What Is The Real Definition of a True Friend? నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి?


నిజమైన స్నేహానికి నిర్వచనం ఏంటి?
స్నేహం గురించి భీష్ముడు తెలియజేసిన కథ ‘నాడీజంఘుడు – గౌతముడు’!

మహాభారతంలోని శాంతి పర్వంలో, భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అనేక నీతి కథలు ఉన్నాయి. మానవుల్లో ఎలాంటివాళ్ళు సౌమ్యులు? ఎవరిని ప్రేమించాలి? ఎవరు ఉపకారం చేసేవారు? అనే విషయాలను గురించి ధర్మరాజు భీష్ముడిని అడుగగా, అందుకు భీష్ముడు, దోషాలున్న వారందరిలోకీ, కృతఘ్నుడు పరమనీచుడు. అలాంటి వాడు మిత్రులను కూడా చంపుతాడు. అలాంటి అధములను పూర్తిగా వదిలివేయాలని, ‘గౌతముడు - నాడీ జంఘుడి’ కథను వివరించాడు? మరి కథలో దాగిన నీతేంటి? ఒక బ్రాహ్మణుడు, స్నేహితుడిని హత్య చేసే కసాయి వాడిగా ఎలా మారాడు – అనేది, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. వీడియోను చివరిదాకా చూసి, మీ అభిప్రాయాలనూ, అనుభవాలనూ, కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ALCW_52fobs ]


మ్లేచ్ఛ దేశంలో, గౌతముడనే పేరు గల ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు బ్రాహ్మణులు చేయవలసిన వేదాధ్యయనం, మొదలైనవేవి చేయకుండా, భిక్షాటనతో జీవించేవాడు. ఒకసారి అతను ఒక బందిపోటు దొంగ ఇంటికి, భిక్ష కోసం వెళ్లాడు. ఆ దొంగ దాత, బ్రాహ్మణ భక్తుడు కావడం వలన, అతడు గౌతముడు ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి అవసరమైన ఆహార సామాగ్రీ మొదలైన అన్ని సౌకర్యాలతోపాటు, అతనికి సేవ చేయడానికి భర్త చనిపోయిన ఒక శూద్ర స్త్రీని కూడా ఏర్పాటు చేశాడు. గౌతముడు ఆ దాసితో సుఖంగా జీవిస్తూ ఆటవికుల లాగా, గురి చూసి బాణం వేయడం నేర్చుకుని, ప్రతిరోజూ అడవికి వెళ్ళి, అనేక పక్షులనూ, మృగాలనూ చంపి తింటూ జీవించేవాడు.

ఒకసారి అతని దగ్గరకు గౌతముని ఊరి వాడు, మిత్రుడు, వేదాధ్యనతత్పరుడు అయిన ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. అదే సమయంలో గౌతముడు, తాను చంపిన హంసలను భుజమ్మీద వ్రేలాడదీసుకుని, చేతిలో ధనుస్సు పట్టుకుని, రక్తంతో తడిసిన శరీరంతో, రాక్షసుని లాగా వేట నుంచి వచ్చాడు. సద్బ్రాహ్మణుడు అతణ్ణి చూసి ఆశ్చర్యపోయి, అతణ్ణి మార్చాలనే ఉద్దేశ్యంతో, సద్బ్రాహ్మణ కర్మలను గురించి ఉపదేశించి, హింసను త్యజించమని, అనేక రకాలుగా బోధించాడు. గౌతముడు అతని మాటలను విని పశ్చాత్తాప పడినట్లుగా నటించి, మరుసటి రోజు తెల్లవారిన తరువాత ఆ వూరినీ, క్రూర కర్మలనూ వదిలిపెట్టి, అతనితోపాటు తానూ వస్తాననీ, సద్బ్రాహ్మణునికి తగిన పనులను చేస్తాననీ చెప్పి, అతనికి నమ్మకం కలిగించాడు.

వచ్చిన సద్బ్రాహ్మణుడు రాత్రి నిద్రపోయిన తరువాత, గౌతముడు అక్కడి నుంచి సముద్రం దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో కొంతమంది వ్యాపారులు అక్కడికి రాగా, వారితో కలసి సముద్రతీరానికి వెళ్ళాడు. ఇంతలోనే ఒక మదించిన ఏనుగు వారి మీద పడి, అందరినీ చంపడం మొదలుపెట్టింది. గౌతముడు అతి కష్టం మీద తప్పించుకుని ఉత్తర దిక్కుకు పారిపోయి, ఒక అడవిలో తిరుగుతూ దివ్యమైన ఒక ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. ఆ ఉద్యానవనం అనేక రకాల పండ్లచెట్లతో, పూల మొక్కలతో సువాసనలు వెదజల్లుతూ, రమణీయంగా ఉంది. ఆ చల్లని గాలికి గౌతముడు ఆదమరచి నిద్రపోయాడు.

ఆ ఉద్యానవనం, నాడీజంఘుడు అనే పేరు గల ఉత్తమమైన కొంగది. ఆ కొంగ, సురభి, కశ్యపుల కుమారుడు, బ్రహ్మ దేవునికి ఆప్తమిత్రుడు. అతనికి రాజధర్ముడనే ప్రసిద్ధమైన మరొక పేరు కూడా ఉంది. దేవకన్యా పుత్రుడు కావడం వలన, అతని శరీరం దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. అలాంటి కొంగను చూసి గౌతముడు మొదట ఆశ్చర్యపోయి, ఆకలితో ఉన్నవాడు కావడం చేత, ఆ కొంగను చంపి తినాలకున్నాడు. అప్పుడా కొంగ గౌతమునితో, " బ్రాహ్మణా, నా అదృష్టం వలన ఈ నాడు నాకు అతిథిగా వచ్చావు. యథావిథిగా నా ఆతిథ్యాన్ని స్వీకరించి, రేపు పొద్దున నీ దారిలో నీవు వెళుదువు." అని పలికి, పక్కనే ఉన్న నది నుంచి చేపలను పట్టి తెచ్చి, వాటిని కాల్చి, అతనికి ఆహారంగా సమర్పించింది. తన రెక్కలతో విసరి, అతని శ్రమను పొగొట్టింది. ఆ తరువాత నాడీజంఘుడు, గౌతముడు అక్కడకు వచ్చిన కారణాన్ని గురించి ప్రశ్నించాడు.

దానికి గౌతముడు, తాను దరిద్రుణ్ణనీ, ద్రవ్య సంపాదన కోసం తిరుగుతున్నాననీ చెప్పాడు. అది విన్న కొంగ, ధన సంపాదనకు అతడు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదనీ, తనకు ఆప్తమిత్రుడైన విరూపాక్షుడనే రాక్షసరాజు, మూడు యోజనాల దూరంలోని నగరంలో ఉన్నాడనీ, అతని దగ్గరకు వెళ్ళి, తన మిత్రునిగా చెప్పుకుంటే, గౌతమునికి కావలసినంత బంగారం అతను ఇస్తాడనీ చెప్పింది. ఆ మాటలకు  గౌతముడు సంతోషించి, మరుసటి రోజు విరూపాక్షుడున్న నగరానికి వెళ్ళి అతణ్ణి దర్శించి, నాడీజంఘుని మిత్రునిగా పరిచయం చేసుకుని, తాను వచ్చిన పనిని గురించి వివరించాడు. విరూపాక్షుడు, గౌతముని చరిత్రను ఉన్నది ఉన్నట్లు చెప్పమన్నాడు. అందుకు గౌతముడు, "రాజా, నేను మధ్య దేశంలో బ్రాహ్మణ కులంలో పుట్టాను. శబరుల గ్రామంలో జీవిస్తున్నాను. నా భార్య శూద్ర స్త్రీ. ఆమె మొదట ఇంకొకరి భార్య. ప్రస్తుతం నా భార్య" అని తన గురించిన వాస్తవాన్ని తెలియజేశాడు. అది విన్న తరువాత విరూపాక్షుడు, తనలో తను ఇలా అనుకున్నాడు. “ఇతడు కేవలం జన్మతః మాత్రమే బ్రాహ్మణుడు. ఇతణ్ణి తనకు అత్యంత ఆప్తమిత్రుడైన నాడీజంఘుడు పంపించాడు. కాబట్టి, ఇతనికి అవసరమైన ధనాన్ని తప్పక ఇవ్వాలి” అని భావించాడు. తాను ప్రతిరోజు చేసే బ్రాహ్మణ పూజతో పాటు, గౌతముని కూడా పూజించి, ఇతర బ్రాహ్మణులతో సమానంగా, గౌతమునికి కూడా విలువైన బంగారు, వెండి, వజ్ర వైఢూర్యాలు, మొదలైన వాటిని ఇచ్చి పంపించాడు.

గౌతముడు ఆ బంగారాన్ని మోసుకుంటూ, నాడీజంఘుని దగ్గరకు వెళ్ళాడు. నాడీజంఘుడు మళ్ళీ అతనికి అనేక రకాల సపర్యలు చేసి, చక్కటి భోజనం పెట్టి, రాత్రి తన దగ్గరే ఆశ్రయమిచ్చాడు. ఆ సమయంలో గౌతముడు, "ఈ బంగారాన్ని మోసుకుని నేను చాలా దూరం వెళ్ళాలి. దారిలో తినడానికి ఆహారం కావాలి. ఆహారం ఉంటేగానీ, ప్రాణం నిలువదు. కాబట్టి, నేను బ్రతకాలంటే, ఆహారం తప్పనిసరి" అని ఆలోచిస్తుండగా, తనకు ఆశ్రయమిచ్చి, ఎంతగానో ఉపకారం చేసిన నాడీజంఘుడు, అతనికి పెద్ద మాంసపు ముద్దలాగా కనిపించాడు. దాంతో అతను నిద్రపోతున్న నాడీజంఘుని చంపి, పక్షి రెక్కలూ, ఈకలూ తీసివేసి, అగ్నిలో కాల్చి, ఆ మాంసాన్నీ, బంగారాన్నీ తీసుకుని, తన గ్రామానికి బయలుదేరాడు.

నాడీజంఘుడు ప్రతిరోజూ బ్రహ్మ దర్శనానికి వెళ్ళి తిరిగివస్తూ, దారిలో విరూపాక్షుని దగ్గరకు వెళుతూ ఉంటాడు. అప్పటికి రెండు రోజులుగా నాడీజంఘుడు రాకపోవడంతో, విరూపాక్షుడు, దుష్టుడైన గౌతముని వలన అతనికేదైనా అపకారం జరిగి ఉంటుందని అనుమానించి, తన కుమారునితో పాటు కొంతమంది అనుచరులైన రాక్షసులను, నాడీజంఘుని ఉద్యాన వనానికి పంపించాడు. అతని కుమారుడు అక్కడ నాడీజంఘుని ఈకలు చూసి, జరిగిన విషయాన్ని గ్రహించి, అనుచరులతో చాలా వేగంగా ప్రయాణించి, గౌతముని పట్టుకుని, అతని వద్ద ఉన్న నాడీజంఘుని శరీరాన్ని తీసుకుని, విరూపాక్షుని వద్దకు వెళ్లాడు. నాడీజంఘుని శరీరాన్ని చూసిన విరూపాక్షుడూ, అతని కుటుంబ సభ్యులూ, మంత్రులూ, భోరున విలపించారు.

వెంటనే విరూపాక్షుడు పట్టరాని కోపంతో, తన మిత్రుని చంపిన పరమ క్రూరుడూ, కృతఘ్నుడూ అయిన గౌతముణ్ణి, రాక్షసులైన తన అనుచరులతో ముక్కలు మక్కులుగా నరికించి, అతని మాంసాన్ని దోపిడిగాళ్ళకు ఆహారంగా వేయించాడు. కృతఘ్నుడైన అతడి మాంసాన్ని తినడానికి, వారు కూడా ఇష్టపడలేదు. విరూపాక్షుడు నాడీజంఘుని శరీరానికి దహన క్రియలు నిర్వర్తించాడు. అదే సమయంలో అతని తల్లీ, దక్షుని కుమార్తె అయిన సురభీ దేవి, ఆకాశంలో ప్రత్యక్షమయ్యింది. ఆమె నోటి నుండి పాలతో కూడిన నురగ జారి, నాడీజంఘుని చితిమీద పడింది. దాంతో నాడీజంఘుడు తిరిగి జీవించాడు. అదే సమయంలో దేవేంద్రుడు అక్కడికి వచ్చి, పూర్వం బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం వలన, నాడీజంఘుడు గౌతమునిచేత చంపబడ్డాడని చెప్పాడు.

పునర్జీవితుడైన నాడీజంఘుడు మహేంద్రునికి నమస్కరించి, చనిపోయిన గౌతముణ్ణి బతికించవలసిందిగా కోరాడు. దేవేంద్రుడు అమృతాన్ని చల్లి, గౌతముని బ్రతికించాడు. నాడీ జంఘుడు గౌతముణ్ణి కౌగలించుకుని, ధనంతో సహా అతణ్ణి అతని గ్రామానికి పంపించాడు. గౌతముడు తన గ్రామానికి వెళ్ళి, శూద్ర స్త్రీతో సంసారం చేసి, సంతానం పొందాడు. చేసిన పాపం కారణంగా, మరణించిన తరువాత గౌతముడు ఘోర నరకంలో పడ్డాడు. అని ఈ కథను భీష్ముడు ధర్మరాజుకు చెప్పి, "మనిషి తాను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉండాలి. మిత్రుల కోరికలను తీర్చాలి. మిత్రుని వల్ల సర్వమూ లభిస్తుంది. మిత్రుని వలన మనిషి భోగాలను పొందుతాడు. మిత్రుని వలన, ఆపదల నుంచి బయటపడతాడు. వివేకవంతుడు మిత్రుణ్ణి గొప్ప సత్కారాలతో పూజించాలి" అని తెలియజేశాడు.

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka