ఆకర్షణ! భగవద్గీత Bhagavadgita Chapter 14


ఆకర్షణ! స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచేది ఏది?

'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (09 – 13 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 09 నుండి 13 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MBDgoVEZ_08 ]


సత్త్వ, తమః, రజో గుణముల లక్షణాలను, ఈ విధంగా తెలియజేస్తున్నాడు భగవానుడు..

00:48 - సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ।
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ।। 9 ।।

సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము, జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తిని కలిగిస్తుంది; తమో గుణము, జ్ఞానమును కప్పివేసి, వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది.

సత్త్వ గుణములో భౌతిక జీవన క్లేశములు తగ్గుతాయి, మరియు ప్రాపంచిక కోరికలు తగ్గుముఖం పడతాయి. ఇది వ్యక్తి యొక్క స్థితిలో, ఒకలాంటి సంతుష్టిని కలుగచేస్తుంది. ఇది మంచిదే.. కానీ, దీనితో ఒక ఇబ్బంది కూడా ఉంది. ప్రపంచంలో క్లేశములకు గురైనవారూ, మరియు మనస్సులో ప్రాపంచిక కోరికలతో సతమతమై పోయేవారూ, వారి సమస్యలకై పరిష్కారమును వెదుకుతూ ఉంటారు. ఈ ప్రయత్నమే కొన్నిసార్లు, వారిని ఆధ్యాత్మికత వైపుకు తెస్తుంది. కానీ, సత్త్వ గుణములో ఉన్నవారు, ఒకలాంటి నిశ్చింతతో కూడిన తృప్తితో ఉండిపోయి, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి, ఉత్సాహం చూపరు. సత్త్వ గుణము, బుద్ధిని జ్ఞానముచే ప్రకాశవంతము చేస్తుంది. దీనితో పాటుగా, ఆధ్యాత్మిక వివేకము లేకపోతే, జ్ఞానముతో గర్వము పెరిగి, ఆ గర్వము భగవత్ భక్తిలో అడ్డుగా వస్తుంది. దీనిని మనము, కొందరు శాస్త్రవేత్తలూ, విద్యావేత్తలూ, పండితులూ, మొదలైన వారిలో గమనించవచ్చు. వీరిలో సత్త్వ గుణము సాధారణంగా, ఎక్కువ ప్రభావశీలంగా ఉంటుంది. ఎందుకంటే, వారి యొక్క సమయాన్నీ, శక్తినీ, జ్ఞాన సముపార్జనలో వినియోగిస్తారు. అయినా, వారికి ఉన్న జ్ఞానము, వారిని కొన్నిసార్లు గర్వితులను చేస్తుంది. వారి బుద్ధికి అతీతముగా ఇంకే పరమ సత్యమూ లేదని అనుకుంటూ ఉంటారు. రజో గుణములో, జీవులు తీవ్ర పరిశ్రమ దిశగా ప్రేరణ పొందుతారు. ప్రపంచం పట్ల వారి అనురక్తీ, మరియు సుఖాలూ, హోదా, సంపద, మరియు శారీరిక సౌకర్యాల పట్ల వారి యొక్క ఆసక్తి, తమ ఆశయాలను సాధించే దిశగా పరిశ్రమించేటట్లు, వారిని ప్రేరేపిస్తుంది; అవే వారికి జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. రజో గుణము, స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచుతుంది, మరియు కామమును ప్రేరేపిస్తుంది. ఈ కామమును తృప్తిపర్చుకోవటానికి, పురుషుడు-స్త్రీ వైవాహిక సంబంధంలోకి ప్రవేశించి, ఒక గృహమును కలిగి ఉంటారు. ఆ గృహమును నిర్వహించుకోవటానికి సంపద అవసరము కాబట్టి, వారు ఆర్ధిక అభ్యున్నతి కోసము పరిశ్రమిస్తుంటారు. తీవ్ర వ్యవహారములు చేస్తుంటారు కానీ, ఆ ప్రతి-ఒక్క పనీ, మరిన్ని కర్మలను సృష్టిస్తుంది, మరియు అవి వారిని మరింత భౌతిక అస్థిత్వ బంధనములో, బంధించివేస్తాయి. తమోగుణము, ప్రాణుల బుద్ధిని మబ్బులా కప్పివేస్తుంది. సుఖాల కోసం వాంఛ, ఇక ఇప్పుడు వక్రమైన తప్పుడు విధాలుగా పరిణమిస్తుంది. ఉదాహరణకి, సిగరెట్టు తాగటం హానికరమని అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సిగరెట్టు పాకెట్ మీదా, ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరిక కూడా ఉంటుంది. సిగరెట్టు త్రాగేవారు దానిని చదువుతారు. అయినా, వారు ధూమపానం ఆపరు. ఇది ఎందుకు జరుగుతుందంటే, బుద్ధి తన విచక్షణా శక్తిని కోల్పోయి, తనకు హాని జరిగినా, ఆ ధూమపాన సుఖాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. ఇదే తమోగుణము యొక్క ప్రభావము. ఇది ఆత్మను అజ్ఞానపు చీకటిలో బంధించివేస్తుంది.

04:21 - రజస్తమశ్చాభిభూయ సత్త్వం భవతి భారత ।
రజఃసత్త్వం తమశ్చైవ తమః సత్త్వం రజస్తథా ।। 10 ।।

ఓ అర్జునా! ఒక్కోసారి రజస్తమోగుణములపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి, సత్త్వతమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది; అలాగే ఇంకాకొన్ని సార్లు, సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.

ఒకే వ్యక్తి యొక్క ప్రవృత్తి, ఈ మూడు గుణములలో ఎలా మారుతూఉంటుందో, శ్రీ కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు. భౌతిక శక్తి యందు ఈ మూడు గుణములూ ఉన్నాయి. మన మనస్సు ఇదే శక్తితో తయారైనది. అందుకే, ఈ మూడు గుణములూ, మన మనస్సులో కూడా ఉన్నాయి. ఒకరితో ఒకరు తలపడే ముగ్గురు మల్లయోధులతో, వీటిని పోల్చవచ్చు. ప్రతి ఒక్కడూ, మిగతా ఇద్దరినీ క్రింద పడవేస్తుంటాడు. కాబట్టి, ఒక్కోసారి మొదటివాడు పైనుంటాడు, ఒక్కోసారి రెండవవాడు, ఇంకోసారి, మూడవ వాడిది పైచేయి అవుతుంది. ఇదే విధంగా, ఈ మూడు గుణములూ, వ్యక్తి యొక్క ప్రవృత్తి పై, ఒక్కోటి ఒక్కోసారి ఎక్కువ ప్రభావంతో ఉంటాయి. బాహ్యమైన పరిస్థితులూ, అంతర్లీన చింతన, మరియు పూర్వ జన్మ సంస్కారములపై ఆధారపడి, ఒక్కో గుణమూ, ఒక్కోసారి ప్రబలమై ఉంటుంది. ఎంతసేపు ఆ ప్రభావం ఉంటుందన్న దానికి, ఏ నియమమూ లేదు. ఒక్కో గుణము, మనోబుద్ధులపై ఒక క్షణం నుండి, ఒక గంట వరకూ ఉండవచ్చు. సత్త్వ గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ప్రశాంతముగా, తృప్తిగా, దయాళువుగా, నిర్మలంగా, ప్రసన్నంగా ఉంటాడు. రజో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ఉద్వేగంతో, లక్ష్యమును సాధించాలనే తపనతో, ఇతరుల విజయం పట్ల అసూయతో, ఇంద్రియ సుఖముల పట్ల ఆసక్తితో ఉంటాడు. తమో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, విపరీత నిద్ర, సోమరితనము, ద్వేషము, కోపము, రోషము, హింస మరియు అపనమ్మకంతో ఉంటాడు.

06:23 - సర్వద్వారేషు దేహేఽస్మిన్ ప్రకాశ ఉపజాయతే ।
జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్త్వమిత్యుత ।। 11 ।।

06:33 - లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహా ।
రజస్యేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ ।। 12 ।।

06:43 - అప్రకాశోఽప్రవృత్తిశ్చ ప్రమాదో మోహ ఏవ చ ।
తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన ।। 13 ।।

దేహములోని అన్ని ద్వారములూ, జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితమని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభమనబడే దురాశ, ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ, పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానమూ, జడత్వమూ, నిర్లక్ష్యమూ, మరియు మోహమూ - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.

భగవంతుడు మళ్ళీ ఒకసారి, త్రిగుణములు వ్యక్తి యొక్క ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తాయో, వివరిస్తున్నాడు. సత్త్వ గుణము, సద్గుణములను పెంపొందించుకునేటందుకూ, మరియు జ్ఞానము ప్రకాశితమవ్వటానికీ, దారితీస్తుంది. రజో గుణము దురాశకీ, ప్రాపంచిక సంపత్తి కోసం అతిప్రయాస, మరియు మనస్సు యొక్క వ్యాకులతకు దారి తీస్తుంది. తమో గుణము, చిత్తభ్రాంతికీ, సోమరితనానికీ, మరియు మత్తుపదార్ధాలకూ, హింసా ప్రవృత్తి దిశగా తీసుకువెళుతుంది. నిజానికి ఈ గుణములు, భగవంతుడు, మరియు ఆధ్యాత్మిక మార్గముల పట్ల మన దృక్పథాన్ని కూడా, ప్రభావితం చేస్తాయి. సత్వ గుణములో ఉన్నప్పుడు, సాధనలో త్వరితగతిన పురోగతిని సాధించటానికి, కృషి చేయాలి. ఎందుకంటే, మానవ దేహమనేది దుర్లభమైనది కాబట్టి, దానిని లౌకికమైన వాటి సముపార్జన కోసం వ్యర్థం చేసుకోకూడదని అనుకుంటాము. రజో గుణము ప్రధానముగా ఉన్నప్పుడు, ‘నేను తప్పకుండా ఆధ్యాత్మిక పురోగతి సాధించాలి. కానీ అంత తొందర ఏమున్నది? ప్రస్తుతం, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. అవి దీనికన్నా ఇంకా ముఖ్యమైనవి.’ అని ఆలోచిస్తాము. ఎప్పుడైతే తమో గుణము ప్రబలంగా ఉంటుందో, ‘ఏమో, భగవంతుడు ఉన్నాడో లేడో నమ్మకం లేదు. ఎవరూ ఆయనను చూడలేదు. ఎందుకు సాధన కోసం సమయం వృధా చేయాలి?’ అని భావిస్తుంటాము. భక్తిలో ఒకే వ్యక్తి యొక్క ఆలోచనలు ఎంత ఉన్నత స్థాయి నుండి, ఎంత తక్కువ స్థాయికి ఊగిసలాడతాయో, మనం గమనించవచ్చు. ఈ త్రిగుణములచే, మనస్సు ఊగిసలాడటం చాలా సహజమే. 
కానీ, ఈ స్థితిగతులచే మనం నిరాశ చెందకుండా, ఇది ఎందుకు ఇలా అవుతుందో అర్థం చేసుకోవాలి. అలాగే, దానికి అతీతంగా ఎదగటానికి పరిశ్రమించాలి. సాధన అంటే, మనసులో ఈ త్రిగుణముల యొక్క ప్రవాహంతో పోరాడుతూ, దానిని గురువు, మరియు భగవంతుడి పట్ల భక్తితో ఉండటానికి, అభ్యాసము చేయటమే. ఒకవేళ మన యొక్క స్మృతి, అత్యంత ఉన్నతమైన స్థాయిలో రోజంతా ఉండి ఉంటే, అప్పుడు సాధన యొక్క అవసరం లేదు. మనస్సు యొక్క సహజమైన భావనలు ప్రపంచం వైపు మొగ్గు చూపినా, బుద్ధి యొక్క సహాయంతో, దానిని ఆధ్యాత్మిక రంగం వైపు మరల్చాలి. ప్రారంభంలో ఇది కష్టతరంగా అనిపించవచ్చు. కానీ, అభ్యాసముచే అది చాలా సులువుగా అయిపోతుంది.

09:51 - ఇక మన తదుపరి వీడియోలో, త్రిగుణములచే ప్రసాదింపబడే గమ్యములను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur