గుప్పెడు మనస్సు - మంచిమాట Manchimata


గుప్పెడు మనస్సు - మంచిమాట

అవకాశం లభించాలే కానీ, మనం జ్ఞానులమని ఇతరులు గుర్తించాలనేలా ప్రవర్తిస్తాము. మౌలికంగా మనం తెలివి గలవారమని మన నమ్మకం. ఇతరులు ఏదైనా చెబితే దానిని ఖండించేందుకు, మాటలను అన్వేషిస్తాము. అవసరం లేని గర్వాన్ని పెంచుకుంటాము. దానితో అరిషడ్వర్గాలన్నీ మనలను ఆవహిస్తాయి. వీటితోపాటు, అతిశయం అంతరంగంలోకి చేరుతుంది.


ఈ ప్రపంచంలో తెలివి అన్నది ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఈ చిన్న నిజాన్ని మనం తెలుసుకో లేక పోతున్నాము. తెలివితేటలంటే మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని చర్వితచర్వణం చేయడమా? అందులో మన సొంతం ఒక్కటీ ఉండదు. మన ప్రజ్ఞ ఎక్కడా ప్రస్ఫుటం కాదు. అన్నీ అరువు తెచ్చుకున్నవే. మన సొంత జ్ఞానం ఏ పాటిదని మనం ఎందుకు విశ్లేషించుకోము? మనలో మౌలికత లేదు.. క్రియాశీలత అంతంత మాత్రమే.. ఇది నా ఆలోచన, ఇది నా ప్రజ్ఞా విశేషం, ఇది నేను తెలుసుకున్న సత్యం - అని ఒక్కటంటే ఒక్కదానిని చూపగలుగుతున్నామా? పైగా ఇతరులు ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే, ససేమిరా వినం.

అమెరికాలోని చికాగోలో సార్వత్రిక మత సమ్మేళనం జరిగినప్పుడు, ఆ సభల్లో పాల్గొనడానికి భారత్‌ నుంచి వివేకానందులు వెళ్లారు. మహామహులందరూ అక్కడ ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానంతో తలలు పండిన వాళ్లందరూ ఆ సభలో ఆసీనులయ్యారు. పేరు ప్రఖ్యాతులున్న ఆధ్యాత్మిక వేత్త ఒకరు వివేకానందుడి వైపు చూసి, కించిత్తు చులకన స్వరంతో, 'నీకు ఏం తెలుసునని ఈ సభలకు వచ్చావ్‌? మేం చెప్పేది వినడానికా, లేక నీవు మాకే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావా?' అని ప్రశ్నించాడు. వివేకానందుడు ఎంతో సౌమ్యంగా 'మహాశయా! మీరు చెప్పింది వినడానికి మాత్రమే ఉబలాట పడుతున్నాను' అన్నాడు. 'అదంత సులువు కాదు. ఈ సభలోని వక్తల మాటలు వినేందుకు అర్హత ఉండాలి. ముందు నీకేం తెలుసో మూడు నిమిషాల్లో మాకు వివరించగలవా?' అని అతిశయంతో ప్రశ్నించాడు.వివేకానందుడు సరేనంటూ వేదిక పైకి ఎక్కి 'నా ఆత్మీయులారా..' అంటూ ప్రారంభించిన ఉపన్యాసం గంటన్నరపాటు ధారాళంగా సాగింది. శ్రోతలందరూ సమ్మోహితులయ్యారు. సభలో అందరి కరతాళధ్వనుల మధ్య వివేకానందుడి ప్రసంగం ముగిసింది. ఆయన ఆధ్యాత్మికంగా ఆవిష్కరించుకున్న సత్యాన్ని అలవోకగా తెలియజేశాడు. అదీ ఆయన ప్రజ్ఞావైభవం.

మనిషి మానసం నిరంతర అన్వేషి. జ్ఞానం కోసం సదా వెతుకుతూనే ఉండాలి. మనసు అంటే ఏమిటి? అది పాత సామానులు నిలువచేసే గది కాదే! పుస్తకాలు చదివి పురాణాలు వినడం ద్వారా కలిగిన జ్ఞానం మన సొంతమా? కానే కాదు. ఈ జ్ఞానాన్ని మానసం అనే మూలగదిలో దాచి మన సొంతమని గర్వపడితే ఎలా? ఇదేనా మన విద్వత్తు? మన మనసులో కొత్తదనం ఉండాలి, మనలో జీవం ఉండాలి. మన హృదయాంతరాళాల్లో చైతన్యం వికసించాలి. మనసును శూన్యం చేసుకోవాలి. సరికొత్త జ్ఞాన పరంపర మనస్సులోకి చేరడానికి అవకాశం కలిగించాలి. గుప్పెడు మనస్సు అంటాము కానీ, అది అంతులేని అలౌకిక జ్ఞానాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. అదే స్వీయ ప్రజ్ఞ. అప్పుడే జీవి స్వతంత్రుడవుతాడు.

ఆదిశంకరాచార్యులను ఆయన శిష్య గణంలో ఒకడైన కమలనాభుడు, ఒక రోజు ప్రశ్నించాడు. 'స్వామీ! ఎందరికో ఎన్నో గొప్పగొప్ప విషయాలు చెబుతున్నారు. నాకు మాత్రం ఏదీ చెప్పడం లేదు' అని. అందుకు శ్రీ శంకర భగవత్పాదులు నవ్వుతూ, 'ఎందరికో ఎన్నో చెబుతున్నానన్నావు.. మరి నీవు వినడం లేదా? .. అంటే, నీ మనస్సు ఖాళీగా లేదు. నిబ్బరం లేక అది ఉరకలు వేస్తున్నట్టుంది. ముందు నీ మనస్సును శూన్యంగా చేయి. నేను చెబుతున్నవన్నీ అందులోకి చేరుతాయి. అపుడు నీవు సైతం ప్రజ్ఞావంతుడవుతావు' అని అన్నారు.

జీవితం ఎన్నో సంవత్సరాల ప్రస్థానంలో, అవసరమైనవీ అనవసరమైనవీ పోగుచేసుకుంటుంది. అవి మనలో కొండలుగా పేరుకుపోయి ఉన్నాయి. ఆ కొండ పేరే 'నేను' అనే మానసం. జన్మజన్మలుగా పేరుకుపోయిన అనవసరమైన చెత్త బరువు మోయలేక, జీవచైతన్యం వెలవెలబోతోంది. ఆ బరువు నుంచి స్వేచ్ఛ పొందడమే, మానవ జీవితానికి విముక్తి, పవిత్రత! జీవి స్వతంత్రం కావడమే జీవన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగితే, మనమూ ఆదిశంకరాచార్యులమే!

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka