3 Doors of Hell - 3 నరక ద్వారములు - Bhagavad Gita భగవద్గీత

 

3 నరక ద్వారములు!
చీకటి దిశగా ఉన్న ఆ మూడు ద్వారములు ఏవి? శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (21 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 21 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/XWs5w3_uIrU ]


ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారముల గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:49 - త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః ।
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్ ।। 21 ।।

ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు, మూడు ఉన్నాయి - కామము, క్రోధము, మరియు లోభము. కాబట్టి, అందరూ వీటిని విడిచిపెట్టాలి.

శ్రీ కృష్ణుడిక ఇప్పుడు, ఈ ఆసురీ స్వభావము యొక్క మూలకారణములను వివరిస్తున్నాడు. కామము అంటే కోరిక, క్రోధము అంటే కోపము, మరియు లోభము  అంటే దురాశ. ఈ మూడూ దీనికి కారణములని, సూటిగా చెబుతున్నాడు. కామము, క్రోధము, మరియు లోభము కలసి, ఆసురీ ప్రవృత్తి యొక్క మూలాధారములుగా ఉంటాయి. అవి మనస్సులో సలుపుతూ, పెరుగుతూ ఉండి, మిగతా అన్ని దుర్గుణములకూ పెరిగే అవకాశం ఇస్తాయి. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని, నరకమునకు ద్వారములని పేర్కొంటున్నాడు. అలాగే, ఆత్మ వినాశనం నుండి కాపాడుకోవటానికి, వాటిని దూరంగా ఉంచాలని గట్టిగా చెబుతున్నాడు. సంక్షేమం కోరుకునే వారు, వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే, వాటిని తమ వ్యక్తిత్వం నుండి దూరంగా ఉంచాలి.

02:03 - ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైః త్రిభిర్నరః ।
ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిమ్ ।। 22 ।।

చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు. తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు.

ఈ కామ క్రోధ లోభములను త్యజించటం వలన కలిగే ఫలితమును వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. ఇవి ఉన్నంతకాలం, వ్యక్తులు ప్రస్తుతానికి సుఖంగా అనిపించి, చివరకు చేదుగా ఉండే ఆనందము వైపుకు ఆకర్షించబడతారు. కానీ, భౌతిక పరమైన కోరికలు తగ్గిపోయినప్పుడూ, భౌతిక రజోగుణము నుండి స్వేచ్ఛను పొందిన తరువాతా, బుద్ధి ఈ మార్గంలో ఉండే అవివేకమును గమనించ గలుగుతుంది. ఆ తరువాత వ్యక్తి, శ్రేయస్సు వైపుకు తిరుగుతాడు. అంటే, ప్రస్తుతానికి కష్టముగా అనిపించినా, చివరకు మధురముగా ఉండే ఆనందము. ఈ శ్రేయస్సు వైపు ఆకర్షితమయ్యేవారికి, జ్ఞానోదయ మార్గము తెరుచుకుంటుంది. దానితో, తమ నిత్య శాశ్వత ఆత్మ సంక్షేమం కోసం పరిశ్రమిస్తారు. దాని వలన, పరమ లక్ష్యం దిశగా ముందుకెళతారు.

03:14 - యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః ।
న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్ ।। 23 ।।

ఎవరైతే శాస్త్రములలో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరకు జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.

శాస్త్రములనేవి, మానవులకు జ్ఞానోదయ దిశలో ప్రయాణించటానికి ఇవ్వబడిన మార్గదర్శక పటముల వంటివి. అవి మనకు జ్ఞానమునూ, మరియు అవగాహననూ అందిస్తాయి. అవి మనకు, ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదనే ఉపదేశాలను కూడా అందజేస్తాయి. ఈ ఉపదేశములు రెండు రకాలుగా ఉంటాయి - విధి మరియు నిషేధము. కొన్ని చేయవలసిన కార్యములను చెప్పే వాటిని, ''విధి'' అంటారు. చేయకూడని పనులను చెప్పే వివరణను, ''నిషేధం'' అంటారు. ఈ రెండు ఉపదేశములనూ శ్రద్ధతో పాటించటం ద్వారా, మానవులు పరిపూర్ణతను సాధించవచ్చు. కానీ, ఆసురీ గుణములు కలవారు, శాస్త్ర ఉపదేశములకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు. నిషేధింపబడిన పనులను చేస్తూ, చేయవలసిన విధులను విస్మరిస్తూ ఉంటారు. ఇటువంటి జనులను ఉదహరిస్తూ, శ్రీ కృష్ణుడు - కామ ప్రేరణచే మోహితులై, ఎవరైతే అనుమతింపబడిన మార్గమును త్యజించి, తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తారో, వారు యదార్థమైన జ్ఞానమునూ, పరిపూర్ణ ఆనంద సిద్ధినీ, మరియు భౌతిక బంధనము నుండి విముక్తిని కూడా పొందలేరని అంటున్నాడు.

04:49 - తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యవ్యవస్థితౌ ।
జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి ।। 24 ।।

కాబట్టి, ఏది చేయాలి, ఏది చేయకూడదన్న విషయంలో, శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధివిధానాలనూ, ఉపదేశాలనూ తెలుసుకొనుము, మరియు ఆ విధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము.

శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు, ఈ అధ్యాయము లోని తన ఉపదేశము యొక్క అంతిమ ముగింపును ఇక్కడ ప్రకటిస్తున్నాడు. దైవీ మరియు ఆసురీ గుణములను పోల్చిచూపి, తేడాలను వివరించిన పిదప, ఆసురీ గుణములు ఏ విధంగా నరక లోకాలకు దారి తీస్తాయో వివరించాడు. ఈ విధంగా, శాస్త్ర విధివిధానములను తిరస్కరిస్తే, మనకు వచ్చే లాభం ఏమీ లేదని, ధృవీకరించాడు. ఇప్పుడు ఏదైనా కార్యము యొక్క ఔచిత్యం, అంటే, మంచో చెడో నిర్ణయించాలన్నా, వేద శాస్త్రములే ప్రమాణములని, గట్టిగా చెబుతున్నాడు. కొన్ని సార్లు మంచి ఉద్దేశ్యంతో ఉన్నవారు కూడా, ‘నేను ఏ నియమాలనూ పాటించను. నా మనస్సు చెప్పినట్టే వింటాను, నాకు నచ్చినట్లే చేస్తాను’ అని అంటుంటారు. మనస్సు చెప్పినట్టు అనుసరించటం మంచిదే అనుకున్నా, వారి మనస్సు వారిని తప్పుదోవ పట్టించటం లేదన్న గ్యారంటీ లేదుగా? ఇలా ఒక నానుడిలో చెప్పినట్టు, ‘నరకానికి మార్గం మంచి భావాలతోనే వేయబడి ఉంటుంది..’ అందుకే, మన మనస్సు మనలను సరియైన దిశలోనే తీసుకువెళుతున్నదా, లేదా అనేదానిని, శాస్త్రములతో పరీక్షించి, సరిచూసుకోవాలి. భూత, వర్తమాన, భవిష్యత్తులలో, ఏ ఆధ్యాత్మిక సూత్రము యొక్క ప్రామాణికత అయినా, వేదము ఆధారంగానే నిర్ణయింపబడాలి. కాబట్టి, శాస్త్రముల ఉపదేశం అర్థం చేసుకుని, తద్విధముగానే నడుచుకొమ్మని అర్జునుడికి చెబుతూ, ఈ అధ్యాయమును ముగిస్తున్నాడు, శ్రీ కృష్ణ భాగవానుడు.

ఓం తత్సదితి శ్రీ మద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం, యోగ శాస్త్రే శ్రీ కృష్ణార్జునసంవాదే, దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోధ్యాయ:

శ్రీ మద్భగవద్గీతలోని జ్ఞానషట్కం, పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగంలోని, 24 శ్లోకాలూ సంపూర్ణం.

07:08 - ఇక మన తదుపరి వీడియోలో, పదిహేడవ అధ్యాయం, శ్రద్ధా త్రయ విభాగ యోగములో, శ్రీ కృష్ణుడు విశదపరిచిన నిగూఢార్థాలను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur