కఠోపనిషత్తు! Significance of Kathopanishad
కఠోపనిషత్తు! ఎందుకంత ముఖ్యం?
‘యమధర్మరాజు’ సూటిగా, సందేహాలకు తావు లేకుండా చెప్పిన విషయాలేంటి?
సమస్త మానవాళికీ, వారి వారి స్థాయిలలో ఉద్ధరింప బడటానికి మార్గాలను చూపేవి, ‘వేదాలు’. పరిపక్వం చెందిన సాధకులకూ, వైరాగ్య భావనగల వారికీ, మోక్షంకోసం తపించేవారికీ చక్కగా ఉపకరించేవి, ‘ఉపనిషత్తులు’. ‘ఉపనిషత్తు’ అనే శబ్దం వినిపించగానే, ఎవరిలో అయితే ఒక పారవశ్యం, పులకరింత కలుగుతాయో, వారే ఉపనిషత్తులలోని జ్ఞానాన్ని గ్రహించగల బుద్ధిని కలిగి వుంటారు. ఉపనిషత్తు అంటే, అజ్ఞానాన్ని పూర్తిగా నశింపజేసేదని ఒక అర్థమయితే, వైరాగ్యవంతుడైన సాధకుని, పరమాత్మ సన్నిధికి చేర్చి, ఆ పరమాత్మతో ఐక్యత కలిగించేదే ఉపనిషత్తని, మరొక అర్థం. నాలుగు వేదాలలోనూ ‘జ్ఞాన భాండాగారాలు’ అనదగిన ఉపనిషత్తులు, 1180 ఉన్నాయి. అయినా ఇప్పుడు అన్ని పేర్లూ లభించడం లేదు. ముక్తికోపనిషత్తులో, శ్రీరాముడు ఆంజనేయునికి, 108 ఉపనిషత్తుల పేర్లను తెలియజేయడం జరిగింది. అందులో 10 ఉపనిషత్తులను, అత్యంత ప్రధానమైనవిగా భావించి, ముగ్గురు ఆచార్యులు వాటికి భాష్యాలు వ్రాశారు. అవే, దశోపనిషత్తులుగా ప్రఖ్యాతిగాంచాయి. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులే అవి. ఉపనిషత్తులనే వేదాంతమని కూడా అంటారు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/vYv_2z5jIJg ]
ఇక్కడ ఒక విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి. ఏ ఉపనిషత్తయినా, తనంతట తానుగా, మనకు ఇష్టం ఉన్నా లేకున్నా, బలవంతంగా మనలను ఈడ్చుకు వెళ్ళి, పరమాత్మ సన్నిధికి చేర్చదు. ఎవరైతే ప్రపంచంలో తిరుగుతూ, వారి వారి వాసనలకనుగుణంగా వ్యవహరిస్తూ, సుఖ దుఃఖాలను పొందుతూ, ఏదో ఒక నాటికి నిత్యమైనదేమిటో, అనిత్యమైనదేమిటో తెలుసుకుని, అనిత్యమైన ప్రాపంచిక విషయాలపట్లా, భోగాలపట్లా వైరాగ్యం చెంది, నిత్యమైన, శాశ్వతమైన, ఆనంద స్వరూపమైన పరమాత్మపట్ల ఆసక్తికలిగి, ఆ పరమాత్మ కొరకు తపిస్తూ సాధనలు చేస్తారో, అటువంటి వారినే, ఉపనిషత్తులు పరమాత్మ సన్నిధికి చేర్చుతాయి. ‘సాధన’ అంటే, నామ మాత్రంగా, మొక్కుబడిగా చేసే సాధన కాదు. ముక్తికోసం తీవ్ర సాధన చేయాలి. నిజంగా ముక్తి సాధన అనేది, ఈ భూమి మీద జన్మించే ప్రతి ప్రాణికీ అనివార్యం. అది ఎప్పటికైనా తప్పదు. కానీ, మానవులు తప్ప, మిగిలిన ఏ ప్రాణికూడా ముక్తి సాధన చెయ్యలేదు. వాటికి ఆలోచించే బుద్ధి ఉండదు. ఆచరించేందుకు అవకాశాలు లేవు. ఒక్క మానవునికి మాత్రమే, ఆ అవకాశం, అదృష్టం. అందుకే, 'అన్ని జన్మలలోను మానవజన్మ శ్రేష్టమైనద'ని అంటూ, “జంతూనాం నరజన్మ దుర్లభం” అని శంకరాచార్యుల వారన్నారు. అంతమాత్రాన, మానవులంతా ముక్తి సాధన చేస్తున్నారా? లేదు.. చాలామంది జంతువులలాగానే తినటం, కనటం, నిద్రపోవటం అనే వాటితోనే సరిపుచ్చుకుంటారు. మరి కొందరు, లౌకిక భోగాలూ, విషయాల కొరకే జీవితాలను వినియోగించుకుంటారు. ఇంకొందరు, ఏదో నామ మాత్రంగా భగవంతుని తలుచుకోవడమో, స్వార్థ ప్రయోజనాలకొరకో, దుఃఖాలు కలిగినప్పుడో, భగవంతునికి దగ్గరవుతూ ఉంటారు. అలాగాక, కేవలం భగవంతుని కొరకే భగవంతునికి దగ్గర కావాలనుకునేవారూ, జన్మను సార్ధకం చేసుకోవటానికి భగవంతుని దరిజేరేవారూ, చాలా అరుదు. వీరిలో పూర్తిగా భగవంతుని శరణాగతి పొంది, 'త్వమేవ సర్వం మమదేవ దేవ' అని దగ్గరయ్యే వారు, బహుకొద్ది మంది మాత్రమే.
నిజంగా ముక్తి సాధనకై భగవంతుడు ప్రతి మానవుడినీ తొందర పెడుతూనే ఉంటాడు. ఎప్పుడూ కష్టాలూ, కడగండ్లనే మొట్టికాయలు వేస్తూనే ఉంటాడు. అయినా మానవుడు, జన్మలకు జన్మలు నెట్టుకొస్తూనే ఉంటాడు. అనిత్యమైన వాటి కోసమే ప్రాకులాడుతూ ఉంటాడు. బొప్పి కడితే మందు వేసుకుందామనుకుంటాడే గానీ, ఆ మొట్టికాయల వెనుకవున్న భగవంతుని ఉద్దేశమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడు. అయితే, భగవంతుడు మాత్రం విసుగూ విరామం లేకుండా, తన ప్రయత్నాన్ని సాగిస్తూనే ఉంటాడు. కోట్లాది జన్మల తర్వాతయినా, జ్ఞానోదయం కలగాల్సిందే. కానీ, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, సంసార బాధలు నసాళానికెక్కి, ఇక భరించలేక పిచ్చెక్కినట్లై, అప్పుడు కక్కుర్తి పడి ఏదో హడావుడిగా ప్రయత్నిస్తే, సుఖం దొరకక పోగా, దుఃఖం కలుగుతుంది. ఇలా హడావుడిగా ఏదో తెలిసీ తెలియని సాధనలు చేసి, వెనుక పిచ్చి కుక్క ఏదో వెంబడిస్తే పరుగెత్తినట్లు పరుగులు తీసి, ఏ గోతిలోనో పడక, దుఃఖాలలో చిక్కుబడి పోక, చక్కని అవకాశాలు లభించిన ఈ జన్మలోనే, సద్గురువులను ఆశ్రయించి, ఉపనిషత్తులలో నిక్షిప్తం చేయబడిన ఆత్మజ్ఞానాన్ని అవగతం చేసుకుని ఆచరించటం, తెలివైన వారి పని. అది ఉత్తముల లక్షణం.
అలాగాక, మానవుడు సంసారధ్యేయంతో, లౌకిక విషయాలపట్ల ఆసక్తితో, భోగాలపట్ల వ్యామోహంతో, ఈ ఒక్క జన్మనే దృష్టిలో పెట్టుకుని, శాస్త్రాలన్నింటినీ తిరస్కరించి, మహాత్ములూ, జ్ఞానుల యొక్క సలహాలనూ, సూచనలనూ పెడచెవినబెట్టి, గురువులను ధిక్కరించి, మొండిగా, మూర్ఖంగా ఈ సంసార లంపటంలోనే కూరుకుపోతే, భగవంతుడు ఊరు కుంటాడా? అడుగడుగునా విచారణలకూ, శిక్షలకూ గురిచేస్తూ ఉంటాడు. అదీ ఎక్కడో కాదు. ఇక్కడే, ఈ జన్మలోనే. అయినా సరే నిర్లక్ష్యం చేశావా! మరణించిన తర్వాతయినా, ధర్మాధర్మ విచారణ పేరుతో, యమధర్మ రాజు న్యాయస్థానంలో ముద్దాయిగా నిలబడాలి. ఆయన వేసే శిక్షలను అనుభవించాలి. మరి అక్కడ న్యాయస్థానంలో నిలబడి, న్యాయవాది చిత్ర గుప్తుడడిగే ప్రశ్నలకు బిక్క మొగం వేస్తే ఏం లాభం? అక్కడ నిన్ను రక్షించటానికి ఏ ప్రతివాద న్యాయవాదీ ఉండడు. కనుక ఆ విషయాలన్నీ ఇక్కడే బాగా ఆలోచించుకుని, తగిన విధంగా తయారై పోవాలి. అసలు యమ ధర్మరాజుకు ఎదురు పడకుండా, తప్పించుకునే ఉపాయమేదో ఇప్పుడే, ఇక్కడే ఆలోచించు కోవాలి. భజ గోవిందంలో దీనికి సూటిగా ఉపాయం చెప్పారు శంకరులవారు..
“భగవద్గీతా కించిదధీతా గంగాజల లవకణికా పీతా ।
సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్యయమేన నచర్చా ॥
భగవద్దీత అధ్యయనం, జ్ఞాన గంగాజలపానం, ‘మురారి అర్చనం’ అంటే, అహంకారమనే రాక్షసుడే ముర.. అతణ్ణి సంహరించిన వాడే మురారి. కనుక అహంకారాన్ని అంతం చేసి, పరమాత్మగా నిలిచిపోవాలి. ఈ మూడూ చేసిన వారికి, ఇక యమునితో ఎటువంటి వివాదమూ ఉండదు.
యమధర్మరాజుకు సంబంధం లేకుండా, ఆయన కంట పడకుండా, ఆయనతో వివాద పడకుండా ఉండాలంటే, ఆయన మాటలలోనే చెప్పిన కఠోపనిషత్తును, ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలి. యముని భయం తీరాలంటే, ఈ ఉపనిషత్తును అధ్యయనం చేయాలి.
కృష్ణ యజుర్వేదంలో, యమ ధర్మరాజూ, నచికేతుల సంవాద రూపంగా, ఈ ఉపనిషత్తు ప్రఖ్యాతి గాంచింది. కృష్ణ యజుర్వేదంలోని కఠశాఖకు చెందిన బ్రాహ్మణాలలోనిది, ఈ ఉపనిషత్తు. కఠక బుషి, ఈ బ్రాహ్మణానికి కర్త. దశోపనిషత్తులలో ఎంతో ప్రాచీనమైనదిగా భావించబడేది, ఈ ఉపనిషత్తు. చెప్పేదేదో గట్టిగా, సూటిగా, సందేహాలకు తావు లేకుండా చెప్పేశాడు ‘యమధర్మరాజు’. ఆత్మతత్వ బోధను సమగ్రంగా అందిస్తున్నది, ఈ ఉపనిషత్తు. అందుకుని, ఆచరించి, ఆనందించి, తరించటం ఇక మన చేతులలోనే ఉంది.
శ్రేష్ఠమైన దశోపనిషత్తులలో మూడవదైన ఈ కఠోపనిషత్తు, చాలా సుబోధమైనది. ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్యయే, బ్రహ్మ జ్ఞానమే. అయితే, చాలా ఇతర ఉపనిషత్తులలాగా ఉపాసనలనూ, కర్మలనూ కలగలిపి, అసలు విషయాన్ని క్లిష్టం చెయ్యకుండా, అన్ని ముఖ్య విషయాలను వదలి పెట్టకుండా వెల్లడిస్తూ, ఈ కఠోపనిషత్తు బ్రహ్మ విద్యను సుస్పష్టంగా, సువ్యక్తంగా బోధించి, వివరిస్తుంది. జగదేక సత్యమైన పరబ్రహ్మనూ, పరమాత్మనూ సుస్పష్టంగా మన హృదయంలో సాక్షాత్మరింపజేస్తుంది.
ఈ ప్రపంచంలోని సమస్త దుఃఖాలకూ, ఆపదలకూ మూల కారణం, అవిద్య, అజ్ఞానమే, తానెవరో తనకు తెలియకపోవటమే. మానవుడు ఈ దేహమే తానని భ్రమపడుతుంటాడు. అదే అజ్ఞానం. దేహం ఎన్నటికీ, ‘నేను’ కావటానికి వీలు లేదు. జనన మరణాలు లేకుండా, శాశ్వతంగా, ఎల్లప్పుడూ, అంతటా ఉండే చైతన్యమైన ఆత్మయే ‘నేను’. ఏ మార్పులూ, ఏ ఆకారమూ, ఏ పరిమితులూ, ఏ కల్మషాలూ లేని ఆనంద స్వరూపమైన ఆత్మయే ‘నేను’. అటువంటి ఆత్మను శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకుని, విచారణ చేసి, బాగా ధ్యానించి, సుస్పష్టంగా గ్రహించి అనుభవించటమే, ‘జ్ఞానం’. అటువంటి ఆత్మగా, సర్వకాల సర్వావస్థలలోనూ ఎరుక కలిగి చేరటమే మోక్షం.
అటువంటి ఆత్మ జ్ఞానాన్ని నచికేతుడు కోరగా, యమధర్మరాజు అనేక ఉదాహరణలతో, అనేక రీతులలో వివరించి, బోధించటమే, ఈ ఉపనిషత్తు సారాంశము.
ఆత్మను కొత్తగా ఎవరూ ఎక్కడినుంచీ పొందనక్కరలేదు. అది బయటి నుంచి రాదు. ప్రతి వ్యక్తీ నిజంగా, ఆత్మ అయ్యే, ఆత్మను పొందే ఉన్నాడు. కనుక పొందడమంటే, లేని వస్తువును తెచ్చుకోవటం లాంటిది కాదు. అది ‘నేనే’ అని తెలుసుకోవటం. ప్రతి వడ్లగింజా బియ్యపు గింజలాగే, ప్రతి ప్రాణీ ఆత్మయే. ప్రతి జీవుడిలోను ఆత్మ శుద్ధచైతన్య రూపమై, స్వయం ప్రకాశకమై ఉంటుంది. ఆ చైతన్యము వల్లనే, సర్వకార్యములూ జరిగిపోతున్నప్పటికీ, అజ్ఞాని మానవుడు, ఆత్మను తెలుసుకోలేక పోతున్నాడు. అందుకే శ్రుతి మాత ఇలా అంటుంది..
“ఉత్తిష్ణత - జాగృత - ప్రాప్యవరాన్ని బోధత”
లేవండి, మేలుకొనండి.. ఆత్మజ్ఞానులైన మహాత్ములను శరణువేడి, ఆత్మను తెలుసుకోండి. ఇది స్వామీ వివేకానందుల వారి గుండె లోతులలోనుండి పెల్లుబికి వచ్చిన వాక్యం. ఈ ఆత్మజ్ఞానమునే, కఠోపనిషత్తు బోధిస్తోంది. ఆసక్తిగలిగినవాడూ, బుద్ధిమంతుడైనవాడూ, విచారణాశీలుడైనవాడూ, దీనిని ప్రశాంతమైన మనస్సుతో, సూక్ష్మమైన బుద్ధితో చదివినా, విన్నా, ఈ విషయాన్ని పూర్తిగా, స్పష్టంగా గ్రహించగలుగుతాడు. అయితే, 'నేను', సత్యము, నిత్యము, చైతన్య మాత్రము, ఆనంద స్వరూపమయిన బ్రహ్మమును.. ‘నేను’ ఈ దేహ, ఇంద్రియ, మనోబుద్ధులకు అతీతుడననే జ్ఞానం, ఈ ఉపనిషత్తును వింటే కలుగవచ్చు కానీ, అంతమాత్రం చేతనే అతడు అత్మానందాన్ని పొందలేడు.
మరి ఎప్పుడు పొందుతాడు??? “నేను పవిత్రమై, జనన మరణ రహితమై, నిత్యమై, ఆనంద స్వరూపమై, ఏ మార్పులూ లేని, ఏ మలినాలూ లేని, శాశ్వత సత్యమైన ఆత్మను” అనే భావాన్ని అదే పనిగా, ఏకధారగా, గంగా ప్రవాహంలాగా, నిత్యము, నిరంతరము మననము చేస్తూ ఉంటే, ఈ సాధన మనలోని అజ్ఞానాన్ని నశింపజేసి, పరమశాంతినీ, పరమానందాన్నీ కలిగిస్తుంది.
జీవితం మరియు మరణం యొక్క ప్రశ్నలూ, మానవ జీవితానికి సంబంధించిన సమస్యలూ, ఆత్మ యొక్క అమరత్వం తాలూకు స్వభావం, మరియు అంతిమంగా ఆత్మ యొక్క ఆరోహణ లక్ష్యం అయిన ఇతివృత్తాలూ, కఠోపనిషత్తులో సాధారణంగా కనిపించే కొన్ని అంశాలు.. అటువంటి కఠోపనిషత్తును ప్రతి ఒక్కరూ తెలుసుకుని తీరాలి! దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు..
శివ గోవింద!
Comments
Post a Comment