Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Wednesday, July 17, 2024

ఈ రోజు '17/07/2024' తొలి ఏకాదశి, శయన ఏకాదశి - అందరికీ శుభాకాంక్షలు! Toli Ekadasi


ఈ రోజు '17/07/2024' తొలి ఏకాదశి, శయన ఏకాదశి - అందరికీ శుభాకాంక్షలు! TELUGU VOICE

తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు చేసుకుంటారు, దీని విశిష్ఠత ఏంటి?

హిందూ సంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తొలి ఏకాదశి, పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలనూ వెంట పెట్టుకుని వచ్చే తొలి ఏకాదశి విశిష్ఠత ఏంటో తెలుసుకుందాము..

తొలి ఏకాదశి అంటే ఏమిటి?

ఆషాఢ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అని అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి, మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి). అవి ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే, పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సుతో కలిపితే, పదకొండు. ఈ పదకొండూ ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి.

తొలి ఏకాదశి విశిష్ఠత!

ఆషాఢ మాస ఏకాదశినే 'తొలి ఏకాదశి'గా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి, హరి వాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాల పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు, ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు (సూర్యుడు దక్షణం వైపుకు మరలి నట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకుని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు, అంటే, క్షీరాబ్ది ద్వాదశి వరకూ ఆచరించాలని, మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

తొలి ఏకాదశి జరుపుకునే విధానం, నియమాలు..

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వ దినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో, భూమి దానమిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశీ వ్రత మాహాత్మ్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహా సాధ్వీ అయిన సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించే, మోక్ష సిద్ధి పొందింది.

వ్రతంలోని ప్రధాన నియమాలు..

ఉపవాస ఫలితాలు:

ఈ వ్రతాన్ని ఆచరించ దలచిన వారు, దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

అసత్యం ఆడకూడదు. స్త్రీ సాంగత్యం నిషిద్ధం. చెడు పనులూ, దుష్ట ఆలోచనలూ చేయకూడదు.

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాల అనంతరం శ్రీహరిని పూజించి, నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.

ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినకూడదు..

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నిష్ఠగా పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని, విష్ణుమూర్తి ప్రతిమకు, లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి, పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, కర్పూర హారతినివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు, కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు,  మినుములు తీసుకోకూడదు. అదే విధంగా, మంచంపై శయనించడం వంటివి చేయకూడదని, పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించబడింది. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొనబడింది.

ఈ రోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంభిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకుని, వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగానే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదనీ, పైరుకు ఏ రకమైన తెగుళ్ళూ సోకకూడదనీ, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదనీ దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి, దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

తొలి ఏకాదశి రోజున శేషశాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయని పండితులు చెబుతారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలూ చేస్తారు.

ప్రాశస్త్యం..

ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోజనంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే, కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసం, శుక్లపక్ష ఏకాదశి నాడు, విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని, తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి, దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించి, ఆ తర్వాత భోజనం చేస్తే, జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు, మళ్ళీ నాలుగు నెలల తర్వాత, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ విదితం. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే, 'క్షీరాబ్ధి ద్వాదశి' అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి, అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు.

అలాగే 'ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి?' అనే విషయాలు తెలుసుకోవాలంటే: [ https://youtu.be/Lcy2ZkxYfYY ]


🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Monday, July 15, 2024

గ్రహాంతర జీవులు! – ఇది నిజమా? Is there life outside of Earth? Existence of Aliens


గ్రహాంతర జీవులు! – ఇది నిజమా? TELUGU VOICE

ఇతర గ్రహాలలో కూడా మనిషిలాంటి మేధో జీవులున్నారా? అనే ప్రశ్న, సామాన్యుడి నుండి శాస్త్రజ్ఞుల వరకూ, ఒక చిక్కుముడిగా ఉండిపోయింది. చాలా కాలం నుండి ఇతర గ్రహాలకు చెందిన జీవులు, ఎగిరే పళ్ళాలు, లేదా Flying Saucers అనబడే అంతరీక్ష విమానాలలో భూమిపైకి వచ్చి, కొందరిని అపహరించుకుని వెళ్ళినట్లు వార్తలు వింటూ ఉంటాము. ఇతర గ్రహాల నుండి వచ్చే గుర్తు తెలియని ఆకాశ ప్రయాణ సాధనాలనే U.F.O. లు, లేదా Un-Identified Flying Objects గా శాస్త్రజ్ఞులు పేర్కొంటారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/R90vO1zWUy0 ]


చాలా దేశాలలో ఈ UFO లను చూసినట్లు, అక్కడి స్థానికులు చెప్పటం మనలో చాలామంది వినే ఉంటారు. కొందరు విజ్ఞానుల అభిప్రాయం ప్రకారం, ఈ UFO లనేవి, Galaxies గా పిలువబడే ఇతర పాలపుంతల నుండి భూమి మీదకు వచ్చిన గ్రహాంతర జీవులనీ, భూమిపైన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందని ప్రాచీన కాలంలోనే, పిరమిడ్ల వంటి భారీ నిర్మాణాలు జరిపించింది, గ్రహాంతర జీవులేననీ, కొందరి నమ్మకం.

ఇందుకు ఒక ఉదాహరణగా, తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామం భీమేశ్వర ఆలయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయంలో, ఆ చుట్టుపక్కల లభించని భారీ పరిమాణంలోని రాళ్ళను ఎక్కడినుంచో తెచ్చి అక్కడ చేర్చి, క్రేన్ లలాంటి పరికరాలు లేని సమయంలో, అంత ఎత్తున పేర్చడం జరిగింది. పురావస్తు శాఖ వారి అభిప్రాయం ప్రకారం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం, ఆరు వేల సంవత్సరాల నాడు కట్టబడింది. మరి ఆనాడు, అంత భారీ శిలలను వాడి, ఆ ఆలయాన్ని ఎలా నిర్మించారు? అన్న ప్రశ్నకు సమాధానంగా, ఇది మానవులకన్నా చాలా ముందుగా సాంకేతిక పరిజ్ఞానం సంపాదించుకున్న గ్రహాంతర వాసుల వల్ల సాధ్యపడి ఉండొచ్చు. అందువల్లనే, ఈ ఆలయాన్ని దేవతలు నిర్మించారని అంటారు.

1979-80 వ సం॥ల మధ్య, ఆంధ్రదేశంలో ఒక రోజు సాయంకాలం, ఆకాశంలో రంగు రంగుల వృత్తాలు ఏర్పడ్డాయి. అవి చాలా భారీ పరిమాణంలో ఆకాశంలో కనిపిస్తూ, మళ్ళీ మాయమవటం జరిగిందనే విషయం చాలామందికి తెలుసు. తర్వాత ఈ ఆకాశ వృత్తాలన్నీ వార్తా పత్రికలలోనూ ప్రచురించ బడ్డాయి. అవి శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగాల వలన వచ్చాయని ప్రచారం జరిగింది. గ్రహాంతర జీవుల అంతరీక్ష నౌకల తాలూకు కాంతి పుంజాలు ఆ నాడు ఆకాశంలో కనిపించాయన్న విషయాన్ని, ఉద్దేశ్య పూర్వకంగా ప్రభుత్వమే తొక్కిపెట్టి, ఏవో కబుర్లు చెప్పిందని కొందరు విజ్ఞానులు అభ్యంతరం వ్యక్తపరిచారు.

రాకెట్‌ ప్రయోగం జరిగితే, ఒక సరళ రేఖ ఆకారంలో, పొగ ఆకాశంలో ఏర్పడుతుందని అందరికీ తెలుసు. కానీ, వృత్తాల రూపంలో కొన్ని వందల మైళ్ళ వరకూ విస్తరించిన ఆ రంగుల వలయాలు, UFO లు కాదా? ఎందుకని ప్రభుత్వం ఇలా వాస్తవాలను దాచింది? ప్రజలు భయాందోళనకు గురికాకుండా ఉండటానికి, అతీంద్రియ మరియు అంతరీక్ష శక్తుల ఉనికిని కొట్టిపారేసి, రహస్యంగా ఆ అంశాలపై ప్రయోగాలు చెయ్యటం, ప్రభుత్వ బాధ్యత కావడం వలన అలా చేసిందని అనుకోవాలి!

1947లో తొలిసారిగా, Arnold అనే వ్యాపార వేత్త తన సొంత విమానంలో వాషింగ్టన్‌ గగన వీధుల్లో విహరిస్తుండగా, అతనికి ఒక డిస్క్‌ అంటే సాసర్‌ ఆకారంలో ఆకాశంలో ఎగురుతున్న గుర్తుతెలియని ఆకారాలు కనిపించాయి. ఆ UFO లు, గంటకి 1800 కి.మీల వేగంతో ప్రయాణించాయని, అతడు తెలిపాడు. “ఆర్నాల్డ్‌” అనుభవాలు అమెరికా వార్తా పత్రికల్లో Headlines లో వచ్చాయి. తర్వాత చాలా మంది, గ్రహాంతర వాసులను చూశామని చెప్పిన విషయాలు, దేశం నాలుగు మూలల నుండీ వార్తా కథనాలు వెలువడ్డాయి. గ్రహాంతర వాసులు పారదర్శక దుస్తులు ధరించారనీ, 8 అడుగుల ఎత్తు వరకూ ఉన్నారనీ కొందరు చెప్పారు. ముగ్గురు గ్రహాంతర వాసులను అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేసిందని, ఆ నాడు వార్తలు వెలువడ్డాయి. మరి వారిని అమెరికా, బాహ్య ప్రపంచానికి తెలియకుండా, అత్యంత భద్రత నడుమ ఉంచిన తమ ‘Area 51’ అనే రహస్య ప్రదేశంలో ఉంచి ప్రయోగాలు చేస్తోందా? ఇందులో నిజానిజాలు ఎంతవరకూ అనేది, ఇంకా తేలాల్సి ఉంది.

UFO లు కనిపించాయన్న వార్తలు పెరిగి పోవటంతో, అమెరికా వాయుసేన విభాగం ఇందులో నిజానిజాలు తేల్చటానికి, ఒక Astrophysics Professor అధ్యక్షతలో, మరో నలుగురు వైమానిక రంగ నిపుణులు సభ్యులుగా, ఒక కమీషన్‌ ని ఏర్పాటు చేసింది. ఈ ఆపరేషన్‌ కి “ప్రాజెక్ట్‌ బ్లూ బుక్‌” అనే పేరు పెట్టింది. దాదాపు 20 సం॥లు UFO ల ఉనికిపై ప్రయోగాలు జరిగాయి. కానీ, ఏమీ తేలలేదు. అయితే, ఆ కమీషన్‌ అధిపతి సిఫార్స్‌ పై, ప్రభుత్వం ఇల్లినాయిస్‌ రాష్ట్రంలో, “Evanston” అనే ప్రాంతంలో, UFO అధ్యయన కేంద్రం ఏర్పరచింది. అంటే, గ్రహాంతర జీవులున్నాయని, ఆ శాస్త్రజ్ఞులు భావించారు. కనుకనే, 20 సం॥ల పరిశోధన తర్వాత, UFO అధ్యయన కేంద్రం ఏర్పాటుకు సిఫార్సు చేశారు.

1970 లో “ఇధియోపియా” అనే దేశంలో ఎగిరే పళ్ళాలు దర్శనమిచ్చాయి. అందులో ఒక UFO, ఎర్రటి అగ్నిగోళంలా ఉంది. అది ఆ ప్రాంతంలోని నివాసాలపైన ఆకాశంలో, బాగా క్రిందగా, గాలిలో చెక్కర్లు కొట్టింది. హెలికాఫ్టర్‌ ఎగిరేటప్పుడు వచ్చే భీకర శబ్దం, ఈ UFO ఎగురుతున్నప్పుడు వచ్చిందని, ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ అంతరీక్ష నౌక చేసిన విన్యాసాల వేగానికి, ఆ ప్రాంతంలోని భారీ వృక్షాలు కూలి పోయి, వంతెనలు విరిగి పోయాయి. అయితే, ఆ సమయంలో ప్రాణాంతక వ్యాధులైన కాన్సర్‌, క్షయలాంటి వ్యాధులతో బాధ పడుతున్న కొందరికి, ఆ వ్యాధి నివారణ జరిగింది. UFO నుండి వెలువడిన గుర్తు తెలియని కిరణాల వల్ల, ఆ రోగులకు స్వస్థత చేకూరి ఉండ వచ్చని, దాక్టర్లు భావించారు. ఈ మధ్య గ్రహాంతర జీవులు ఒక నిండు గర్భిణీ స్రీ ని అపహరించాయన్న వదంతి, జపాన్‌ దేశంలో ప్రబలింది. ఇందులో నిజానిజాలు తేలాల్సి ఉంది.

1978 లో, ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఒక మానసిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో, నలుగురు సభ్యుల కమిటీని, UFO ల పరిశోధనకు ఏర్పాటుజేసింది. ఆ కమిటీ సభ్యులు, UFO లను చూశామన్న 12 మంది వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేశారు. అయితే, వాళ్ళెవరూ UFO ల గురించి స్పష్టంగా వివరించ లేక పోయారు. ఇంకో ఆసక్తికరమైన సంఘటన, 1979 వ సంవత్సరంలో, అమెరికాలో జరిగింది. “ఆల్బర్ట్‌ బెండర్‌” అనే వ్యక్తి, అమెరికాలోని కనెక్టికట్‌ ప్రాంతంలో, "అంతర్జాతీయ ఫ్లయింగ్‌ సాసర్‌ బ్యూరో” అనే సంస్థను స్థాపించాడు. ఆయన "స్పేస్‌ రివ్యూ” అనే పత్రికను కూడా స్థాపించి, UFO ల గురించి తనకు తెలిసిన విషయాలను ఎప్పటికప్పుడు, ఆ పత్రికలో ప్రచురిస్తూ వచ్చాడు.

అయితే, అతడు తన పరిశోధనలు ప్రారంభించిన నాలుగు నెలలకు, ముగ్గురు గ్రహాంతర వాసులు అతడి దగ్గరకు వచ్చి, UFOల గురించిన అతని పరిశోధనలను వెంటనే ఆపేయాలని తీవ్రంగా హెచ్చరించారు. వారు పారదర్శక ముసుగులను ధరించి ఉండటంతో, వాళ్ళ ముఖాలను గుర్తు పట్టలేక పోయాడని తెలుస్తోంది. ఏది ఏమైనా, “ఆల్బర్ట్‌” గ్రహాంతర వాసుల బెదిరింపులకు భయపడి, తన ప్రయోగాలను హఠాత్తుగా, అర్ధాంతరంగా నిలిపివేశాడు. మరి మనుషులు గ్రహాంతర జీవులపై పరిశోధనలు చేసి, వారి రహస్యాలను తెలుసుకోకుండా అడ్డుకోవడం వెనుక అసలు కారణం ఏమిటి? గ్రహాంతర జీవుల ఉనికి రహస్యంగా ఉంచడంలోని మర్మం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం, ఆ గ్రహాంతర వాసులకే తెలియాలి!

UFO లు కనిపించిన తర్వాతే, ఈ అంతరీక్ష జీవులు మానవులకు కనిపించటం జరుగుతోంది. అంటే, ఎగిరే పళ్ళాలవంటి అంతరిక్ష విమానాలలో ప్రయాణించి,  గ్రహాంతర జీవులు భూమిపైకి వస్తున్నారని భావించటం వాస్తవం. కొందరి వాదన ప్రకారం, గ్రహాంతర వాసులు కుజ గ్రహ నివాసులనీ, ఆ గ్రహంలో భయంకర అణుయుద్దాలు జరిగి, అక్కడి వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదనీ, అందుకే నివాస యోగ్యంగా ఉండే మరో గ్రహం కోసం అన్వేషణలో భాగంగా, ఆ గ్రహాంతర వాసులు భూమిపైకి కూడా వస్తున్నారనీ తెలుస్తోంది.

21 ఆగస్టు, 2007 న, కెనడాలోని Alberta లో, ఒక ఇంటి గోడలపై గ్రహాంతర జీవుల చిత్రాలు ముద్రించ బడ్డాయి. ఒక గోడపై ఇద్దరు అంతరిక్ష వాసుల తలలు కనిపించాయి. ఆ గ్రహాంతర జీవుల ముఖాలపై రెండు కళ్ళున్నాయి. తలపైన Antenna ల వంటి పరికరాలున్నాయి. ఆ చిత్రాలను వేలాది మంది చూశారు. ఆ చిత్రాలు అంతర్జాతీయ పత్రికలలో కూడా వచ్చాయి. తమ చిత్రాలను గ్రహాంతర జీవులే ఆ ప్రదేశంలో చిత్రించారా? అలా ఎందుకు చేశారు? అన్నది ఈ నాటికీ సమాధానం లభించని ప్రశ్నగానే మిగిలి పోయింది.

ఇక దేవుడున్నాడా? పునర్జన్మలు నిజంగా ఉన్నాయా? అతీత శక్తులు వాస్తవమేనా? లాంటి ప్రశ్నలు, బుద్ధి జీవులైన మానవులను చాలా కాలంగా వేధిస్తున్నాయి. ఈ పురాతన కాల ప్రశ్నలకు తోడుగా, ఇంకో ప్రశ్న నాగరిక మానవులను తీవ్రంగా కలవర పెడుతూ వుంది. అదే, గహాంతర జీవులు నిజంగా ఉన్నాయా..?

[ దేవుడున్నాడా? - https://youtu.be/kQTqwv8rNck ]


ఆక్సిజన్‌, నీరు ఉన్న చోటనే, ప్రాణులు జీవించగలవు. ఈ అంశాలు భూ గ్రహంపై సమృద్ధిగా ఉండటం వల్లనే, భూమిపై అనేక రకాల జీవజాలం మనుగడ సాగిస్తోంది. మరి కార్బన్ డయాక్సయిడ్ అధికంగా ఉండే గ్రహాలలో జీవరాశి ఉండే అవకాశముందా? అనే ప్రశ్నకు, కొందరు శాస్త్రవేత్తలు చెప్పే సమాధానం.. మనుషులు, జంతువులు ఆక్సిజన్‌ పీల్చి కార్బన్‌ డయాక్సయిడ్ ను బయటికి వదిలితే, ఆ వాయువును వృక్షాలు పీల్చుకుని, ఆక్సిజన్‌ ను విడుదల చేస్తాయి. దేవుడు చేసిన అత్యంత సంక్లిష్టమైన ఏర్పాటు ఇది. సకల జీవరాశీ చెట్లపైన ఆధార పడుతుంది. ఇక్కడ కార్బన్‌ డయాక్సయిడ్ ను పీల్చుకుని జీవించే వృక్షాలలాగానే, గ్రహాంతర జీవులు తమ గ్రహాలలోని కార్బన్‌ డయాక్సయిడ్ ని పీల్చుకుని జీవించే అవకాశం లేకపోలేదు.. ఆయితే, చాలా మంది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, భూమిని మినహాయించి, మన సౌరకుటుంబంలోని ఏ గ్రహంలోనూ, జీవులుండే ఆస్కారం లేదని తేల్చి చెబుతున్నారు. కానీ, కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, మనిషి నేటి వరకూ కనీసం సౌరకుటుంబంలో ఉన్న సూర్యుడి దాకా కూడా వెళ్ళ లేక పోయాడు. అలాంటిది, ఈ అనంత విశ్వంలో ఉన్న కోటానుకోట్ల గ్రహాలలో, జీవులు లేరని ఏ ఆధారాలతో చెప్ప గలం?

ఇటీవలి కాలంలో ఎలక్ట్రానిక్‌ మీడియా చాలా అభివృద్ధి చెందింది. అనేక టీ.వి. ఛానెల్స్‌, Social Media మాద్యమాలూ ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా, క్షణాలలో వీడియోతో సహా, ప్రపంచం మొత్తం ప్రదర్శించ గల పరిజ్ఞానం ఏర్పడింది. కనుకనే, గ్రహాంతర జీవుల వివరాలూ, అప్పుడప్పుడూ కనిపించే గ్రహాంతర జీవుల అంతరీక్ష నౌకల ఫొటోలూ, ప్రపంచమంతటా అందించ బడుతున్నాయి. 'నిప్పు లేనిదే పొగ రాదు' అని ఒక సామెత ఉంది. ఏ ఆధారాలూ లేకుండా, గ్రహాంతర జీవులు లేరనీ, అవన్నీ ఎవరో పని లేని వారి కల్పనలనీ, కొందరు ఎందుకు వాదిస్తున్నారు?

నిజంగా గ్రహాంతర వాసులు ఉన్నారా? UFO లు గా పిలువబడుతున్న గ్రహాంతర వాసుల అంతరీక్ష వాహనాలు, చాలా మందికి, చాలా దేశాలలో కనిపించిన మాట నిజమేనా? ఏ కారణాలతో పాశ్చాత్య ప్రభుత్వాలు గ్రహాంతర జీవుల సమాచారాన్ని ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి పెడుతున్నాయి? గ్రహాంతర జీవులతో సంబంధాలు పెట్టుకునీ, వారికున్న అపార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునీ, ప్రపంచాన్ని శాసించాలని నాడు అడాల్ఫ్ హిట్లర్‌ వంటి వారూ, అమెరికా వంటి దేశాలూ ప్రయత్నించిన మాట వాస్తమేనా? కొన్ని నిజాలు కాలమే నిరూపించాలి. ఇలాంటి కొన్ని అసాధారణ ప్రశ్నలకు సమాధానంగా, మనం ఇది వరకు చేసిన "తిరుమల శిలాతోరణం మరో గ్రహానికి వెళ్లే ద్వారమా?" అనే వీడియోను తప్పక చూసి, మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను. ఆ వీడియో లింక్, క్రింద పొందు పరుస్తున్నాను.

[ శిలాతోరణం మరో గ్రహానికి వెళ్లే ద్వారమా? - https://youtu.be/Hi4qJn2xAoA]


🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

Antique Art by Legendary Artist Late Sri. BG Sharma

Saturday, July 6, 2024

ఆశ - Desire


ఆశ - Desire TELUGU VOICE

శ్లోకం :

ఆశాయాః యే దాసాః తే దాసాః సర్వలోకస్య ।
ఆశా యేషాం దాసీ తేషాం దాసాయతే లోకః ॥

యే ఆశాయాః దాసాః తే సర్వలోకస్య దాసాః (భవన్తి)।
యేషాం ఆశా దాసీ, లోకః తేషాం దాసాయతే ॥

భావం:

ఆశకి ఎవరైతే దాసులో, వారు సమస్త లోకానికీ దాసులు. ఆశ ఎవరికైతే దాసురాలో, అటువంటి వారికి సమస్త లోకమూ దాసత్వం చేస్తుంది.

Those who are the slaves of ‘desire’ are slaves of the entire world. But world itself is the slave of those, to whom ‘desire’ is a slave.

ఆశ మనిషికి సహజం. అదే ఆశ మితిమీరితే, అత్యాశ లేక దురాశ అవుతుంది. స్థూలంగా దీనినే ఆశ అంటూ ఉంటారు.  ఈ ఆశే, మనిషిని తన బానిసను చేసుకుంటుంది. ధన వ్యామోహము ఒక ఆశ. విపరీతమైన ధన వ్యామోహము, లేదా దానిమీద విపరీతమైన కోరిక లేక మమకారం, అనేకమైన విపరీతాలకు దారి తీస్తుంది. విపరీత ధనకాంక్షతో మనిషి ఉచ్ఛనీచాలు కూడా మరచిపోయి, ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు. మద్యపానమూ, జూదమూ, వ్యభిచారమూ, చౌర్యమూ, మాదక ద్రవ్య సేవనమూ, హత్యలూ, మాన భంగాలూ, ఇవన్నీ తీవ్రమైన కోరికల పర్యవసానములు. అవే వ్యసనాలుగా పరిణమిస్తాయి. ఇటువంటి కోరికలకు ఎవరైతే దాసులో, వారు ప్రపంచానికే దాసులు. వారి ప్రవర్తనను సమాజం ఏవగించుకుంటుంది. వారు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ చులకనై పోతారు. వారిని ఎవరూ గౌరవించరు, ఎవరూ లక్ష్య పెట్టరు. చివరకు సమాజ విద్రోహకులుగా ముద్ర వేయబడి, తీవ్రమైన శిక్షా పాత్రులవుతారు.

అటువంటి 'కోరిక' ఎవరికైతే దాసీయో, వారికి ప్రపంచమే దాసోహం అంటుంది. అనగా, కోరికలను అదుపులో ఉంచుకుని వాటిని అధిగమించిన వారు, ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకుని, జీవితంలో అనేక విజయాలు సాధించగలుగుతారు. సమాజ శ్రేయస్సుకై పాటుపడతారు. అటువంటి వారికి ప్రపంచమంతా దాసోహం అంటుంది, వేనోళ్ళ కొనియాడుతుంది, ప్రశంసిస్తుంది. వారు చిరస్మరణీయులవుతారు. సత్సమాజ నిర్మాణానికై, సమాజ అభివృద్ధికై, ఇటువంటి వారు ఎంతైనా అవసరం.


🚩 ఓం నమో వేంకటేశాయ 🙏

Friday, July 5, 2024

షడగోప్యము (శఠగోపనం) - Shada-Gopyam

 

షడగోప్యము (శఠగోపనం) TELUGU VOICE

అసలు దేవాలయంలో ఈ షడగోప్యమును తల మీద ఎందుకు పెట్టించుకోవాలి? దాని వలన కలిగే ఫలితం ఏంటి?

దేవాలయంలో దర్శనం అయ్యాక తప్పక షడగోప్యము పెట్టించుకుని, తీర్థము తీసుకోవాలి. ఈ రొజుల్లో చాలామంది ఆలయాలకు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక, వచ్చిన పనైపొయిందని గబగబా వెళ్ళి ఏదో ఒక ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. బహుకొద్ధి మంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు.

అసలు షడగోప్యము అంటే అత్యంత గోప్యము, గోప్యము అంటే, రహస్యము అని అర్థం.. అంటే, దానిని తల మీద పెట్టే పూజారికీ, లేదా అర్చకుడికి కూడా వినిపించని విధంగా కోరికను మనస్సులోనే తలచుకోవాలి. అంటే, మీ కోరికే షడగోప్యము. మానవునికి శత్రువులైన కామమూ,  క్రోధమూ,  లోభమూ, మోహమూ, మద - మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటానని అనుకుంటూ, తలవంచి తీసుకొవటము మరో అర్ధము. పూజారి చేత షడగోప్యము పెట్టించుకోండి. చక్కగా మీ మనస్సులోని కోరికను స్మరించుకోండి.

షడగోప్యమును రాగి, కంచు, లేదా వెండితో తయారు చేస్తారు. షడగోప్యము పైన దేవతా పాదములు ఉంటాయి. షడగోప్యమును తల మీద ఉంచినపుడు, మన శరీరంలో ఉన్న విద్యుత్తు, దాని యొక్క సహజత్వం ప్రకారం, శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధికమైన విద్యుత్తు బయటికి పంపివేయబడి, శరీరంలో అందోళనా, ఆవేశమూ తగ్గుతాయి. ఈ షడగోప్యమునే, శఠగోపము, శఠగోపనము, శఠగోపం, శఠారి అని కూడా అంటారు.

మన 'సనాతన ధర్మం'లో చెప్పబడిన ప్రతి విషయం శాస్త్రీయమే - ఏదీ మూఢ నమ్మకం కాదు 🚩 శ్రీ మాత్రే నమః 🙏

Monday, July 1, 2024

The purpose of human life | మనిషి జన్మ?


మానవ జన్మ? TELUGU VOICE
కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. మధ్యన ఉన్న రెప్పపాటు కాలమే ఈ జీవితం!

పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ।
ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ।।

మరల మరల జన్మిస్తూ, మరల మరల మరణిస్తూ, తిరిగి తల్లి గర్భంలో శయనిస్తూ, ఈ సంసారజంఝాటం దాటలేక, నానా బాధలకూ గురౌతున్న నన్ను ఓ మురారీ! కృపతో తరింపజేయి తండ్రీ.. ఒక జీవితం ముగిసిన తరువాత, మళ్ళీ పుట్టడమే ‘జన్మ’. అలా పుట్టే జీవికి మళ్ళీ మానవ జన్మే లభిస్తుందనేది మాత్రం, ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేని విషయం. ఎందుకంటే, మళ్ళీ మనం పొందే జన్మ, గడిచిన జన్మలో మనం సంపాదించుకున్న జ్ఞానం, కర్మల మీద ఆధారపడి వుంటుంది. అన్ని జన్మలలోనూ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, అత్యంత దుర్లభమైనది. మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తూవుంటాడు. చేసిన కర్మలకు ఫలితాలను తప్పనిసరిగా అనుభవించి తీరాలి. వాటినే కర్మ ఫలాలంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు, జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dNWbKKQMSjo ]


అన్ని పుణ్య కర్మల ఫలాలూ పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు దేవలోకాలలో, దేవతా జన్మనెత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా, అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమిగనుక, అక్కడ అతడికి ఏ కర్మలూ చేసే అధికారం ఉండదు. అందువల్ల, పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలను ఆచరించే అవకాశమూ ఉండదు. తన కర్మఫలానుసారం భోగాలననుభావించాక, ఆ కర్మ ఫలాలు క్షయం కాగానే, ‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి’ అన్నట్లుగా, తిరిగి మర్త్య లోకమైన ఈ మానవ లోకాన్ని చేరవలసిందే. మరల మరల మానవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే. దేవ జన్మలో కేవలం మనోబుద్ధులుంటాయేగానీ, కర్మలు చేయటానికి సాధనమైన స్థూల శరీరం వుండదు. కనుక దేవజన్మ భగవత్సాక్షాత్కారానికి ఉపయోగపడే జన్మకాదు.

ఇక పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు జంతువులూ, పశుపక్ష్యాదులూ, క్రిమికీటకాదులూ మొదలైన జీవులుగా, నీచయోనులలో జన్మించాల్సివుంటుంది. ఆ జన్మలలో, తన పూర్వార్జిత కర్మఫలాల కారణంగా, అనేక బాధలూ, దుఃఖాలూ అనుభవించి, హింసింపబడతాడు. ఆ జన్మలలో అవి కర్మలు చేస్తున్నా, అవన్నీ బుద్ధిపరంగా కాకుండా, కేవలం ప్రకృతి ప్రేరణతో, పరతంత్రంగా చేస్తాయి. జంతు జన్మలలో శరీరం, మనస్సూ ఉంటాయిగానీ, బుద్ధి మాత్రం ఉండదు. కనుక ఆ జన్మలలో కూడా, కేవలం కర్మఫలాలు అనుభవించడమే గానీ, పరమాత్మను అందుకోవడానికి తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం ఉండదు. అందుకే, భగవత్సాక్షాత్కారానికి జంతు జన్మ కూడా ఉపయోగ పడదు.

ఇక పుణ్య, పాప కర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు, ఆ జీవుడు మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది. ఈ మనవ జన్మలో, పుణ్య కర్మల ఫలంగా సుఖాలనూ, పాప కర్మల ఫలంగా దుఖాలనూ అనుభవిస్తాడు. అయితే, ఇలా కర్మఫలాలను అనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా, ఈ మనవ జన్మలో మాత్రమే వుంటుంది. ఎందుకంటే, స్వతంత్రంగా బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ ఇది. కనుక పరమాత్మను అందుకోవటానికి తగిన కర్మలు చేసే అధికారమూ, జ్ఞానమూ పొందే అవకాశం ఉన్న మనవ జన్మ, ఉత్తమోత్తమమైనదీ, మరియు దుర్లభమైనదని అంటారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ కావడంచేత ఈ మనవ జన్మను, ‘జంతూనాం నర జన్మ దుర్లభం’ అని శంకరాచార్యులవారు, “వివేక చూడామణి” అనే గ్రంధంలో తెలియజేశారు. ఇటువంటి అపురూపమైన, ఉత్తమమైన, మరియు దుర్లభమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ, దీనిని సార్ధకం చేసుకునే ప్రయత్నం చేయాలి.

ఇక జన్మల విషయం పక్కనబెడితే, మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ ఎందుకు పుట్టవలసి వస్తోంది? పుట్టిన మన జన్మ లక్ష్యం ఏమిటి..? అనే విషయానికి వస్తే, జంతు జన్మలు పొందిన జీవుల లక్ష్యం అయితే ఒకటే.. అవి మానవ జన్మ పొందడానికి, కర్మలను ఆచరిస్తూ వుంటాయి. మరి మనిషిగా పుట్టిన మనం ఏం చేస్తున్నాము? మన లక్ష్యం ఏమిటి? అంటే, మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్ధకం చేసుకోవాలి. అలా సార్ధకం చేసుకోవడానికి ఏం చేయాలనేది మనం తెలుసుకోవాలి.

మానవుడు ఏ దు:ఖమూలేని నిత్యమైన ఆనందం మాత్రమే కోరుకుంటాడు. కానీ, లభిస్తున్నది మాత్రం దుఃఖాలతో, క్లేశాలతో కూడిన అనిత్యమైన ఆనందం. దాని కారణంగానే, అసంతృప్తి, అశాంతి, ఆవేదన, అలజడి రూపుదిద్దుకుంటుంటాయి. ఎందుకిలా జరుగుతోంది? బాగా చదువుకుని మంచి ఉద్యోగాలో, పెద్ద పెద్ద పదవులో చేపట్టి, బాగా సంపాదించి, భార్యబిడ్డలతో అనేక భోగాలను అనుభవించాలనేది, మానవ సహజ ఆలోచనా సరళి. అయితే, ఎన్ని సుఖాలూ, భోగాలూ అనుభవించినా, మనస్సుకు ఎదో ఒక వెలితి మిగిలే వుంటుంది. దీనికి కారణం, మనం అనుభవించేవి ఏవీ, నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవన్నీ అనిత్యమైన వస్తువుల ద్వారా వచ్చే తాత్కాలిక సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన, శాశ్వతమైన సుఖం కావాలంటే, అది నిత్య శాశ్వత వస్తువు ద్వారానే లభిస్తుంది. ఏమిటా నిత్యమైనటువంటి వస్తువు? “నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” – నిత్యమైన వస్తువు ఏకమైన బ్రహ్మమే. అదే పరమాత్మ. పరమాత్మ కన్నా వేరైనవన్నీ, అనిత్యాలే అని ‘తత్త్వబోధ’లో తెలియజేశారు, శ్రీశంకరభగవత్పాదులవారు. అంటే, నిత్యమైన వస్తువు, ఏకమైన పరమాత్మ మాత్రమే గానీ, దానికి వేరుగా ఉన్నవన్నీ అనిత్యాలే. కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం, ఆనందం అందుకునే వరకూ, మానవుడికి తృప్తి ఉండదు, అసంతృప్తి తీరదు. అటువంటి శాస్వతానందాన్ని అందుకోవడమే, జన్మ సార్ధకత. ఆ శాస్వతానందాన్నే మోక్షం,  ముక్తి అని కూడా అంటారు.

ఈ సృష్టిలో వున్న ప్రతి జీవీ భగవంతుడిలో ఐక్యమవ్వాలంటే, ఇక్కడ చేసిన అన్ని కర్మలనూ సంపూర్ణంగా నిర్మూలించుకోవాలి. అంటే, ఆత్మ స్వరూపుడవైన నీవు, వీటన్నిటినుండీ విముక్తిని పొందాలి. ఈ విధంగా విముక్తిని పొందటాన్నే, ముక్తి అని కూడా అంటారు. దానికి సరియైన జన్మ, ఒక్క మానవ జన్మ మాత్రమే. ముందు చెప్పుకున్న విధంగా, ఇక యే ఇతర జన్మలలోనూ సాధ్యం కాదు. మానవ జన్మలో మనిషికి దేవుడు ప్రసాదించిన బుద్ధి ద్వారా, శాశ్వతమైన, నిత్యమైన, సత్యమైన దానిని గ్రహించి, మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో తెలుసుకుని, మనస్సునూ, బుద్దినీ అదుపులో వుంచుకుని, పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకుని, ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించడమే జ్ఞానం. ఎప్పుడైతే నీలో దేవుడి గురించి తెలుసుకోవాలనే తపన మొదలవుతుందో, అప్పుడా దేవుడే నీకు మార్గాన్ని సుగమం చేయవచ్చు, లేదా అందుకు తోడ్పడే సద్గురువుకై మన అన్వేషణకి సహకరించవచ్చు.

అలా కాకుండా మనం అజ్ఞానంలో వుంటూ కర్మలను ఆచరిస్తూ, అన్నీ దుష్కర్మలే చేస్తే, ఖచ్చితంగా తరువాతి జన్మ, మానవ జన్మ పొందడం సాధ్యపడదు. అన్నీ చెడ్డ పనులే చేస్తే, గరుడ పురాణంలో చెప్పబడినట్టు, ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, నరకంలో వాటి ఫలితాలను అనుభవించి, మళ్ళీ ఈ కర్మ భూమిలో, నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా, నీకు ఎదో ఒక జన్మ లభిస్తుంది. మరి సత్కర్మలు ఆచరిస్తే మానవ జన్మ వస్తుందా? అంటే, 99% అవకాశాలున్నాయి. సత్కర్మలు చేస్తే, ఒక సూక్ష్మ శరీరాన్ని ధరించి, వాటి ఫలితాలను స్వర్గంలో అనుభవించి, మళ్ళీ ఈ కర్మ భూమిలో నీ జ్ఞాన సముపార్జన ఆధారంగా నీకు జన్మ లభిస్తుంది. నీవు సత్కర్మలు ఆచరించి, కొద్దోగొప్పో దేవుడి గురించి తెలుసుకుని వుంటే, నీవు మంచి యోగుల కుటుంబంలో జన్మిస్తావు. ఈ విషయాన్ని భగవద్గీతలోని ధ్యాన యోగంలో, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా చెప్పాడు.. ఓ అర్జునా! ఎవరయితే నా జ్ఞానాన్ని గ్రహించి, కర్మ, జ్ఞాన, ధ్యాన యోగాలను అవలంభించి ఉంటారో, వారికి ఒకవేళ ఇంకా ఏవైనా కర్మలు మిగిలి వుంటే, ఖచ్చితంగా మంచి జన్మ, అదీ ఉన్నతమైన కుటుంబంలో లభిస్తుంది. ఇందులో ఎంత మాత్రమూ సందేహం లేదని, శ్రీ కృష్ణుడు వివరించాడు.

కాబట్టి, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. మధ్యన ఉన్న రెప్ప పాటు కాలమే ఈ జీవితమనే సత్యాన్ని గ్రహించాలి. కానీ మనం చేస్తున్నది? మంచితనాన్నీ, మానవత్వాన్నీ, దాతృత్వాన్నీ, ఆధ్యాత్మిక దృష్టినీ విస్మరించి, కేవలం స్వార్ధమే పరమావధిగా, అరిషడ్వర్గాలలో చిక్కుకుపోయి, విషయలోలురై, పాపపంకిలమైన జీవితం గడిపేస్తున్నాము. ఆ పరిస్థితిని అధిగమించి, జీవితం అంతా వట్టి భ్రమ, మాయా నాటకం అన్న పరమ సత్యాన్ని తెలుసుకుంటే, మానవ జన్మ తరించినట్లే.. ఆ పరబ్రహ్మమును చేరుకునే మార్గం గోచరించినట్లే..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, June 24, 2024

Humbling of Thondaman's pride | తొండమాన్ గర్వభంగం!


తొండమాన్ గర్వభంగం! భవిష్యోత్తర పురాణంలోని గాధ! TELUGU VOICE
అహంకారం గర్వం ఎంత కొంచమైనా నిలువునా దహించివేస్తుంది!

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేఙ్కటేశ్వరునికి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి పద్మావతీ దేవిని, కన్యాదానమిచ్చిన మహానుభావుడు, తొండమండలాధీశుడైన ఆకాశరాజు. ఆ ఆకాశరాజు సోదరుడే, తొండమానుడు. అతడు అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై, తిరుమల భవ్య మందిరమైన ‘ఆనందనిలయ’ నిర్మాణము చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వేఙ్కటపతిని సేవించుకునేది, తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంతటి భక్తుడంటే, నిత్యం స్వామితో నేరుగా సంభషణ చేసేవాడు! మరి అంతటి వాడికి గర్వభంగమా!? అసలేం జరిగిందో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను comment చేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/hAPcbmTx3F4 ]


అలా తొండమానుడు స్వామి వారితో అత్యంత సన్నిహితంగా మెలగుతూ, సేవలు చేసుకుంటుండగా, ఒకరోజు ఆకాశవాణి, “ఆహా! ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యుమూ నీ చేతుల మీదుగా, శ్రద్ధా భక్తులతో, అంగ రంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా! నీ వంటి విష్ణు భక్తుడు లేడయ్యా” అని అన్నది. అంత వరకూ స్వామి గురించి తప్ప, మరో ఆలోచన లేని తొండమానుడు, ఆకాశవాణి మాటలు విని, “నిజమే కదా! నా వంటి భక్తుడు మరొకడు లేడు” అని అనుకున్నాడు.

అహంకారమెంత దుర్భరమైనదో కదా? చివరకు మహనీయుడైన తొండమానుడిని సైతం విడువలేదు! అహంకారమే సకల దురుతాలకూ మూలం. అహంకారం, గర్వం ఎంత కొంచమైనా, అది ఉన్నవాడిని నిలువునా దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమ శత్రువునైనా అక్కున జేర్చుకుంటాడు. అలాంటిది, సర్వ సుగుణవంతుడు, మహాభక్తుడు అయిన తొండమానుడి పతనం జరుగనిస్తాడా? వెంటనే తొండమానుడికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి.

ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషిస్తూ, “నా వంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజ భక్తులు ఎవరైనా ఉన్నారా దేవాది దేవా?” అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరు మందహాసంతో సమాధానమిచ్చి, తొండమానునికి గుణపాఠం నేర్పే నాటకానికి శ్రీకారం చుట్టాడు.

ఒకరోజు తొండమానుడు, రోజూలాగానే, ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకుని, నిశ్చల భక్తితో ఆ పరమ పురుషుని ధ్యానించి, కలిదోష నివారణములైన శ్రీపాదాలను దర్శించాడు. శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల లాగా ప్రకాశిస్తున్నాయి, తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం! కనులు మిరుమిట్లు గొలిపే అంతటి సువర్ణకాంతులలోనూ, రాజుకు వాడిపోయి, మట్టి అంటుకుని ఉన్న కమలాలూ, తులసీ దళాలూ కనిపించాయి. “ఏమిటీ చిత్రము? వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అయినా ఈ సుమాలు ఇక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని సువర్ణ కమలాలతో తప్ప పూజించను కదా!” అని తర్కించుకుని, నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు.

“నాయనా! ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేద పల్లెలో, ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి, అందులో నా చెక్క బొమ్మ ఒకటి మలచి, అందులోనే నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎలా భావిస్తే, అలా కారుణించడం నా బాధ్యత కదా! ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు! పాపం భీముడికి మంత్ర తంత్రాలు, తపో యోగాలూ తెలియవు. త్రికరణ శుద్ధిగా, నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా, ఎప్పుడూ నా ఊసే! నా ధ్యాసే! తన కులాచారం, ధర్మం, ఎల్ల వేళలా పాటిస్తాడు. సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి, తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు పూర్తిజేసుకుని, నా పేరు స్మరిస్తూ, తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే, నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా.. వారి కుటుంబమంతా అంతే.. నా మాట, నా పాట తప్ప, వారికింకేదీ రుచించదు. నేను ఆ భీమకులాలుని భక్తి పాశాలకు బందీనయిపోయాను!”

స్వామి చెప్పిన మాటలతో, విషయం తెలిసి వచ్చింది తొండమానుడికి. భాష్ప పూరిత నయనాలతో, “ప్రభూ..!” అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, “జగన్నాథా! నా తప్పును మన్నించు. నా వంటి భక్తుడు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచమెంత? నా అనుభవమెంత..? నా పై దయతో, నా బుద్ధి దోషాన్ని పోగొట్టి, నిజమైన భక్తుడిని చేశావు తండ్రీ. ఇదుగో, ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం జేసుకుని వస్తాను. నాకు సెలవు ఇప్పించండి” అని చెప్పి బయలుదేరాడు రాజు.

నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ |
మద్భక్తాః యత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద! ||

అన్న సూక్తి ప్రకారం, భీముని దర్శనం తీర్థయాత్రగా భావించి, తొండమానుడు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలి నడకనే ప్రయాణము చేయాలనే నియమం ఉంది కదా! అలా రాజు భీముడి ఇల్లు చేరే సమయానికి, స్వామి భజనలతో మారు మ్రోగుతోంది భీముడి ఇల్లు. రాజు అతని పాదాలపై పడి, “అయ్యా! శ్రీ వేఙ్కటేశుని ద్వారా నీ మాహాత్మ్యాన్ని తెలిసుకున్నాను. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే, నీ భక్తిని కొనియాడాడు! నీ పాదధూళి తాకి, పునీతుడనవుదామని వచ్చాను” అని అన్నాడు తొండమానుడు. చక్రవర్తి అంతటి వాడు తన పాదలు తాకడం ఏమిటని భీముడు, వెనక్కు జరిగి చేతులు జోడించి, “రాజా! అంత పని చేయవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావులు మీరు” అని అన్నాడు.

ఇంతలో గరుడారూఢుడైన వేఙ్కటేశుడు, లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు. భీముడి ఆనందానికి అంతులేకుండా పోయింది. “ఓ దయామయా! నా పూరి గుడిసెకు వచ్చారా! మీ లీలలే లీలలయ్యా.. మా తప్పులను ఎన్నక, దయావర్షం కురిపించే కాలమేఘం స్వామీ మీరు! నేను హనుమంతుని లాగా వారధి దాటి మిమ్మల్ని మెప్పించలేను.. శబరి లాగా భక్తి శ్రద్ధలు చూపి మిమ్మల్ని ఆకట్టుకోలేను.. జనకుని లాగా సీతమ్మను ఇవ్వలేను.. నారదుని లాగా, గంధర్వగానంతో మీ గుణగణాలను కీర్తించలేను.. జటాయువు లాగా మీ కోసం నా ప్రాణాలు ఇవ్వలేను.. అయినా, మిమ్మల్ని శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తులు మీరు” అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో అంటున్న మాటలను, వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి.

మహాభక్తురాలైన భీముడి భార్య తమాలిని కూడా, గద్గద స్వరంతో అమ్మను కీర్తించింది. ఆది దేవుడూ, మహాలక్ష్మీ స్వయంగా తమ యింటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదని బిడియ పడింది. అది గమనించిన శ్రీనివాసుడు, “తమాలినీ! నీ చేతులతో ఏది వండి పెట్టినా తింటానమ్మా” అని అన్నాడు. తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తనకు పెద్దల ద్వారా తెలిసినంతలో, యథా శక్తిగా, శుచిగా, తామర తూడులతో వంటకాన్ని వండి, లక్ష్మీ నారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలుమంగా, శ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే, దివ్య శరీరధారులై, వైకుంఠ ధామానికి చేరారు, భీమకులాల దంపతులు.

ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుండిపోయిన తొండమానుడు, “ప్రభూ! మరి నా సంగతేమిటి?” అని ప్రాధేయ పడ్డడు. అప్పుడు జగన్నాథుడు, “రాజా! నీ తరువాతి జన్మలో, నీవు విరాగివై, నా ఏకాంత భక్తుడవవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది” అని చెప్పి, తొండమానుడిని ఊరడించాడు. ఇలా తొండమానుడికీ, భీముడికీ ముక్తిని ప్రసాదించాడు భక్త సులభుడయిన శ్రీ వేఙ్కటేశ్వరుడు.

ఇక ఈ కథలోని నీతి విషయానికి వస్తే, అహంకారం, గర్వం, ఎంతటి వారికైనా, ఎంత కొంచమైనా తగదు. మహనీయుడైన తొండమానుడికే, అహంకారం వలన భంగపాటు తప్పలేదు. ఇక సామాన్యులమైన మన సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఎప్పుడూ వినయ విధేయతలతో మెలగాలి. కుల ధర్మం, కర్తవ్యం పాటిస్తూ, భగవంతుడిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని, ఆయన కరుణిస్తాడని నిరూపించాడు, భీముడు. కులం కన్నా, గుణం ప్రధానం అనేది మనం గమనించాలి.

ఓం నమో వేఙ్కటేశాయ!

Monday, June 17, 2024

The Journey to Hell - Story of Kathopanishad (Nachiketa) | కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి!


కఠోపనిషత్ కథ - నచికేతుడి పితృభక్తి! TELUGU VOICE
యమధర్మ రాజు నుండి అతి రహస్యమైన విద్యను ఎలా పొందాడు?

పూర్వం వాజస్రవసుడనే సత్పురుషుడుండేవాడు. గౌతమవంశసంజాతుడైన అతడు, గౌతముడు, ఔద్దాలకుడు, ఆరుణి అనే పేర్లతోకూడా ప్రసిద్ధుడు. అతడొకసారి విశ్వజిత్ యజ్ఞం చేశాడు. ఆ బృహత్ యజ్ఞం చేసినవారు, యాగం చివరలో, తమ సర్వస్వాన్నీ దానం చేసేయాలి! వాజస్రవసుడు కూడా అలాగే తనకున్నదంతా దానం చేయసాగాడు. అనాదినుంచీ భారతీయులకు పశువృక్షాదులే ముఖ్యమైన సంపదలు. అందులోనూ, గో సంపద అతి ముఖ్యమైనది. మరకత మాణిక్యాలూ, హిరణ్య రజితాలకంటే గొప్పది గో సంపద. కాబట్టి, వాజస్రవసుడు ఋత్వికులకు గోదానాలు చేయసాగాడు. వాజస్రవసుడికి, మహాబుద్ధిశాలి, గుణసంపన్నుడు, పితృభక్తి పరాయణుడైన పుత్రుడున్నాడు. అతడి పేరు నచికేతుడు. చిన్న వయస్సులోనే సకల ధర్మ శాస్త్రాలనూ అభ్యసించాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/D9Uk9VwwZTs ]


ఆ సమయంలో నచికేతుడి దృష్టి, తన తండ్రి దానమిస్తున్న గోవుల మీద పడింది. ఆ గోవులు చాలావరకూ ముసలివి, పళ్ళు లేనివి, పాలివ్వడానికీ, ప్రసవించడానికీ శక్తిలేనివని గమనించిన నచికేతుడు, ఇలా అనుకున్నాడు.. “ఎవరైతే నిస్సారమైన గోవులను దానం చేస్తారో, వారికి సద్గతులుండవని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అయ్యో! మహనీయులైన మా తండ్రిగారు, విశిష్టమైన విశ్వజిత్ యజ్ఞము చేసికూడా, ఈ తామస దానము వలన పూర్ణఫలాన్ని పొందలేక పోతున్నారే” అని బాధపడి, చివరిలోనైనా తండ్రిగారికి హితవు చెబుదామని తలచి ఇలా అన్నాడు.. “తండ్రీ! ఈ యజ్ఞంలో మీకున్నవన్నీ దానం చేయాలి కదా? మరి నన్ను ఎవరికిస్తున్నారు?” అని అడిగాడు. బాలచేష్టగా భావించి, అతడి ప్రశ్నకు బదులివ్వలేదు వాజస్రవసుడు. “నన్నెవరికిస్తున్నారు నాన్నా?” అని నచికేతుడు మళ్ళీ అడిగాడు.

“సహనావవతు..” మొదలైన శాంతి మంత్రాలతో ప్రతిధ్వనిస్తున్న యాగశాలలో ఉన్న వాజస్రవసుడు, సహనం వహించాడు. తండ్రికి మహా పుణ్యాన్ని ఎలాగైనా కట్టబెట్టాలన్న దృఢ నిశ్చయంతో ఉన్న నచికేతుడు, మూడవసారి కూడా అదే ప్రశ్న వేశాడు. ఇక సహనాన్ని కోల్పోయిన వాజస్రవసుడు, “నిన్ను యమునికిస్తాను” అని కోపంగా అన్నాడు! అలా మాట జారిన వాజస్రవసుడు, “అయ్యో! కోపంలో నేనెంత మాటన్నాను? ‘తన కోపమే తన శత్రువు’ అన్న సూక్తిని చిన్న నాటి నుంచీ వింటూ వచ్చినా, ఒక్క క్షణం సహనాన్ని కోల్పోయి, ఎంత తప్పుచేశాను!” అని బాధ పడ్డాడు.

అప్పుడు నచికేతుడు తన మనస్సులో, “దానమిచ్చేటప్పుడు, అది స్వీకరించేవారికి పనికివచ్చేదై ఉండాలి. నా వంటి సామాన్యుడు, ధర్మ ప్రభువైన యముడికి ఏ విధంగా ఉపయోగపడగలడు? అయినా, పితృవాక్య పాలనమే పుత్రుడి ధర్మం” అని అనుకుని, బాధపడుతున్న తండ్రిని చూచి ఇలా అన్నాడు.. “తండ్రీ! విచారించవద్దు. మన పూర్వీకులందరూ సత్యనిష్ఠాగరిష్ఠులు. అన్న మాట ఎన్నడూ జవదాటి ఎరుగని వారు. సత్యమే ఈ చరాచర సృష్టికి మూలాధారము. సత్యభ్రష్టుడైన వాడికి నరకం తప్పదు.. తండ్రీ! మీరు అన్న మాటను నేను సత్యము చేస్తాను. నా గురించి విచారించకండి. పండిన పంట ఎలా జీర్ణమయి పోతుందో, అదే విధంగా, పాంచ భౌతిక శరీరమూ, పుట్టి పెరిగి, మళ్ళీ ఆ పంచ భూతముల లోనే లీనమవ్వాలి.. కాబట్టి, ఈ శరీరం శాశ్వతం కాదు. సత్యమొక్కటే శాశ్వతము. సత్యమే భగవంతుడు. కనుక బాధ పడకుండా, యముడి దగ్గరకు పోవడానికి అనుజ్ఞ ఇవ్వండి.”

ఇలా తన అమృత వాక్కులతో సుధలను కురిపించాడు నచికేతుడు. దశరథ మహారాజు ఎలా అయితే శోకతప్త హృదయంతో రాముడిని ఆడవులకు పంపాడో, అలా వాజస్రవసుడూ, బాధాతప్త హృదయంతో నచికేతుడిని యముడి దగ్గరకు పంపాడు. ఆ యమపురికి వెళ్ళే దారి అత్యంత దుర్గమమైనది. ఎంతో పుణ్యం చేసుకున్న వారు కూడా అంత సులభంగా దాటలేని వైతరణీ నదిని, నచికేతుడు తన సత్యసంధత, పితృభక్తి ప్రభావాలతో సునాయాసంగా దాటి, యమపురికి చేరాడు. తను చేరే సమయానికి యమ ధర్మరాజు నగరంలో లేరని తెలుసుకుని, ద్వారం దగ్గరే నిరీక్షించాడు. అలా ఆ పసివాడు, మూడు రోజులు అన్నపానీయాదులు లేకుండా కాలుని కోసం నిరీక్షించాడు.

మూడు దినాల అనంతరం ధర్ముడు వచ్చాడు. మహా తేజస్సుతో అగ్నిలాగా వెలిగి పోతున్న నచికేతుడిని చూసి, “అయ్యో! తెలియక నా వలన ఎంత అపరాధం జరిగింది? ధర్మానికి రాజునైన నా ఇంటనే ఇంతటి అధర్మం జరిగినదే! ఇంట్లోని వారి వలన తప్పు జరిగినా, ఆ తప్పుకు బాధ్యత యజమానిదే! అగ్నితుల్యుడైన అతిథి ఎవరింట్లో పస్తుంటాడో, వాడి ఇష్టాపూర్తులూ, పుత్రులూ మొదలైన సంపదలు నశిస్తాయి! నిప్పును తెలిసి తాకినా, తెలియక తాకినా కాలక మానదు. అలాగే తెలిసి చేసినా, తెలియక చేసినా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించక తప్పదు. ఈ అధర్మ కార్యానికి ఫలితము నాకు రాక మానదు.

ఇప్పటికైనా ఈ అతిథికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరిస్తాను” అని నిశ్చయించుకుని, యముడు నచికేతుడి వద్దకు వెళ్ళి, “అభ్యాగతః స్వయం విష్ణుః.. కావున చిన్న వాడివైనా నీకు నమస్కరిస్తున్నాను. నా నమస్కారమును స్వీకరించు. ఇంటికి వచ్చిన అతిథి అగ్ని దేవునితో సమానుడని తెలిసి కూడా, నిన్ను మూడు రోజులు నిరీక్షింపజేసినందుకు నన్ను క్షమించు. నాకు శుభం కలిగేటట్లు ఆశీర్వదించు. మూడు రోజులు నిన్ను కష్ట పెట్టినందుకు ప్రాయశ్చిత్తంగా, నీకు మూడు వరాలను ప్రసాదిస్తాను.. కోరుకో..” అని అన్నాడు.

వంశ దీపకుడైన నచికేతుడు, ధర్మదేవతతో ఇలా అన్నాడు.. “ఓ యమధర్మరాజా! మా తండ్రిగారు ఆందోళనా రహితుడు, శాంత చిత్తుడు అయ్యేటట్లు ఆశీర్వదించండి. నేను ఇంటికి చేరిన తరువాత, ఆయన నా పై కోపమును విడచునట్లు ఆశీర్వదించండి. నాకు అగ్ని విద్యను ఉపదేశించండి” అని కోరాడు. యముడు ఆ వరములను ప్రసాదించి, మూడవ వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు నచికేతుడు, “స్వామీ! ఆత్మ శాశ్వతమని కొందరు, కాదని మరికొందరు అంటున్నారు. ఈ సందేహము తీరేటట్లు, నాకు అతి రహస్యమైన బ్రహ్మ విద్యను ఉపదేశించండి” అని ప్రార్ధించాడు.

ఆత్మవిద్యను యోగ్యత, అర్హతలున్న వారికే బోధించాలి. అనర్హులకు బోధిస్తే, అది వారికీ, సమాజానికీ హానికారకమని తెలిసిన యమధర్మరాజు, నచికేతుడు జ్ఞానోపదేశానికి అర్హుడో కాదో తెలుసుకో దలచాడు. “ఈ విద్యను నేర్చుకోవడం చాలా కష్టము. ఇంకేదైనా వరం కోరుకో. ఉత్తమ సంతానం, ఏనుగులు, గుఱ్ఱాలు, ఆవులు, సిరిసంపదలు, ఇంకా మానవులకు దుర్లభమైన భోగభాగ్యాలు ఏవైనా కోరుకో.. వెంటనే తీరుస్తాను. ఈ భూమండలాన్నంతా కోరినా ఇచ్చేస్తాను. దీర్ఘాయువు, అమరత్వము కోరుకున్నా ప్రసాదిస్తాను.. ఆత్మవిద్య తప్ప” అని ప్రలోభ పెట్ట జూశాడు కాలుడు. ధీరుడైన నచికేతుడు, ఐహికార్థాలను తృణప్రాయంగా ఎంచి, ఆత్మవిద్యను నేర్చుకోవడానికే ఉత్సుకతను చూపించాడు. నచికేతుని పట్టుదలను చూసి సంతోషించి, ప్రలోభాలకు లొంగని అతడు ఆత్మవిద్యను నేర్చుకోవడానికి అర్హుడని నిశ్చియించుకుని, అతడికి తెలియజేసిన వివరణే కఠోపనిషత్ సారము..

ఇక ఈ కథలోని నీతి విషయానికి వస్తే.. దానమిచ్చే సమయంలో, మన వద్దనున్నవాటిలో మంచివీ, గ్రహీతకు ఉపకరించేవీ మాత్రమే ఇవ్వాలని, నచికేతుడు మనకు బోధించాడు. ఇదే ఉత్తమ దానం యొక్క లక్షణము. పితృ వాక్య పాలనం, పుత్రుల ప్రథమ కర్తవ్యం. అంతేగాక, తండ్రి అడగకుండానే, అప్రియమైనా, తండ్రికి హితవు చేయాలని తపించేవాడు, ఉత్తమ పుత్రుడు. శ్రీరాముడు, భీష్మ పితామహుడు, నచికేతుడు, ఈ కోవకు చెందిన వారు. తండ్రికి పూర్ణ దాన ఫలం ఇప్పించాలన్న దృఢసంకల్పం గలవాడు, నచికేతుడు. తండ్రి అన్న మాటను నిజం చేయటానికి, తన ప్రాణాలనే తృణప్రాయంగా ఎంచి, యమపురికి బయలుదేరాడు. ఇటువంటి పితృభక్తి పరాయణులు మనకు ఆదర్శ ప్రాయులు. క్షణికావేశం మనచేత ఎంతటి తప్పునైనా చేయిస్తుంది. పసివాడి మాటలకు విసుగు చెంది, సహనం కోల్పోయిన వాజస్రవసుడు, “యమునికిస్తాను” అని నోరు జారి, తరువాత పశ్చాత్తాప పడి ఏం లాభం? కాబట్టి, ఎప్పుడూ శాంత చిత్తంతో ఉండాలి.“అభ్యాగతః స్వయం విష్ణుః” అన్న సూక్తిని మనకు తెలియజేశాడు యమధర్మరాజు. అతిథిని నిరీక్షింపచేయవలసి వచ్చిందని ఎంతో బాధపడ్డాడు. దిక్పాలకుడయి ఉండి కూడా, తనను క్షమించమని ఒక పసి బాలునితో అన్నాడు! సకల శాస్త్రాలూ తెలిసి ఉండి కూడా నచికేతుడు, తన వంటి సామాన్యుడు యమునికి ఎందుకు పనికివస్తాడని అనుకుని, వినయంతో మెలగడం మనం నేర్చుకోవాలి.

సర్వేజనాః సుఖినోభవంతు!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...