Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, August 26, 2024

Is Gautam Buddha avatar of Lord Vishnu | దశావతారాలు! బుద్ధుడు విష్ణువు అవతారమా?


అందరికీ 'శ్రీకృష్ణ జన్మాష్టమి' శుభాకాంక్షలు 🙏 TELUGU VOICE

బుద్ధుడు విష్ణువు అవతారమా? దశావతారాలలోని బుద్ధుడికీ, గౌతమ బుద్ధుడికీ సంబంధం లేకపోతే, మరి ఆ బుద్ధుడు ఎవరు?

శ్రీ మహావిష్ణువు ‘దశావతారాలు’ అనగానే, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఇలా చెప్పుకుంటూ పోతాము. ఈ వరుసలోనే, విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారంగా, ఆయన బుద్ధుడిగా అవతరించాడని విశ్వసిస్తాము. కానీ, నిజంగా విష్ణువే బుద్ధుడిగా అవతరించాడా? బుద్ధుడు విష్ణువు అంశేనా? అసలు బుద్ధుడు ఎవరు? ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న బౌద్ధమతానికి ఆది గురువైన గౌతమ బుద్ధుడేనా? ఈయనేనా ఆ విష్ణువు తొమ్మిదవ అవతారం? లేక దశావతారాలలోని బుద్ధుడు వేరెవరైనా ఉన్నారా? అసలు బుద్దుడి రహస్యం ఏమిటి?.. వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/aaXuYOOtaM0 ]


బుద్ధుడి రాకకు మునుపు, అప్పటిదాకా ప్రపంచం, ఒక మార్గంలో నడుస్తోంది, ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్లింది. ఆ మార్గంలో ఉన్న ముళ్లను తొలగించి, ఆ ధర్మంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి, సరికొత్త మార్గాన్ని చూపించిన ఆధ్యాత్మిక గురువు, గౌతమ బుద్ధుడు. దాదాపు రెండువేల అయిదు వందల సంవత్సరాల క్రితం, మనకు తెలిసిన కాలంలో, మనకు తెలిసిన చరిత్రలో, ఈ భూమిపై నడయాడిన పుణ్యమూర్తి, బుద్ధుడు. హిందువులలో ఉన్న కొన్ని విశ్వాసాలతో విభేదిస్తూ, ఒక విధమైన విప్లవాత్మకమైన ధోరణితో దూసుకు వచ్చిన వాడు, బుద్ధ భగవానుడు.

ఇప్పుడున్న నేపాల్‌ లోని కపిలవస్తు నగరాన్ని ఏలిన మహారాజు సంతానంగా, శక్తిమంతుడైన మతాచార్యుడిగా అవతరించిన పుణ్య మూర్తి, గౌతమ బుద్ధుడు. జీవితం-చావుపుట్టుకల గురించి సిద్ధార్థుడనే రాకుమారుడికి తీవ్రంగా వచ్చిన సందేహాలు, అతడిని బుద్ధుడిగా మార్చేశాయి. ఊరూరా తిరిగి తిరిగి, అలసిపోయిన యువరాజుకు, గయలో ఓ బోధి వృక్షం ఆశ్రయమిచ్చి, జ్ఞానాన్ని ప్రసాదించింది. సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది. 375 జన్మలు ఎత్తిన వాడూ, ఆ తరువాత కూడా ఆచార్యుడిగా అవతరించిన వాడూ, అన్ని కాలాలలో ఉన్నవాడూ, అన్ని ధర్మాలకూ అతీతమైన ధర్మాన్ని లోకానికి అందించిన వాడు... ఈయనకూ విష్ణుమూర్తికీ సంబంధం ఏమిటి? విష్ణువు దశావతారాలతో ఉన్న అనుబంధం ఏమిటి? నారాయణుడే తన తొమ్మిదవ అవతారంలో, గౌతమ బుద్ధుడిగా అవతరించాడా? ఇది నిజమేనా? ఒకవేళ దశావతారాలలో ఉన్న బుద్ధుడికీ, గౌతమ బుద్ధుడికీ సంబంధం లేకపోతే, ఆ అవతారంలో ఉన్న బుద్ధుడు ఎవరు?

విష్ణువు దశావతారాలు కట్టు కథలు కావు. పుక్కిటి పురాణాలుగా వీటిని కొట్టిపారేయలేము. వీటి వెనుక పౌరాణిక వాస్తవాల విషయం అటుంచితే, సైంటిఫిక్‌ లాజిక్‌ మాత్రం అద్భుతంగా ఉంటుంది. భూమిమీద జీవరాశి పుట్టినప్పటి నుంచీ, దాని పరిణామ క్రమాన్ని వ్యక్తం చేసేది, దశావతార క్రమం. అందులో తొమ్మిదవ అవతారం, బుద్ధుడని మనం విశ్వసిస్తాము. అయితే, ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడేనా! అన్న విషయానికి వస్తే..

పురాణాల ప్రకారం విష్ణువు వందల అవతారాలు ధరించాడు. కానీ మనకు తెలిసినవి మాత్రం, పదే. అందులో తొమ్మిది ఇప్పటికే అవతరించాడు.. కలియుగాంతంలో రాబోయే పదవ అవతారమైన కల్కి అవతారం కోసం, అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక మన వీడియో విషయానికి వస్తే, గౌతమ బుద్ధుడే విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారమనేది, అందరి విశ్వాసమూ. అద్వైత, విశిష్టాద్వైత మతాల మధ్య పోరూ, హిందువుల్లో సంక్షిష్టంగా మారిన విశ్వాసాలూ పెడదారి పట్టినప్పుడు అవతరించిన మూర్తే బుద్ధుడనేది, అందరి నమ్మకం. కానీ, మనకు తెలిసిన బుద్ధుడు విష్ణువు కాదనేది మరో వాదన. ఆ వాదన ప్రకారం, దశావతారాలలో ఉన్న బుద్ధుడు వేరే ఉన్నాడంటారు. దుష్టశిక్షణ సక్రమంగా జరిగేందుకు విష్ణువు, రామ, కృష్ణుల అవతారాల మధ్యలో, బుద్ధుడిగా ఆవతరించాడు.

మనకు తెలిసిన గౌతమ బుద్ధుడు మరో అవతార పురుషుడే కానీ, దశావతారాలలో ఒకరు కాకపోవచ్చు. సామాన్య శక పూర్వం, 568వ సంవత్సరంలో, భారతదేశంలో శైవ, వైష్ణవ, శాక్తేయ మతాలను ధిక్కరిస్తూ, అందులోని లోపాలను తిప్పికొడుతూ, గౌతమ బుద్ధుడు సమాజానికి కొత్త దిక్సూచి అయ్యి నిలిచాడు. ఇప్పుడు నేపాల్‌లో ఉన్న అప్పటి కపిలవస్తు నగరాన్ని ఏలుతున్న రాజు శుద్ధోధనుడు, మాయ దంపతులకు జన్మించిన సిద్ధార్థుడు, అందరు రాజకుమారుల లాగానే, సకల రాజభోగాలనూ అనుభవించిన వాడే. దాదాపు 29 సంవత్సరాలు అన్ని సుఖాలనూ అనుభవించాడు. వైవాహిక జీవితాన్ని అనుభవించి, ఒక కుమారుడికి తండ్రి అయ్యాడు. కానీ, ఆ తరువాతే ఆయన జీవితం మారి పోయింది. సందేహాల పుట్టగా మారి, చివరకు జీవించటమే నరకంగా భావించే పరిస్థితి నెలకొంది. ఇల్లు, సంసారం వదిలి బయటకు వెళ్లిన సిద్ధార్థుడు, కౌండిన్యుడనే యోగి దగ్గర కొంతకాలం శిష్యరికం చేశాడు. కానీ, ఆ శిష్యరికం కూడా సంతృప్తినివ్వలేదు, ఆయన సందేహాలు తీరలేదు. గురువును వదిలి, తిరిగి తిరిగి చివరకు గయకు చేరుకున్నాడు. అక్కడ ఓ రావిచెట్టు సిద్ధార్థుడికి ఆశ్రయాన్నిచ్చింది. ఆ చెట్టే ఆయనకు నివాసమైంది. ఆ చెట్టు క్రిందే జ్ఞానోదయమైంది. ఆ జ్ఞానంతో సిద్ధార్థుడు, గౌతముడయ్యాడు. గౌతముడు బుద్ధుడయ్యాడు. త్రిపీఠికలతో నూతన ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆది గురువై నిలిచాడు. ఆయన బోధనలు ప్రపంచానికి తలమానికమై నిలిచాయి. సత్యాహింసలు మహాస్త్రాలుగా తయారయ్యాయి. అందువల్లనే, ఆయనను విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. ఆయన బోధనలూ, ధర్మ రక్షణా మార్గం, ఆయనను అవతార పురుషుడిగా మార్చాయి.

బుద్ధుడిగా మనకు విడిగా కనిపిస్తున్న మరో రూపం, మన పౌరాణిక గాథల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. గౌతమ బుద్ధుడి మాదిరిగానే, పౌరాణిక బుద్ధుడికీ, రావిచెట్టుతో అనుబంధం ఉంది. పౌరాణిక బుద్ధుడూ విష్ణుమూర్తి అంశతోనే అవతరించాడు. యుగాలకు అందని పౌరాణిక గాధ ఇది.

జనాలను నానా అవస్థలూ పెడుతున్న త్రిపురాసురులనే రాక్షసులను, ఎవరూ జయించలేక పోయారు. త్రిపురాసురుల భార్యలు మహా పతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల, త్రిపురులు అజేయులయ్యారు. ఏం చేయాలో దేవతలకు అర్ధం కాలేదు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింపజేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం, శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపంతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషయం, "ఆపన్నివారక స్తోత్రం"లో ఉంది. "దైత్యస్త్రీమనభంజినే" అంటే, రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడని అర్ధం.

ఇక్కడ అశ్వత్ధ వృక్షం అంటే మరేదో కాదు. రావిచెట్టే. ఇదే బోధి వృక్షం. ఇక్కడ పతివ్రతలకు వ్రతభంగం చేసినది శ్రీ మహా విష్ణువే. ఇతడే దశావతారాలలో మనకు కనిపించే బుద్ధుడనేది కొందరి వాదన. కాకపోతే, ఈ కథనానికి విష్ణుకథల్లో పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. అశ్వత్థ వృక్షాన్ని పూజించడం, పతివ్రతల గొప్పదనాన్ని వివరించడం వరకే, ఈ కథనాన్ని చెప్పుకొచ్చారు.

నిజానికి దశావతారాలను ఒక క్రమ పరిణామంగా గనుక చూచినట్లయితే, గౌతమ బుద్ధుడిని, తొమ్మిదవ అవతారంగా గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే, విష్ణువు అవతారాలలో మొదటి అయిదు, అంటే, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలన్నీ, కృతయుగంలో జరిగాయి. ఆ తరువాత త్రేతాయుగానికి వచ్చేసరికి, పరశురామ, రామావతారాలు సంభవించాయి. ద్వాపరయుగంలో కృష్ణావతారం మనకు తెలిసిందే. శ్రీకృష్ణ నిర్యాణంతోనే, ద్వాపర యుగం ముగిసి, కలియుగం మొదలైంది. కలియుగంలో సనాతన ధర్మానికి సంబంధించినంత వరకూ అవతరించిన మహాపురుషుడు, గౌతమ బుద్ధుడొక్కడే. అందుకే దశావతారాల బుద్ధుడు, పౌరాణిక బుద్ధుడు కాకుండా, కపిలవస్తు నగరంలో జన్మించిన సిద్ధార్థుడేనని రూఢి అవుతోంది. ద్వాపర యుగాంతంలో కృష్ణ నిర్యాణానికీ, సామాన్య శక పూర్వం 568లో గౌతమబుద్ధుడు అవతరించటానికీ మధ్య సాగిన 2500 సంవత్సరాల కాలం, ప్రపంచ సమాజాన్ని అస్తవ్యస్తం చేసిన కాలం. అన్ని మతాల మధ్యనా సామరస్యం లోపించిన సమయంలో, అత్యున్నతమైన అహింస, ధర్మ పరిరక్షణ మార్గాలుగా మతాన్ని నిర్మించిన మహాపురుషుడు, గౌతమ బుద్ధుడు. విష్ణుమూర్తి అవతారమా కాదా అన్న ప్రశ్నను పక్కనబెడితే, ఆయన విశ్వానికి మార్గదర్శి. ఇదే సత్యం, ఇదే నిజం. గౌతమ బుద్ధుడు, జీవితం ఎలా గడపాలో నేర్పిన వాడు. మానవత ఆయన మతం, ధర్మం ఆయన మార్గం, అహింస ఆయన వ్యక్తిత్వం. అందుకే అందరికీ ఆయన శరణయ్యాడు.

🚩 బుద్ధం శరణం గచ్ఛామి 🙏

Monday, August 19, 2024

Reincarnation or Rebirth or Transmigration | పునర్జన్మలు – జనన మరణ రహస్యం!


పునర్జన్మలు – జనన మరణ రహస్యం! TELUGU VOICE
‘ఆత్మ’ నివాసంగా చేసుకున్న శుక్రకణం గర్భాన్ని కలిగించే శక్తిగలదా?

కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభంలో, శ్రీకృష్ణుడిచే అర్జునుడికి బోధింపబడిన జ్ఞాన నిధి ‘భగవద్గీత’. భారతదేశ న్యాయస్థానాలలో సైతం, ప్రమాణం చేయించడానికి ఎంచుకున్న భగవద్గీతను, పాశ్యాత్యులు సైతం పఠిస్తారు. ఇక మరణమంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? పునర్జన్మలు ఉన్నాయా? ఉంటే చనిపోయిన వారు ఎలా? ఎప్పుడు? ఎక్కడ పుడతారు? లాంటి నిగూఢమైన రహస్యాలను విప్పిచెప్పే మహోత్తర గ్రంధ రాజం, శ్రీమద్ భగవద్గీత.. అటువంటి జన్మ రహస్యాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/looiV-svsw0 ]


ఒక ఆత్మ తల్లిదండ్రుల శుక్ల శోణితాల కలయిక వల్ల ఏర్పడిన ఒక సంయుక్త బీజం అంటే, Zygote లోకి ప్రవేశిస్తుంది. “ఆత్మ” పురుషుని ఇంద్రియం ద్వారా, స్త్రీ యొక్క అండంలో కలుస్తుంది. కోట్లాది వీర్యకణాలున్నా, కేవలం ఒక్కటి మాత్రమే అండాన్ని కలిసి ఫలదీకరణం పొంది, పిండంగా మారుతుంది. అంటే, కేవలం ఆత్మ నివాసంగా చేసుకున్న శుక్రకణం మాత్రమే, గర్భాన్ని కలిగించ గల శక్తిని కలిగివుంటుంది. అయితే, కొంతమంది స్త్రీలకు తరుచూ అబార్షన్స్‌ జరుగుతూ ఉంటాయి. దానికి దాక్టర్లు, జన్యు సంబంధమైన కారణాలనూ, ఇతర అనారోగ్యాలనూ కారణాలుగా చెబుతుంటారు. కానీ, వాస్తవంగా ప్రతి జీవీ, ఈ లోకంలో జీవించటానికి ఒక నియమిత ఆయుర్దాయం కలిగివుంటుంది. అంటే, జీవి పిండంగా మారిన నాటి నుండి, జన్మించి, పెరిగి, వృద్ధాప్యానికి చేరే వరకూ, ఏ దశలోనైనా మరణాన్ని ఎదుర్కుని తీరాల్సిందే. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఒకే స్త్రీకి పదే పదే గర్భస్రావాలవుతున్నప్పుడు, ఒకే ఆత్మ ఆమె శరీరంలో ప్రవేశించి పిండంగా మారి, రెండు మూడు సంవత్సరాల వ్యవధిలోనే, అరడజను సార్లు పుట్టడం, గిట్టడం జరుగుతుంది.

తన కర్మఫలాన్ని బట్టి, ఆత్మ శిశువుగా మారటం, భూమిపై జన్మించడం జరుగుతుంది. కాబట్టి, ఆత్మయొక్క పాపపుణ్యాలను బట్టే, తల్లిదండ్రులు లభిస్తారు. పాపాలు చేసిన ఆత్మ, పాపులైన తల్లిదండ్రులకు జన్మించి, అనేక రకాల శిక్షలను గర్భంలోనూ, జన్మించిన తర్వాతా అనుభవించడం జరుగుతుంది. చావు లేని ఆత్మ, ఒకసారి దేహాన్ని విడిచి పెట్టి, మళ్ళీ జన్మించి మరొక దేహాన్ని పొందినప్పుడు, గతజన్మను గురించిన జ్ఞాపకాలు గుర్తుంటే కలిగే నష్టం, అంతా ఇంతా కాదు. ఎందుకంటే, ఒకసారి మరణించిన తర్వాత, ఆ జన్మతాలూకు జ్ఞాపకాలను మరు జన్మలోకి తీసుకెళ్ళ బడకుండా, ప్రకృతి, లేదా దైవం నియంత్రిస్తుంది. అయితే, కొన్ని అసాధారణ పరిస్థితులలో, మరపు అనే ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించి, ఆత్మ తన గత జన్మ జ్ఞాపకాలను మరు జన్నలో కూడా గుర్తుంచుకుని, ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

అలా గత జన్మ జ్ఞాపకాలు గుర్తున్న వ్యక్తులు, ఈ జన్మలో సరిగ్గా జీవించలేరు. జన్మలున్నాయని నమ్మడం వలన కలిగే లాభం, ఆ జనన మరణ వలయం నుండి విముక్తి పొందే మార్గాన్ని కనుగొనటానికి వీలు కలుగుతుంది. పుట్టడం, పెరగడం, ఎంతో మందితో గాఢానుబంధాలు ఏర్పరచుకోవడం, ఆ పై ఆ బంధాలను తెంచుకో లేక, మరణ యాతనను అనుభవిస్తూ, శరీరాన్ని త్యజించడం, మళ్ళీ పుట్టడం, ఈ జన్మ, గత జన్మల బంధాల మధ్య నలిగి పోవడం, అంతేలేని ఈ జనన మరణ చక్రంలో బందీ కావడం, 'వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం' అని మహాకవి ఆరుద్ర అన్నట్లు.. ఔను, ఈ భూమిపై పుట్టీ గిట్టే వ్యక్తులు, లోకమనే ఈ సత్రంలో కొద్దిసేపు బసచేసే నిత్య ప్రయాణీకులు..

ఇక భగవంతుడైన శ్రీకృష్ణుడు, స్వయంగా ఆత్మ రహస్యాల గురించి, భగవద్గీతలో చెప్పిన విషయానికి వస్తే, విరక్తి కలిగిన వారూ, వృద్దులూ, కష్టాలలో ఉన్న వారేగాక, ఆత్మను గురించీ, పునర్జన్మలను గురించీ తెలుసుకోవాలన్న ఆసక్తి గల వారెవరైనా, చదివి తీరవలసిన ప్రామాణిక గంధరాజం, శ్రీమద్భగవద్గీత. నిజం చెప్పాలంటే, భారతీయుల కన్నా విదేశీయులే, పునర్జన్మల పరిశోధనలకు భగవద్గీతను ఒక దిక్సూచిగా ఉపయోగించుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే, ఇతర మత గ్రంధాలలో ఉన్న మరణానంతర స్థితీ, పునర్జన్మల భావాలూ, ఆ మతాలు పుట్టడానికంటే కొన్ని వేల ఏళ్ల క్రితం గ్రంధస్థం చేయబడిన భగవద్గీతలో చెప్పబడినట్టుగానే ఉన్నాయి. చివరికి హిందూమతాన్నీ, హిందూ కర్మకాండలనూ వ్యతిరేకించి, బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుడు కూడా, కర్మసిద్ధాంతాన్ని అంగీకరించాడు. ప్రతికర్మకూ, ఒక ఫలితం ఉండి తీరుతుందని బుద్ధుడు చెప్పిన మాట, భగవద్గీత సారాంశమైన కర్మసిద్ధాంతమేనని గుర్తించాలి!

శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం.. ఆత్మ అన్నికాలాలలో ఉంటుంది. ఈ నాడు మనం చూస్తున్న మానవులూ, ఇతర జీవులూ, గతం లోనూ ఉన్నారు. కాకపోతే, వేర్వేరు ఆకారాలతో జీవించి ఉండవచ్చు. జీవుడికి బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఉన్నట్లుగానే, మరణించిన తరువాత మరొక జన్మ ద్వారా, మరో శరీరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మ ఎవ్వరిచేతా చంపబడలేదు, ఎవ్వరినీ చంపదు. మనుషులు చిరిగిన వస్త్రాలను వదిలి, కొత్త వస్త్రాలను ఎలా అయితే ధరిస్తారో, అదే విధంగా, జీవుడు ముందు జన్మలోని శరీరాన్ని వదలి, మరు జన్మలో కొత్త శరీరాన్ని ధరించడం జరుగుతుంది. ఆత్మను శస్త్రములుగానీ, అస్త్రములుగానీ ఛేదించలేవు, అగ్ని దహించ లేదు, నీరు తడుప లేదు. ఆత్మ సర్వవ్యాపి, నాశరహితము. ఇంద్రియములకు ఆత్మ గోచరము కాదు. అంటే, ఆత్మను చూడలేము, స్పృశించలేము. అందుకే, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారు మరల జన్మించక తప్పదు. ఈ ప్రయాణంలో మానవులు తాము చేసిన పాప పుణ్యాలకు ప్రతిఫలాలను స్వర్గ-నరకాలలో అనుభవించి, కర్మఫలం పూర్తి కాగానే, మళ్ళీ జన్మిస్తుంటారు.

ఇక గతంలో మనం గరుడపురాణం, కఠోపనిషత్తు వంటి గ్రంధాల ఆధారంగా చేసిన వీడియోలను చూసిన చాలామంది, మంచీ చెడు కర్మ ఫలాలను స్వర్గ నరకాలలో అనుభవించినప్పుడు, మళ్ళీ ఈ జన్మలో ఈ కష్టాలు దేనికి అనే సందేహాన్ని వెలిబుచ్చారు. కష్టాలు అనుభవిస్తున్న వారు అంటే కురూపులూ, అంగ వైకల్యం గలవారూ, నిరు పేదలూ, గత జన్మలలో చేసిన పాపాలకు నరకంలో శిక్షలను అనుభవించి, ఇంకా స్వల్పంగా మిగిలిన పాపాలను అనుభవించటానికి, అలా జన్మిస్తారు. అలాగే, గతజన్మలలో పుణ్యాలూ, మంచి పనులూ చేసిన వారు, స్వర్గంలో సుఖాలను అనుభవించి, మిగిలిన కొద్దిపాటి పుణ్యఫలాన్ని అనుభవించటానికి, సౌందర్యవంతులుగా, మేధావులుగా, మరియు సంపన్నులుగా పుడతారు. శారీరక లోపాలున్న వారూ, డబ్బు లేని వారూ అనుభవించే బాధలూ, కష్టాలూ, పైనున్న నరకంలో అనుభవించే శిక్షలకన్నా తక్కువేమీ కాదు.

అలాగే, గత జన్మల పుణ్యం వలన ఈ జన్మలో అన్నీ ఉన్న వారిగా జన్మించిన వారు, అహంకారంతో అభాగ్యులను హింసిస్తే, అది శాపంగా మారుతుంది. అంటే, అన్నీవున్న జన్మ కలిగినప్పుడు, మరిన్ని మంచి పనులను చేస్తే, స్వర్గలోక ప్రాప్తితోబాటు, వచ్చే జన్మలోనూ మరింత ఉన్నతంగా జీవిస్తారు. దేవతలను పూజించే వారు, మరణానంతరం, దేవలోకాలకు చేరతారు. భూత ప్రేతాలను పూజించే వారూ, క్షుద మాంత్రికులూ, హంతకులూ, పిశాచాలుగా మారి, ఈ భూమిపైనే సంచరిస్తూ ఉంటారు. వారికి పునర్జన్మ లభించక, స్వర్గం-నరకం లేని ఒక దుస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఆత్మలే, బలహీన మనస్కులను ఆవహిస్తాయి. దానినే దెయ్యం పట్టడమని కూడా అంటారు.

వాయువు వాసనలను ఒక చోటినుండి మరొక చోటికి తీసుకు పోయినట్టుగా, దేహానికి యజమానైన జీవాత్మ, ఒక శరీరాన్ని త్యజించేటప్పుడు, మనస్సు, ఇంద్రియాలను గ్రహించి, వాటితో పాటు మరొక శరీరాన్ని పొందుతుంది. ఈ అంశానికి తిరుగులేని ఋజువు, అతిచిన్న వయస్సులోనే గణితం, ఈత, డ్రైవింగ్‌ వంటి విషయాలలో అసమాన ప్రతిభను చూపే పిల్లలను చెప్పుకోవచ్చు.

ఇటీవల విజయవాడలో అక్షయ, సువీర్ అనే 5 సంవత్సరాల లోపు చిన్నారులు, కృష్ణానదిని ఈదారు. సరిగ్గా నేల మీదనే అడుగులు వేయలేని చిన్నారులు, గజ ఈతగాళ్ళు మాత్రమే ఈదగలిగే కృష్ణానదిని ఈదటం, పూర్వజన్మ వాసన కాదంటారా! గత జన్మలో రాక్షస ప్రవృత్తి గలవారు, ఈ జన్మలో హత్యలూ, మాన భంగాలూ చేసే సంఘ విద్రోహక శక్తులుగా జన్మిస్తారు. కొందరు విపరీతమైన తిండిబోతులుగానూ, మరి కొందరు విశృంఖలమైన కాముకులుగానూ, కాసుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారే వారిగానూ జన్మించటానికి గల ఏకైక కారణం, వారు గతజన్మలోనూ అలాంటి లక్షణాలను కలిగి ఉండటమే.

ఇక రామాయణ, భాగవత గ్రంధాలను పరిశీలిస్తే, పునర్జన్మలున్నాయని తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వచ్చిన సనక సనందనాదులనే బుషులను, వైకుంఠానికి పోనీయకుండా ఆపిన వైకుంఠ ద్వార పాలకులైన జయవిజయులు, ఆ మునుల శాపానికి గురై, ఆ తరువాత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించి, శ్రీమన్నారాయణుడి చేతిలో మరణించినట్లుగా తెలుస్తోంది. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా జన్మించిన వారిని, వరాహ, నారసింహ అవతారాలు ధరించి, విష్ణువు సంహరించాడు. అలాగే, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణాదులుగా జన్మించిన వారిని, రామావతారం ధరించి సంహరించాడు. మూడవ జన్మలో శిశుపాలుడు, దంతావక్రులుగా జన్మించిన వారిని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సంహరించాడు. సంభవామి యుగేయుగే అన్న గీతా వాక్యం, అన్ని కాలాలలోనూ నిజమైంది. రాబోయే కాలంలోనూ నిజమవుతుంది.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Monday, August 12, 2024

అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయి? Internal Peace


అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయి? TELUGU VOICE

“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలూ, డాబూ పెంచుకుంటే, ఏ నాటికైనా పతనం తప్పదు” అన్నది ఆర్యోక్తి.. ఉదాహరణకు, వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది. సమంగా ఉంటే బంగారం పండుతుంది. అదే అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుని, వరిని మనిషి అనుకుంటే, తగినంత లేకుంటే కరవు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తాను నశింపచేసుకునే రాచ మార్గం! అదే అధికంగా ఉన్న ధనాన్ని, ఉదాహరణగా తీసుకున్న నీటిని తీసివేయడంలాగా ధనం దానం చేస్తే, తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. ఇందుకు అద్భుతమైన ఉదాహరణ, ‘చక్వవేణుడి గాథ’. అసలు ఎవరీ చక్వవేణుడు? ఆయన ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటి?

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/PZVzePvXASc ]


ప్రస్తుత లోకం తీరు మారింది. ఉన్నది తినడం అటుంచి, తింటున్నది ఎదుటి వాడికి చూపిస్తూ గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యం పెరిగింది. తమదగ్గరున్న డబ్బు, బంగారం, కార్లూ, బంగళాలూ, విలాస వస్తువులూ, తిరిగిన ప్రాంతాలూ, అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా, లేదా స్టేటస్ లలో చూపాలి. చీరలూ, నగలూ ధరించి, షోకేసులలో బొమ్మల్లా ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపూ, నవ్వూ, ప్రదర్శన, అంతా పటాటోపమే. వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి ఇతరులు అనుకరించ కూడదు. మరి అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయని అడిగేవారు, తప్పనిసరిగా చక్వవేణ మహారాజు గాధను తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి!

ఒకానొకప్పుడు చక్వవేణుడనే ధర్మాత్ముడూ, సదాచార పరాయణుడూ, సత్యవాదీ, దయామయుడూ, మహాజ్ఞానీ అయిన మహారాజుండేవాడు. తన మీద తాను ఆధారపడి, కష్టపడి, తనకు అవసరమైనది సంపాదించుకునే వాడు. త్యాగ శీలుడు, విరాగి, జ్ఞాని, భక్తుడు, తేజశ్శాలి, తపోమూర్తి, ఉన్నత శ్రేణికి చెందిన అనుభవశాలియైన మహాపురుషుడాయన. రాజ్య సంబంధమైన ద్రవ్యాన్ని తన కోసము, తన భార్య కోసము వినియోగించుకోవడం దోషంగా భావించి, దానిని ముట్టుకోకుండా, ఆ డబ్బుకు దూరంగా ఉండే వాడు.

పన్నుల రూపంలో ప్రజలనుండి వసూలు చేసిన ద్రవ్యాన్ని, వారి క్షేమం కోసమే వినియోగించే వాడు. అతడు రాజ్య కార్యాలను, ప్రతిఫలాపేక్షనూ, అభిమానాన్నీ వర్జించి, తనువునూ, మనస్సునూ లగ్నం చేసి నిర్వర్తించే వాడు. ప్రజలమీద అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. రామ రాజ్యంలో లాగా, అతని రాజ్యం లోని ప్రజలందరూ, దుఃఖమంటే ఏమిటో తెలియక, అన్ని రకాల సుఖ సంపదలతో ఎంతో సంతోషంగా ఉండే వారు.

మహారాజు తనూ, తన భార్యా జీవించడానికి, రాజ్యానికి సంబంధించిన డబ్బు ముట్టకుండా, ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకునే వారు. ఆ వ్యవసాయానికి కూడా, ఎద్దులను ఉపయోగించే వారు కాదు. ఎద్దులకు బదులుగా, రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లే వాడు. తమ పొలంలో పండిన పత్తితో బట్టలు నేసుకుని, వాటినే ధరించే వారు. తమ పొలంలో పండిన ఆహారమే తినే వారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు. అతడు రాజ్య ద్రవ్యాన్ని వినియోగించి, ఆమెకు ఆభరణాలేవీ చేయించే వాడు కాదు.

వారి పొలంలో పండే పంట, వారికి సాధారణమైన అన్న వస్త్రాదులతో, కాలం గడపడానికి మాత్రమే సరిపోతూ ఉండేది. ఒక్క పొలం పనులకే కాక, ఆయన రాజ్య కార్యాల కోసం కూడా కాలాన్ని వినియోగిస్తూ ఉండేవాడు. ఆయన జీవనం, సదాచార సంపదతో, సాదాసీదాగా బ్రతికే ఒక రైతు జీవనాన్ని పోలి ఉండేది. ప్రతి దినమూ ఆరు గంటల కాలము నిద్రకు పోగా, మిగిలిన కాలమంతా అతడు దేవుడిని పూజించడం, ఇతరులకు సహాయం చేయడం, రాజ్య పనులు చూసుకోవడం, పొలం పనులు చేసుకోవడం వంటి వాటిలో, మునిగి తేలుతూ ఉండేవాడు.

అతడికి అన్ని జీవుల పట్లా సమానత్వ భావన ఉండేది. జంతువుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండే వాడు. అన్ని రకాల జీవులనూ, ప్రాణులనూ, పరమాత్మ స్వరూపములుగా భావించే వాడు. అందరికీ సమానమైన ప్రేమాభిమానాలతో సేవలు చేసే వాడు. అతడికి ఏదైనా అవసరం ఏర్పడినా, ఎవ్వరినీ ఏదీ అడిగే వాడు కాదు. సహజంగానే అతడిలో దేని మీదా వ్యామోహం ఉండేది కాదు. సేవకుల చేత కానీ, రాజ్య సంబంధమైన పనులు చేసే వారి చేత కానీ, తాను ఏ పనీ చేయించుకునే వాడు కాడు. అతడు ఏ పని చేసినా, ఆసక్తినీ, అహంకారాన్నీ విడిచిపెట్టి, ఎంతో ఉత్సాహంతోనూ, ధైర్యంతోనూ చేస్తూ ఉండేవాడు.

ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టడు. కానీ, తను సామ్రాట్టుగనుక, దుష్టులూ, బలవంతులూ, అత్యాచారులూ అయిన రాజుల దగ్గర నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు కదా! అని అనుకున్నాడు. తన మంత్రిని పిలిపించి, రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, తాను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించినట్లుగా చెప్పి తీసుకురమ్మని, అనుజ్ఞ ఇచ్చాడు.

మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు, అతడిని పరిహాసం చేసి పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా ఆమె, ‘స్వామీ! మీరు పొరపాటు చేశారు. వారు అడిగిన బంగారాన్ని ఇచ్చి వేయ వలసింది. చక్వవేణుడి మహిమను మీకు చూపుతాను..’ అని అన్నది. ఆమె పక్షులకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి’ అని అన్నది. అవి ఎంతమాత్రం లెక్క చెయ్యక తిన సాగాయి. వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన.. ఇక గింజలు ముట్టకండి’ అని అన్న వెంటనే, పావురాలన్నీ ఎగిరిపోయాయి. ఒక్క చెవిటి పావురం మాత్రం, ఆమె అన్నది వినబడక గింజ తినగానే, తల తెగి క్రింద పడింది. కొద్దిసేపు ఆగిన రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను. గింజలు తినండి’ అన్న మరు నిముషం, పక్షులు మళ్ళీ వాలి, గింజలు తిన సాగాయి. ‘చూసారా స్వామీ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ’ అని అన్నది మండోదరి. అయినా పక్షులను అల్ప జీవులుగా, తేలికగా కొట్టి పారేశాడు రావణుడు.

చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుకతో లంకా నగర నమూనాను చేసి, ఒక వినోదం చూపుతానని రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపున్న బురుజులూ, ప్రాకారాలనూ పడగొట్టాడు. వెంటనే లంకలో నిజంగా అమరి ఉన్న తూర్పు వైపు బురుజూ, ప్రాకారం కూలి పోయాయి. అది చూసి హతాశుడయ్యాడు రావణుడు. ఆ తరువాత మంత్రి, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, నమూనాలోని తూర్పువైపు స్థూపాలను పడగొట్టగానే, నిజ లంకాపురి స్థూపాలు కూలి పోయాయి. ఇదంతా చూసి బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి పంపాడు.

మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వబోగా, అతడు అది ఎలా తెచ్చాడో చెప్పమని అడిగాడు. మంత్రి చెప్పినది విన్న రాణి ఆశ్చర్యచకితురాలయ్యింది. తన భర్త పవిత్ర వర్తనం యొక్క మహిమ తెలుసుకున్న ఆమె, బంగారం వద్దన్నది. ఆ బంగారం తిరిగి రావణుడికి పంపివేయ బడింది. అన్ని లోకాలనూ ప్రభావితం చేయగల చక్వవేణుడి త్యాగ బుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి పంపి వేశాడు.

ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి.. క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలుగజేస్తుంది. అందుకే దురభ్యాసాలూ, మత్తు పదార్ధాలూ, క్రీడా వినోదాలూ, ఖరీదైన ఆడంబరాలతో గడిపే వారి సాంగత్యానికి దూరంగా ఉండాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విష తుల్యమే. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించే పిడికెడు అన్నమైనా అమృత తుల్యమే. దానం, దయ, ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది!

ఇదే సత్యం! ఇదే నిత్యం! ఇదే శాశ్వతం!

Monday, August 5, 2024

మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం! Rudraprashna - రుద్రప్రశ్న!


అందరికీ శ్రావణమాసారంభ శుభాభినందనలు 🙏 TELUGU VOICE
మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం!

శ్రీ రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. శత రుద్రీయం, యజుర్వేదంలో భాగం. ఇది శివునికి అంకితం చేయబడిన శ్లోకం. మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం. ఇది జన్మకూ, మృత్యువుకూ అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేదీ, మరల దానిని తీసుకుపోయేది కూడా, ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. వేద శ్లోకాలలో గొప్పదైన రుద్రం, అన్ని రకాల ప్రయోజనాల కోసం, అన్ని దోషాలనూ, కష్టాలనూ తొలగించడానికి సహకరిస్తుంది. పూజలు, హోమాలలో, దీనిని వేద పండితులు పఠిస్తారు. శ్రీ రుద్రం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం, యజుర్వేదంలోని 16వ అధ్యాయంలోనిది. 'నమో' అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల, నమకం అని పిలుస్తారు. రెండవ భాగం, యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోనిది. 'చమే' అనే పదాలను పదే పదే ఉపయోగించడం వల్ల, దీనిని చమకం అని పిలుస్తారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2GuNRVW62rk ]


నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రయుంజనో బ్రహ్మలోకే మహీయతే ||

నమకం చమకం ఎవరైతే మూడు సార్లు, పురుష సూక్తంతో ప్రతి దినం చదువుతారో, వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.

నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒక్కో భాగాన్ని, “అనువాకం” అని అంటారు. మొదటి అనువాకం, పరమ శివుడిని తన రౌద్ర రూపాన్ని వదిలి, తన అనుచరులనూ, ఆయుధాలనూ త్యజించమని, ప్రసన్నం చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయదలచమని ప్రార్ధించే భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేసే విధానాలు కూడా కనిపిస్తాయి.

మొదటి అనువాకం: తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్నీ, దైవం యొక్క ఆశీర్వచనాన్నీ పొందేటట్లుగా చేసి, క్షామం, భయం పోయేటట్లు చేసి, ఆహార, గో సంపద సమృద్ధి గావించి, గో సంపదను చావునుండీ, ఇతర జంతువులనుండీ, జబ్బులనుండీ కాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనం చేస్తుంది.

రెండవ అనువాకం: ప్రకృతిలో, సర్వ ఔషధాలలో, సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన. శత్రు వినాశనానికీ, సంపద, మరియు రాజ్యప్రాప్తికీ, జ్ఞాన సాధనకూ, ఈ అనువాకాన్ని చదువుతారు.

మూడవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణించబడింది. ఆయన సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహా స్వరూపాన్ని అర్ధం చేసుకోక, నిమిత్త బుద్ధిని అలవరుచుకుంటాడు. ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి, జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టిస్తాడు. ఈ అనువాకం, వ్యాధి నివారణకు కూడా చదువుతారు.

నాలుగవ అనువాకం: ఇందులో రుద్రుడు సృష్టి కర్త, కారకుడు. చిన్నా, పెద్దా ప్రతీదీ ఆయన చేసిన సృష్టే. ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.

అయిదవ అనువాకం: ఈ అనువాకంలో, పారే నీట ఉండే రూపంగా, రుద్రుడు కొనియాడబడతాడు. ఆయన పంచ తత్వాలు వర్ణించబడతాయి. అంటే, సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

ఆరవ అనువాకం: ఇందులో రుద్రుడు కాలరూపుడు. ఆయన అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు, ఆస్తుల పెంపుకూ, శత్రువుల మీద విజయానికీ, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికీ, సుఖ ప్రసవానికీ, జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికీ, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.

ఏడవ అనువాకం: నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకూ, ఆరోగ్యానికీ, ఆస్తినీ, వారసులను పొందడానికీ, పశు సంపద, వస్త్రాలు, భూములు, ఆయుష్షు, మొక్షం కోసం కూడా చదువుతారు.

ఎనిమిదవ అనువాకం: ఇందులో శివుడు, ఇతర దేవతల కారకుడిగానూ, వారికి శక్తి ప్రదాతగానూ వర్ణింపబడ్డాడు. ఆయన అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలనూ పోగొట్టేవాడు. శత్రువులను నాశనము చేసి, సామ్రాజ్యాన్ని సాధించడానికి, ఈ అనువాకాన్ని చదువుతారు.

తొమ్మిదవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుని శక్తీ, ప్రకాశం, సకల దేవతలకూ శక్తినిచ్చేవిగా ప్రస్తుతించ బడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులనూ శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారం కోసం, మంచి సహచరి కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

పదవ అనువాకం: ఈ అనువాకంలో మరలా, రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన అమ్ములను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై, ప్రసన్న వదనంతో దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం, వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టటానికీ, భైరవ దర్శనార్ధమై, అన్నిరకాల భయాలను పోగొట్టటానికీ, అన్ని పాపాలనూ పోగొట్టటానికీ చదువుతారు.

పదకొండవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుని గొప్పదనాన్ని ప్రస్తుతించి, ఆయన కరుణా ప్రాప్తికై, నిర్బంధమైన నమస్సులు అర్పించబడతాయి.

ఈ అనువాకాన్ని సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్య వృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికై చదువుతారు.

ఇక చమకం విశిష్టత: నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి, దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది, చమకం. ఇది ప్రతి ఒక్కరికీ పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గంలో, ప్రతి పనినీ మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందాన్ని కలుగచేసే మంత్రమిది. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి, ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం ఆయన నుండి ఉద్భవించినదే గనుక, మోక్షాకాంక్ష దైవత్వానికి సూచనే..

మరొక్క విజ్ఞప్తి.. చాలా మందికి సహజంగా కలిగే సందేహం ప్రకారం, ఇక్కడ మరణాన్ని అధిగమించడం అంటే, చిరంజీవిత్వం పొందడం కాదు.. అకాల మృత్యువును జయించడం అనే వాస్తవాన్ని గమనించాలి.

🚩  ఓం నమః శివాయ 🙏

Monday, July 29, 2024

Mahavatar Babaji's Cosmic Cobra Breath | మహావతార్‌ బాబాజీ – ‘విశ్వ సర్ప శ్వాస’ ప్రక్రియ!


మహావతార్‌ బాబాజీ – ‘విశ్వసర్పశ్వాస’!? TELUGU VOICE
కుండలినీ శక్తిని నిద్ర లేపటానికి ఉపయోగించే తాంత్రిక యోగమార్గం ఏమిటో తెలుసా?

ఈ అనంత విశ్వంలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలూ, మనిషి మేధస్సుకందని విశేషాలూ అనంతం. మరణం లేని మానవులూ.. మరణాన్ని జయించే యోగాసనాలూ.. ఆ మహా యోగి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేకొద్దీ, సాధారణ మానవులకు నమ్మశక్యంకాని అటువంటి అద్భుతాలు కోకొల్లలు. ఆయనే మహావతార్ బాబాజీ. సుమారు 2000 సంవత్సరాలుగా, సజీవంగా ఉన్న సిద్ధ యోగి బాబాజీ గురించీ, ఆయన జీవిత విశేషాలతో, మానవాళి శ్రేయస్సుకోసం ఆయన అందించిన ‘క్రియా యోగం’ గురించీ, గతంలో మనం చేసిన వీడియోల Playlist, క్రింద description లో పొందుపరిచాను. చూడని వారు తప్పక చూడండి. ఇక ఈ రోజుటి మన వీడియోలో, ఆ సిద్ధ యోగి మనకోసం అందించిన మరో అద్భుతమైన ‘విశ్వ సర్ప శ్వాస’ గురించి తెలుసుకుని, గురవు ద్వారా నేర్చుకుని తరిద్దాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/W_hczzQyXJY ]


ఈనాటికీ హిమాలయాలలో అదృశ్యరూపుడిగా సంచరిస్తున్నాడని చెప్పబడుతున్న మహావతార్‌ బాబాజీ, మానవ జాతి అభ్యుదయం కోసం అందించిన ఒక అపూర్వమైన వరం “క్రియా యోగం”. క్రియా యోగం అంటే, ఎవరిని వారు తెలుసుకోవటం అని అర్ధం. నిజానికి క్రియా యోగం ఒక సైన్స్‌ అని చెప్పాలి. ఈ క్రియాయోగంలో అత్యున్నత స్థాయికి చెందిన ఒక యోగ ప్రక్రియను “విశ్వ సర్ప శ్వాస ప్రక్రియ అనీ, Science పరంగా కాస్మిక్‌ కోబ్రా బ్రీత్‌” అనీ పిలుస్తారు. అతి పవిత్రమయిన, మరియు అత్యంత రహస్యమైన ఈ శ్వాస ప్రక్రియను, మహావతార్‌ బాబాజీ తన శిష్యులకు బోధించారు. ఆ తరువాతి కాలంలో, ఆ శిష్యులు తమ శిష్యులకు ఈ ప్రక్రియను అందజేస్తూ వచ్చారు.

మానవ శరీరంలో దాగి ఉండే శృంగార సామర్ధ్యాన్ని ఊర్ధ్వరేతస్సుగా, కుండలినీ శక్తిని నిద్రలేపటం కోసం ఉపయోగించే ఒక తాంత్రిక యోగమార్గాన్ని, విశ్వ సర్ప శ్వాస, లేక కాస్మిక్‌ కోబ్రా బ్రీత్ అని పిలుస్తారు. వేలాది సంవత్సరాలుగా భారతదేశానికి చెందిన ఎందరో మహర్షులు, ఈ విధానం ద్వారా కుండలినీ సాక్షాత్కారాన్ని పొందారని తెలుస్తోంది. ఈ విధానంలో 7 స్థాయిలుంటాయి. ఒక్క గురువు ద్వారా మాత్రమే, ఈ శ్వాస విధానాన్ని నేర్చుకోవాలని తెలుస్తోంది.

సాధారణ మానవులు శృంగారంలో పాల్గొన్నప్పుడు, వారిలోని శృంగార శక్తి వీర్యం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఫలితంగా, మానవులు బలహీన పడతారు. అయితే, యోగులు ఆ శృంగార శక్తిని, తమ శరీరంలోని పై భాగాలకు పంపిస్తారు. దీనినే ఊర్ధ్వ రేతస్‌ అని పిలుస్తారు. ఈ ‘విశ్వ సర్ప శ్వాస’ అనే ప్రక్రియ, గురువు నుండి శిష్యుడికి తెలుస్తుంది. ఈ ప్రక్రియ ఎక్కడా వ్రాత రూపంలో కనబడదు. ‘విశ్వ సర్ప శ్వాస’ అనే యోగ ప్రక్రియలో, మొదటి స్థాయిలోనే మానవుడి నుదిటి భాగంలో ఉన్న “అజ్ఞా చక్రాన్ని”, చాలా వేగంగా తెరిచే విధానం నేర్పబడుతుంది. దీనినే మూడవ కన్ను అనికూడా పిలుస్తారు. ఇక ఈ విశ్వ సర్ప శ్వాస ప్రక్రియలోని రెండవ స్థాయిలో, మనిషిలో ఉండే స్త్రీ / పురుష శక్తులను సమతౌల్యంలోకి తీసుకువచ్చి, ఆపై దిగువగా ఉండే మూడు శక్తి కేంద్రాలైన చక్రాలను శుద్ధిచేసే పద్ధతి బోధించ బడుతుంది.

ఇక మానవునిలోని హృదయ ప్రాంతంలో, మరియు కంఠ ప్రాంతంలో ఉండే 4, 5 చక్రాలను తెరచి, ఆపై వెన్నెముక గుండా వెళ్ళే కేంద్ర మార్గాన్ని తెరచి, ఆ మార్గం గుండా, కుండలినీ శక్తిని పైకి వెళ్ళేలా చేసే ప్రక్రియ, “విశ్వ సర్ప శ్వాస” మూడవ స్థాయిలో బోధిస్తారు. నడి నెత్తిన ఉండే ఏడవ చక్రాన్ని తెరచి, ఆ పై జీవాత్మతో పరమాత్మను కలిపే ప్రక్రియను, “విశ్వ సర్ప శ్వాస” నాలుగవ స్థాయిలో నేర్పిస్తారు. మొత్తంగా ఉన్న 7 స్థాయిలలో, 4 స్థాయిలు గురువు ద్వారా నేర్చుకోవాలి. మిగిలిన మూడు స్థాయిలను, శిష్యుడు తన వ్యక్తిగత సాధన ద్వారా సాధించాల్సి ఉంటుంది.

మహావతార్‌ బాబాజీ ప్రబోధించిన “క్రియాయోగం”లో 5 విభాగాలుంటాయి. అవి.., 
1. క్రియా హఠయోగం 2. క్రియా కుండలినీ ప్రాణాయామం 3. క్రియా ధ్యాన యోగం 4. క్రియా మంత్ర యోగం 5. క్రియా భక్తి యోగం..

మానవాళి శ్రేయస్సుకై మహావతార్ బాబాజీ అందించిన ‘క్రియా యోగం’ గురించీ, పైన ప్రస్తావించబడిన సప్త చక్రాల గురించీ, గతంలో మనం చేసిన వీడియోల Playlists, ఈ వీడియో క్రింద description లో పొందుపరిచాను. చూడని వారు తప్పక చూసి మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక్క విషయం.. గతంలో చాలామంది, ఈ విద్యలను నేర్చుకునే విధంగా వీడియోలు చేయమని కోరారు. అందరూ గమనించాల్సిన ముఖ్యమైన విషయం, ఇవన్నీ గురుముఖత నేర్చుకోవలసినవే.. ఔత్సాహికులు గురువులకొరకు స్వయంగా అన్వేషణలో పడక తప్పదు.

🚩  ఓం క్రియా బాబాజీ నమః ఓం 🙏

Monday, July 22, 2024

గరుడ పురాణం - మనిషి పాపపుణ్యాలను లెక్కించే శ్రవణులు - Garuda Puranam


‘గరుడ పురాణం’ ప్రకారం.. మనిషి పాపపుణ్యాలను లెక్కించే ‘శ్రవణులు’!? TELUGU VOICE

ఈ కలియుగంలో, అన్ని పురాణాలలోకీ ప్రముఖమైనవిగా పరిగణించబడేవి, మూడు. వాటిలో ప్రధానదీ, ప్రజలకు శుభాలనందించేదీ, శ్రీమద్ భాగవతం. అందుకే అన్ని పురాణాలలో భాగవతం, అత్యున్నతమైనది. తరువాత విష్ణు పురాణం, ఆ తరువాత, గరుడ పురాణంగా చెప్పవచ్చు. అటువంటి గరుడ పురాణంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను వీడియోలుగా, ఇది వరకు కొన్నింటిని అందించి ఉన్నాను. వాటి playlist ను, వీడియో క్రింద description లో పొందుపరుస్తున్నాను. మనిషి సన్మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడే, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి స్వయంగా తెలియజేసిన మరికొన్ని విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ATV1ynLPOGs ]


“జ్ఞానసాగరా! శ్రీ మహావిష్ణూ! యమలోకంలో శ్రవణులనే వారుంటారనీ, వారు సర్వజ్ఞులనీ విని ఉన్నాను. వారిని గూర్చి తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను.” అని అన్న గరుత్మంతుడితో విష్ణుభగవానుడు.. “గరుడా! ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినపుడు, నేను దానిని ఆత్మ లీనం చేసుకుని, పాల సముద్రంలో శయనించాను. అప్పుడు నా నాభికమలం నుండి బ్రహ్మపుట్టి, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తిమంతుడై, ఏకాకారం చెందిన సృష్టిలోని ప్రాణులను, నాలుగు ప్రకారాలుగా విడగొట్టాడు. తరువాత బ్రహ్మగావించిన సృష్టిని పాలించే బాధ్యతను నేను స్వీకరించాను. ఆ తరువాత సంహారమూర్తి రుద్రుడుదయించాడు. అనంతరం సమస్త చరాచర జగత్తులోనూ ప్రాణాధారమై ప్రవహించే వాయువూ, ఆత్యంత తేజస్వి సూర్యదేవుడూ, చిత్రగుప్త సహితుడై యమధర్మ రాజూ ప్రకటితులయ్యారు..”

సృష్టిలోని ప్రాణులను విడగొట్టిన బ్రహ్మ, మరల తపస్సు చేశాడు. కొన్ని వందల ఏళ్ళు ఆయన అలాగే, నాభి కమలంలో తపస్సమాధిలోనే ఉండిపోయాడు. సృష్టిని మాత్రం అలాగే కొనసాగించాలని, లోపలి నుండే ఆదేశించాడు. అప్పుడు బ్రహ్మతో విష్ణు రుద్రాదులు, తమకు లోక వ్యవహారమెలా నడుస్తుందో, ఎవరే పాప పుణ్యాలు చేస్తున్నారో తెలియదనీ, దానికి సంబంధించిన ఏర్పాటేదో బ్రహ్మయే చేయాలనీ విన్నవించారు.

తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో, సర్వశక్తులనూ కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని, బ్రహ్మ వారందరికీ కలిగించాడు. వారంతా అలా చాలాకాలం పాటు చేసిన తరువాత, బ్రహ్మ తన పుత్రులుగా పన్నెండు మంది అమిత తేజస్వులూ, విశాల నేత్రులూ అయిన దేవతలను సృష్టించాడు. వారికి ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా, ఎవరేం చేసినా, ఎవరు ఏమన్నా వినే శక్తినిచ్చాడు. ఈ విశేషజ్ఞానం వల్ల, ఆ బ్రహ్మపుత్రులను శ్రవణులన్నారు. వీరి నివాసం, ఆకాశం. అక్కడి నుండే అందరినీ చూస్తూ, వింటూ, అవసరమైనప్పుడు యమధర్మరాజు, లేదా చిత్రగుప్తల వద్దకు వచ్చి, వారికి కావలసిన వివరాలనందిస్తారు. ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన సర్వకర్మల సారమూ, వివేచన సహితంగా, ధర్మరాజుకు సమర్పించ బడుతుంది.

ఓయీ వైనతేయా! సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు నాలుగే. అవే, ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. ఉత్తమ ప్రకృతి గల ప్రాజ్ఞి, ధర్మ మార్గంలో నడుస్తాడు. ధనధాన్యాలను సంపాదించినా, దానానికే వినియోగించిన వారు, విమానంలో పరలోకాలకు చేరతారు. మోక్షాకాంక్షతోనే జీవితంలో ప్రతి పనినీ చేసిన వారు, తమ దేహాంతంలో హంసల విమానంపై పరలోకానికి పయనమవుతారు. ఉన్న దాని తోనే బ్రతుకుతూ, అప్పుడప్పుడైనా ఉన్నంతలో యాచకులను సంతోష పెట్టిన వారిని, దేవ దూతలు గుర్రాలపై తీసుకుని పోతారు. ఏ పుణ్యమూ, ధర్మమూ చేయకుండానే బ్రతుకు వెళ్లబెట్టిన వారిని, ఇది వరకు నువ్వ విన్నట్లుగా, యమదూతలు నడిపించుకుంటూ, ఏ అసిపత్ర వనానికో తీసుకు పోతారు. శ్రవణులను భక్తితో, పక్వాన్నం, వర్ధని, జలపాత్రల ద్వారా పూజించిన వారికి, నేను స్వయంగా ప్రసన్నుడనై, ఏ దేవతలూ ఇవ్వలేనన్ని వరాలను కురిపిస్తాను. (అధ్యాయం - 17)

పక్షింద్రా! ఈ శ్రవణులు చెప్పినదంతా విన్న తరువాత, చిత్రగుప్తుడు కొన్ని క్షణాలపాటు ధ్యాన నిమగ్నుడై, ఆ మనిషి రాత్రింబవళ్ళు గావించిన పాపపుణ్యాల ఫలాన్ని, యమధర్మ రాజుకు విన్నవిస్తాడు. గరుడా! మనిషి మాట, తనువు, మనస్సులతో చేసే ప్రతి కర్మకీ, ఫలాన్ని అనుభవించ వలసినదే. నేడు నీవు విన్న ఈ విషయాలను, రేపు ప్రపంచమంతా తెలుసుకుంటుంది. అన్నదానం, దీపదానం చేసిన వారు, మహామార్గంలో సుఖ పూర్వకంగా పయనిస్తారు.

కార్తీక కృష్ణ చతుర్దశి నాటి రాత్రి చేసే దీపదానం, సర్వసుఖకారి. ఇప్పుడొకసారి సంక్షిప్తంగా దాన ఫలాలను చెబుతాను విను.. వృషోత్సర్గ పుణ్యం వల్ల, మనిషి పితృలోకానికి వెళతాడు. జలపూర్ణ ఘట దానం వల్ల, యమదూతలు సంతోషిస్తారు. పదకొండవ రోజున శయ్యాదానం చేయడం వల్ల, మనిషి విమానమెక్కి, స్వర్గలోకానికి చేరతాడు. విశేషించి, పన్నెండవ రోజు అన్ని ప్రకారాల దానాలనూ చేయాలి. పదమూడు పద దానాలను చేసినవారు, పితరులూ, పుత్రులూ కూడా, వాటి సహాయంతో మహామార్గాన్ని సుఖంగా దాటి వెళ్ళగలరు. ఎవరి భాగ్యమెలా వున్నదో, వారి మార్గ సుఖమును బట్టి తేలిపోతుంది. తన కొడుకు తాను పోయినప్పుడెలాగూ చేస్తాడు కదా అని సరిపెట్టుకోకుండా, తానే, తన జీవిత కాలంలోనే, స్వస్థ చిత్తుడై, అన్ని రకాల దానాలనూ చేసినవాడు, సర్వత్రా సుఖ పడతాడు.

విష్ణు భగవానుడి ఈ మాటలు విన్న గరుత్మంతుడు, “భగవాన్‌! పదమూడు పద దానాలంటే ఏమిటో తెలియజేయండి” అని అడిగాడు. దానికి శ్రీ మహావిష్ణువు, “ఛత్రం, పాదుక, వస్త్రం, ముద్రిక, కమండలువు, ఆసనం, భోజన పాత్ర, మరొక ఆసనం, జలపాత్ర, అన్నం, భోజన సామగ్రి, నెయ్యి, యజ్ఞోపవీతం.. ఈ పదమూడింటినీ పద దానాలన్నారు. ఇవన్నీ మృతుని నారకీయ మార్గంలో ఉపయోగపడి, ప్రేతానికి సుఖాన్నిస్తాయి. అంతేగాకుండా, దానమిచ్చిన వానికి కూడా గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తాయి.

గృహ్ణాతి వరుణో దానం మమహస్తే ప్రయచ్ఛతి |
అహంచ భాస్కరే దేవో భాస్కరాత్‌ సో అశ్నుతే సుఖం ॥ (18/27)

మృతుని బంధువు, అతని ఇంటి వద్ద చేసిన దానాన్ని, వరుణుడు స్వీకరించి విష్ణువు చేతిలో పెట్టగా, దానిని భాస్కరుడు సేకరించి, ప్రేతం సుఖించేలా చూస్తాడు. ఇది వరకే చెప్పబడిన పదహారు పురాలనూ దాటి, యమునికి దగ్గరగానున్న బహుభీతికర నామక పురంలో, అంతవరకు హస్తం పరిమాణంలో వున్న శరీరం, చిటికెన వేలంత అయిపోగా, జీవుడు గాలిలో ఎగురుతూ, అక్కడక్కడ శమీపత్రాలపై కూర్చుంటూ, యముని వద్దకూ, ఆ తరువాత ఆయనతో కలసి, చిత్రగుప్త పురీ చేరుకుంటాడు.

ఆ పురి ఇరవై యోజనాలలో పరుచుకుని వుంటుంది. అక్కడుండే కాయస్థులనే దేవయోని జనితులు, అన్ని రకాల ప్రాణుల పాప-పుణ్యాలనూ పూర్తిగా గ్రహించి వుంటారు. ఇది వరకూ నేను చెప్పినట్లుగానే, యమధర్మరాజు పాపులకొకలాగా కనిపిస్తే, పుణ్యులకు మరొక విధంగా దర్శనమిస్తాడు. దానములు చేసిన వారిని, ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు.” అని గరుడుడికి శ్రీమహావిష్ణువు వివరించాడు. ఈ విషయాలన్నీ తెలుసుకుని, మనుష్యులందరూ సన్మార్గంలో నడుచుకోవాలన్నదే నా ఆకాంక్ష..

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Sunday, July 21, 2024

గురు పౌర్ణమి - శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు - Guru Paurnami 2024


ఈ రోజే '21 జులై, 2024' గురు పౌర్ణమి.. TELUGU VOICE
అందరికీ శ్రీ వ్యాస పూర్ణిమ / గురు పూర్ణిమ శుభాకాంక్షలు 🙏🏻

శ్రీ వ్యాస స్తుతి..

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్‌ ।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్‌ ।।
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।
నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ।।

నారాయణుడు, ఆయన నాభి కమలం నుండి జన్మించిన బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రుడు వశిష్ఠుడు, వశిష్ఠుని సంతానమైన శక్తి, శక్తి మహర్షి పుత్రుడు పరాశరుడు, పరాశరాత్మజుడు వ్యాసుడు, ఆయన కొడుకు పరమ భాగవతోత్తముడైన శుకుడు, ఆ పరంపరలో గౌడపాదాచార్యులు, గోవింద యోగి మొదలైన వారు మన గురువులు. ఇది ఆర్ష గురు పరంపర. వీరిలో వ్యాస మహర్షి సాక్షాత్‌ విష్ణు రూపుడే. ఆయనకు నాలుగు ముఖాలు లేవు కానీ, బ్రహ్మ స్వరూపుడే. అటువంటి వ్యాస భగవానునికి నమస్కారం 🙏🏻

పరమపావనమైన ఆషాఢ పూర్ణిమ పర్వదినం ఇది. పూర్ణిమ అనగానే ఆధ్యాత్మిక సాధనకి చాలా యోగ్యమైనది. అందునా ఈ ఆషాఢ పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది గురు పూర్ణిమ అని ప్రసిద్ధి. ఇక్కడి నుంచి చాతుర్మాసాలలో వచ్చే పూర్ణిమలు అన్నీ, జ్ఞాన ప్రధానమైనటువంటి పూర్ణిమలు. జ్ఞానము అనగానే, ఆధ్యాత్మ జ్ఞానమే జ్ఞానము. సృష్టిలో విద్యలు ఎన్నైనా ఉండవచ్చు గాక! కానీ, “ఆధ్యాత్మ విద్యా విద్యానాం” అని భగవద్గీతలో చెప్పినట్లుగా, విద్యలన్నింటిలోకీ ఆధ్యాత్మ విద్య చాలా గొప్పది. మిగిలినవన్నీ భౌతికమైన సుఖదుఃఖాలకు మాత్రమే పరిమితమై ఉంటాయి. జీవుడిని తరింప జేసే విద్య, ఆధ్యాత్మ విద్య. అందుకే ఆధ్యాత్మకం ఎవరు బోధిస్తారో, అతనిని సద్గురువుగా భావన చేసి, ఆరాధించాలి. అసలు ఒక్క అక్షరం నేర్పిన వాడినైనా గురువుగా గౌరవించవలసిందే అని, శాస్త్రం మనకి చెబతున్నది. అందుకు విద్యలు, పరా విద్యలు, అపరా విద్యలని రెండు విధములుగా చెప్పబడుతూ ఉంటాయి. అపరా విద్యలంటే, లౌకికమైన విద్యలన్నీ అందులోకి వస్తాయి. పరావిద్య అంటే, బ్రహ్మవిద్య, మోక్షానికి పనికివచ్చే ఆధ్యాత్మ విద్య. ఈ రెండు విద్యలు చెప్పేవాళ్లూ గురువులే. ప్రతి వారినీ గౌరవించాలి. అందునా పరా విద్యను చెప్పిన వారిని భగవంతునితో సమానంగా ఆరాధించుకోవాలి.

అందుకు గురువు ఆరాధనలో..

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ।।

నిజానికి ఈ శ్లోకం భారతీయులందరికీ ఇంచుమించు వచ్చు. అంత ప్రసిద్ధి చెందినది. దీనిని బట్టి గురువును ఎలా భావించాలి అంటే, బ్రహ్మవిష్ణుశివాత్మకమైన పరబ్రహ్మగా భావించి, ఆరాధించాలని దీని యొక్క భావం. అయితే, బ్రహ్మవిష్ణుశివ స్వరూపం గురువులో కనబడుతుంది. అందుకు భారతీయ సంస్కృతి ప్రకారం, సృష్టి స్థితి లయలకు హేతువైన పరమాత్మ ఒకడున్నాడు. ఆయననే పరబ్రహ్మ అంటారు. పరబ్రహ్మ అంటే, అన్నింటికీ అతీతమై, అన్నింటినీ మించిపోయి ఉండే తత్త్వము, పరబ్రహ్మ తత్త్వం. అదే సృష్టి, స్థితి, లయలు చేసేటప్పుడు, బ్రహ్మ విష్ణు శివాత్మకంగా ఉన్నది. కనుక వీరు ముగ్గురూ ఒకే పరబ్రహ్మము యొక్క స్వరూపము. అలాంటి స్వరూపమే గురువు అని భావించాలి. ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటని మనం గమనించినట్లైతే, బ్రహ్మ అనగా సృష్టికర్త. విష్ణువు అనగా స్థితికర్త. రుద్రుడు అంటే లయకర్త, లీనము చేయువాడని అర్థం. అంటే, మరుగు పరచు వాడు, లీనము చేయువాడని. ఏదైనా పని ప్రారంభించడం సృష్టి అనుకుంటే, ఆ పనిని చక్కగా కొనసాగించడం స్థితి అనుకుంటే, దానిని పూర్తి చేసి లయం పొందటం లయం. ఈమూడూ ఒకపనిలో మూడు భాగాలు. ఆ మూడూ ఒకే చైతన్యం వల్ల నడుస్తాయి. కానీ, ఆ పనియొక్క స్థితిని బట్టి, మూడు పేర్లు.

అదేవిధంగా, మామూలు మానవుణ్ణి వివేక వైరాగ్యాలు కలిగించి, జ్ఞానాన్ని ఇచ్చి, ఒక జ్ఞాన శరీరాన్ని సృష్టిస్టారు గురువులు. అప్పుడతడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే, మనలో జ్ఞానాన్ని సృష్టించాడతను. ఆ సృష్టించిన వివేకాన్ని, జ్ఞానాన్ని, క్రమంగా మార్గం చూపిస్తూ పెంచి పోషిస్తాడు. ఆ జ్ఞానానికి స్థితి కల్పిస్తాడు. అప్పుడతను విష్ణువు. క్రమంగా ఈ జ్ఞానం ద్వారా ఈ జీవుడిని పరమాత్మలో లయం చేయిస్తాడు. ఆ లయం చేసేటప్పుడు అతడే శివుడయ్యాడు. కనుక జ్ఞానాన్ని పుట్టించి, పెంచి పరమాత్మలో లయం చేసేటటువంటి గురువు, బ్రహ్మ విష్ణు శివాత్మకుడని భావించాలి. ఇది మన శాస్త్రం చెబుతున్నటువంటి గొప్ప భావం. అందుకు ఈ శ్లోకం ప్రసిద్ధి చెందింది. అయితే, అలాంటి బ్రహ్మవిష్ణుశివాత్మకమైన గురు స్వరూపం ఎవరు? అంటే, వ్యాస భగవానుని ఆవిధంగా చూపించారు..

అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః ।
అఫాల లోచనః శంభుః భగవాన్ బాదరాయణః ।।

అని వర్ణించారు. వ్యాస భగవానునికి అసలు పేరు కృష్ణుడు. ఆయన పుట్టినప్పుడు ఆ తల్లి సత్యవతి పెట్టినటు వంటి పేరు కృష్ణుడు. పరాశర మహర్షి తపస్సు చేస్తుండగా, నారాయణుని తేజస్సు ఆయనలో ప్రవేశించి, నారాయణ ప్రేరణ చేత ఒక అప్సర కాంత సత్యవతి అనే స్త్రీగా అవతరించినపుడు, నారాయణుడు అవతరించడానికి తగిన క్షేత్రం అది అని ప్రేరణ గ్రహించి, పరాశర మహర్షి ద్వారా ఆ తేజం ఆ తల్లిలో ప్రవేశింప జేయబడి, అప్పటికప్పుడు సద్యోగర్భంగా, ఒక తపః ఫలంగా ఆవిర్భవించి, ఒక దీవియందు ఉద్భవించాడు, వ్యాస దేవుడు. పుడుతూనే ఒక యోగ్యమైన స్వరూపంతో ఆయన వ్యక్తమయ్యాడు. అందుకు ఆయనకు కృష్ణుడు అని పేరు. ద్వీపమునందు ఉద్భవించాడు కనుక, ద్వైపాయణుడని పేరు. నల్లని కాంతులతో ఉంటాడట ఆయన. మేఘము వలె ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే..

ప్రాంశు పయోద నీల తను భాసితు నుజ్జ్వల దండధారు పిం
గాంశు జటాచ్ఛటాభరణు నాగమ పుంజపదార్థ తత్త్వ ని
స్సంశయ కారు కృష్ణ మృగ చర్మ కృతోత్తర కృత్యు భారతీ
వంశ వివర్ధను త్రిదశ వందితు సాత్యవతేయు గొల్చెదన్ ।।

అంటారు తిక్కన గారు, భారతంలో వ్యాస దేవుడికి నమస్కారం చేస్తూ.. నీల మేఘ ఛాయతో ప్రకాశిస్తూ, తేజోమయమైన రూపంతో, వర్చస్సుతో ఉంటారు వ్యాసుల వారు. అందుకు ఆయన పేరు, శరీర కాంతికి తగ్గట్లుగా, కృష్ణ అని వచ్చింది. ద్వైపాయణుడు అని కూడా పేరున్నది. ఆయన వేదములను వ్యాసం చేసి వ్యాస దేవుడయ్యారు. పైగా ఆయనకు బాదరాయణుడు అని కూడా పేరున్నది. బదరికాశ్రమంలో సాధన చేసి గ్రంథ రచన చేసినందుకు, నిరంతరం బదరికాశ్రమంలో నేటికీ ఉంటారని శాస్త్రంలో ప్రసిద్ధి. ఇప్పటికీ బదరికాశ్రమం దగ్గర వ్యాస గుహ అని ఉంటుంది. అందుకు బాదరాయణుడు అన్న పేరు కూడా ఆయనకు ఉన్నది. వ్యాసుడే మనందరకూ అసలైన గురువు. ఎందుకంటే, ఈ రోజు మనం ఒక సంస్కృతి, సంస్కారం, ఒక ధర్మం, వేదాంతం, విజ్ఞానం, ఉపాసన, ఇవన్నీ మాట్లాడుతున్నాము అంటే, ఇవన్నీ మనకు లభించింది వ్యాసుని ద్వారానే. కావలసినవన్నీ వ్యాసమహర్షి మనకు అమర్చి పెట్టాడు. దానిని సరియైన గురువుల ద్వారా మనం గ్రహించాలి. వ్యాసుడి విజ్ఞానాన్ని మనకు ఎవరు బోధిస్తారో వారిని మనం వ్యాస రూపంతో, గురు రూపంతో ఆరాధించుకుని, వ్యాసునికి నమస్కరించాలి..


శ్రీ గురుభ్యో నమః 🙏🏻

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...