The Immortal Ashwatthama: Where Is He Now? 5000 సంవత్సరాలనుండి బ్రతికే ఉన్నాడా?
5000 సంవత్సరాలనుండి బ్రతికే ఉన్నాడా?
మహాభారత శాపం నుండి అసిర్‌ఘర్ కోట రహస్యాల వరకు!
The Immortal Ashwatthama: Where Is He Now?
మరణం అనేది మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఆశ్చర్యంగా ఉంది కదూ? మరణం ఒక విశ్రాంతి. ఆత్మ ప్రయాణంలో ఈ జననం నుండి మరణం దాకా ఒక మజిలీ. కానీ, అందులో మరణమే కరువైతే? చావు కావాలని వేడుకున్నా అది దరిచేరకపోతే? మరణం వరమా, శాపమా? అనే అంశంతో గతంలో మనం చేసిన వీడియోను కూడా చూడండి..
యుగయుగాలుగా యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యాలు పోతున్నాయి, మనుషులు పుడుతున్నారు, చనిపోతున్నారు.. కానీ ఒక్కడు మాత్రం ఒంటరిగా, నిశ్శబ్దంగా, తన నుదుటి మీద రక్తం ఓడుతున్న గాయాన్ని దాచుకుంటూ, ఈ కలియుగంలో ఇంకా తిరుగుతున్నాడు. ఆయనే... అశ్వత్థామ!
అసలు అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? మధ్యప్రదేశ్ లోని అసిర్‌ఘర్ కోటలో ప్రతి రోజూ తెల్లవారుజామున శివలింగంపై ఆ తాజా పువ్వులు ఎవరు పెడుతున్నారు? హిమాలయాల్లో పైలట్ బాబాకి కనిపించిన ఆ 12 అడుగుల మనిషి ఎవరు? మహాభారతాంతంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం కలియుగాంతం వరకు ఉంటుందా?
ఈ రోజు... మహాభారతంలోని చీకటి కోణాలనూ, మోడరన్ డే సైంటిఫిక్ మిస్టరీస్ నీ కలిపి... అశ్వత్థామ గురించిన పూర్తి చరిత్రను తెలుసుకుందాము. ఇది కేవలం ఒక గాధ మాత్రమే కాదు... ఇది ఒక అన్వేషణ.
వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/d2Q7b1WL7Q4 ]
చాలా మందికి అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడి కొడుకు అని మాత్రమే తెలుసి ఉంటుంది. కానీ ఆయన సాక్షాత్తు 'రుద్రాంశ సంభూతుడు'. ద్రోణాచార్యుడు పుత్ర సంతానం కోసం శివుడిని గూర్చి ఘోర తపస్సు చేశాడు. తనకు పరమ శివుడి లాంటి పరాక్రమవంతుడైన కొడుకు కావాలని శివయ్యను కోరుకున్నాడు. శివుడు తథాస్తు అన్నాడు. అలా పుట్టినవాడే అశ్వత్థామ.
పుట్టినప్పుడు అశ్వత్థామ ఏడ్చిన ఏడుపు సాధారణ పిల్లలలా లేదు. అది 'ఉచ్ఛైశ్రవం' అంటే దేవతల గుర్రం సకిలించినట్లుగా వినిపించింది. అందుకే 'అశ్వ' అంటే గుర్రం, 'ద్ధామ' అంటే శబ్దం, లేక బలం కలిపి అశ్వత్థామ అని పేరు పెట్టారు.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం 'మణి'. అశ్వత్థామ పుట్టుకతోనే నుదుటిపై ఒక దివ్యమైన మణితో పుట్టాడు. అది సామాన్యమైన మణి కాదు. ఆ మణి ఉన్నంత కాలం అతనికి ఆకలి, దప్పిక, రోగాలు, ముసలితనం రావు. ఆయుధాలు అతడిని గాయపరచలేవు. రాక్షసులు, గంధర్వులు కూడా అతడిని చంపలేరు. ఒక రకంగా చెప్పాలంటే... శ్రీకృష్ణుడి శాపం కంటే ముందే, ప్రకృతి అతనికి అమరత్వాన్ని ప్రసాదించింది. కానీ పాండవులతో వైరం, దుర్యోధనుడితో స్నేహం... అతని తలరాతను మార్చేసింది.
కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. పాండవుల పక్షాన ధర్మం ఉంటే, కౌరవుల పక్షాన అశ్వత్థామ, భీష్ముడు, కర్ణుడి వంటి అతిరథ మహారథులు ఉన్నారు. నిజానికి అశ్వత్థామ పరాక్రమం అర్జునుడికి ఏమాత్రం తీసిపోదు. 14వ రోజు రాత్రి యుద్ధం గుర్తుంది కదా? ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నప్పుడు, అశ్వత్థామ చూపిన వీరత్వం సామాన్యమైనది కాదు.
కానీ... యుద్ధం మలుపు తిరిగింది, ఒక్క అబద్ధంతో. 'అశ్వత్థామ హతః... కుంజరః' అంటే, అశ్వత్థామ చనిపోయాడని ధర్మరాజు చెప్పడం, కానీ అది ఏనుగు అని మెల్లగా అనడం. తన కొడుకు చనిపోయాడని నమ్మి ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు. అదను జూసి దృష్టద్యుమ్నుడు ద్రోణుడి తల నరికాడు.
ఆ దృశ్యం చూసిన అశ్వత్థామలో శివుడి రుద్రరూపం బయటికి వచ్చింది. అతను కోపంతో 'నారాయణాస్త్రం' ప్రయోగించాడు. అది ఎంత శక్తివంతమైనది అంటే... దాన్ని ఎదిరిస్తే చాలు, భస్మం చేసేస్తుంది. శ్రీకృష్ణుడు కూడా భయపడి, 'అందరూ ఆయుధాలు పడేసి నమస్కరించండి' అని పాండవులను ఆదేశించాడు. ఒక్క అశ్వత్థామ దగ్గర మాత్రమే, అంతటి వినాశనకరమైన ఆయుధాలు ఉన్నాయి. కానీ తండ్రి మరణం అతన్ని ఒక మృగంలా మార్చేసింది.
యుద్ధం ముగిసిందని అనుకున్నారు అందరూ. దుర్యోధనుడు తొడలు విరిగి చావుబతుకుల్లో ఉన్నాడు. పాండవులు విజయం సాధించారు. కానీ అసలు భీభత్సం ఇంకా మొదలవ్వలేదు. దీన్నే 'సౌప్తిక పర్వం' అంటారు. అర్ధరాత్రి... అశ్వత్థామ నిద్రపోలేకపోయాడు. ఒక మర్రిచెట్టు కింద కూర్చున్నప్పుడు, అతనికి ఒక దృశ్యం కనిపించింది. పగలు కాకులు గుడ్లగూబను తరిమికొడితే, రాత్రి అదే గుడ్లగూబ వచ్చి నిద్రపోతున్న కాకులను చంపేసింది.
అశ్వత్థామకు వెంటనే ఒక ఆలోచన తట్టింది. 'ధర్మం గురించి మాట్లాడే పాండవులను, నిద్రపోతున్నప్పుడు చంపితే తప్పేంటి?' అని నిర్ణయించుకున్నాడు. కృపాచార్యుడు వారించినా వినలేదు.
పాండవుల శిబిరంలోకి దూరి, శివుడిని ప్రార్థించి ఒక కత్తితో భీభత్సం సృష్టించాడు. దురదృష్టం ఏంటంటే... అక్కడ పాండవులు లేరు. ద్రౌపది యొక్క ఐదుగురు కొడుకులైన ఉపపాండవులు నిద్రపోతున్నారు. వారిని పాండవులే అని భ్రమపడి, అశ్వత్థామ దారుణంగా గొంతులు కోశాడు. ఆ రక్తంతో తడిసిన చేతులతో వెళ్లి దుర్యోధనుడికి చెప్పాడు... 'తాను పాండవులను చంపేశాను' అని. కానీ తెల్లారాక తెలిసింది, చనిపోయింది పాండవులు కాదు, వారి వారసులు అని. ఇది మహాభారతంలోనే అత్యంత విషాదకరమైన ఘట్టం. అర్జునుడు కోపంతో రగిలిపోయాడు. అశ్వత్థామను వెంబడించాడు. ప్రాణభయంతో పరిగెడుతున్న అశ్వత్థామను వెంబడించి, వారి గురువు యెక్క కొడుకు అనే కారణంతో వదిలేశాడు.
ఆ తరువాత కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసి అశ్వత్థామ కోపోద్రిక్తుడయ్యాడు. కోపంలో విచక్షణ కోల్పోయి, దాడికి ప్రయత్నించి, 'బ్రహ్మశిర అస్త్రాన్ని' ప్రయోగించాడు. బ్రహ్మ శిర అస్త్రం అనేది మన పురాణాలలో పేర్కొనబడిన అత్యంత శక్తివంతమైన, విధ్వంసకర దివ్యాయుధం. ఇది బ్రహ్మ సృష్టించిన అత్యంత భయంకరమైన ఆయుధాలలో ఒకటి. ఇది శత్రువు ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టగలదు. సృష్టిలో ఎక్కడా లేకుండా చేయగలదు. ఇది బ్రహ్మాస్త్రం కంటే నాలుగు రెట్లు శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇది దేవతలను కూడా అంతం చేయగల అస్త్రంగా వర్ణింపబడింది. దీనిని దుర్వినియోగం చేయడం వల్ల తీవ్రమైన పర్యావరణ వినాశనం కలుగుతుంది. అప్పుడు ప్రతిగా అర్జునుడు కూడా తన దివ్యాస్త్రాన్ని వదిలాడు. కానీ వ్యాసుడి కోరిక మేరకు అర్జునుడు వెనక్కి తీసుకున్నాడు. అశ్వత్థామకు అది వెనక్కి తీసుకోవడం తెలియదు. అప్పుడతను చేసిన పని క్షమించరానిది. ఆ అస్త్రాన్ని ఉత్తర గర్భంలో ఉన్న పసిబిడ్డ పరీక్షిత్తు మీదకు మళ్ళించాడు. పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చేయడమే అతని లక్ష్యం. అప్పుడు... సాక్షాత్తు శ్రీకృష్ణుడు రంగంలోకి ప్రవేశించాడు. కృష్ణుడు ఇచ్చిన శాపం మామూలు శాపం కాదు. అది ఒక నరకం.
'ఓరి పాపాత్ముడా! కళ్ళు కూడా తెరవని పసిబిడ్డను చంపడానికి చూస్తావా? నీకు మరణం లేదు. కానీ ఆ మరణం లేకపోవడమే నీకు శిక్షగా పరిణమిస్తుంది. కలియుగాంతం వరకు నువ్వు ఒంటరిగా ఈ భూమి మీద తిరుగుతావు. నీ శరీరం నుండి రక్తం, చీము కారుతూనే ఉంటాయి. ఏ మందు నీ గాయాన్ని నయం చేయలేదు. నీ దారిలో ఎవరూ నీకు అన్నం పెట్టరు, నీతో మాట్లాడరు. అడవుల్లో, ఎడారుల్లో రోదిస్తూ తిరుగుతావు.' అని కృష్ణ పరమాత్ముడు శపించాడు..
అర్జునుడు తన కత్తితో అశ్వత్థామ నుదుటిపై ఉన్న మణిని పెకలించాడు. ఆ గాయం ఎప్పటికీ మానదు. ఇదే అశ్వత్థామ శాప వృత్తాంతం.
ఇదంతా పురాణం. మరి ఇప్పుడు? 21వ శతాబ్దంలో అశ్వత్థామ ఉన్నాడా..? దీనికి సంబంధించి మన దగ్గర కొన్ని ఆసక్తికరమైన సంఘటనలున్నాయి.
మొదటిది, అసిర్‌ఘర్ కోట మిస్టరీ (Asirgarh Fort Mystery): మధ్యప్రదేశ్ లోని బుర్హాన్‌పూర్ దగ్గర ఈ కోట ఉంది. ఇక్కడ 'గుప్తేశ్వర మహాదేవ ఆలయం' ఉంది. స్థానికులు చెప్పేదాని ప్రకారం... కోట తలుపులు ఎంత గట్టిగా మూసినా, ఉదయం పూజారి వెళ్ళేసరికి శివలింగంపై తాజా పువ్వులు, కుంకుమ కనిపిస్తాయి. ఇది ఎవరు చేస్తున్నారనేది ఇప్పటికీ వీడని మిస్టరీయే. అశ్వత్థామే తొలి పూజ చేస్తాడని స్థానికుల ప్రగాఢ విశ్వాసం.
రెండు, పృథ్వీరాజ్ చౌహాన్ మరియూ వైద్యుడి కథ: 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ అడవిలో ఒక వృద్ధుడిని కలిశాడని చరిత్ర విదితం. ఆ వృద్ధుడి నుదుటిపై రక్తం వెలువరుస్తున్న గాయాన్ని చూశాడు. పృథ్వీరాజ్ చౌహాన్ గొప్ప వైద్యుడు కూడా. ఆయన మందు రాసినా గాయం తగ్గకపోగా, రక్తం కారడం పెరిగింది. అప్పుడు ఆయన అడిగాడు... 'మీరు అశ్వత్థామా?' అని. మరుక్షణం ఆ వృద్ధుడు మాయమయ్యాడు. అలాగే, ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్ లో ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి ఒక పొడవైన వ్యక్తి నుదుటి మీది గాయంతో తారసపడ్డాడు. ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడంతో, డాక్టర్ అనుమానించి ప్రశ్నించే సరికి, ఆ పేషెంట్ మాయమయ్యాడని ఒక కథ ప్రచారంలో ఉంది.
మూడు, పైలట్ బాబా అనుభవం (Pilot Baba's Encounter): హిమాలయాల్లో ప్రసిద్ధ యోగి 'పైలట్ బాబా' తన పుస్తకంలో వ్రాశారు. ఆయన నర్మదా నదీ తీరంలో గిరిజనులైన భిల్లులతో (Bhil Tribe) ఉన్నప్పుడు, ఒకసారి 12 అడుగుల ఎత్తు ఉన్న ఒక భారీ ఆకారాన్ని చూశారు. ఆ వ్యక్తి నుదుటిపై పసుపు గుడ్డ కట్టుకుని ఉన్నాడు. గిరిజనులు అతడిని దేవుడిలా చూస్తున్నారు. ఆయన అశ్వత్థామే అని పైలట్ బాబా తన పుస్తకంలో పేర్కొన్నారు.
అసలు వేల ఏళ్లుగా అశ్వత్థామ ఎందుకు బతికి ఉన్నాడు? కేవలం శిక్ష కోసమేనా? అంటే కాదనే చెప్పాలి. పురాణాల ప్రకారం ఒక పెద్ద లక్ష్యం ఉంది. అదేమిటో తెలుసుకునే ముందు, ఈ మధ్య కాలంలో అశ్వత్థామ పేరు దేశమంతటా మారుమోగిపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదే... 'కల్కి 2898 AD' సినిమా! ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ పాత్రలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశారు.
సినిమాలో చూపించినట్లుగానే... పురాణాల్లో కూడా అశ్వత్థామ 8 అడుగుల పైనే ఎత్తు ఉంటాడనీ, ఒంటి నిండా గాయాలతో, ముఖం నిండా ముడతలతో ఉంటాడనీ వర్ణన ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ని టచ్ చేశారు. అశ్వత్థామ కేవలం శాపగ్రస్తుడు మాత్రమే కాదు, రాబోయే భవిష్యత్తుకు ఒక రక్షకుడు కూడా! అని.
సినిమాలో ఆయన కల్కి అవతారాన్ని కాపాడటానికి వస్తున్నట్లు చూపించారు. కానీ మన పురాణాల ప్రకారం చూస్తే... అశ్వత్థామ పాత్ర ఇంకా కీలకం. కల్కి పురాణం ప్రకారం... కలియుగాంతంలో విష్ణువు 'కల్కి'గా అవతరించినప్పుడు, ఆయనకు యుద్ధ విద్యలు, శస్త్ర రహస్యాలు నేర్పించే 'గురువు' స్థానంలో అశ్వత్థామ ఉంటాడు. పరశురాముడు, కృపాచార్యుడు, అశ్వత్థామ... ఈ ముగ్గురు చిరంజీవులు కల్కి భగవానుడికి సహాయకులుగా మారతారు.
అంటే... ఇన్నాళ్లు మనం అనుకుంటున్నట్లు, అది కేవలం శాపం మాత్రమే కాదు.. అదొక పెద్ద బాధ్యత కోసం దేవుడు ఏర్పాటు చేసిన నిరీక్షణ అన్నమాట. సినిమా ఫిక్షన్ కావచ్చు.. కానీ దాని వెనుక ఉన్న సోల్ (Soul) మాత్రం 100% మన పురాణాలదే. ఈ సినిమా వల్ల చాలా మందికి మన ఇతిహాసాల మీద ఆసక్తి పెరిగింది. అది నిజంగా సంతోషించాల్సిన విషయం.
అలా అశ్వత్థామ శాపం ఒక వైపు శిక్ష అయితే, మరొక వైపు అది ఒక బాధ్యత. మరణం లేని జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో, అశ్వత్థామ గాధ మనకు చెప్తుంది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. అది భగవంతుడి అంశతో పుట్టిన వాడికైనా సరే.
మరి మీరేమంటారు? అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా? అశ్వత్థామ హిమాలయాలలో ఉన్నాడా? అసిర్‌ఘర్ కోటలో తిరుగుతున్నాడా? మీరు ఎప్పుడైనా ఇలాంటి వింత అనుభవాల గురించి విన్నారా? కింద కామెంట్స్ లో తెలియజేయండి. మహాభారతంలోని ఇలాంటి మరిన్ని రహస్యాలతో మళ్ళీ కలుద్దాము.
🚩 ॐ కృష్ణం వందే జగద్గురుం 🙏

Comments
Post a Comment