Reincarnation or Rebirth or Transmigration | పునర్జన్మలు – జనన మరణ రహస్యం!


పునర్జన్మలు – జనన మరణ రహస్యం!
‘ఆత్మ’ నివాసంగా చేసుకున్న శుక్రకణం గర్భాన్ని కలిగించే శక్తిగలదా?

కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభంలో, శ్రీకృష్ణుడిచే అర్జునుడికి బోధింపబడిన జ్ఞాన నిధి ‘భగవద్గీత’. భారతదేశ న్యాయస్థానాలలో సైతం, ప్రమాణం చేయించడానికి ఎంచుకున్న భగవద్గీతను, పాశ్యాత్యులు సైతం పఠిస్తారు. ఇక మరణమంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? పునర్జన్మలు ఉన్నాయా? ఉంటే చనిపోయిన వారు ఎలా? ఎప్పుడు? ఎక్కడ పుడతారు? లాంటి నిగూఢమైన రహస్యాలను విప్పిచెప్పే మహోత్తర గ్రంధ రాజం, శ్రీమద్ భగవద్గీత.. అటువంటి జన్మ రహస్యాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/looiV-svsw0 ]


ఒక ఆత్మ తల్లిదండ్రుల శుక్ల శోణితాల కలయిక వల్ల ఏర్పడిన ఒక సంయుక్త బీజం అంటే, Zygote లోకి ప్రవేశిస్తుంది. “ఆత్మ” పురుషుని ఇంద్రియం ద్వారా, స్త్రీ యొక్క అండంలో కలుస్తుంది. కోట్లాది వీర్యకణాలున్నా, కేవలం ఒక్కటి మాత్రమే అండాన్ని కలిసి ఫలదీకరణం పొంది, పిండంగా మారుతుంది. అంటే, కేవలం ఆత్మ నివాసంగా చేసుకున్న శుక్రకణం మాత్రమే, గర్భాన్ని కలిగించ గల శక్తిని కలిగివుంటుంది. అయితే, కొంతమంది స్త్రీలకు తరుచూ అబార్షన్స్‌ జరుగుతూ ఉంటాయి. దానికి దాక్టర్లు, జన్యు సంబంధమైన కారణాలనూ, ఇతర అనారోగ్యాలనూ కారణాలుగా చెబుతుంటారు. కానీ, వాస్తవంగా ప్రతి జీవీ, ఈ లోకంలో జీవించటానికి ఒక నియమిత ఆయుర్దాయం కలిగివుంటుంది. అంటే, జీవి పిండంగా మారిన నాటి నుండి, జన్మించి, పెరిగి, వృద్ధాప్యానికి చేరే వరకూ, ఏ దశలోనైనా మరణాన్ని ఎదుర్కుని తీరాల్సిందే. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఒకే స్త్రీకి పదే పదే గర్భస్రావాలవుతున్నప్పుడు, ఒకే ఆత్మ ఆమె శరీరంలో ప్రవేశించి పిండంగా మారి, రెండు మూడు సంవత్సరాల వ్యవధిలోనే, అరడజను సార్లు పుట్టడం, గిట్టడం జరుగుతుంది.

తన కర్మఫలాన్ని బట్టి, ఆత్మ శిశువుగా మారటం, భూమిపై జన్మించడం జరుగుతుంది. కాబట్టి, ఆత్మయొక్క పాపపుణ్యాలను బట్టే, తల్లిదండ్రులు లభిస్తారు. పాపాలు చేసిన ఆత్మ, పాపులైన తల్లిదండ్రులకు జన్మించి, అనేక రకాల శిక్షలను గర్భంలోనూ, జన్మించిన తర్వాతా అనుభవించడం జరుగుతుంది. చావు లేని ఆత్మ, ఒకసారి దేహాన్ని విడిచి పెట్టి, మళ్ళీ జన్మించి మరొక దేహాన్ని పొందినప్పుడు, గతజన్మను గురించిన జ్ఞాపకాలు గుర్తుంటే కలిగే నష్టం, అంతా ఇంతా కాదు. ఎందుకంటే, ఒకసారి మరణించిన తర్వాత, ఆ జన్మతాలూకు జ్ఞాపకాలను మరు జన్మలోకి తీసుకెళ్ళ బడకుండా, ప్రకృతి, లేదా దైవం నియంత్రిస్తుంది. అయితే, కొన్ని అసాధారణ పరిస్థితులలో, మరపు అనే ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించి, ఆత్మ తన గత జన్మ జ్ఞాపకాలను మరు జన్నలో కూడా గుర్తుంచుకుని, ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

అలా గత జన్మ జ్ఞాపకాలు గుర్తున్న వ్యక్తులు, ఈ జన్మలో సరిగ్గా జీవించలేరు. జన్మలున్నాయని నమ్మడం వలన కలిగే లాభం, ఆ జనన మరణ వలయం నుండి విముక్తి పొందే మార్గాన్ని కనుగొనటానికి వీలు కలుగుతుంది. పుట్టడం, పెరగడం, ఎంతో మందితో గాఢానుబంధాలు ఏర్పరచుకోవడం, ఆ పై ఆ బంధాలను తెంచుకో లేక, మరణ యాతనను అనుభవిస్తూ, శరీరాన్ని త్యజించడం, మళ్ళీ పుట్టడం, ఈ జన్మ, గత జన్మల బంధాల మధ్య నలిగి పోవడం, అంతేలేని ఈ జనన మరణ చక్రంలో బందీ కావడం, 'వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం' అని మహాకవి ఆరుద్ర అన్నట్లు.. ఔను, ఈ భూమిపై పుట్టీ గిట్టే వ్యక్తులు, లోకమనే ఈ సత్రంలో కొద్దిసేపు బసచేసే నిత్య ప్రయాణీకులు..

ఇక భగవంతుడైన శ్రీకృష్ణుడు, స్వయంగా ఆత్మ రహస్యాల గురించి, భగవద్గీతలో చెప్పిన విషయానికి వస్తే, విరక్తి కలిగిన వారూ, వృద్దులూ, కష్టాలలో ఉన్న వారేగాక, ఆత్మను గురించీ, పునర్జన్మలను గురించీ తెలుసుకోవాలన్న ఆసక్తి గల వారెవరైనా, చదివి తీరవలసిన ప్రామాణిక గంధరాజం, శ్రీమద్భగవద్గీత. నిజం చెప్పాలంటే, భారతీయుల కన్నా విదేశీయులే, పునర్జన్మల పరిశోధనలకు భగవద్గీతను ఒక దిక్సూచిగా ఉపయోగించుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే, ఇతర మత గ్రంధాలలో ఉన్న మరణానంతర స్థితీ, పునర్జన్మల భావాలూ, ఆ మతాలు పుట్టడానికంటే కొన్ని వేల ఏళ్ల క్రితం గ్రంధస్థం చేయబడిన భగవద్గీతలో చెప్పబడినట్టుగానే ఉన్నాయి. చివరికి హిందూమతాన్నీ, హిందూ కర్మకాండలనూ వ్యతిరేకించి, బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుడు కూడా, కర్మసిద్ధాంతాన్ని అంగీకరించాడు. ప్రతికర్మకూ, ఒక ఫలితం ఉండి తీరుతుందని బుద్ధుడు చెప్పిన మాట, భగవద్గీత సారాంశమైన కర్మసిద్ధాంతమేనని గుర్తించాలి!

శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం.. ఆత్మ అన్నికాలాలలో ఉంటుంది. ఈ నాడు మనం చూస్తున్న మానవులూ, ఇతర జీవులూ, గతం లోనూ ఉన్నారు. కాకపోతే, వేర్వేరు ఆకారాలతో జీవించి ఉండవచ్చు. జీవుడికి బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఉన్నట్లుగానే, మరణించిన తరువాత మరొక జన్మ ద్వారా, మరో శరీరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మ ఎవ్వరిచేతా చంపబడలేదు, ఎవ్వరినీ చంపదు. మనుషులు చిరిగిన వస్త్రాలను వదిలి, కొత్త వస్త్రాలను ఎలా అయితే ధరిస్తారో, అదే విధంగా, జీవుడు ముందు జన్మలోని శరీరాన్ని వదలి, మరు జన్మలో కొత్త శరీరాన్ని ధరించడం జరుగుతుంది. ఆత్మను శస్త్రములుగానీ, అస్త్రములుగానీ ఛేదించలేవు, అగ్ని దహించ లేదు, నీరు తడుప లేదు. ఆత్మ సర్వవ్యాపి, నాశరహితము. ఇంద్రియములకు ఆత్మ గోచరము కాదు. అంటే, ఆత్మను చూడలేము, స్పృశించలేము. అందుకే, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారు మరల జన్మించక తప్పదు. ఈ ప్రయాణంలో మానవులు తాము చేసిన పాప పుణ్యాలకు ప్రతిఫలాలను స్వర్గ-నరకాలలో అనుభవించి, కర్మఫలం పూర్తి కాగానే, మళ్ళీ జన్మిస్తుంటారు.

ఇక గతంలో మనం గరుడపురాణం, కఠోపనిషత్తు వంటి గ్రంధాల ఆధారంగా చేసిన వీడియోలను చూసిన చాలామంది, మంచీ చెడు కర్మ ఫలాలను స్వర్గ నరకాలలో అనుభవించినప్పుడు, మళ్ళీ ఈ జన్మలో ఈ కష్టాలు దేనికి అనే సందేహాన్ని వెలిబుచ్చారు. కష్టాలు అనుభవిస్తున్న వారు అంటే కురూపులూ, అంగ వైకల్యం గలవారూ, నిరు పేదలూ, గత జన్మలలో చేసిన పాపాలకు నరకంలో శిక్షలను అనుభవించి, ఇంకా స్వల్పంగా మిగిలిన పాపాలను అనుభవించటానికి, అలా జన్మిస్తారు. అలాగే, గతజన్మలలో పుణ్యాలూ, మంచి పనులూ చేసిన వారు, స్వర్గంలో సుఖాలను అనుభవించి, మిగిలిన కొద్దిపాటి పుణ్యఫలాన్ని అనుభవించటానికి, సౌందర్యవంతులుగా, మేధావులుగా, మరియు సంపన్నులుగా పుడతారు. శారీరక లోపాలున్న వారూ, డబ్బు లేని వారూ అనుభవించే బాధలూ, కష్టాలూ, పైనున్న నరకంలో అనుభవించే శిక్షలకన్నా తక్కువేమీ కాదు.

అలాగే, గత జన్మల పుణ్యం వలన ఈ జన్మలో అన్నీ ఉన్న వారిగా జన్మించిన వారు, అహంకారంతో అభాగ్యులను హింసిస్తే, అది శాపంగా మారుతుంది. అంటే, అన్నీవున్న జన్మ కలిగినప్పుడు, మరిన్ని మంచి పనులను చేస్తే, స్వర్గలోక ప్రాప్తితోబాటు, వచ్చే జన్మలోనూ మరింత ఉన్నతంగా జీవిస్తారు. దేవతలను పూజించే వారు, మరణానంతరం, దేవలోకాలకు చేరతారు. భూత ప్రేతాలను పూజించే వారూ, క్షుద మాంత్రికులూ, హంతకులూ, పిశాచాలుగా మారి, ఈ భూమిపైనే సంచరిస్తూ ఉంటారు. వారికి పునర్జన్మ లభించక, స్వర్గం-నరకం లేని ఒక దుస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఆత్మలే, బలహీన మనస్కులను ఆవహిస్తాయి. దానినే దెయ్యం పట్టడమని కూడా అంటారు.

వాయువు వాసనలను ఒక చోటినుండి మరొక చోటికి తీసుకు పోయినట్టుగా, దేహానికి యజమానైన జీవాత్మ, ఒక శరీరాన్ని త్యజించేటప్పుడు, మనస్సు, ఇంద్రియాలను గ్రహించి, వాటితో పాటు మరొక శరీరాన్ని పొందుతుంది. ఈ అంశానికి తిరుగులేని ఋజువు, అతిచిన్న వయస్సులోనే గణితం, ఈత, డ్రైవింగ్‌ వంటి విషయాలలో అసమాన ప్రతిభను చూపే పిల్లలను చెప్పుకోవచ్చు.

ఇటీవల విజయవాడలో అక్షయ, సువీర్ అనే 5 సంవత్సరాల లోపు చిన్నారులు, కృష్ణానదిని ఈదారు. సరిగ్గా నేల మీదనే అడుగులు వేయలేని చిన్నారులు, గజ ఈతగాళ్ళు మాత్రమే ఈదగలిగే కృష్ణానదిని ఈదటం, పూర్వజన్మ వాసన కాదంటారా! గత జన్మలో రాక్షస ప్రవృత్తి గలవారు, ఈ జన్మలో హత్యలూ, మాన భంగాలూ చేసే సంఘ విద్రోహక శక్తులుగా జన్మిస్తారు. కొందరు విపరీతమైన తిండిబోతులుగానూ, మరి కొందరు విశృంఖలమైన కాముకులుగానూ, కాసుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారే వారిగానూ జన్మించటానికి గల ఏకైక కారణం, వారు గతజన్మలోనూ అలాంటి లక్షణాలను కలిగి ఉండటమే.

ఇక రామాయణ, భాగవత గ్రంధాలను పరిశీలిస్తే, పునర్జన్మలున్నాయని తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వచ్చిన సనక సనందనాదులనే బుషులను, వైకుంఠానికి పోనీయకుండా ఆపిన వైకుంఠ ద్వార పాలకులైన జయవిజయులు, ఆ మునుల శాపానికి గురై, ఆ తరువాత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించి, శ్రీమన్నారాయణుడి చేతిలో మరణించినట్లుగా తెలుస్తోంది. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా జన్మించిన వారిని, వరాహ, నారసింహ అవతారాలు ధరించి, విష్ణువు సంహరించాడు. అలాగే, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణాదులుగా జన్మించిన వారిని, రామావతారం ధరించి సంహరించాడు. మూడవ జన్మలో శిశుపాలుడు, దంతావక్రులుగా జన్మించిన వారిని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సంహరించాడు. సంభవామి యుగేయుగే అన్న గీతా వాక్యం, అన్ని కాలాలలోనూ నిజమైంది. రాబోయే కాలంలోనూ నిజమవుతుంది.

🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana