గరుడ పురాణం ప్రకారం ‘ప్రేతాత్మలు’! Garuda Purana - Ghosts


గరుడ పురాణం ప్రకారం ‘ప్రేతాత్మలు’!
ప్రేతాత్మలు మనకు ఏం చెబుతాయి? ఎలా తెలియబరుస్తాయి?

మనలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన విషయం, ‘ప్రేతాత్మలు’. ఏ కారణం లేకుండా జ్వరం వచ్చి తగ్గలేదంటే, గాలి శోకిందని భావిస్తాము. ఒక కుంటుంబంలో ఎవరైనా చనిపోయిన తరువాత ఆ ఇంట్లో కీడు జరిగిందంటే, ప్రేతాత్మే కారణమని, పరిహారాలు చూసుకుంటాం. ఈ ప్రేత్మాతల గురించి, శ్రీ మహా గరుడ పురాణం, ధర్మకాండలో, గరుడుడు, విష్ణుమూర్తిని అడుగగా, అందుకు భగవానుడే స్వయంగా సమాధానాలిచ్చాడు. ఎలాంటి మరణాలు పొందిన వారు ప్రేతాత్మలవుతారు? ఎటువంటి వారిని ప్రేతాత్మలు ఆవహిస్తాయి? ప్రేతాత్మల వలన మనకు ఎటువంటి కీడు కలిగే అవకాశం ఉంది? ప్రేతం ఆవహించిన వారు ఎటువంటి చర్యలకు పాల్పడతారు? ప్రేతాల బారి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయలి? వంటి ముఖ్య విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dZKCW8TLpHw ]


బ్రహ్మాండాధి నాయకుడిని గరుడుడు ఇలా అడుగుతున్నాడు.. ‘అసలు ఈ ప్రేతాల ఉత్పత్తి ఎలా జరుగుతుంది? అవి ఎలా తిరుగుతాయి? వాటి రూపురేఖలు భోజనాదులు ఎలా ఉంటాయి? అవెక్కడుంటాయి? వాటిని ప్రసన్నం చేసుకోవడం ఎలా? ప్రసన్న చిత్తుడవై నాకీ జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి’ అని కోరాడు. అందుకు భగవానుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. పూర్వ పాప ఫలం వల్ల, మరికొన్ని పాపాలు చేయాలనే కోరిక పుట్టి, దానిని అణచుకోకుండా, అదుపు లేని చిత్త ప్రవృత్తితో వర్తించి, మానవ జన్మను తగలబెట్టుకునే పాపాత్ములు, ప్రేతాలవుతారు. పాపాత్ముల మృతి సాధారణంగా, ఛండాలాయుధం, పాముకాటు, నీటిమునక, అగ్ని, పంటికాటు, బ్రాహ్మణ శాపం, పశువు దాడి, విద్యుత్తు వంటి వాటి వల్ల జరుగుతుంది.

అలాగే, పై మృతులతో పాటు, ఆత్మహత్య చేసుకున్నవారూ, ఉరిశిక్ష, విషప్రయోగం, విషూచిక, శస్త్రపు దెబ్బల వల్ల పోయినవారూ, దొంగల చేతిలో పోయిన వారూ, అపర కర్మ జరుపబడని వారూ, వృషోత్సర్గ మాసిక పిండాదులందని వారూ, ఆకాశంలో మరణించిన వారూ, కొండమీదనుండి జారిపడి పోయినవారూ, భగవంతుడిని స్మరించకుండా మృతి చెందినవారూ, కుక్క కాటు వల్ల దుర్మరణం పాలైన వారూ - వీరంతా ప్రేతాత్మలై పోతారు. ప్రమాదాల పాలై మృతి చెందిన వారూ ప్రేతాత్మలై, శ్మశానంలోనే తిరుగుతుంటారు. ఏ స్త్రీనైనా దోషం లేకుండా శిక్షించే వాడూ, హింసించే వాడూ, త్యజించే వాడూ, అలాగే, మహాపాతకులూ, ప్రేతాత్మలవుతారు. పండిత గృహాలలో జన్మించి కూడా, విద్య నేర్వక, సదాచార హీనుడై, తండ్రిని బాధించువాడు, ప్రేత యోనిలో పుడతాడు. పాపాత్మ మృతిని పోందిన వారి పితృకార్యలు సక్రమంగా నిర్వహించి నట్లయితే, ప్రేత కర్మ నుండి విముక్తి పోందుతారు.

కపటం, మోసం, ప్రేతాలకు మూలం. ఇతరుల ధనాన్నీ, స్త్రీలనూ, ద్రోహబుద్ధితో అపహరించే వారు, రాక్షసాది నిశాచర యోనుల్లో పుడతారు. పుత్ర మోహం కొద్దీ, వారి సుఖం కోసం, అన్ని రకాల మోసాలూ, దౌర్జన్యాలూ చేసి కూడబెట్టి చచ్చినవారు, శరీర రహితులై, ఆకలి దప్పులతో అలమటిస్తూ, గాలిలో, ధూళిలో తిరుగుతుంటారు. వారు దొంగల వలె, పితరుల కోసం అక్కడక్కడా పెట్టిన జలాన్ని అపహరిస్తుంటారు. ఈ పాపం వల్ల వారి ప్రేత జీవనం, మరింత కాలం పెరిగిపోతుంది. వారే జ్వరాలుగా, రోగాలుగా, పీడలుగా మారి, స్వంత ఇంటిలోనే చేరి, తమ వారినే పట్టి పీడిస్తుంటారు. తలనొప్పీ, విషూచిక వంటి అనేక రోగాలు, కారణం లేకుండానే, నియమబద్ధంగా ఆహారం తీసుకునే వారికి కూడా తగలడం, ఈ ప్రేతాల చలవే.

బతికున్నంతకాలం తామెంతగానే ప్రేమించిన వారినే, చచ్చి ప్రేతాలైన వీరు బాధిస్తారు. తమ ఇంటి సమీపంలో నున్న ఇతరులను కూడా, వారు అధర్మం చేస్తే బాధిస్తారు. ప్రేత బంధువులైనా, ఇతరులైనా, శ్రీ రుద్ర భగవానుని మంత్రాన్ని జపిస్తూ, ధర్మానురక్తులై, దేవతలనూ, అతిథులనూ పూజిస్తూ, సత్య, ప్రియ వచనాలనే పలుకుతూ ఉన్నంతకాలం, ఏ ప్రేతమూ వారి ఇంటి ఛాయలకైనా వెళ్ళలేదు. ప్రేతాలు నాస్తికులనూ, ఇతరత్రా పాపులనే ముట్టుకోగలవు.. అని విష్ణుభగవానుడే స్వయంగా, గరుడ పురాణంలో వివరించాడు.  కలికాలంలో అపవిత్ర క్రియలను గావించేవారు, ప్రేతయోనిలో పుడతారు. లోకంలో ఒకే తల్లి దండ్రులకు పుట్టిన వారిలో, ఒకడు సుఖపడవచ్చు, మరొకడు పాపకర్మలను చేయడానికే ఇష్టపడవచ్చు, వేరొకడు ప్రేతాలచే పీడితుడు కావచ్చు, ఇంకొకడు ధనధాన్యాలతో సంపన్నుడిగా ఉండవచ్చు. వీరిలో సంతానవంతుడొకడైతే, వేరొకనికి, ఉన్న ఒక్కకొడుకూ దక్కకపోవచ్చు. కొడుకులే ఒకడికి పుడితే, మరొకడికి కూతుళ్ళే కలగవచ్చు.

కాబట్టి, ఎవరి కర్మఫలం వారిదే. దానికి పుట్టుకతో సంబంధం లేదు. అలాగే, ప్రేతాలు పట్టుకున్నప్పుడు, కర్మయే కారణమవుతుంది కానీ, వంశ ప్రతిష్ఠ కాదు. ప్రేత దోషం కూడా అందరికీ ఒకలాగే ఉండదు. ప్రేతగ్రస్థులలో, ఒకడికి అనుకోకుండా అందరు బంధువులతోనూ విరోధం వస్తుంది. మరొకడు సంతానహీనునిగా మిగిలపోవచ్చు. కొందరికి కలిగిన సంతానమూ మిగలదు. కొందరు పశుహీనులూ, బంధు హీనులూ, ధన హీనులూ అయిపోతారు. కొన్ని ప్రాంతాలలో ప్రేత ప్రమేయం వలన, ప్రకృతి పరివర్తనం చెందడం కూడా ఉంటుంది. తల్లి దండ్రులను ఎవడైనా హత్య చేశాడంటే, వాడిని ప్రేతం పట్టుకుందని నిశ్చయించుకోవచ్చు. నాస్తికత కూడా ప్రేత ప్రభావమే. నిత్యకర్మలపై ఆసక్తి పోయి, జపహోమాలను మాని వేయాలనే బుద్ధి పుట్టడం, ప్రేత ప్రేరణం. అలాంటి వాటిలో, పర ధనాపహరణ ఆలోచన కూడా ప్రేత నిర్ణయమే.

ఇలా మనిషికి జరిగే ప్రతి కీడు వెనుకా, ప్రేత ప్రమేయముంటుంది. పాపపుటాలోచనలున్న వారినే, ప్రేతం ఆవహించి, బాధిస్తుంది. ప్రేతాల నుండి విడుదల ఉంది. దానికి ముందు అది ఎలాంటి ప్రేతమో, దాని తాపమేంటో తెలియాలి. దానికి జ్యోతిర్విద్వాంసుల సహకారం అవసరం. ప్రేతగ్రస్త ప్రాణికి కొన్ని అద్భుతమైన కలలొస్తుంటాయి. తీర్థయాత్రలకు వెళ్ళాలనీ, నదీ స్నానాలు చెయ్యాలనీ, ధర్మకార్యాలను అనుష్ఠించాలనీ, గట్టిగా నిశ్చయించుకుని, ముహుర్తం కూడా చూసుకున్నాక, ఎందుకో అత్యంత నిరాసక్తత ఏర్పడుతుంది. ఎక్కడికీ వెళ్ళ బుద్ధి కాదు. చెడ్డ పనుల వైపు మనస్సు పోతుంది. వెంటనే ఇది ప్రేత నిర్వాకమే అని పోల్చి, జ్యోతిర్విద్వాంసులను ఆశ్రయించిన వాడు, బాగుపడతాడు. వారిని సంప్రదించవలసిన అవసరం లేకుండా, దానాలు చేసినా, ప్రేత బాధలు వదిలిపోతాయి.

కలలో కనిపించిన ప్రేతాన్నుద్దేశించి మంత్ర సహితంగా దానం చేయడం వలన, ఆ ప్రేతానికీ, ఆ మనిషికీ కూడా తృప్తి కలుగుతుంది. ప్రేతాత్మలు వాటిలో అవి కూడబలుకుకుని, దానమిచ్చిన వానికి సుఖాలనిస్తాయి. వారి బంధూ, బాంధవులకు కూడా ధనధాన్యాలనిస్తాయి. స్వప్నాలలో ప్రేతాలు కనిపించిన తరువాత కూడా, వాటి మాటలూ, చేష్టలూ, పీడలను చూసి కూడా, శ్రాద్ధాదుల ద్వారా వాటి నుండి ముక్తికై ప్రయత్నించని వారు, ఆ ప్రేతాలు పెట్టే శాపాలకు లోనై, దు:ఖ సాగరంలోనే మునిగి ఉంటారు. ఇక తేలరు. కొంతమంది మరుజన్మలో కూడా నిస్సంతులూ, పశుహీనులూ, దరిద్రులూ, రోగులుగానే ఉండిపోతారు. కొన్ని సందర్భాలలో, ప్రేతాల నామ గోత్రాలు, స్వప్నాల ద్వారా తెలుస్తాయి. కొందరికి కలలు రాకున్నా, ప్రేతాలు పట్టి పీడిస్తాయి. అలాంటి సందర్భాలలో కులపురోహితుని మాటనే పూర్తిగా విశ్వసించి, ఆయన ఆదేశం మేరకు, భక్తి భావన పూర్వకంగా, పితృభక్తినిష్ఠులై, పురశ్చరణ పూర్వకంగా నారాయణ బలి కార్యాన్ని నిర్వహించి, జప, హోమ, దానముల ద్వారా దేహశోధనను చేసుకోగానే, సమస్త విఘ్నాలూ సమసిపోతాయి. ఇవన్నీ చేయగానే, అంతవరకూ భూత ప్రేత పిశాచాదులచే పీడింపబడుతున్న ప్రాణి బాధలన్నీ, దూదిపంజల వలె ఎగిరిపోతాయి.

పితృ భక్తి ఉండాలి. లేకుంటే, సుఖం లేదు. తల్లిదండ్రులను మించిన దైవాలు లేరు. ప్రాణులకు స్వర్గానికి గానీ, మోక్షానికి గానీ, ఏకమాత్ర సాధనం, శరీరమే. అటువంటి శరీరం దేని ద్వారా అయితే వచ్చిందో, దానికన్నా పూజ్యమేది? కాబట్టి, దానమిచ్చిన వాడికి దక్కే ఫలమే గొప్పది. పుత్రుడు పుట్టటమే భాగ్యము. వాడు మంచివాడై, అన్ని పితృకార్యములనూ చేయటమే, గొప్ప పుణ్య ఫలము. వాడు పుట్టగానే, తండ్రికి పుత్ అనే నరకబాధ తప్పిపోతుంది. ఎవరికైనా మాతాపితరులిరువురూ అకాల మృత్యువు పాలైతే, వారొక యేడాదిపాటు, ఆ తల్లిదండ్రులకు పుణ్యలోకాలను ప్రాప్తింపజేసే ప్రయత్నంలో ఉండాలి. ఆ యేడు వ్రతాలనూ, తీర్థయాత్రలనూ, వివాహాది మంగళకార్యాలనూ తలపెట్టకూడదు. ఈ విశ్లేషణ గరుడ పురాణంలోని ధర్మకాండ, 21వ అధ్యాయం, 28, 29 శ్లోకాలలో స్పష్టంగా వివరించబడి ఉంది.

లోకాః సమస్తా సుఖినోభవంతు!

Comments

Popular posts from this blog

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History