కనుమ పండుగ Kanuma Festival


అందరికీ 'కనుమ పండుగ' శుభాకాంక్షలు 🙏 
               
కనుమ పండుగ నాడు ప్రయాణాలు నిషిద్ధం.. అంటుంది శాస్త్రం..! పండుగకు పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు,అల్లుళ్ళు,ఇతర బంధువులు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు.

[ కనుమ రోజు పశువులను ఎందుకు పూజించాలో తెలుసా?: https://youtu.be/HEeD4ulBfK0 ]


మనకు ఉన్నవి ఐదు కనుమలు.

సంప్రదాయంగా ఐదు కనుమలలో ప్రయాణం చేయరాదని అంటారు... కనుమ నాడు కాకైనా బయలుదేరదు అని సామెత కూడా ప్రసిద్దం...

"శవదాహే గ్రామదాహే సపిండీకరణే తథా
శక్య్తుత్పవే చ సంక్రాంతౌ నగంతవ్యం పరేహని"

1. శవదహనం జరిగిన మరుసటి రోజు..
2. గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు..
3. సపిండీకరణమైన మరుసటి రోజు..
4. గర్భస్రావం మరుసటి రోజు.. మరియు 
5. సంక్రాంతి మరుసటి రోజు.

వీటిని 'ఐదు కనుమలు' అంటారు. ఈ రోజుల్లో ప్రయాణించరాదని శాస్త్ర వచనం. 

కనుమ రోజు పశువులను  పూజించడం ఒక సాంప్రదాయం! 

దీని వెనుక కూడా ఓ కథ ఉంది...

ఒకసారి శివుడు నందిని పిలిచి “భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి”  అని చెప్పి రమ్మన్నాడు.

కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పాడట.

దాంతో కోపం వచ్చిన శివుడు, “ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి, ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి!” అని శపించాడట.

అప్పటి నుంచి ఎద్దులు, వ్యవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు...

కనుమ పండుగ విశేషాలు:

సంక్రాంతి మూడవ రోజు కనుమ. ఈ ప్రకృతిలో మనతో బాటు జీవించే పశు పక్ష్యాదుల ఉనికిని గుర్తించి గౌరవించటమే కనుమ పండుగ ఉద్దేశం. 

కొన్ని ప్రాంతాల్లో దీన్ని ‘పశువుల పండుగ’ అంటారు. మనది వ్యవసాయిక దేశం  గనుక మన జీవనంలో పశువులూ ఒక భాగమే.

ఆదినుంచీ పశువులను జంతువులుగా గాక సంపదగా, దైవాలుగా భావించే సంప్రదాయం మనది.

వృషభాన్ని ధర్మానికి ప్రతీకగా, పరమేశ్వరుని వాహనమైన నందీశ్వరునిగానూ, గోవును మాతృ స్వరూపంగా, సర్వ దేవతా సమూహానికి చిహ్నంగానూ భావిస్తారు.

ఏడాది పొడవునా తమ వ్యవసాయ పనుల్లో సహాయపడిన ఎడ్లు, ఇంటిల్లిపాదికీ కావాల్సిన పాడిని అందించి చక్కని ఆరోగ్యాన్ని సమకూర్చిన ఆవులు, గేదెలకు గ్రామీణులు కృతజ్ఞతలు తెలియజేసే పండుగే కనుమ.

ద్వాపరయుగంలో ఇంద్రుడికి బదులుగా గోవులను, గోవర్ధనగిరిని పూజించమని నందకులానికి కృష్ణుడు చెప్పిన నాటి నుంచే ఈ పండుగ ఉందని పెద్దల నమ్మకం.

ఈ రోజు రైతులు తమ పశువులను వేడి నీటితో శుభ్రంగా కడిగి అందంగా అలంకరించి హారతులిచ్చి పూజిస్తారు. అనంతరం పశు గణాన్ని తోలుకొని వెళ్లి గ్రామ దేవత ఆలయం చుట్టూ తిప్పి తీసుకొస్తారు. ఈ రోజు వాటిచేత ఏ పనీ చేయించరు. వాటికి మేలైన ఆహారాన్ని అందిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కనుమనాడు గ్రామ ప్రజల౦దరూ కలిసి ఎడ్ల పందాలను తిలకిస్తారు.

కొన్నిచోట్ల కనుమ నాడు పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండి దాన్ని దేవుడికి నివేదించిన తర్వాత పొలంలో చల్లుతారు. దీన్నే 'పొలి చల్లటం' అంటారు. దీనివల్ల తమ పంటలకు చీడపీడల బెడద ఉండదని రైతులు విశ్వసిస్తారు.

కనుమ నాడు పక్షులనూ రైతులు ఆదరిస్తారు. ఇందులో భాగంగా పక్షుల కోసం జొన్న కంకులూ, వరి కంకులూ తెచ్చి గుమ్మాలు, కిటికీలు, వసారాలో వేళ్ళాడగడతారు.

ధనుర్మాసం అంతా వేసే ముగ్గులకు భిన్నంగా కనుమనాడు పెద్ద రథం ముగ్గు వేస్తారు. విష్ణువు చేత పాతాళానికి తొక్కబడిన బలి చక్రవర్తి సంక్రాంతి మూడురోజులూ భూలోకానికి వచ్చి, కనుమనాడు తిరిగి వెళతాడనీ, ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికేందుకే ఈ రథం ముగ్గు వేస్తారని పెద్దలు చెబుతారు. 

అలాగే శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఆయన నివసించే వైకుంఠ వాకిలికి ఈ ముగ్గు ప్రతీక అనీ కొందరు చెబుతారు.

పండుగ రోజు పెట్టిన బొమ్మల కొలువును కనుమనాడు తీస్తారు. దీన్నే 'బొమ్మల కొలువు ఎత్తటం' అంటారు. పేరంటాలను పిలించి బొమ్మలకు హారతి పట్టి, కొలువులో పెట్టిన ఏదైనా ఒక్క బొమ్మను ఉన్నచోటు నుంచి కదిలిస్తారు. తర్వాత వీలును బట్టి ఎప్పుడైనా బొమ్మలను తీసుకుంటారు.

కనుమ రోజు మినప వంటకాలు తినాలని పెద్దలు చెబుతారు. అందుకే అందరూ ఈ రోజు గారెలు తింటారు. పశు పక్ష్యాదులను పూజించే కనుమ నాడు మాంసం తినే ఆచారం తర్వాతి రోజుల్లో వచ్చిందే తప్ప మొదటినుంచీ ఉన్నదైతే కాదు.

కనుమనాడు పిల్లలు, యువతీ యువకులు గాలిపటాలు (పతంగులు) ఎగరవేస్తారు. ఆకాశంలో రివ్వున పైకి దూసుకుపోయే గాలిపటం మాదిరిగానే వారి లక్ష్యాలూ సమున్నతంగా ఉండాలనే సందేశం ఇందులో ఉంది.

కనుమ నాడు నువ్వులు, బెల్లం పంచి శనిదేవుని శుభ దృష్టి, శనగ గుగ్గిళ్ళు లేదా నానబెట్టిన శనగలు పంచిపెడితే (దానము) ద్వారా గురు గ్రహం ఆశీస్సులు లభిస్తాయి.
          
లోకా సమస్తా సుఖినోభవన్తు!

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka