ఆనాడు రాముడు చేసినపని ధర్మబద్ధమేనా? Killing Vali: Rama's Confession


ఆనాడు రాముడు చేసినపని ధర్మబద్ధమేనా?
రాముడు చేసిన తప్పు ద్వాపర యుగంలో శాపంగా మారిందా?

మన పురాణాలనుంచి మనం నేర్చుకోవలసిన ధర్మసూక్ష్మాలు కోకొల్లలు. రామాయణంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన వారు, ఇంద్ర, సూర్య తనయులైన వాలి, సుగ్రీవుల గురించి. వానర జాతిలో మహా బలవంతులూ, పరాక్రమవంతులుగా పేరుగడించిన ఆ సోదరులు, చివరకు శత్రువులయ్యారు. ప్రతిదినమూ బ్రహ్మ ముహుర్తంలోనే నిద్దురలేచి, నాలుగు సముద్రములకు వెళ్లి, సంధ్యోపాసన గావించేవాడు వాలి. పర్వతాల పైకెక్కి, వాటి శిఖరములను కూల్చి, వాటితో బంతాట ఆడుకునేవాడు. పది తలల రావణుడిని మూడు మార్లు ఓడించిన వీరుడు. అంతటి బలవంతుడైన వాలిని, రాముడు చెట్టు చాటు నుండి అంతమొందించడానికి అసలు కారణం, అతని బలమా, గుణమా? రాముడు వాలిని చంపడం ధర్మబద్ధంగానే జరిగిందా - వంటి ధర్మాధర్మ వితార్కానికి గురిజేసే ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/9LXSsYA2RbE ]


వాలి, సుగ్రీవుల యుద్ధంలో, కొన ప్రాణాలతో వున్న వాలిని సమీపించారు రామలక్ష్మణులు. వారిని చూడగానే, పరుష పదములతో నిందించాడు వాలి. ‘‘నీతోయుద్ధము చేయలేదు. ఇంకొకరితో యుద్ధము చేసేటప్పుడు నన్ను చంపి, నీవు ఏమి సాధించావు? నీ గురించి నా భార్య తార హెచ్చరించినప్పుడు, రాముడు సత్కులమున పుట్టినవాడు. బలశాలి, తేజస్సుగలవాడు, నియమవర్తనుడు, కరుణామయుడు, ప్రజాహితము కోరువాడు, హృదయములో జాలినిండినవాడు, సమయాసమయములు తెలిసినవాడు, నియమము పాటించుటలో స్థిరమైనవాడని నీ గురించి తెలిపి, నీ వలన భయములేదని చెప్పి, యుద్ధానికి వచ్చాను. రామా, ఎందుకీ కార్యానికి ఒడిగట్టావు? యుద్ధరంగానికి వచ్చినప్పుడు, నాకు నీవు కనబడలేదు. అప్పుడు నా మనస్సులో ఒకటే భావము మెదిలింది. ఇంకొకరితో యుద్ధము చేసేటప్పుడు, నీవు కీడు చేయవని. అలాంటి నా నమ్మకము వమ్ము అయినదిగదా రాఘవా! అప్పుడు తెలియలేదు. నీవు నిదురిస్తున్న వానిని కాటేసే పామువని. గడ్డి కప్పిన నుయ్యివంటి వాడవని. ఇంత అధార్మికుడు, దశరథ పుత్రుడెలా అవుతాడు? రామా, నీవు నరుడవు. నేను అడవిలో కాయకసరులు తిను వానరుడను. ఎవరినైనా చంపటానికి, వాడి భూమి, బంగారము, సంపద, కారణములు. నీకు నా భూమి అయిన అడవిమీద, నేను తినే ఫలములమీద ఆశ ఏమిటి? రామా, నా చర్మము నీవు ధరించ యోగ్యమయినది కాదు. నా మాంసము నీవు భుజించదగినదీ కాదు. మరి ఎందుకు ఇటువంటి అఘాయిత్యానికి పూనుకున్నావు?

నా భార్య మాటను పెడచెవిన పెట్టి, యముడికి వశుడనైనాను. నాతో ఎదురుపడి యుద్ధము చేసి ఉంటే, ఈ పాటికి నీవు యమధర్మరాజును కలుసుకుని ఉండేవాడివి. అయినా, సుగ్రీవునకు ప్రియము చేయదలచి, ఏ కార్యము కొరకై నన్ను చంపావో, ఆ కార్యము నిమిత్తము, నన్నే నీవు ముందే ప్రేరేపించి వుండవచ్చును కదా! నీ భార్యను అపహరించిన రావణుని చంపకుండా, మెడకు తాడుకట్టి, లాగుకుని వచ్చి, నీ ముందు పడవేసి వుండే వాడిని. అది పాతాళమయినా, లేక సముద్రగర్భమైనా, ఎక్కడ దాచినా, నీ సీతను కనుగొని, తీసుకు వచ్చి నీకు భద్రముగా అప్పచెప్పేవాడిని. నా మరణానంతరము, సుగ్రీవుడు రాజ్యమును చేపట్టడం, ధర్మమే.  కానీ, ఈ విధముగా నన్ను నీవు చంపడం మాత్రము, ధర్మము కాదు. నీవు చేసిన పని ఎలా ధర్మమవుతుందో చెప్పగలవా?’’ అని ప్రశ్నించాడు వాలి.

ఆ మాటలకు కాస్త కలత చెందిన రామచంద్రుడు ఇలా అన్నాడు.. ‘‘ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును. నేను వేట మిష మీద నిన్ను చంపలేదు.. కనుక భక్ష్యాభక్ష్య విచికిత్స అనవసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. లోకమర్యాదనూ, ధర్మమునూ తెలుసుకోకుండా, అజ్ఞానముతో నిందించడం తగదు. ఈ భూమి అంతా ఇక్ష్వాకులకు చెందినది. ఈ భూమిని ఇప్పుడు పాలించే రాజు భరతుడు. ఆ భరతుడి ప్రతినిధులము మేము. ధర్మము అవిచ్ఛిన్నముగా ఉండకుండా చూడడమే, మా కర్తవ్యము. ధర్మము అతిక్రమించిన వారిని శిక్షించుట కూడా, మా కర్తవ్యములో భాగమే. నీవు రాజధర్మమును అనుసరించ లేదు. హీనమైన, నింద్యమైన కర్మ చేశావు. కామభోగాలకే ప్రాధాన్యమిచ్చావు. అన్నగారూ, కన్నతండ్రీ, విద్యనేర్పిన గురువు, వీరు ముగ్గురూ తండ్రులని కదా, శాస్త్రము చెబుతున్నది. అదే విధంగా, తమ్ముడూ, కుమారుడూ, శిష్యుడూ, వీరు ముగ్గురూ కూడా కుమారులే.

వాలీ, ధర్మము చాలా సూక్ష్మమైనది. నేను నిన్ను ఎందుకు చంపాను అని కదా నీ ప్రశ్న. రుమ సుగ్రీవుని భార్య. సుగ్రీవుడు నీకు తమ్ముడు. అనగా కొడుకుతో సమానము. అనగా రుమ నీకు కోడలివంటిది. అట్టి రుమను కామించి, చెరపట్టి భోగించి, ధర్మమును అతిక్రమించినావు. ఏ మానవుడు కామమోహితుడై కుమార్తెను గానీ, సోదరిని కానీ, సోదరుడి భార్యను కానీ పొందునో, అతనికి శిక్ష మరణదండనే. రాజ్యము, భార్యా నిమిత్తమై, సుగ్రీవునితో నాకు ఏర్పడిన సఖ్యము వలన, అతడు నాకు లక్ష్మణ సమానుడు. అతని మంత్రులైన వానరుల సమక్షములో నిన్ను వధించి, అతనిని రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తానని, ప్రతిజ్ఞ చేశాను. నీవే కదా అన్నావు.. మేము శాఖామృగములని! క్రూర మృగములను వేటాడునప్పుడు, వలలు పన్ని, ఉచ్చులు బిగించి, చెట్టు చాటునుండి రహస్యముగా వేటాడుట ధర్మమేకదా! నీవు శాఖా మృగము కావున, నీతో యుద్ధము చేయకుండా, బాణముచేత నిహతుని గావించాను. నీవు యుద్ధము చేసినా, చేయకున్నా, శాఖా మృగమువే! వానరుడవే.

కావున ఆ విధముగా కొట్టాను. వాలీ, నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు, రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కానీ, నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే, మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే, పితృ ద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా, నిన్ను రక్షించాను. ఇకనైనా జరిగిన ధర్మకార్యాన్ని తెలుసుకుని, చిత్త క్షోభను వర్జించి, శాంతిని పొందు.’’ అని రాముడు వాలికి ధర్మాన్ని బోధించాడు.

అప్పుడు వాలి రాముడు చేసిన పని ధర్మబద్ధమే అని గ్రహించి, ఆయనలో దోషమేమీ లేదని తెలుసుకుని, ఆయనకు అంజలి ఘటించి, తన చివరి కోరికను విన్నవించుకున్నాడు. ‘‘రామా, నీవు చెప్పినదంతా సత్యమే. సందేహము లేదు. నేను దేహము విడచినా, నాకు ఏ చింతా లేదు. కానీ, నా కుమారుడు అంగదుని గూర్చే విచారము. నేను కనపడక పోయినట్లయితే, అంగదుడు నీరసుడైపోతాడు. తారాపుత్రుడైన అంగదుడు, నా ఏకైక కుమారుడు. అతని రక్షణబాధ్యత నీవు వహించాలి. రామా, నా మీద కోపంతో, తారను సుగ్రీవుడు అవమానించకుండా, హింసించకుండా, నీవే బాధ్యత తీసుకోవాలి’’ అని తన వాంఛను వెల్లడించాడు వాలి. భార్యా పుత్రుల విషయమై బాధపడుతున్న వాలిని చూసి శ్రీరాముడు, “ఓ వాలీ, నీవు తారా అంగదుల విషయములో దుఃఖించవలదు. ధర్మానుసారముగా ఏది జరుగవలెనో, అది జరుగగలదు. సుగ్రీవుడు రాజుగా, అంగదుడు యువరాజుగా, రాజ్యాన్ని పాలిస్తాడు” అని అభయమిచ్చాడు రామచంద్రుడు.

భగవంతుడైనా, మానవ రూపంలో ఈ భువిపై అవతరించినప్పుడు, కాలానికి అనుగుణంగా, చేసిన చర్యకు ప్రతిచర్యను అనుభవింపక తప్పదు. త్రేతాయుగంలో రాముడు మృగయా ధర్మమున, వెనుక నుండి బాణం వేసి, వాలిని హతమార్చాడు. ఇక ద్వాపర యుగంలో, సాంబుడి కడుపులో పుట్టిన ముసలం కారణంగా, యదు వంశం మొత్తం నాశనమైపోగా, ఆ ముసలాన్ని అరగదీయగా మిగిలిన ముక్క, ఒక బోయవానికి దొరికింది. దానితో ఆ బోయవాడు, జంతువులను వేటాడేందుకు ఒక బాణాన్ని తయారుచేశాడు. ఒకనాడు వేటకు వెళ్ళిన బోయవాడు, చెట్టు వెనుక ఏదో జంతువు ఉందనుకుని, బాణాన్ని ప్రయోగించాడు. అవతార పరిసమాప్తి కోసం, ఒంటరిగా అరణ్యంలోకి వచ్చిన శ్రీ కృష్ణుడి పాదానికి తగిలింది, ఆ బాణం. శ్రీ కృష్ణుడి నిర్యాణానికి కారణమైన ఆ బోయవాడే, త్రేతాయుగంలో రాముడి చేతిలో మరణించిన వాలి అని, కొన్ని కథనాలు ప్రస్ఫుటం చేస్తున్నాయి.

ధర్మో రక్షతి రక్షితః

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur