Audi9 – Telugu Mythology & Temple History Stories | Voice of Maheedhar (Planet Leaf), Shadow Madhu Babu Audiobooks, Facts Hive Youtube Channels. Here I bring you Bhagavad Gita in Telugu, Stories of Mahabharata, Ramayana, Science behind Sanatana Dharma, Hinduism, Interesting and Unknown Facts and Mysteries in Telugu, and Writer Madhu babu's Shadow, Folklore, Fantasy Fiction Novels as Audiobooks / Podcasts. Watch interesting videos Every Day in the original Voice of Maheedhar and Sudha..
అభిమన్యుడిని శ్రీకృష్ణుడు ఎందుకు కాపాడలేదు? TELUGU VOICE
అన్నీ తెలిసిన కృష్ణుడు 16 ఏళ్ల చిరు ప్రాయంలో అభిమన్యుడి మరణాన్ని ఎందుకు అడ్డుకోలేదు?
పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని వీర యోధులు అనగానే, ముందుగా అందరి మదిలో మెదిలే పేరు 'అభిమన్యుడు'. పాండవ మధ్యముడు అర్జునుడు, శ్రీకృష్ణుడి సోదరి సుభద్రాదేవిల ముద్దుల తనయుడు అభిమన్యుడు. అంటే, సాక్షాత్తు శ్రీ కృష్ణుడికి మేనల్లుడు. తల్లి కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి నుంచి అస్త్రశస్త్ర విద్యలను అభ్యసించిన జ్ఞాని. పుట్టకముందే చక్రవ్యూహంలోకి ప్రవేశించే జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే, ఆ చక్ర వ్యూహం నుంచి బయటపడే మార్గం తెలియక, 16 ఏళ్ల చిరు ప్రాయంలో మరణించాడు. అభిమన్యుడు యుద్ధంలో ఇలా వీర మరణం పొందడం వెనుక కారణం ఏంటి? ఎందుకు శ్రీ కృష్ణుడు కూడా తన మేనల్లుడు అభిమన్యుడిని కాపాడకుండా మిన్నకుండిపోయాడు? వంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
మహాభారతం అనగానే మనకు గుర్తుకు వచ్చేది, కురుక్షేత్ర మహాసంగ్రామం. కురుక్షేత్రాన్నే ధర్మక్షేత్రం అని కూడా అంటారు. ఆ యుద్ధం, ధర్మాన్ని పరిరక్షించడానికి జరిగిన యుద్ధంగా పేర్కొంటారు. 'ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగేయుగే' అని చెప్పినట్లుగానే, లోకంలో అధర్మం పెచ్చు మీరిన ప్రతి సారీ, శ్రీ మహా విష్ణువు అవతరిస్తుంటాడు. అలా ద్వాపర యుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు, ఆయనకు సహాయంగా ఇతర దేవతలు కూడా జన్మించడానికి సిద్ధపడ్డారు. వివిధ ప్రదేశాలలో ఎందరో దేవతలు జన్మించి, ధర్మాన్ని స్థాపించడంలో శ్రీ కృష్ణ భగవానుడికి సహాయం చేశారు. అందులో భాగంగానే, చంద్రుడి కుమారుడైన 'వర్చస్సు', అభిమన్యుడిగా జన్మించాడు.
అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, తండ్రి పద్మవ్యూహం గురించి చెబుతుండగా శ్రద్ధగా ఆలకించాడు. ఇక పద్మవ్యూహం నుంచి బయటపడటం ఎలాగో చెప్పబోతున్న సమయంలో, శ్రీకృష్ణుడు అర్జనుడిని అడ్డుకున్నాడు. కావాలనే శ్రీకృష్ణుడు అలా చేశాడు. దీనితో అభిమాన్యుడు, పద్మవ్యూహాన్ని ఛేదించడం మాత్రమే తెలుసుకుని, బయట పడటం తెలుసుకోలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జనుడు, శ్రీకృష్ణుడు లేని సమయంలో, పాండవులకు అండగా యుద్ధరంగంలోకి ప్రవేశించిన అభిమన్యుడు, కౌరవులను వీరోచితంగా ఎదుర్కొని, చివరకు పద్మవ్యూహం నుంచి బయటకు రాలేక, కౌరవుల చేతిలో అసువులు బాశాడు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా, శ్రీకృష్ణ పరంధాముడు మౌనంగా ఉండిపోయాడు.
ముందు చెప్పుకున్నట్లుగా దీనికి కారణం, గత జన్మలో అభిమన్యుడు చంద్రుడి కుమారుడు. మానవ జన్మ అయిన అభిమన్యుడిగా తన కుమారుడిని భూమి పైకి పంపడానికి ముందే, చంద్రుడు తన తనయుడు భూమిపై 16 ఏళ్లు మాత్రమే ఉంటాడని షరతు పెట్టాడు. ఆ మాట ప్రకారమే, 16 ఏళ్లకే అభిమన్యుడు మరణిస్తున్నా, కృష్ణ భగవానుడు చూస్తుండిపోయాడు. పైగా ఈ ఘటన, అర్జనుడు తన సోదరులపై యుద్ధం చేయడానికి వెనుకాడుతున్న సమయంలో జరిగి, వారు కుతంత్రం పన్ని తన తనయుడిని హతమార్చడంతో, వైరాగ్యం వీడి, అర్జునుడు పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగాడు. మహాభారతంలోని ఆదిపర్వంలో, భీష్ముడి సంశయాన్ని తీరుస్తూ, పులస్త్య మహాముని తెలియజేసిన వివరాలివి.
మరో కథనం ప్రకారం, అభిమన్యుడు పూర్వ జన్మలో అభికాసురుడనే రాక్షసుడిగా చెప్పబడింది. అతడు కృష్ణుడి మేనమామ కంసుడికి మిత్రుడు. కంస వధ తరువాత, అభికాసురుడు కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోదలచాడు. విషయం గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్ముడు అతడిని కీటకంగా మార్చి, ఒక పెట్టెలో బంధించాడు. కాలక్రమంలో, కృష్ణుడి సోదరి సుభద్రా దేవీ, అర్జునుల వివాహం జరిగింది. ఒకనాడు అనుకోకుండా సుభద్ర ఆ పెట్టెను తెరచినప్పుడు, కీటకం ఆమె కడుపులోకి చేరి ప్రాణాలు విడిచింది. అభికాసురుడు అభిమన్యుడిగా, సుభద్ర కడుపున పునర్జన్మను పొందాడు.
విషయం తెలిసిన కృష్ణుడు బరువెక్కిన హృదయంతో తన మేనల్లుడి మరణానికి వేదికను సిద్ధం చేశాడు. అందుకే పద్మవ్యూహంలోకి ప్రవేశించడం మాత్రమే తెలిసిన అభిమాన్యుడి మరణాన్ని కావాలని అడ్డుకోలేదు. అర్జునుడు తన కుమారుడి మరణానికి దుఃఖిస్తూ కృష్ణుడిని నిందించినప్పుడు, పరమాత్ముడు అతడికి అభికాసురుడి గురించీ, అభిమన్యుడిగా అతడు పునర్జన్మనెత్తిన వైనాన్నీ వివరించాడు.
ద్రౌపది మనస్సులో కర్ణుడిని కామించిందనడంలో ఎంతవరకూ నిజం ఉంది?
వేదవ్యాసుడు చెబుతుండగా, గణపతి రచించిన మహాభారతం, పంచమ వేదంగా పరిగణించబడే భారత ఇతిహాసం. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం, మహాభారత కావ్యం, వేద కాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శక పూర్వం 4000 సంవత్సరాల కాలంలో, దేవనాగరి లిపి అయిన సంస్కృత భాషలో రచించబడింది. 18 పర్వాలతో, లక్ష శ్లోకాలతో, 74,000 పద్యాలతో లేక సుమారు 18 లక్షల పదాలతో, ప్రపంచంలోనే అతి పెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ మహా కావ్యాన్ని 14వ శతాబ్దంలో, కవిత్రయంగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. అటువంటి మహాభారతంలోని అర్జునుడూ, కర్ణుడి గురించి తెలియనివారుండరు. ఇక ప్రభాస్ నటించిన కల్కి వంటి చిత్రాలు చూసినప్పుడు, వీరిలో ఎవరు గొప్ప అనే సందేహం మెదులుతూ ఉంటుంది చాలామందిలో. విశ్లేషణాత్మకంగా ఈ విషయాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
కర్ణుడు గొప్పా, అర్జునుడు గొప్పా అనేది తెలుసుకునే ముందు, వ్యాస విరచిత మహాభారత కావ్యంలోని కొన్ని పాత్రల వైశిష్ట్యం, కొన్ని సంఘటనలూ తెలుసుకోవడం తప్పనిసరి. దానం విషయంలో కర్ణుడికి సాటి ఎవరూ లేరన్న పేరుంది. కర్ణుడు అంగరాజ్యానికి రాజయ్యాక చేసిన దానాలన్నీ, దుర్యోధనుడు ఇచ్చినవే కావచ్చు. కానీ, బాల్యం నుండీ కర్ణుడికి దానగుణం హెచ్చని, భారతం చెబుతుంది. అలాగే, కర్ణుడి దానాలలోకెల్లా గొప్ప దానం, కవచ కుండలాల దానం. ఎందుకంటే, అవి దుర్యోధనుడు ఇచ్చినవి కావు. కర్ణుడి స్వంతం, అతడికి పుట్టుకతో సంక్రమించినవి. కవచ కుండలాల దానం, కర్ణుడికి మహత్తర కీర్తిని తెచ్చిపెట్టింది. కానీ, ఇక్కడ గమనించాల్సింది, కవచ కుండలాలను దానం చేసి, అంతకంటే గొప్పదైన 'శక్తి' ఆయుధాన్ని ప్రతిఫలంగా పుచ్చుకున్నాడు. ప్రతిఫలం పుచ్చుకున్న దానికి, దాన ఫలం మిగలదు. కర్ణుడు తన పూర్వజన్మలో సహస్ర కవచుడిగా, 1000 కవచాలూ, కుండలాలతో వున్నప్పుడే, నరనారాయణుల ముందు నిలువలేక పోయాడు. ఇక ఈ జన్మలో, కేవలం ఒక్క కవచంతో, నరనారాయణులు అంటే, కృష్ణార్జునుల ముందు నిలువగలడా? ఆ కవచం బలం ఎంతో కర్ణుడికి తెలుసు. అందుకే దాన్ని ఇచ్చేసి, అర్జునుణ్ణి చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. అంటే, ఈ విషయంలో మోస పోయింది కర్ణుడు కాదు, ఇంద్రుడే అనేది తేటతెల్లమవుతుంది. ఈ దానం సందర్భంలో, కర్ణుడు అంతటి చాకచక్యం చూపించాడు.
ఇక భీష్ముడు తన తండ్రి కోసం, రాజ్యాన్ని వదులుకున్నాడు. తండ్రి కోసం ఆయన చేసిన త్యాగమది. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం, ఆ రాజ్యం భీష్ముడి స్వంతం కాదు, స్వార్జితమూ కాదు. అప్పటికి ఇంకా భీష్ముడు రాజు కాలేదు. యువరాజు మాత్రమే. ఆ రాజ్యం అప్పటికీ ఆయన తండ్రి అయిన శంతనుడిదే. శంతనుడి రాజ్యాన్ని శంతనుడికే వదిలేశాడు. ఒక విధంగా ఆ త్యాగం అసంపూర్ణం. అతను రాజ్యాన్ని వదిలేసి, దానికి ప్రతిఫలంగా, తాను కోరుకున్నప్పుడే మరణించే వరాన్ని పొందాడు. అంటే, ఈయనా తన త్యాగానికి ఫలితాన్ని పొందాడు. పైగా, సత్యవతి కుమారులు పెరిగి పెద్దయ్యే వరకూ, సుమారు 25 సంవత్సరాలు మకుటం లేని మహారాజుగా, రాజ్యపాలన చేశాడు. అనంతర కాలంలోనూ, చివరి వరకూ బ్రహ్మాండమైన రాజభోగాలను కూడా అనుభవించాడు.
ఈ విధంగా కర్ణుడూ, భీష్ముడూ, తగిన ప్రతిఫలాలను పొందడం వలన, వారి చర్యల్లో చెప్పుకునేంత గొప్పదనం ఏమీ మిగలదు. వీరిద్దరికంటే గొప్ప దాతగా, త్యాగశీలిగా, ధర్మరాజును చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అరణ్యవాస కాలంలో, తమకే తిండి తిప్పలు కరువైన రోజుల్లో కూడా, తమనే నమ్ముకుని, తమతోబాటు అరణ్యాలకు వచ్చిన వేలాది మంది అమాయక ప్రజల కోసం, సూర్యునికై తపస్సుజేసి, అక్షయపాత్రను సంపాదించి, ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, వేలాది మందికి ప్రతిరోజూ అన్నదానాలు చేశాడు. ఎక్కడో హిమాలయాలకు వెళ్లి, అక్కడ భూమిలో నిక్షిప్తమైవున్న నిధులను స్వయంగా సాధించుకు తెచ్చి, అశ్వమేధ యాగ సమయంలో వేలాది మందికి, వారు కోరినంత, స్వార్జితమైన బంగారాన్ని దానం చేసిన ధర్మరాజు, కర్ణ భీష్ముల కంటే గొప్పవాడని నిరూపితమవుతుంది.
కర్ణుడిలో కొంత దానగుణం తప్ప, ఇక ఏ ఇతర మంచి గుణాలూ లేవు. అందుకే వ్యాసభగవానుడూ, తిక్కన, కర్ణుడిని దుష్టచతుష్టయంలో చేర్చారు. అంగరాజ్యమిచ్చి దుర్యోధనుడు ఆదరించాడనే విశ్వాసంతోనే, దుష్టకార్యాలు చేశాడని కొందరు భ్రమపడుతుంటారు. కానీ అది నిజం కాదు. అంత విశ్వాసం వుంటే, పంతాలకు పోయి, కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళకుండా, పది రోజుల పాటు దుర్యోధనుణ్ణి వదిలేస్తాడా? అంటే, దుర్యోధనుడికంటే, అతనికి తన స్వంత పంతాలే ముఖ్యం. అంతేగాక, కర్ణుడు అసూయ, మోసం, ద్వేషం, అన్నీ మెండుగా కలిగివున్న వాడు. అతడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నదే, మోసంతో. మొట్టమొదట కురు పాండవ యుద్ధవిద్యా ప్రదర్శనలో, తానూ పాల్గొనాలని వచ్చాడు. కానీ, అతడు క్షత్రియుడు కాదని కొందరు అభ్యంతరం వెలిబుచ్చారు. ఆ సమయంలో అర్జునుడు గొప్ప అస్త్ర నిధిగా పొగడబడుతున్నాడు. అదే, కర్ణుని అసూయకు నాంది. దుర్యోధనుడి పుణ్యమా అని ఆ అస్త్ర విద్యా ప్రదర్శనలో పాల్గొన్నాడు. అయితే, కౌరవులు తప్ప అతడిని అర్జునుడి కన్నా మిన్న అని అక్కడ ఎవ్వరూ పొగడలేదు. అందుకే ఏనాటికైనా అర్జునుణ్ణి ఓడించాలని అనుకున్నాడు. కానీ, ద్రౌపదీ స్వయంవరం, ఘోష యాత్ర, ఉత్తర గోగ్రహణం లాంటి సంఘటనలు తీసుకుంటే, అనేకసార్లు అర్జునుడి ముందు ఓడిపోయాడు. అందుకే భూమిపై తానో, అర్జునుడో, ఎవరో ఒక్కరే వుండాలని నిర్ణయించుకుని, అర్జునుడి పై పగబట్టాడు.
నిజం చెప్పాలంటే, అర్జునుడేమీ కర్ణుని అంతగా అవమానించిన సందర్భం లేదు. అస్త్ర విద్యా ప్రదర్శన నాడు కూడా, కర్ణుని భీముడే అవమానించి మాట్లాడాడు. దుర్యోధనుడికి ముఖ్య శత్రువు భీముడు. స్నేహితుని శత్రువు గనుక, పగబడితే భీముడిపై పగబట్టాలి కర్ణుడు. కానీ, అర్జునుడిపై పగబట్టింది, కేవలం అసూయ వల్లనే. అందుకే పాండవులలో ఎవరు దొరికినా చంపను, అర్జునుడిని మాత్రం వదలనన్నాడు కుంతీ దేవితో. అర్జునుడిని చంపడానికి నాగాస్త్రం సంపాదించాడు. ఇంద్ర 'శక్తి' ఆయుధం తీసుకున్నాడు. యుద్ధంలో అర్జునుడు అలసిపోయే వరకూ, 10 రోజుల పాటు తాను విశ్రాంతి తీసుకుని, కురుక్షేత్రానికి వచ్చాడు. అతని గురి కేవలం అర్జునుడే..
కర్ణుడి జన్మ రహస్యం ధర్మరాజుకు తెలిస్తే, ఆయన తనకున్నదంతా కర్ణుడికే ఇచ్చేసే వాడు. అలా జరిగితే, పాండవులంతా అతని అనుచరులుగా వుండేవారు. కానీ, కర్ణుడికి కావలసింది, భ్రాతృ ప్రేమో, మాతృ ప్రేమో కాదు. పెద్దన్నయ్యగా గౌరవాదులూ కాదు. అర్జునుడిని ఓడించాలి. తానే గొప్ప వీరుడిగా కీర్తించబడాలి. అందుకు అర్జునుడిని చంపేయాలి. పాండవులతో కలసి జీవిస్తే, తన అసూయా పూరిత దుష్టాశయం నెరవేరదు కాబట్టి, అతడు ఆజన్మాంతం పాండవ విరోధిగానే మిగిలిపోయాడు.
ఇక కర్ణుడి దానశీలతను ఆసరాగా తీసుకుని, ఇంద్రుడు అతని కవచకుండలాలను కాజేశాడనీ, కురుక్షేత్రంలో కర్ణుడిని శల్యుడు తన మాటలతో కుంచింపచేశాడనీ, రధచక్రం భూమిలో క్రుంగిన సమయంలో, అర్జునుడు అతడిని చంపేశాడనీ, ఇటువంటి ఘటనలు జరిగివుండకపోతే, కర్ణుడి చేతిలో అర్జునుడు ఓడిపోయే వాడనీ కొందరు అంటూ ఉంటారు. మరి ఆ విషయాలలోకి వెళితే.. ఏ విధంగా చూసినా, అర్జునుడి వీరత్వం ముందు, కర్ణుడు దిగదుడుపే. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. అయితే, ఈ కలియుగంలో కలి ప్రభావంచేతనో ఏమోగానీ, ఈ మధ్య విలన్స్‌కి అభిమానులు పెరుగుతున్నారు. అంతటితో ఆగకుండా, డబ్బున్న మారాజులు కొందరు విలన్స్‌ను గొప్పవారిగానూ, ధర్మపరులను అల్పులు గానూ చిత్రించి, సినిమాలూ, టి.వి. సీరియల్స్ తీసి ప్రదర్శిస్తున్నారు. ఆ పుక్కిటి కథలనే నిజమని నమ్మడం వల్లే, ఇటువంటి సందేహాలు పుట్టుకొస్తున్నాయి.
‘రావణుడు రాముడికన్నా మిన్న’ అంటాడు ఒకడు. ‘ద్రౌపది, మనస్సులో కర్ణుడిని కామించింద’ని అంటాడు ఇంకొకడు. ‘ధర్మరాజుకు రాజ్య పిపాస హెచ్చ’ని అంటాడు మరొకడు. ‘కీచకుడు మంచివాడే.. అతడిని రెచ్చగొట్టింది ద్రౌపదే’ అని వేరొకడంటాడు. కీచకుడిపై గెలవలేక, భీముడు రహస్యంగా దాచుకున్న కత్తితో పొడిచి చంపేశాడనీ, ద్రౌపదీ స్వయంవరంలో కర్ణుడే మత్స్య యంత్రాన్ని కొట్టేసేవాడు కానీ, ద్రౌపదే అతడిని కించ పరచి, పోటీలో పాల్గొన నీయలేదనీ, అసలు మత్స్య యంత్రాన్ని జరాసంధుడు కొట్టేసేవాడు కానీ, ద్రౌపది అతడిని వేడుకుని, బ్రతిమాలి, పోటీ నుండి తప్పించిందనీ, ఇలా ఎన్నెన్నో.. ఇవన్నీ మన సినిమాలలో, టి.వి. సీరియల్స్‌లోని మాయా జాలాలు. ఈ సంఘటనలేవీ, కృతికర్త వ్యాసుల వారు చెప్పినవి కావు. కర్ణుడు వీరుడే.. కానీ అర్జునుడితో ఏ మాత్రం సరిసమానుడు కాడు. ద్రౌపదీ స్వయంవరంలో, కర్ణుడు అర్జునుడిచేత ఓడించబడ్డాడు. ఘోష యాత్రలో కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు, అర్జునుడి చేతిలో ఓడి పోయిన వాడే. ఉత్తర గోగ్రహణంలో కర్ణుడిని పడగొట్టి, అతని తలపాగా కుచ్చును తీసుకు పోయాడు అర్జునుడు. కురుక్షేత్రంలో ఒకే రోజున అయిదు సార్లు భీముడి చేతిలో ఓడిపోయి, పారిపోయాడు కర్ణుడు. అభిమన్యుడి చేతిలో చావుదెబ్బలు తిని పారిపోయి, మరో ఐదుగురు దుర్మార్గులతో కలసివచ్చి, అన్యాయంగా అభిమన్యుణ్ణి చంపిన భీరువు కర్ణుడు. కర్ణుడి కుమారుణ్ణీ, సైంధవుణ్ణీ చంపుతానని చెప్పిమరీ, కర్ణుడి కళ్ళముందే వారిద్దరినీ చంపేశాడు అర్జునుడు. ఘటోత్కచుడి చేతిలో చావుదెబ్బలు తిని, గత్యంతరం లేక, తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం, అర్జునుణ్ణి చంపడానికి దాచుకున్న ఇంద్రశక్తిని ప్రయోగించి, ఘటోత్కచుణ్ణి తుదముట్టించిన భయస్థుడు కర్ణుడు. ఇదీ, కర్ణుడి వీరత్వం.
వేయి కవచాలు కలిగి ఉన్ననాడే, కృష్ణార్జునులు నరనారాయణుల రూపంలో కర్ణుడిని, అంటే సహస్ర కవచుడిని చావగొట్టి, 999 కవచాలను ఛేదించారు. చేసేది లేక పారిపోయాడు కర్ణుడు. ద్రౌపదీ స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తర గోగ్రహణం సమయాలలో, కర్ణుడికి చివరి కవచ కుండలాలున్నాయి. అయినా, అర్జునుడే గెలిచాడు. అందుకే ఆ కవచ కుండలాల శక్తి ఏ పాటిదో కర్ణుడికి అర్ధమై, ఇంద్రుడు అడిగిన వెంటనే వాటిని ఇచ్చేసి, బదులుగా, అర్జునుడిని చంపగల శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు, దాన కర్ణుడు. ఇక శల్యుడు తన మాటలతో కర్ణుడి మనస్సు పాడు చేయటం సంగతి ఎలావున్నా, ఒక సంఘటనలో, కర్ణుడి ప్రాణాలను రక్షించాడు శల్యుడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజున, కర్ణుడు ధర్మరాజును దూషించిన విషయం తెలుసుకున్న భీముడు వెళ్ళి, కర్ణుడితో యుద్ధం చేసి ఓడించి, మూర్చబోయేటట్లుజేశాడు. అన్నగారిని తిట్టిన నాలుకను కోసి పారేస్తానని ముందుకురికాడు, భీముడు. అప్పుడు శల్యుడు భీముణ్ణి శాంతపరచి, మూర్చలో వున్న వారి నాలుక కోయడం తగదని నచ్చజెప్పి, కర్ణుడిని రక్షించాడు.
ఇక రధ చక్రం కృంగి పోయినప్పటి సంగతికొస్తే, చక్రాన్ని కర్ణుడు ఎత్తుతుండగా అర్జునుడు అతన్ని చంపడం వాస్తవం కాదు. క్రుంగిన రధ చక్రాన్ని ఎత్తడానికి ఎంత ప్రయత్నించినా రాకపోవటంతో, శాపవశాన ఆ చక్రం ఇక రాదనీ, మరో రధం తెచ్చుకున్నా, అదే గతి పడుతుందనీ తెలుసుకున్న కర్ణుడు, ఆ పై ఇక నేలపై నిలబడే యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలోనే కర్ణుడు మరణించాడు. ఇక్కడ అర్జునుడు రధంపైనా, కర్ణుడు నేలపైనా వున్నందువల్లనే, కర్ణుడు ఓడిపోయాడని అనుకోవడం సరికాదు. ఎందుకంటే, అదే కర్ణుడిని ఓడించిన చిత్రరధుడు రధంపై వుండి యుద్ధం చేయగా, నేలపై నిలబడి పోరాడిన అర్జునుడే గెలిచాడు. అందువల్ల మనం గమనించవలసింది, శాపాలు వగైరాలు లేకపోయినా, కర్ణుడు అర్జునుడిపై గెలవగలగడం అసంభవం.
సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా నా వంతు ప్రయత్నానికి ఎంతగానో తోడ్పాటు అందించి, నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, మొదటి మైలు రాయి 'లక్ష సబ్స్క్రైబర్స్' ని అందుకునేలా చేసిన ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షక దేవుళ్లందరికీ, పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.. భవదీయుడు 'మహీధర్' వల్లభనేని 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
అందరికీ 'శ్రీకృష్ణ జన్మాష్టమి' శుభాకాంక్షలు 🙏 TELUGU VOICE
బుద్ధుడు విష్ణువు అవతారమా? దశావతారాలలోని బుద్ధుడికీ, గౌతమ బుద్ధుడికీ సంబంధం లేకపోతే, మరి ఆ బుద్ధుడు ఎవరు?
శ్రీ మహావిష్ణువు ‘దశావతారాలు’ అనగానే, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, ఇలా చెప్పుకుంటూ పోతాము. ఈ వరుసలోనే, విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారంగా, ఆయన బుద్ధుడిగా అవతరించాడని విశ్వసిస్తాము. కానీ, నిజంగా విష్ణువే బుద్ధుడిగా అవతరించాడా? బుద్ధుడు విష్ణువు అంశేనా? అసలు బుద్ధుడు ఎవరు? ప్రపంచ వ్యాప్తంగా ప్రచారంలో ఉన్న బౌద్ధమతానికి ఆది గురువైన గౌతమ బుద్ధుడేనా? ఈయనేనా ఆ విష్ణువు తొమ్మిదవ అవతారం? లేక దశావతారాలలోని బుద్ధుడు వేరెవరైనా ఉన్నారా? అసలు బుద్దుడి రహస్యం ఏమిటి?.. వంటి విషయాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
బుద్ధుడి రాకకు మునుపు, అప్పటిదాకా ప్రపంచం, ఒక మార్గంలో నడుస్తోంది, ఒక ధర్మాన్ని అనుసరిస్తూ వెళ్లింది. ఆ మార్గంలో ఉన్న ముళ్లను తొలగించి, ఆ ధర్మంలో ఉన్న లోపాలను ఎత్తి చూపి, సరికొత్త మార్గాన్ని చూపించిన ఆధ్యాత్మిక గురువు, గౌతమ బుద్ధుడు. దాదాపు రెండువేల అయిదు వందల సంవత్సరాల క్రితం, మనకు తెలిసిన కాలంలో, మనకు తెలిసిన చరిత్రలో, ఈ భూమిపై నడయాడిన పుణ్యమూర్తి, బుద్ధుడు. హిందువులలో ఉన్న కొన్ని విశ్వాసాలతో విభేదిస్తూ, ఒక విధమైన విప్లవాత్మకమైన ధోరణితో దూసుకు వచ్చిన వాడు, బుద్ధ భగవానుడు.
ఇప్పుడున్న నేపాల్ లోని కపిలవస్తు నగరాన్ని ఏలిన మహారాజు సంతానంగా, శక్తిమంతుడైన మతాచార్యుడిగా అవతరించిన పుణ్య మూర్తి, గౌతమ బుద్ధుడు. జీవితం-చావుపుట్టుకల గురించి సిద్ధార్థుడనే రాకుమారుడికి తీవ్రంగా వచ్చిన సందేహాలు, అతడిని బుద్ధుడిగా మార్చేశాయి. ఊరూరా తిరిగి తిరిగి, అలసిపోయిన యువరాజుకు, గయలో ఓ బోధి వృక్షం ఆశ్రయమిచ్చి, జ్ఞానాన్ని ప్రసాదించింది. సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది. 375 జన్మలు ఎత్తిన వాడూ, ఆ తరువాత కూడా ఆచార్యుడిగా అవతరించిన వాడూ, అన్ని కాలాలలో ఉన్నవాడూ, అన్ని ధర్మాలకూ అతీతమైన ధర్మాన్ని లోకానికి అందించిన వాడు... ఈయనకూ విష్ణుమూర్తికీ సంబంధం ఏమిటి? విష్ణువు దశావతారాలతో ఉన్న అనుబంధం ఏమిటి? నారాయణుడే తన తొమ్మిదవ అవతారంలో, గౌతమ బుద్ధుడిగా అవతరించాడా? ఇది నిజమేనా? ఒకవేళ దశావతారాలలో ఉన్న బుద్ధుడికీ, గౌతమ బుద్ధుడికీ సంబంధం లేకపోతే, ఆ అవతారంలో ఉన్న బుద్ధుడు ఎవరు?
విష్ణువు దశావతారాలు కట్టు కథలు కావు. పుక్కిటి పురాణాలుగా వీటిని కొట్టిపారేయలేము. వీటి వెనుక పౌరాణిక వాస్తవాల విషయం అటుంచితే, సైంటిఫిక్ లాజిక్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. భూమిమీద జీవరాశి పుట్టినప్పటి నుంచీ, దాని పరిణామ క్రమాన్ని వ్యక్తం చేసేది, దశావతార క్రమం. అందులో తొమ్మిదవ అవతారం, బుద్ధుడని మనం విశ్వసిస్తాము. అయితే, ఆ బుద్ధుడు గౌతమ బుద్ధుడేనా! అన్న విషయానికి వస్తే..
పురాణాల ప్రకారం విష్ణువు వందల అవతారాలు ధరించాడు. కానీ మనకు తెలిసినవి మాత్రం, పదే. అందులో తొమ్మిది ఇప్పటికే అవతరించాడు.. కలియుగాంతంలో రాబోయే పదవ అవతారమైన కల్కి అవతారం కోసం, అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక మన వీడియో విషయానికి వస్తే, గౌతమ బుద్ధుడే విష్ణుమూర్తి తొమ్మిదవ అవతారమనేది, అందరి విశ్వాసమూ. అద్వైత, విశిష్టాద్వైత మతాల మధ్య పోరూ, హిందువుల్లో సంక్షిష్టంగా మారిన విశ్వాసాలూ పెడదారి పట్టినప్పుడు అవతరించిన మూర్తే బుద్ధుడనేది, అందరి నమ్మకం. కానీ, మనకు తెలిసిన బుద్ధుడు విష్ణువు కాదనేది మరో వాదన. ఆ వాదన ప్రకారం, దశావతారాలలో ఉన్న బుద్ధుడు వేరే ఉన్నాడంటారు. దుష్టశిక్షణ సక్రమంగా జరిగేందుకు విష్ణువు, రామ, కృష్ణుల అవతారాల మధ్యలో, బుద్ధుడిగా ఆవతరించాడు.
మనకు తెలిసిన గౌతమ బుద్ధుడు మరో అవతార పురుషుడే కానీ, దశావతారాలలో ఒకరు కాకపోవచ్చు. సామాన్య శక పూర్వం, 568వ సంవత్సరంలో, భారతదేశంలో శైవ, వైష్ణవ, శాక్తేయ మతాలను ధిక్కరిస్తూ, అందులోని లోపాలను తిప్పికొడుతూ, గౌతమ బుద్ధుడు సమాజానికి కొత్త దిక్సూచి అయ్యి నిలిచాడు. ఇప్పుడు నేపాల్‌లో ఉన్న అప్పటి కపిలవస్తు నగరాన్ని ఏలుతున్న రాజు శుద్ధోధనుడు, మాయ దంపతులకు జన్మించిన సిద్ధార్థుడు, అందరు రాజకుమారుల లాగానే, సకల రాజభోగాలనూ అనుభవించిన వాడే. దాదాపు 29 సంవత్సరాలు అన్ని సుఖాలనూ అనుభవించాడు. వైవాహిక జీవితాన్ని అనుభవించి, ఒక కుమారుడికి తండ్రి అయ్యాడు. కానీ, ఆ తరువాతే ఆయన జీవితం మారి పోయింది. సందేహాల పుట్టగా మారి, చివరకు జీవించటమే నరకంగా భావించే పరిస్థితి నెలకొంది. ఇల్లు, సంసారం వదిలి బయటకు వెళ్లిన సిద్ధార్థుడు, కౌండిన్యుడనే యోగి దగ్గర కొంతకాలం శిష్యరికం చేశాడు. కానీ, ఆ శిష్యరికం కూడా సంతృప్తినివ్వలేదు, ఆయన సందేహాలు తీరలేదు. గురువును వదిలి, తిరిగి తిరిగి చివరకు గయకు చేరుకున్నాడు. అక్కడ ఓ రావిచెట్టు సిద్ధార్థుడికి ఆశ్రయాన్నిచ్చింది. ఆ చెట్టే ఆయనకు నివాసమైంది. ఆ చెట్టు క్రిందే జ్ఞానోదయమైంది. ఆ జ్ఞానంతో సిద్ధార్థుడు, గౌతముడయ్యాడు. గౌతముడు బుద్ధుడయ్యాడు. త్రిపీఠికలతో నూతన ఆధ్యాత్మిక ప్రపంచానికి ఆది గురువై నిలిచాడు. ఆయన బోధనలు ప్రపంచానికి తలమానికమై నిలిచాయి. సత్యాహింసలు మహాస్త్రాలుగా తయారయ్యాయి. అందువల్లనే, ఆయనను విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు. ఆయన బోధనలూ, ధర్మ రక్షణా మార్గం, ఆయనను అవతార పురుషుడిగా మార్చాయి.
బుద్ధుడిగా మనకు విడిగా కనిపిస్తున్న మరో రూపం, మన పౌరాణిక గాథల్లో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. గౌతమ బుద్ధుడి మాదిరిగానే, పౌరాణిక బుద్ధుడికీ, రావిచెట్టుతో అనుబంధం ఉంది. పౌరాణిక బుద్ధుడూ విష్ణుమూర్తి అంశతోనే అవతరించాడు. యుగాలకు అందని పౌరాణిక గాధ ఇది.
జనాలను నానా అవస్థలూ పెడుతున్న త్రిపురాసురులనే రాక్షసులను, ఎవరూ జయించలేక పోయారు. త్రిపురాసురుల భార్యలు మహా పతివ్రతలు. వారిపాతివ్రత్య శక్తి వల్ల, త్రిపురులు అజేయులయ్యారు. ఏం చేయాలో దేవతలకు అర్ధం కాలేదు. అప్పుడు ఆ శక్తిని ఉపసంహరింపజేయడానికి, లోకరక్షణ, ధర్మ రక్షణ కోసం, శ్రీ మహా విష్ణువు బుద్ధ రూపాన్ని ధరించాడు. సమ్మోహనకరమైన రూపంతో, ఒక అశ్వత్థ వృక్షమూలాన సాక్షాత్కరించిన అతనిని జూచి, మోహితులై, ధర్మాన్ని తప్పారు ఆ స్త్రీలు. దానితో త్రిపురుల బలం క్షీణించింది. శివుని చేత హతులయ్యారు. ఇదే విషయం, "ఆపన్నివారక స్తోత్రం"లో ఉంది. "దైత్యస్త్రీమనభంజినే" అంటే, రాక్షస స్త్రీల పాతివ్రత్యాన్ని భంగం చేసినవాడని అర్ధం.
ఇక్కడ అశ్వత్ధ వృక్షం అంటే మరేదో కాదు. రావిచెట్టే. ఇదే బోధి వృక్షం. ఇక్కడ పతివ్రతలకు వ్రతభంగం చేసినది శ్రీ మహా విష్ణువే. ఇతడే దశావతారాలలో మనకు కనిపించే బుద్ధుడనేది కొందరి వాదన. కాకపోతే, ఈ కథనానికి విష్ణుకథల్లో పెద్దగా ప్రాధాన్యత కనిపించదు. అశ్వత్థ వృక్షాన్ని పూజించడం, పతివ్రతల గొప్పదనాన్ని వివరించడం వరకే, ఈ కథనాన్ని చెప్పుకొచ్చారు.
నిజానికి దశావతారాలను ఒక క్రమ పరిణామంగా గనుక చూచినట్లయితే, గౌతమ బుద్ధుడిని, తొమ్మిదవ అవతారంగా గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకంటే, విష్ణువు అవతారాలలో మొదటి అయిదు, అంటే, మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలన్నీ, కృతయుగంలో జరిగాయి. ఆ తరువాత త్రేతాయుగానికి వచ్చేసరికి, పరశురామ, రామావతారాలు సంభవించాయి. ద్వాపరయుగంలో కృష్ణావతారం మనకు తెలిసిందే. శ్రీకృష్ణ నిర్యాణంతోనే, ద్వాపర యుగం ముగిసి, కలియుగం మొదలైంది. కలియుగంలో సనాతన ధర్మానికి సంబంధించినంత వరకూ అవతరించిన మహాపురుషుడు, గౌతమ బుద్ధుడొక్కడే. అందుకే దశావతారాల బుద్ధుడు, పౌరాణిక బుద్ధుడు కాకుండా, కపిలవస్తు నగరంలో జన్మించిన సిద్ధార్థుడేనని రూఢి అవుతోంది. ద్వాపర యుగాంతంలో కృష్ణ నిర్యాణానికీ, సామాన్య శక పూర్వం 568లో గౌతమబుద్ధుడు అవతరించటానికీ మధ్య సాగిన 2500 సంవత్సరాల కాలం, ప్రపంచ సమాజాన్ని అస్తవ్యస్తం చేసిన కాలం. అన్ని మతాల మధ్యనా సామరస్యం లోపించిన సమయంలో, అత్యున్నతమైన అహింస, ధర్మ పరిరక్షణ మార్గాలుగా మతాన్ని నిర్మించిన మహాపురుషుడు, గౌతమ బుద్ధుడు. విష్ణుమూర్తి అవతారమా కాదా అన్న ప్రశ్నను పక్కనబెడితే, ఆయన విశ్వానికి మార్గదర్శి. ఇదే సత్యం, ఇదే నిజం. గౌతమ బుద్ధుడు, జీవితం ఎలా గడపాలో నేర్పిన వాడు. మానవత ఆయన మతం, ధర్మం ఆయన మార్గం, అహింస ఆయన వ్యక్తిత్వం. అందుకే అందరికీ ఆయన శరణయ్యాడు.
‘ఆత్మ’ నివాసంగా చేసుకున్న శుక్రకణం గర్భాన్ని కలిగించే శక్తిగలదా?
కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రారంభంలో, శ్రీకృష్ణుడిచే అర్జునుడికి బోధింపబడిన జ్ఞాన నిధి ‘భగవద్గీత’. భారతదేశ న్యాయస్థానాలలో సైతం, ప్రమాణం చేయించడానికి ఎంచుకున్న భగవద్గీతను, పాశ్యాత్యులు సైతం పఠిస్తారు. ఇక మరణమంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? పునర్జన్మలు ఉన్నాయా? ఉంటే చనిపోయిన వారు ఎలా? ఎప్పుడు? ఎక్కడ పుడతారు? లాంటి నిగూఢమైన రహస్యాలను విప్పిచెప్పే మహోత్తర గ్రంధ రాజం, శ్రీమద్ భగవద్గీత.. అటువంటి జన్మ రహస్యాలను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
ఒక ఆత్మ తల్లిదండ్రుల శుక్ల శోణితాల కలయిక వల్ల ఏర్పడిన ఒక సంయుక్త బీజం అంటే, Zygote లోకి ప్రవేశిస్తుంది. “ఆత్మ” పురుషుని ఇంద్రియం ద్వారా, స్త్రీ యొక్క అండంలో కలుస్తుంది. కోట్లాది వీర్యకణాలున్నా, కేవలం ఒక్కటి మాత్రమే అండాన్ని కలిసి ఫలదీకరణం పొంది, పిండంగా మారుతుంది. అంటే, కేవలం ఆత్మ నివాసంగా చేసుకున్న శుక్రకణం మాత్రమే, గర్భాన్ని కలిగించ గల శక్తిని కలిగివుంటుంది. అయితే, కొంతమంది స్త్రీలకు తరుచూ అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. దానికి దాక్టర్లు, జన్యు సంబంధమైన కారణాలనూ, ఇతర అనారోగ్యాలనూ కారణాలుగా చెబుతుంటారు. కానీ, వాస్తవంగా ప్రతి జీవీ, ఈ లోకంలో జీవించటానికి ఒక నియమిత ఆయుర్దాయం కలిగివుంటుంది. అంటే, జీవి పిండంగా మారిన నాటి నుండి, జన్మించి, పెరిగి, వృద్ధాప్యానికి చేరే వరకూ, ఏ దశలోనైనా మరణాన్ని ఎదుర్కుని తీరాల్సిందే. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఒకే స్త్రీకి పదే పదే గర్భస్రావాలవుతున్నప్పుడు, ఒకే ఆత్మ ఆమె శరీరంలో ప్రవేశించి పిండంగా మారి, రెండు మూడు సంవత్సరాల వ్యవధిలోనే, అరడజను సార్లు పుట్టడం, గిట్టడం జరుగుతుంది.
తన కర్మఫలాన్ని బట్టి, ఆత్మ శిశువుగా మారటం, భూమిపై జన్మించడం జరుగుతుంది. కాబట్టి, ఆత్మయొక్క పాపపుణ్యాలను బట్టే, తల్లిదండ్రులు లభిస్తారు. పాపాలు చేసిన ఆత్మ, పాపులైన తల్లిదండ్రులకు జన్మించి, అనేక రకాల శిక్షలను గర్భంలోనూ, జన్మించిన తర్వాతా అనుభవించడం జరుగుతుంది. చావు లేని ఆత్మ, ఒకసారి దేహాన్ని విడిచి పెట్టి, మళ్ళీ జన్మించి మరొక దేహాన్ని పొందినప్పుడు, గతజన్మను గురించిన జ్ఞాపకాలు గుర్తుంటే కలిగే నష్టం, అంతా ఇంతా కాదు. ఎందుకంటే, ఒకసారి మరణించిన తర్వాత, ఆ జన్మతాలూకు జ్ఞాపకాలను మరు జన్మలోకి తీసుకెళ్ళ బడకుండా, ప్రకృతి, లేదా దైవం నియంత్రిస్తుంది. అయితే, కొన్ని అసాధారణ పరిస్థితులలో, మరపు అనే ప్రకృతి ధర్మాన్ని అతిక్రమించి, ఆత్మ తన గత జన్మ జ్ఞాపకాలను మరు జన్నలో కూడా గుర్తుంచుకుని, ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
అలా గత జన్మ జ్ఞాపకాలు గుర్తున్న వ్యక్తులు, ఈ జన్మలో సరిగ్గా జీవించలేరు. జన్మలున్నాయని నమ్మడం వలన కలిగే లాభం, ఆ జనన మరణ వలయం నుండి విముక్తి పొందే మార్గాన్ని కనుగొనటానికి వీలు కలుగుతుంది. పుట్టడం, పెరగడం, ఎంతో మందితో గాఢానుబంధాలు ఏర్పరచుకోవడం, ఆ పై ఆ బంధాలను తెంచుకో లేక, మరణ యాతనను అనుభవిస్తూ, శరీరాన్ని త్యజించడం, మళ్ళీ పుట్టడం, ఈ జన్మ, గత జన్మల బంధాల మధ్య నలిగి పోవడం, అంతేలేని ఈ జనన మరణ చక్రంలో బందీ కావడం, 'వచ్చేవారూ పొయేవారూ జగతి పురాతన సత్రం' అని మహాకవి ఆరుద్ర అన్నట్లు.. ఔను, ఈ భూమిపై పుట్టీ గిట్టే వ్యక్తులు, లోకమనే ఈ సత్రంలో కొద్దిసేపు బసచేసే నిత్య ప్రయాణీకులు..
ఇక భగవంతుడైన శ్రీకృష్ణుడు, స్వయంగా ఆత్మ రహస్యాల గురించి, భగవద్గీతలో చెప్పిన విషయానికి వస్తే, విరక్తి కలిగిన వారూ, వృద్దులూ, కష్టాలలో ఉన్న వారేగాక, ఆత్మను గురించీ, పునర్జన్మలను గురించీ తెలుసుకోవాలన్న ఆసక్తి గల వారెవరైనా, చదివి తీరవలసిన ప్రామాణిక గంధరాజం, శ్రీమద్భగవద్గీత. నిజం చెప్పాలంటే, భారతీయుల కన్నా విదేశీయులే, పునర్జన్మల పరిశోధనలకు భగవద్గీతను ఒక దిక్సూచిగా ఉపయోగించుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విశేషమేమిటంటే, ఇతర మత గ్రంధాలలో ఉన్న మరణానంతర స్థితీ, పునర్జన్మల భావాలూ, ఆ మతాలు పుట్టడానికంటే కొన్ని వేల ఏళ్ల క్రితం గ్రంధస్థం చేయబడిన భగవద్గీతలో చెప్పబడినట్టుగానే ఉన్నాయి. చివరికి హిందూమతాన్నీ, హిందూ కర్మకాండలనూ వ్యతిరేకించి, బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుడు కూడా, కర్మసిద్ధాంతాన్ని అంగీకరించాడు. ప్రతికర్మకూ, ఒక ఫలితం ఉండి తీరుతుందని బుద్ధుడు చెప్పిన మాట, భగవద్గీత సారాంశమైన కర్మసిద్ధాంతమేనని గుర్తించాలి!
శరీరం తాత్కాలికం, ఆత్మ శాశ్వతం.. ఆత్మ అన్నికాలాలలో ఉంటుంది. ఈ నాడు మనం చూస్తున్న మానవులూ, ఇతర జీవులూ, గతం లోనూ ఉన్నారు. కాకపోతే, వేర్వేరు ఆకారాలతో జీవించి ఉండవచ్చు. జీవుడికి బాల్యం, యవ్వనం, వార్ధక్యం ఉన్నట్లుగానే, మరణించిన తరువాత మరొక జన్మ ద్వారా, మరో శరీరం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మ ఎవ్వరిచేతా చంపబడలేదు, ఎవ్వరినీ చంపదు. మనుషులు చిరిగిన వస్త్రాలను వదిలి, కొత్త వస్త్రాలను ఎలా అయితే ధరిస్తారో, అదే విధంగా, జీవుడు ముందు జన్మలోని శరీరాన్ని వదలి, మరు జన్మలో కొత్త శరీరాన్ని ధరించడం జరుగుతుంది. ఆత్మను శస్త్రములుగానీ, అస్త్రములుగానీ ఛేదించలేవు, అగ్ని దహించ లేదు, నీరు తడుప లేదు. ఆత్మ సర్వవ్యాపి, నాశరహితము. ఇంద్రియములకు ఆత్మ గోచరము కాదు. అంటే, ఆత్మను చూడలేము, స్పృశించలేము. అందుకే, పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారు మరల జన్మించక తప్పదు. ఈ ప్రయాణంలో మానవులు తాము చేసిన పాప పుణ్యాలకు ప్రతిఫలాలను స్వర్గ-నరకాలలో అనుభవించి, కర్మఫలం పూర్తి కాగానే, మళ్ళీ జన్మిస్తుంటారు.
ఇక గతంలో మనం గరుడపురాణం, కఠోపనిషత్తు వంటి గ్రంధాల ఆధారంగా చేసిన వీడియోలను చూసిన చాలామంది, మంచీ చెడు కర్మ ఫలాలను స్వర్గ నరకాలలో అనుభవించినప్పుడు, మళ్ళీ ఈ జన్మలో ఈ కష్టాలు దేనికి అనే సందేహాన్ని వెలిబుచ్చారు. కష్టాలు అనుభవిస్తున్న వారు అంటే కురూపులూ, అంగ వైకల్యం గలవారూ, నిరు పేదలూ, గత జన్మలలో చేసిన పాపాలకు నరకంలో శిక్షలను అనుభవించి, ఇంకా స్వల్పంగా మిగిలిన పాపాలను అనుభవించటానికి, అలా జన్మిస్తారు. అలాగే, గతజన్మలలో పుణ్యాలూ, మంచి పనులూ చేసిన వారు, స్వర్గంలో సుఖాలను అనుభవించి, మిగిలిన కొద్దిపాటి పుణ్యఫలాన్ని అనుభవించటానికి, సౌందర్యవంతులుగా, మేధావులుగా, మరియు సంపన్నులుగా పుడతారు. శారీరక లోపాలున్న వారూ, డబ్బు లేని వారూ అనుభవించే బాధలూ, కష్టాలూ, పైనున్న నరకంలో అనుభవించే శిక్షలకన్నా తక్కువేమీ కాదు.
అలాగే, గత జన్మల పుణ్యం వలన ఈ జన్మలో అన్నీ ఉన్న వారిగా జన్మించిన వారు, అహంకారంతో అభాగ్యులను హింసిస్తే, అది శాపంగా మారుతుంది. అంటే, అన్నీవున్న జన్మ కలిగినప్పుడు, మరిన్ని మంచి పనులను చేస్తే, స్వర్గలోక ప్రాప్తితోబాటు, వచ్చే జన్మలోనూ మరింత ఉన్నతంగా జీవిస్తారు. దేవతలను పూజించే వారు, మరణానంతరం, దేవలోకాలకు చేరతారు. భూత ప్రేతాలను పూజించే వారూ, క్షుద మాంత్రికులూ, హంతకులూ, పిశాచాలుగా మారి, ఈ భూమిపైనే సంచరిస్తూ ఉంటారు. వారికి పునర్జన్మ లభించక, స్వర్గం-నరకం లేని ఒక దుస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఆత్మలే, బలహీన మనస్కులను ఆవహిస్తాయి. దానినే దెయ్యం పట్టడమని కూడా అంటారు.
వాయువు వాసనలను ఒక చోటినుండి మరొక చోటికి తీసుకు పోయినట్టుగా, దేహానికి యజమానైన జీవాత్మ, ఒక శరీరాన్ని త్యజించేటప్పుడు, మనస్సు, ఇంద్రియాలను గ్రహించి, వాటితో పాటు మరొక శరీరాన్ని పొందుతుంది. ఈ అంశానికి తిరుగులేని ఋజువు, అతిచిన్న వయస్సులోనే గణితం, ఈత, డ్రైవింగ్ వంటి విషయాలలో అసమాన ప్రతిభను చూపే పిల్లలను చెప్పుకోవచ్చు.
ఇటీవల విజయవాడలో అక్షయ, సువీర్ అనే 5 సంవత్సరాల లోపు చిన్నారులు, కృష్ణానదిని ఈదారు. సరిగ్గా నేల మీదనే అడుగులు వేయలేని చిన్నారులు, గజ ఈతగాళ్ళు మాత్రమే ఈదగలిగే కృష్ణానదిని ఈదటం, పూర్వజన్మ వాసన కాదంటారా! గత జన్మలో రాక్షస ప్రవృత్తి గలవారు, ఈ జన్మలో హత్యలూ, మాన భంగాలూ చేసే సంఘ విద్రోహక శక్తులుగా జన్మిస్తారు. కొందరు విపరీతమైన తిండిబోతులుగానూ, మరి కొందరు విశృంఖలమైన కాముకులుగానూ, కాసుల కోసం ఎంతటి నీచానికైనా దిగజారే వారిగానూ జన్మించటానికి గల ఏకైక కారణం, వారు గతజన్మలోనూ అలాంటి లక్షణాలను కలిగి ఉండటమే.
ఇక రామాయణ, భాగవత గ్రంధాలను పరిశీలిస్తే, పునర్జన్మలున్నాయని తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువును దర్శించడానికి వచ్చిన సనక సనందనాదులనే బుషులను, వైకుంఠానికి పోనీయకుండా ఆపిన వైకుంఠ ద్వార పాలకులైన జయవిజయులు, ఆ మునుల శాపానికి గురై, ఆ తరువాత మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించి, శ్రీమన్నారాయణుడి చేతిలో మరణించినట్లుగా తెలుస్తోంది. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షులుగా జన్మించిన వారిని, వరాహ, నారసింహ అవతారాలు ధరించి, విష్ణువు సంహరించాడు. అలాగే, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణాదులుగా జన్మించిన వారిని, రామావతారం ధరించి సంహరించాడు. మూడవ జన్మలో శిశుపాలుడు, దంతావక్రులుగా జన్మించిన వారిని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సంహరించాడు. సంభవామి యుగేయుగే అన్న గీతా వాక్యం, అన్ని కాలాలలోనూ నిజమైంది. రాబోయే కాలంలోనూ నిజమవుతుంది.
అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయి? TELUGU VOICE
“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలూ, డాబూ పెంచుకుంటే, ఏ నాటికైనా పతనం తప్పదు” అన్నది ఆర్యోక్తి.. ఉదాహరణకు, వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది. సమంగా ఉంటే బంగారం పండుతుంది. అదే అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుని, వరిని మనిషి అనుకుంటే, తగినంత లేకుంటే కరవు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే తనను తాను నశింపచేసుకునే రాచ మార్గం! అదే అధికంగా ఉన్న ధనాన్ని, ఉదాహరణగా తీసుకున్న నీటిని తీసివేయడంలాగా ధనం దానం చేస్తే, తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. ఇందుకు అద్భుతమైన ఉదాహరణ, ‘చక్వవేణుడి గాథ’. అసలు ఎవరీ చక్వవేణుడు? ఆయన ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటి?
ప్రస్తుత లోకం తీరు మారింది. ఉన్నది తినడం అటుంచి, తింటున్నది ఎదుటి వాడికి చూపిస్తూ గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్యం పెరిగింది. తమదగ్గరున్న డబ్బు, బంగారం, కార్లూ, బంగళాలూ, విలాస వస్తువులూ, తిరిగిన ప్రాంతాలూ, అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా, లేదా స్టేటస్ లలో చూపాలి. చీరలూ, నగలూ ధరించి, షోకేసులలో బొమ్మల్లా ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపూ, నవ్వూ, ప్రదర్శన, అంతా పటాటోపమే. వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి ఇతరులు అనుకరించ కూడదు. మరి అంతర్గత శాంతీ, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటాయని అడిగేవారు, తప్పనిసరిగా చక్వవేణ మహారాజు గాధను తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి!
ఒకానొకప్పుడు చక్వవేణుడనే ధర్మాత్ముడూ, సదాచార పరాయణుడూ, సత్యవాదీ, దయామయుడూ, మహాజ్ఞానీ అయిన మహారాజుండేవాడు. తన మీద తాను ఆధారపడి, కష్టపడి, తనకు అవసరమైనది సంపాదించుకునే వాడు. త్యాగ శీలుడు, విరాగి, జ్ఞాని, భక్తుడు, తేజశ్శాలి, తపోమూర్తి, ఉన్నత శ్రేణికి చెందిన అనుభవశాలియైన మహాపురుషుడాయన. రాజ్య సంబంధమైన ద్రవ్యాన్ని తన కోసము, తన భార్య కోసము వినియోగించుకోవడం దోషంగా భావించి, దానిని ముట్టుకోకుండా, ఆ డబ్బుకు దూరంగా ఉండే వాడు.
పన్నుల రూపంలో ప్రజలనుండి వసూలు చేసిన ద్రవ్యాన్ని, వారి క్షేమం కోసమే వినియోగించే వాడు. అతడు రాజ్య కార్యాలను, ప్రతిఫలాపేక్షనూ, అభిమానాన్నీ వర్జించి, తనువునూ, మనస్సునూ లగ్నం చేసి నిర్వర్తించే వాడు. ప్రజలమీద అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. రామ రాజ్యంలో లాగా, అతని రాజ్యం లోని ప్రజలందరూ, దుఃఖమంటే ఏమిటో తెలియక, అన్ని రకాల సుఖ సంపదలతో ఎంతో సంతోషంగా ఉండే వారు.
మహారాజు తనూ, తన భార్యా జీవించడానికి, రాజ్యానికి సంబంధించిన డబ్బు ముట్టకుండా, ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకునే వారు. ఆ వ్యవసాయానికి కూడా, ఎద్దులను ఉపయోగించే వారు కాదు. ఎద్దులకు బదులుగా, రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లే వాడు. తమ పొలంలో పండిన పత్తితో బట్టలు నేసుకుని, వాటినే ధరించే వారు. తమ పొలంలో పండిన ఆహారమే తినే వారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు. అతడు రాజ్య ద్రవ్యాన్ని వినియోగించి, ఆమెకు ఆభరణాలేవీ చేయించే వాడు కాదు.
వారి పొలంలో పండే పంట, వారికి సాధారణమైన అన్న వస్త్రాదులతో, కాలం గడపడానికి మాత్రమే సరిపోతూ ఉండేది. ఒక్క పొలం పనులకే కాక, ఆయన రాజ్య కార్యాల కోసం కూడా కాలాన్ని వినియోగిస్తూ ఉండేవాడు. ఆయన జీవనం, సదాచార సంపదతో, సాదాసీదాగా బ్రతికే ఒక రైతు జీవనాన్ని పోలి ఉండేది. ప్రతి దినమూ ఆరు గంటల కాలము నిద్రకు పోగా, మిగిలిన కాలమంతా అతడు దేవుడిని పూజించడం, ఇతరులకు సహాయం చేయడం, రాజ్య పనులు చూసుకోవడం, పొలం పనులు చేసుకోవడం వంటి వాటిలో, మునిగి తేలుతూ ఉండేవాడు.
అతడికి అన్ని జీవుల పట్లా సమానత్వ భావన ఉండేది. జంతువుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండే వాడు. అన్ని రకాల జీవులనూ, ప్రాణులనూ, పరమాత్మ స్వరూపములుగా భావించే వాడు. అందరికీ సమానమైన ప్రేమాభిమానాలతో సేవలు చేసే వాడు. అతడికి ఏదైనా అవసరం ఏర్పడినా, ఎవ్వరినీ ఏదీ అడిగే వాడు కాదు. సహజంగానే అతడిలో దేని మీదా వ్యామోహం ఉండేది కాదు. సేవకుల చేత కానీ, రాజ్య సంబంధమైన పనులు చేసే వారి చేత కానీ, తాను ఏ పనీ చేయించుకునే వాడు కాడు. అతడు ఏ పని చేసినా, ఆసక్తినీ, అహంకారాన్నీ విడిచిపెట్టి, ఎంతో ఉత్సాహంతోనూ, ధైర్యంతోనూ చేస్తూ ఉండేవాడు.
ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు. తాను రాజద్రవ్యాన్ని ముట్టడు. కానీ, తను సామ్రాట్టుగనుక, దుష్టులూ, బలవంతులూ, అత్యాచారులూ అయిన రాజుల దగ్గర నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు కదా! అని అనుకున్నాడు. తన మంత్రిని పిలిపించి, రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, తాను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని ఆజ్ఞాపించినట్లుగా చెప్పి తీసుకురమ్మని, అనుజ్ఞ ఇచ్చాడు.
మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు, అతడిని పరిహాసం చేసి పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా ఆమె, ‘స్వామీ! మీరు పొరపాటు చేశారు. వారు అడిగిన బంగారాన్ని ఇచ్చి వేయ వలసింది. చక్వవేణుడి మహిమను మీకు చూపుతాను..’ అని అన్నది. ఆమె పక్షులకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి’ అని అన్నది. అవి ఎంతమాత్రం లెక్క చెయ్యక తిన సాగాయి. వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన.. ఇక గింజలు ముట్టకండి’ అని అన్న వెంటనే, పావురాలన్నీ ఎగిరిపోయాయి. ఒక్క చెవిటి పావురం మాత్రం, ఆమె అన్నది వినబడక గింజ తినగానే, తల తెగి క్రింద పడింది. కొద్దిసేపు ఆగిన రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను. గింజలు తినండి’ అన్న మరు నిముషం, పక్షులు మళ్ళీ వాలి, గింజలు తిన సాగాయి. ‘చూసారా స్వామీ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ’ అని అన్నది మండోదరి. అయినా పక్షులను అల్ప జీవులుగా, తేలికగా కొట్టి పారేశాడు రావణుడు.
చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుకతో లంకా నగర నమూనాను చేసి, ఒక వినోదం చూపుతానని రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపున్న బురుజులూ, ప్రాకారాలనూ పడగొట్టాడు. వెంటనే లంకలో నిజంగా అమరి ఉన్న తూర్పు వైపు బురుజూ, ప్రాకారం కూలి పోయాయి. అది చూసి హతాశుడయ్యాడు రావణుడు. ఆ తరువాత మంత్రి, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, నమూనాలోని తూర్పువైపు స్థూపాలను పడగొట్టగానే, నిజ లంకాపురి స్థూపాలు కూలి పోయాయి. ఇదంతా చూసి బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి పంపాడు.
మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వబోగా, అతడు అది ఎలా తెచ్చాడో చెప్పమని అడిగాడు. మంత్రి చెప్పినది విన్న రాణి ఆశ్చర్యచకితురాలయ్యింది. తన భర్త పవిత్ర వర్తనం యొక్క మహిమ తెలుసుకున్న ఆమె, బంగారం వద్దన్నది. ఆ బంగారం తిరిగి రావణుడికి పంపివేయ బడింది. అన్ని లోకాలనూ ప్రభావితం చేయగల చక్వవేణుడి త్యాగ బుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి పంపి వేశాడు.
ఈ కథలో మనం తెలుసుకోవలసిన నీతి.. క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలుగజేస్తుంది. అందుకే దురభ్యాసాలూ, మత్తు పదార్ధాలూ, క్రీడా వినోదాలూ, ఖరీదైన ఆడంబరాలతో గడిపే వారి సాంగత్యానికి దూరంగా ఉండాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విష తుల్యమే. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించే పిడికెడు అన్నమైనా అమృత తుల్యమే. దానం, దయ, ప్రేమతో అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతమవుతుంది!
శ్రీ రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. శత రుద్రీయం, యజుర్వేదంలో భాగం. ఇది శివునికి అంకితం చేయబడిన శ్లోకం. మరణాన్ని సహితం అధిగమించగలిగిన సాధనం. ఇది జన్మకూ, మృత్యువుకూ అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేదీ, మరల దానిని తీసుకుపోయేది కూడా, ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది. వేద శ్లోకాలలో గొప్పదైన రుద్రం, అన్ని రకాల ప్రయోజనాల కోసం, అన్ని దోషాలనూ, కష్టాలనూ తొలగించడానికి సహకరిస్తుంది. పూజలు, హోమాలలో, దీనిని వేద పండితులు పఠిస్తారు. శ్రీ రుద్రం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం, యజుర్వేదంలోని 16వ అధ్యాయంలోనిది. 'నమో' అనే పదాన్ని పదే పదే ఉపయోగించడం వల్ల, నమకం అని పిలుస్తారు. రెండవ భాగం, యజుర్వేదంలోని 18వ అధ్యాయంలోనిది. 'చమే' అనే పదాలను పదే పదే ఉపయోగించడం వల్ల, దీనిని చమకం అని పిలుస్తారు.
నమకం చమకం ఎవరైతే మూడు సార్లు, పురుష సూక్తంతో ప్రతి దినం చదువుతారో, వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒక్కో భాగాన్ని, “అనువాకం” అని అంటారు. మొదటి అనువాకం, పరమ శివుడిని తన రౌద్ర రూపాన్ని వదిలి, తన అనుచరులనూ, ఆయుధాలనూ త్యజించమని, ప్రసన్నం చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయదలచమని ప్రార్ధించే భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేసే విధానాలు కూడా కనిపిస్తాయి.
మొదటి అనువాకం: తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్నీ, దైవం యొక్క ఆశీర్వచనాన్నీ పొందేటట్లుగా చేసి, క్షామం, భయం పోయేటట్లు చేసి, ఆహార, గో సంపద సమృద్ధి గావించి, గో సంపదను చావునుండీ, ఇతర జంతువులనుండీ, జబ్బులనుండీ కాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనం చేస్తుంది.
రెండవ అనువాకం: ప్రకృతిలో, సర్వ ఔషధాలలో, సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన. శత్రు వినాశనానికీ, సంపద, మరియు రాజ్యప్రాప్తికీ, జ్ఞాన సాధనకూ, ఈ అనువాకాన్ని చదువుతారు.
మూడవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణించబడింది. ఆయన సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహా స్వరూపాన్ని అర్ధం చేసుకోక, నిమిత్త బుద్ధిని అలవరుచుకుంటాడు. ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి, జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టిస్తాడు. ఈ అనువాకం, వ్యాధి నివారణకు కూడా చదువుతారు.
నాలుగవ అనువాకం: ఇందులో రుద్రుడు సృష్టి కర్త, కారకుడు. చిన్నా, పెద్దా ప్రతీదీ ఆయన చేసిన సృష్టే. ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.
అయిదవ అనువాకం: ఈ అనువాకంలో, పారే నీట ఉండే రూపంగా, రుద్రుడు కొనియాడబడతాడు. ఆయన పంచ తత్వాలు వర్ణించబడతాయి. అంటే, సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
ఆరవ అనువాకం: ఇందులో రుద్రుడు కాలరూపుడు. ఆయన అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు, ఆస్తుల పెంపుకూ, శత్రువుల మీద విజయానికీ, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికీ, సుఖ ప్రసవానికీ, జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికీ, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.
ఏడవ అనువాకం: నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకూ, ఆరోగ్యానికీ, ఆస్తినీ, వారసులను పొందడానికీ, పశు సంపద, వస్త్రాలు, భూములు, ఆయుష్షు, మొక్షం కోసం కూడా చదువుతారు.
ఎనిమిదవ అనువాకం: ఇందులో శివుడు, ఇతర దేవతల కారకుడిగానూ, వారికి శక్తి ప్రదాతగానూ వర్ణింపబడ్డాడు. ఆయన అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలనూ పోగొట్టేవాడు. శత్రువులను నాశనము చేసి, సామ్రాజ్యాన్ని సాధించడానికి, ఈ అనువాకాన్ని చదువుతారు.
తొమ్మిదవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుని శక్తీ, ప్రకాశం, సకల దేవతలకూ శక్తినిచ్చేవిగా ప్రస్తుతించ బడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులనూ శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారం కోసం, మంచి సహచరి కోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
పదవ అనువాకం: ఈ అనువాకంలో మరలా, రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన అమ్ములను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై, ప్రసన్న వదనంతో దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం, వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టటానికీ, భైరవ దర్శనార్ధమై, అన్నిరకాల భయాలను పోగొట్టటానికీ, అన్ని పాపాలనూ పోగొట్టటానికీ చదువుతారు.
పదకొండవ అనువాకం: ఈ అనువాకంలో రుద్రుని గొప్పదనాన్ని ప్రస్తుతించి, ఆయన కరుణా ప్రాప్తికై, నిర్బంధమైన నమస్సులు అర్పించబడతాయి.
ఈ అనువాకాన్ని సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్య వృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికై చదువుతారు.
ఇక చమకం విశిష్టత: నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి, దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది, చమకం. ఇది ప్రతి ఒక్కరికీ పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గంలో, ప్రతి పనినీ మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందాన్ని కలుగచేసే మంత్రమిది. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి, ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం ఆయన నుండి ఉద్భవించినదే గనుక, మోక్షాకాంక్ష దైవత్వానికి సూచనే..
మరొక్క విజ్ఞప్తి.. చాలా మందికి సహజంగా కలిగే సందేహం ప్రకారం, ఇక్కడ మరణాన్ని అధిగమించడం అంటే, చిరంజీవిత్వం పొందడం కాదు.. అకాల మృత్యువును జయించడం అనే వాస్తవాన్ని గమనించాలి.