ఈ రోజు '31-03-2023' ధర్మరాజ దశమి! Dharmaraja Dasami

 

ఈ రోజు '31-03-2023' ధర్మరాజ దశమి!

ఈ పుణ్య దినాన్ని 'ధర్మరాజ దశమి' లేదా 'యమ ధర్మరాజ దశమి' అంటారు. ఈ రోజు, మరణానికి దేవుడయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది. యమధర్మరాజు అని కూడా పిలువబడే ధర్మరాజుకు అంకితం చేసిన పూజ ఈ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు. ప్రాథమికంగా ఈ రోజున చేసే పూజలు, భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించే దిశగా ఉంటాయి. మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ, ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ, వినడం ఆనందంగా ఉంటుంది.

ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును 'వేదాంతం' అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడా కొన్ని కథలు కనిపించినా, వాటిలో సత్యకామజాబాలి, నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే, అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది..

[ పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం: https://youtu.be/L4UeG2rUorU ]


ఇక నచికేతుడి కథలోకి వెళితే..

పూర్వం గౌతముని వంశానికి చెందిన వాజశ్రవసుడనే బ్రాహ్మణుడున్నాడు. అతను ఒకసారి విశ్వజిత్‌ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి, వాజశ్రవసుని యాగం గురించి వినగానే, జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి, నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలలో భాగంగా, వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ, ధృడంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని, వట్టిపోయిన ముసలి ఆవులనూ, అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవాటినీ దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది.

దానం అంటూ చేస్తే, అది అవతలివాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ, తన దగ్గర ఉన్నవాటిని వదిలించుకునేదిగా ఉండకూడదు కదా! అన్న సందేహం కలిగింది. పైగా బాల్యచాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్లి, 'ఇలా మీకు పనికిరాని వాటన్నింటినీ దానం చేస్తున్నారు సరే.. ఇంతకీ నన్నెవరికి దానం చేస్తారు?' అని అడిగాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో, తండ్రికి చిర్రెత్తుకొచ్చి, 'నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పో' అన్నాడు.

తండ్రి నోటినుంచి అలాంటి మాట వినిపించగానే, నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపపడ్డాడు. 'ఏదో పొరపాటున అనేశాను. ఊరుకో' అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞసమయంలో, అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో, తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే, దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. 'పొరపాటున అనేశాను' అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా, ఆ యయునికి తనను తాను అర్పించుకునేందుకు బయలుదేరాడు.

యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ, సమయం వచ్చినప్పడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు, తలమునకలై ఉన్న యముడు, ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు.

'ముక్కుపచ్చలారని పసి పిల్లవాడికి యమలోకంలో పనేంటి? ఇంటికి పో' అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా, జరిగినదంతా చెప్పి, తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. 'ఏదో తొందరపాటుగా అన్నంత మాత్రాన, నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నచికేతుని సత్యనిష్ఠకు ముచ్చటపడి, నువ్వు నా ద్వారం ముందు మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి, నేనే నీకు మూడు వరాలను ఇస్తాను.. తీసుకో..' అన్నాడు యముడు.

'మీరు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి, నా తండ్రి నా మీద కోపగించుకోకుండా, నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక' అన్నాడు నచికేతుడు. దానికి యముడు 'తథాస్తు' అన్నాడు. ఇక రెండవ కోరికగా, 'ఎవరైనా సరే.. స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించండి' అన్నాడు నచికేతుడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది.. 'స్వర్గలోకే న భయం కించనాస్తి' అంటాడు నచికేతుడు. అంటే, నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు, 'నచికేత యజ్ఞం' పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశించాడు.

ఇక మూడవ కోరికగా, 'చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు?' అని అడిగాడు నచికేతుడు. తనంతటివాడు ప్రత్యక్షమై, కావలసిన కోరికలు కోరుకోమంటే, 'నా తండ్రి నన్ను అభిమానించాలి. భయాన్ని జయించే స్వర్గం కావాలి. మరణ రహస్యం తెలియాలి' అంటూ ఈ పిల్లవాడు పారమార్థిక కోరికలను కోరడం, యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. అందుకే, 'నువ్వు చిన్నపిల్లవాడివి. అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జనన-మరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదైనా కోరుకో. నీకు ఏం కావాలన్నా ఇస్తాను.' అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు. తనకి ఇస్తేగిస్తే, ఆ మరణజ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరాడు.

నచికేతుని పట్టుదల, తృష్ణలను చూసిన యముడికి ముచ్చట వేసింది. 'సరే.. చెబుతాను విను. మీ మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా, అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక, పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనూలేక, మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది, ఒక్క ఆత్మ మాత్రమే.. దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు?' అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరించాడు, యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు, తన ఇంటికి సంతోషంగా తిరుగు ముఖం పట్టాడు.

ఆత్మజ్ఞానం గురించి యముడికీ నచికేతునికీ మధ్య జరిగిన సంభాషణే, కఠోపనిషత్తులో ముఖ్య భాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు, మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానందుల వంటి జ్ఞానులకి, 'కఠోపనిషత్తు' అంటే ఎంతో ఇష్టం. 'నచికేతుడి వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పది పన్నెండు మంది పిల్లలు ఉంటే, ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను' అంటారు వివేకానందులవారు. అంతేకాదు, ఆయన తరచూ స్మరించే 'ఉత్తిష్ఠత జాగ్రత' (లేవండి, మేలుకోండి) అన్న మాటలు కూడా, కఠోపనిషత్తులోనివే..

సర్వేజనాః సుఖినోభవంతు!

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam