మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం! Rudraprashna - రుద్రప్రశ్న!


అందరికీ శ్రావణమాసారంభ శుభాభినందనలు 🙏
మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం!

శ్రీ రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. శత రుద్రీయం, యజుర్వేదంలో భాగం. ఇది శివునికి అంకితం చేయబడిన శ్లోకం. మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం. ఇది జన్మకూ, మృత్యువుకూ అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేదీ, మరల దానిని తీసుకుపోయేది కూడా, ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. వేద శ్లోకాలలో గొప్పదైన రుద్రం, అన్ని రకాల ప్రయోజనాల కోసం, అన్ని దోషాలనూ, కష్టాలనూ తొలగించడానికి సహకరిస్తుంది. పూజలు, హోమాలలో, దీనిని వేద పండితులు పఠిస్తారు. శ్రీ రుద్రం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం, యజుర్వేదంలోని 16వ అధ్యాయంలోనిది. 'నమో' అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల, నమకం అని పిలుస్తారు. రెండవ భాగం, యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోనిది. 'చమే' అనే పదాలను పదే పదే ఉపయోగించడం వల్ల, దీనిని చమకం అని పిలుస్తారు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2GuNRVW62rk ]


నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రయుంజనో బ్రహ్మలోకే మహీయతే ||

నమకం చమకం ఎవరైతే మూడు సార్లు, పురుష సూక్తంతో ప్రతి దినం చదువుతారో, వాళ్లకు బ్రహ్మలోకం  ప్రాప్తిస్తుంది.

నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒక్కో భాగాన్ని, “అనువాకం” అని అంటారు. మొదటి అనువాకం, పరమ శివుడిని తన రౌద్ర రూపాన్ని వదిలి, తన అనుచరులనూ, ఆయుధాలనూ త్యజించమని, ప్రసన్నం చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయదలచమని ప్రార్ధించే భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేసే విధానాలు కూడా కనిపిస్తాయి.

మొదటి అనువాకం: తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్నీ, దైవం యొక్క ఆశీర్వచనాన్నీ పొందేటట్లుగా చేసి, క్షామం, భయం పోయేటట్లు చేసి, ఆహార, గో సంపద సమృద్ధి గావించి, గో సంపదను చావునుండీ, ఇతర జంతువులనుండీ, జబ్బులనుండీ కాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనం చేస్తుంది.

రెండవ అనువాకం: ప్రకృతిలో, సర్వ ఔషధాలలో, సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన. శత్రు వినాశనానికీ, సంపద, మరియు రాజ్యప్రాప్తికీ, జ్ఞాన సాధనకూ, ఈ అనువాకాన్ని చదువుతారు.

మూడవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణించబడింది. ఆయన సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహా స్వరూపాన్ని అర్ధం చేసుకోక, నిమిత్త బుద్ధిని అలవరుచుకుంటాడు. ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి, జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టిస్తాడు. ఈ అనువాకం, వ్యాధి నివారణకు కూడా చదువుతారు.

నాలుగవ అనువాకం: ఇందులో రుద్రుడు సృష్టి కర్త, కారకుడు. చిన్నా, పెద్దా ప్రతీదీ ఆయన చేసిన సృష్టే. ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.

అయిదవ అనువాకం: ఈ అనువాకంలో, పారే నీట ఉండే రూపంగా, రుద్రుడు కొనియాడబడతాడు. ఆయన పంచ తత్వాలు వర్ణించబడతాయి. అంటే, సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.

ఆరవ అనువాకం: ఇందులో రుద్రుడు కాలరూపుడు. ఆయన అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.

ఐదు ఆరు అనువాకాలు, ఆస్తుల పెంపుకూ, శత్రువుల మీద విజయానికీ, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికీ, సుఖ ప్రసవానికీ, జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికీ, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.

ఏడవ అనువాకం: నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకూ, ఆరోగ్యానికీ, ఆస్తినీ, వారసులను పొందడానికీ, పశు సంపద, వస్త్రాలు, భూములు, ఆయుష్షు, మొక్షం కోసం కూడా చదువుతారు.

ఎనిమిదవ అనువాకం: ఇందులో శివుడు, ఇతర దేవతల కారకుడిగానూ, వారికి శక్తి ప్రదాతగానూ వర్ణింపబడ్డాడు. ఆయన అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలనూ పోగొట్టేవాడు. శత్రువులను నాశనము చేసి, సామ్రాజ్యాన్ని సాధించడానికి, ఈ అనువాకాన్ని చదువుతారు.

తొమ్మిదవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుని శక్తీ, ప్రకాశం, సకల దేవతలకూ శక్తినిచ్చేవిగా ప్రస్తుతించ బడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులనూ శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారం కోసం, మంచి సహచరి కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.

పదవ అనువాకం: ఈ అనువాకంలో మరలా, రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన అమ్ములను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై, ప్రసన్న వదనంతో దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం, వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టటానికీ, భైరవ దర్శనార్ధమై, అన్నిరకాల భయాలను పోగొట్టటానికీ, అన్ని పాపాలనూ పోగొట్టటానికీ చదువుతారు.

పదకొండవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుని గొప్పదనాన్ని ప్రస్తుతించి, ఆయన కరుణా ప్రాప్తికై, నిర్బంధమైన నమస్సులు అర్పించబడతాయి.

ఈ అనువాకాన్ని సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్య వృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికై చదువుతారు.

ఇక చమకం విశిష్టత: నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి, దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది, చమకం. ఇది ప్రతి ఒక్కరికీ పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గంలో, ప్రతి పనినీ మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందాన్ని కలుగచేసే మంత్రమిది. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి, ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం ఆయన నుండి ఉద్భవించినదే గనుక, మోక్షాకాంక్ష దైవత్వానికి సూచనే..

మరొక్క విజ్ఞప్తి.. చాలా మందికి సహజంగా కలిగే సందేహం ప్రకారం, ఇక్కడ మరణాన్ని అధిగమించడం అంటే, చిరంజీవిత్వం పొందడం కాదు.. అకాల మృత్యువును జయించడం అనే వాస్తవాన్ని గమనించాలి.

🚩  ఓం నమః శివాయ 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana