సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి! Karma Siddhantha


మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే!

ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా, నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం!

రాముడు దండకారణ్యంలో 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహా పతివ్రత శాపం!

సత్య యుగంలో దేవాసుర సంగ్రామ సమయంలో, మృత సంజీవనీ మంత్ర బలంతో, చావు లేకుండా, దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుద ముట్టించడానికి, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి, వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుచుందా ఋషి పత్ని!

విధి లేక శ్రీమహావిష్ణువు, ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా, తన సుదర్శన చక్రంతో హతమార్చాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన మహా తపోధనుడైన ఆమె భర్త, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ, శ్రీమహావిష్ణువును శపించాడు. తన భార్యను హతమార్చి, తమకు పత్నీ వియోగం కల్పించినందుకు గాను, అతడు కూడా భార్యా వియోగంతో బాధపడాలని శపించాడు! అందుకే త్రేతాయుగంలోని రామావతారంలో, రాముని వనవాసానికి కైక, మందర లేదా దశరథుడు కారణం కాదనీ, వారు నిమిత్త మాత్రులనీ స్పష్టమౌతున్నది.

ఇక్కడ మనం గమనించ వలసినది, అవతార పురుషుడైన శ్రీరాముడికి కూడా కర్మానుభవం తప్పలేదు. అలాగే, రామునికి పట్టాభిషేకం నిర్ణయించినప్పుడు, రాత్రికి రాత్రి, అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో, కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళ్తున్న రాముడిని చూసి, లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.. "ముసలి తండ్రిని చంపి, రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారెవరైనా సరే, వారిని వధిస్తాను” అని అన్నాడు.

అప్పుడు రాముడు తమ్మునితో, “నాయనా! నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు, నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించి, ఇప్పుడు మౌనంగా ఉండటం, ఆయన తప్పు కాదు. అతి బలీయం, విధి విధానం! అది ఎంత బలవత్తరంగా ఉంటుందో ముందుగా తెలుసుకో. పైగా, నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పి ఉన్నారు. ఈ ప్రారబ్ద కర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు. కనుక కోపాన్ని తగ్గించుకుని, తండ్రి ఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణా!” అని అన్నాడు.

భగవద్గీతలో చెప్పిన "స్థితప్రజ్ఞత" అంటే ఇదే! కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడమే భావ్యం.." అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి.

భగవద్గీతలోని 18వ అధ్యాయం, 61వ శ్లోకంలో, “ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ, జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను!" అని గీతాచార్యుడు చెప్పినట్లుగా, సీతారాముల కష్టాలకు కారణం, వారి పూర్వ జన్మల కర్మలే అని మనము తెలుసుకోవాలి.

వారే కాదు.. భూమిపై జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతుడు కాడు. దానికి ఎవరినో బాధ్యులను చేయకూడదు. మనం కర్మలు చేయవలసిందే, ఆ కర్మల ఫలితం, సుఖమైనా, దుఃఖమైనా, ఇష్టమున్నా లేకున్నా, రాముడైనా, కృష్ణుడైనా, అనుభవించ వలసిందే.

చెట్టు చాటున దాక్కుని వాలిని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రాముడు, ద్వాపరయుగంలోని తన మరుజన్మ అయిన కృష్ణావతారంలో, అవతార పరిసమాప్తి సమయంలో, తన నిర్యాణం కోసం అదే బాణం దెబ్బకు ఒక వేటగాడి చేతిలో కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పలేదు.

మరో దృష్టాంతం.. ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయంతో బాటు, తమ కళ్ళ ముందు జరిగిన ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా, చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు కూడా, జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు. భారత మహాసంగ్రామంలో మిడతలలా మాడిపోయారు.

అలా అన్యాయం చేస్తున్న వారితో బాటు, సమర్థత ఉండీ, అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా, చూస్తూ మిన్నకుండి పోయినవాళ్లు కూడా అంతే పాపాత్ములుగా పరిగణించబడతారని మనం గుర్తెరగాలి. కనుకనే శిక్షకు పాత్రులవుతున్నారు. ఎంతటి ప్రజ్ఞా శాలియైనా, తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.

రామాయణ, భారత, భాగవతాలన్నీ, “సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి” అని బోధిస్తున్నాయన్న విషయం మనం గ్రహించాలి.

దేవుడు మనిషికి రెండు వరాలు అనుగ్రహించాడు. ఒకటి జ్ఞానం, రెండు మాట్లాడే ప్రతిభ. వీటిని తమ తమ జీవితాలలో, సత్ ప్రవర్తన, సత్ చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. ఉత్కృష్టమైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా.

పర పీడనం, పాపాన్నీ, తాపాన్నీ కలిగిస్తుంది. నవ్వులాటకైనా ఏ ప్రాణినీ హింసించ కూడదు. ఎందుకంటే, అన్ని శరీరాలలోనూ ఉన్నది పరమాత్మయే. అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ, అన్నీ గమనిస్తూ.. మనలోనే ఉంటూ, మన పాప పుణ్యాల కర్మలను లెక్క గడుతూ ఉన్నాడన్న సత్యాన్ని మరువ కూడదు.

ధర్మో రక్షతి రక్షితః!

Comments

Post a Comment

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka