గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు? Garuda Puranam


సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ!
గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులకు ఎటువంటి శిక్షలు?

మనిషి జీవన గమనంలో ఇటువంటి తప్పులు చేస్తే, వాటికి శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసుకుని, సన్మార్గంలో నడుచుకోవాలనే ఉద్దేశ్యంతో, గరుడుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన అమృత వాకులను, అష్టాదశ పురాణాలలో ఒకటైన ‘గరుడ పురాణం’ పేరిట మనకు అందించారు, కృతికర్త అయిన వ్యాస భగవానుడు. ఇక అందులోని ఏడవ అధ్యాయంలో నిక్షిప్తమైవున్న ‘సంతప్తక బ్రాహ్మణుడు - పంచ ప్రేతాల గాధ’లోకి వెళితే..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/gPM542QYpBA ]


విష్ణు మహిమ విస్తారంగా కనిపించే కథను వినాలని వుందని గరుత్మంతుడు వేడుకోగా, ఆతనిని అనుగ్రహించి ఇలా చెప్పసాగాడు శ్రీ మహావిష్ణువు.. “గరుత్మంతా! పూర్వకాలంలో సంతప్తకుడనే తపోధనుడైన బ్రాహ్మణుడొకాయన వుండేవాడు. ఆయన తన తపోబలం వల్ల, పాపరహితుడయ్యాడు. ఈ ‘సంసారం’ పేరులోనే గానీ, తత్త్వంలో సారం లేనిదని తెలుసుకుని, అడవులలోకి పోయి, వైఖానస మునుల వృత్తినే తానూ పాలిస్తూ, అరణ్యంలోనే చరిస్తుండే వాడు. బాహ్య చిత్తవృత్తులను అదుపులో పెట్టుకుని, తద్ద్వారా ఇంద్రియాలపై విజయం సాధించే ఉద్దేశ్యంతో, తీర్థయాత్రలకు బయలు దేరాడు. కానీ, మధ్యలో దారి తప్పి, ఒక చీమలు దూరని, కాకులు కూడా దారి తప్పితే ఇక పట్టుకోలేని మహారణ్యంలోకి వెళ్ళిపోయాడు. నలువైపులా బ్రహ్మాండంగా పెరిగిన చెట్లూ, లతలూ, పొదలూ, అతనికి దారీ తెన్నూ తోచనివ్వలేదు. సాధు, క్రూర జంతువులూ, పక్షులూ, రాక్షస పిశాచ గణాలూ మాత్రమే వున్నాయక్కడ. నరసంచారమనేదే  లేదు.
సంతప్తునికి భయమనిపించ లేదు కానీ, ఎటూ దిక్కు తోచలేదు. కానున్నది కాక మానదు కదా! ఏదో ఒకటి జరుగుతుందిలే అనుకుంటూ, ఒకవైపు సూటిగా సాగిపోయాడు. కొంతసేపటికి కీచురాళ్ళ అరుపులు కర్ణకఠోరంగానూ, గూడ్లగూబల ధూత్‌కారాలు భయంకరంగానూ వినిపించ సాగాయి. అయినా ఆగలేదతను. కానీ, ఒక చోట ఒక జుగుప్పాకర దృశ్యాన్ని చూసి, నిలబడిపోయాడు. అడుగు ముందుకు పడలేదు.

అక్కడొక మర్రి చెట్టుకి కట్టబడి, వ్రేలాడుతూ వున్నదొక శవం. దానిని అయిదు ప్రేతాత్మలు పీక్కు తింటున్నాయి. ప్రతి ప్రేతమూ చూడడానికి చాలా భయంకరంగా వుంది. ముఖం మీద తప్ప, ఇంకెక్కడా మాంసం లేదు. చేతులు, కాళ్ళు, అన్ని అంగాలూ, ఎముకల మీద చర్మం కప్పినట్లున్నాయి. ముఖంలో కళ్ళు లేవు; వాటికి బదులు రెండు రంధ్రాలున్నాయి. ముక్కుఅసలే లేదు. నెత్తిపై జుట్టు లేదు. అలాగని, కోతిలా చూడగానే నవ్వు పుట్టించేలా కాకుండా, భయంతో గుండెలవిసిపోయేలా వున్నాయవి. బ్రాహ్మణుడు వాటిని చూసి భయంతో మ్రాన్పడిపోగా, అవి మాత్రం ఆయనను చూడగానే పిచ్చి ఆనందంతో గంతులేస్తూ, మంచి ఆహారం దొరికిందని సంబరపడిపోతూ, ఆయన వైపు పరుగు దీశాయి. కాళ్ళను రెండు ప్రేతాలూ, చేతులను రెండు ప్రేతాలూ పట్టుకోగా, అయిదవది ఆయన తలను పట్టుకుంది. అవన్నీ భయంకరంగా అరుస్తూ, అలా పట్టుకునే గాలిలోకి లేచాయి. అంతవరకూ తింటున్న శవంలో ఇంకా మాంసం వుండిపోవడంతో, దానిని కాళ్ళలో ఇరికించుకుంటూ ఎగిరాయి.

అప్పుడు భయార్తుడైన సంతప్త బ్రాహ్మణుడు, విష్ణుదేవునిలా ప్రార్ధిస్తూ, తన రక్షణకై పిలువనారంభించాడు. ‘ఆపద్రక్షకా! జగన్నాయకా! నాకు నీవే శరణు. నన్ను కాపాడు. దేవాధిదేవా, చిన్మయా, సుదర్శన చక్రధారీ, హరీ! నన్ను కాపాడు. ఖగరాజారూఢుడై, మొసలి నోట చిక్కిన ఏనుగును తన చక్రం ద్వారా రక్షించిన సామజవరగమనుడు, నా కర్మ పాశాలను కూడా ఆ మొసలి తల వలెనే ఖండించి, నన్ను ముక్తుని చేయాలి గాక! రమారమి వందమంది నిర్దోషులైన రాజకుమారులను కారాగారంలో బంధించి బలిచ్చుటకు సిద్ధపడిన, కర్కోటక లోకకంటక జరాసంధుని, ధర్మజ రాజసూయ మిషచే చంపించి, లోకకల్యాణాన్ని గావించిన శ్రీకృష్ణపరమాత్మ, ఆ రాకుమారుల వలెనే, నాకునూ విడుదలను ప్రసాదించాలి గాక!’ అంటూ, మరెన్నో విధాల నా అవతారతత్త్వాన్ని కీర్తిస్తూ, ఆర్తితో అరుస్తూ, నన్నే రమ్మని పిలచిన ఆ తపస్సంపన్నునిపై ప్రేమతో కూడిన జాలి కలుగగా, నేను స్వయంగా బయలుదేరాను.

నేనా దరిదాపులకు చేరగానే, అతనిలోని ఏ తపశ్శక్తి ఆ విషయాన్నతనికి చేరవేసిందోగానీ, అతడు భయాన్ని వదిలేసి, ఆ ప్రేతాల మూపులపై పల్లకీలో రాజులాగా సుఖంగా నిద్రిస్తున్నట్లయినాడు. నేనా గుంపు వెనుకే కాసేపు వెళ్ళగా, అక్కడ మణిభద్రుడనే యక్షరాజు కనిపించాడు. నేనతనికి ఆ ప్రేతాల సంగతేదో చూడమని కనుసైగ చేశాను. వెంటనే అతడా భయంకర ప్రేతాలకే దుఃఖాన్నీ భయాన్నీ కలిగించే ప్రేతరూపాన్ని ధరించి, వాటి కనులు కలవర పడేలా, గుండె గుభిల్లుమనేలా, పెద్ద భుజాలతో, బుసలు కొడుతున్న తాచు పామంత నాలుకతో, ఉచ్చ్వాస నిశ్వాసాలను, అవి భయంతో కంపించేలా తీసుకుంటూ, ముందు వాటి యెదుట నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ ప్రేతాలు భయం నుండి తేరుకునేలోగానే, రెండింటిని చేతులతో, రెండింటిని కాళ్ళతో, ఒక ప్రేతాన్ని నోటితో ఒడిసి పట్టి, భయంకరమైన పిడి గుద్దులతో వాటి ఒళ్ళు హూనం చేశాడు. వారి చేతుల నుండి బ్రాహ్మణుని విడిపించి, శవాన్ని పట్టుకుని, ఆ మణిభద్ర యక్షుడు మాయమైపోయాడు. మణిభద్రుని శిక్షతో, నా యొక్క దయతో, ప్రేతాల పాపాలు నశించి, బ్రాహ్మణునికి ఎదురుగా మోకరిల్లి, ఇలా అన్నాయి. 'హే విప్రదేవా! మమ్మల్ని క్షమించండి' అంటూ, ఆయనకు చేతులు జోడించి ప్రదక్షిణ చేసి, మరల క్షమించమని కోరారు. దీనికి కారణం, బ్రాహ్మణ దర్శనం, శ్రీహరి కరుణ, యక్షస్పర్శల వల్ల, వారికి పూర్వ స్మృతి కలగడమే. వారి దీన వదనాలనూ, మరింత దీనాలాపనలనూ చూసి మనస్సు కరిగిన బ్రాహ్మణుడు, వారినిలా అడిగాడు: “బాబూ! ఎవరు మీరు? ఇదంతా ఏమిటి? ఏదైనా మాయా లేక నా చిత్త భ్రమా?

అప్పుడు ప్రేతాలు, “స్వామీ! ఇది మాయా కాదు, భ్రమా కాదు. మేము ప్రేతాలము. మా పూర్వ జన్మ దుష్కృతాల వల్ల, ఇలా మాకు ప్రేత యోని ప్రాప్తించింది.”

అది విన్న బ్రాహ్మణుడు, “ప్రేతాల్లారా! మీ పేర్లేమిటి? మీరేం చేస్తుంటారు? మీకీ దుర్దశ ఎలా ప్రాప్తించింది? నా పట్ల మీ ప్రవర్తనకీ, అందులోని మార్పుకూ కారణమేమిటి?” అని ప్రశ్నించాడు..

అందుకు ప్రేతాలు, “ద్విజోత్తమా! మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలిస్తాము. మా పేర్లు పర్యుషిత, సూచీముఖ, శీఘ్రగ, రోధక, లేఖకులు. సామాన్య మానవులే అనుకుని, మిమ్మల్ని పట్టుకున్నాము. మీరు యోగిరాజనీ, విష్ణుభక్తులనీ తెలిశాక, పూజిస్తున్నాము. మీ స్పర్శ మాత్రాననే, మా పాపాలన్నీ ఎగిరి పోయాయి”

“మీ నామధేయాలు విచిత్రంగా వినిపిస్తున్నాయి. ఇవి అర్ధం లేనివని నాకనిపించడం లేదు. మీరు నాకు విస్తారంగా మీ గురించి వివరించండి”అని బ్రాహ్మణుడాదేశించగానే, ఆ ప్రేతాలు ఒకటొకటిగా ఇలా చెప్పసాగాయి.

“బ్రాహ్మణోత్తమా! ఒకమారు నేను శ్రాద్ధం పెట్టవలసి వచ్చినపుడు, ఒక బ్రాహ్మణుని నియమించుకున్నాను. ఆ వృద్ధ బ్రాహ్మణుడు నడవలేక నడుస్తూ, బాగా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆకలికి తాళలేక, శ్రాద్ధ కర్మ చేయకుండానే, ఆ శాకపాకాలను తినేశాను. బ్రాహ్మణునికి పర్యుషిత అంటే పాచిపోయిన అన్నాన్ని ఎక్కడి నుండో తెప్పించి మరీ పెట్టాను. నేనిలా దుష్ట ప్రేతాన్ని కావడానికీ, నా పేరు పర్యుషితుడు కావడానికి కారణం అదే.

“బ్రాహ్మణ దేవతా! నా పేరు సూచీముఖుడు. ఒకనాడొక బ్రాహ్మణి, తీర్ధస్నానానికై భద్రవట తీరానికి వచ్చింది. ఆమెతో ఆమె అయిదేళ్ళ కొడుకున్నాడు. ఆమె అతనినే చూసుకుని జీవిస్తున్నట్లుంది. నేనప్పుడు క్షత్రియ యువకునిగా జన్మించియున్నాను. అలవి మీరిన పొగరు, క్రూరత్వాలతో ప్రజలను హింసిస్తుండే వాడిని. నేనా బ్రాహ్మణీ, ఆమె పుత్రుల దారికాచి, అతని తలపై పిడికిటితో బాది, వారి సామానులన్నిటినీ లాగేసుకున్నాను. ఆ పసివాడు దాహమని ఏడుస్తుంటే, తల్లి అతనికొక చిన్న పాత్రతో నీళ్ళిచ్చింది. నేను పాత్రను దౌర్జన్యంగా లాగేసుకుని, ఖాళీ చేశాను. భయసంత్రస్తుడై, దాహవ్యాకులుడై, ఆ పిల్లవాడు అప్పుడే, అక్కడే మరణించాడు. అతని తల్లి ఆ గర్భశోకాన్ని తట్టుకోలేక, అక్కడే వున్న నూతిలో దూకి అసువులు బాసింది. ఆ మహా పాపం వల్ల నాకీ ప్రేతయోని ప్రాప్తించింది. పర్వతాకార శరీరుడనే కానీ, నాకు నోరు లేదు. కొంగలాగా సూది ముక్కుంది. నాకు ఆహారం దొరికినా, దానిని తినడానికి చాలాసేపు కష్టపడవలసి వస్తుంది. నేనా రోజు బ్రాహ్మణ బాలకుని నీరు తాగనివ్వకుండా చేసినందుకు, ఇలా అనుభవిస్తున్నాను. నా ఈ నోరు కలిసిన ముక్కు, నా పేరుని సూచీముఖుడిగా చేసింది.

“భూ సురేంద్రా! నా పేరు శీఘ్రగుడు. నేనొకప్పుడొక ధనవంతుడనైన వైశ్యుడను. ఆ జన్మలో నా మిత్రుడొకనితో కలసి, ఇతర దేశాలకు వ్యాపార నిమిత్తమై వెళ్ళాను. నేను కటిక పేదవానిని కాకపోయినా, నా మిత్రుని వద్ద అశేష ధనరాశులుండడంతో, నాలో లోభం, దాని వల్ల క్రౌర్యం పెరిగాయి. మేమిద్దరం వ్యాపారం చేసి, వెనుకకు మరలి వస్తున్నపుడు, దారిలో తగిలిన ఒక నదిని పడవ సహాయాన దాటుతుండగా, సూర్యుడస్తమించాడు. మసక చీకటిలో ప్రయాణీకులంతా ఎవరి గోలలో వారున్నారు. చాలామంది అలసట కారణంగా, కునుకు పాట్లు పడుతున్నారు. వారిలో నా మిత్రుడు కూడా వున్నాడు. అతడు నా తొడ మీదే తలపెట్టి, నిశ్చింతగా నిద్ర పోసాగాడు. నేనతనిని ప్రవాహంలోకి తోసేశాను. చీకటిలో అది ఎవరూ చూడలేదు. అతని వద్దనున్న బహుమూల్యప్రదాలైన రత్న ఖచిత స్వర్ణాభరణాలూ, ముత్యాలూ, బంగారు కాసులన్నింటినీ పట్టుకుని, మా వూరొచ్చేశాను. నా మిత్రుని పత్నితో, దారిదోపిడీ దొంగలు మాపై దాడి చేయగా, ఆమె భర్త దొరికిపోయాడనీ, వారతని సొత్తంతా దోచుకుని, అతనిని చంపేశారనీ చెప్పాను. నేను మరోదారంటా, తుప్పల వెంటా, నా సొమ్ముని పట్టుకుని పరుగెత్తి, ఏదో చావు తప్పి కన్నులొట్టబోయిన చందాన, ఇల్లు చేరానని చెప్పాను. నా జీవితాన్నంతటినీ ఆ పాపపు సొమ్ముతోనే గడిపాను. శీఘ్రంగా డబ్బు సంపాదనలో ముందుకెళ్ళానని, నన్ను శీఘ్రగుడన్నారు. కానీ, ఆ పాపానికి నాకిలా ప్రేతయోనిలో పుట్టుక వస్తుందని ఎవరూ ఎరుగరు కదా!”

“విప్రోత్తమా! నా పేరు రోధకుడు. నేను శూద్రజాతికి చెందినవాడను. రాజభవనం నుండి నాకొక వంద పెద్ద పెద్ద గ్రామాలపై అధికారం ఇవ్వబడింది. నా కుటుంబంలో వృద్ధులైన తల్లిదండ్రులూ, ఒక తమ్ముడు మాత్రమే ఉండేవారము. అయినా, లోభం కొద్దీ నా తమ్ముడిని వేరే కాపురం పెట్టుకొమ్మని తరిమేశాను. వాడికేమీ లేదు. అన్నవస్త్రాలు లేక అవస్థపడుతున్నాడని తెలిసి, నా తల్లిదండ్రులు రహస్యంగా నా గృహం నుండి అన్ని వస్తువులనూ పంపిస్తుండేవారు. నేనది విని అగ్గిరాముడనై పోయి, నా తల్లిదండ్రులను సంకెళ్ళతో బంధించి, ఒక గదిలో పడవేశాను. వారు అతి కష్టం మీద విడిపించుకుని, ఆత్మాభిమానం దెబ్బతిన్నదనే బాధతో, విషం మింగి మరణించారు. నా తమ్ముడు ఏమీ లేక, ఎక్కడెక్కడో తిరుగుతూ, ఏమైపోయాడో తెలియలేదు. వృద్ధులను బంధాలతో “రుద్ధం” చేశాను కాబట్టి, రోధకుడనే పేరు వచ్చి నిలిచింది. ఈ మహాపాపాల వల్ల, నేనిలా ప్రేత యోనిలో పడి వున్నాను”.

“హే విప్రదేవా! నన్ను లేఖకుడంటారు. పూర్వం ఉజ్జయినీ నగరంలో బ్రాహ్మణునిగా జన్మించాను. మా రాజు గారు నన్నొక బ్రహ్మాండమైన కోవెలకు పూజారిగా నియమించారు. ఆ గుడిలో విభిన్న నామాలతో ఎన్నో విగ్రహాలున్నాయి. స్వర్ణ నిర్మితములైన ఆ విగ్రహాలలో, అవసరమైన చోట పలు విలువైన రత్నాలు తాపడం చేయబడి వున్నాయి. వాటిని రోజూ పూజిస్తూ, పుణ్యాన్ని వెనకేసుకోవలసిన నేను, లోభ మోహాలచే, రాకాసి మనస్సు గలవాడనై, డబ్బు వెనకేసుకోవాలనే వాంఛ పుట్టి, మహా పాపినై పోయాను. బుద్ధి పాపాసక్తమై పోతే, బ్రాహ్మణుడైనా, పూజాధికారైనా ఒకటే, రాక్షసుడైనా, పిశాచమైనా ఒకటే. నేనొక సూదిగా, వాడిగా వున్న ఇనుప ఆయుధాన్ని చేపట్టి, ఆ విగ్రహాలకున్న బంగారాన్నీ, రత్నాలనూ పెకలించి దాచేసుకున్నాను. మరునాడు ఏమీ తెలియనివాడిలాగా, ఎప్పటిలాగే కోవెల తెరచి, గోల గోల పెట్టాను. రాజుగారు ఆ రూపుమాసిన విగ్రహాలను చూసి, ప్రజ్వలితాగ్ని వలే, క్రోధంతో రగిలిపోయారు. 'ఈ పని చేసిన దొంగనూ, దైవద్రోహినీ, వాడు బ్రాహ్మణుడైనా సరే, పట్టుకుని నేరాన్ని నిరూపించి, వాడిని నా చేతులతోనే చిత్రవధ చేసి చంపుతాను” అని దేవునియెదుట ప్రతిజ్ఞ చేశారు. ఆయన “బ్రాహ్మణుడైనా సరే” అనడంతో, నా మీద అనుమానమేదైనా కలిగిందేమో అన్న సంశయం నాకు కలిగి, రాత్రికి రాత్రే రాజమందిరంలోకి ప్రవేశించి, ప్రశాంతంగా నిద్రిస్తున్న రాజును చంపేశాను. అటునుంచటే, రత్నాలనూ బంగారాన్నీ పట్టుకుని పారిపోయాను. దాంతో భూదేవికి కూడా నా మీద అసహ్యం కలిగిందేమో.. అలా పారిపోతూ, దారి తప్పి, ఘోరారణ్యంలో దిగబడి, అక్కడొక ఆకలిగొన్న పులివాత పడి చనిపోయాను. కలం వంటి సాధనంతో మహా పాపం చేశాను కాబట్టి, నన్ను నరకంలో లేఖకుడని పిలిచారు. అక్కడ ఎనలేని బాధలను అనుభవించి, ఇలా ప్రేతయోనిలో పడ్డాను.”

ఇలా అయిదు ప్రేతాలూ, వినయంతో తమ పన్నాలను వినిపించగా, బ్రాహ్మణుడు జాలిపడ్డాడు. వారి ప్రస్తుత పరిస్థితిని గూర్చి అడుగగా, వారిలా చెప్పుకుని విలపించారు.

'ఓ ద్విజేంద్రా! ఎక్కడ వేదమార్గం అనుసరింపబడుతుందో, ఎక్కడ లజ్జ, ధర్మమూ, దమమూ, క్షమ, ధృతి, జ్ఞానమూ వుంటాయో, అక్కడ మేము ప్రవేశించలేము. శ్రాద్ధ తర్పణ కర్మలు చేయబడని గృహాలలో మేము నిరాటంకముగా దూరగలము. అక్కడి మనుషుల రక్తమాంసాలను వారికి తెలియకుండానే అపహరించి ఆరగిస్తాము. వారు ఏ జబ్బూ లేకుండానే నీరసించి పోతుంటారు. మా ఆహారం పరమ అసహ్యకరం. మలం దగ్గరనుండి శవం దాకా, అన్నీ తింటాము. మాకే సిగ్గనిపిస్తుంది. అయినా తప్పదు. మేము అజ్ఞానులం, తామసులం, మంద బుద్ధులం. ఏ మాత్రం దైవశక్తి అలికిడి విన్నా, భయంతో పారిపోయే పిరికి జనాలము. మాకీ ప్రేతజన్మ ఎప్పుడు పూర్తవుతుందా? అని ఎదురు చూస్తూ వుంటాము.”

ఓ గరుత్మంతా, అలా బ్రాహ్మణుడు వారి బాధలను వింటుండగానే, నేను అతనికి దర్శనమిచ్చాను. హృదయంలో నివసించే అంతర్యామిని, పురుష స్వరూపంలో సాక్షాత్కరించిన నన్ను చూడగనే, ఆ విప్రుడు నేలపై సాష్టాంగ పడి నమస్కరించి, స్తుతులతో నన్ను సంతుష్ట పరిచాడు. అతని దయ వల్ల, ఆ ప్రేతాలు కూడా నన్ను చూడగలిగాయి. “అన్ని రకాల ప్రాణులనూ కేవలం నీ దయతోనే, వారికి ఏ అర్హతా లేకపోయినా, నీవు ఉద్ధరించగలవు. మహాప్రభో! నీకు నమస్కారములు" అని పలుకుతున్న ఆ బ్రాహ్మణుని మనస్సు లోని కోరికను అర్థం చేసుకుని, నేను వారందరికీ ఉత్తమలోకాలను ప్రసాదించాను. నా ఇచ్చ మేరకు, అత్యంత తేజముగల, శ్రేష్ఠ ఆకాశగమనం చేయగల, గంధర్వ, అప్సర యుక్తములైన ఆరు విమానాలు అక్కడకు వచ్చి, ఆ బ్రాహ్మణునీ, పంచ ప్రేతాలనూ ఎక్కించుకుని, నా లోకానికి తీసుకుని పోయాయి” అని చెప్పాడు శ్రీ మహా విష్ణువు. (అధ్యాయం - 7)

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History