Shraadh: An In-Depth Guide to Hindu Ancestral Rituals - The Garuda Purana | 'శ్రాద్ధాలు' - గరుడ పురాణం!


'శ్రాద్ధాలు' - గరుడ పురాణం!
మరణించిన వారి పేరు మీద బ్రాహ్మణులకు పెట్టే భోజనం ఎవరికి చేరుతుంది?

మన సనాతన ధర్మంలో, పూర్వీకులకు అంకితం చేయబడిన, సంవత్సరంలోని నిర్దిష్ట కాలాన్ని, పితృ పక్షం అంటారు. పితృపక్షం సమయంలో, పూర్వీకులు తమ వారిని కలవటం కోసం, భూమి మీదకు వస్తారని కూడా చెబుతారు. ఈ సమయంలో స్నానం, దానం, తర్పణం, శ్రార్ధ కర్మలు చేసినప్పుడు, పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది, సుఖ సంతోషాలతో వర్ధిల్లేటట్లు దీవిస్తారని చెబుతారు. ప్రతి ఏడాదీ, పితృపక్షాలు భాద్రపద మాసంలో, కృష్ణ పక్షంలో వస్తూ ఉంటాయి. అయితే, మనం ఇక్కడ చేసే తద్దినాలూ, శ్రాద్ధాలూ, మరణించిన మన పితరులకు ఏ విధంగా చేరతాయి? బ్రాహ్మణులకు పెట్టే భోజనం, అన్ని వర్ణాల పితృదేవతలకూ సంతృప్తి చేకూరుస్తుందా - వంటి అనేక ప్రశ్నలను, గరుడ పురాణం, ఆచారకాండలో, గరుడుడు శ్రీ మహా విష్ణువును అడిగాడు. పితృకార్యక్రమాలకు సంబంధించి, గరుడుడు అడిగిన ప్రశ్నలకు, శ్రీ మహా విష్ణువు చెప్పిన దివ్య సమాధానాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/enEKiyfwnxs ]


సపిండీకరణ, వార్షిక శ్రాద్ధాల తరువాత, మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం, దైవత్వమో, మానుషత్వమో, ఇతర ఏతత్వమో  ప్రాప్తిస్తుంది కదా? ఆహరపుటలవాట్లు అందరివీ ఒకలాగా ఉండవు కదా? మరి బ్రాహ్మణ భోజనాల వల్ల గానీ, శ్రాద్ధ హోమాల వల్లగానీ, అందరూ తృప్తిపడడమోలా సాధ్యం? ప్రేత రూపంలోనున్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం, వారి కడుపు నింపి ఎలా ఆనందింప జేయగలదు? శ్రాద్ధాలను అమావాస్య నాడే పెట్టాలన్నది నిజమేనా? ఈ లోకంలో, అంటే మృత్యులోకమైన భూలోకమనే ఉద్దేశ్యం.. మనుష్యుల ద్వారా ఇవ్వబడిన హవ్య-కవ్య పదార్థాలు, పై లోకాలకెలా వెళతాయి? వాటిని పొందేదెవరు? ఈ శ్రాద్ధాలు, మృతుల కడుపు నింపడమంటే, ఆరిపోయిన దీపంలో తైలం పోస్తే, వెలుగులు విరజిమ్ముతాయన్నట్లుంది. చనిపోయిన వాడు పోవలసిన చోటికి, వాని కర్మఫలాన్ని బట్టి పోనే పోతాడు కదా? వాని పుత్రుని ద్వారా ఈయబడ్డ పుణ్యకార్య ఫలాన్నెలా అందుకుంటాడు? ఆ లోకం నుండి భూలోకానికి వచ్చి, శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా? దయచేసి నా యొక్క విషయక అజ్ఞానాన్ని దూరం చేయండి! అని విష్ణు దేవుని ప్రార్థించాడు వినతా సుతుడు.

అందుకు శ్రీ మహా విష్ణువు, ‘గరుత్మంతా, మనిషి తన కర్మానుసారం దేవతలలో కలసిపోతే, శ్రాద్ధాన్నం, అంటే, వారసులు పెట్టే అన్నం, అమృతంగా మారి, వాని చేతికందుతుంది. అదే అన్నం, గంధర్వయోనిలో పడినవానికి భోగ రూపంలోనూ, పశుయోనిలో పడినవానికి గడ్డిరూపంలోనూ అందుతుంది. అలాగే, నాగయోనిలో పడ్డ వారికి వాయురూపంలోనూ, పక్షికి ఫలంగానూ, రాక్షసునికి మాంసం గానూ, ప్రేతానికి రక్తంగానూ, మనుష్యునికి అన్నపానాదులుగానూ అందుతుంద’ని వివరించాడు. ‘ప్రత్యక్షంగా కనిపించేది ప్రమాణమే. కానీ, దానికన్నా గొప్ప ప్రమాణం, బలమైనదీ, శ్రుతి వాక్యం. దాని నుండి వచ్చిన జ్ఞానం, అమృతాదులతో సమానం. శ్రాద్ధ కర్మలలో ఉచ్ఛరింపబడిన గోత్రనామాదులే, ఆయా పితరాదులకు హవ్య-కవ్యాలనందించే ప్రాపకాలు. ఆ మంత్రాలు అచేతనాలని అనుకోకు. వాటికున్న చైతన్యం, మరి వేటికీ ఉండదు. సంశయము వలదు. అగ్నిష్వాత్తాది పితృగణాలచే, ఆ పితరులు రాజ పదవులలో నియమింప బడతారు. వారి వద్దకు ఈ పితృ పాత్రలలో, విధివశాత్తుగా ప్రతిపాదింపబడిన అన్నాది అభీష్ట పదార్థాలు చేరతాయి. ఆ జీవులెక్కడుంటే అక్కడికి, ఈ అగ్నిష్వాత్తాది పితృదేవతలే అన్నాదులను తీసుకుని వెళతారు.

గోత్ర నామాలూ, మంత్రాలే, ఇక్కడి శక్తి ప్రదాయకాలు. ఇదంతా ఊహకందనంత వేగంగా జరిగి పోతుంటుంది. ఎక్కడ మృతులకు నామ గోత్ర మంత్ర సహితంగా శ్రాద్ధం పెట్టబడుతున్నా, ఆ మృతి చెందాడనుకుంటున్న జీవి మరెక్కడ ఏ యోనిలో ఉన్నా, ఈ మంత్రం చదవగానే, ఆ జీవికి కడుపు నిండి, తృప్తి కలుగుతుంది. సంస్కారం చేస్తున్న వ్యక్తి, కుశాచ్ఛాదితమైన పృథ్విపై, జందెమును కుడి భుజంపై పెట్టుకుని, మూడు పిండములను పెట్టి, మంత్రం ద్వారా తన పితరులను తృప్తులను చేయగలడు. ఇక్కడితడు అన్నమునే పెట్టవచ్చు కానీ, మంత్ర బలం వల్ల, 'అక్కడ' ఏ యోనిలోనున్న పితరునికి, ఆ యోని జాతి తినే పదార్థమే లభిస్తుంది. ఆవులన్నీ ఒకచోటే వున్నా, దూడ తన తల్లిని పోల్చుకుని, దాని దగ్గరకే పరుగెత్తినట్లు, జీవి ఏ యోనిలో ఉన్నా, ఆ పితరుల నిమిత్తమై, బ్రాహ్మణులచే చేయబడిన శ్రాద్ధాన్నం, గురి తప్పకుండా, ఆ పితరులనే చేరుతుంది. పితృగణాలు విశ్వేదేవతలతో కలసి, శ్రాద్ధాన్నమును గ్రహిస్తాయి. వసు, రుద్ర, దేవత, పితర, విశ్వేదేవులీ కర్మకు ప్రసన్నులైతే, పితృదేవతలు ప్రసన్నులవుతారు.

మంచి కుటుంబాల నుండి వచ్చిన పితరులు, 'శ్రాద్ధ సమయం వస్తోంది' అని తెలుసుకోగానే, ప్రసన్నులౌతారు. తమలో తాము చర్చించుకుని, వాయు మనో వేగాలతో, శ్రాద్ధకర్మ జరిగే చోటికి చేరుకుని, ఆకాశంలోనే కూర్చుని, బ్రాహ్మణుడితో బాటే భోజనం చేయగలరు. అయితే, ఇవి అంతరీక్షగాములైన పితరులకే సాధ్యం. వారు వాయు రూపంలో వచ్చి, భోజనం చేసి, పరమగతిని పొందుతారు. కొందరు బ్రాహ్మణుల శరీరాలలో ప్రవేశించి భుజించి, తమ లోకాలకు వెళతారు. కారణవశానా శ్రాద్ధకర్త, శ్రాద్ధ కర్మలో ఒక్క బ్రాహ్మణునే కూర్చుండ బెడితే, ఆయన ఉదర భాగంలో శ్రాద్ధకర్త తండ్రీ, దక్షిణం వైపు తాతా, వెనుక భాగంలో పిండభక్షక పితరులూ ఉంటారు. శ్రాద్ధ కాలంలో, యమధర్మ రాజు తన వద్దనున్న ప్రేతాలనూ, పితరులనూ వదిలేస్తాడు. నరక లోకంలో శిక్షలను అనుభవిస్తున్నవారు, ఆకలి దప్పులతో అలమటిస్తూ, తమ పుత్ర పౌత్రులు తేనె కలిపిన పాయసాన్ని శ్రాద్ధంలో పెడితే, ఆకలి దప్పుల నుండి విముక్తి కలుగుతుందని భావిస్తారు. శ్రాద్ధ కర్తకు తన వారెక్కడున్నారో తెలియదు కాబట్టి, అందరూ అందరికీ మధుమిశ్రిత పాయసాన్ని పెట్టడం మేలు.

అమావాస్య దినాలలో, పితృగణాలు తమ వారి ఇంటి గుమ్మాల వద్ద, వాయు రూపంలో దిగి వుండి, శ్రాద్ధాల నభిలషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారలాగే వుంటారు. సూర్యడస్తమించినా శ్రాద్ధ భోజనం లభించకపోతే, నిరాశాపూరిత నిశ్వాసాలను బరువుగా వెలువరుస్తూ వెడలిపోతారుగానీ, తమ స్వజనాలను నిందింపరు, దూషించరు, శపించరు. అయినా వారి దీవెనలు లభించి, మనిషికి ఇహపరాలలో పరమసుఖం కావాలంటే, ఏదో తద్దినం ఏడాదికొకమారు ముక్తసరిగా పెట్టేసి వూరుకోకుండా, ప్రతి అమావాస్యనాడూ పితరులనుద్దేశించి, శ్రాద్ధం పెట్టాలి. వారి ఆకలి దప్పులను తీర్చాలి. శాస్త్రం చెప్పిన విధంగా, పితృజనులకు వారి పుత్రులూ, బంధుబాంధవులూ కూడా, శ్రాద్ధకర్మలను సాంగోపాంగంగా నిర్వర్తించి, గయా తీర్థానికొక మారైనా పోయి పిండ ప్రదానము చేస్తే, పితరులతో పాటు వారు కూడా బ్రహ్మలోక నివాసానికధికారులవుతారు. ఇక్కడ గానీ, అక్కడ గానీ, వారికి ఆకలి దప్పులు తీరక పోవడం ఉండదు.

విద్వాంసులెన్నడూ, ఈ శ్రాద్ధాలను విస్మరించ రాదు. వారూ చేయాలి, ఇతరుల చేతా చేయించాలి. సమయానుసారం శ్రాద్ధకర్మలు జరిగే ఇంటిలోకి, ఏ దు:ఖమూ, అశాంతీ ప్రవేశింప జాలవు. పితరులను పూజించటం వల్లా, సంతృప్తి పరచటం వల్లా, మనుష్యులకు ఆయు, పుత్ర, యశ, స్వర్గ, కీర్తి, పుష్టి, బల, శ్రీ, పశు, సుఖ, ధన ధాన్యాలన్నీ లభిస్తాయి. దేవకార్యానికన్నా, పితృకార్యానికే మాహాత్మ్యమెక్కువ. దేవతల కంటే ముందే పితరులను ప్రసన్నం చేసుకోవాలి.  తమ తమ పితృగణాలనూ, దేవగణలనూ, బ్రాహ్మణులనూ, అగ్నినీ పూజించేవారు, నన్ను పూజించిన్నట్లే. వీటన్నిటిలో నేను పూజలందుకుంటాను. శ్రాద్ధాల ద్వారా పిపీలకం నుండి బ్రహ్మదాకా, అన్నిటినీ, అందరినీ ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ శ్రాద్ధకర్మ, ఎంతమందినెలా సంతోషపెడుతుందో ఆలోచిస్తే, ఆశ్చర్యమనిపిస్తుంది. మనుష్యుల ద్వారా పెట్టబడిన శ్రాద్ధంలో, నేలపై రాలిన అన్నపు మెతుకుల వల్ల, పిశాచ యోనిలో నున్న పితరుల ఆకలి తీరుతుంది. శ్రాద్ధస్నానంలో, తడి వస్త్రాల నుండి నేలకు జారిన నీటిబిందువులతో, వృక్షయోనిలో పడివున్న పితరుల కడుపు నిండుతుంది. ఆ కార్య వేళ నేలపైబడిన గంధ జలాలు, దైవత్వ యోని ప్రాప్తినొందిన పితరులను, సుఖపెడతాయి.

శ్రాద్ధానంతరం, బ్రాహ్మణులు చేతులు కడుగుకున్నప్పుడు, నేల వ్రాలిన జలాన్నాలతో, కులబహిష్కృతులై, శ్రాద్ధ కర్మకు గానీ, ఏ సంస్కారానికి గానీ నోచుకోక అలమటించే పితరులకు, క్షుద్బాధ తగ్గుతుంది. ఈ లోకంలో శ్రాద్ధ నిమిత్తం ఇతరులకీయబడిన అన్నం, ధనం, ఇతరం ఏమైనా సరే, పితరులకు చేరుతుంది. ఆండబరంతో పని లేదు. సామాన్యమైన ఆకు కూరలూ, కూరగాయలూ మున్నగు వాటితో, యథాశక్తి ఎవరు శ్రాద్ధం పెట్టినా, వారి పితరులకు సంపూర్ణ తృప్తి కలుగుతుంది. శ్రద్ధ నుండే శ్రాద్ధం వచ్చింది. మృత్యువు తరువాత ప్రాణికి మరొక శరీరం రావడానికి పట్టేకాలం, అందరికీ ఒక్కలాగే ఉండదు. ధూమరహితమైన దీపం లాగా, మనిషిలో వెలిగే ప్రధాన పురుషుడైన జీవాత్మ, ఆ మనిషి పోగానే, వాయవీయ శరీరాన్ని ధరిస్తాడు. ఒక మెట్టుమీద కాలుంచి మరొక మెట్టు మీద రెండవకాలు పెట్టాక, మొదటి మెట్టును వదిలేసినట్లు, శరీరి, పూర్వ శరీరాన్ని వదిలేసి, మరొక శరీరాన్నాశ్రయిస్తాడు. ఆ మధ్య కాలంలో, ఆత్మ గాలిలో వుంటుంది. కాబట్టి, దానినే వాయవీయ శరీరధారణమంటారు.

ఇక శరీరంలోని ఇంద్రియాలన్నీ నిశ్చేష్టితాలై పోగానే, ఆ జీవి శరీరాన్ని వదిలేస్తాడు. ఆ తరువాత ఆశ్రయించిన శరీరాన్ని కూడా, వదిలెయ్య వలసినదే. అంటే, ఏ జీవికీ ఏ శరీరమూ శాశ్వతం కాదు. అమ్మ కడుపులో పడిన జీవి, ఆమె నుండి అన్నాదికములను గ్రహించి బలపడి, దానిని వదలి ఒక శరీరాన్ని ధరించి బయటికి వచ్చినపుడు, గర్భమనే ఆశ్రయాన్ని పరిత్యజించినట్లే, ఈ శరీరం బలహీనమైనపుడు, దీనిని త్యజించి వేస్తాడు. రెండు శరీరాల మధ్య వుండే శరీరాన్ని, ఆతివాహిక వాయవీయ శరీరమని, విద్వాంసులు వ్యవహరిస్తారు. భూతప్రేతాది శరీరాలూ, మనిషి పిండజ శరీర స్థాయీ ఒక్కటే. పుత్రాదుల ద్వారా, దశగాత్ర పిండదానాలీయబడిన వారి పిండజ శరీరం, వాయవీయ శరీరంతో ఏకాకారమై పోతుంది. పిండజ శరీరము కలవకపోతే, వాయజ శరీరం కష్టాల పాలవుతుంది. ఇక ఆలస్యంగా శరీర ధారణ చేసే జీవాల విషయానికొస్తే, కొందరు జీవాత్మలకు పిండజ శరీరం రావడానికి, సమయం పడుతుంది. మృతి చెందగనే వారు తమ కర్మల వల్ల, నరకానికి వెళతారు. చిత్రగుప్తుని మాట మేరకు, వారి కాలం అక్కడ గడుస్తుంది. అక్కడి యాతనలను తమ కర్మం కొద్దీ అనుభవించిన తరువాత, పశు-పక్షి యోనులలో వారు పుడతారు. శరీరం మీద మోహం, మానవులకే ఎక్కువగా వుంటుంది.

శుభా శుభకర్మలను ఇతర లోకాలలో భోగించాక, అది పోతుంది. పితృకార్యక్రమాలకు సంబంధించి, సీతా దేవి గురించిన ఉదాహరణ ఒకటుంది. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో, ఒకానొకప్పుడు పుష్కర తీర్థానికి వెళ్లాడు. అక్కడ తన పితరులకు శ్రాద్ధ కర్మను చేయ సంకల్పించగా, సీతమ్మ పక్వానికి వచ్చిన పండును సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు, ఆయనతో బాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి, తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడి నెత్తిన చేరాడు. కుతుప ముహుర్తం వచ్చింది. శ్రీ రాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. రామచంద్రుడు తల ఊపగానే, సీతమ్మ తద్దినం, అంటే, బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ, బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి, సంభ్రమంగా, దూరంగా పోయి, చెట్టుచాటున తీగల మధ్య నిలబడిపోయింది. 'సీతాదేవి ఏకాంతంలోకి పోయినదేమిటీ? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గు పడిందేమో. సరిలే' అనుకుంటూ, రాముడే బ్రాహ్మణుల చేత భోజనాదులను చేయించి, వారు సెలవు తీసుకుని వెళ్ళి పోయిన తరువాత, సీతను కనుగొని చిరునవ్వు నవ్వాడు.

ఆ నవ్వు చాటు ప్రశ్నను అర్థం చేసుకున్న సీత, ఇలా సమాధానం చెప్పింది. 'ఆర్య పుత్రా!' నేనిక్కడొక గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గోన్న బ్రాహ్మణుల అగ్ర భాగాన, నేను మా మామగారైన దశరథ మహారాజును చూశాను. ఆయన నిండు కొలువులో ఉన్నట్లే, సర్వాలంకార భూషితులై, దరహాసభాసుర వదనారవిందులై నాకు దర్శనమిచ్చారు. వారితో పాటు, మీ పితామహ, ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నార చీరలతో, మహారాజుగారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి, నేను చెట్టు చాటుకు వెళ్ళిపోయాను. ఆ మహారాజుగారికి, ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతిసామాన్య ఆహారాన్ని వడ్డించలేక, తప్పుకున్నాను. తృణపాత్రలో అన్నాన్ని వేసి పట్టుకుని, దేవేంద్ర సన్నిభుడైన రఘుకులాన్వయ భూషణుని ఎదుటికెలా పోగలను? అందుకే ఆ మహా భాగులకు నమస్కరించి, నిష్క్రమించాను. సీతమ్మ మాటలు విని, శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం, తన జీవన సహచరికైనా దక్కినందుకు సంతోషించాడు.

గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు వివరించిన ఈ నియమాలను పాటిస్తూ, పితృపక్షాలను సక్రమంగా నిర్వహించినట్లయితే, పితృదేవతలను సంతృప్తి పరచడమే కాకుండా, వారి ఆశీస్సులను పొంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతాము.

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History