మహాలయ పక్షాలు 2024 Mahalay Paksh - Pitru Paksh


ఈ రోజు 'సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2' వరకు, 'మహాలయ పక్షాలు'.. TELUGU VOICE
- అంటే ఏమిటి? ఏం చేయాలి?

మనిషి ఎంతగా ఎదిగినా, ఎంత దూరం పయనించినా, తన మూలాలను మరచి పోకూడదు. ఆ మూలాలే అతని జన్మకీ, అతని సంస్కారానికీ, సంస్కృతికీ కారణం. అందుకే, ప్రతి ఏటా ఏదో ఒక సమయంలో మన పెద్దలను తలుచుకునేందుకు కొన్ని సందర్భాలను ఏర్పరిచారు మన పూర్వీకులు. వాటిలో ముఖ్యమైనవి, మహాలయపక్షం రోజులు.

చనిపోయినవారి ఆత్మలు తిరిగి జన్మించాలంటే, అన్నాన్ని ఆశ్రయించే తల్లి గర్భంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రాద్ధకర్మలు సరిగ్గా నిర్వహించకపోతే, మనిషి ప్రేత రూపంలో సంచరిస్తూనే ఉంటాడని నమ్మకం. ఈ రెండు వాదనలూ నమ్మకపోయినా, పూర్వీకులను తలుచుకోవడం అనే సంస్కారాన్ని మాత్రం కాదనలేము కదా! అందుకు ఓ సందర్భమే మహాలయ పక్షాలు. భ్రాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకూ వచ్చే 15 రోజుల కాలాన్ని, 'మహాలయ పక్ష'మని అంటారు.

మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు విడుస్తాము కాబట్టి, దీనిని పితృ పక్షమని కూడా అంటారు. ఇప్పటి వరకూ మనం పితృ దేవతలకు చేస్తున్న శ్రాద్ధకర్మలలో ఎలాంటి లోపం వచ్చినా కూడా, ఈ పక్షంలో తర్పణాలని విడిస్తే దోషాలన్నీ తొలగిపోతాయి. అంతే కాదు! మనకి రక్త సంబంధం లేని గురువులు, స్నేహితులకు కూడా ఈ సమయంలో తర్పణాలను వదల వచ్చు. కొందరికి పుత్రులు లేకపోవడం వల్ల శ్రాద్ధకర్మలు జరగక పోవచ్చు. అలాంటి వారికి కూడా ఈ సమయంలో తర్పణాలను వీడవ వచ్చు.

మహాలయ పక్షంలోని ఒక్కో రోజుకీ ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో కారణంతో చనిపోయిన వారికి, ఒక్కో రోజు కేటాయించ బడింది. క్రితం ఏడు చనిపోయిన వారికీ, భర్త ఉండగానే చనిపోయిన వారికీ, పిల్లలకీ, అర్ధాంతరంగా చనిపోయిన వారికీ.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో తిథి నాడు తర్పణం విడవడం మంచిదని శాస్త్ర వచనం. అలా కుదరక పోతే, మహాలయ పక్షం చివరి రోజు వచ్చే అమావాస్య నాడు తర్పణం విడవవచ్చని చెప్పబడింది. అందుకే ఆ అమావాస్య రోజును ‘సర్వ పితృ అమావాస్య’ అని పిలుస్తారు.

ఈ మహాలయ అమావాస్య వెనుక ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకున్నాడు. అక్కడ ఇంద్రుడు అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. బంగారం, వజ్రాలను అతని ముందు ఉంచి భుజించమన్నాడు. వాటిని చూసిన కర్ణుడికి ఆశ్చర్యం వేసింది. అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుందని అడిగాడు. ‘నీ జీవితకాలమంతా బంగారం, వజ్రాలను దానం చేశావు. కానీ నీ పితృదేవతలకు ఏనాడూ పిండ ప్రదానం చేసి ఎరగవు’ అని బదులిచ్చాడు ఇంద్రుడు. దానితో కర్ణుడు తన తప్పును తెలుసుకుని, తన పితృదేవతలకు తర్పణాలు విడిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేడుకున్నాడు. అలా కర్ణుడికి దక్కిన 15 రోజులే ఈ మహాలయ పక్షం. ఈ విషయాలను విపులంగా వివరిస్తూ మనం చేసిన వీడియోను చూడదలుచుకున్న వారు ఈ లింక్ క్లిక్ చేయండి.. https://youtu.be/vfBBesZcTbw


మహాలయ పక్షంలో ఏదో ఒక రోజున కనీసం ఒక భోక్తనన్నా పిలిచి పితృ దేవతలకు తర్పణాలు వీడాలి, లేదా గయ వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకుని అక్కడ శ్రాద్ధకర్మలు నిర్వహించాలి, లేదా తమ పితృ దేవతలను స్మరిస్తూ ఎవరన్నా బ్రాహ్మణుడికి స్వయంపాకాన్ని దానం చేయాలి. మహాలయ పక్షంలో అంతటా ఈ పితృకర్మలు జరుగుతాయి కాబట్టి, పెద్ద పనులు వేటినీ చేపట్టకూడడు. తీర్థయాత్రలు తప్ప, దూరప్రయాణాలు సాగించకూడదు.

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam