మనిషి జన్మ! జీవిత సత్యాలు.. ‘గరుడ పురాణం’ Garuda Puranam


మనిషి జన్మ! జీవిత సత్యాలు..
‘గరుడ పురాణం’ ప్రకారం మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం ‘ధర్మం’ ఏమిటో తెలుసా?

మన సనాతన ధర్మంలోని పురాణాలు, మన మహర్షులు మనకు అందించిన వరాలు. అందులోనూ వ్యాస భగవానుడి కృతులైన అష్టాదశ పురాణాలలోని గరుడ పురాణం, మనిషి జీవన గమనానికి మార్గ దర్శకం. సనాతన ధర్మం ప్రకారం, ఆత్మ జనన-మరణ చక్రంలో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. అత్యంత దుర్లభమైన మనుష్య జన్మకు సంబంధించి, గరుడుడికి సాక్ష్యాత్తూ శ్రీ మహావిష్ణువు తెలియజేసిన ఆ విషయాలలో, మనిషిగా పుట్టాలంటే ఏం చెయ్యాలి? మనిషికి మృత్యువెలా ప్రాప్తిస్తుంది? శరీరాన్ని ఆశ్రయించి మరణించేది ఎవరు? అప్పుడు ఇంద్రియాలు ఏమైపోతాయి? మనిషి అస్పృశ్యుడెలా అవుతాడు? ఇక్కడ చేయబడిన కర్మకు ఫలాన్ని ఎక్కడ, ఎలా అనుభవిస్తాడు? అసలు ఎక్కడికి, ఎలా వెళ్తాడు? యమలోకానికీ విష్ణులోకానికీ ఏయే మార్గాలలో వెళతాడన్న గరుడుడి సందేహాలకు, శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/2eMvV6mcSnU ]


“ఓయీ వినతనందనా! పరస్త్రీనిగానీ, బ్రాహ్మణుని ధనాన్నిగానీ అపహరించినవాడు, నిర్జన ప్రదేశంలో గానీ, మహారణ్యంలో గానీ, బ్రహ్మ రాక్షసిగా పుడతాడు. రత్నాల దొంగ, నీచయోనిలో పడతాడు. కొన్ని జన్మలు, ఆ జీవులు మృత్యు సమయంలో పెట్టుకున్న ఆశలకూ, కోరికలకూ అనుగుణంగా కూడా వస్తాయి. నవరంధ్రాల కాయం మానవ శరీరమనే మాట విని వున్నావు కదా! సత్కర్మలు చేసిన పుణ్యాత్ముని ప్రాణం, నాభినుండి పై వరకూ గల ఊర్ధ్వ ఛిద్రాల నుండి బయటకు పోతుంది. శరీరం ద్వారా చేసే పనులను, శరీరంతోనే అనుభవించాలి. ఒక్కటి మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి.. అనాసక్త భావంతో అన్నీ సత్కర్మలే చేసేవాడు, అన్ని చోట్లా సుఖాన్నే అనుభవిస్తాడు. అతడు సాంసారిక మాయాజాలంలో చిక్కుకోడు. మాయ వలలో పడి వికర్మలనే చేసేవాడు, పాశబద్ధుడై, కష్టాల పాలవుతాడు. (అధ్యాయం -11)

గరుడ పురాణంలో, ఎనభై నాలుగు లక్షల యోనుల్లో మనుష్య జన్మ శ్రేష్ఠత - మనిషి ఏకమాత్ర కర్తవ్యం - ధర్మం గురించి ఇలా వివరించబడినది.. మనిషికి అన్ని చోట్లా హితాన్ని కలిగించేవీ, ప్రేతత్వం నుండి ముక్తిని కలిగించేవీ ఏవేవో తెలిసింది కదా! గరుత్మంతా! ఈ సృష్టిలో ఎనుబది నాలుగు లక్షల యోనులున్నాయి. వీటిని నాలుగు రకాల జీవాలుగా విభజించవచ్చు. అండజ, స్వేదజ, ఉద్భిజ, జరాయుజములనే ఈ నాలుగు రకాలలో, మరల ఒక్కొక్కటి ఇరవై యొక్క లక్షల జీవాలతో ఉన్నది. మనుష్యాది యోనులను జరాయుజాలంటారు. వీటిలో మనుష్య జన్మ, పరమ దుర్లభం.

మనుష్య లేదా మానవ జాతి సర్వ శ్రేష్ఠం. ఈ పంచేంద్రియ యుక్త యోని, ప్రాణికి ఎంతో పుణ్యం చేసుకుంటే గాని లభింపదు. ఈ జాతిలో ప్రముఖమైన వర్ణాలు నాలుగు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామకములైన ఈ వర్ణాలు, వృత్తుల ఆధారంగా ఏర్పడ్డాయి. వీరేకాక మానవులలో భిల్లులనీ, తుంబులనీ, మ్లేచ్చులనీ, మరెన్నో ప్రకారాల జాతులున్నాయి. జీవులలో వేల సంఖ్యలో రకాలున్నా, ఆహారం, మైథునం, నిద్ర, భయం, క్రోధం, అన్నిటికీ వుంటాయి కానీ, వివేకం కొందరికే వుంటుంది. శారీరక సంరచన కూడా, అన్నిటికీ ఒకేలా వుండదు. ఒకే పాదం నుండి, ఎనిమిది పాదాలున్న ప్రాణులు కూడా వుంటాయి. రెండు పాదాలున్నది, మానవ జాతి.

కృష్ణ సారమనే పేరు గల మృగం నివసించే ప్రదేశాన్ని, ధర్మ దేశమంటారు. బ్రహ్మాది దేవతలంతా అక్కడే నివశిస్తారు. పంచ మహా భూతాలలో ప్రాణీ, ప్రాణులలో బుద్ధి జీవీ, బుద్ధి జీవులలో మనిషీ, మనుష్యులలో బ్రాహ్మణ వర్ణాలూ శ్రేష్ఠులు. స్వర్గాన్ని గానీ, మోక్షాన్నిగానీ సాధించుకునే అవకాశం, మానవ శరీరానికే వుంది. అటువంటి మానవ శరీరం, లేదా జన్మ లభించి కూడా, దానిని సత్కర్మలకూ మోక్ష సాధనకూ వాడని వారు, తమని తామే మోసగించుకుంటున్నట్లు లెక్క. వంద కాసులున్న వాడు వేయి కాసుల కోసం, వేయి కాసులు గలవాడు లక్ష కోసం ప్రయత్నిస్తాడు. లక్ష కాసులున్న వాడు, రాజ్యం కావాలంటాడు. రాజుకి వాడికున్న రాజ్యం చాలదు. మొత్తం పృథ్వినే శాసించాలనుకుంటాడు. అలా పృథ్వీ శాసకుడైన చక్రవర్తి, దేవేంద్ర పదవిని అధిష్టించాలనుకుంటాడు. ఆ ఇంద్రుడైనా తృప్తిగా సుఖంగా విశ్రాంతిగా జీవిస్తాడా అంటే, అదీ లేదు. ఇలా మొత్తం మానవ జాతిని ఒకే మనస్సూ, ఆ మనస్సును ఒకే ఒక తృష్ణా శాసిస్తున్నాయి. ఆ తృష్ణ వల్ల దానికి బానిసయైన మనిషి నరకానికి పోతాడు. తృష్ణను జయించినవానికి తృప్తి లభిస్తుంది. ఆ మనిషి ఆ తృప్తి వల్ల ఉత్తమ లోకాలను పొందుతాడు.

ఈ విశ్వంలో ఆత్మాధీనులైన వ్యక్తులే సుఖపడతారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే అయిదూ విషయాలు. ఈ విషయాలను కోరేవే విషయ వాంఛలు. అవి జీవిని సుఖంగా బతకనివ్వవు. లేడి, ఏనుగు, దీపం పురుగు, తేనెటీగ, చేప, ఈ అయిదు ప్రాణులూ క్రమంగా, శబ్ద, స్పర్శ, రూప, గంధ, రస అనే ఒక్కొక్క విషయ వాంఛతోనే నశిస్తాయి. అలాటపుడు, అన్ని విషయ వాంఛల కోసమూ ఆరాట పడే మనిషి గతి వేరే చెప్పాలా? మానవ సంఘానికి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాటిని గౌరవించి పాటించినంత కాలమే, ఆ సంఘానికి సుఖశాంతులుంటాయి. కానీ, మనిషి పుత్ర, కళత్రాది బంధాలలో చిక్కుకున్నంతకాలం, ముక్తి మార్గం కనిపించదు.

ఎంత గొప్ప మనిషైనా మృత్యువును జయించలేడు. ఈ లోకంలోకి ఒంటరిగా వస్తాడు. ఈ లోకం నుండి ఒంటరిగానే పోతాడు. ఏడుస్తూ వస్తాడు, ఏడుస్తూనే పోతాడు. ఏడుస్తూ వచ్చినా, నవ్వుతూ పోగలిగిన వాడే యోగి, బుషి, ధన్యాత్ముడు. ఒంటరిగా మరణించే మానవుడు, తన పాప పుణ్యాల ఫలాలను కూడా ఒంటరిగానే అనుభవించవలసి వుంటుంది.

మనిషి బ్రతికినంత కాలం తానెంతగానో ప్రేమించిన బంధు బాంధవులు, ఆ మనిషి మరణించగానే, వాని శరీరాన్ని కట్టెల సవారీకెక్కించి, మట్టిబస్తాను మోసుకెళ్ళినట్లుగా తీసుకువెళ్ళి, నిప్పుల్లో పడేసి ముఖం తిప్పుకుని వెళ్ళిపోతారు. ధర్మమొక్కటే వానిననుసరించి నడుస్తుంది. ప్రాణి యొక్క ధనమూ, వైభవమూ, వాని ఇంటి దగ్గరే వుండిపోతుంది. ఆ బంధం అక్కడే తెగిపోతుంది. మిత్రులూ బంధు బాంధవులూ శ్మశానందాకా వెళతారు. వీరి బంధం ఇక్కడతో తెగిపోతుంది. ఇక పుట్టినప్పటి నుంచీ చావు దాకా పెంచి పోషించి, ఇది నాదనుకుని విర్రవీగిన శరీరం, అగ్నిలో పడి బూడిదైపోతుంది. దాని బంధం అక్కడితో సరి. ఇక వీడని బంధమై, విడువని మిత్రమై, జోడు విడని సైదోడై, జీవాత్మతో మిగిలేది, పాపపుణ్యాలే.

పక్షిరాజా! ధనవంతుడు ఈ రోజు సూర్యుడస్తమించేలోగా ఎవరికీ ఏమీ దానం చేయలేదనుకో, రేపు తెల్లవారాక, ఈ లోగానే వాడి బ్రతుకు తెల్లారిపోతే, ఆ డబ్బంతా ఎవరి వశమై పోతుందో ఎవరికి తెలుసు? ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల, ఎంతో మంది దగ్గర ఎంతో కొంత ధనం వుండే తీరుతుంది కదా! దానిని పరోపకార నిమిత్తమో, శ్రేష్ఠద్విజుల దానార్ధమో వాడకుండా, అంతా తానూ తన పుత్రులే వాడేసుకోవాలనుకుంటే, ఆ ధనమే ఒక రూపాన్ని ధరించి, వాడు పోయే ముందు అడుగుతుంది. 'నన్నెలాగూ తీసుకుపోలేవు. కనీసం దానమైనా చేసి వుంటే, ఆ పుణ్యాన్నయినా పట్టుకు పోగలిగివుండే వాడివి కదా!’ అని. ఇలా ఆలోచించి, రేపు ఏమవుతామో అనుకుని, ఇవాళే సత్కర్మలనాచరించాలి. మనిషి శ్రద్ధాపూర్వకంగా, పవిత్రుడై, శుద్ధమనస్కుడై ఇచ్చే ధనం ధర్మాన్ని నిలబెడితే, ఆ మనిషికి నరకమే వుండదు. ఈ ధర్మమే మళ్ళీ అతని అర్ధ కామ సముపార్జనలలో అక్కరకు వస్తుందనేది ‘ధర్మసూక్ష్మం’. శ్రద్ధాపూర్వకం కాని ధర్మం, ఏ లోకంలోనూ అక్కరకు రాదు. ప్రచుర ధనరాశి వల్ల ధర్మం సిద్ధించదు. ధర్మ సిద్ధి, శ్రద్ధా మూలకం. అట్టి ధర్మమే, ఆ వ్యక్తికి మోక్ష ప్రదాయకం.

“హే భగవన్‌! మృత్యువు ఆసన్నమైనప్పుడూ, వ్యక్తి మరణించిన వెంటనే చేయవలసిన కర్మలనూ వివరంగా వినాలని వుంది. కరుణించండి” అని ప్రార్ధించిన గరుడునికి విష్ణువు తెలియజేసిన వివరాలు, గరుడ పురాణానికి సంబంధించిన మన తదుపరి వీడియోలో తెలుసుకుందాము. మరణించిన వారిని సశాస్త్రీయంగా సాగనంపే పద్ధతులను ప్రతి హిందువూ తప్పక తెలుసుకుని తీరాలి. అందుకే రాబోయే ఆ వీడియోను ఎవ్వరూ మిస్ కావద్దని నా మనవి.. పరమ దుర్లభమైన మనుష్యజన్మ మనకు లభించినందుకు సంతోషించడమే కాకుండా, మంచి పనులూ, దానధర్మలనూ చేస్తూ, నిత్య దైవనామ స్మరణతో దీనిని సార్ధకం చేసుకుందాము..

సర్వేజనాః సుఖినోభవన్తు! లోకాః సమస్తా సుఖినోభవంతు!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur