బ్రాహ్మణులని ఎవరిని అంటారు? భగవద్గీత Bhagavad Gita


బ్రాహ్మణులని ఎవరిని అంటారు? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

'భగవద్గీత' సప్తదశోధ్యాయం - శ్రద్ధా త్రయ విభాగ యోగం (13 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, శ్రద్ధా త్రయ విభాగ యోగములోని, 13 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/w2ANVXD63co ]


ఎటువంటి యజ్ఞము, తమో గుణములోనికి వస్తుందో ఇప్పుడు చూద్దాము..

00:47 - విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ ।
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ।। 13 ।। 

శ్రద్ధావిశ్వాసములు లేకుండా మరియు శాస్త్ర నియమాలకు విరుద్ధంగా, ప్రసాదవితరణ చేయకుండా, మంత్రములు జపించకుండా, మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞము, తమో గుణములో ఉన్నదని పరిగణించబడును.

జీవితంలో, అనుక్షణం వ్యక్తులకు ఏ పనులు చేయాలన్న విషయంలో, ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మన సమాజానికి, మరియు మన సంక్షేమానికి దోహదపడే మంచి పనులు ఉంటాయి. అదే సమయంలో, ఇతరులకూ మనకూ హానికరమైన తప్పుడు పనులు కూడా ఉంటాయి. కానీ, ఏది ప్రయోజనకరమైనది, మరియు ఏది హానికరమైనదని ఎవరు నిర్ణయించాలి? అంతేకాక, ఏదైనా వివాదం తలెత్తితే, దానిని దేని ఆధారంగా నివృత్తి చేసుకోవాలి? ప్రతివారు తమ స్వంత నిర్ణయం తీసుకుంటే, అదొక గందరగోళ పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి, శాస్త్ర ఉపదేశాలు మార్గదర్శకాలుగా ఉపయోగపడతాయి, మరియు ఎక్కడెక్కడైతే సంశయం తలెత్తుతుందో, మనం ఈ శాస్త్రముల ఆధారంగా ఏది సరియైన పనో నిర్ణయించుకోవచ్చు. కానీ, తమో గుణములో ఉన్నవారికి, శాస్త్రముల పట్ల విశ్వాసం ఉండదు. వారు కర్మ కాండలను చేస్తారు కానీ, శాస్త్రములలో చెప్పబడిన ఉపదేశములను లెక్క చేయరు. శాస్త్ర నియమ-నిబంధనలను పక్కనపెట్టి, సోమరితనంతో, అలసత్వంతో, లేదా వైరబుద్ధితో, తమకు నచ్చినట్టు చేసే యజ్ఞము, తమో గుణములో ఉన్నట్టు. ఇటువంటి శ్రద్ద, నిజానికి భగవంతుని పట్లా మరియు శాస్త్రముల పట్లా విశ్వాసరాహిత్యమే.

02:29 - దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ ।
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ।। 14 ।।

పరమేశ్వరుడూ, బ్రాహ్మణులూ, ఆధ్యాత్మిక గురువూ, జ్ఞానులూ మరియు పెద్దలూ - వీరి ఆరాధన, శుచి, నిష్కాపట్యము, బ్రహ్మచర్యమూ మరియు అహింసలను ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో - అది శారీరక తపస్సని చెప్పబడును.

తపః’ అంటే ‘వేడిమిని పెంచటం’.. ఉదాహరణకి, అగ్నిపై ఉంచటం. మలినములను నిర్మూలించే ప్రక్రియలో, లోహములు వేడి చేసి కరిగించబడతాయి. ఈ ప్రక్రియలో మలినములు పైకి వచ్చినప్పుడు, నిర్మూలించబడతాయి. బంగారమును అగ్నిపై ఉంచినప్పుడు, దానిలో ఉన్న మలినములు కాలిపోయి, దాని యొక్క తేజస్సు పెరుగుతుంది. అదే విధంగా, ఋగ్వేదం ఈ విధంగా పేర్కొంటున్నది: ‘శరీరమును తపస్సుచే పవిత్రం చేయకుండా, మనిషి యోగములో అంతిమ స్థాయిని చేరుకోలేడు.’ శారీరక తపస్సును త్రికరణశుద్ధిగా అభ్యాసం చేస్తే, మానవులు తమ జీవితాన్ని, ప్రాపంచికత్వం నుండి భగవత్ పరంగా ఉన్నతంగా మార్చుకోగలరు. ఇటువంటి తపస్సనేది, ఆర్భాటం లేకుండా, సద్భావనతో, శాంతియుతంగా, గురువు, మరియు శాస్త్రముల ఉపదేశ ప్రకారంగా ఉండాలి.

శ్రీ కృష్ణుడు ఇటువంటి తపస్సును మూడు రకాలుగా వర్గీకరిస్తున్నాడు — శారీరిక తపస్సు, వాక్కు యొక్క తపస్సు, మరియు మనస్సు యొక్క తపస్సు. ఈ శ్లోకములో కృష్ణుడు శారీరక తపస్సును గురించి, వివరించాడు. ఎప్పుడైతే శరీరము పవిత్రమైన, సాధుపురుషుల సేవలో వినియోగించబడుతుందో, ఇంద్రియ భోగములూ, ప్రత్యేకంగా లైంగిక భోగములూ త్యజించబడినప్పుడు, అది శారీరక తపస్సని చెప్పబడుతుంది. ఇటువంటి తపస్సు, శౌచముతో, సరళముగా, మరియు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా చేయబడాలి. ఇక్కడ, ‘బ్రాహ్మణులు’ అంటే, ఏదో పుట్టుకతో తమను తాము బ్రాహ్మణులని అనుకునేవారు కాదు. సాత్త్విక గుణములు కలవారు అని అర్థం.

04:34 - అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ ।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే ।। 15 ।।

ఉద్వేగమును కలిగించనివీ, సత్యములూ, కోపము పుట్టించనివీ, ప్రయోజనకరమైనవీ అగు మాటలూ, మరియు నిత్య వేద శాస్త్రముల పఠనమూ - ఇవి వాక్కు సంబంధమైన తపస్సని చెప్పబడుతున్నది.

వాక్కు యొక్క తపస్సు అంటే, సత్యములైన వాటినే మాట్లాడటం, ఎదుటివారికి ఉద్వేగమును కలిగించనివి, వినేవారికి ప్రియముగా, మరియు ప్రయోజనకారిగా ఉండే మాటలు మాట్లాడటమే. వేద మంత్ర పారాయణ అభ్యాసము కూడా, వాక్కు సంబంధ తపస్సులోనే చెప్పబడినది.

05:15 - మనఃప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ।। 16 ।।

ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము, మరియు ఉద్దేశ్య పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సని పేర్కొనబడినాయి.

మనస్సు యొక్క తపస్సనేది, శరీరము, మరియు వాక్కు యొక్క తపస్సుల కంటే ఉన్నతమైనది. ఎందుకంటే, మనస్సును గెలువ గలిగితే, శరీరము, మరియు వాక్కు, వాటంతట అవే స్వాధీనంలోనికి వస్తాయి. కానీ, శరీరము, వాక్కులను గెలిస్తే, మనస్సు ఖచ్చితంగా నియంత్రణ లోనికి వచ్చినట్లు చెప్పలేము. నిజానికి, మనస్సు యొక్క స్థితియే, వ్యక్తి యొక్క స్థాయిని నిర్ణయిస్తుంది. మనస్సును ఒక పూదోటతో పోల్చవచ్చు. దానిని తెలివిగా సాగు చేసుకోవచ్చు, లేదా దానిని అలా విశృంఖలంగా వదిలేయవచ్చు. పండ్లు, పువ్వులు మరియు కూరగాయలు పండించుకోవటానికి, తోటమాలులు తమ నేలని సాగు చేస్తారు. అదే సమయంలో, వారు కలుపుమొక్కలు పెరగకుండా కూడా, జాగ్రత్త పడతారు. అదే విధంగా, మన స్వంత మనస్సుని ఉన్నత తలంపులతో, పవిత్రమైన భావాలతో నింపుకుంటూ, అదే సమయంలో ప్రతికూల, వినాశకర తలంపులను ఏరిపారేస్తూ ఉండాలి. ఒకవేళ మనం క్రోధపూరిత, ద్వేషపూరిత, దూషణభరిత, ప్రతీకారేచ్ఛతో కూడిన, విమర్శక, మరియు నిందించే తలంపులను మన మనస్సులో ఉండనిస్తే, అవి మన వ్యక్తిత్వం పైన తీవ్ర వినాశకర ప్రభావం చూపుతాయి. మనస్సును నియంత్రించటం నేర్చుకుని, దానిని క్రోధము, ద్వేషము, అయిష్టత వంటి వాటి నుండి ప్రభావితం కాకుండా చూసుకోనంతవరకూ, మన మనస్సు నుండి ప్రయోజనకారక పని ఏదీ మనకు లభించదు. భగవంతుని కృప మన హృదయములలో వ్యక్తమవ్వటాన్ని అడ్డుకునే కలుపుమొక్కలు ఇవే. జనులు వారి తలంపులు రహస్యమైనవనీ, అవి వారి మనస్సులోనే ఉంటూ, ఇతరులకు ఏమాత్రం తెలియనివి కాబట్టి, వాటికి ఎటువంటి బాహ్యమైన పరిణామం ఉండదని అనుకుంటారు. ఈ ఆలోచనలే, వారి యొక్క అంతర్గత స్వభావాన్నీ, బాహ్య వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయి. నీ ఆలోచనలను గమనించు. అవే నీ మాటలవుతాయి. నీ మాటలను గమనించు. అవే నీవు చేసే పనులవుతాయి. నీవు చేసే పనులను గమనించు. అవే నీ అలవాట్లవుతాయి. నీ అలవాట్లను గమనించు. అవే నీ వ్యక్తిత్వం అవుతాయి. నీ వ్యక్తిత్వాన్ని గమనించు. అదే నీ భవితవ్యము అవుతుంది. మన మనస్సులో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల ద్వేషభావ ఆలోచనతో, మనం మనకే హాని చేకూర్చుకుంటున్నామని మనం తెలుసుకోవటం, చాలా ముఖ్యం. అదే సమయంలో, ప్రతిఒక్క మంచి ఆలోచనతో, మనలను మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటాము.  మనలో ఉండే ప్రతి ఒక్క తలంపుకీ దాని పరిణామాలు ఉంటాయి. ఒక్కొక్క ఆలోచనతో మనం మన భవిష్యత్తును ఎంచుకుంటాము. ఈ కారణం చేత, మనస్సును చెడు, ప్రతికూల తలంపుల నుండి దూరం చేస్తూ, దానిని సద్భావనతో ఉన్న తలంపులలో ఉంచటం అనేది, మనస్సు యొక్క తపస్సని చెప్పబడుతుంది.

08:31 - ఇక మన తదుపరి వీడియోలో, రజో గుణ లక్షణాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History