్బలు తినివున్నాడు. ఆ గాయాల నుండి కారుతున్న రక్తధారలతో, 'పూసిన మోదుగవృక్షం'లా కనిపించేవాడు. అలాంటప్పుడు కూడా కాస్తయినా చలించేవాడు కాదాయన. అటువంటి వజ్రకాయుడు, కేవలం బొటన వ్రేలికి బాణం గ్రుచ్చుకున్నంత మాత్రాన ప్రాణాన్ని కోల్పోతాడా? యథార్ధానికి అది జరగని పని! అయితే, అవతారాన్ని ముగించేందుకు శ్రీకృష్ణుడే స్వయంగా సృష్టించుకున్న మిష ఇది. దీనిలో ఒక పరమార్థం ఉంది. శ్రీకృష్ణుణ్ణి గెలవడం, చంపడం ఎవరికీ సాధ్యం అయ్యే పని కాదు. పైగా ముసలం ద్వారానే తన మరణాన్ని ఆహ్వానించ దలచుకున్నాడాయన. అందువల్ల పూర్వజన్మ పుణ్యఫలం గల ఒక కిరాతకుని ఎన్నుకుని, ముసలంలోని ఇనుప ముక్క అతని చేతికి ఆయుధంగా వచ్చే ఏర్పాటు చేసుకున్నాడు. దాని ద్వారానే అవతారాన్ని చాలించాడు.

శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు, ద్వారకలోని వారందరినీ తరలించి తీసుకుపోయాడు అర్జునుడు. కృష్ణావతార పరిసమాప్తి జరిగిన వారం రోజులకు, సముద్రంలో మునిగిపోయింది ద్వారక. ద్వ్యాపరయుగంలో సముద్రంలో మునిగిన ద్వారకా పట్టణం, ఇటీవలి చారిత్రక పరిశోధనల్లో బయటపడిన విషయం అందరికీ తెలిసిందే. భారతీయ సముద్ర గర్భ పురావస్తుశాఖ అధిపతి శ్రీ యస్‌. ఆర్‌. రావు గారు తన బృందంతో జరిపిన పరిశోధనల్లో, గుజరాత్‌ నమీపంలోని అరేబియా మహాసముద్రంలో మునిగివున్న ద్వారక అవశేషాలు బయటపడ్డాయి. ద్వారకా నగరానికి పూర్వ వైభవాన్ని కల్పించేందుకు, ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశ, విదేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం, ఈ దిశగా కృషి చేస్తోంది. సముద్రగర్భంలో వున్న ద్వారకను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, మన ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

యతః కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయః ||

Tuesday, September 17, 2024

మహాలయ పక్షాలు 2024 Mahalay Paksh - Pitru Paksh


ఈ రోజు 'సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2' వరకు, 'మహాలయ పక్షాలు'.. TELUGU VOICE
- అంటే ఏమిటి? ఏం చేయాలి?

మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా, తన మూలాలను మరచి పోకూడదు. ఆ మూలాలే అతని జన్మకీ, అతని సంస్కారానికీ, సంస్కృతికీ కారణం. అందుకే, ప్రతి ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు మన పూర్వీకులు. వాటిలో ముఖ్యమైనవి, మహాలయపక్షం రోజులు.

చనిపోయినవారి ఆత్మలు తిరిగి జన్మించాలంటే, అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగ్గా నిర్వహించకపోతే, మనిషి ప్రేత రూపంలో సంచరిస్తూనే ఉంటాడని నమ్మకం. ఈ రెండు వాదనలూ నమ్మకపోయినా, పూర్వీకులను తలుచుకోవడం అనే సంస్కారాన్ని మాత్రం కాదనలేము కదా! అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షాలు. భ్రాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ వచ్చే 15 రోజుల కాలాన్ని, 'మహాలయ పక్ష'మని అంటారు.

మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాము కాబట్టి, దీనిని పితృ పక్షమని కూడా అంటారు. ఇప్పటి వరకూ మనం పితృ దేవతలకు చేస్తున్న శ్రాద్ధకర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా, ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. అంతే కాదు! మనకి రక్త సంబంధం లేని గురువులు, స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదల వచ్చు. కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధకర్మలు జరగక పోవచ్చు. అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వీడవ వచ్చు.

మహాలయ పక్షంలోని ఒక్కో రోజుకీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో కారణంతో చనిపోయిన వారికి, ఒక్కో రోజు కేటాయించ బడింది. క్రితం ఏడు చనిపోయిన వారికీ, భర్త ఉండగానే చనిపోయిన వారికీ, పిల్లలకీ, అర్ధాంతరంగా చనిపోయిన వారికీ.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో తిథి నాడు తర్పణం విడవడం మంచిదని శాస్త్ర వచనం. అలా కుదరక పోతే, మహాలయ పక్షం చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం విడవవచ్చని చెప్పబడింది. అందుకే ఆ అమావాస్య రోజును ‘సర్వ పితృ అమావాస్య’ అని పిలుస్తారు.

ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడు. అక్కడ ఇంద్రుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. బంగారం, వజ్రాలను అతని ముందు ఉంచి భుజించమన్నాడు. వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు. ‘నీ జీవితకాలమంతా బంగారం, వజ్రాలను దానం చేశావు. కానీ నీ పితృదేవతలకు ఏనాడూ పిండ ప్రదానం చేసి ఎరగవు’ అని బదులిచ్చాడు ఇంద్రుడు. దానితో కర్ణుడు తన తప్పును తెలుసుకుని, తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడు. అలా కర్ణుడికి దక్కిన 15 రోజులే ఈ మహాలయ పక్షం. ఈ విషయాలను విపులంగా వివరిస్తూ మనం చేసిన వీడియోను చూడదలుచుకున్న వారు ఈ లింక్ క్లిక్ చేయండి.. https://youtu.be/vfBBesZcTbw


మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్తనన్నా పిలిచి పితృ దేవతలకు తర్పణాలు వీడాలి, లేదా గయ వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకుని అక్కడ శ్రాద్ధకర్మలు నిర్వహించాలి, లేదా తమ పితృ దేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయంపాకాన్ని దానం చేయాలి. మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి, పెద్ద పనులు వేటినీ చేపట్టకూడడు. తీర్థయాత్రలు తప్ప, దూరప్రయాణాలు సాగించకూడదు.

Monday, September 16, 2024

Death: A Curse or a Blessing? | మనిషికి మృత్యువు ఎందుకు అవసరం?


మరణం! మనిషికి మృత్యువు ఎందుకు అవసరం? TELUGU VOICE
ఆత్మ నిరంతర ప్రయాణంలో ఒక చిన్న మజిలీ అయిన ఈ జీవితాన్ని ఎలా మలుచుకోవాలి?

'చిరంజీవత్వం' అన్నది సాధారణ విషయం కాకపోయినా, సాధ్యమే. ఎందరో మహనీయులు దానిని సాధించారు కూడా. ఎవరైతే మూల చైతన్యాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకుని, ఆ ‘మూలధనం’ లో వృద్ధి చెందుతూ వుంటారో, వారు అకల్పాంతం వరకూ, అంటే, ఎల్లప్పటికీ ‘పిన్న వయస్కులు’ గానే ఈ లోకంలో ఉండగలరు. ఈ విధంగానే అంజనేయస్వామి గానీ, మహావతార్ బాబాజీ కానీ, ఇంకా ఎంతో మంది యోగులు, ‘చిరంజీవులు’ గా ఇప్పటికీ భూమిపై నడయాడుతూ ఉన్నారు. అందరూ మరణాన్ని గురించి భయపడటం సహజమే. కానీ, జనన మరణాలు సృష్టి నియమాలు. ఈ రెండూ విశ్వం యొక్క సమతౌల్యతను కాపాడటానికి అత్యవసరం. లేకపోతే, మనుషులు ఒకరినొకరు అధిగమించే ప్రయత్నంలో, సృష్టి అల్లకల్లోలమవుతుంది. అది ఎలా..? అనే సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/LrkjH4viRsU ]


మూల చైతన్యాన్ని తెలుసుకోలేని మానవుడు, సృష్టిలో అనివార్యమైన మరణాన్ని గురించి భీతిల్లుతుంటాడు. అవగాహనారాహిత్యం వలన, అది ఒక అంతు చిక్కని విషయంగా అనిపిస్తుంటుంది. మరణమనే సహజ పర్యవసానం ఉండడం వల్లనే, జీవితం ప్రకాశవంతమవుతుంది. ఆత్మ ప్రయాణంలో భాగంగా, మనం కేవలం కొద్ది కాలం మాత్రమే భూమిపై సజీవంగా ఉంటాము. ఎక్కువ కాలం మరణానంతర ప్రయాణంలో ఉంటాము. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోలు చేశాను. చూడని వారు తప్పక చూడండి. జనన మరణ చక్ర భ్రమణంలోని ఈ నిగూఢ సత్యాన్ని తెలుసుకోలేక, భౌతికపరమైన ఆశలూ, కోరికలతో, కలకాలం జీవించి ఉండాలని కోరుకునే వారికోసం, ఒక చిన్న కథను చెప్పుకుందాము..

మరణాన్ని జయించి, చిరంజీవిగా ఉండిపోవాలని తలచిన ఒక రాజు, తన రాజ్యం వెలుపల మహారణ్యంలో వున్న ఒక మహర్షిని సందర్శించాడు. తనకు అమరత్వం సిద్ధించే మార్గం తెలియజేయమని, ఆయనను ప్రార్ధించాడు. రాజు మనోవాంఛితం తెలుసుకున్న మహర్షి, అక్కడికి కొంత దూరంలో ఉన్న రెండు కొండలను దాటిన తరువాత ఒక దివ్య సరస్సు ఉంటుందనీ, దాని నీరు త్రాగితే రాజు అమరత్వాన్ని పొందగలుగుతాడనీ చెప్పాడు. మహర్షి చెప్పినట్లుగానే రాజు ఆ రెండు కొండలనూ దాటిన తరువాత, దివ్య సరస్సును కనుగొన్నాడు. అతను దైవాన్ని తలుచుకుని నీరు త్రాగబోతుండగా, బాధను భరించలేక ఎవరో చేస్తున్న దీనారావాలు వినిపించాయి. బాధాకరమైన ఆ శబ్దాలు వినవస్తున్న దిశకు వెళ్ళిన రాజుకు, చాలా బలహీనుడైన ఒక మనిషి కనిపించాడు.

అటువంటి నిర్జన ప్రాంతంలో అతడిని చూసి ఆశ్చర్యపోయిన రాజు, కారణం అడగగా, అతడు ఇలా చెప్పనారంభించాడు. తాను ఆ దివ్య సరస్సులోని నీరు త్రాగి అమరత్వాన్ని పొందగలిగాడనీ, వంద సంవత్సరాల వయస్సు దాటిన తనను, తన కుమారుడు ఇంటి నుండి బయటకు పంపించేశాడనీ చెప్పాడు. అప్పటికి యాభై సంవత్సరాల నుండి ఆలనా పాలనా లేకుండా, తానక్కడే పడి ఉన్నాడని తెలియజేశాడు. తన కుమారుడు మరణించి, మనవళ్లు కూడా వృద్ధులై పోయారని చింతించాడు. తాను తినడం, త్రాగడం మానేసినా, ఇంకా బ్రతికే ఉన్నానని వాపోయాడు.  చిరంజీవిత్వం తన పాలిట శాపంగా ఎలా పరిణమించిందో మొరపెట్టుకున్నాడు. తనకు మృత్యువును ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధిస్తూ రోదించసాగాడు.

రాజు ఆలోచనలో పడ్డాడు. వృద్ధాప్యం, దయనీయమైనది. జవసత్వాలతో కూడిన యవ్వనం లేని అమరత్వం పొంది, ప్రయోజనం ఏమిటి? అప్పుడు అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందాలని నిశ్చయించుకుని, తిరిగి మహర్షిని సందర్శించి, తనకు అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందేందుకు మార్గం సూచించమని కోరాడు. చిరునవ్వు నవ్వుతూ మహర్షి, రాజు అంతకు ముందు చూసిన దివ్య సరస్సును దాటి ఇంకా కొంత దూరం ముందుకు వెళితే కనిపించే మరో కొండను అధిగమిస్తే, పసుపు రంగు పండ్లతో నిండిన ఒక దేవతా వృక్షం కనిపిస్తుందనీ, దాని పండును తింటే, అమరత్వంతో పాటు యవ్వనాన్ని కూడా పొందవచ్చనీ చెప్పాడు.

మహర్షి చెప్పిన విధంగానే రాజు ఈసారి మూడవ కొండను కూడా దాటి, పసుపు రంగు పండ్లతో నిండిన దేవతా వృక్షాన్ని చేరుకున్నాడు. అతను ఒక పండు కోసి తినబోతున్న సమయంలో, ఉన్నట్లుండి అక్కడికి సమీపంలోనుంచి ఏదో సవ్వడి వినిపించింది. జన సంచారం లేని ఆ ప్రాంతంలో వాదులాడుకునేవారు ఎవరై ఉంటారా అని ఆశ్చర్యపోయాడు రాజు. హుటాహుటిన శబ్దం వినవస్తున్న దిశకు వెళ్లి చూసిన రాజుకు, తర్జన భర్జనలు పడుతున్న నలుగురు యువకులు కనిపించారు. సమస్య ఏమిటని రాజు అడగగా, వారిలో ఒక యువకుడు, "నా వయస్సు 400 సంవత్సరాలు. నా కుడివైపున ఉన్న మనిషి నా తండ్రి. వయస్సు 450 సంవత్సరాలు. అతడు నాకు రావలసిన వాటా ఆస్తిని నాకు ఇవ్వడం లేదు." అని అన్నాడు చిన్నబుచ్చుకుంటూ.

అది విన్న రాజు ఆ కుడివైపున ఉన్న రెండవ మనిషిని అడగగా, అతను మూడవ వ్యక్తిని చూపిస్తూ, "ఈయన నాకు తండ్రి. వయస్సు 500 సంవత్సరాలు. తాను ఇంకా జీవించి ఉండడంవలన, నా భాగం ఆస్తి నాకు రాలేదు. నాది కానిది నా కుమారుడికి నేనెలా ఇవ్వగలను?" అని అన్నాడు. ఇక అతడు నాలుగవ వ్యక్తిని చూపించి, అతడిని తన తండ్రిగా చెప్పి, వయస్సు 550 సంవత్సరాలని చెప్పాడు. అతడిది కూడా అదే సమస్య. ఇలా వారు ఆస్తి కోసం నిత్యం ఘర్షణ పడుతుండడంతో విసుగు చెందిన గ్రామస్థులు, వారిని గ్రామం నుండి బహిష్కరించారు. అలా వారు ఆ నిర్జన ప్రదేశంలో చేరి, నిత్యం ఘర్షణలతో మనశ్శాంతిని కోల్పోయి, కాలం వెళ్లబుచ్చుతున్నారు.

ఇదంతా చూసి ఆశ్చర్యానికి గురైన రాజు తిరిగి మహర్షిని చేరి, తన అజ్ఞానాన్ని దూరంచేసినందుకూ, తనకు మరణం యొక్క ఆవశ్యకతను ఎరుకపరచినందుకూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాడు. అప్పుడు మహర్షి చిరుదరహాసంతో ఇలా అన్నాడు.. "రాజా! మరణం ఉన్నందువల్లనే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని తప్పించడానికి ప్రయత్నించే బదులు, ప్రతి రోజూ, ప్రతి క్షణమూ సంతోషంగా గడపండి. సహజంగా అందరూ పొరబడే.. ‘నేనొక్కడిని మారితే ఏమవుతుంది!’ అని అనుకోకుండా, ముందు మీరు మారండి. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు మారతారు. తదనుగుణంగా ప్రపంచం మారుతుంది." మార్పనేది, ఒక్కరితోనే మొదలవుతుంది..

మానవజన్మ విశిష్టతనూ, విలువనూ మనం గ్రహించాలి. అన్ని రాళ్లకంటె వజ్రం ఎలా విలువైనదో, అలాగే మానవజన్మ అన్ని జన్మలకంటే విలువైనది. ఇది మనకు అంత సులభంగా లభించలేదు. ఈ మానవ జన్మ లభించడానికి మనం ఎంతో పుణ్యం చేశాము. వజ్రం కోసం ఎంతో ధనాన్ని వెచ్చించినట్లే, మానవ జన్మకోసం మనం ఎంతో పుణ్యాన్ని వెచ్చించాము. అందుకే మానవ జన్మ కూడా వజ్రంలాగే ఎంతో విలువైనది. వజ్రాన్ని అలక్ష్యంచేసే వ్యక్తిని ఎలాగైతే మూర్ఖుడిగా భావిస్తామో, అలాగే, మానవజన్మను సక్రమంగా ఉపయోగించుకోకపోతే, మనం కూడా మూర్ఖులమే అవుతాము.

స్నానం చేస్తూ దేవుడి నామస్మరణ చేస్తే, అది పవిత్ర స్నానమవుతుంది..

తింటూ దైవ నామస్మరణ చేస్తే, ఆహారం ప్రసాదమవుతుంది..

నడుస్తూ భగవన్నామస్మరణ చేస్తే, అది యాత్ర అవుతుంది..

వంట చేస్తూ స్మరణ చేస్తే, ఆహారం దివ్యమవుతుంది..

నిద్రించే ముందు స్మరించుకుంటే, అది ధ్యాన నిద్రవుతుంది..

ఇంట్లో దివ్య నామస్మరణ చేస్తే, ఆ ఇల్లే దేవాలయంగా మారుతుంది..

నిత్య దైనందిన కర్మలు చేసుకుంటూ దైవాన్ని తలుచుకుంటే, అది భక్తి అయ్యి, మనలను భగవంతుడికి దగ్గరజేస్తుంది..

యతః కృష్ణస్తతో ధర్మో యతో ధర్మస్తతో జయః ||

Friday, September 13, 2024

నేను దేవాలయానికి ఇక రాను!!!


నేను దేవాలయానికి ఇక రాను!!! TELUGU VOICE

11 సంవత్సరాల ఒక పాప తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్లింది. భగవంతుడికి నమస్కరించి వచ్చి ఓ ప్రక్కన కూర్చున్న సమయంలో, తన తండ్రితో ఆమె ఇలా అన్నది. "నాకు ఇకపై ఆలయానికి రావాలని లేదు నాన్నా".. అని. తండ్రి ఎందుకని ఆడగగా ఆమె ఇలా అన్నది.. "భగవంతుడికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపటం కోసం మనం ఇక్కడకు వస్తున్నాము. కానీ, ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే కనిపిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు, దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటోంది. చెడు మాటలు వినిపిస్తున్నాయి. వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలచుకోవడం లేదు" అని చెప్పింది కుమార్తె.

[ ప్రార్థించే మనస్సెలా ఉండాలి?: https://youtu.be/HYR6GJyUWUc ]


తండ్రి నిశ్శబ్దంగా విన్న తరువాత.. "సరే.. నాకోసం ఒక పని చేసి పెట్టు తల్లీ" అని అన్నాడు  తండ్రి. ఆమె అలాగే అన్నది.. "ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకుని ఆలయం చుట్టూ 2 సార్లు తిరిగి రా. ముఖ్యంగా వీళ్లందరి మధ్యలో నుండి నడచి, నీరు క్రింద పడకుండా రావాలి. రాగలవా?" అన్నాడు తండ్రి.

కుమార్తె సరేనని చెప్పి, తండ్రి చెప్పినట్లుగానే తిరిగి వచ్చి.. చూశారా! ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీరు కూడా క్రింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేశాను" అన్నది ఆనందంగా..

అప్పుడు తండ్రి పాపను అభినందించి, ఆమెను 3 ప్రశ్నలడిగాడు..

1. ఈ సారి వెళ్లినప్పుడు, ఇందాక నీకు నచ్చని పనులు చేస్తున్నవారు ఏం చేస్తున్నారు?
2. ఎవరైనా చెడు మాటలు, ఇతర గాసిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారా?
3. కపట భక్తులేం చేస్తున్నారు?

అదుకామె.. "నేను అవేమీ చూడలేదు. నా దృష్టి గ్లాసు, మరియు దానిలోని నీటిపైనే ఉంది. నీరు ఒక్క చుక్క కూడా పోకుండా తీసుకు రావడంలో, మిగతా వారిని గమనించనే లేదు" అని చెప్పింది.

అప్పుడు తండ్రి ఆమెతో ఇలా అన్నాడు.. "నీవు దేవాలయానికి వచ్చినప్పుడు సరిగ్గా చేయవలసినది ఇదే. కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి, ఆయన గురించే ఆలోచిస్తూ, ఆయనతో మమేకం అవడానికి ప్రయత్నించాలి. అలాగనుక చేయ గలిగితే, ఎవ్వరూ నీ దృష్టికిరారు. పైగా నీవంటి వారిని చూసి వారు కూడా క్రమంగా తమ పద్ధతిని మార్చుకోవచ్చు. అచంచలమైన భక్తి, ఏకాగ్రత, నిరంతర సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నత పథంవైపుకు నడిపిస్తాయి".

దేవాలయంలో గడప వలసిన విధానం గురించి ఇంత చక్కగా చెప్పిన ఆ తండ్రి ధన్యుడు. పిల్లలకు ఇదే విధమైన ఏకాగ్రత అలవాటు చేయాలి అందరూ. దైవ సన్నిధిలో ఏకాగ్రతతో ఉండడం ఎంతో ముఖ్యం. దాని కొరకు సాధన చేయడంలోనే అర్థం పరమార్థం ఉన్నాయి.

🚩 ఓం శ్రీమాత్రే నమః 🙏

Thursday, September 12, 2024

అశోకుడి 9 మంది రహస్య సంఘం ఇంకా కొనసాగుతోందా? Mystery of secret organization formed over 2000 yrs ago


అశోకుడి 9 మంది రహస్య సంఘం ఇంకా కొనసాగుతోందా? TELUGU VOICE

మనిషి ఆది మానవుడి స్థితి నుంచి, ఆధునిక మానవుడి స్థాయికి ఎదిగే క్రమంలో, ఎన్నో విషయాలను మధించి, కొన్ని శాస్త్రాలను వెలికి తీశాడు.. ఈ శాస్త్రాలలో కొన్ని, మనిషి అభివృద్ధికి తోడ్పడితే, మరికొన్ని, వినాశనానికి కారణమవుతున్నాయి.. ఆ శాస్త్రాలను దాచిపెట్టడం తోపాటు, మానవాళిని రక్షించడానికి కొన్ని రహస్య సంఘాలు ఏర్పడితే, మరికొన్ని నాశనం చేయడానికి ఏర్పడ్డాయి. వీటిలో కొన్ని పురాతన సంఘాలు, ఇప్పటికీ రహస్యంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటే, కొన్ని కాలగమనంలో కలిసిపోయాయి. అటువంటి వాటిలో 'Illuminati, The Skull and Bones, The Rosicrucians, The Knights Templar' అనే సంస్థలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే, ఈ రహస్య సంఘాలన్నీ 15, 16 శతాబ్దాల మధ్యలో ఆరంభమైనవే. కానీ, పాశ్చాత్యులకు రహస్య సంఘాలు అనే పదం తెలియక మునుపే, అఖండ భారతావనిని ఏలిన ఒక చక్రవర్తి, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రహస్య సంఘాన్ని ఏర్పాటు చేసి, అతి పురాతనమైన, శక్తివంతమైన విజ్ఞాన భాండాగారాన్ని, దుష్టుల చేతిలో పడకుండా రక్షణ కల్పించాడు. అసలు ఎవరా భారత చక్రవర్తి? అతను ఎందుకని ఈ రహస్య సంఘాన్ని ఏర్పాటు చేశాడు? అందులో ఎంత మంది సభ్యులు ఉన్నారు? వారి వద్దనున్న ఆ విజ్ఞానం ఏంటి? అనే విషయాలు, నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-wMOVPj2sIA ]


అఖండ భారతావనిని ఏలిన మహా చక్రవర్తి, మౌర్య సామ్రాజ్య అధిపతి అశోకుడు. ఈయన సామాన్యశకానికి పూర్వం, 268 నుంచి 232 వరకు పాలించినట్లు, చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈయన మౌర్య సామ్రాజ్యాన్ని, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బెంగాల్, అస్సాంతో పాటు, దక్షిణ భారత దేశంలో మైసూర్ వరకు విస్తరింపజేసి, ఈ భరతగడ్డను ఏలిన వారిలో ఒక గొప్ప చక్రవర్తిగా నిలిచారు. ఆయన రాజ్య విస్తరణలో భాగంగా, ఎన్నో ప్రాచీన గ్రంథాలను అవపోసన బట్టి, వాటి సహాయంతో కొత్త కొత్త యుద్ధ యంత్రాలూ, తంత్రాలూ సృష్టించి, తనకి కదన రంగంలో తిరుగులేకుండా చేశాడు. అయితే, అశోకుడి తండ్రి అయిన బిందుసారుడి చిరకాల కోరిక, కళింగను జయించడం. తండ్రి కోరిక నెరవేర్చడానికి, అతి బలమైన కళింగ రాజ్యంపై దండెత్తి, తన వశం చేసుకున్నాడు. అయితే, ఈ యుద్ధంలో తన సైన్యం సుమారు పది వేల మందికి పైగా చనిపోతే, కళింగ సైనికులు, ప్రజలు, సుమారు లక్ష మంది వరకు చనిపోయారు. రక్తపుటేరులై ప్రవహించిన రణరంగం చూసిన అశోకుడికి, మనసు చలించిపోయింది. ఎటు చూసినా పీనుగుల గుట్టలు, అశోకుడిని రాజ్యవిస్తరణ కాంక్షనుంచి, వైరాగ్యం వైపు నడిపించాయి..

ఈ కళింగ యుద్ధం వల్ల జరిగిన నష్టం మళ్లీ జరగకూడదని భావించి, ఆయుధాన్ని వదిలి, బౌద్ధమతాన్ని స్వీకరించాడు. రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూనే, శాంతి స్థాపనకు అమోఘ కృషి చేశాడు. ఈ క్రమంలో ఆయన ఏర్పాటు చేసిన సంఘమే, అశోక నవ రహస్య సంఘం. ఈ సంఘంలో, మొత్తం తొమ్మిది మంది అత్యంత ప్రతిభావంతులు ఉండేవారట. ఈ తొమ్మిది మందీ, మన ప్రాచీన గ్రంథాలను అవపోసన బట్టి, వాటిలోని విజ్ఞానాన్ని దుష్టుల చేతిలో పడకుండా రక్షించడమే, వారు చేయవలసిన కార్యం. ఈ నవ రహస్య సంఘం, ప్రపంచం నలుమూలలకూ వెళ్లి, అతి రహస్య జీవనం సాగిస్తూ, అత్యంత విలువైన విజ్ఞాన భాండాగారాన్ని రక్షించినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, కాలగమనంలో మరుగున పడిపోయిన ఈ విషయాన్ని, Talbot Mundy అనే బ్రిటిష్ అధికారి, 1923లో వెలువరించిన 'The Nine unknown' అనే పుస్తకం వల్ల, ప్రపంచం మొత్తానికీ తెలిసింది.

ఈయన భారతదేశంలో బ్రిటిష్ అధికారిగా ఉన్న సమయంలో, మన దేశ చరిత్ర మీద ఎంతో అధ్యయనం చేశాడు. దాని ఫలితంగానే, అశోకుడి కాలంలో స్థాపించబడ్డ రహస్య సంఘం గురించిన కొన్ని నిజాలను, మన ముందుకు తీసుకు రాగలిగాడు. ఆయన రాసిన దాని ప్రకారం, ఈ తొమ్మిది మంది వద్ద, ఊహకందని అత్యంత అధునాతన విజ్ఞాన భాండాగారం ఉందనీ, వాటిని వారు తాళపత్రాల రూపంలో పొందుపరిచారనీ, ఆ పరిశోధనలు నేటి శాస్త్రవేత్తల వద్ద కూడా లేవనీ, ఆయన వివరించాడు. ఈ తొమ్మిది మందీ, ప్రాచీన విజ్ఞాన భాండాగారాన్ని తొమ్మిది అంశాలుగా విభజించి, వాటిని గ్రంథాలుగా మార్చి, ఒక్కొక్కరూ ఒక్కొక్క గ్రంథాన్ని రక్షించేవారు. వారు ఆ గ్రంథాలను రక్షించడమే కాకుండా, కాలానుగుణంగా వచ్చిన అంశాలను అందులో పొందుపరచాలని, వారి తరువాత తమకు నమ్మకస్తులైన వారు ఈ పనిని చేయాలని చెప్పినట్టు, Mundy వ్రాసిన పుస్తకంలో ఉంది. Mundy చెప్పినదాని ప్రకారం, ఆ తొమ్మిది మంది వద్దనున్న తొమ్మిది గ్రంథాల గురించి, ఇలా వివరించబడింది.

మొదటి గ్రంథంలో, మనసులతో చేయు యుద్ధం గురించిన సమాచారం ఉంది. దానిని ఇంగ్లీషులో 'Propaganda and Psychological Warfare' అంటే, ఎదుటి వ్యక్తులని మాటలతో వశపరుచుకుని, వారిని తమకు నచ్చినట్లు వినియోగించుకోవడం. ఈ విధంగా ప్రజలను మాటలతోనే వశపరుచుకుని, వారిని యుద్ధాలకూ, విపరీత కార్యాలకూ పురిగొల్పడం.

రెండవ గ్రంథంలో, శరీర ధర్మం గురించిన పూర్తి సమాచారం ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో, Physiology అని అంటారు. దీని ద్వారా మన శరీర నిర్మాణంపై పూర్తి పట్టుతో పాటు, కేవలం ఒక్క స్పర్శతో ఎంతటి వారినైనా చంపవచ్చు. ఈ విద్య ద్వారా, మనిషి నాడీ వ్యవస్థపై ఎలా దాడి చేస్తే ఏం జరుగుతుందో అనే విషయాలు, చాలా విపులంగా వివరించబడింది.

ఇక మూడవ గంధంలో, అతి సూక్ష్మ జీవ శాస్త్రం మరియు జీవ సాంకేతిక శాస్త్రం గురించిన వివరాలు ఉంటాయట. దీనిని ఇంగ్లీషులో మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ అంటారు. దీని ప్రకారం, సూక్ష్మజీవులపై పరిశోధన, వాటిలో మంచి వాటిని గుర్తించి, వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించడం లాంటి అనేక విషయాలపై సమగ్రంగా ఉందట.

నాల్గవ గ్రంధంలో, రసవాదం వాదం గురించి ఉందట. దీనినే ఇంగ్లీషులో, Alchemy అని అంటారు. ఇందులో సమస్త లోహాల గురించిన పూర్తి వివరణతో పాటు, ఒక లోహాన్ని మరో లోహంగా మార్చే ప్రక్రియ గురించి ఉందట. ఈ శాస్త్రాన్ని ఉపయోగించి, ఈ లోహాన్ని బంగారంగా మార్చవచ్చు.

5వ గంధంలో సమాచారం, అంతరిక్ష మరియు గ్రహాంతరవాసులతో సమాచారం గురించి వివరించబడింది. దీనిని ఇంగ్లీష్లో, Communication and Communicate with Extraterrestrials అంటారు. దీని సహాయంతో, దూర ప్రాంతాల్లో ఉన్న వారితో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు, గ్రహాంతర వాసులను ఎలా కలవాలి? వారితో ఏ విధంగా సంభాషించాలి? అనే విషయాలు తెలుసుకోవచ్చు.

ఆరవ గ్రంధంలో, భూమ్యాకర్షణ మరియు విమానాల తయారీ గురించి వివరించబడింది. దీనిని నేడు గ్రావిటేషన్ అండ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అని అంటున్నారు.

ఏడవ గ్రంథంలో అంతరిక్షం గురించిన వివరాలున్నాయి. ఈ గ్రంథం ఆధారంగా, అంతరిక్షం గురించి, విశ్వం ఏర్పడిన విధానం గురించీ వివరించబడింది. దీనినే కాస్మాలజీ అని నేడు అంటున్నారు. అంతేకాదు,  ఈ గ్రంధం ద్వారా టైం ట్రావెలింగ్ ఎలా చేయాలి? Portals ఎలా ఏర్పడతాయి? వాటిని ఎలా మనకు ఉపయోగపడేలా వాడవచ్చు? అనే విషయాలు వివరించబడింది.

ఎనిమిదవ గ్రంథంలో, కాంతి గురించీ దాని వేగాన్ని మార్చే సాంకేతికత గురించీ వివరించబడింది. అంతేకాదు, కాంతినీ, వేగాన్నీ మనకి అనుకూలంగా మార్చుకుని, దానితో దాడి ఎలా చేయాలి? అనే విషయాలపై వివరంగా రాసి ఉందట.

ఇక ఆఖరి గ్రంధంలో సమాజ శాస్త్రం గురించి వివరించబడింది. ఈ గ్రంథం ఆధారంగా, మన సమాజం ఎలా ఉండాలనే నియమ నిబంధనలు, ప్రభువులు సమాజ అభివృద్ధి చేయడానికి కావలసిన మార్గదర్శకాలతో పాటు, రాజ్య పాలన గురించి వివరించబడింది. అంతే కాదు, ఇందులో ఏం చేస్తే సమాజం నాశనం అవుతుందో తెలిపే సమాచారం కూడా ఉందట.

ఇది, అశోకుడి తొమ్మిదిమంది రహస్య సభ్యుల వద్దనున్న గ్రంథాలలోని సమాచారం. ఈ తొమ్మిది మంది సభ్యులు, తమ వారసుల ద్వారా, వారి రహస్య కార్యకలాపాలను నేటికీ కొనసాగించేలా చేశారని, వారి వారసులు ఈ సమాచారం అత్యంత రహస్యంగా, వారి తరువాతి తరాల వారికి అందిస్తూ ఉంటారనీ, అందువల్ల అశోకుడు స్థాపించిన ఈ రహస్య సంఘం నేటికీ మనుగడలో ఉందనీ, చాలామంది బలంగా నమ్ముతున్నారు. కొన్ని విపత్కర పరిస్థితులలోనూ, కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు సమయంలో వీరు బయటకు వచ్చి, కొంత సమాచారాన్ని ఇచ్చారని కూడా చాలామంది నమ్ముతున్నారు. ఏది ఎలా ఉన్నా, ఈ తొమ్మిది మందికి సంబంధించిన విషయాలు, ఇంకా ఒక మిస్టరీగానే ఉండిపోయాయి.

[ 20 లక్షల సంవత్సరాల క్రితం వ్రాయబడిన మొదటి గ్రంధం! = https://youtu.be/40259dhpZm4 ]

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...