Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Wednesday, January 17, 2024

శ్రీరామ పట్టాభిషేకం! భాగం - 1 Coronation of Lord Rama in Ayodhya - Shri Rama Pattabhishekam


శ్రీ రామ పట్టాభిషేకం! భాగం - 1  @mplanetleaf  
రాముడు పట్టాభిషిక్తుడవ్వడం భరతుడికి ఇష్టమేనా?

రామాయణంలోని ప్రతి ఘట్టం ఒక మధుర కావ్యంలానే ఉంటుంది. ఒక్కో కాండం, అద్భుతమైన భావోద్వేగాలను జనింపజేస్తుంది. రామాయణంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం, శ్రీ రామ పట్టాభిషేకం. రాముడికి రాజుగా పట్టాభిక్తుడవ్వడం ఇష్టమేనా? రాముడి దూతగా హనుమ భరతుడి దగ్గరకు ఎందుకు వెళ్ళాడు? పుష్పక విమానంలో లంక నుండి బయలుదేరిన రాముడు, సీతతో పంచుకున్న విషయాలేంటి? పుష్పక విమానంలో ఎవరెవరు అయోధ్యకు చేరుకున్నారు - వంటి మధురమైన విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/6D9Vuf63rNc ]


తాము అయోధ్యకు పయనమవ్వడానికి ప్రయాణ సాధనం ఏదైనా ఉన్నదా? అని రాముడు విభీషణుడిని అడగగా, విభీషణుడు వెంటనే పుష్పక విమానాన్ని ఏర్పాటు చేశాడు. రాముడు ఆ విమానాన్ని ఎక్కిన తరువాత వానరులతో, "మీరందరూ నాకోసం చాలా కష్టపడ్డారు. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. నేను బయలుదేరతాను" అని చెప్పగా వారందరూ, "మిమ్మల్ని విడిచి మేము ఉండలేము. మేము కూడా మీతో అయోధ్యకు వచ్చేస్తాము. మేము అక్కడ ఎక్కువ రోజులుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. మిమ్మల్ని కన్న కౌసల్యా మాతను ఒకసారి దర్శించుకోవాలని ఉంది. మీరు పట్టాభిషిక్తులై సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది" అని అన్నారు. విశాల హృదయుడైన రాముడు సరే అనేసరికి, అక్కడున్న వాళ్ళందరూ ఆ పుష్పక విమానంలోకి గబగబా ఎక్కేశారు. తరువాత ఆ విమానం ఆకాశంలోకి ఎగిరిపోయింది.

రాముడు సీతమ్మకు పుష్పక విమానం నుండి కిందకి చూపిస్తూ, "సీతా, ఇదిగో ఇదే నేను రావణుడిని పడగొట్టిన ప్రదేశం. అదిగో అది కుంభకర్ణుడు పడిపోయిన ప్రదేశం. అది నరాంతకుడు పడిపోయిన ప్రదేశం. ఇది హనుమ విరూపాక్షుడిని పడగొట్టిన ప్రదేశం. ఆ సముద్రంలో ఉన్న సేతువును మేము వానరులతో కలసి నిర్మించాము. ఇక్కడే మేమందరమూ కూర్చుని, ఈ సముద్రాన్ని ఎలా దాటడం అని ఎంతో ఆలోచించాము. ఇదే కిష్కింధ. ఇక్కడి నుంచే వానరులు అన్ని దిక్కులకూ నీ జాడను కనిపెట్టడానికి బయలుదేరారు" అని చెప్తుంటే, సుగ్రీవుడు గబగబా వచ్చి, "రామ! మనం కిష్కింధ మీద నుంచే వెళుతున్నాము కదా, నా భార్యలు తారా, రుమా చూస్తుంటారు. వాళ్ళని కూడా ఎక్కించుకుందాము" అన్నాడు. రాముడు సరేనని ఒప్పుకోవడంతో, పుష్పకవిమానాన్ని కిందకి దింపారు. సుగ్రీవుడు వెంటనే వెళ్ళి, తార, రుమలకు విషయాన్ని చెప్పి, రమ్మన్నాడు.

అప్పుడు తార మిగిలిన ఆడవారి దగ్గరికి వెళ్ళి "రండి, రండి. సుగ్రీవుడు జయాన్ని సాధించి, రామ పట్టాభిషేకానికి వెళుతున్నారు. మంచి మంచి బట్టలు, ఆభరణాలు వేసుకుని అందరూ వచ్చెయ్యండి" అని చెప్పింది. అప్పుడు అక్కడున్న ఆడ వానరులందరూ మానవ కాంతలలాగా  కామరూపాలను పొంది, పట్టుపుట్టాలు, ఆభరణములు వేసుకుని, పుష్పక విమానానికి ప్రదక్షిణం చేసి లోపలికి ఎక్కి, "సీతమ్మ ఎక్కడ? సీతమ్మ ఎక్కడ?" అని అడిగారు. "ఆవిడే సీతమ్మ" అని చూపిస్తే, అందరూ వెళ్ళి ఆమెకి నమస్కరించారు. అప్పుడు సీతమ్మ వాళ్ళందరినీ సంతోషంగా కౌగలించుకుని, పలకరించింది.

మళ్ళి రాముడు సీతతో "సీత, అదే ఋష్యమూక పర్వతం. అక్కడే నేను, సుగ్రీవుడు కలుసుకున్నాము. అది శబరి యొక్క ఆశ్రమం. అక్కడున్న చిక్కటి వనంలోనే కబంధుడిని చంపాను. చూశావా సీత, అది మనం ఉన్న పంచవటి ఆశ్రమం.  అక్కడే రావణుడు నిన్ను అపహరించాడు" అని రాముడు చెబుతుంటే, సీతమ్మ గబుక్కున రాముడి చెయ్యి పట్టుకుంది. ఇంకా కొంత ముందుకు వెళ్ళాక, అదే అగస్త్య మహర్షి ఆశ్రమం. అక్కడే అగస్త్యుడు నాకు రావణ సంహారం కోసం అస్త్రాన్ని ఇచ్చాడు. అక్కడ కనపడుతున్నది సుతీక్షణుడి ఆశ్రమం. ఆ పక్కన కనపడుతున్నది చిత్రకూట పర్వతం. అక్కడే మనం తిరుగుతూ ఉండేవాళ్ళము" అన్నాడు. అలా రాముడు పుష్పకవిమానంలో ప్రయాణం చేస్తున్నంత సేపు, సీతమ్మకు దారి పొడవునా ఉన్న ప్రాంతాలను చూపిస్తూ, అక్కడ జరిగిన సంఘటనలు వివరించాడు.

అలా ఆ పుష్పక విమానం కొంత ముందుకు వెళ్ళాక, వాళ్ళకి భరద్వాజ మహర్షి ఆశ్రమం కనపడింది. అప్పుడు ఆ పుష్పక విమానాన్ని అక్కడ దింపి, భరద్వాజుడికి నమస్కరించారు వాళ్ళు అందరూ. భరద్వాజ మహర్షి రాముడిని చూసి సంతోషిస్తూ, "రామ! నేను నా తపఃశక్తితో అన్ని కాలాలలో నీ గురించి తెలుసుకుంటున్నాను. నువ్వు రావణ సంహారం చెయ్యడం నాకు తెలుసు. ఈ ఒక్క రాత్రి నా ఆశ్రమంలో ఉండి విశ్రాంతి తీసుకుని, నా ఆతిధ్యం స్వీకరించిన తరువాత నువ్వు బయలుదేరు" అని అన్నాడు. అప్పుడు రాముడు భరద్వాజుడి మాట కాదనలేక, అక్కడ ఉండటానికి నిర్ణయించుకున్నాడు. తరువాత  హనుమంతుడిని పిలిచి, 'హనుమ! నువ్వు ఇక్కడినుండి బయలుదేరి వెళ్ళి, గంగానది ఒడ్డున శృంగిభేరపురంలో గుహుడు ఉంటాడు. అతను నాకు మిక్కిలి స్నేహితుడు. గుహుడికి నా క్షేమ సమాచారం చెప్పి, పట్టాభిషేకానికి రమ్మని చెప్పు. ఆ పని అయిపోయిన తరువాత అక్కడినుండి బయలుదేరి, అయోధ్యలో అందరూ కుశలంగా ఉన్నారా లేదా? అని కనుకకుని, నందిగ్రామానికి వెళ్ళు. అక్కడ అందరితో నేను తిరిగి వస్తున్నానని చెప్పు. ముఖ్యంగా భరతుడికి అదే మాట చెప్పి, ఆయన ముఖకవళికలు గమనించు.

భరతుడి ముఖంలో ఏదన్నా కొంచెం బెంగ నీకు కనపడితే, వెంటనే వెనక్కి వచ్చెయ్యి. ఇంక నేను అయోధ్యకి రాను. భరతుడు అయోధ్యను పాలిస్తాడు. ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా కనిపెట్టి తిరిగిరా" అన్నాడు. వెంటనే హనుమంతుడు అక్కడి నుండి బయలుదేరి గుహుడిని కలుసుకుని, ఆయనని పలకరించి, రాముడు చెప్పిన విషయాన్ని చెప్పాడు. తరువాత అక్కడినుండి బయలుదేరి వెళ్ళి భరతుడిని కలుసుకుని, రాముడు పడిన కష్టాలు, సీతాపహరణం, రావణ వధ మొదలైన విషయాలను వర్ణించి చెప్పాడు. హనుమంతుడి మాటలు విన్న భరతుడు చాలా సంతోషించాడు.

మరునాడు ఉదయం రాముడు బయలుదేరబోయేముందు భరద్వాజుడు రాముడితో, "రామా!! నీ ధర్మానుష్టానికి నాకు ప్రీతి కలిగింది. నీకొక వరం ఇస్తాను, ఏదన్నా కోరుకో" అని అన్నాడు. అప్పుడు రాముడు, "వానరములు ఎక్కడ ఉంటాయో అక్కడ ఫలసంవృద్ధి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడి నుండి 3 యోజనముల దూరం వరకూ అయోధ్యకు ప్రయాణిస్తాము. ఆ మార్గంలో కూడా, చెట్లన్నీ ఫల పుష్పభరితములై, తేనెపట్లతో తేనెలు కారుతూ ఉండాలి. ఇలా నాకు వరం ఇవ్వండి" అని అడిగాడు. భరద్వాజుడు రాముడు అడిగినట్టు వరం ఇవ్వగానే, భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకుని, కోలాహలంతో నందిగ్రామానికి చేరుకున్నాడు రాముడు. అప్పుడు భరతుడు తన సైనికులతో "రాముడు వచ్చేస్తున్నాడు. అయోధ్యలో ఉన్న తల్లులను తీసుకురండి. రథాలని తీసుకురండి. పెద్దవాళ్ళని తీసుకురండి. అందరినీ అయోధ్యకు రమ్మనండి. అంతటా పసుపు నీరు, గంధపు నీరు జల్లించండి. దివ్యమైన ధూపములు వెయ్యండి. అందరమూ కలిసి రాముడిని నందిగ్రామం నుండి అయోధ్యకు పట్టాభిషేకానికి తీసుకువెళదాము" అని భరతుడు ఆజ్ఞాపించాడు.

రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్య వాసులు, పరుగు పరుగున నందిగ్రామానికి వచ్చారు. అలా రాముడి రాక అయోధ్యకు కొత్త కాంతి తీసుకొచ్చింది. రాముడు పుష్పక విమానం నుండి కిందకి దిగగానే, భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, అన్నగారి పాదాలకు పాదుకలు తొడిగాడు. ఇది చూసి సుగ్రీవ విభీషణుల కన్నుల నుండి నీళ్ళు కారాయి. వెంటనే భరతుడు సుగ్రీవుడిని కౌగలించుకుని, "ఇంతకముందు మేము నలుగురము, ఇవ్వాల్టి నుండి, మనం అయిదుగురన్నదమ్ములము సుగ్రీవ" అని అన్నాడు. తరువాత అక్కడున్న గంధమాదనుడూ, మైందుడూ మొదలైనవారిని భరతుడికి పరిచయం చేశారు. అప్పుడు భరతుడు ఆ వానరాలతో, "మీరు మా అన్నయ్యకి సహాయం చేశారు. మీకు ఋణపడి ఉన్నాం" అని అందరినీ కౌగలించుకున్నాడు. పుష్పకం నుండి కిందకి దిగిన వానరకాంతలు, అక్కడున్న ఆడవారి రూపాలనూ, వారి అలంకారాలనూ చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్కడికి వచ్చిన కౌసల్య, కైకేయ, సుమిత్రలు వారందరితో, "ఈ వానర కాంతలందరికీ మేమే తలస్నానాలు చేయిస్తాము" అని వాళ్ళందరికీ చెప్పి తలస్నానాలు చేయించారు. తరువాత రాముడు ఆ పుష్పక విమానాన్ని, కుబేరుడి దగ్గరికి వెళ్ళిపొమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడా ఆ పుష్పకం కుబేరుడి దగ్గరికి వెళ్ళిపోయింది.

భరతుడు తలవంచి నమస్కారం చేసి రాముడితో, "అమ్మ కైకేయి ఆనాడు రెండు వరాలడిగింది. ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడిగా పుట్టి, రాజ్యం పొందడానికి సమస్త అర్హతలు కలిగి ఉన్న నువ్వు, తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసం రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయావు. నీ పాదుకలను వ్యాసంగా ఇచ్చి, నన్ను రాజ్యం చెయ్యమన్నావు. నువ్వు నాకు రాజ్యాన్ని ఎలా ఇచ్చావో, అలా ఆ రాజ్యాన్ని తీసుకువచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. నీకు ఉన్నదానిని నాకు ఇచ్చి, నేను దానిని అనుభవిస్తుంటే చూసి నువ్వు మురిసిపోయావు. ఇవ్వాళ నేను దానిని నీకు అప్పగించేస్తున్నాను" అని అన్నాడు. భరతుడి మాటలకు సంతోషించిన రాముడు, తిరిగి రాజ్యాన్ని స్వీకరించడానికి అంగీకరించాడు. శత్రుఘ్నుడు అక్కడికి వచ్చి, "అన్నయ్య! క్షుర కర్మ చేసేవారిని తీసుకొచ్చాను. నీ జుట్టు జటలు పట్టేసింది కదా, అందుకని క్షుర కర్మ చేయించుకో" అని అన్నాడు. అప్పుడు రాముడు, "నేను తండ్రిమాట నిలబెట్టడం కోసమని, నా అంతట నేనుగా అరణ్యవాసానికి వెళ్ళాను. కానీ, తండ్రి ఆజ్ఞాపించకపోయినా, నా మీద ఉన్న  ప్రేమ చేత, స్వచ్ఛందంగా తనంత తాను దీక్ష స్వీకరించి, నా పాదుకలను తీసుకెళ్ళి సింహాసనంలో పెట్టి, 14 సంవత్సరములు రాజ్యము మీద  మమకారము లేకుండా పరిపాలించిన భరతుడు, ముందు దీక్ష విరమించి స్నానం చేస్తే తప్ప, నేను దీక్షని విరమించను" అని అన్నాడు.

భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు క్షుర కర్మ చేయించుకుని మంగళస్నానం చేశాక, రాముడు క్షుర కర్మ చేయించుకుని మంగళ స్నానం చేశాడు. తరువాత రాముడు అందమైన పట్టుపుట్టములను ధరించి, మంచి అంగరాగములను పూసుకుని, దివ్యాభరణములను ధరించి బయటకు వచ్చాడు. తన కొడుకు ఇన్నాళ్ళకు తిరిగొచ్చాడని పొంగిపోయిన కౌసల్యా దేవి, సీతమ్మకు అభ్యంగన స్నానం చేయించి, మంచి పట్టుపుట్టం కట్టి, చక్కగా అలంకరించింది. కౌసల్య, సుమిత్ర, కైకేయిల చేత అలంకరింపబడ్డ వానర కాంతలు, 9000 ఏనుగులను ఎక్కారు. దశరథుడు ఎక్కే శత్రుంజయం అనే ఏనుగును తీసుకు వచ్చి, దానిమీద సుగ్రీవుడిని ఎక్కించారు. వానరులందరూ కూడా సంతోషంగా అయోధ్యకు బయలుదేరారు. మరి అయోధ్యలో రాముడి పట్టాభిషేకం ఎలా జరిగింది? ఎవరెవరు పాల్గోన్నారనేటటువంటి రసరమ్య ఘట్టాలను, మన తదుపరి వీడియోలో తెలుసుకుందము..

జై శ్రీరామ!

Tuesday, January 16, 2024

కనుమ పండుగ Kanuma Festival


అందరికీ 'కనుమ పండుగ' శుభాకాంక్షలు 🙏 
               
కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం.. అంటుంది శాస్త్రం..! పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు,అల్లుళ్ళు,ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు.

[ కనుమ రోజు పశువులను ఎందుకు పూజించాలో తెలుసా?: https://youtu.be/HEeD4ulBfK0 ]


మనకు ఉన్నవి ఐదు కనుమలు.

సంప్రదాయంగా ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదని అంటారు... కనుమ నాడు కాకైనా బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్దం...

"శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా
శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని"

1. శవదహనం జరిగిన మరుసటి రోజు..
2. గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు..
3. సపిండీకరణమైన మరుసటి రోజు..
4. గర్భస్రావం మరుసటి రోజు.. మరియు 
5. సంక్రాంతి మరుసటి రోజు.

వీటిని 'ఐదు కనుమలు' అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదని శాస్త్ర వచనం. 

కనుమ రోజు పశువులను  పూజించడం ఒక సాంప్రదాయం! 

దీని వెనుక కూడా ఓ కథ ఉంది...

ఒకసారి శివుడు నందిని పిలిచి “భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి”  అని చెప్పి రమ్మన్నాడు.

కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట.

దాంతో కోపం వచ్చిన శివుడు, “ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి!” అని శపించాడట.

అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు...

కనుమ పండుగ విశేషాలు:

సంక్రాంతి మూడవ రోజు కనుమ. ఈ ప్రకృతిలో మనతో బాటు జీవించే పశు పక్ష్యాదుల ఉనికిని గుర్తించి గౌరవించటమే కనుమ పండుగ ఉద్దేశం. 

కొన్ని ప్రాంతాల్లో దీన్ని ‘పశువుల పండుగ’ అంటారు. మనది వ్యవసాయిక దేశం  గనుక మన జీవనంలో పశువులూ ఒక భాగమే.

ఆదినుంచీ పశువులను జంతువులుగా గాక సంపదగా, దైవాలుగా భావించే సంప్రదాయం మనది.

వృషభాన్ని ధర్మానికి ప్రతీకగా, పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరునిగానూ, గోవును మాతృ స్వరూపంగా, సర్వ దేవతా సమూహానికి చిహ్నంగానూ భావిస్తారు.

ఏడాది పొడవునా తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన ఎడ్లు, ఇంటిల్లిపాదికీ కావాల్సిన పాడిని అందించి చక్కని ఆరోగ్యాన్ని సమకూర్చిన ఆవులు, గేదెలకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలియజేసే పండుగే కనుమ.

ద్వాపరయుగంలో ఇంద్రుడికి బదులుగా గోవులను, గోవర్ధనగిరిని పూజించమని నందకులానికి కృష్ణుడు చెప్పిన నాటి నుంచే ఈ పండుగ ఉందని పెద్దల నమ్మకం.

ఈ రోజు రైతులు తమ పశువులను వేడి నీటితో శుభ్రంగా కడిగి అందంగా అలంకరించి హారతులిచ్చి పూజిస్తారు. అనంతరం పశు గణాన్ని తోలుకొని వెళ్లి గ్రామ దేవత ఆలయం చుట్టూ తిప్పి తీసుకొస్తారు. ఈ రోజు వాటిచేత ఏ పనీ చేయించరు. వాటికి మేలైన ఆహారాన్ని అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు గ్రామ ప్రజల౦దరూ కలిసి ఎడ్ల పందాలను తిలకిస్తారు.

కొన్నిచోట్ల కనుమ నాడు పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నివేదించిన తర్వాత పొలంలో చల్లుతారు. దీన్నే 'పొలి చల్లటం' అంటారు. దీనివల్ల తమ పంటలకు చీడపీడల బెడద ఉండదని రైతులు విశ్వసిస్తారు.

కనుమ నాడు పక్షులనూ రైతులు ఆదరిస్తారు. ఇందులో భాగంగా పక్షుల కోసం జొన్న కంకులూ, వరి కంకులూ తెచ్చి గుమ్మాలు, కిటికీలు, వసారాలో వేళ్ళాడగడతారు.

ధనుర్మాసం అంతా వేసే ముగ్గులకు భిన్నంగా కనుమనాడు పెద్ద రథం ముగ్గు వేస్తారు. విష్ణువు చేత పాతాళానికి తొక్కబడిన బలి చక్రవర్తి సంక్రాంతి మూడురోజులూ భూలోకానికి వచ్చి, కనుమనాడు తిరిగి వెళతాడనీ, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఈ రథం ముగ్గు వేస్తారని పెద్దలు చెబుతారు. 

అలాగే శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఆయన నివసించే వైకుంఠ వాకిలికి ఈ ముగ్గు ప్రతీక అనీ కొందరు చెబుతారు.

పండుగ రోజు పెట్టిన బొమ్మల కొలువును కనుమనాడు తీస్తారు. దీన్నే 'బొమ్మల కొలువు ఎత్తటం' అంటారు. పేరంటాలను పిలించి బొమ్మలకు హారతి పట్టి, కొలువులో పెట్టిన ఏదైనా ఒక్క బొమ్మను ఉన్నచోటు నుంచి కదిలిస్తారు. తర్వాత వీలును బట్టి ఎప్పుడైనా బొమ్మలను తీసుకుంటారు.

కనుమ రోజు మినప వంటకాలు తినాలని పెద్దలు చెబుతారు. అందుకే అందరూ ఈ రోజు గారెలు తింటారు. పశు పక్ష్యాదులను పూజించే కనుమ నాడు మాంసం తినే ఆచారం తర్వాతి రోజుల్లో వచ్చిందే తప్ప మొదటినుంచీ ఉన్నదైతే కాదు.

కనుమనాడు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాలు (పతంగులు) ఎగరవేస్తారు. ఆకాశంలో రివ్వున పైకి దూసుకుపోయే గాలిపటం మాదిరిగానే వారి లక్ష్యాలూ సమున్నతంగా ఉండాలనే సందేశం ఇందులో ఉంది.

కనుమ నాడు నువ్వులు, బెల్లం పంచి శనిదేవుని శుభ దృష్టి, శనగ గుగ్గిళ్ళు లేదా నానబెట్టిన శనగలు పంచిపెడితే (దానము) ద్వారా గురు గ్రహం ఆశీస్సులు లభిస్తాయి.
          
లోకా సమస్తా సుఖినోభవన్తు!

Monday, January 15, 2024

భూమండలాన్ని గడగడలాడించిన రాముడి ఆగ్రహం! Ramayana


భూమండలాన్ని గడగడలాడించిన రాముడి ఆగ్రహం!
రాముడు లంకకు ప్రయాణమై సముద్రం దగ్గరకు చేరుకున్న తరువాత ఏం జరిగింది?

రాముడు లేని రామాయణం లేదు. మనుష్యరూపంలో సంచరించిన దైవం ఆ రామచంద్ర ప్రభువు. అవతారపురుషుడు అయ్యివుండి కూడా, సామాన్య మనుష్యులు అనుభవించే కర్మఫలాలను చిరునవ్వుతో స్వీకరించాడు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యంలో గమనిస్తే, రాముడి పాత్రకు ఎంత ప్రత్యేకత ఉంటుందో, రావణుడు సీతమ్మను అపహరించిన సమయంలో ఆయనకు సహయం చేసిన వానర వీరుల పాత్రలకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ఆ సమయంలో రాముడికి సహయం చేసిన హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు మాత్రమే మనలో చాలామందికి తెలిసి వుంటుంది. కానీ, రామసేతును నిర్మించడంలో అతి ముఖ్యుడైన నీలుడి గురించి, రామాయణాన్ని పఠించిన అతి కొద్ది మందికి మత్రమే తెలుసని చెప్పవచ్చు. నీలుడు రామసేతు నిర్మాణంలో ముఖ్యుడు ఎలా అయ్యాడు? రాముడి కోసం సముద్రుడి సహకారం ఏమిటి? రాముడి ఆగ్రహానికి సముద్రుడు ఎలా కారణమయ్యాడు? రాముడు లంకను చేరడానికి సముద్రం వద్దకు చేరుకున్న తరువాత, అక్కడ ఎటువంటి పరాణామాలు చోటుచేసుకున్నాయి? రావణుడు పంపిన దూతలేమయ్యారు? వంటి అద్భుత ఘట్టాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gAelx7i7X24 ]


హనుమ వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చాక, రాముడు వానర సైన్యం సహాయంతో, రావణుడిపై యుద్ధానికి పూనుకున్నాడు. వారందరూ సముద్రపు ఒడ్డుకు చేరుకోగా, అక్కడకు విభీషణుడు కూడా వచ్చి, రాముడికి సహాయం చేస్తానని మాట ఇచ్చాడు. అయితే, రామ సైన్యం అంతా లంకను చేరుకోవాలంటే, సముద్రాన్ని దాటాలి. దానికి తగిన పరిష్కారం కోసం ఆలోచిస్తుండగా విభీషణుడు, "సముద్రుడు రాముడి పూర్వీకుడైన సగరుడికి ఋణపడి ఉన్నాడు. అందు చేత రామకార్యం తీరుస్తాడు." అని మార్గం చెప్పాడు. ఆ మాటలకు రాముడు సముద్రతీరాన దర్భలు పరచి వాటి పైన కూర్చుని, సముద్రుడిని ధ్యానించాడు. ఈలోపు రావణుడి వేగైన శార్దూలుడనే రాక్షసుడు వానరసేన ఉన్న చోటికి వచ్చి, అక్కడి పరిస్థితులన్నీ చూసి రావణుడి వద్దకు తిరిగివెళ్ళి, “వానర, భల్లూక సేన అపరసముద్రంలాగా లంక పైకి వస్తున్నది. ఉత్తమ ఆయుధాలను ధరించిన రామలక్ష్మణులు సీత కోసం, సేనతో సహా సముద్రతీరాన ఉన్నారు. ఆ సేన యొక్క విస్తీర్ణం ఎటు చూసినా పది యోజనాలున్నది. నేనీ విషయాలు స్థూలంగా చూసి వచ్చాను. వివరంగా చూసి రావటానికి మరెవరినైనా పంపటం మంచిది” అని అన్నాడు. అప్పుడు రావణుడు శుకుడనే రాక్షసుడితో, “నీవు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి, మంచిగా ఈ మాటలు చెప్పు” అని, ఏం చెప్పాలో చెప్పి పంపాడు.

శుకుడు పక్షి రూపం ధరించి లంక నుంచి బయలుదేరి, సముద్రం దాటి వానరసేన దగ్గిరకు ఎగురుతూ వెళ్ళి, సుగ్రీవుడు మొదలైన వారి మీదుగా గాలిలోనే ఉండి ఇలా చెప్పాడు. “వానర రాజైన సుగ్రీవుడా! రావణుడు ఇలా అన్నాడు. ఉన్నత వంశంలో పుట్టిన వాడవు, మహాబలుడవు. జన్మతః నాకు బంధువువంటి వాడవు. అకారణంగా నాతో విరోధ మెందుకు? ఇందువల్ల నీకు ఒరిగేదీ, తరిగేదీ లేదు. వాలి నా స్నేహితుడు. నీవు నా తమ్ముడిలాంటి వాడవు. నేను రాముడి భార్యను తెస్తే నీకేమిటి? బుద్ధి మంతుడవు. బాగా ఆలోచించుకుని కిష్కింధకు తిరిగి వెళ్ళు. ఈ విషయంలో నీ ప్రమేయమేమీ లేదు. లంకలోకి దేవతలే ప్రవేశించలేరు గదా! నరుల మాటా, వానరుల మాటా చెప్పే దేముంది?”

ఈ మాటలు వింటూనే వానరులు ఆకాశాని కెగిరి, శుకుణ్ణి పట్టుకుని నేల మీదికి పడద్రోశారు. శుకుడు ఎలుగెత్తి, “ఓ రామా, నన్నీ వానరులు చంపేస్తున్నారు. దూతను చంపరాదు. నా ప్రభువు అనమన్న మాటలే అన్నాను గానీ, నేను సొంతాన ఏమీ అనలేదు.” అని వాపోయాడు. రాముడు జాలిపడి, దూతగా వచ్చిన వారిని అగౌరవపరచకూడదని చెప్పి, వదిలేయమన్నాడు. శుకుడు దెబ్బతిన్న రెక్కలతో ఆకాశంలోకి లేచి, “సుగ్రీవుడా, రావణుడితో ఏం చెప్పమంటావు?” అని అడిగాడు. “రావణుడితో ఇలా అన్నానని చెప్పు. ‘రాక్షసరాజా, నీవు నాకు స్నేహితుడవూ కావు, మేలుచేసిన వాడవూ కావు. నా మిత్రుడైన శ్రీ రాముడికి శత్రువువు, నా శత్రువైన వాలికి మిత్రుడవు. అందుచేత తప్పక చంపదగిన వాడవు. మేము నిన్ను సకుటుంబంగా చంపి, లంకను భస్మీపటలం చేస్తాము. అన్ని దివ్యాస్త్రాలూ తన అధీనంలో ఉన్న రాముడి బారి నుండి దేవతలు కూడా నిన్ను రక్షించలేరు. ముసలి జటాయువును చంపినట్లో, రామలక్ష్మణులు లేనప్పుడు దొంగతనంగా సీతమ్మను ఎత్తుకు పోయినట్లో కాదు. రాముడి ప్రతాపం నీకు త్వరలో తెలుస్తుంది.”అని చెప్పమని, సుగ్రీవుడు శుకుడితో అన్నాడు. అంతలో అంగదుడు సుగ్రీవుడితో, "వీడు దూతలాగా లేడు. వేగుల వాడని తోస్తున్నది. మనతో మాట్లాడుతూనే శిబిరమంతా చూశాడు. వీడిని వదలకుండా పట్టుకోండి. లంకకు పోనివ్వకండి" అని అన్నాడు. సుగ్రీవుడి ఆజ్ఞానుసారం, వానరులు శుకుణ్ణి మళ్ళీ పట్టుకున్నారు. శుకుడు మళ్ళీ ఆక్రోశిస్తూ, "ఓ రామా, దూతనైన నా రెక్కలను ఈ వానరులు విరుస్తున్నారు. కళ్ళు పీకేస్తున్నారు" అని పెద్దగా మొర పెట్టుకున్నాడు. రాముడు వానరులకు చెప్పి, శుకుణ్ణి విడిపించాడు.

తరువాత రాముడు సముద్రుడికి నమస్కరించి, చెయ్యి తల క్రింద పెట్టుకుని, సముద్రుడికి ఎదురుగా పడుకున్నాడు. రాముడలా మూడు అహోరాత్రాలు ఉపవసిస్తూ గడిపాడు. అంతకాలమూ సముద్రుణ్ణి ధ్యానించాడు. కానీ, సముద్రుడు సాక్షాత్కరించకపోయేసరికి, రాముడికి కోపం వచ్చింది. లోకంలో మంచితనం అసమర్థతగా పరిగణించబడుతుంది. సముద్రుడు తనను అలాగే భావించినట్లున్నాడు. అందుచేత రాముడు సముద్రుడికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు. రాముడు దివ్యధనుస్సు తీసుకుని శరసంధానానికి ఉద్యుక్తుడవుతుండగా, లక్ష్మణుడు అన్న కోపాన్ని ఉపశమింపచేసే ప్రయత్నం చేశాడు. కోపంతోసముద్రుడిని శోషింపజేస్తే నిరపరాధులైన కోటానుకోట్ల జలజీవులు ఏమైపోతాయోనని భయపడ్డాడు. కానీ, రాముడు సముద్రుడికి గుణపాఠం నేర్పాలని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించటానికి ధనుస్సుకు నారి బిగించి శరసంధానం చేశాడు. అప్పుడు లోకాలు సంక్షోభంలో కూరుకునిపోయాయి. సూర్యచంద్రులు గతులు తప్పారు. ఆకాశం నుంచి పిడుగుల వర్షం కురిసింది. ఉల్కలు రాలాయి. ప్రచండవాయువు వీచింది. భూమ్యాకాశాల నడుమ జ్వాలలు వ్యాపించాయి. అప్పటికే రాముడు ప్రయోగించి వదిలిపెట్టిన దివ్యాస్త్రాలతో, సముద్రం మైళ్ళ పర్యంతం వెనక్కు వెళ్లి క్షీణించి పోయింది.

రాముడు బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టి ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు సముద్ర మధ్యంలోని బ్రహ్మాండమైన అలల మధ్య నుంచి సముద్రుడు, సమస్త నదులు వెంటరాగా బయటకు వచ్చాడు. సముద్రుడి దేహం వైఢూర్య వర్ణంగా ఉంది. ఎర్రని మాలలూ, బట్టలూ ధరించి, రంగురంగుల పుష్పమాలికలూ, అనేకమైన బంగారు నగలూ ధరించివున్నాడు. అతని మెడలోని ముత్యాల హారాల మధ్య, కౌస్తుభమణి యొక్క తోబుట్టువు ప్రకాశిస్తున్నది. సముద్రుడు రాముణ్ణి సమీపించి, ముందుగా తానే రాముడి పేరు స్మరించి నమస్కరించాడు. "శ్రీరామా, పంచభూతాలూ ఎలాగైతే సహజ ధర్మాలను అతిక్రమించలేవో, అలా నేనూ నా కట్టుబాటుకు బద్ధుడనై ఉన్నాను. అంతేకానీ, నీ పట్ల అగౌరవం చూపటానికో, అపరాధం చేయటానికో కాదు. అగ్నిహోత్రం చల్లగా ఉండటం ఎంత విరుద్ధమో, నేను నా అగాధత్వాన్ని పరిత్యజించటం కూడా స్వభావవిరుద్ధం కదా! నీవు లోకధర్మాన్ని స్థిరంగా అనుశాసించాలి, అనుపాలించాలి. నేను గడ్డకట్టుకుని పోవడమో, చీలిపోవడమో అనూహ్యం. అలాచేస్తే, జలచరాలన్నీ నశించిపోతాయి. అయితే రామా! నేను నీకు నా చేతనైనంతగా తోడ్పడతాను. నీ ఆజ్ఞానువర్తినై, నీ అనుగ్రహం కోరి ప్రవర్తిస్తాను. వానరులు వారధి కట్టేటప్పుడు వారికి సముద్ర ప్రాణుల భయం లేకుండా చెయ్యగలను. స్వభావ సిద్ధంగా ఎగసిపడే అలలను అణచగలను. మీరు ఈ సముద్రాన్ని దాటడంలో సహాయపడగలను. నీ సేనలో గల నలుడనే వానరోత్తముడు, విశ్వకర్మ కొడుకు. శిల్ప విద్యలో తండ్రికి ఏమాత్రమూ తీసిపోడు. అతని చేత సేతువును నిర్మింపజెయ్యి. అలాగే, వానరుల్లో నీలుడుకి ఒక శాపం ఉంది. పూర్వం మునులు నది ఒడ్డున తపస్సు చేసుకుంటుండగా, వారి వస్తువులను నీటిలో పడవేశాడు. దానితో వారు, నీలుడు నీటిలో వేసిన ఏ వస్తువైనా మునగదని శపించారు. ఇప్పుడు అదే శాపాన్ని వినియోగించుకుని, నీలుడు వారధి నిర్మాణానికి తోడ్పడగలడు." అని సముద్రుడు చెప్పి, రాముడికి వినయంగా నమస్కరించి, అంతర్ధానమయ్యాడు.

నలుడి నేతృత్వంలో కోట్లాదిమంది వానరులు అయిదు రోజులలో లంకకు వారధిని నిర్మించారని రామాయణంలో స్పష్టంగా పేర్కొనబడి ఉంది. మహాకాయులైన వానరులు మొదటిరోజు పధ్నాలుగు యోజనాలు, రెండవ రోజు ఇరవై, మూడవ రోజు ఇరవైఒకటి, ఆ తరువాత రోజు ఇంకో యోజనం అదనంగా, అలా సువేలాద్రి హద్దుగా సేతువును నిర్మించారు. మహా ప్రజ్ఞాశాలి నలుడు నిర్మించిన సేతువు ఆకాశంలో స్వాతిపథంలా విరాజిల్లింది. తన తండ్రి విశ్వకర్మ కీర్తిని సార్థకంజేశాడు నలుడు. ఈ వారధిని రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటి నుంచి, శ్రీలంక దగ్గరున్న మన్నార్‌ తీరం వరకూ నిర్మించారు. సముద్రుడు ఆనాడు రాముడికిచ్చిన మాట ప్రకారమే, నేటికీ రామసేతు ఉన్న ప్రాంతంలో అలల ఉధృతి లేకుండా, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటికీ సేతువు చాలావరకూ సముద్రం మీద తేలుతూ కనిపిస్తుంటుంది. అది రాముని స్పర్శ సోకిన నిర్మాణమే అన్న పులకింతను, మనకు నిలువెల్లా కలుగజేస్తుంది.

జై శ్రీరామ!

సంక్రాంతి పండుగ Sankranti 2024


అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🙏 

[ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి?: https://youtu.be/itjUnux5PEE ]


ధనుర్మాసం మొదలైన దగ్గర్నుంచే తెలుగు లోగిళ్లలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ఇంటిముందు ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లతో, గ్రామాలలో పండుగ వాతావరణం వెల్లివిరుస్తుంది. దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వస్తారు. సంక్రాంతి పండుగ గురించి చెప్పాలంటే, పెద్దలనుంచి పిన్నల వరకు ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. పట్టణాల నుంచి వచ్చే బంధువులకు పల్లె జనం స్వాగతం పలుకుతూ, ఆనందోత్సాహాలలో మునిగిపోతారు. చిన్ననాడు స్వగ్రామంలో తిరిగిన తీపి గురుతులను నెమరువేసుకుంటూ, అంతా పండుగను ఎంజాయ్ చేస్తారు. ఇల్లలికి సున్నాలు వేసి, సుందరంగా అలంకరిస్తారు.

లేలేత సూర్యకిరణాలు భూమిని తాకే వేళ, ఇంటి ముందు ఆడవారు ముగ్గులు పెట్టేవేళ, రామదాసు కీర్తనలు, హరినామ సంకీర్తన, శ్రీ కృష్ణ లీలామృతాన్ని గానం చేసుకుంటూ కాలికి గజ్జెకట్టి తంబురను మీటుతూ, తలపై అక్షయ పాత్రతో, చేతిలో చిడతలతో, హరిదాసులు చేసే సంకీర్తనలు, సంక్రాంతి పండుగవేళ కనిపించే అతి గొప్ప సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పవచ్చు. హరిదాసులు శ్రీమహావిష్ణువుకు  ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. ఇంటి వారు ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను తీసుకుని ఇంటింటికీ తిరుగుతూ, "హరిలో రంగ హరి.. హరిలో రంగ హరి" అంటూ ఇంటి ముందు నర్తిస్తూ, అందరినీ చల్లగా ఉండమని దీవిస్తూ గ్రామంలో తిరిగే హరిదాసులు, నేటికీ గ్రామాలలో కనిపిస్తారు. హరిదాసులు తమ తలపై ఉన్న అక్షయపాత్రను గ్రామ సంచారం సమయంలో ఎక్కడా తీసి కింద పెట్టరు. కేవలం ఇంటికి వెళ్లాక అతని భార్య మాత్రమే అక్షయపాత్రను కిందకు దించుతుంది.

ఏడాది పొడవునా ఎప్పడూ కనపడని హరిదాసులు, సంక్రాంతి పండుగ సమయంలో ధనుర్మాసం నెల రోజులపాటు మాత్రమే కనిపిస్తారు. గ్రామాలలో హరిదాసుల సందడి సూర్యోదయం తోటే మొదలవుతుంది. ఇలా నెలరోజులపాటు తిరిగి, సంవత్సరానికి సరిపడా గ్రాసాన్ని సంపాదించుకుంటారు హరిదాసులు. వీరంతా ఊరి బయటనుంచే వస్తారు. ఏడాదిలో  ప్రతి వూరికీ ఎవరెవరు వస్తారో, వారు తప్ప ఇతరులు రారు. ముఖ్యంగా ఇలా వచ్చే వారిలో, విష్ణు భక్తులైన సాతానులు, దాసరులు, రాజులు మొదలైన వారు, ఇలా జీవిస్తూ వుంటారు.
గ్రామ వీధుల్లో హరిదాసులు ఇలా హరి భజన చేయడం కోలాహలంగా వుంటుంది. హరిదాసుడి అక్షయ పాత్రలో బియ్యం వేయటానికి  బాలబాలికలు పోటీలు పడతారు. హరిదాసులు ప్రతి ఇంటి ముందూ కూర్చుని లేవటం చాల కష్టమైన పని. అయినా భక్తి భావంతో అదంతా మరచిపోతారు.

హరిదాసులతో పాటు, సంక్రాంతి పర్వదినాలలో గంగిరెద్దుల వారు, బుడబుక్కలవారు, పగటి వేషధారులు, గారడీ వాళ్ళు, ఎందరెందరో జానపద కళాకారులతో, కన్నుల పండువుగా సంక్రాంతి పర్వదినాలు ముగుస్తాయి. పంటను ఇంటికి తెచ్చుకుని కళకళలాడే రైతు కుంటుంబాలు అందరినీ ఆదరిస్తూ, సంక్రాంతి పర్వదినాలను ఆనందంగా ముగిస్తారు.

నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ।
ఆయురారోగ్య మైశ్వర్యం దేహి దేహి దేవః జగత్పతే ॥

Sunday, January 14, 2024

భోగి పండుగ 2024


అందరికీ 'భోగి పండుగ' శుభాకాంక్షలు 🙏

[ భోగి రోజు ఇలా చేస్తే ఇంటి నిండా సిరులే: https://youtu.be/jkmkEU3i8yg ]


సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈ పండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది. భోగి రోజున ఇంటి ముందు మంట వేస్తే, ఇంట్లో ఉండే దరిద్ర దేవతను తరిమినట్లేనని మన నమ్మకం. ఈ భోగి పండుగ నాడు సంబరమంతా పిల్లలదే. తెల్లవారు జామున భోగి మంటలు వేయటం, సాయంత్రం భోగి పండ్లు పోయించుకోవడంతో, పిల్లలు హుషారుగా ఉంటారు. 'భగ' అనే పదం నుంచి భోగి అన్న మాట పుట్టిందని చెబుతారు. 'భగ' అంటే 'మంటలు' లేదా 'వేడి'ని పుట్టించడం అని అర్ధం.

భోగి రోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తూ, చిన్న పిల్లలను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావిస్తారు. రేగి పళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగి పళ్ళలో చేమంతి, బంతి పూరేకులు, అక్షింతలు, చిల్లర నాణేలు కలిపి, పిల్లల తలపై పోస్తారు. ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజున శ్రీ రంగనధాస్వామిలో గోదా దేవి లీనమై, భొగాన్ని పొందిందనీ, దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనీ పురాణ గాధ. అయితే, చాలా మంది భావించే విధంగా భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యం కోసం కూడా.

ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడతారు. దేశీ ఆవు పేడ పిడకలని కాల్చడం వలన, గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మ క్రిములు నశిస్తాయి. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరళ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని జోడిస్తారు. ఈ ఔషధ మూలికలు, ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి, అతి శక్తివంతమైనది. మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి, శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. దీనితో భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయం వల్ల వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఇక ఆధ్యాత్మిక పరంగా, ఈ భోగి మంటలను అగ్నిదేవుడికి ఆరాధనగా పరిగణిస్తారు. వాస్తవానికి  భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులను కాదు. మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలను. అప్పుడే మనకున్న పీడ పోయి, మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి అనే అర్ధం ఈ భోగి మంటల వెనుక ఉంది. భోగి రోజున మొదలయ్యే పెద్ద పండుగలో అరిసెలు, నువ్వుల లడ్లు, జంతికలు, చక్కలతో పాటు, రకరకాల పిండి వంటలతో మన ఇరు రాష్ట్రాలలోని తెలుగు వారు ఎంతో ఆనందంగా చేసుకునే ఈ భోగి పండుగతో, మూడు రోజుల పెద్ద పండుగ ప్రారంభం అవుతుంది.

Wednesday, January 10, 2024

విశ్వరూపం! భగవద్గీత Bhagavad Gita Chapter 18


విశ్వరూపం!
యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా పొందబడిన ‘సర్వోన్నత యోగ శాస్త్రము’!

'భగవద్గీత' అష్టాదశోధ్యాయం - మోక్ష సన్యాస యోగం (75 – 78 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్దెనిమిదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. ఈ రోజుటి మన వీడియోలో, మోక్ష సన్యాస యోగములోని, 75 నుండి 78 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/jh-LR5NbMvk ]


పాపముల నుండి విముక్తి పొంది, పుణ్యాత్ములు నివసించే పవిత్ర లోకములకు చేరుకోవడానికి మార్గం ఏంటో సంజయుడి మాటలలో విందాము..

00:50 - వ్యాసప్రసాదాఛ్చ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ।। 75 ।।

వేదవ్యాసుని అనుగ్రహం చేత, నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైన యోగమును, స్వయంగా యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి నుండి తెలుసుకున్నాను.

శ్రీ కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడినే మహర్షి వేద వ్యాసుడని కూడా అంటారు; ఆయన సంజయుని యొక్క ఆధ్యాత్మిక గురువు. తన గురువు గారి అనుగ్రహం చేత, సంజయుడు హస్తినాపుర రాజమందిరంలోనే కూర్చుని, కురుక్షేత్ర యుద్ధ భూమిలో జరిగేదంతా తెలుసుకోవటానికి, ఆయనకు దివ్యదృష్టి ప్రసాదించబడింది. తన గురువు గారి కృప వలననే, తనకు సర్వోన్నత యోగ శాస్త్రమును స్వయంగా, యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడి ద్వారా వినే అవకాశం లభించిందని, ఇక్కడ సంజయుడు ఒప్పుకుంటున్నాడు. బ్రహ్మ సూత్రాలూ, పద్దెనిమిది పురాణాలూ, మహాభారతము, ఇంకా ఇతర గ్రంథాలను వ్రాసిన వేద వ్యాసుడు, ఒక భగవత్ అవతారము. ఆయనకు దివ్యదృష్టి వంటి శక్తులున్నాయి. ఈ విధంగా ఆయన, కేవలం శ్రీ కృష్ణుడికీ, అర్జునుడికీ మధ్య జరిగిన సంభాషణనే కాక, సంజయుడికీ, ధృతరాష్ట్రుడికీ మధ్య జరిగిన సంభాషణను కూడా విన్నాడు. అందువలన, ఆయన భగవద్గీత లో ఈ రెండు సంభాషణలనూ పేర్కొన్నాడు.

02:14 - రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమిమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ।। 76 ।।

సర్వోత్కృష్ట శ్రీ కృష్ణ భగవానునకూ, మరియు అర్జునుడికీ మధ్య జరిగిన ఈ మహాద్భుతమైన సంవాదమును, పదేపదే గుర్తుచేసుకుంటూ ఓ రాజా, నేను మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను.

ఆధ్యాత్మిక అనుభవమనేది, సమస్త భౌతిక ఆనందాలనూ ఒక్కచోట కూర్చిన దానికన్నా ఎక్కువ హర్షమునూ, తృప్తిని కలిగించే ఆనందమునూ ఇస్తుంది. సంజయుడు అటువంటి ఆనందమును అనుభవిస్తూ, తన అనుభవాన్ని అంధుడైన ధృతరాష్ట్రునితో పంచుకుంటున్నాడు. ఈ అద్భుతమైన సంవాదమును గుర్తుచేసుకుంటూ, ఆయన దివ్య ఆనందమును అనుభవిస్తున్నాడు. ఈ గీతా శాస్త్రములో ఉన్న జ్ఞానము యొక్క మహనీయతనూ, మరియు సంజయుడు చూసిన లీలల యొక్క దైవత్వమునూ ఇది సూచిస్తున్నది.

03:11 - తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః ।
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ।। 77 ।।

అలాగే, ఆ శ్రీ కృష్ణుడి అత్యద్భుతమైన, ఆశ్చర్యకరమైన విశ్వ రూపమును గుర్తుచేసుకుంటూ, ఆశ్చర్యచకితుడనై, మహదానందముతో, పదేపదే పులకించి పోతున్నాను.

మహోన్నత యోగులకు కూడా అరుదుగా కనిపించే భగవంతుని విశ్వ రూప దర్శన భాగ్యము, అర్జునుడికి కలిగింది. అర్జునుడు, ఆయన యొక్క భక్తుడు, మరియు స్నేహితుడు. ఆయనకు చాలా ప్రియమైన వాడు కావున, తన విశ్వరూపమును చూపిస్తున్నానని, శ్రీ కృష్ణుడు చెప్పాడు. సంజయుడు కూడా ఆ విశ్వ రూపమును చూశాడు. ఎందుకంటే, భగవంతుని దివ్యలీలలలో పాలు పంచుకునే భాగ్యము, ఆయనకు కథకుడిగా లభించింది. ఊహించని భగవదనుగ్రహము, ఒక్కోసారి మన దారిలో వస్తుంటుంది. దానిని సరిగ్గా ఉపయోగించుకుంటే, మనం సాధనలో అత్యంత వేగంతో ముందుకెళ్లవచ్చు. సంజయుడు పదేపదే తాను చూసిన దానిని గుర్తుచేసుకుంటూ, భక్తి ప్రవాహంలో ఓలలాడి పోతున్నాడు.

04:20 - యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ।। 78 ।।

ఎక్కడెక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడూ, మరియు అత్యున్నత విలుకాడైన అర్జునుడూ ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యమూ, సర్వ విజయమూ, సకల-సమృద్ధీ, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము.

ఈ శ్లోకంతో, ఒక గంభీరమైన ప్రకటన ఇస్తూ, భగవద్గీతను ముగించాడు. ధృతరాష్ట్రుడు యుద్ధం యొక్క ఫలితం పట్ల ఆందోళనతో ఉన్నాడు. రెండు సైన్యముల పరస్పర భౌతిక పరమైన సామర్థ్యముల లెక్కలు వ్యర్థమని, సంజయుడు అతనికి చెబుతున్నాడు. ఈ యుద్ధంలో ఒక్కటే తీర్పు ఉంటుంది - విజయం ఎల్లప్పుడూ భగవంతుడు, మరియు ఆయన శుద్ధ భక్తుడున్న పక్షానే ఉంటుంది; అదే పక్షాన, మంచితనమూ, ఆధిపత్యము, మరియు సమృద్ధి కూడా ఉంటాయి. భగవంతుడు సర్వ స్వతంత్రుడు, స్వయం సమృద్ధిగల జగదీశ్వరుడు, మరియు అర్చన-ఆరాధనలకు అత్యంత యోగ్యుడు. ఆయనకు సరితూగేవారు ఎవరూ లేరు; ఆయనకంటే గొప్పవారూ ఉండరు; తన అసమానమైన మహిమను ప్రకటించటానికి తగిన వాహకం, ఆయనకు కావాలి. ఆయనకు శరణాగతి చేసిన జీవాత్మ, భగవంతుని యశస్సును ప్రకాశింపచేయటానికి, అటువంటి ఒక చక్కటి వాహకంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఎక్కడైతే సర్వోత్కృష్ట పరమేశ్వరుడూ, మరియు ఆయన యొక్క పరిపూర్ణ భక్తుడూ ఉంటారో, పరమ సత్యము యొక్క తేజస్సు ఎల్లపుడూ అసత్యపు చీకటిని జయిస్తుంది. ఇంకే ఇతర ఫలితమూ ఉండజాలదు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే మోక్ష సన్యాస యోగోనామ అష్టాదశోధ్యాయ:

06:17 - శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పద్దెనిమదవ అధ్యాయం, మోక్ష సన్యాస యోగంలోని, 78 శ్లోకాలూ సంపూర్ణం. భగవద్గీతలోని 18 అధ్యాయాలూ, 18 యోగాలలో ఉన్న మొత్తం 701 శ్లోకాలు పూర్తయ్యాయి. స్వయానా భగవంతుడు వివరించిన ఆత్మజ్ఞానం, కర్మజ్ఞానం గురించీ, భగవద్గీతలోని అంతరార్థం గురించీ, ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలనే కోరికతో మేము చేసిన ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆదరించినందుకు, కృతజ్ఞతాభివందనాలు..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, January 8, 2024

Brahmastra on a crow | కాకి మీద బ్రహ్మాస్త్రం!


కాకి మీద బ్రహ్మాస్త్రం!
లంకలో సీతమ్మ హనుమకు చెప్పిన కాకాసుర వృత్తాంతం!

రామాయణం గురించి మనలో చాలామందికి తెలుసు. శ్రీ రామ చంద్రమూర్తికి సతి అయిన సీతా దేవిని, మాయావి రావణాసురుడు అపహరించి లంకలో బంధించడం, రామ దూతగా హనుమ వెళ్లి సీతమ్మను కనుగొనడం, తరువాత రాముడు వానర సైన్యంతో వారధిని నిర్మింపజేసి, రావణాసురుడితో యుద్ధం చేసి, సీతమ్మను తిరిగి తీసుకురావడం.. ఇవన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసిన రామాయణ ఘట్టాలే. హనుమ సప్త సముద్రాలనూ దాటి, సీతమ్మను చేరుకున్న తరువాత జరిగిన సంభాషణ, రామాయణంలో రసరమ్యభరితం. వాటిలో, సీతా దేవి హనుమకు వివరించిన కాకాసుర వృత్తాంత సంఘటనను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/Vgn-qemaUEA ]


రాముడి గుణగణాల గురించీ, రాముడి రూపం గురించీ ఎంతో గొప్పగా చెప్పి, రాముడు సీతమ్మకు ఇవ్వమన్న ఉంగరాన్ని, హనుమంతుడు ఆ తల్లికి ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే, సీతమ్మ ఎంతో సంతోషపడింది. సాక్షాత్తూ రాముడిని చూసినంత ఆనందం పొందింది. తరువాత హనుమంతుడు సీతమ్మతో, "యజ్ఞములో వేసిన హవిస్సును హవ్యవాహనుడైన అగ్నిదేవుడు ఎంత పవిత్రంగా తీసుకెళతాడో, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో" అని అన్నాడు. హనుమంతుడు సీతమ్మను వీపు మీద కూర్చోమని అడిగేసరికి, "నన్ను క్షేమంగా రాముడి దగ్గరికి నువ్వు తీసుకువెళ్ళగలవు. కానీ నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప, వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి, నా చెయ్యి పట్టుకుని, ఈ సముద్రాన్ని దాటించాలి" అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, "ఒక మనుష్య స్త్రీగా ఉండి, ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా 'నేను రాను' అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా! పోనీ రాముడి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడానికి, ఏదైనా ఒక విషయం చెప్పు తల్లి" అని అన్నాడు.

అప్పుడు సీతమ్మ, "ఒకనాడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు, చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని, అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో, ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద, మేము విహరిస్తున్నాము. అప్పుడు రాముడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకుని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి, నా పక్కన కూర్చున్నాడు. ఆ సమయంలో నేను కొన్ని  ఒరుగులను అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు, సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు. అప్పుడు కాకాసురుడనే కాకి అక్కడికి వచ్చి, ఆ ఒరుగులను తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డను తీసి, ఆ కాకి మీదకు విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో పొడిచి, నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన, నా వడ్డాణం జారింది. నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకు విసరబోతే, రాముడు నన్ను చూసి నవ్వి, 'సీత! కాకి మీదకు బంగారు వడ్డాణం విసురుతావా' అని అన్నాడు.

తరువాత నేను ఆ బాధను ఓర్చుకుని, రాముడి ఒడిలో తల పెట్టుకుని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకుని ఉన్నంతసేపు, ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను. అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకుని నిద్రపోతున్నాడు. మళ్ళీ ఆ కాకాసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తిన్నది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి, రాముడి నుదిటి మీద పడింది. రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిదని చూసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది.. "ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు?" అని గద్దించాడు. దానికి అర్థం, సీతమ్మను పంచముఖ గాయత్రిగా రాముడు అభివర్ణించాడు. అప్పుడాయన చుట్టూ చూసేసరికి, ముక్కున నెత్తురంటిన మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో, ఒక కాకి కనపడింది.

రాముడు అక్కడ ఉన్న ఒక గడ్డిపోచను తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది. ఆ కాకి మూడు లోకములు తిరిగి, అందరి దగ్గరికీ వెళ్ళింది. కానీ, అందరూ రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే, మేము రక్షించలేము. నువ్వు వెళ్ళిపో అని అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకీ తిరిగి తిరిగి, రాముడున్న చోటకి వచ్చి, నమస్కారం చేస్తూ పడిపోయింది. రాముడు ఆ కాకిని చూసి, నా దగ్గరికి వచ్చి పడిపోయావు కనుక, నువ్వు నాకు శరణాగతి చేసినట్టే. అందుకు నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కానీ, ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత, ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చేయ్యాలి. మరి నువ్వు ఏమిస్తావు?' అని రాముడు ఆ కాకసురుడిని అడిగాడు. అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నును బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి, రాముడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు, ఇవేళ ఎందుకూరుకున్నాడో ఆలోచించమని, ఒకసారి రాముడికి చెప్పు" అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకు చెప్పింది.

సీతమ్మ హనుమంతుడితో కాకాసుర వృత్తాంతాన్ని చెప్పిన తరువాత, "శత్రువులను సంహరించే సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వలన చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్యా దేవి, లోకమునంతటినీ రక్షించే కొడుకును కన్నది. ఆ రాముడి పాదాలకు తలవంచి, భక్తిగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా, రాముడు ఆ బాధను పొందలేదంటే, లక్ష్మణుడు పక్కన ఉండడమే అందుకు కారణం. వదినను తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు, లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు. ఆ లక్ష్మణుడిని కుశలం అడిగానని చెప్పు. సుగ్రీవుడినీ కుశలమడిగానని చెప్పు. హనుమా! నువ్వు రాముడి దగ్గర చెప్పే మాటలను బట్టి, రాముడికి నామీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. కాబట్టి, నువ్వు రాముడి దగ్గర ఇక్కడ జరిగింది మొత్తం వివరంగా చెప్పి,  రాముడు నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి" అని చెప్పింది. అప్పుడు హనుమంతుడు, "అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు. దీనితో పాటుగా, ఇంకొక జ్ఞాపకం ఏదైనా ఇస్తావా? తీసుకువెళతాను! దానిని చూపించి, రాముడికి జరిగింది మొత్తం వివరంగా చెబుతాను" అని అన్నాడు.

అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకు కట్టి ఉన్న మూటను విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సు మీద, మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు. అప్పుడు రాముడికి ఒకే సమయంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు. ఒకరు మా అమ్మ, రెండు దశరథుడు, మూడు  నేను. ఇలా రాముడికి ముగ్గురం జ్ఞాపకం వస్తాము" అని అన్నది. హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకు అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకు విశేషమైన శక్తీ, ధైర్యం వచ్చాయి. ఆ తరువాత సీతమ్మ హనుమంతుడితో, "హనుమా! నీకు ఇంకొక విషయం చెబుతాను విను. ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో, నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలను అరగదీసి, నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి" అని చెప్పింది సీతమ్మ. రామాయణంలోని ఈ ఘట్టంలో, సీతా దేవి తన శ్రీరాముడి కోసం ఎదురుచూస్తూ పడిన వేదన, ప్రతి సందర్భంలోనూ ప్రస్ఫుటిస్తుంది.

జై శ్రీరామ!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...