ఏది నీది? What belongs to you? భగవద్గీత Bhagavadgita


ఏది నీది?
సమాజంలో ఉండే నాలుగు రకాలైన మనుష్యులు ఎవరు?

'భగవద్గీత' షోడశోధ్యాయం - దైవాసుర సంపద్విభాగ యోగం (13 – 16 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను, జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పదహారవ అధ్యాయం, దైవాసుర సంపద్విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, దైవాసుర సంపద్విభాగ యోగములోని, 13 నుండి 16 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/V53m_Aej3zs ]



అసురీ లక్షణాలను కలిగిన వారు ఎలా ఆలోచిస్తారో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:48 - ఇదమద్య మయా లబ్దమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ ।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ।। 13 ।।

00:58 - అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ।। 14 ।।

01:08 - ఆఢ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ।। 15 ।।

ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు.. ‘నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను. నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే. రేపు నాకు ఇంకా వస్తుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, మరియు నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని. నేనే ఇదంతా భోగించేది. నేను దోషరహితుడను. నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాలలో ఉన్న బంధువులు నాకు ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను దేవతలకు యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను.’ ఈ విధంగా, వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు.

నైతికత్వాన్ని పూర్తిగా విస్మరిస్తూ, తమకేది నచ్చితే దానిని అనుభవించే హక్కు తమకుందని, ఆసురీ లక్షణములు కలవారనుకుంటారు. తన స్వప్రయోజనాలు నెరవేరటం కోసం, పరిస్థితులను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వైదిక కర్మ కాండలు తమకు భౌతిక సంపత్తిని కలుగచేస్తాయని తెలుసుకుని, వారు కీర్తి సంపదల కోసం యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తుంటారు. కానీ, ఏవిధంగా అయితే రాబందు ఎత్తులో ఎగిరినా, దాని చూపు క్రిందికే నిమగ్నమై ఉంటుందో, ఆసురీ స్వభావము కలవారు, కొన్నిసార్లు సమాజంలో ఉన్నతహోదాకి ఎదిగినా, వారి పనులు నీచమైనవిగా, మరియు నిమ్నస్థాయిలో ఉంటాయి. వారి కోరికలను తీర్చుకునేందుకు ఉన్న అవరోధాలను తొలగించటానికీ, ఇతరులకు హాని చేయటానికీ, లేదా గాయపరచటానికి కూడా వెనుకాడరు. నాలుగు రకాలైన మనుష్యులు ఉంటారు సమాజంలో.

మొదటి రకం మనుష్యులు, సాధు పురుషులు. వారు ఇతరుల సంక్షేమం కోసం, తమ స్వార్థ-ప్రయోజనాన్ని వదిలి పెడతారు. రెండవ రకం మనుష్యులు, సాధారణమైన వారు. వీరు తమకు హాని కలగనంత వరకూ, ఇతరుల సంక్షేమం కోసం పనిచేస్తారు. మూడవ రకం మనుష్యులు, ఆసురీ గుణాలు కలవారు. వారి స్వార్థ-ప్రయోజనం నెరవేరుతుంది అంటే, ఇతరులకు హాని చేయటానికీ వెనుకాడరు. ఇక నాల్గవ రకం మనుష్యులు కూడా ఉంటారు. అకారణంగా ఇతరులను బాధ పెడుతుంటారు. అటువంటి వారికి సరిపోయే పేరు కూడా లేదు. శ్రీ కృష్ణుడు, నీచమైన ఆసురీ ప్రవృత్తి గల వారిని, ఇక్కడ స్పష్టముగా వివరిస్తున్నాడు. గర్వముతో కళ్ళు మూసుకుపోయి, వారు ఈ విధముగా అనుకుంటారని చెబుతున్నాడు: ‘నేను ఒక ఐశ్వర్యవంత రాచరిక కుటుంబంలో పుట్టాను. ధనవంతుడను, మరియు బలవంతుడను. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. భగవంతుని ముందు మ్రోకరిల్లాల్సిన అవసరమూ నాకు లేదు. ఎందుకంటే, నేనే దేవుడి లాంటి వాడను’. చాలా సందర్భాలలో, మనుషులు ‘నేను’ అన్నప్పుడు, అది వారి అహంకారము మాట్లాడుతున్నట్టు.. వారు కాదు. ఈ అహంకారమనేది, అభిప్రాయాలూ, బాహ్య వేషధారణ, కోపావేశాల వంటి వాటితో, వ్యక్తిగతంగా అనుసంధానం అయి ఉంటుంది. ఈ అహంకారమనేది, దానికే ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటుంది. దాని ప్రభావముచే, జనులు తలంపులు, భావోద్వేగాలు, మరియు జ్ఞాపకాలతో అనుసంధానమై ఉంటారు. వాటిని తమలో భాగమే అనుకుంటారు. ఈ అహంకారమే, ‘ఇది నాది’ అన్న భావన కలిగి ఉంటుంది. కానీ, ఈ యజమానత్వము తాత్కాలికమైనదే. దానిలోనే, ‘ఇది చాలదు’ అన్న గాఢమైన అసంతృప్తి భావన ఉంటుంది. ఈ యొక్క తీరని కోరికే, వ్యాకులతనూ, కలవరపాటునూ, విసుగునూ, ఆందోళననూ, మరియు అసంతృప్తినీ కలుగ చేస్తుంది. పర్యవసానంగా, యధార్థము యొక్క మరింత వికృతమైన అనుభూతి కలుగుతుంది. అది నిజమైన ఆత్మ నుండి, ‘నేను’ ను మరింత దూరం చేస్తుంది. ఈ అహంకారమే, మన జీవితంలో అత్యంత పెద్ద అబద్ధాన్నిసృష్టిస్తుంది. మనం-కాని దాన్ని మనముగా చూపిస్తుంది. ఈ విధంగా, ధర్మమార్గంలో పురోగతి కోసం, సమస్త మతధర్మాలూ, మరియు సాధువులూ, మన అహంకార పూరిత ఆలోచనా పరంపరను విధ్వంసం చేయాలని, వేడుకుంటారు.

05:39 - అనేకచిత్తవిభ్రాంతాః మోహజాలసమావృతాః ।
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేఽశుచౌ ।। 16 ।।

ఇటువంటి ఊహలూ, తలంపులతో తప్పుదారి పట్టి, చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయీ, మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసై పోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.

అహంకారపు పట్టులో, జనులు తమను తాము, తమ యొక్క మనస్సుతో అనుసంధానం చేసుకుని, దానియొక్క భ్రష్టుపట్టిన, మరియు నిరంతరంగా వచ్చే ఆలోచనా పరంపరకు బానిసై పోతారు. పూర్తిగా తమ మనస్సు యొక్క ఆధీనము లోనికి వెళ్ళిపోతారు. వారి మనస్సు సృష్టించిన జగత్తులో నివసిస్తుంటారు. అపవిత్రమైన మనస్సుకు ఇష్టమైన ఇటువంటి ఒక పని ఏమిటంటే, అస్తమానం ఫిర్యాదు చెయ్యటం. అది ఎప్పుడూ మనుష్యుల పట్లే కాక, పరిస్థితుల పట్ల కూడా సణుగుతూ, కోపంతో ఉంటూ ఉంటుంది. మనకున్న ప్రతి ఒక్క అసంతృప్తీ, మన మనస్సు సృష్టించినదే. వ్యక్తి దాన్ని గుడ్డిగా, పూర్తిగా నమ్మేస్తాడు. తలలో ఉన్న స్వరం, మన జీవితం గురించి దుఃఖపూరిత, ఆందోళనకర, లేదా క్రోధపూరిత కథలను చెబుతుంటుంది. పాపం ఆ వ్యక్తి, అహంకారము యొక్క పట్టులో ఉండి, ఆ చెప్పబడే దానిని నమ్ముతాడు. ఈ అసంతృప్తి తీవ్రమైనప్పుడు, అది ఆక్రోశముగా మారుతుంది. ఆక్రోశము అంటే, దుఃఖంతో, కోపంగా, వేదనతో, మనస్సు నొప్పించబడినట్టు ఉండటం. ఈ ఆక్రోశము చాలా కాలం ఉండిపోతే, అది వ్యధగా మారుతుంది. వ్యధ అంటే, భూతకాలంలో జరిగిన ఏదేని ఒక సంఘటనతో అనుసంధానమై, పదేపదే ‘నాపట్ల వారు ఇలా చేసారు’ అనే దాని గురించే ఆలోచిస్తూ, దానిని మనస్సులోనే ఉంచుకున్న, ఒక తీవ్రమైన, ప్రతికూల భావోద్వేగము. ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే.. అహంకారముచే సృష్టించబడిన, మోహ భ్రాంతి వలలోనే ఉండాలని నిర్ణయించుకున్న ఆసురీ ప్రవృత్తి మనుష్యులు, ఎన్నెన్నో నీచమైన అలోచనలచే సతమతమై పోతుంటారు. అందువలన, వారి భవిష్యత్తును చీకటిమయం చేసుకుంటారు. మానవులు తమ స్వంత చిత్తముతో కర్మలు చేయటానికి, వారికి పూర్తి స్వేచ్ఛ ఉన్నది. కానీ, వారు చేసిన కర్మల యొక్క ఫలితములు వారే నిర్ణయించుకునే అధికారం లేదు. కర్మ సిద్ధాంతమును అనుసరించి, కర్మఫలములను ఆ భగవంతుడే వారికి ప్రసాదిస్తాడు. ఆసురీ స్వభావమును ఎంచుకున్న వారిని, వారి తదుపరి జన్మలలో, భగవంతుడు నిమ్న, నీచ స్థాయి జీవనం లోనికి పంపించి వేస్తాడు. సాత్త్విక బుద్ధితో ప్రవర్తించేవారు, ఉన్నత స్థాయికి వెళతారు; రాజసిక ప్రవృత్తితో వ్యవహరించేవారు, మధ్యమ స్థాయిలోనే ఉండిపోతారు; తామసిక మనస్తత్వంతో పనిచేసేవారూ, మరియు పాపిష్టి పనులపై మొగ్గు చూపేవారూ, నిమ్న స్థాయి లోకాలకు పడిపోతారు.

08:38 - ఇక మన తదుపరి వీడియోలో, దురహంకారము కలిగిన మనుషులు ఏవిధంగా నడుచుకుంటారో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur