దానం సక్రమమైనదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది ఎలా నిర్ణయించబడుతుంది? భగవద్గీత Bhagavad Gita
దానం సక్రమమైనదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది ఎలా నిర్ణయించబడుతుంది?
'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (17 – 20 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 17 నుండి 20 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/8AVAHaPcbmw ]
రజో గుణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాము..
00:45 - శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్ త్రివిధం నరైః ।
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ।। 17 ।।
భక్తి-శ్రద్ధలు కల వ్యక్తులు, అత్యంత విశ్వాసముతో ఈ మూడు తపస్సులనూ, భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా ఆచరిస్తే, వాటిని సాత్త్విక తపస్సులని అంటారు.
శారీరక, వాక్కు, మరియు మనస్సులకు సంబంధించిన తపస్సులను వేర్వేరుగా, స్పష్టంగా వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, సత్త్వ గుణములో చేసే వాటి లక్షణములను వివరిస్తున్నాడు. భౌతిక ప్రతిఫలములను ఆశించి చేయబడితే, తపస్సు దాని యొక్క పవిత్రతను కోల్పోతుంది. అది నిస్వార్ధ చిత్తముతో, ఫలాసక్తి లేకుండా చేయబడాలి. అంతేకాక, అది విజయవంతమైనా, లేదా విఫలమైనా, ఆ తపస్సు యొక్క విలువ పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి; సోమరితనం వల్ల కానీ, అసౌకర్యముగా ఉందని కానీ, దాని యొక్క ఆచరణను ఆపకూడదు.
01:46 - సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ।। 18 ।।
కీర్తిప్రతిష్టలూ, గౌరవమూ, మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సూ మరియు యజ్ఞములూ, రజో గుణములో ఉన్నట్టు. దాని యొక్క ప్రయోజనములు అస్థిరమైనవి, మరియు తాత్కాలికమైనవి.
తపశ్చర్య అనేది, ఆత్మ-శుద్ధి కోసమున్న అత్యంత ప్రయోజనకరమైన ఉపకరణమే అయినా, దానిని అందరూ పవిత్రమైన ఉద్దేశంతో ఉపయోగించుకోరు. ఒక రాజకీయవేత్త రోజులో ఎన్నో ఉపన్యాసాలు ఇస్తూ, చాలా పరిశ్రమిస్తాడు. అది కూడా ఒక లాంటి తపస్సే. కానీ, దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, పదవీ, హోదా పొందటము. అదే విధముగా, ఎవరైనా ఆధ్యాత్మిక కార్యకలాపాలలో, గౌరవం లేదా ప్రశంస కోసం నిమగ్నమయితే - మార్గం వేరయినా, దాని ఉద్దేశ్యం కూడా, అంతే సమానమైన భౌతికపరమైనదే అవుతుంది. గౌరవం కోసం, పదవి కోసం, లేదా ఏ ఇతర భౌతిక ప్రాపంచిక ప్రతిఫలం కోసం చేసినా, ఆ తపస్సు, రజో గుణ తపస్సుగా పరిగణించబడుతుంది.
02:57 - మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః ।
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ।। 19 ।।
అయోమయ భావాలతో, తమను తామే హింసపెట్టుకుని, లేదా ఇతరులకు హాని కలిగించటం కోసం చేయబడే తపస్సు, తమో గుణములో ఉన్నట్టు చెప్పబడినది.
మూఢ-గ్రాహేణాత్ అంటే - అయోమయ ఉద్దేశ్యంతో ఉన్న జనులు అని. తపస్సనే పేరు మీద, శాస్త్ర విధివిధానాలను పట్టించుకోకుండా, లేదా శరీర పరిమితులను అర్థం చేసుకోకుండా, అనవసరంగా తమను తాము హింసించుకోవడమో, లేదా ఇతరులకు హాని చేసేవారని అర్థం. ఇటువంటి తపస్సులు ఎటువంటి ప్రయోజనాన్నీ చేకూర్చవు. అవి శారీరక దృక్పథంతో చేయబడినట్లూ, మరియు మొరటు వ్యక్తిత్వాన్ని చాటుకునేందుకే చేస్తారు.
03:48 - దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ।। 20 ।।
దానము చేయుట తన కర్తవ్యమని భావించి, తగిన పాత్రత ఉన్నవారికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది, సత్త్వగుణ దానమని చెప్పబడుతుంది.
మూడు విధముల దానములు ఇప్పుడు వివరించబడుతున్నాయి. శక్త్యానుసారంగా దానము ఇవ్వటం అనేది, మన కర్తవ్యముగా చేయాలి. భవిష్య పురాణం ఇలా పేర్కొంటున్నది: దానమేకం కలౌ యుగే.. ‘కలి కాలంలో దానం చేయటమే, అంతఃకరణ శుద్ధికి మార్గము.’ రామాయణం కూడా ఇలా పేర్కొంటున్నది: ‘ధర్మమునకు నాలుగు మూల సూత్రములున్నాయి. వాటిలో ఒకటి, కలియుగంలో అత్యంత ముఖ్యమైనదీ ఏమిటంటే - ఏ రూపంలోనైనా, పద్ధతిలోనయినా దానం చేయి - అని.’ దాన ప్రక్రియ ఎన్నో మంచి ఫలితాలను ఇస్తుంది. అది ఇచ్చే వాడికి, భౌతిక ప్రాపంచిక వస్తువులమీద మమకారాసక్తిని తగ్గిస్తుంది; అది సేవా దృక్పథాన్ని పెంచుతుంది; విశాల హృదయమును ఇస్తుంది, మరియు ఇతరుల పట్ల వాత్సల్య భావమును పెంచుతుంది. కాబట్టి, చాలా మతాల సిద్ధాంతాలు, వ్యక్తి సంపాదనలో పదవ వంతు దానము చేయమని ఉపదేశిస్తున్నాయి. ‘నీవు న్యాయముగా సంపాదించిన దానిలో నుండి, పదవవంతు పక్కకు తీసి, అది నీ కర్తవ్యముగా భావించి, దానిని దానం చేయి. నీ దానమును ఈశ్వర ప్రీతి కోసమే అర్పితం చేయి.’ దానము సక్రమమైనదా, లేదా, ఉన్నతమైనదా, నీచమైనదా అనేది, శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాలను బట్టి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైతే హృదయపూర్వకంగా, అర్హతగల పాత్రుడికి, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో ఇవ్వబడుతుందో, అప్పుడది సత్త్వ గుణ దానమని చెప్పబడుతుంది.
05:47 - ఇక మన తదుపరి వీడియోలో, తామసిక దానముగా దేనిని పరిగణిస్తారో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Comments
Post a Comment