The Asteroid That Became a Goddess: Unbelievable Facts of Mridangasaileshwari Temple | మృదంగశైలేశ్వరి!


శ్రీ మృదంగశైలేశ్వరీ దేవి!
ఓ క్రిష్టియన్ పోలీస్ ఆఫీసర్ చెప్పిన నమ్మలేని నిజాలు!

మన సనాతన భారతావని ఎన్నో అద్భుతాలకూ, ఆధునిక సాంకేతికతకు సైతం అంతు చిక్కని దైవీక శక్తులకు సాక్షీభూతం. భారత దేశం అంటే ధర్మం పుట్టిన దేశమనీ, దైవం నడయాడిన ప్రదేశమనీ, చరిత్ర ఎంతో ఘనంగా చెబుతుంది. కానీ ఈనాడు చాలా మందికి దైవం ఉనికిపైనే ఎన్నో సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఒక విధంగా, కొందరు పుట్టించారని చెప్పుకోవచ్చు. అటువంటి సందేహాలకు సమాధానంగా, తన ఉనికిని ప్రపంచానికి చాటి చెబుతున్న దివ్యమైన శక్తి క్షేత్రం ఒకటి కేరళలో ఉంది. ఆ ఆలయంలో 4 సార్లు దొంగతనం జరిగినా, ఏ ఒక్కరూ అక్కడున్న ప్రధాన మూర్తిని తీసుకెళ్లలేకపోయారు. ఆ దైవ శక్తి ఎలా ఉంటుందో చూపిన క్షేత్రం ఇదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఈ విషయాలు చెప్పింది ఒక పూజారో, లేక ఓ హిందుత్వవాదో కాదు.. ఒకప్పుడు ఆ ఏరియాలో DSP గా, SP గా, DIG గా పని చేసి, కేరళ DGP గా రిటైర్ అయిన ఒక కిరాస్తానీయుడు. ఈ మాటలు వినగానే, ఇంతకీ ఆ ఆలాయం ఎక్కడుంది..? ఆ ఆలయంలో ఉన్న ప్రధాన మూర్తిని దొంగలు ఎందుకని ఎత్తుకెళ్ళలేకపోయారు..? పక్కా సాక్ష్యాలు లేనిదే సొంతవారిని కూడా నమ్మని ఒక పోలీస్ ఆఫీసర్, అందులోనూ పరమతస్థుడు చెబుతున్న ఆ శక్తి విశేషాలేమిటి..? అసలు ఆ ఆలయం పుట్టు పూర్వోత్తరాలేమిటి..? అనే సందేహాలు కలగడం సహజం. మరి ఆ వివరాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసం వీడియో లింక్: https://youtu.be/xa0P6O_vBIs ]


మన భారత దేశం ఎన్నో దివ్యమైన శక్తి క్షేత్రాలకు నిలయం. అటువంటి మహా శక్తివంతమైన క్షేత్రాలలో, మృదంగశైలేశ్వరి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం, కేరళలోని కన్నూర్ జిల్లాలో గల Muzhakunnu అనే ఊరికి సమీపంలో ఉంది. అసలు మృదంగశైలేశ్వరి ఆలయంలో ఏం జరిగిందో తెలుసుకునే ముందు, ఆ క్షేత్రం యొక్క చరిత్ర, విశిష్ఠత గురించి ముందుగా తెలుసుకోవాలి. మన పురాణాల ప్రకారం, విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు, 108 దివ్య దుర్గాలయాలను నిర్మించాడని తెలుస్తోంది. ఆ 108 ఆలయాలలో ఒకటే, ఈ మృదంగశైలేశ్వరి ఆలయం. ఒకానొక సమయంలో Kannur దగ్గరలో ఉన్న పర్వతాలపై తపస్సు చేసుకుంటున్న పరశురాముడు, అంతరీక్షం నుంచి ఏదో శక్తివంతమైన వస్తువు ఒకటి దగ్గరలో పడడం గ్రహించి దాని కోసం వెతకగా, ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలోనే ఆ దివ్య శిల ఆయనకు దొరికింది. అది అచ్చంగా సంగీత ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే మృదంగ వాయిద్యం ఆకారంలో కనిపించింది. వెంటనే పరశురాముడు తన తపోశక్తితో, ఆ విగ్రహంలో సర్వస్వతి, లక్ష్మీ, కాళీ మాతల శక్తులను ఆవాహన జేసి, ప్రసన్న వదనంతో వెలిగిపోతున్న దుర్గా మాత విగ్రహాన్ని మలచి, అక్కడ ప్రతిష్టించాడు. పరశురాముడే స్వయంగా ఆ విగ్రహానికి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు చేసి, మృదంగశైలేశ్వరీ మాతగా కొలిచాడని, ఆలయ చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం మనకు కనిపించే ఆలయాన్ని నిర్మించి 500 ఏళ్లు అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అంతరీక్షం నుంచి మృదంగ శిల పడిన గోతిని ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు.

ఇదిలా ఉంటే, తాంత్రిక శక్తి సాధనకు ఆలవాలమైన కేరళ రాష్ట్రంలో ఆనాడు మృదంగశైలేశ్వరీ మాత విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో, సాక్షాత్తూ పరశురాముడే కట్టు దిట్టమైన తాంత్రిక మంత్రబలంతో ప్రతిష్టించాడనీ, అందుకే అక్కడి అమ్మవారిని చూస్తే, ఎదురుగా మన ముందు ఎవరో వున్న అనుభూతిని పొందుతామనీ, అమ్మవారిని ప్రత్యక్షంగా దర్శించిన వారు చెబుతారు. అంతేకాకుండా, మృదంగశైలేశ్వరీ అమ్మవారు సరస్వతీ స్వరూపం కావడం చేత, సంగీత కళాకారులూ, చదువులో వెనుకబడిన పిల్లలూ, బుద్ధి మాంద్యం ఉన్న పిల్లలూ ఆ తల్లిని దర్శించి పూజిస్తే, వారిలోని బుద్ధి మాంద్యం తొలగిపోయి, వారికి ఖచ్చితంగా జ్ఞానం పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, భారతీయ నృత్యకళలలో ఒకటిగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాట్యమైన కథాకళి, ఈ మృదంగశైలేశ్వరీ ఆలయంలోనే పురుడు పోసుకున్నదని తెలుస్తోంది.

అయితే, ఇంతటి ఘన కీర్తినొందిన ఆలయాన్ని గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం, ఒకప్పుడు కేరళ రాష్ట్రంలో DGP గా పనిచేసి రిటైర్ అయిన Alexander Jacob అనే వ్యక్తి ఇచ్చిన ఓ interview వల్లనే అని చెప్పాలి. ఆయన తన జీవితంలో చూసిన కొన్ని ప్రత్యేకమైన కేసుల గురించి చెబుతున్న క్రమంలో, మొదటి సారి మృదంగశైలేశ్వరీ ఆలయంలోని ప్రధాన మూర్తిని 4 సార్లు దొంగలించే ప్రయత్నం చేసిన వైనం, ఎవరూ ఊహించని విధంగా మళ్ళీ ఆ విగ్రహం ఆలయానికి తిరిగి చేరిన తీరు, వివరంగా చెప్పారు.

Alexander Jacob చెప్పిన వివరాల ప్రకారం, 1979లో తొలిసారి, కేరళకు చెందిన ఒక దొంగలముఠా, మృదంగశైలేశ్వరీ అమ్మవారి విగ్రహాన్ని దొంగలించింది. దాదాపు మూడున్నర అడుగుల పొడవు ఉండే ఆ విగ్రహం, పంచ లోహాలవంటి లోహంతో తయారైన అత్యంత పురాతనమైన విగ్రహం. ఆ కాలంలోనే మన దేశంలో ఆ విగ్రహం విలువ దాదాపు కోటి నుంచి రెండు కోట్ల మధ్యలో ఉండిందనీ, ఒకవేళ విదేశాలలో అమ్మగలిగితే, ఆ విగ్రహం విలువ మరింత ఎక్కువగా ఉందవచ్చనీ నాటి పోలీసులు లెక్కగట్టారు. అందుకే దొంగలు ఆ విగ్రహాన్ని దొంగిలించడానికి ప్రయత్నించారని, Jacob చెప్పారు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దొంగతనం చేసినతరువత దాదాపు 200 అడుగుల దూరంలో ఆపి ఉంచిన తమ వాహనం దాకా కూడా దొంగలు విగ్రహాన్ని తీసుకెళ్లలేకపోయారు. దాంతో ఆ విగ్రహాన్ని మధ్యలోనే వదిలేసి పారిపోయారు. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఆ విగ్రహాన్ని దొంగలు ఎక్కడయితే భయపడి వదిలి పారిపోయారో, అక్కడ మనుషుల మల మూత్రాలు కనిపించాయి పోలీసులకు. ఇదిలా ఉంటే, విగ్రహం దొరికిన తరువాత పూజారులు మళ్ళీ శాస్త్రోక్తంగా, మంత్ర సహితంగా అమ్మవారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారు.

ఆ తర్వాత 1983లో మరోసారి మృదంగశైలేశ్వరీ అమ్మవారి విగ్రహాన్ని దొంగలించడానికి ప్రయత్నం జరిగింది. అయితే ఈసారి స్థానిక దొంగల ముఠా కాకుండా, తమిళనాడు నుంచి వచ్చిన ఓ కొత్త ముఠా ప్రయత్నించింది. ఎటువంటి సెక్యూరిటీ ఉండని ఆ ఆలయాంలోకి వారు సులువుగా చొరబడి, అక్కడి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని, ఈసారి కొంత దూరం వెళ్లి పోయారు. దాంతో చరిత్రలో తొలిసారి ఇంచుమించు 40 రోజుల పాటు అమ్మవారి విగ్రహం ఆలయానికి దూరంగా వుంది. ఆ సమయంలో ఒక సాధువు ఎక్కడి నుంచో వచ్చి, 43వ రోజున అమ్మవారు ఆలయానికి తిరిగి చెరతారని చెప్పాడు.

అలా అమ్మవారి విగ్రహం దొంగలించబడిన తరువాత, హఠాత్తుగా వచ్చిన సాధువు చెప్పినట్లుగానే, దొంగతనం జరిగిన 41వ రోజున, కేరళ, తమిళనాడు బోర్డర్ లోని Palakkad జిల్లా ప్రధాన పోలీస్ స్టేషన్ నుంచి, విగ్రహానికి సంబంధించిన ఒక సమాచారం కేరళ పోలీసులకు అందింది. ఆ వివరాల ప్రకారం, తాము Palakkad, Coimbatore హైవే పక్కన ఒక విగ్రహాన్ని కనుగొన్నామనీ, దాని పక్కన ఒక ఉత్తరం కూడా లభించిందనీ తెలిసింది. ఆ ఉత్తరం ప్రకారం ఆ విగ్రహం మృదంగశైలేశ్వరీ ఆలయంలోని ప్రధాన మూర్తి అనీ, వెంటనే ఈ విగ్రహాన్ని తిరిగి ఆలయానికి చేర్చమనీ రాసి ఉంచారు. అందుకే ఎవరికైనా అటువంటి విగ్రహం పోయిందనే కంప్లైంట్ వస్తే, వెంటనే Palakkad ప్రధాన పోలీస్ స్టేషన్ కి వచ్చి తీసుకువెళ్లాల్సిందిగా కేరళ పోలీసులకు తెలియజేశారు. ఆ సమయంలో Palakkad ప్రధాన పోలీస్ స్టేషన్ లోని వారెవరికీ మృదంగశైలేశ్వరీ అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలియకపోవడంతో, వారు కేరళలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ అలా వైర్లెస్ మెసేజ్ పంపారు.

దాంతో Alexander Jacob తన సహచర బృందంతో కలిసి Palakkad పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా, అక్కడ జరిగింది చూసి తాము ఆశ్చర్యపోయినట్లు, ఆయన ఇంటర్వ్యూ లో చెప్పారు. విగ్రహం ఆ పోలీస్ స్టేషన్ కి చేరిన క్షణం నుంచీ అక్కడి సిబ్బందీ, అక్కడికి వచ్చిన విజిటర్స్, నేరస్తులు, ఇలా అంతా కలిసి ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెట్టారు. ఆ ప్రాంతంలోని పూజారిని కూడా తీసుకువచ్చి పూజలు చేయించారు. అలా వారికే తెలియకుండా ఆ పోలీస్ స్టేషన్ ఒక అమ్మవారి ఆలయంగా మారిపోయింది. అలా మునుపెన్నడూ కేరళ పోలీస్ స్టేషన్ల చరిత్రలో జరగలేదని, Jacob ఆ సంఘటన గురించి విస్మయంతో తెలియజేశారు. ఆ తర్వాత Muzhakunnu నుంచి కొంతమంది పూజారులూ, గ్రామ ప్రజలూ వచ్చి, ఎంతో వైభవంగా అమ్మవారిని రథం మీద కూర్చోబెట్టి ఆలయానికి తీసుకువెళ్ళి, వేద మంత్రోచ్చారణల మధ్య మృదంగశైలేశ్వరీ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, ఆ రథాన్ని ఏర్పాటు చేసింది Palakkad జిల్లా పోలీసులే. అంతేకాకుండా అమ్మవారి విగ్రహం తిరిగి ఆలయం చేరేవరకు రక్షణగా కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఆనాడు సాధువు చెప్పినట్లుగానే, అమ్మవారు సరిగ్గా 43వ రోజునే ఆలయానికి తిరగి రావడం ఒక విచిత్రమని Jacob తెలియజేశారు.

ఇక మూడవ సారి, కర్ణాటక నుంచి వచ్చిన మరో ముఠా మళ్ళీ మృదంగశైలేశ్వరీ అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించారు. వారు ఆ తల్లి విగ్రహాన్ని తీసుకుని కర్ణాటక వైపు ప్రయాణిస్తూ, Wayanad ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సారి దొంగతనం జరిగిన 72 గంటల వరకు, అమ్మవారి విగ్రహం ఎటు వైపు తీసుకువెళ్లారనే సమాచారం పోలీసులకు లభించలేదు. అయితే 4వ రోజు సాయంత్రం, దొంగలు స్వయంగా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, తాము అమ్మవారి విగ్రహాన్ని ఫలానా లాడ్జ్ లో, ఫలానా రూమ్ నెంబర్ గదిలో విడిచి వెళ్తున్నామని తెలియజేశారు. దాంతో Muzhakunnu నుంచి ఓ పోలీస్ బృందం అక్కడికి చేరుకుని, ఆ తల్లి విగ్రహాన్ని రికవర్ చేసుకున్నారు. అమ్మవారికి పూజలు చేసి, ఒక రథంపై మళ్ళీ ఆలయానికి తిరగి తీసుకువచ్చారు.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు విగ్రహాలను దొంగతనం చేసే ఆ మూడు ముఠాలనూ కేరళ పోలీసులు బంధించగా, విచారణలో వారు ఎవరికీ నమ్మశక్యం కానీ కొన్ని వాస్తవాలను బయటపెట్టారు. అమ్మవారి విగ్రహం దొంగతనం చేసిన క్షణం నుంచీ తాము ఎటువెళుతున్నామో కూడా తెలియని అయోమయ స్థితిలో పడిపోయామనీ, చాలా సేపు తిరిగిన చోటే తిరుగుతూ ఉండిపోయామనీ చెప్పారు. దిక్కు తోచని పరిస్థితిలో మనస్సంతా ఏదో తెలియని భయం అవహించి, మానసికంగా క్రుంగిపోయామనీ చెప్పారు. అంతేకాదు, ఆ విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకున్న మారు క్షణం నుంచీ తమకు తెలియకుండానే మలమూత్ర విసర్జన జరిగిపోయిందనీ చెప్పారు. తమిళనాడుకు తీసుకువెళ్తున్న దొంగలు తమకు తెలియకుండానే ట్యాక్సీలో మలమూత్రాలు విసర్జించడంతో, డ్రైవర్ తమను తిట్టి కిందకి దించేశాడనీ చెప్పారు. అప్పటికే మానసికంగా క్రుంగిపోయి వున్న తమను ట్యాక్సీ డ్రైవర్ దారి మధ్యలోనే దింపేయడంతో, తాము కేరళ బోర్డర్ కూడా దాటలేక, ఆ హైవే పక్కనే విగ్రహాన్ని వదిలి పరారయ్యామని చెప్పారు.

ఇదిలా ఉండగా, ఈ సంఘటన జరిగిన మరికొద్ది రోజులకు, అదే కేరళకు చెందిన మరో ముఠా అమ్మవారి విగ్రహాన్ని దొంగలించడానికి ప్రయత్నించింది. ఈ సారి వారు ఆలయం నుంచి కనీసం 200 మీటర్లు కూడా వెళ్లలేక, విగ్రహాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్ళి చూసిన వారికి, అమ్మవారి విగ్రహ పరిసరాలలో గతంలో జరిగినట్లే మనుషుల మలమూత్రాలు కనిపించాయి. కొద్ది రోజుల తరువాత ఈ ముఠా కూడా పోలీసులకు దొరకిపోయి, తాము ముస్లిం మతానికి చెందిన వ్యక్తులమనీ, ఈ అమ్మవారి గురించి విన్నా అది తాము పట్టించుకోలేదనీ, విగ్రహాన్ని దొంగిలించిన క్షణంనుంచీ తమ బుద్ధి తమ చెప్పుచేతలలో లేకుండా పోయిందనీ, మొదటి మూడు ముఠాల దొంగలు ఏదైతే చెప్పారో, అదే విధమైన అనుభవాన్ని తాము ఎదుర్కొన్నామని చెప్పినట్లు, ఒక క్రిష్టియన్ అయ్యుండి, అమ్మవారి శక్తిని ప్రత్యక్షంగా చూశాక, తాను కూడా ఆ తల్లిని పూజించడం మొదలుపెట్టానని, Alexander Jacob తెలియజేశారు. ఇక్కడ మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఈ నాటికీ మృదంగశైలేశ్వరీ అమ్మవారి ఆలయానికి పోలీస్ రక్షణ ఉండదనీ, చాలా సార్లు రక్షణ ఏర్పాట్లు చేసుకోమని పోలీసులు హెచ్చరించినా, ఆలయ పూజారులూ, స్థానికులూ దానికి అభ్యంతరం వెలిబుచ్చారనీ తెలుస్తోంది. అమ్మవారు ఎక్కడికీ పొరనీ, ఎవరు తస్కరించి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేసినా తిరిగి తీసుకువచ్చి అప్పగిస్తారనీ, Alexander Jacob అదే interview లో తెలియజేశారు.

ॐ శ్రీమాత్రే నమః

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas