దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు? వాటి విశేషాలు ఏమిటి? Deepavali Significance


అందరికీ దీపావళి శుభాకాంక్షలు 🙏

దీపావళి ఐదు రోజుల పండుగ అంటారు? వాటి విశేషాలు ఏమిటి?

ధన్వంతరీ త్రయోదశి..

వాడుకలో ధన త్రయోదశి అని అంటూ ఆ రోజు బంగారం కొనాలనే ఆశ పడుతున్నాం ! కానీ ఆరోజు ‘ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడు అయిన ‘ధన్వంతరీభగవాన్’ జయంతి. పాల సముద్రం చిలికిన సమయంలో చేతిలో అమృత భాండముతో అవతరించాడు.

నరక చతుర్దశి..

నరక యాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు ప్రాక్జ్యోతీషపురం (నేటి అస్సాము)ను పాలించిన ‘నరకుడు’ నర రూప రాక్షసుడు. దేవీ ఉపాసకుడే కానీ దేవిని వామాచారంలో క్షుద్రపూజలు చేసి అనేక అధ్భుత శక్తులను సంపాదించి, దేవతలను కూడా ఓడించాడు. వాడు ప్రతీ అమావాస్య - పౌర్ణమికి నవ యవ్వన రాచ కన్యలను దేవికి బలి ఇచ్చే వాడు. కాముకత్వంతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు (రాచకన్యలు) బందీలుగా వుండేవారు. ఆది వరాహమూర్తికి – భూదేవికి కలిగిన సంతానమే ఈ నరకుడు. తామస ప్రవృత్తితో జనించాడు. శ్రీకృష్ణ భగవానుడు – సత్యభామ (భూదేవీ అవతారం)తో కలసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి (సత్యభామ) సహకారంతో సంహరించాడు. నరకుని పీడ విరగడైంది కావున, ఇది ‘నరక చతుర్దశి’.

దీపావళి..

రావణ సంహారం తర్వాత సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సంధర్బంగా దీపావళి జరుపు కోవాటం, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళిని జరుపుకోవటం, అనాదిగా వస్తున్న ఆచారం. 'దీపం' లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య స్వరూరం, జ్ఞాన స్వరూపం.. అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాము. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు.

బలి పాఢ్యమి..

వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలి చక్రవర్తిని ‘మూడు అడుగుల’ నేలను దానమడిగాడు. వామన వటువుకు దానమిచ్చాడు బలి. ‘ఇంతింతైవటుడింతైనభోరాశిపైనల్లంతై’ అన్నట్లుగా, ఒక పాదంతో భూమిని, ఇంకో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించిన ‘త్రివిక్రముడు’, వేరొక పాదంతో బలిని పాతాళానికి అణచాడు. సంవత్సరానికి ఒకసారి బలి పాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి, ఇక్కడి దీప కాంతులను చూసి, మనమంతా సుఖశాంతులతో వుండాలని ఆశీర్వదించి వెలతాడని పురాణ విదితం. ఇది ఆయనకు వామనుడిచ్చిన వరం.

యమద్వితీయ..

సూర్య భగవానునికి యముడు, శనిదేవుడు, ఇద్దరు పుత్రులు, యమున అనే ఒక పుత్రిక ఉన్నారు. యముడు, యమున ఇద్దరూ అన్నా చెల్లెలు కదా! తనపని (జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశంతో ఈడ్చుకు వచ్చి, వారి వారి కర్మాను సారం వారికి తగిన శిక్షలు విధించే పని) లో పడి, పాపం చెల్లెలింటికి వెళ్ళటం లేదు యముడు. ఒకసారి మా ఇంటికి రా అన్నయ్యా అని చెల్లి బతిమాలింది. కార్తీక శుద్ఘ విదియ, మంగళవారం రోజు తీరిక చేసుకుని, తన చెల్లెలింటికి వెళ్లి హాయిగా కొద్ది సేపు వుండి భోజనం చేసి వచ్చాడు యముడు. చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగింది. 'ఎవరైతే ఈ రోజు చెల్లెలింటికి వెళ్లి, చెల్లెలికి కట్నకానుకలిచ్చి, వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో, వారికి యముని బాధలు లేకుండా చేయి' అని అడిగింది. ఈ యమునమ్మనే, యమునా నది. కృష్ణుని భక్తురాలు. భగినీ హస్త భోజనం అన్న పేరుతో, ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారు.

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ఏది శాకాహారం – ఏది మాంసాహారం? Story of Dharmavyadha and his curse - Varaha Purana