ఈ రోజు '17/07/2024' తొలి ఏకాదశి, శయన ఏకాదశి - అందరికీ శుభాకాంక్షలు! Toli Ekadasi


ఈ రోజు '17/07/2024' తొలి ఏకాదశి, శయన ఏకాదశి - అందరికీ శుభాకాంక్షలు! TELUGU VOICE

తొలి ఏకాదశి అంటే ఏమిటి, ఎందుకు చేసుకుంటారు, దీని విశిష్ఠత ఏంటి?

హిందూ సంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన తొలి ఏకాదశి, పండుగలకు ఆది.  తెలుగు సంవత్సరంలో అన్ని పండగలనూ వెంట పెట్టుకుని వచ్చే తొలి ఏకాదశి విశిష్ఠత ఏంటో తెలుసుకుందాము..

తొలి ఏకాదశి అంటే ఏమిటి?

ఆషాఢ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అని అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి, మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి). అవి ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే, పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతరేంద్రియం అయిన మనస్సుతో కలిపితే, పదకొండు. ఈ పదకొండూ ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి.

తొలి ఏకాదశి విశిష్ఠత!

ఆషాఢ మాస ఏకాదశినే 'తొలి ఏకాదశి'గా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి, హరి వాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒక రకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాల పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు, ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు (సూర్యుడు దక్షణం వైపుకు మరలి నట్లు, ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకుని, కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు, అంటే, క్షీరాబ్ది ద్వాదశి వరకూ ఆచరించాలని, మన పురాణాలు తెలియజేస్తున్నాయి.

తొలి ఏకాదశి జరుపుకునే విధానం, నియమాలు..

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వ దినాన వ్రతాన్ని ఆచరిస్తే, సూర్య, చంద్ర గ్రహణాల సమయంలో, భూమి దానమిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని, ఏకాదశీ వ్రత మాహాత్మ్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహా సాధ్వీ అయిన సతీ సక్కుబాయి ఈ వ్రతాన్ని ఆచరించే, మోక్ష సిద్ధి పొందింది.

వ్రతంలోని ప్రధాన నియమాలు..

ఉపవాస ఫలితాలు:

ఈ వ్రతాన్ని ఆచరించ దలచిన వారు, దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

అసత్యం ఆడకూడదు. స్త్రీ సాంగత్యం నిషిద్ధం. చెడు పనులూ, దుష్ట ఆలోచనలూ చేయకూడదు.

ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాల అనంతరం శ్రీహరిని పూజించి, నైవేద్య తాంబూలాలు సమర్పించి, భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది.

ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినకూడదు..

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరిని నిష్ఠగా పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని, విష్ణుమూర్తి ప్రతిమకు, లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి, పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, కర్పూర హారతినివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు, కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు,  మినుములు తీసుకోకూడదు. అదే విధంగా, మంచంపై శయనించడం వంటివి చేయకూడదని, పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి, పద్మ పురాణంలో వివరించబడింది. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవ జాతిని ఉద్ధరించటానికి, సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు, సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ, మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ, పద్మ పురాణంలో పేర్కొనబడింది.

ఈ రోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంభిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకుని, వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగానే, తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదనీ, పైరుకు ఏ రకమైన తెగుళ్ళూ సోకకూడదనీ, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదనీ దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు, మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి, దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

తొలి ఏకాదశి రోజున శేషశాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయని పండితులు చెబుతారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలూ చేస్తారు.

ప్రాశస్త్యం..

ముఖ్యంగా ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోజనంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే, కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసం, శుక్లపక్ష ఏకాదశి నాడు, విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని, తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి, దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించి, ఆ తర్వాత భోజనం చేస్తే, జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు, మళ్ళీ నాలుగు నెలల తర్వాత, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణ విదితం. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే, 'క్షీరాబ్ధి ద్వాదశి' అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి, అందరూ చాతుర్మాస్య దీక్ష చేస్తారు.

అలాగే 'ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి?' అనే విషయాలు తెలుసుకోవాలంటే: [ https://youtu.be/Lcy2ZkxYfYY ]


🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka