Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Tuesday, November 5, 2024

నాగుల చవితి 2024 Nagula Chavithi


అందరికీ 'నాగుల చవితి' శుభాకాంక్షలు 🙏  TELUGU VOICE

'కాల నాగు' మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాలను గ్రక్కుతూ, మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందనీ, అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే, మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు'కు తెల్లని ఆదిశేషువుగా మారి, శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేదే, ఈ పాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి, దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా, నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాము. అలాగే మన బ్రతుకనే పాలను, జ్ఞానమనే వేడితో కాచి, వివేకమనే చల్ల కలిపితే, సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా, శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం, శివం, సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే, సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే, త్యాగము, యోగము, భోగమనే మూడు రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది. సకల వేదాల సారం, సకల జీవన సారం అయిన పాలను, జీవనానికి ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం ఇదే.

”దేవాః చక్షుషా భుంజానాః భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం.. అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం.  పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా, కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.

నాగులచవితి రోజు పుట్ట వద్ద పఠించ వలసిన శ్లోకం..

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!

నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్‌ ||

పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం, నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్ప దేవతలు ఉన్నప్పటికీ, 12 మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు.

చవితి నాడు సర్పాలను పూజిస్తే, కుజ దోషం, కాలసర్ప దోషానికి అధిదేవుడు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి, నాగుపాము పుట్టకు పూజ చేస్తే, కళత్ర దోషాలు తొలగుతాయని, శాస్త్రాలు సూచిస్తున్నాయి.

దేవతా సర్పాలుగా పేర్కొనబడే - అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటక, ఆశ్వతర, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ అనే  12 దేవతా సర్పాలను ఈ రోజు పూజించి, ఆశీర్వాదాలు పొందుతారు. ఈ విశ్వంలో పాములు - ఆకాశంలో, స్వర్గంలో, సూర్యకిరణాలలో, సరస్సులలో, బావులూ చెరువులలో నివసిస్తాయి.

పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి, పిల్లల చేతా చెప్పించాలి.

 "నడుము తొక్కితే నావాడనుకో
 పడగ తొక్కితే పగవాడు కాదనుకో
 తోక తొక్కితే తోటి వాడనుకో
 నా కంట నువ్వు పడకు, నీ కంట నేను పడకుండా చూడు తండ్రీ.." అని చెప్పాలి.

ప్రకృతిని పూజిచటం, మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి, మన శత్రువును కూడా ఆదరిస్తామని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే, వారికి మంచి అలవాట్లు నేర్పించడం, మన ముఖ్య వుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారినీ, కష్టపెట్టేవారిని కూడా క్షమించాలని తెలియజేయటమే, ఇలాంటివి నేర్పటంలో ముఖ్య ఉద్దేశము.

నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోసిన తరువాత, బియ్యం, రవ్వ, లేదా పిండిని చుట్టూ జల్లుతారు. ఎందుకంటే, మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారాన్ని సమకూర్చడానికి. ఉదాహరణకు, చీమలకు ఆహారంగా అదే కదా.. పుట్ట నుండి మట్టి తీసుకుని, ఆ మట్టిని చెవులకు పెడతాము. ఇది చెవికి సంభందించిన ఇబ్బందులు రాకుండా..

Monday, November 4, 2024

What is Cosmic Plan? | కర్మయోగం!


కర్మయోగం! TELUGU VOICE
ఫలాన్ని ఆశించి చేసే 'కర్మ' వలన ఎటువంటి ఫలితాన్ని పొందుతాము?

ఫలితంపై కోరిక లేకుండా పనిచేయడానికి, అంటే, నిష్కామకర్మకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు పెట్టిన పేరే, 'కర్మయోగం'. యోగం అంటే ఆసనాలు వేయడం, గాలి పీల్చడం అని మనం సాధారణ పరిభాషలో అనుకుంటూ వుంటాము. నిజానికి యోగమంటే కలయిక. ఫలానా వాడికి రాజయోగం పట్టింది, లక్ష్మీ యోగం పట్టిందని అనడం వింటూంటాము. లేనిదానిని పొందడం, పొందినదానిని రక్షించుకోవడమే, యోగమంటే. ఇక్కడ కర్మయోగం అంటే, కర్మ అనే ఉపాయాన్ని పట్టుకుని, మరొకదానిని సాధించడం. ఆ మరొకటే, 'ఆత్మజ్ఞానం'. ఆ విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XycX4sTLnE8 ]


ఫలితం కోరకుండా పని చేసే వ్యక్తి మనస్సు, క్రమక్రమంగా పవిత్రంగా మారుతుంది. దీనినే చిత్తశుద్ధి అంటారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మంచిపనులు చేస్తున్నప్పుడు, మనస్సు ఎంత ప్రశాంతత, సంతృప్తిని పొందుతుందో, మనం స్వంతంగా ప్రయత్నం చేసి చూడవచ్చు. కర్మ మనస్సును శుభ్రపరచడానికి ఒక మార్గం. చిత్తశుద్ధి ఉన్న వ్యక్తియే, ఆత్మజ్ఞానం గురించి ఆలోచన చేయగలడని ఉపనిషత్తుల సిద్ధాంతం.

కర్మయోగం గురించి చెబుతూ, శ్రీకృష్ణుడు ‘యోగః కర్మసు కౌశలం’ అన్నాడు. ‘కర్మయోగం అంటే, పనులు చేయడంలో నేర్పరితనం’ అని చెప్పాడు. ఏమిటి ఆ నేర్పరితనం అంటే, కర్మచేస్తూ ఉండి కూడా, దాని ఫలితం నుంచి తప్పించుకోవడం. అది ఒక దొంగ దొంగతనం చేసి తప్పించుకున్నట్లు కాకుండా, మంచి పని చేసి కూడా దాని ఫలితమైన పుణ్యాన్ని కోరకపోవడం.. ఇది ఆశ్చర్యంగా కనిపించవచ్చు. ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన చెప్పుకుందాము..

ఒకానొక సందర్భంలో కాశీలోని హనుమాన్‌ ఘాట్ దారి గుండా ఇద్దరు యువకులు వెళుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు యువతులు నీళ్ళలో మునిగిపోయే స్థితిలో ఉండటం యాదృచ్ఛికంగా గమనించారు వాళ్ళు. మరు క్షణమే ఆ ఇద్దరూ ముందూ వెనుకా చూడకుండా నీళ్ళలోకి దూకి, మునిగి పోబోతున్న ఆ ఇద్దరు యువతులనూ సురక్షితంగా కాపాడి, వడ్డుకు చేర్చారు.

తమను కాపాడిన ఆ ఇద్దరు యువకులకూ తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు, ఆ యువతులు. కాపాడిన యువకుల్లో ఒకడు, తను కాపాడిన యువతితో తనను వివాహం చేసుకోమని అడిగాడు. అతడు “ఈ లోకమే సత్యం" అనే దృక్పథంగల వాడు. రెండవ యువకుడు, తనకన్నా వయస్సులో పెద్దవారైన స్త్రీలను తల్లి గానూ, సమ వయస్కులైన వారిని సోదరిగానూ, పిన్నలను పుత్రికలుగానూ భావించి మెలగేవాడు. కనుక అతడు, “సోదరీ, ఒక మంచి పని చేయడానికి భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను నా కర్తవ్యాన్ని మాత్రమే చేశాను” అని తాను కాపాడిన యువతితో చెప్పాడు. అతడు "భగవంతుడు మాత్రమే సత్యం” అనే దృక్పథం గలవాడు.

బాహ్య స్థాయిలో చూసినప్పుడు, ఇద్దరు యువకులూ ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఒకే రకమైన కర్మనే చేశారు. కానీ వాస్తవ దృక్పథం ప్రకారం, ఇద్దరిలో వ్యత్యాసం ఉంది. ఆ కారణంగా, వారికి ఫలమూ విభిన్నంగానే దక్కింది.

కర్మయోగి కానివాడు, స్వంత అభ్యుదయం కోసం పనిచేస్తూ, జనన మరణ చక్రంలో తిరుగుతూ వుంటాడు. అతడికి మోక్షం ప్రాప్తించదు. అలాకాకుండా, 'కర్మయోగి' లోకం మేలు కోసం, ఈశ్వరార్పణ బుద్ధితో పనిచేస్తూంటాడు. ఈశ్వరార్పణ అంటే, తాను భగవంతుడి కాస్మిక్ ప్లాన్ లో ఒక భాగంగా, భగవంతుని చేతిలో ఒక పనిముట్టుగా భావిస్తూ, పనిచేయడం. దీనివల్ల ప్రయోజనం, చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఉన్న మనస్సు, పరిశుభ్రమైన అద్దం వంటిది. ఒక అద్దంలో ఏదైనా వస్తువు ప్రతిబింబం ఏర్పడాలంటే, అద్దం శుభ్రంగా ఉండాలి. అలాగే, ఆత్మజ్ఞానమనే వెలుగును ప్రతిబింబించాలంటే, మనస్సనే అద్దం శుభ్రంగా ఉండాలని, వేదాంతం చెబుతుంది.

ఫలితాన్ని ఆశించి చేసే 'కర్మ', బంధానికి దారి తీస్తుంది. తనను భగవంతుని ఉపకరణగా భావించి కర్మను ఆచరించటమూ, దాని ఫలాన్ని భగవంతునికే అర్పించడమూ, 'ఆత్మ విముక్తి'కి దారి తీస్తుంది. పైగా, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారు మాత్రమే, నిష్కళంక భావంతో లోకానికి సేవలు అందించగలరు. అలా కాని స్థితిలో, స్వార్ధం చోటుచేసుకోవడాన్ని నివారించలేము.

కర్మాచరణలో మాత్రమే నీకు అధికారం ఉంది. దాని ఫలాలలో ఎన్నడూ లేదు. కర్మ ఫలాలను రూపొందించే వానిగా అవ్వవద్దు. కర్మలు ఒనర్చకుండటంలో అనురక్తి కూడదు.

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన |
మా కర్మఫలహేతుర్భూర్మా తే సఙ్గోஉస్త్వకర్మణి || -గీత, 2.47

మనం మన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలి. ఫలితాల గురించి చింతించకూడదు. మన కర్తవ్యాన్ని నిర్వర్తించే హక్కు మనకు ఉంది కానీ, ఫలితాలు మన ప్రయత్నాలపై మాత్రమే ఆధారపడి ఉండవు. ఫలితాలను నిర్ణయించడంలో, అనేక అంశాలు అమలులోకి వస్తాయి.. అవి మన ప్రయత్నాలూ, విధి, అంటే, మన గత కర్మలూ, భగవంతుని సంకల్పం, ఇతరుల ప్రయత్నాలూ, పాల్గొన్న వ్యక్తుల సంచిత కర్మలూ, స్థలమూ మరియు పరిస్థితి, అంటే, అదృష్టానికి సంబంధించిన విషయం, మొదలైనవి. మనం ఫలితాల కోసం ఆత్రుతగా ఉంటే, అవి మన అంచనాలకు అనుగుణంగా లేనప్పుడు, ఆందోళనను అనుభవిస్తాము. కాబట్టి, ఫలితాల కోసం చింతించవద్దనీ, మంచి పని చేయడంపై మాత్రమే దృష్టి పెట్టమనీ, శ్రీ కృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చాడు. వాస్తవమేమిటంటే, ఫలితాల గురించి మనం పట్టించుకోనప్పుడు, మన ప్రయత్నాలపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతాము. ఫలితం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

మరో కోణంలో భగవాన్‌ శ్రీరామకృష్ణులవారు ఇలా అన్నారు.. పడవ నీటి మీద తేలవచ్చు. కాని పడవలో నీరు ప్రవేశించ కూడదు. ఆ విధంగానే, మనిషి సంసారంలో ఉండవచ్చు కానీ, సంసారానురక్తి అతడిలో ప్రవేశించ కూడదు.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Tuesday, October 29, 2024

2024 'ధన్వంతరి జయంతి' శుభాకాంక్షలు

 

అందరికీ 'ధన్వంతరి జయంతి' శుభాకాంక్షలు 🙏 TELUGU VOICE
సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ 'ధన్వంతరి' ఒకటి!

క్షీర సాగర మధన సమయంలో, విష్ణు అంశతో సాగర గర్భం నుండి యువకుడిగా ఉదయించాడు 'ధన్వంతరి'. లేలేత బాహు దండాలు, విశాలమైన వక్షస్థలి కలిగివున్నాడు. పద్మాలవంటి ఎర్రని కన్నులతో, చిక్కనైన కేశజాలంతో, నీలగాత్ర తేజంతోనూ కనిపించాడు. పీతాంబరాలలను కట్టుకున్నాడు. మణికుండలాలతోనూ, పుష్పమాలాతోనూ సమలంకృతుడై ఉన్నాడు. అమృత కలశాన్ని ఒక చేత్తోనూ, వనమూలికల్ని మరొక చేత్తోనూ పుచ్చుకుని ఆవిర్భవించాడు.

ముక్కోటి దేవతలూ ఆ రూపాన్ని రెప్ప వాల్చకుండా చూశారు. "ఓం తత్పురుషాయ విద్మహే అమృత కలశహస్తాయా ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్..." అని ధన్వంతరీ గాయత్రి జపించారు. శరీరానికి ముసురుకున్న వ్యాధుల్నీ, మనసుకు పట్టిన జాడ్యాన్ని తొలగించే వాడు ధన్వంతరి. సూర్యుడికి గల 108 పేర్లలోనూ, శివుడికి గల 1008 పేర్లలోనూ ధన్వంతరి ఒకటని మహాభారతంలో ఉంది. భాగవత పురాణం ధన్వంతరిని విష్ణుమూర్తి 12వ అవతారంగా పేర్కొంది.

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే... ఇది శ్రీ ధన్వంతరి ధ్యానమంత్రం. ఋగ్వేదంలో దేవభిషక్కులుగా అశ్వనీదేవతలే ప్రసిద్ధులు. పురాణకాలంలో ధన్వంతరి ఆవిర్భవించాడు. వ్యాస భారతం ఉద్యోగ పర్వంలోనూ, భాగవంతం నవమ స్కంధంలోనూ, హరి వంశం 29వ అధ్యాయంలోనూ, ధన్వంతరిని గురించిన ప్రస్తావనలున్నాయి. ఇంకా అగ్నిపురాణం, గరుడపురాణాలలో కూడా ఉంది. ధన్వంంతరి చారిత్రక వ్యక్తిగా భారతదేశంలో నడయాడాడనీ, ఆయనే ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందించాడనీ నమ్మేవారున్నారు.

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత !
రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే !!

Monday, October 28, 2024

సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి? 6 Questions of Yudhishtira to Bhishma


భక్తి! జ్ఞాన సముపార్జన! TELUGU VOICE
సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ధర్మరాజడిగిన 6 ప్రశ్నలేంటి?

“స్వ స్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే” అని సూత్రీకరించారు, నారద మహర్షి. దానిని బట్టి, జీవాత్మను పరమాత్మతో చేర్చటమే ‘భక్తి’ అని తెలుస్తోంది. “సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం, హృషీకేణ హృషీకేశ సేవనం భక్తి రుచ్యతే” అని నారద పంచరాత్రం లోనూ, “అన్యాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం, ఆనుకూల్యేన కృష్టానుశీలనం భక్తి రుత్తమా”.. అని భక్తి రసామృత సింధువులోనూ విశదీకరింపబడి ఉంది. “మన ఇంద్రియాలన్నింటి ద్వారా, ఇంద్రియాలకు అధిపతి అయిన పరమాత్మను సేవిస్తూ ఉండడమే 'భక్తి'. జ్ఞాన కర్మాదులవైపు మనస్సు పోనీయకుండా, శ్రీ కృష్ణుని సంతృప్తి పరచడమే లక్ష్యంగా చేసే సాధన, ఉత్తమ భక్తిగా పరిగణింప బడుతుందన్నదే, వాటి తాత్పర్యం. మరి అంపశయ్యపై మృత్యు నిరీక్షణలో వున్న భీష్ముడు, భక్తి గురించీ, విష్ణు సహస్రనామం గురించి ఏం చెప్పాడు? అన్న విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QI8rw_UOcco ]


ఉపాధిగతుడై ఉన్న పరమాత్మనే, ‘జీవుడు’అని అంటాము. అటువంటి జీవులు అనంతంగా ఉంటాయి. అంటే, ఆ పరమాత్మ, ఈ సువిశాల విశ్వమంతటా ఉన్న అన్ని ఉపాధులలోనూ, జీవ రూపంలో ఉన్నాడని అర్ధం. దానివల్ల, అన్ని ప్రాణులలో ఉండేవాడు ఆయన ఒక్కడే అని తెలుస్తోంది. ఆ సత్యాన్నే “ఏకో దేవః సర్వభూతేషు గూఢః” అని ఉపనిషత్తులూ, “క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు..” అని శ్రీ కృష్ణపరమాత్మా, వ్యక్త్రపరచటం జరిగింది.

అయితే, యిప్పుడు మన కర్తవ్య మేమిటి? అంటే, సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ శ్రీమహావిష్ణువును, విష్ణు సహస్ర నామస్తోత్ర రూపంలో ఉన్న“మహా మంత్రం” ఆధారంగా గుర్తించటానికి ప్రయత్నించటం. మనలో భక్తి అనేది దృఢంగా ఉంటే, తప్పకుండా సఫలమనోరథులమవుతాము. అందులో సందేహమేమీలేదు.

“శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం” అనే మహామంత్రం, శ్రీమన్మహాభారతంలో, అనుశాసనిక పర్వంలో ఉంది. మహాభారత యుద్ధ కాలంలో, ఒక వైపు కురు పితామహుడైన భీష్మాచార్యుడు ప్రాణోత్క్రమణ సమయం కోసం ఎదురు చూస్తూ, అంపశయ్య మీద ఉన్నాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అయిన శ్రీకృష్ణుని దర్శనం కోసం తహతహలాడుతున్నాడు. మరొక వైపు యుధిష్ఠిరుడు, తన రాజ్యకాంక్ష కారణంగానే యుద్ధం జరిగిందనీ, అందులో తన గురువులూ, బంధువులూ, మిత్రులూ అన్యాయంగా మరణించటం సంభవించిందనీ భావించి, అమిత వేదనను అనుభవిస్తూ, పాపభీతితో కుమిలిపోతున్నాడు.

ఇదంతా గ్రహిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు, తన పరమ భక్తుడైన భీష్మాచార్యునికీ, ధర్మమూర్తి అయిన యుధిష్ఠిరునికీ, ఏకకాలంలో మనశ్శాంతి చేకూర్చాలని నిశ్చయించుకున్నాడు. ఆ కారణంగానే, ధర్మజుని తీసుకుని భీష్మాచార్యుని దగ్గరకు వెళ్ళాడు.

శ్రీ కృష్ణుని ఆగమనాన్ని గ్రహించిన భీష్ముడు, ఆనంద పరవశుడయ్యాడు. శ్రీ కృష్ణుని భక్తవాత్సల్యాన్ని అమితంగా ప్రశంసించాడు. ఆపైన శ్రీ కృష్ణుని ఆదేశానుసారం, ఆయన ప్రసాదించిన శక్తి ఆధారంగా, పాండవాగ్రజునికి అనేక ధర్మసూక్ష్మాలు బోధించాడు. ఆ ధర్మసూక్ష్మాలలో కొన్నింటిని, మనం ఇదివరకే వీడియోలుగా అందించివున్నాము. చూడనివారు తప్పక చూడగలరు. అలా ఆయన ధర్మరాజు ఆవేదనను ఉపశమింప చేయటానికి ప్రయత్నించాడు.

కానీ, ధర్మజుడికి సంపూర్ణమైన సంతృప్తి కలుగలేదు. తన గురు దేవుని ద్వారా తాను తెలుసుకో వలసిన అసలు విషయమేదో మిగిలి ఉన్నదన్న అభిప్రాయం, ఆయనను బాధిస్తూనే ఉంది. ఆ కారణంగానే ఆయన, సర్వధర్మజ్ఞుడైన భీష్మాచార్యుడిని ఉద్దేశించి, ఆరు ప్రశ్నలడిగాడు..

1. ‘కి మేకం దైవతం లోకే’ అంటే, ప్రపంచమంతటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు?
2. ‘కిం వా ప్యేకం పరాయణం’ అంటే, ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యమేమిటి?
3. ‘స్తువంతః కం ప్రాప్నుయుర్‌ మానవాః శుభం’ అంటే, ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది?
4. ‘కమర్చంతః ప్రాప్నుయుర్‌ మానవాః శుభం’ అంటే, ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి?
5. ‘కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమోమతః?’ అంటే, మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకీ విశిష్ఠమైన ధర్మం ఏది?
6. ‘కిం జపన్‌ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్‌’ అంటే, ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి, జనన-మరణ రూపమైన సంసారచక్రం నుండి విడివడగలుగుతుంది?

అన్న ఈ ఆరు ప్రశ్నలకు సమాధానాలను, భీష్మాచార్యుడు ఇలా చెప్పనారంభించాడు..

ప్రపంచమంతటికీ ఏకైక ఆరాధ్య దేవత ఎవరు? అన్న ప్రశ్నకు, ‘పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం, దైవతం దేవతానాం చ భూతానాం యో అవ్యయః పితా’ అంటే, పవిత్రమైన వాటన్నింటికీ పవిత్రతను చేకూర్చే పరమ పవిత్రుడూ, సర్వశ్రేయాలకూ మూలమైన వాడూ, దేవతలందరికీ దైవతమైన వాడూ, సమస్త ప్రాణికోటికీ తండ్రి అయిన శ్రీ మహావిష్ణువే, ప్రపంచమంతటికీ ఏక్రైక దైవతం.

ప్రాణికోటికి ఏకైక పరమ లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు, ‘పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః, పరమం యో మహద్‌ బ్రహ్మ పరమం యః పరాయణం’ అంటే, పరమ తేజస్వరూపుడూ, సర్వ నియామకుడూ, సర్వ వ్యాపకుడూ, సర్వేశ్వరుడూ, పరమాత్మా అయిన శ్రీ మహావిష్ణువే, ప్రాణికోటి అంతటికీ ఏకైక లక్ష్యం.

ఎవరిని స్తుతించడం ద్వారా మానవులకు మేలు కలుగుతుంది? అన్న ప్రశ్నకు, ‘జగత్ ప్రభుం దేవదేవ మనంతం పురుషోత్తమం, స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః’ అంటే, ముల్లోకాలకూ ప్రభువూ, దేవతలకు కూడా దైవతమైన వాడూ, ఆది మధ్యాంత రహితుడూ అయిన పరమ పురుషుడిని, ఆయనకు సంబంధించిన అనంత నామాల ద్వారా స్తోత్రం చేయటంవలన, జీవులకు మేలు కలుగుతుంది.

ఎవరిని అర్చించడం ద్వారా మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి? అన్న ప్రశ్నకు, ‘తమేవ చార్చయన్‌ నిత్యం భక్ష్యాపురుష మవ్యయం, స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః’ అంటే, భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించడం, పూజించడం, సేవించడం ద్వారా, మానవులకు సుఖమూ, శాంతీ లభిస్తాయి.

చివరి రెండు ప్రశ్నలు.. ‘మీ అభిప్రాయంలో ధర్మాలన్నింటిలోకీ విశిష్ఠమైన ధర్మం ఏది? ఏ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణికోటి, జనన-మరణ రూపమైన సంసారచక్రం నుండి విడివడగలుగుతుంది? అన్న ప్రశ్నలకు, ‘అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం స్తువ న్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్‌’ అంటే, జనన మరణాలకు అతీతుడూ, సర్వవ్యాపీ, విశ్వమంతటికీ ప్రభుడూ, సర్వసాక్షీ అయిన పరమాత్ముని అనంత నామాలను అనుదినమూ జపించడం ద్వారా, మానవులు దుఃఖ నివృత్తి చేసుకో గలుగుతారు.

ఈ విధంగా సమాధానమిచ్చిన తరువాత భీష్మాచార్యుల వారు, భగవంతుడికి సంబంధించిన అనంతనామాలైన శ్రీ విష్ణు సహస్రనామాలను ధర్మజుడికి వినిపించడం జరిగింది. నిరాకారుడైన భగవంతుడు, నామ రూపాలుగల ప్రపంచంగా వ్యక్తంకావడం వల్ల, ఆయనకు అనంత నామాలు ఏర్పడ్డాయి. ఆ నామాలన్నీ ఆయనవే అని గ్రహించడం, ఆ రూపాలన్నీ ఆయనవిగానే భావించడం, ప్రపంచంలోనూ, త్రికాలాలలోనూ శాశ్వతంగా ఉండేది ఆయన ఒక్కడే అని స్పష్టంగా తెలుసుకోవడం అన్నదే, ‘జ్ఞానం’. ఆ విధమైన జ్ఞాన సముపార్జనకు, విష్ణు సహస్రనామాలు అమితంగా సహాయపడతాయి.

ధర్మ సంరక్షణకోసం, అధర్మ నిర్మూలనకోసం, భగవంతుడు అప్పుడప్పుడూ అవతరిస్తూ ఉంటాడు. జ్ఞానులూ, భక్తులూ, సత్పురుషులూ మొదలయిన మహనీయుల రూపంలో, సామాన్యంగా వ్యక్తమవుతూ ఉంటాడు. ఆయా నమయాలలో ఆయన వెలువరుస్తూ ఉండే గుణాల ఆధారంగానే, మనం ఆయనదైన మహత్తర శక్తిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంటే, అవ్యక్త శక్తిని అవగాహన చేసుకోవటానికి, వ్యక్త రూపాలను ఆధారం చేసుకోవాలి. ఉదాహరణకు, ఒక చిత్రపటాన్నో, శిల్పాన్నో దర్శించుకున్నా, ఒక మహాకావ్యాన్ని చదివినా, ఆ చిత్రపటం, శిల్పం, లేక కావ్యం ద్వారా, ఆయా చిత్రకారుల, శిల్పాచార్యుల, మహాకవుల శక్తి సామర్థ్యాలు కొంతవరకైనా మనకు అవగతమవుతాయి. అలాగే వివిధ రూపాలలో వ్యక్తమయ్యే భగవత్‌ సృష్టిని పరిశీలించడం ద్వారా, ఆ భగవత్‌ శక్తిని లేశ మాత్రమైనా అర్థంజేసుకోవడానికి మనకు వీలవుతుంది. మనకు ఆ విధమైన అనుభూతిని కలిగించేవే, ‘శ్రీ విష్ణు సహస్రనామాలు’.

అలాగే, ‘కలిదోష నివారకమైన మార్గమేమిటి?’ అని నారద మహర్షి ఒకసారి, చతుర్ముఖ బ్రహ్మని అడిగాడు. అప్పుడాయన, ‘సర్వ శృతి రహస్యం గోప్యం తత్‌ శృణు యేన కలి సంసారం తరిష్యసి, భగవతః ఆదిపురుషస్య నారాయణస్య నామోచ్ఛారణ మాత్రేన నిర్ధూత కలిర్‌ భవతి’ అని సమాధానమిచ్చాడు.

ఆ అభిప్రాయాన్నే ‘బృహన్నారద పురాణం’, ‘హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం, కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతి రన్యథా’ అని ఉద్ఘోషించింది. దానిని బట్టి, ‘కలియుగంలో మానవులకు హరినామం ఒక్కటే గతి. అంతకు మించి వేరే గతి లేదు..’ అని నిష్కర్షగా తేటతెల్లమవుతోంది. అటువంటి మహత్తర శక్తిగల నామాలు, ఈ ‘స్తోత్ర మహామంత్రం’లో వెయ్యి వున్నాయి.

జనన ధర్మంగల జీవులకు జన్మరాహిత్యాన్ని చేకూర్చేది, భగవన్నామ జపం ఒక్కటే. ఏ రూపంలో ఉన్నా, ఏ జాతికి, కులానికి, మతానికి చెంది ఉన్నా, భగవన్నామాన్ని జపించే అర్హత ప్రతి ప్రాణికీ ఉంది. ఆ సత్య నిరూపణకు, గజేంద్ర మోక్షం ప్రబల నిదర్శనం. జడ భరతుని గాథ ఒక తార్కాణం. వాల్మీకి, హరిదాసు మొదలైన వారి చరితలు, కొన్ని ఉదాహరణలు.

శ్రీ విష్ణు సహస్రనామాలలో ప్రతి నామం ఒక మంత్రమే. వీటిలో ఏ ఒక్క నామాన్ని జపించినా, ధన్యత్వం సిద్ధించి తీరుతుందంటారు ఆర్యులు.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Monday, October 21, 2024

Rules of Impurity (Sutaka or Ashoucha) as per Garuda Puranam గరుడ పురాణం ప్రకారం మృత్యు మైల!


మృత్యు మైల!? TELUGU VOICE
గరుడపురాణంలో పరాశరుడు చెప్పిన ధర్మకర్మాలేమిటి?
ఏ వర్ణానికి ఎన్నాళ్ళు మృత్యు అశౌచము లేక మైల వుంటుంది?

అతి ప్రాచీన జోతిష్య శాస్త్రానికి ఆద్యుడూ, పరాశర హోర గ్రంథకర్త, వ్యాస భగవానుడి తండ్రి, పరాశర మహర్షి. అటువంటి మహనీయుడు చెప్పిన ధర్మసూక్ష్మాల విషయానికి వస్తే.. గరుడపురాణం ప్రకారం, నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ, తన గురువైన వ్యాస మహర్షికి, ఆయన తండ్రి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా చెప్పనారంభించాడు. “శౌనకాచార్యా! ప్రతి కల్పాంతంలోనూ, అన్నీ నశించిపోతాయి. కల్ప ప్రారంభంలో, మన్వాది ఋషులు వేదాలను స్మరించి, బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరల విధిస్తుంటారు. అంటూ ప్రారంభించి, మానవాళికి ఆయన వ్యక్తపరచిన విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/K0OBiPNIEsU ]


త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సృజేత్‌ ।
ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలౌయుగే ।।

కలియుగంలో దానమే ధర్మము. పాపమూ, శాపమూ సర్వాంతర్యాములుగా పరిఢవిల్లే ఈ కలియుగంలో, పాపాన్ని అంతంచేయలేము. పాపంచేసిన వారిని మాత్రమే పరిత్యజించవలసి వుంటుంది.

సత్య, లేక కృత యుగంలో పాపాత్ములుంటే, ఆ దేశాన్నే బుష్యాదులు త్యజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్నీ, ద్వాపరంలో పాపి కుటుంబాన్నీ త్యజించారు. కలియుగంలో పాపం సార్వలౌకికమైపోతుంది కాబట్టి, పాపిని మాత్రమే త్యజించగలరు.

సదాచారం, శౌచాచారాల ద్వారానే, మనిషి అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజనం, అతిథి సత్కారం అనే ఆరు సత్మర్మలనూ, ప్రతి దినం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు గానీ, సర్వసంగ పరిత్యాగియైన సన్యాసిగానీ, కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. అధ్యయనాధ్యాపనాదులను వదులుకోరాదు. క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి, ప్రజలను కన్నబిడ్డలలాగా చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాదికాలను చేయిస్తూ, న్యాయ సమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈ పై మూడు వర్ణాల వారికీ నిష్కపటంగా సహకరిస్తూ, దేశ సౌభాగ్యానికి ఊతమివ్వాలి.

తినకూడనివి తినడం, దొంగతనం, పోకూడని చోటికి పోవడం, మనిషి పతనానికి కారణాలవుతాయి. వ్యవసాయం చేసేవాడు, అలసిపోయిన ఎద్దును మళ్ళీ కాడికి కట్ట కూడదు, దాని చేత బరువులనూ మోయించకూడదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞాదులను మానకూడదు. బ్రాహ్మణులకు నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూరకర్ముల విషయంలో, ముఖమాటానికీ, స్వార్ధానికీ తావివ్వకుండా ప్రవర్తించాలి.

నువ్వులనూ, నేతినీ అమ్ముకోకూడదు. పంచసూనాజనిత దోషం పోవడానికి, బలి వైశ్వదేవ హోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన, లేదా పంటలోని ఆరవభాగాన్ని రాజుకీ, ఇరువదవ భాగాన్ని దేవునికీ, ముప్పది మూడవ భాగాన్ని బ్రాహ్మణులకీ ఇవ్వాలి. దీని వల్ల కృషి హింసా పాపం ప్రక్షాళితమవుతుంది. ఈ విధంగా ఇవ్వకపోతే, అంటే, పన్ను ఎగ్గొడితే, పాపం చుట్టుకుంటుంది. అదీ దొంగతనంతో సమానమైన పాపమే!

పరాశరుడు ఏ వర్ణానికి ఎన్నాళ్ళు మృత్యు అశౌచముంటుందో, యాజ్ఞవల్క్యుని లాగానే చెప్పాడు. బంధువులలో ఈ మైల నాలుగవ తరం దాకా పది రోజులు, అయిదవ తరంలో ఆరు రోజులు, ఆరవ తరంలో నాలుగు రోజులు, ఏడవతరంలో మూడు రోజులూ వుంటుంది. పరదేశంలో వున్న బాలకుడు పోతే, మృత్యు అశౌచం పెద్దగా వుండదు. వార్త వినగానే స్నానం చేస్తే, వెంటనే శుద్ధి అయిపోతుంది.

గర్భస్రావ, గర్భపాతాలలో బిడ్డ మరణించినపుడు, తల్లి ఎన్నవ నెల గర్భవతి అయివుంటుందో, అన్ని రోజుల అశుచి ఆ బిడ్డ బంధుగణానికి వుంటుంది. నాలుగవ నెల వరకూ జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమనీ, ఆరు మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే, గర్భపాతమనీ అంటారు.

శిల్పకారుడూ, మేదరవాడు, రాజూ, రాజ గురువూ, శ్రోత్రీయ బ్రాహ్మణుడూ, దాసదాసీ జనమూ, భృత్యులూ, వీరిలో ఎవరు పోయినా, వారి సంతానానికి తప్ప, మైల ఇతరులెవరికీ వుండదు.

పురుటి మైల అనగా, పిల్లలు పుట్టినపుడు కలిగే అశుచి, కన్నతల్లికే పది రోజుల పాటు వుంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం, లేదా యజ్ఞం తలపెట్టి, అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక మృత్యువు, లేదా పురుటి వార్త తెలిసినా, ఆ ఉత్సవం చేసేవారికీ, అందులో పాల్గొనే వారికీ అశుచి వుండదు. అనాథ శవాన్ని మోసే వారికి, ప్రాణాయామ మాత్రాన శుద్ధి కలుగుతుంది. తెలిసీ, శూద్ర శవాన్ని మోసిన వారికి మాత్రం, మూడు రాత్రుల వరకూ అశుచి వుంటుంది.

మంచివాడు, సచ్ఛరిత్రుడు అయిన పతిని మదమెక్కి వదిలేసిన స్రీ, ఏడుజన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానే పోతుంది. అన్నపానాదుల విషయంలో భ్రష్టురాలైన స్తీ, మరుజన్మలో పందిగా పుడుతుంది.

ఔరసుడూ, క్షేత్రజ్ఞుడూ ఒకే తండ్రికి పుడితే, ఆ తండ్రి పోయినపుడు, రెండు రకాల వాళ్ళూ పిండదానం చేయవచ్చు.

పరివేత్త అంటే, అన్నకు పెళ్ళి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడూ, పరివిత్తి అంటే, తమ్ముడికి వివాహం జరిగిపోయి, తాను అది లేకుండా వుండిపోయిన అన్న.. ఈ రెండు రకాల వారికీ కృచ్ఛ్ర వ్రతం చేసుకునే దాకా శుద్ధి లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛ్ర వ్రతం చేయాలి. కన్యాదాత అతికృచ్ఛ్రం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పురోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడుగానీ వీరికి శుద్ధి లేదు.

అన్న గూనివాడో, మరుగుజ్జో, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగ విహీనుడో అయితే మాత్రం, తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చు. అప్పుడు ఎటువంటి దోషమూ లేదు.

నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్త అయిన కన్య, ఆ వరుడు పరదేశం వెళ్ళి పోయి, ఇక రాడని తెలిసినా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడై పోయినా, ఆ కన్య వేరొకరిని వరించి వివాహం చేసుకో వచ్చు. భర్తతోపాటు, సతీ ధర్మాన్ని అనుసరించి అగ్ని ప్రవేశం చేసిన స్త్రీ, తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో, అన్నేళ్లపాటు స్వర్గంలో నివాసముంటుంది. ప్రస్తుత రాజ్యాంగం ఈ సతీసహగమనాన్ని నిషేధించిందని గుర్తించాలి.

కుక్కకాటుకు గురైన వాడు, ఔషధ సేవనం గావించి, గాయత్రీ మంత్రాన్ని జపిస్తే అశౌచం పోతుంది. స్వయంగా దాన్ని జపించే అర్హత లేనివారు, బ్రాహ్మణులనెవరినైనా ఆశ్రయించి, ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే, ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చు. ఆయన అస్థికలను సేకరించి, మరల మంత్ర పూర్వకంగా, ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్నిని తెచ్చి, అంతకు ముందే పాలతో శుద్ధి చేసిన ఆయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే, ఇక్కడి పరిజనులు, తమ గృహాలలోనే కుశలతో ఆ వ్యక్తి శరీరాన్ని తయారు చేసి, అగ్నికి ఆహుతి చేయాలి. ఆ పరదేశ మృతుడు అగ్నిహోత్రి అయితే, మృగ చర్మంపై ఆరు వందల పలాశ ఆకులను అతని ఆకారంలో పరచి, శిశ్న భాగంలో శమీ, వృషణ భాగంలో అరణీ పెట్టి, కుడి చేతి స్థానంలో అన్నం కుండనూ, ఎడమ చేతి స్థానంలో యజ్ఞియ పాత్రనూ వుంచాలి. వక్షో భాగంలో, సోమరసం తయారీలో వాడే రాతినుంచాలి. ముఖ భాగంలో నేతిలో ముంచిన తిలలనూ, తండులాలనూ, నేత్రాల వద్ద నేతి కుండనూ ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు, నోటి ప్రాంతాలలో, చిన్న చిన్న బంగారు ముక్కలనుంచే పద్ధతి కూడా వుంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలనూ వుంచి, ఆ అగ్నిహోత్రి ఊహాకల్పిత కళేబరాన్ని, ‘అసౌస్వర్గాయ లోకాయ స్వాహా’ అనే మంత్రాన్ని చదువుతూ, నేతిని ఒక ఆహుతి నిచ్చి, అగ్నికి ఆహుతి చేస్తే, ఆయనకు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.

హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలులలో దేనిని వధించినా, ఒక పగలూ, ఒక రాత్రీ ఉపవాసం చేస్తే పాపం పోతుంది. గోవును కాకుండా, నాలుగు కాళ్ళ పశువును దేనిని వధించినా, ఒక రోజంతా నిలబడి, ఉపవసించి, గాయత్రిని జపిస్తే పాప శాంతి కలుగుతుంది.

శూద్రుని వధిస్తే, కృచ్ఛ్ర వ్రతం చేయాలి. వైశ్యుని హత్య చేస్తే, అతి కృచ్ఛ్ర వ్రతం చేయాలి. క్షత్రియుని చంపితే ఇరవై రెండూ, బ్రాహ్మణుని మృతి నొందిస్తే ముప్పదీ, ‘చాంద్రాయణ వ్రతాలు’ చేయాలి. (అధ్యాయం - 107)

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Thursday, October 17, 2024

నేను పోతే!!!


నేను పోతే!!! TELUGU VOICE

భోజ మహారాజు ఒకనాడు తన ఆస్థాన పండితులను, "మోక్షానికి పోగలిగే వాడెవడు?" అని ప్రశ్నించాడు..

[ నేను వదిలి రా..! నేను కనబడతాను..! https://youtu.be/0YFcLtZ565o ]


మహాక్రతువులు చేస్తే మోక్షానికి పోవచ్చని కొందరు, జ్ఞానం పొందితే పోవచ్చని మరికొందరు, భక్తితో పోవచ్చని ఇంకొందరు, సత్సంగంతో పోవచ్చనీ, ఇలా రకరకాలుగా, ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెప్పసాగారు.

అదే ఆస్థానంలో ఉన్న మహాకవి కాళిదాసు లేచి, "నేను పోతే పోవచ్చు" అని అన్నాడు. ఆ మాట తక్కిన వారికి కోపం తెప్పించింది. "మాకు లేనిది ఏమిటి? కాళిదాసుకు ఉన్నది ఏమిటి? అతనొక్కడే మోక్షానికి పోతానంటాడేమిటి?" అని మదనపడ్డారు. "ఇతడొక్కడేనా మోక్షానికి పోయేవాడు!?" అని ఆక్షేపణలు కూడా మొదలయ్యాయి.

భోజుడు కాళిదాసు వంక ప్రశ్నార్ధకంగా చూశాడు. కాళిదాసు లేచి ఇలా అన్నాడు.. “మహా ప్రభూ! 'నేను' అన్న అహంకారం పోతే ఎవడైనా మోక్షానికి పోవచ్చన్నాను. అంతే కానీ,నేను పోతానని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు" అని వివరించాడు..

భోజ మహారాజుతో సహా సభాసదులందరూ హర్షధ్వానాలు చేశారు..

[ శివోహం! - నేను శివుడిని! https://youtu.be/UafRztjHW04 ]


🚩 జై సనాతన ధర్మం! 🙏

Monday, October 14, 2024

The Varna and Caste System as per Garuda Puranam | శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం కులము!?


కులము!? – గరుడపురాణంలో చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మాలేమిటి? TELUGU VOICE
శూద్రులు తపస్సు చేయడం? వేదాలు చదివి బ్రాహ్మణులవ్వడం? బ్రాహ్మణుల చేత పూజలందుకోవడం?

ఈ సువిశాల విశ్వం లాగానే, ఆది తెలియనిది, అంతం లేనిది, సనాతన ధర్మం. నాలుగు వేదాలను స్థంభాలుగా చేసుకుని సుస్థిరంగా నిలబడిన సనాతన ధర్మాన్ని నిష్ఠగా పాటించే హిందువులను గెలువలేక, పాశ్చాత్య ధూర్తులు పన్నిన ఒకానొక దౌర్భాగ్యపు పన్నాగం, 'కులం'! 1947 లో పేరుకు వారు వదిలి వెళ్ళినా, Secularism పేరిట హిందువుల ముసుగులో ఇప్పటికీ వారి ప్రయత్నాన్నీ, వారసత్వాన్నీ కొనసాగిస్తూనే వున్నారు కొందరు ద్రోహులు. మరి సాక్షియత్తు శ్రీమహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పిన విషయాలను, వ్యాస మహర్షి మనకందించిన అష్టాదశ పురాణాలలో ఒకటయిన గరుడపురాణంలో, ఆ పైత్యం గురించి ఏం చెప్పబడింది? వర్ణాశ్రమ ధర్మాలేమిటి? వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/yF1smKwsNqo ]


వర్ణమంటే కులం కాదు. పురాణ కాలంలో సమాజాన్ని నడిపించిన వర్ణానికీ, నేటి కలికాలంలో రాజకీయాలను శాసిస్తున్న కులానికీ పోలికే లేదు. ఎవరైనా పేర్లను బట్టి భ్రమపడినా, అది హస్తి మశకాంతరమే. వర్ణమంటే, వృత్తి.. వృత్తులను బట్టి ఆర్యావర్తంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఏర్పడ్డాయి. సృష్టి, స్థితి, లయ కారకులైన దేవతల భక్తి విషయంలో భేదాలు లేవు. ఎవరి పూజలు వారు చేసుకోవచ్చు. ధర్మాలు వేరైనా, హరి అన్ని వర్ణాలకూ హరియే.

యజన, యాజన, దాన, ప్రతిగ్రహ, అధ్యయన, అధ్యాపన అనే ఆరుకర్మలూ బ్రాహ్మణ ధర్మాలు. దానము, అధ్యయనము, యజ్ఞము, ఇటు క్షత్రియులకూ, అటు వైశ్యులకూ సమాన ధర్మాలు, సాధారణ కర్తవ్యాలు. ఇవిగాక పరిపాలన, దండన – క్షత్రియులకు.. వ్యవసాయం అంటే, పొలాల సేద్యం మాత్రమే కాకుండా, వ్యాపారమూ, వైశ్యులకు విద్యుక్త ధర్మాలు. పై మూడు వర్ణాల వారిని సేవించడం, శూద్రుల ధర్మం. ఈ సేవించడం అనే మాటను పట్టుకుని పెడార్థాలు తీసి, అపార్థాలు సృష్టించి, వర్ణం అనే మాటను అర్ధంతో సహా మరుగున పడేసి, ‘కులం’ అనే మాటను నృష్టించి, అనర్ధాలను ప్రేరేపించారు పాశ్చాత్యులు. ఆ విధంగా వారు హిందూ సంఘాన్ని విభజించి పాలిస్తే, వారి మానస పుత్రులైన కొందరు భారతీయ కుహనా మేధావులు ఈ కులతత్త్వాన్ని మరింత సాగదీసి, ముందుబడిపోయిన వారనీ, వెనకబడిపోయిన వారనీ, రెండు జాతులను సృష్టించి, పొరబాటున కూడా వారు కలవకుండా జాగ్రత్త పడుతూ, రాజకీయ లబ్దిని పొందుతున్నారు. ఈ సత్యాన్ని అందరూ అర్ధం చేసుకుని, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి.

సనాతన ధర్మంలో ఆదియుగంనుంచీ కులాలు లేవు. శూద్రులు ఇతర వర్ణాలను నేవించాలంటే అర్ధం, వారికి చాకిరీ చేస్తూ బ్రతకమని కాదు. వివిధ కర్మలలో సహాయపడాలని మాత్రమే. శూద్రులు తపస్సు చేయడం, వేదాలు చదివి బ్రాహ్హణులవ్వడం, బ్రాహ్మణుల చేత పూజలందుకోవడం, మన పురాణాలలో కనిపిస్తుంది. నిజానికి ఈ గరుడ పురాణాన్ని శౌనకాది మునులకు చెప్పిన సూత మహర్షి ఎవరు???

అలాగే శూద్రులు రాజ్యాలేలడం, వస్తు విక్రయం చేయడం కూడా పురాణాలలో కనిపిస్తుంది. అంటే, శూద్రులే ఆయా వర్ణాల పనులలో సహాయపడి, ఆ పనిని బ్రహ్మాండంగా చేయడంతో, వారికి ‘వర్ణోన్నతి’ని కల్పించి, వారిని ఆ వర్ణం వారిగా గుర్తించి వుంటారు. కాబట్టి, హిందువులలో కులాలు లేవు. ఈనాటి కులపు లెక్కలు ఆ నాడు ఉండివుంటే, మాహాపద్మనందుడూ, చంద్రగుప్తుడూ, మగధ రాజులూ, భారత సామ్రాట్టులయ్యి వుండే వారు కాదేమో.. శ్రీకృష్ణుడిని భగవంతుడే కాదనే వారేమో! వర్ణాలు వర్ణాలే, కులాలు కులాలే అన్న సత్యాన్ని తెలుసుకుని, హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి.

శిల్ప రచన, పాకయజ్ఞ, సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే. ఇవి, వర్ణధర్మాలు. ఇక ఆశ్రమ ధర్మాలలో, జీవితపు తొలినాళ్ళలో ‘బ్రహ్మచర్యాశ్రమాన్ని’ అందరూ పాటించాలి. భిక్షాచరణ, గురు శుశ్రూష స్వాధ్యాయము, సంధ్యావందనము, అగ్ని కార్యము, బ్రహ్మచారుల ధర్మాలు. బ్రహ్మచారులలో రెండు రకాల వారుంటారు. మొదటి రకం, ఉపకుర్వాణులు. అంటే శాస్రోక్తంగా వేదాదులనూ, ఇతర విద్యలనూ అధ్యయనం చేసి స్నాతకులై, గురుకులాన్ని వీడి, జనారణ్యంలోకి పోయి గృహస్థులయ్యేవారు.

రెండవ విధం, నైష్ఠికులు.. అంటే, స్నాతకులైన తరువాత కూడా గురుకులంలోనే వుండి చదువుతూ, ఆ చదువునే బోధిస్తూ, బ్రహ్మజ్ఞాన తత్పరులై, సాధకులై, మృత్యుపర్యంతమూ గురుకులంలో వుండిపోయే వారు. అగ్నిక్రార్యము, అతిధిసేవ, యజ్ఞ, దాన, దేవతార్చనలూ, గృహస్థుల సంక్షిప్త ధర్మాలు. గృహస్థులలో సాధకులనీ, ఉదాసీనులనీ, రెండు ప్రకారాల వారుంటారు. తన పరివారం యొక్క భరణ పోషణలలోనే నిమగ్నుడై వుండేవాడు, సాధకుడు. పితృ, దేవ, ఋషి ఋణాలను తీర్చుకుని, ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ, గృహస్థుగా జీవించేవాడు, ఉదాసీన గృహస్థుడు. వీరిని మౌక్షికులంటారు.

ఇక వానప్రస్థం.. బాధ్యతలన్నీ తీరిన వారి స్థాయి ఇది. ఈ దశలో భూశయనం, ఫల, మూల ఆహారం, వేదాధ్యయనం, తపస్సు, తన సంపత్తిని తన వారికి యథోచితంగా పంచి ఇవ్వడం, ధర్మాలు. అరణ్యంలో తపస్సు చేసుకుంటూ, దేవార్చన, ఆహుతి ప్రదానం గావిస్తూ, స్వాధ్యాయాన్ని ఇష్టంగా చేస్తూ వుండే వానప్రస్థి, తాపసోత్తమునిగా పరిగణింప బడతాడు. తపస్సు ద్వారా శరీరాన్ని శుష్కింపజేసి, నిరంతరం భగవత్‌ ధ్యానంలో వుండే వానప్రస్థి, చివరి కాలంలో సన్యాసిగా గౌరవింప బడతాడు. వానప్రస్థి సన్యాసిగా మారి తనువు చాలిస్తాడు. ఇక్కడ సన్యాసాశ్రమం వేరు.

భిక్షుక వృత్తి ద్వారానే జీవిస్తూ, నిత్యం యోగాభ్యాసానురక్తుడై, బ్రహ్మప్రాప్తి కోసమే ప్రయాస పడుతూ, జితేంద్రియుడై జీవించేవాడిని, ‘పారమేష్ఠిక సన్యాసి’ అంటారు. ఇక్కడ పరమేష్ఠి అంటే, ‘బ్రహ్మ’ అని అర్ధం. ఎల్లప్పుడూ ఆత్మతత్త్వానుసంధానం పైనే అంటే, ప్రేమను చూపిస్తూ, నిత్యతృప్తులై, సంయమ నియమాలతో జీవిస్తూ, మహా మునులుగా, యోగులుగా ప్రతిష్ఠితులైన సన్యాసులను, ‘భిక్షు’ శబ్దంతో గౌరవిస్తారు.

భిక్షాచరణము, వేదాధ్యయనము, మౌనావలంబనము, తపము, ధ్యానము, సమ్యక్‌ జ్ఞానము, వైరాగ్యములు, సన్యాసాశ్రమి యొక్క సామాన్య ధర్మాలు. జ్ఞాన సన్యాసులనీ, వేద సన్యాసులనీ, కర్మ సన్యాసులనీ, పారమేష్ఠిక సన్యాసులు మూడు విధాలు. అలాగే యోగులలో కూడా ప్రారంభీ, భౌతిక, అంత్యాశ్రమి అనబడే స్థాయులున్నాయి. వీరందరికీ ఆరాధ్యమూ, ఆశ్రయమూ ఒక్కటే.. అదే, యోగమూర్తి స్వరూపుడైన పరమాత్మ.

మానవులకు ధర్మం ద్వారానే మోక్షం ప్రాప్తిస్తుంది. అర్ధం వల్ల కామమనే పురుషార్ధం సిద్ధిస్తుంది. ప్రవృత్తి, నివృత్తి, అనే రెండు విధాల కర్మలు వేదంలో చెప్పబడ్డాయి. వేద, శాస్త్రానుసారం, అగ్ని మొదలైన దేవతలనూ, గురు, విప్రాదులనూ ప్రసన్నం చేసుకోవడానికి చేయబడే కర్మలు ‘ప్రవృత్తి కర్మలై’తే, విధిపూర్వక కర్మానుష్ఠానం ద్వారా చిత్తశుద్ధినీ, ఆత్మజ్ఞానాన్నీ కలిగింపజేసేవి, ‘నివృత్తి కర్మలు’. క్షమ, దమ, దయ, దాన, నిర్లోభత, స్వాధ్యాయ సరలత, అనసూయత, తీర్థానుసరణ, సత్య, సంతోష, ఆస్తిక్య, ఇంద్రియనిగ్రహ, దేవార్చనలూ, మరీ ముఖ్యంగా బ్రాహ్మణ పూజనం, అహింస, ప్రియవాదిత, అరూక్షత, అపైశున్యం (దర్జా) వంటి గుణాలన్నీ, అన్ని ఆశ్రమాలలోనూ అందరికీ సామాన్య ధర్మాలు.

ఇప్పుడు ఈ చాతుర్వర్ణాలవారు చేరుకునే ఉత్తమ గతులను వినండి. వేద విహిత కర్మలన్నిటినీ ఆచరిస్తూ జీవించిన బ్రాహ్మణులు, ప్రాజాపత్య లోకప్రాప్తిని పొందుతారు. యుద్ధంలో పారిపోకుండా తమ ధర్మాలను పాటించిన క్షత్రియులు, ఇంద్రస్థానాన్ని పొందుతారు. నిత్యమూ తమ ధర్మంలో రతులై జీవించిన వైశ్యులు, మరుద్‌ దేవతల లోకాన్ని పొందుతారు. తమ వృత్తిని ప్రాణ సమానంగా ప్రేమించి జీవించిన శూద్రులకు, గంధర్వ లోకం ప్రాప్తిస్తుంది.

ఊర్థ్వ రేతస్కులై, బ్రహ్మనిష్టలోనే మొత్తం జీవితాన్ని గడిపి, వందల యేళ్ళ తపస్సు ద్వారా, బ్రహ్మలోకంలో ఒక ఉత్తమ స్థానాన్ని పొందిన బుషులు, ఎనభై ఎనిమిది వేలమంది మన భారతీయ పరంపరలో వున్నారు. ఆ స్థానమే, గురుకుల నివాసియైన బ్రహ్మచారికి లభిస్తుంది. వానప్రస్థి, దేహాంతంలో సప్తర్షిలోకాన్ని చేరుకుంటాడు. సన్యాసికి మోక్షం లభిస్తుంది. ఇక పునర్జన్మవుండదు. ఆ మోక్ష పదం, పరబ్రహ్మ వ్యోమమనీ, ఈశ్వర సంబంధిత పరమానంద నిలయమనీ, అమృత స్థానమనీ చెప్పబడింది. ఇదే ముక్తి పదం, అష్టాంగమార్గ సమ్యక్‌ జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...