Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Thursday, April 25, 2024

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas


శ్రీ కృష్ణ లీలలు! TELUGU VOICE

అది మండు వేసవి. మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. పండు ముదుసలి, రామ భక్తురాలు అయిన ఒక అవ్వ, తలపై బరువైన పళ్ళ బుట్టతో, వేణు గోపాల స్వామి గుడి దగ్గర కాసేపు నీడలో కూర్చుందామని వచ్చింది. మెల్లగా బుట్టను క్రిందికి దించింది. చెమట పట్టిన ఆ ముడుతల ముఖాన్ని తుడుచుకుంటూ, "నాయనా గోపాలా! ఊరంతా తిరిగాను. ఒక్క పండు కూడా అమ్మలేదు. ఈ రోజు పస్తేనా స్వామీ?" అని ఆ వేణు గోపాలుని విగ్రహం వైపు చూస్తూ తనలో తాను అనుకున్నది.

[ శ్రీ కృష్ణుడి అయిదుగురు తల్లులు! https://youtu.be/AbSSImIw2-4 ]


ఇంతలో ఒక బాలుడు, నుదుటిపై కస్తూరీ తిలకం, వక్ష స్థలంపై కౌస్తుభ హారం, నాసాగ్రమున నవమౌక్తికం,  కంఠాన ముత్యాలహారం, చేతిలో పిల్లన గ్రోవి, శిఖలో నెమలి పింఛంతో, ఆ అవ్వ వైపుగా వస్తున్నాడు. ఆ బాలుడు ఎవరోకాదు, వేణు గోపాలుడే..

ఎవరా అన్నట్లు, ఆ అవ్వ అలా చూస్తోంది. దగ్గరగా వచ్చిన బాలుని చూసింది. తాదాత్మ్యంతో ఆ లీలా మానుష రూపధారిని చూస్తూ, 'అయినా కలియుగంలో భగవంతుని దర్శనం ఏమిటిలే' అనుకున్నది. 

"అవ్వా, ఈ పళ్ళు తీయగా ఉంటాయా?" అడిగాడు బాలుడు.

"అవును కన్నా. చాలా తీయగా ఉంటాయి. తీసుకో" అన్నది అవ్వ.

బాలుడు: ఎన్ని?

అవ్వ: ఎంత డబ్బు ఇస్తే అన్ని..

బాలుడు: డబ్బా? అంటే ఏమిటి?

అవ్వ: నీకు అర్ధం కాలేదా.. కాలేదన్నట్లు తల ఊపాడు బాలుడు.

ఈ చోద్యాన్నంతటినీ నారదుడు గమనిస్తున్నాడు. ఆ లీలామానుష విగ్రహధారి లీల ఏమిటా అన్నట్లు చూస్తున్నాడు.

అవ్వ: అయ్యొ పిచ్చికన్నా.. డబ్భంటేనే తెలియదా? నువ్వు ఏదైనా తీసుకుంటే, దానికి ప్రతిఫలం ఇవ్వాలి. అదే డబ్బంటే..

బాలుడు: అటువంటిదేదీ నా దగ్గర లేదే..!

అవ్వ: నీకు తెలియదులే. పళ్ళు కొనడానికి డబ్బు కావాలని అమ్మనడుగు. ఇస్తుంది.

బాలుడు: అమ్మ ఇంట్లో లేదు. యమునకు వెళ్ళింది..

అవ్వ: ఇంట్లో ఏమైనా ధాన్యం గింజలున్నాయా?

బాలుడు: ఓ.. చాలా ఉన్నాయి. గాదెల నిండా ఉన్నాయి..

అవ్వ: అయితే కొన్ని తీసుకురా. పళ్ళు ఇస్తాను..

బాలుడు: చాలా వింతగా ఉందే. అమ్మ ఎన్నో ఇస్తుంది. కానీ ఏమీ తీసుకోదు. గొల్ల భామలు వెన్న పెడతారు. డబ్బులు తీసుకోరు. వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకోమంటారు. కౌగిలించుకోమంటారు. అమ్మా అనమంటారు..

బాలుడి మాటలు అవ్వకు అంత అలసటలోనూ నవ్వు తెప్పించాయి. బాలుని అలాగే చూస్తోంది. ఆమె మనస్సు ఏదో తన్మయత్వం చెందుతోంది ఆ ముద్దు ముద్దు మాటలకు.

బాలుడు: అమ్మా..

అవ్వ: నన్నే! అన్నది ఆశ్చర్యపోతూ..

బాలుడు: అవునమ్మా.. నిన్నే అమ్మా అన్నాను. అమ్మా అంటాను. నిన్ను కౌగలించు కుంటాను. నీ ఒళ్ళో కూచుంటాను. నిన్ను ముద్దు పెట్టుకుంటాను. ఒక్క పండు ఇవ్వవా? తినాలనుంది..

అవ్వ: పిచ్చి తండ్రీ. నాకా అదృష్టం లేదు కన్నా..

బాలుడు: ఎందుకు?

అవ్వ: నేను అంటరాని దానను. నిన్ను నేను ఎలా ముద్దాడగలను?

అవ్వ అలా అంటుండగానే బాలుడు, 'ఇలా' అంటూ అవ్వ ఒడిలో వాలిపోయాడు. అవ్వను ముద్దాడాడు. మెడ చుట్టూ తన చిట్టి చేతులతో చుట్టేశాడు.

అవ్వ: అయ్యో కన్నా. ఏమిటిది! ఎవరైనా చూస్తే ఎంత గొడవ చేస్తారో.. నేను అంట రాని దానను..

బాలుడు: ఏం? అంటరాని వారు మనుషులు కారా? ఇవన్ని మానవ కల్పితాలు.. అలాంటి ఆంక్షలు నాకు ఇష్టంలేదు.. నా స్నేహితులు చాలా మంది నీవంటి వారే. నవ్వు కూడా అమ్మవే నాకు.. అంటూ అవ్వను ముద్థు పెట్టుకున్నాడు.

నారదుడు చూస్తున్నాడు. ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు.

శ్రీకృష్ణునికి యశోదా దేవి లాగా, శ్రీనివాసునికి వకుళాంబ లాగా, అవ్వ ఆ బాలుడి కళ్ళలోకి అలా వాత్సల్యంగా చూస్తోంది. తన అదృష్టానికి మురిసి పోతోంది.

అవ్వ: కన్నా.. నువ్వు ఎవరివి? ఏమిటీ మాయ? నీ స్పర్శ నాలో వెలుగులు చిమ్మి, తన్మయ పరచింది. క్రిందటి జన్మలో యశోదా దేవినా? లేక వకుళా దేవినా..? ఈ అదృష్టం చాలు.. ఇంతకన్నా ధనం వద్థు.. పళ్ళు ఎన్నికావాలో తీసుకో. ఒకటా? రెండా? అన్నీనా? తీసుకో కన్నా.. ఎన్నికావాలో తీసుకో..

బాలుడు: నాకు ఇవన్నీ కావాలి..

అవ్వ: అలాగే కన్నా.. అన్నీ తీసుకో. అంటూ అన్నీ తీసి ఒక గుడ్డలో మూట కట్టబోయింది.

బాలుడు: వుండమ్మా. నేను నీకు కావలసినన్ని ధాన్యం గింజలు తెస్తాను..

అవ్వ: వద్దు కన్నా.. నా జన్మ తరించి పోయింది. పళ్ళు తీసుకో కన్నా.. అన్నది ఆర్ద్రంగా

ఆ బాలుడు వినిపించుకోకుండా బుడిబుడి అడుగులతో ఇంట్లోకి వెళుతుంటే, అవ్వ ఆ బాలునివైపే చూస్తూ, తన్మయత్వంతో బుట్టలో వున్న పళ్ళన్నీ బాలుని కోసం గుడ్డలో వేసి మూటకడుతోంది.

ఇంతలో బాలుడు తన చిట్టి చేతుల దోసిలి నిండా ధాన్యం తీసుకు వస్తున్నాడు. ధాన్యపు గింజలు దారంతా పడిపోతున్నాయి.

బాలుడు: ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను తీసుకో.. అంటూ అవ్వకు చూపించాడు. బాలుడు అవ్వను చేరే సమయానికి, ఆ చిట్టి చేతుల దోసిలిలో పది పదిహేను గింజలు మాత్రమే మిగిలాయి. అవ్వ అలా బాలుని దోసిలి వైపు, బుంగమూతి వైపు, మిలమిల లాడే కన్నుల వైపు చూస్తోంది. నాడు  యశోదా దేవికి పదునాలుగు లోకాలను చూపించిన ఆ నోటిని సగం తెరచి, బాలుడు చిరునవ్వుతో అవ్వవైపు చూస్తున్నాడు.

అవ్వ ఆ గింజలను చూసి చిరునవ్వుతో, బోసి నోటిని సగం తెరచుకుని, కంటి నుండి వాత్సల్య పూరితమైన ఆనంద భాష్పాలతో, లీలా మానుష ధారిని చూస్తూ తన్మయత్వం చెందుతూ, తనను తాను మరచిపోయి అలా ఉండిపోయింది.
 
అవ్వ: అబ్బో.. చాలా తెచ్చావు కన్నా..

బాలుడు: దోసిలిలో చాలానే తీసుకున్నానమ్మా.. అన్నీ దారిలో పడిపోయాయి. ఇవే మిగిలాయమ్మా.. బుంగమూతితో అవ్వ వైపు చూస్తూ అన్నాడు.

అవ్వ: ఇవే చాలా ఎక్కువ కన్నా. నా బుట్ట నిండిపోతుంది..

అంటూ ఆ ధాన్యం గింజలను ఆనందంగా తీసుకున్నది. ఈ రోజు చాలా మంచి రోజు అనుకున్నది అవ్వ. ఆ కాసిన్ని గింజలే బుట్టలోని గుడ్డలో అపురూపంగా పోసుకుని, పళ్ళమూటను బాలునికి ఇచ్చింది. బాలుడిని మనసారా కౌగలించుకుని, ముద్దు పెట్టుకున్నది. విడువలేక విడువలేక, అతి కష్టం మీద బయలుదేరింది.

అంతా నారద మహాముని తిలకిస్తున్నాడు. ఆ శ్రీకృష్ఞ పరమాత్మ ఏ లీల చూపనున్నాడా అన్నట్టు, నమస్కారం చేశాడు.

అవ్వ బుట్ట తేలికగా ఉంది. మనసు బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది. నెమ్మదిగా ఇంటికి చేరింది. నట్టింట్లో బుట్టను క్రింద పెట్టి, కూర్చుని బుట్టలోని ధాన్యం గింజలు కట్టిన గుడ్డను తెరిచి చూస్తే, అందులో ధాన్యంగింజలు లేవు. వాటి స్థానంలో, గంపెడు నవరత్నాలూ, మణి మాణిక్యాలూ ధగధగలాడిపోతూ కనిపించాయి. అవ్వ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. నిస్చేష్ఠురాలై పోయింది ఆమె. తనకు తెలియకుండానే రెండు చేతులనూ జోడించి, పరమాత్మకి నమస్కరిస్తోంది. ఇదంతా గమనిస్తున్న నారదుడు, ఆ పరమాత్మ ఆవ్వపై కురిపించిన కనకవర్షానికి, ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తి మార్గమని అనుకున్నాడు.
 
మనకు ధనరాశులు ఇచ్చి, భక్తి మార్గంలో వెళతామా, లేక ధన రాశుల వలన వేరే పేరాశలు, పెను బంధాలకు మార్గం మార్చుకుంటామా! అనే దానికి ఇది ఒక పరీక్ష కాదుగదా? ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే ఉచ్చులో నరుని వివేకము ఏవిధంగా పయనిస్తుందో.. దైవ చింతన వైపా, లేక ధన చింతన వైపా? నరుడు ఈ పరీక్షలో బాగా యోచించి, ధనమనే మాయా పాశానికి లొంగక, ఆ పరమాత్మ చింతనలోకి వెళతాడా, లేక ఆ ఉచ్చులో చిక్కుకుపోయి, ఐహిక బంధాలలో ఉండిపోతాడా? ఆ నందనందనుడు బహు చమత్కారి. అనుకున్నాడు నారదుడు..

🚩 జై శ్రీ కృష్ణ 🙏

Tuesday, April 23, 2024

హనుమత్ విజయోత్సవ దినం 2024 Hanuman Jayanti


అందరికీ హనుమత్ విజయోత్సవ శుభాకాంక్షలు 🚩 జై శ్రీహనుమ 🙏 TELUGU VOICE
ఈ రోజు చైత్ర పూర్ణిమ - హనుమత్ విజయోత్సవ దినం.. 

చాలా మందికి వున్న సందిగ్ధం, హనుమాన్ జయంతి ఎప్పుడు? హనుమాన్ విజయోత్సవ దినం ఎప్పుడనేది.. హనుమంతుని జన్మ తిథి చైత్ర మాసం లోనా, వైశాఖంలో చేసుకోవాలా అనే అనుమానం చాలామందికి ఉంటుంది.. అలాంటి వారు ఈ కథనం చదివి, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

[ హనుమంతుడు తీర్చిన తుంబుర నారదుల వివాదం: https://youtu.be/PDJaB6-eRmQ ]


పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం, ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం రోజున జన్మించారని తెలుపబడింది.. అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు.

[ హనుమకు సీతమ్మ చెప్పిన ‘బోయవాడు - ఎలుగుబంటి’ కథ!: https://youtu.be/YK8QjVW2kc0 ]


అయితే, కొన్ని ఇతిహాసాల ప్రకారం, చైత్ర పౌర్ణమినాడు నికుంభుడు, తదిరత రాక్షసులను సంహరించి, హనుమంతుడు విజయం సాధించినట్లు వ్యక్తమవుతోంది. ఈ కారణంగా, ఆ రోజున హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు. అలాగే, చైత్ర పూర్ణిమ నాడు "హనుమంతుని విజయోత్సవం" దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.

[ ఆంజనేయ స్వామి అద్భుత చరిత్ర!: https://youtu.be/6wOkEw-wpsw ]


ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం, దగ్గర దగ్గరగా 60 అడుగులతో, శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ "హనుమత్ విజయోత్సవం" నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు. ఈ దీక్ష చివరి రోజున, హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులూ తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తారు.

[ అర్జునుడి రథంపై హనుమంతుడు: https://youtu.be/F3pdXaWX7ps ]


హనుమంతుని జన్మ తిథి వైశాఖ బహుళ దశమినాడు జరుపుకునేందుకు ఓ బలమైన కారణం వుంది. "కలౌ పరాశర స్మృతి" అని శాస్త్రాలు చెబుతున్నాయి.

శ్లో: వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే |
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే ||

అని చెప్పబడింది.  దీని ప్రకారం వైశాఖ మాస బహుళ దశమి నాడు హనుమంతుని జన్మ తిథి జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలతో స్వామిని స్తుతిస్తే, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని, ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

[ ఔరంగజేబుని హడలెత్తించి పరుగెత్తించిన ఆంజనేయస్వామి!: https://youtu.be/pmdh0JhWyMY ]


చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవం అంటారని పెద్దలు చెబుతారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది, వైశాఖ బహుళ దశమినాడని, పరాశర మహర్షి చెప్పారు.

[ 16వ శతాబ్దంలో హనుమాన్ చాలీసా వ్రాసిన తులసీదాసుకు హనుమ కటాక్షం: https://youtu.be/jUk27kUoa5w ]


శ్రీ రాముడు సీతామాతతో కలసి అయోధ్యను చేరుకున్నాక, లంకలో రావణునిపై విజయానికి కారణం హనుమయేనని రాముడు ప్రకటించి, చైత్ర పూర్ణిమను హనుమాన్ విజయోత్సవంగా నిర్ణయించారట.

🚩 జై శ్రీరామ 🚩 జై శ్రీహనుమ 🙏

Monday, April 22, 2024

అంతిమ యాత్ర! ‘గరుడ పురాణం’ Garuda Puranam - Antim Yatra


అంతిమ యాత్ర! జీవిత సత్యాలు.. TELUGU VOICE
‘గరుడ పురాణం’ ప్రకారం వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన పనులు!

మన సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ గురించి మన గత వీడియోలో తెలుసుకున్నాము. అటువంటి ఉత్తమమైన జన్మ అంత్య కాలంలో, సశాస్త్రీయంగా చేయాల్సిన విధులను, పాశ్చాత్య పోకడలలో పడో, పద్ధతులు తెలియకో, Secular మూర్ఖుల ప్రభావం వలన ఇవన్నీ మూఢ నమ్మకాలుగా భావించో, అంతిమ యాత్రకు సంబంధించిన విధి విధానాలను విస్మరిస్తున్నాము. అందరూ ఈ వీడియోను చివరిదాకా చూసి, అసలైన పద్ధతులను తెలుసుకుంటారనీ, మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తారనీ ఆశిస్తున్నాను.. ప్రతి హిందువూ తెలుసుకుని, తప్పక పాటించాల్సిన ఇటువంటి అత్యవసర విషయాలను అందరికీ చేరేలా ప్రయత్నిద్దాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1s3K7fXEf_A ]


శ్రీమహావిష్ణువును గరుత్మంతుడు ఇలా అడుగుతున్నాడు.. “హే భగవన్‌! మృత్యువు ఆసన్నమైనప్పుడూ, వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలను వివరంగా వినాలని వుంది. కరుణించండి” అని ప్రార్ధించాడు.. దానికి విష్ణు భగవానుడు ఇలా చెప్పనారంభించాడు.. జీవాత్మ తన కర్మ భోగ కారణవశాన, తన వర్తమాన శరీరాన్ని వీడిపోతున్నప్పుడు, ఆ వ్యక్తిని పేడతో బాగా అలికిన భూమిపై, తిలలనూ, కుశాసనాన్నీ పరచి, దానిపై పరుండ బెట్టాలి. నోటిలో బంగారాన్ని పెట్టి, సమీపంలో తులసి మొక్కనూ, సాలగ్రామ శిలనూ తెచ్చిపెట్టాలి. ఆ వ్యక్తి మృత్యువును వీలైనంత వరకూ ముక్తి దాయకం చేయడానికి, ఒక పద్ధతిలో సూక్తాలను పఠించాలి. తరువాత చిన్న చిన్న బంగారు రేకులను, మరణించిన ప్రాణి ముఖంపై, ముక్కు ఇరు కన్నాలలో, కన్నులపై, చెవులపై, లింగంపై అంటించాలి. రెండు చేతులలోనూ, కంఠ భాగంపైనా, తులసి దళాలను ఉంచాలి. శవాన్ని రెండు వస్త్రాలలో చుట్టి, కుంకుమతో, అక్షతలతో పూజించిన తరువాత, పూలమాలతో అలంకరించాలి. అప్పుడు పుత్రులు, బంధు బాంధవులంతా కలసి, ఆ శవాన్ని పుత్రులు భుజంపై పెట్టుకుని మోస్తుండగా, పురజనులతో కలసి, రెండవ ద్వారం గుండా బయటకు తీసుకు వచ్చి, శ్మశానం వైపు సాగి పోవాలి. అక్కడ పుత్రులే, తూర్పు వైపుగానీ, ఉత్తరాభిముఖంగా గానీ చితిని నిర్మించి, అందులో చందన, తులసి, పలాశాది కర్రలను వేయాలి.

మరణాసన్న వ్యక్తి ఇంద్రియాలన్నీ వ్యాకులమైపోయి, చైతన్యం పోయి, శరీరం జడమైపోతుండగా, ప్రాణం అనబడే ఆత్మ, యమదూతలతో కలసి వెళ్ళిపోతుంది. అప్పుడు మృతునికి దివ్యదృష్టి ప్రాప్తిస్తుంది. దాని ద్వారా అతడు ప్రపంచాన్నంతటినీ చూడ గలుగుతాడు. దీనికి ముందు ప్రాణం పోవడం అనేది, అందరికీ ఒకేలాగా జరగదు. కొందరికది గొంతుదాకా వచ్చి చిక్కుకుపోయి, నానాబాధలూ పెడుతుంది. శరీరం భీభత్సంగా, ముఖం వికృతంగా కదులుతాయి. కొందరికి నోటి నుండి నురగ కారుతుంది. వీరంతా పాపాత్ములు. కాబట్టి, వీరిని యమదూతలు పాశంతో కొడతారు. అప్పుడా పాశానికి ప్రాణం తగులుకుంటుంది. పుణ్యాత్ముల విషయంలో ఇవేవీ జరగవు. మృతుడు నిద్రిస్తున్నట్టే వుంటాడు. ముఖంలో ఒకరకమైన ప్రశాంతతా, వెలుగూ కనిపిస్తుంటాయి. ఆ ప్రాణి దృష్టికి యమదూతలు దేవదూతల లాగా, యమధర్మరాజు విష్ణురూపునిలాగా కనిపిస్తారు. అదే యమధర్మరాజు, పాపులకు కాటుక కొండలాగా ఎలా కనిపిస్తాడో ఇది వరకే విన్నావు కదా!

మరణం తరువాత మానవశరీరం, అస్పృశ్యమై పోతుంది. వెగటును కూడా కలిగిస్తుంది. పుణ్యాత్ముని శవం కూడా, కొంతసేపటికి దుర్గంధయుక్తమై పోతుంది. ఈ అందమైన శరీరంపై ఇతరులకుండే భ్రమలు కూడా, తాత్మాలికంగా తొలగిపోతాయి. గరుడా! ఈ అసత్‌ శరీరం ద్వారా జరిగే విత్త దానం, ఆదరపూర్వక వాణి, ధర్మం, కీర్తి, పరోపకారం లాటివే అందంగా వుండి, లోకానికి ఆనందాన్ని కలిగిస్తాయి. మానవ జీవితానికి సారభూతం, ఆ పుణ్యమే.

దుష్టులను తోలుకుపోతున్న యమదూతలు, వారిని అడుగడుగునా, అన్ని విధాలా హింసిస్తుంటారు. ఓరీ దుష్టాత్మా! పద నిన్ను కుంభీపాకంలో పడేస్తాము. అదెలాగుంటుందో తెలుసా?” అంటూ దానిని అతి భయంకరంగా వర్ణిస్తారు.

గరుడా! పదకొండవ రోజున సముచితమైన స్థలంలో శ్రాద్ధం పెట్టాలి. ప్రాణం పోయినప్పటి నుండి అప్పటిదాకా, క్రమంగా ఆరు పిండదానాలు చేయాలి. మృత స్థానం, ద్వారం, నలుబాటల కూడలి, విశ్రామ స్ధలం, చితి, అస్థిచయన స్ధానం అనే స్థలాలలో వాటిని పెట్టాలి. వీటినెందుకు పెట్టాలంటే, మనిషి పోయిన చోట అంటే, ఇంటిలో పెట్టేదానిని, ‘శవ పిండమని అంటారు’. దీనివల్ల ఆ గృహ వాస్తు దేవతలు ప్రసన్నులౌతారు. భూదేవీ, ఆమె కొలువులో ఉండే దేవతలు కూడా ప్రసన్నులౌతారు. రెండవ పిండాన్ని, ద్వారంపై పెట్టాలన్నాను కదా! దానికి ‘పాంథ’ అని పేరు. దాని వల్ల ద్వారస్థ గృహ దేవతలు ప్రసన్నులవుతారు. కూడలిలో పెట్టబడే ‘ఖీచరి’ నామక పిండం వల్ల, భూతాది దేవయోనులు శాంతిస్తాయి. విశ్రామ స్థలంలో చేసే ‘భూతి’ పేరిటి పిండ దానం వల్ల, పిశాచ, రాక్షస, యక్షాది గణాలూ, అన్య దిగ్వాసి దేవతలూ, దహనంలో సహకరిస్తాయి. చితా స్థలంపై, ఆ పేరుతోనే చేసే పిండదానం, ప్రేతత్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీని తరువాత, ‘ప్రేత’ నామంతో చేసే పిండదానం వల్ల, శవం అగ్నికి ఆహుతయ్యే యోగ్యతను పొందుతుంది.

మరొక మూడు పిండదానాలను, ప్రాణం పోయిన చోట, స్మశానానికి సగం దూరంలోనూ, చితి మీదా చేయాలి. వీటివల్ల క్రమంగా, విధాత, గరుడధ్వజుడూ, యమదూతలూ ప్రసన్నులవుతారు. మూడవ పిండ దానం ముగుస్తుండగానే, మృతవ్యక్తి, శారీరక దోషాలనుండి ముక్తుడవుతాడు. తరువాత చితిని ప్రజ్వలింపజేయడానికి ఒక వేదికను నిర్మించి, దానికి ఉల్లేఖన, ఉద్ధరణ, అభ్యుక్షణాదులను చేసి, విధి పూర్వకంగా అగ్నిని స్థాపించి, పుష్ప అక్షతాదులతో, క్రవ్యాది నామాలతో, అగ్నిదేవుని పూజించి, ఇలా ప్రార్థించాలి...

త్వం భూత కృజ్జగద్యోనే త్వం లోక పరిపాలకః
ఉపసంహారకస్త స్మాదేనం స్వర్గం మృతం నయ (ధర్మ... 15/44, 45)

ఇలా అగ్నిని పూజించి, శవానికి నిప్పంటించాలి. మృతుని శరీరం సగం కాలాక, నేతిని ఆహుతి చేయాలి. ‘లోమభ్యః స్వాహా’... అనే మంత్రంతో, యథావిధి హోమం చేయాలి. యమ, అంతక, మృత్యు, బ్రహ్మ, జాతవేద నామాలతో ఆహుతులిచ్చి, ఒక ఆహుతిని ప్రేత ముఖంపై ఇవ్వాలి. ముందుగా అగ్నిని పై భాగంలో జ్వలింపజేసి, దానిని తెచ్చి చితియొక్క తూర్పు భాగాన్ని మండించాలి. క్రింది మంత్రాలచే అభిమంత్రితమైన తిలమిశ్రిత ఆజ్యాహుతులను, చితిపై వేస్తునే వుండాలి.

అస్మాత్ త్వ మధిజాతోఽసి త్వదయం జాయతాం పునః
అసౌ స్వర్గాయ లోకాయ స్వాహా జ్వలిత పావకః (ధర్మ... 15/49)

ఈ విధంగా తిల మిశ్రిత సమంత్రక ఆజ్యాహుతినిచ్చి, మృతకుని పుత్రుడే శవదహనం చేయాలి. ఈ సమయంలో మాత్రమే, అతడిలోని దుఃఖమంతా పోయేలాగా వెక్కి వెక్కి ఏడవాలి. ఆ దృశ్యం ప్రేతానికి సుఖాన్ని కలిగిస్తుంది. శవం పూర్తిగా కాలిపోయాక, ఆ స్థలంలోనే అస్థి-సంచయనం చేయాలి. తరువాత ప్రేతానికి దాహజన్య క్లేశ శాంతికై, పిండ దానమివ్వాలి.

దహన సంస్కారానంతరం, పుత్రులు సచేల స్నానం అంటే, వస్త్ర సహితంగా స్నానం చేసి, నామ గోత్రోచ్చారణ సహితంగా, తిలోదకాలివ్వాలి. అంతట అక్కడున్న గ్రామ ప్రజలందరూ గట్టిగా చప్పట్లు చరుస్తూ, విష్ణునామ సంకీర్మనాన్ని కొంత సేపు చేసి, తరువాత మృతకుని గుణగణాలను చర్చించుకుంటూ, అతని, లేక ఆమె ఇంటికి వచ్చి, ద్వారపు దక్షిణ భాగంలో గోమయాన్నీ, తెల్ల ఆవాలనూ ఉంచాలి. మనస్సులో వరుణ దేవుని ధ్యానించుకుంటూ, వేపాకులను నమలి, నేతి చుక్కను నోట్లో వేసుకుని, ఎవరింటికి వారు పోవాలి.

సూర్యాస్తమయమైనాక, మృతుని పుత్రుడు ఇంటి బయటగానీ, ఏకాంత ప్రదేశంలో గానీ, మృతుడు రోజూ చూసిన నలుదారుల కూడలిలోగానీ, మట్టిపాత్రలతో పాలు, నీరు పెట్టాలి. ఇలా మూడు రోజులు చేయాలి. కొన్ని మూఢ హృదయ జీవాత్మలు, ఆ మూడుచోట్లా తిరుగుతుంటాయి. పదవరోజు దాకా ప్రతిరోజూ, ప్రేతానికి పిండదానాన్నీ, జలాంజలినీ ఇస్తూనే వుండాలి. పదవ రోజుదాకా, రోజుకి కొంత పెంచుతుండాలి.

ఈ ఔర్ధ్వదైహిక సంస్కారాన్ని పుత్రుడు చెయ్యాలి, లేని పక్షంలో, భార్య, లేక భర్త చెయ్యాలి, లేకుంటే శిష్యుడు, కాకుంటే సోదరుడు చెయ్యాలి. పిండ దానాన్ని స్మశానంలో గానీ, అన్య తీర్ధంలో గానీ చేయవచ్చు. పిండ ప్రదానంలో కూర, ఉప్మా, తీపిముద్ద అన్నంతో బాటు, ఏదైనా పెట్టవచ్చు గానీ, తొలిరోజు పెట్టిన పదార్థాలనే, పదవరోజు దాకా రోజూ పెట్టాలి.

ఈ పిండం నాలుగు భాగాలుగా విడిపోతుంది. రెండు భాగాలు మృతుడి శరీర నిర్మాణానికీ, ఒక భాగం యమదూతలకీ పోగా, మిగిలినదే మృతుని నోటికందుతుంది. తొమ్మిది పగళ్ళూ, రాత్రులూ గడిచే సరికి, మృతుడికొక శరీరం ఏర్పడుతుంది. అది పదవ రోజు మహా ఆకలితో ఆవురావురుమంటుంటుంది.

పదవ రోజు పార్వణాది శ్రాద్ధాలలో నిర్దేశింపబడిన పిండ విధి, మంత్ర, స్వధా, ఆవాహన, ఆశీర్వాద ప్రయోగాలేవీ వుండవు. ఆ నాటి కర్మ కేవలం మృతుని నామ గోత్రోచ్చార పూర్వకంగా చేయబడుతుంది. ఇంతవరకు పెట్టిన పిండాల వల్ల, రోజుకొక అంగంగా, క్రమంగా తల, మెడ, భుజాలు, గుండె, వీపు, నాభి, కటి, గుహ్యం, తొడలు, కాళ్ళు ఏర్పడతాయి. పదవ రోజు చేసే పిండదానం, పెద్ద యెత్తున వుండాలి. ఆ రోజు మృతకునికి ఆకలి, అతని అలవి మీరినదై వుంటుంది. ఆతడు లేక ఆమె బతికున్నప్పుడు ఇష్టంగా తిన్న పదార్థాలన్నిటినీ వండించి పెట్టాలి.

ప్రేతాలు బాగా భోజనం చేసేది, పదకొండు, పన్నెండవ రోజులలోనే. ఆ రోజులలో ప్రేత శబ్దాన్ని, స్త్రీ పురుషలిద్దరికీ వాడాలి. ఇక నామ గోత్రాలకి బదులుగా, మంత్రాలతో బాటు, ప్రేత శబ్దాన్నే వాడుతుండాలి. పదమూడవ రోజు, ప్రేత నరకయానం ప్రారంభమవుతుంది. అది ఎవరికెలా జరుగుతుందో, ఎన్ని నగరాలను ఎలా విలపింపజేస్తూ దాటిస్తుందో వినివున్నావు కదా!” (అధ్యాయాలు 15, 16) ఈ వీడియోను మనం గతంలో చేసి ఉన్నాము. చూడనివారు తప్పక చూడండి..

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Wednesday, April 17, 2024

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏 Sri Rama Navami


అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🚩 జై శ్రీరామ 🙏 TELUGU VOICE

శ్రీ రామనవమి విశిష్ఠత : 

https://youtu.be/VDcEZ1quBg8?si=PEBbICHjG7yjgnxG

శ్రీ రామనవమి రాముడు పుట్టిన రోజా, పెళ్లిరోజా? | What Is Sri Rama Navami and Why Do We Celebrate it?



Monday, April 15, 2024

మనిషి జన్మ! జీవిత సత్యాలు.. ‘గరుడ పురాణం’ Garuda Puranam


మనిషి జన్మ! జీవిత సత్యాలు.. TELUGU VOICE
‘గరుడ పురాణం’ ప్రకారం మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ ఏమిటో తెలుసా?

మన సనాతన ధర్మంలోని పురాణాలు, మన మహర్షులు మనకు అందించిన వరాలు. అందులోనూ వ్యాస భగవానుడి కృతులైన అష్టాదశ పురాణాలలోని గరుడ పురాణం, మనిషి జీవన గమనానికి మార్గ దర్శకం. సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అత్యంత దుర్లభమైన మనుష్య జన్మకు సంబంధించి, గరుడుడికి సాక్ష్యాత్తూ శ్రీ మహావిష్ణువు తెలియజేసిన ఆ విషయాలలో, మనిషిగా పుట్టాలంటే ఏం చెయ్యాలి? మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది? శరీరాన్ని ఆశ్రయించి మరణించేది ఎవరు? అప్పుడు ఇంద్రియాలు ఏమైపోతాయి? మనిషి అస్పృశ్యుడెలా అవుతాడు? ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడ, ఎలా అనుభవిస్తాడు? అసలు ఎక్కడికి, ఎలా వెళ్తాడు? యమలోకానికీ విష్ణులోకానికీ ఏయే మార్గాలలో వెళతాడన్న గరుడుడి సందేహాలకు, శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2eMvV6mcSnU ]


“ఓయీ వినతనందనా! పరస్త్రీనిగానీ, బ్రాహ్మణుని ధనాన్నిగానీ అపహరించినవాడు, నిర్జన ప్రదేశంలో గానీ, మహారణ్యంలో గానీ, బ్రహ్మ రాక్షసిగా పుడతాడు. రత్నాల దొంగ, నీచయోనిలో పడతాడు. కొన్ని జన్మలు, ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలకూ, కోరికలకూ అనుగుణంగా కూడా వస్తాయి. నవరంధ్రాల కాయం మానవ శరీరమనే మాట విని వున్నావు కదా! సత్కర్మలు చేసిన పుణ్యాత్ముని ప్రాణం, నాభినుండి పై వరకూ గల ఊర్ధ్వ ఛిద్రాల నుండి బయటకు పోతుంది. శరీరం ద్వారా చేసే పనులను, శరీరంతోనే అనుభవించాలి. ఒక్కటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి.. అనాసక్త భావంతో అన్నీ సత్కర్మలే చేసేవాడు, అన్ని చోట్లా సుఖాన్నే అనుభవిస్తాడు. అతడు సాంసారిక మాయాజాలంలో చిక్కుకోడు. మాయ వలలో పడి వికర్మలనే చేసేవాడు, పాశబద్ధుడై, కష్టాల పాలవుతాడు. (అధ్యాయం -11)

గరుడ పురాణంలో, ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం - ధర్మం గురించి ఇలా వివరించబడినది.. మనిషికి అన్ని చోట్లా హితాన్ని కలిగించేవీ, ప్రేతత్వం నుండి ముక్తిని కలిగించేవీ ఏవేవో తెలిసింది కదా! గరుత్మంతా! ఈ సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల యోనులున్నాయి. వీటిని నాలుగు రకాల జీవాలుగా విభజించవచ్చు. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజములనే ఈ నాలుగు రకాలలో, మరల ఒక్కొక్కటి ఇరవై యొక్క లక్షల జీవాలతో ఉన్నది. మనుష్యాది యోనులను జరాయుజాలంటారు. వీటిలో మనుష్య జన్మ, పరమ దుర్లభం.

మనుష్య లేదా మానవ జాతి సర్వ శ్రేష్ఠం. ఈ పంచేంద్రియ యుక్త యోని, ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభింపదు. ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు నాలుగు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామకములైన ఈ వర్ణాలు, వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. వీరేకాక మానవులలో భిల్లులనీ, తుంబులనీ, మ్లేచ్చులనీ, మరెన్నో ప్రకారాల జాతులున్నాయి. జీవులలో వేల సంఖ్యలో రకాలున్నా, ఆహారం, మైథునం, నిద్ర, భయం, క్రోధం, అన్నిటికీ వుంటాయి కానీ, వివేకం కొందరికే వుంటుంది. శారీరక సంరచన కూడా, అన్నిటికీ ఒకేలా వుండదు. ఒకే పాదం నుండి, ఎనిమిది పాదాలున్న ప్రాణులు కూడా వుంటాయి. రెండు పాదాలున్నది, మానవ జాతి.

కృష్ణ సారమనే పేరు గల మృగం నివసించే ప్రదేశాన్ని, ధర్మ దేశమంటారు. బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివశిస్తారు. పంచ మహా భూతాలలో ప్రాణీ, ప్రాణులలో బుద్ధి జీవీ, బుద్ధి జీవులలో మనిషీ, మనుష్యులలో బ్రాహ్మణ వర్ణాలూ శ్రేష్ఠులు. స్వర్గాన్ని గానీ, మోక్షాన్నిగానీ సాధించుకునే అవకాశం, మానవ శరీరానికే వుంది. అటువంటి మానవ శరీరం, లేదా జన్మ లభించి కూడా, దానిని సత్కర్మలకూ మోక్ష సాధనకూ వాడని వారు, తమని తామే మోసగించుకుంటున్నట్లు లెక్క. వంద కాసులున్న వాడు వేయి కాసుల కోసం, వేయి కాసులు గలవాడు లక్ష కోసం ప్రయత్నిస్తాడు. లక్ష కాసులున్న వాడు, రాజ్యం కావాలంటాడు. రాజుకి వాడికున్న రాజ్యం చాలదు. మొత్తం పృథ్వినే శాసించాలనుకుంటాడు. అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి, దేవేంద్ర పదవిని అధిష్టించాలనుకుంటాడు. ఆ ఇంద్రుడైనా తృప్తిగా సుఖంగా విశ్రాంతిగా జీవిస్తాడా అంటే, అదీ లేదు. ఇలా మొత్తం మానవ జాతిని ఒకే మనస్సూ, ఆ మనస్సును ఒకే ఒక తృష్ణా శాసిస్తున్నాయి. ఆ తృష్ణ వల్ల దానికి బానిసయైన మనిషి నరకానికి పోతాడు. తృష్ణను జయించినవానికి తృప్తి లభిస్తుంది. ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలను పొందుతాడు.

ఈ విశ్వంలో ఆత్మాధీనులైన వ్యక్తులే సుఖపడతారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే అయిదూ విషయాలు. ఈ విషయాలను కోరేవే విషయ వాంఛలు. అవి జీవిని సుఖంగా బతకనివ్వవు. లేడి, ఏనుగు, దీపం పురుగు, తేనెటీగ, చేప, ఈ అయిదు ప్రాణులూ క్రమంగా, శబ్ద, స్పర్శ, రూప, గంధ, రస అనే ఒక్కొక్క విషయ వాంఛతోనే నశిస్తాయి. అలాటపుడు, అన్ని విషయ వాంఛల కోసమూ ఆరాట పడే మనిషి గతి వేరే చెప్పాలా? మానవ సంఘానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాటిని గౌరవించి పాటించినంత కాలమే, ఆ సంఘానికి సుఖశాంతులుంటాయి. కానీ, మనిషి పుత్ర, కళత్రాది బంధాలలో చిక్కుకున్నంతకాలం, ముక్తి మార్గం కనిపించదు.

ఎంత గొప్ప మనిషైనా మృత్యువును జయించలేడు. ఈ లోకంలోకి ఒంటరిగా వస్తాడు. ఈ లోకం నుండి ఒంటరిగానే పోతాడు. ఏడుస్తూ వస్తాడు, ఏడుస్తూనే పోతాడు. ఏడుస్తూ వచ్చినా, నవ్వుతూ పోగలిగిన వాడే యోగి, బుషి, ధన్యాత్ముడు. ఒంటరిగా మరణించే మానవుడు, తన పాప పుణ్యాల ఫలాలను కూడా ఒంటరిగానే అనుభవించవలసి వుంటుంది.

మనిషి బ్రతికినంత కాలం తానెంతగానో ప్రేమించిన బంధు బాంధవులు, ఆ మనిషి మరణించగానే, వాని శరీరాన్ని కట్టెల సవారీకెక్కించి, మట్టిబస్తాను మోసుకెళ్ళినట్లుగా తీసుకువెళ్ళి, నిప్పుల్లో పడేసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోతారు. ధర్మమొక్కటే వానిననుసరించి నడుస్తుంది. ప్రాణి యొక్క ధనమూ, వైభవమూ, వాని ఇంటి దగ్గరే వుండిపోతుంది. ఆ బంధం అక్కడే తెగిపోతుంది. మిత్రులూ బంధు బాంధవులూ శ్మశానందాకా వెళతారు. వీరి బంధం ఇక్కడతో తెగిపోతుంది. ఇక పుట్టినప్పటి నుంచీ చావు దాకా పెంచి పోషించి, ఇది నాదనుకుని విర్రవీగిన శరీరం, అగ్నిలో పడి బూడిదైపోతుంది. దాని బంధం అక్కడితో సరి. ఇక వీడని బంధమై, విడువని మిత్రమై, జోడు విడని సైదోడై, జీవాత్మతో మిగిలేది, పాపపుణ్యాలే.

పక్షిరాజా! ధనవంతుడు ఈ రోజు సూర్యుడస్తమించేలోగా ఎవరికీ ఏమీ దానం చేయలేదనుకో, రేపు తెల్లవారాక, ఈ లోగానే వాడి బ్రతుకు తెల్లారిపోతే, ఆ డబ్బంతా ఎవరి వశమై పోతుందో ఎవరికి తెలుసు? ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల, ఎంతో మంది దగ్గర ఎంతో కొంత ధనం వుండే తీరుతుంది కదా! దానిని పరోపకార నిమిత్తమో, శ్రేష్ఠద్విజుల దానార్ధమో వాడకుండా, అంతా తానూ తన పుత్రులే వాడేసుకోవాలనుకుంటే, ఆ ధనమే ఒక రూపాన్ని ధరించి, వాడు పోయే ముందు అడుగుతుంది. 'నన్నెలాగూ తీసుకుపోలేవు. కనీసం దానమైనా చేసి వుంటే, ఆ పుణ్యాన్నయినా పట్టుకు పోగలిగివుండే వాడివి కదా!’ అని. ఇలా ఆలోచించి, రేపు ఏమవుతామో అనుకుని, ఇవాళే సత్కర్మలనాచరించాలి. మనిషి శ్రద్ధాపూర్వకంగా, పవిత్రుడై, శుద్ధమనస్కుడై ఇచ్చే ధనం ధర్మాన్ని నిలబెడితే, ఆ మనిషికి నరకమే వుండదు. ఈ ధర్మమే మళ్ళీ అతని అర్ధ కామ సముపార్జనలలో అక్కరకు వస్తుందనేది ‘ధర్మసూక్ష్మం’. శ్రద్ధాపూర్వకం కాని ధర్మం, ఏ లోకంలోనూ అక్కరకు రాదు. ప్రచుర ధనరాశి వల్ల ధర్మం సిద్ధించదు. ధర్మ సిద్ధి, శ్రద్ధా మూలకం. అట్టి ధర్మమే, ఆ వ్యక్తికి మోక్ష ప్రదాయకం.

“హే భగవన్‌! మృత్యువు ఆసన్నమైనప్పుడూ, వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలనూ వివరంగా వినాలని వుంది. కరుణించండి” అని ప్రార్ధించిన గరుడునికి విష్ణువు తెలియజేసిన వివరాలు, గరుడ పురాణానికి సంబంధించిన మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము. మరణించిన వారిని సశాస్త్రీయంగా సాగనంపే పద్ధతులను ప్రతి హిందువూ తప్పక తెలుసుకుని తీరాలి. అందుకే రాబోయే ఆ వీడియోను ఎవ్వరూ మిస్ కావద్దని నా మనవి.. పరమ దుర్లభమైన మనుష్యజన్మ మనకు లభించినందుకు సంతోషించడమే కాకుండా, మంచి పనులూ, దానధర్మలనూ చేస్తూ, నిత్య దైవనామ స్మరణతో దీనిని సార్ధకం చేసుకుందాము..

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Thursday, April 11, 2024

గురు మంత్రం - Guru Mantra


గురు మంత్రం - Guru Mantra TELUGU VOICE

ఎవరైనా, ఎప్పుడైనా మననం చేయవచ్చు. దీని అర్ధం తెలుసుకుని, భక్తి శ్రద్ధలతో, నియమ బద్ధంగా జపించే వారికి, సర్వశుభములూ చేకూరుతాయి. మనల్ని ఉద్ధరించడానికి ఈ దివ్య ద్వాదశాక్షరీ మంత్రము, 'జగద్గురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల' వారిచే ఉపదేశింపబడినది..

"ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః"

ఓం = సచ్చిదానందమయ బ్రహ్మ స్వరూపుడును, 
హ్రీం = హృదయాకాశమునందు అంతరాత్మగా ప్రకాశించువాడును,  
క్లీం = భౌతిక దేహమునందు చైతన్యముచే వ్యాపించిన వాడును అనగా సర్వ వ్యాపకుడును, 
శ్రీం = చక్కని తేజస్సుచే విరాజిల్లువాడును, అయినట్టి, 
శివాయ = శుభములు చేకూర్చు వానికి అనగా మోక్షసుఖము నొసగు వానికి,  
బ్రహ్మణే = ఆ పరబ్రహ్మమునకు (పరమాత్మకు) 
నమః = నేను నమస్కరించుచున్నాను.

[ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం: https://youtu.be/Hn7wy7POWgw ]


Thanks for 90K+ Subscribers

Monday, April 8, 2024

Rewriting Destiny - Influence of Rahu | మృత్యువును తప్పించిన దానం!


మృత్యువును తప్పించిన దానం! - ఒక చిన్న కథ.. TELUGU VOICE
కొన్ని ఆపదలను తప్పించుకోవడానికి మంచి పనులు చేయడమెలా మార్గం?

మంచి కథలు మనిషి జీవితాన్ని సన్మార్గంలో నడిపించడానికి ఉపయోగపడతాయి. మంచితనం, గ్రహ దేవతలనూ, బ్రహ్మ రాతను సైతం మార్చేంత శక్తిని ఎలా కలిగి ఉంటుంది? వంటి విషయాలతో కూడుకున్న, అటువంటి ఒక మంచి కథను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. వీడియోను చివరిదాకా చూసి, ఈ కథ ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో comment చేసి చెబుతారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/1YDunsrZIio ]


ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రోజూ అడవిలోకి వెళ్లి ఆకుకూరలు కోసుకొచ్చి, వాటిని అమ్ముకుని జీవనం గడుపుతుండేవాడు. ఉన్నంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేసేవాడు. అతను రోజూ అడవికి వెళ్లే దారిలో, ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి చిన్న విగ్రహం పెట్టుకుని, తులసి ఆకులతో అర్చన చేయడం గమనిస్తుండేవాడు. అది చూసి ఆ వ్యక్తి చాలా ముచ్చట పడేవాడు. తను కూడా అలా తులసి ఆకులతో పూజ చేయాలని నిత్యం అనుకుంటుండేవాడు. కానీ ఏదో ఒక కారణం చేత చేయలేక పోయేవాడు.

ఒక రోజు అతను అడవిలో ఆకుకూరలు కోస్తుంటే, తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు.. “నేను ఎలాగూ పూజ చేయలేక పోతున్నాను. కనీసం ఇవి కోసుకెళ్లి ఆ బ్రాహ్మణుడికి ఇస్తాను” అని నిశ్చయించుకున్నాడు. కోసిన ఆకుకూరలతో పాటు, తులసి దళాలను కూడా కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే, నల్ల నాగు ఒకటి అందులో ఉన్నది.

ఆ వ్యక్తి వెళ్లి గుడిసె ముందు నిలబడగానే, ఎవరో వచ్చి నిలబడ్డారని గమనించి తల తిప్పి చూసిన బ్రాహ్మణుడితో, “అయ్యా, పూజకు తులసి దళాలు తెచ్చాను. నేను చేయలేక పోతున్నాను. అందుకే మీకు ఇస్తున్నాను” అని అన్నాడు.

ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ బ్రాహ్మణుడు తన దివ్యదృష్టితో, తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం  గమనించాడు. అతడితో, “నాయనా, నేను చెప్పేవరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు” అని చెప్పి, గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే, రాహువు ఆయన వద్దకు వచ్చాడు. రాహువుకు నమస్కరించి, ఎందుకు అతడి వెనుక వచ్చావని ఆయన అడగగా, రాహువు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, “నేను ఈ రోజు అతడికి హాని చేయాల్సి ఉంది. అది విధి రాత. కానీ, అతను తన తలపైన తులసీ దళాలను మొస్తున్నాడు. అందుకే నేను నా పని చేయలేక పోతున్నాను. అతను అది దించగానే, నేను కాటేసి వెళ్ళిపోతాను” అని అన్నాడు.

ఈ విషయం వినగానే బ్రాహ్మణుడికి చాలా జాలి వేసింది. ఎప్పుడూ రాని వాడు, ఆ రోజు పూజకు దళాలను తీసుకు రావడం.. అతడికి ఆపద ముంచుకు రాబోతోందని తెలియగానే, “ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా?” అని రాహువును అడిగాడు.

అందుకు రాహువు, “అయ్యా మీరు ఇన్ని రోజులూ చేసిన పూజల వలన సంపాదించుకున్న పుణ్యా ఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్టయితే, అతడిని ఈ గండం నుండి తప్పించ వచ్చు” అని చెప్పాడు.

బ్రాహ్మణుల వారు క్షణం కూడా ఆలోచించకుండా, అతడికి తను సంపాదించుకున్న పుణ్య ఫలాన్ని దానం ఇస్తున్నానని చెప్పడంతో, రాహువు ఆశ్చర్యపోయాడు. అంతటితో సంతోషించిన రాహువు, ఆ బ్రాహ్మణుడికి నమస్కరించి, తిరిగి వెళ్ళి పోయాడు. వెంటనే పాము కూడా మాయమయ్యింది.

ఒక్క తులసీ దళంతో ఇంత అద్భుతమా! ఒక దానం ఇవ్వడం వల్ల, ఒక ప్రాణం నిలబడడమా! మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా! గ్రహ దేవతలనూ, బ్రహ్మ రాతను సైతం మార్చేంత శక్తి గలదా!

తరువాత బ్రాహ్మణుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి, ఇక నుండి రోజూ తనకు తులసీ దళాలను తెచ్చి ఇవ్వమని చెప్పాడు. జరిగిన తంతు తెలియక పోయినా, ఆ వ్యక్తి సంతోషంగా అలాగేనని ఒప్పుకున్నాడు.

ఇక్కడ మనం గమనించాల్సింది, డబ్బు చేయలేని పనులను సైతం, మంచితనం చేస్తుంది. కొన్ని ఆపదలనుండి తప్పించుకోవడానికి, మంచి పనులు చేయడం ఒక్కటే మార్గం. మనిషిలో మంచితనాన్ని పెంపొందించే ఇటువంటి కథలను పదిమందికీ అందేలా చూసుకోవలసిన బాధ్యత మనందరిదీ..

లోకాః సమస్తా సుఖినోభవంతు!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...